వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 2)

(ముందు భాగం)

3NABOKOVసరే ఇప్పటి వరకూ పుస్తకం గురించి చెప్పుకున్నాం గనుక, ఇప్పుడు కాస్త రచయిత గురించి కూడా చెప్పుకుందాం. ఈ పుస్తకంతోనే నబొకొవ్‌ని చదవటం మొదలుపెట్టిన పాఠకులకి ఆయన రచనా విధానం గురించి కొన్ని వివరాలు ఇవ్వడం అవసరమని నేననుకుంటున్నాను. ఆయన తాత్విక దృక్పథం, ఆయన శైలి, ఆయన తన నవలల్లో కాలాన్ని వాడుకునే ప్రత్యేకమైన తీరూ. . . వీటి గురించి నాకు తోచింది చెప్తాను:

నబొకొవ్ – తాత్త్వికత: ప్రతీ రచయితనీ ఏదో ఒక చట్రంలో ఇరికించందే గుల తీరని వాళ్ళు నబొకొవ్‌ని స్టైలిస్టుగా ముద్రవేస్తూంటారు. అసలా ముద్రకి అర్థం పర్థం వుందో లేదో తర్వాతి పేరాల్లో తెలుస్తుంది. దాని సంగతి ప్రస్తుతానికి పక్కన పెడదాం. ఈ ముద్ర వేసేవాళ్ల అంతరంగపుటుద్దేశం వేరే వుంది. నబొకొవ్ దగ్గర శైలి తప్ప ఏమీ లేదని, ఆయన రచనలు పైకి డాబుసరిగా కన్పించే డొల్లలనీ వాళ్ళ అభిప్రాయం. కానీ నాకు ఇప్పటిదాకా పరిచయమున్న రచయితలందరిలోనూ ఆయన దగ్గరున్నంత తాత్త్విక గాఢత నేను వేరే ఎవ్వరి దగ్గరా చూడలేదు. ఇది కూడా కథల మధ్య ఆయనే స్వయంగా చొరబడో, లేదా పాత్రల నోటిలో కూరడం ద్వారానో వెలిబుచ్చే తాత్త్వికత కాదు. అసలాయన ఏదీ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా చెప్పడు. తరచి చూస్తే మాత్రం ఆ రచనలన్నీ వ్యక్తిగా ఆయనకున్న బలమైన తాత్త్విక పునాదుల మీదే భద్రంగా నిలబడి వున్నాయని అర్థమవుతుంది. కాబట్టి ఆయన రచనల్లో తాత్త్వికత గురించి తెలుసుకోవాలంటే ముందు ఆయన తాత్త్విక దృక్పథమేమిటో తెలుసుకోవాలి.

జీవితంలో మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరచేది ఏమిటీ అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆయనిచ్చిన సమాధానం ఇది:

NABOKOV: . . . the marvel of consciousness—that sudden window swinging open on a sunlit landscape amidst the night of non-being.

పుట్టుకకు ముందు చీకటి, మరణం తర్వాత చీకటి. ఈ రెంటి మధ్యా మనకు కాసేపు ఈ ప్రపంచంలో మనడానికి అవకాశం లభిస్తుంది. పురుగూ పుట్రా, గొడ్డూ గోదా, చెట్లకూ పుట్లకూ కూడా ఈ అవకాశం లభిస్తుంది. మరి వీటి నుంచి మనల్ని వేరు చేసేదేమిటి? ఇదే కాన్షస్‌నెస్, జీవిస్తున్నామన్న స్పృహ, మానసిక చైతన్యం . . . ఇదే ఈ ప్రపంచంలో మనిషి జీవితం గిట్టుబాటయ్యేట్టు చేసేది. పుట్టుకతో రాజుకున్న ఈ చైతన్యం, మళ్ళా మరణంతో ఆరిపోయేలోపులో, మనకు లెక్కలేనన్ని అద్భుతాల్ని చూపిస్తుంది. వనాలూ, వార్షుకాభ్రాలూ, రంగులూ, సంగీతం, సముద్రాకాశాలు, ప్రేమానుబంధాలూ, పుస్తకాలూ, సెక్సూ . . . ఇలా కొట్టొచ్చినట్టూ కనిపించేవే కాదు; కరెంటు తీగ మీద వరసాగ్గా వాలిన పిచ్చికల సందడి, గడ్డి పరక మీద ఆరుద్ర పురుగూ, ఆమె చెంపల నూగూ . . . ఇలా వెతికే కళ్ళకు మాత్రమే కనిపించే అద్భుతాలూ ఎన్నెన్నో! జీవితం ఇంత అద్భుతమైనపుడు దానికిక అర్థం వుంటే ఏంటి, లేకపోతే ఏంటి? రోలర్‌కోస్టర్‌రైడ్ మొదలైన చోటే ముగియచ్చుగాక, అయితేనేం, సాగినంతకాలం కేరింతలు కొట్టించదూ? అందుకే అస్తిత్వవాదుల నిరాశా నిస్సత్తువలు నబొకొవ్‌లో కనిపించవు. అలాగే మిథ్యావాదుల్లా మానవాతీతమైన ఘోష, భౌతిక వాదుల్లా “తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళ”నే గుడ్డితనమూ కూడా కనిపించవు. ఆయన ఈ ప్రపంచంలో తన వంతు కేటాయింపుగా అందిన జీవితాన్ని, దాన్ని ఆస్వాదించేందుకు లభ్యమైన మానసిక చైతన్యాన్ని, అమూల్యమైన బహుమానాలుగా స్వీకరించాడు. వీటిని సద్వినియోగ పరచుకునేందుకు కళను వాడుకున్నాడు. నబొకొవ్ రచనలన్నింటినీ  మూకుమ్మడిగా ఒక్కముక్కలో “సెలబ్రేషన్ ఆఫ్ కాన్షస్‌నెస్” అని చెప్పేసుకోవచ్చు. కానీ నబొకొవ్‌కి తెలుసు, మన మానసిక చైతన్యం మనకి ఎంత చూపిస్తుందో, అంతే చూపించకుండా దాచేస్తుందని; అది చూపించేది కూడా మనలోని ప్రపంచపు ప్రతిఫలనాల్నే తప్ప అసలు ప్రపంచాన్ని కాదని; అంతేకాదు . . .

” . . . he knew that the external world resists the desires, however desperate, of the world within. While he often glories in the power of human consciousness, he also laments the absurdity of its limits: death, solitude, our exclusion even from our own past. Thrilled by all that the mind offers but aghast at all that it shuts out, Nabokov devotes his whole oeuvre to ascertaining our “position in regard to the universe embraced by consciousness” and to analyzing the bizarre discrepancy between the richness of our life, as it accumulates moment by moment, and its becoming inaccessible, so utterly unlike the present around us, as it retreats into the past or as we advance into death.” ~ from “Vladimir Nabokov: Russian Years” by Brain Boyd.

[“. . . ఆయనకు తెలుసు బయటి ప్రపంచం మన లోపలి ప్రపంచపు వాంఛల్ని, అవెంత తీవ్రమైనవైనా, వ్యతిరేకిస్తుందని. ఆయన తరచూ మానవ చైతన్యానికున్న శక్తి పట్ల ఆనందిచంటం తోపాటూ,  దానికున్న అసంబద్ధ పరిమితుల్ని తల్చుకుని వాపోతాడు కూడా: ఉదాహరణకు మృత్యువు, ఒంటరితనం, మన గతం నుంచి మనకే బహిష్కరణ వంటివి. మన చైతన్యం మనకు ఎంత అందిస్తోందోనన్న పులకరింత తోపాటూ అది మన నుంచి ఎంత వెలివేస్తోందోనన్న గగుర్పాటుతో, నబొకొవ్ తన మొత్తం రచనా సంచయాన్ని “చైతన్యంతో ఆవృతమైన ఈ విశ్వంలో మనిషి స్థానం” ఏమిటన్నది నిర్థారించేందుకు వినియోగిస్తాడు; క్షణ క్షణంగా పోగుపడుతూన్న జీవితపు సుసంపన్నత ఒకవైపూ, ఆ జీవితం గతంలోకి మళ్ళే కొద్దీ, లేదా మనం చావు వైపు వెళ్ళే కొద్దీ, మన చుట్టూ వున్న వర్తమానంతో అస్సలు పోలికే లేకుండాపోయి, మనకి అందనంత దూరమైపోవటం మరోవైపు; ఈ రెంటి మధ్యనున్న అగాథాన్ని విశ్లేషించేందుకు తన రచనలు మొత్తం అంకితం చేస్తాడు.”]

ఈ వర్తమానానికీ గతానికీ మధ్య అగాథాల్నీ, మానవ చైతన్యపు పరిమితుల్నీ మనిషి అధిగమించలేకపోవచ్చు. కానీ ఆ మనిషి కళాకారుడైతే మాత్రం కళ ద్వారా కొంతవరకూ ఆ సౌలభ్యాన్ని అందిపుచ్చుకోగలడు. కళాకారుడు, ముఖ్యంగా రచయిత, తన చైతన్యంతో మాత్రమే సరిపుచ్చుకోడు; దాని పరిధుల్ని దాటుకుని అవతలి వ్యక్తుల చైతన్యంలోకి కూడా ప్రవేశించే ప్రయత్నం చేస్తాడు. అహపు బంధనాల్ని ఛేదించి ఎటంటే అటు విశృంఖలంగా విస్తరించాలని తహతహలాడతాడు. నబొకొవ్ ఈ స్వేచ్ఛని తన రచనల్లో పూర్తిగా వినియోగించుకున్నాడు. రచనా వ్యాసంగపు తొలి రోజుల్లో కేవలం తన విలువల్ని ప్రతిబింబించే మెదళ్లనీ, ప్రపంచాల్నే చిత్రీకరించినా, రచయితగా పరిణతి సాధించేకొద్దీ తన విలువలకు పూర్తిగా వ్యతిరేకమైన మెదళ్లలోకీ, ప్రపంచాల్లోకీ కూడా జొరబడే ప్రయత్నం చేసాడు. దీని ఫలితమే హంబర్ట్ హంబర్ట్ (లొలీటా) లాంటి వికృత పాత్రల సృష్టి. ఇలాంటి విలోమ ప్రపంచాల సృజన వెనుకనున్న ఆయన ఉద్దేశ్యం మంచిదా కాదా అని మాత్రం మనం సందేహించనక్కర్లేదు. నబొకొవ్ ఉద్దేశపూర్వకంగా సృష్టించిన ఇలాంటి ప్రపంచాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఉక్కిపోతాం, వాటి క్రూరత్వానికి జడిసిపోతాం. ఫలితంగా ఏ విలువలైతే ఆ ప్రపంచాల్లో లోపించాయో వాటిపై పరోక్షంగా మమకారం పెరుగుతుంది. నిజానికి నబొకొవ్ వీటిలో ఆ విలువల్ని పూర్తిగా లోపించేట్టు కూడా చేయడు. తరచి చూడాలే గానీ, ఈ ఇరుకు ప్రపంచాల పొలిమేరల్లో ఆయన ప్రపంచంలో ప్రేమించే మార్దవమూ, నమ్మిన విలువలూ పొగమంచు కావలనున్న దృశ్యాల్లా వ్యక్తావ్యక్తంగా కనిపిస్తూనే వుంటాయి. ఆయన నవల “లొలీటా”నే ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. పద్నాలుగేళ్ళ లొలీటాని ఏ అపరాధభావనా లేకుండా వాడుకునే హంబర్ట్ హంబర్ట్ ఫిడోఫిలిక్ మెదళ్ళో ప్రయాణిస్తున్నంతసేపూ, దాని తొక్కిడికి చిదుగుల్లా చితికి ఛిద్రమవుతున్న ఆమె బాల్యపు జాలి చప్పుళ్ళు కూడా మనకు లీలగా వినిపిస్తూనే వుంటాయి. నేను చిన్నప్పుడో హిందీ సినిమా చూసాను. అందులో హీరో శశికపూర్ అని గుర్తు. అతనో వేటగాడు. అతని మూణ్ణాల్గేళ్ళ కొడుకు ఓ సారి ఇంట్లో ఆడుకుంటూ, అటుగా వచ్చిన పిల్లికి జడిసి ఏడవటం మొదలు పెడతాడు. మర్నాడు పిల్లాడి భయం పోగొట్టడానికి శశికపూర్ వాణ్ణి ఓ సర్కస్ సింహాలబోనులో పడేస్తాడు. తాను తాపీగా పక్కన నుంచుని చూస్తాడు. నబొకొవ్ సాధారణంగా పాఠాలు చెప్పడు; చెప్తే మాత్రం అవి ఇలాంటి క్రూరత్వంతోనే వుంటాయి. కానీ ప్రస్తుత నవల “ద గిప్ట్” దీనికి భిన్నం. ఇందులో అలాంటి పాఠాలూ లేవు, ఈ ప్రపంచపు విలువలు నబొకొవ్ నమ్మిన విలువలకు విలోమమూ కాదు.

నబొకొవ్ – శైలి: నబొకొవ్ రచనల గురించి పోచికోలు పాఠకుల్నించీ తరచూ వచ్చే ఫిర్యాదు ఒకటుంది. ఆయన శైలి మితి మీరిన వర్ణనలతో, కఠిన పదాలతో మరీ సంక్లిష్టంగా వుంటుందని అంటూంటారు. ఈ అపోహకి సమాధానం చెప్పాలంటే, అసలు శైలి అంటే ఏంటో వివరంగా తెలుసుకోవాలి. అందుగ్గానూ శైలి గురించి ప్రోస్ట్ (Proust) చెప్పిన ఒక మాట క్రింద ఇస్తున్నాను:

“Style is not at all an embellishment as certain people think, it is not even a matter of technique, it is — like colour with painters — a quality of vision, the revelation of the private universe that each one of us can see and which others cannot see. The pleasure an artist affords us is to introduce us to one universe the more.”

[కొందరు భావించేట్టు శైలి అనేది ఒక అలంకారం ఎంతమాత్రమూ కాదు, ఇది మెళుకువకు సంబంధించిన విషయమూ కాదు. చిత్రకారులకు వర్ణాలు ఎలాగో, అలాగే ఇది ఒక దృష్టి తత్త్వం, చూసే విధానం. మనలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు మాత్రమే చూడగలిగే — వేరెవ్వరూ చూడలేని — ఆంతరంగిక ప్రపంచపు వ్యక్తీకరణ. ఇలా మనకు ఒక ప్రపంచాన్ని అదనంగా పరిచయం చేయడమే కళాకారుడు మనకు ప్రసాదించే ఆనందం.]

మనలో ప్రతి ఒక్కరం ప్రపంచాన్ని మనకి మాత్రమే ప్రత్యేకమైన కళ్ళతో చూస్తాం. ఆనందమో విషాదమో, ఆశో నిరాశో, కుతూహలమో నిర్వేదమో. . . ఇలా మనం ప్రపంచాన్ని చూసే తీరుకు ఒక ప్రత్యేకమైన లక్షణం వుంటుంది; కాస్త జన్మసిద్ధమూ, కాస్త పరిసర ప్రభావితమూ ఐన ప్రత్యేకమైన దృక్కోణం వుంటుంది. పైకి అంతా ఒకేలా కనిపించవచ్చు. మనుషులందర్నీ రకరకాల మూసలుగానూ, నమూనాలుగానూ కుదించి బండ పద్దు కట్టేయడం చాలా తేలికనిపించవచ్చు. కానీ ఒక మనిషిని లోతుగా తెలుసునే కొద్దీ, అతని అంతరాంతరాళాల్లోకి ఒక్కో మెట్టూ దిగే కొద్దీ, మిగతా మానవ సమూహమంతటి నుంచీ అతణ్ణి వేరు చేసే ప్రత్యేక దృక్కోణం ఒకటి పరిచయమవుతుంది. ఆ మనిషి దైనందిన చర్యలు, నిర్ణయాలు, మాటలూ, వాదులాటలూ, ఇతర కార్యకలాపాలు వేటిలోనూ ఈ దృక్కోణం బాహటంగా వ్యక్తం కాకపోవచ్చు. కానీ అతనో కళాకారుడైతే మాత్రం అతని కళలో ఇది వ్యక్తమై తీరుతుంది. ఎందుకంటే కళకు మూలాలు అంతరాంతరాళాల లోతుల్లోనే వుంటాయి. సమూహపు అంగీకారం కోసం దేబిరించే పాపులర్ రచనల్ని పక్కనపెడితే, నిజాయితీగా రాసే ఏ రచనైనా ఆ లోతుల్నించే వస్తుంది. తత్ఫలితంగా ఆయా లోతులకి మాత్రమే ప్రత్యేకమైన పురుగూ పుట్రా, మణులూ మాణిక్యాలూ ఇక్కడ వ్యక్తమై తీరతాయి. అతని అద్వితీయమైన దృక్కోణం ఆ రచనలో వద్దనుకున్నా ప్రకటితమై తీరుతుంది. అతను ఎన్నుకొనే మెటఫొర్లూ ఉపమానాలూ; అతని వాక్యాల పొడవూ పొట్టీ; వర్ణనలు ఎక్కువుండటమూ, తక్కువుండటమూ; అతని వ్యాకరణమూ, విరామ చిహ్నాలూ; అతని పదాల ఎంపికా. . . ఇలా ప్రతీ స్వల్పమైన అంశమూ దీని ద్వారా ప్రభావితమవుతుంది. ఇదే అతని శైలి అవుతుంది.

You Might Also Like

One Comment

  1. పుస్తకం » Blog Archive » కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర

    […] శుద్ధ పంచమి నాడు; నా కాలమానం ప్రకారం నబొకొవ్‌ పుట్టడానికి ఒక సంవత్సరం ముందు). […]

Leave a Reply