లేఖలు-సంభాషణలు
రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్
(కొన్ని పుస్తకాలపై అభిప్రాయాలు)
*****************************************
కొ.కు లేఖలు
గొప్ప రచయితకున్న విప్లవభ్రమలు హాస్యాస్పదంగా తోచి కొంచెం నవ్వు , ఎక్కువ సానుభూతిని కలిగిస్తాయి .60,70 ల్లో రాక్షస పాలన అమలు జరుగుతోంది రష్యాలో..గులాగ్ లో కవులు కళాకారులు నరకయాతన పడుతున్నారు.బ్రాడ్స్కీ,మిలోష్ లు దేశాంతరాలు పట్టుకొని పోతే,అన్నా అఖ్మతోవా అక్కడే కృశిస్తే..మెండెలెస్తాం ఒక్కడై మరణిస్తే.. మనవాళ్ళు మార్క్సిజం అని మల్లాగుల్లాలు పడుతున్నారు .అవార్డు డబ్బు శ్రీశ్రీ తీసుకోవాలా వద్దా అన్న దాని మీద రచ్చ.కథల్లో ,లేఖల్లో కొ.కు ది ఒకటే ధోరణి ..పదునైన బుద్ధి,సున్నిత హృదయం.
కొన్ని అభిప్రాయాలు ఆలోచింప జేస్తాయి. ‘తెలంగాణ చీలదు .చీలితే తెలంగాణ పాట్లు కుక్కలు నక్కలూ పడవు ‘(పే.101).
సోమసుందర్ గూర్చి-‘అభ్యుదయ కవిత్వం అతనికి హాబీ అని నాకు ఇరవై ఏళ్ళ క్రితమే తెలుసు.’
చందమామ నిర్వహణ,కథా రచన ,టెక్నిక్స్,విశాలాంధ్ర ,ఆంధ్రజ్యోతి రాజకీయాలు తదితరాలు తెలుసుకోగోరిన వారు హాయిగా చదువుకోవచ్చు ఈ లేఖలను..
సరస్వతీ పుత్రునితో సంభాషణలు
నానా భాషల్లో ప్రవేశం పాండిత్యం ! కానీ ఎక్కడో దారితప్పింది వ్యవహారం.కవిత్వం రాయవలసింది మాతృభాషలో..కవిత్వానికి కావలసింది అమేయ పాండిత్యం కాదు..అచ్చమైన జీవితానుభవం ! పద్నాలుగు భాషల్లో ‘ఆశు కవిత్వం ‘చెప్పగలనన్న ధీమా ఆయనకైతే ఉంది గానీ, కవిత్వం గూర్చి లోతుగా తెలిసినవాడీ విషయాన్ని సీరియస్‌గా తీసుకోడు.ఆయన రాసిన Hero కావ్యం ఎంత పేలవంగా,అమాయకంగా ఉందో చదివితే తెలుస్తుంది.ఈయనకు పాండిత్యం దాని దిక్ ప్రదర్శన ప్రధానం. పేచీ లేదు.కాబట్టే 140 రచనల్లో గొప్ప కృతి ‘శివతాండవం’ ఒక్కటే!
గురజాడను ఒప్పుకోగల ఆధునికతా,హృదయవైశాల్యం ఉంది(విశ్వనాథకు భిన్నంగా;వీరిద్దరిమధ్యా స్పర్ధ అందరికీ తెలిసిందే..)
సహృదయునికి ప్రేమలేఖ –చినవీరభద్రుడు
చిన్నాపెద్దా వ్యాసాలు ఒక అరవై (240 పే).రచయితకు గతం మీద మక్కువ.. దానికి తోడు ఏ విషయాన్ని సరళంగా చెప్పడం చేతకాదు.వేమన పద్యాలకు కుప్పుస్వామయ్యర్ మేడ్డిఫికల్టీ వ్యాఖ్యానాలు రాసే పండితుల ధోరణి. ( ‘నూర్లార్లు లెక్కసేయక ‘ అని బ్రౌన్ ను కీర్తిస్తూ రాసిన ములుపాక బుచ్చయ్య శాస్త్రి ప్రాపకం కోల్పోయింది..ఇటువంటి దుష్కర పాండిత్య ప్రదర్శన వల్లే).
చదివింది జీర్ణించుకోవడం ఒకెత్తైతే దాన్ని పాతిపెట్టి ఆపై మొలుచుకు వచ్చే మొక్కల హరితాన్ని అవసరం మేరకు వాడుకోవడం మరొక ఎత్తు.డాంబికమైన శైలిని క్షేమేంద్రుడు, Edgar Allan Poe ఎవరూ మెచ్చరు.సూటిగా,సరళంగా రాసి ప్రాణానికి హాయి చేకూర్చే ప్రయత్నం లేదిందులో..వేదకాలం,renaissance, marxism, మహాత్మాగాంధీ.. అమ్మా ఆవూ పేడ పిడకలు అన్నీ ప్రత్యక్షం.నుడికారం లోపించిన రాతలు చదివి తలబొప్పి కట్టించుకోగల సాహసులు సత్వరం చదవాలీ పుస్తకాన్ని. ఠాగోర్, ఇస్మాయిల్,కేశవరెడ్డి,అజంతా,చైనీస్ / కన్నడ కవిత్వం..కథలు ఉపనిషత్తుల నుండి ఉప్పు సత్యాగ్రహం దాకా సకలవిషయాల మీద అభిప్రాయ ప్రకటన చూడవచ్చు.
గద్యానికైనా పద్యానికైనా క్లుప్తత ప్రాణం..sense of humour ,ఇంచుక రసజ్ఞత..తోడైతే ధిమ్మసా కొట్టినా హైరోడ్డెక్కుతుంది రచన..అకాడెమీ అనువాదాలకు బ్రహ్మాండంగా సరిపోతుందీ శైలి.(ముఖ్యంగా నగేంద్ర రససిద్ధాంతం,Ferdinand భాషా శాస్త్రాలకు అనువాదాల్లో పట్టిన గతి చూశాక).
తెలుగు అధికార భాష కావాలంటే ? – నూర్ భాషా రహంతుల్లా
చక్కని పుస్తకం.రచయిత స్వయంగా మాట్లాడుతున్నట్లుగా ఉంది.లేవనెత్తిన అంశాలు అందరూ చదివి ఆకళించుకుని తమవంతు కృషి చేయవలసిన తరుణం ఆసన్నమయింది.దక్షిణాదికి ముఖద్వారంగా వెలిగిన భాష, నేడు గడియ పడని తలుపులా నిలుచుంది.
పోర్చుగీసు వారు ,తతిమ్మా ఐరోపా వాసులు మన భాషను GENTOO అని పిలిచే వారు.Gentile అనగా క్రైస్తవులు కానివారు అంటే హిందువులు.. వారి భాష జెంటూ! అంటే భారతావనిలో హిందువుల భాషగా గుర్తింపు బడసిన ఏకైక భాష తెలుగు.. రామానుజన్ జీవితచరిత్రలో ఒక విషయం నన్నాకట్టుకుంది:చిన్ననాడు అతను చదువుకుంది తెలుగు బడిలో!
వేదకాలం నాటి సరస్వతి నదిలా తెలుగు ఎండిపోక ముందే అందరు మేలుకోవలసిందే . ఇదే విషయాన్ని ఎన్నో రకాలుగా పాఠకుల మనసుకు పట్టేలా చేశారు ..రచయిత
శతపత్రం (గడియారం)
గొప్ప రచన.ఆలంపూర్ కేంద్రంగా చేసుకొని బ్రతికిన ఉత్తముని అత్మ కథ. ఎక్కడా రాజీ లేదు.హృదయం ఉంది.చూసిన జీవితాన్ని రూపు కట్టించే
లాఘవం ఉంది.నిష్కల్మషంగా , ధారాళంగా సాగిన రచన.విసుగనిపించదు ఎక్కడా.గొప్పవాళ్ళ గోత్రాలు తెలుసుకోవచ్చు.
పాళీసాహిత్యంలోని దీఘనికాయంలో తాత్వికధోరణులు
ఒక కేంద్రం లేదు భావాలకు.గుడ్డెద్దు చేలో పడినట్లు..ఏమి చెప్పదలచుకున్నాడు రచయిత ? తెలిసింది తిరిగి రాయడమా ? ఆలోచనలను క్రోడీకరించడమా ?? ఇదే రచయిత పాళీభాష మీద రాసిన లఘు పుస్తిక చక్కగా ఉంది.
కాకతీయ యుగ సాహిత్యంలో సంస్కృతి (ప్రమీల)
కొత్తగా చెప్పింది ఏమీలేదు.సంకలనం లాంటి రచన.ideas ఏమీ లేవు. క్రిక్కిరిసి వున్న సమాచారం తప్ప.
వేమన కవితా తత్వం
కొత్తగా చెప్పిందేమీ లేదు.వేమనకు వ్యాఖ్యానాలు అవసరమా ??
తమ్మినేని యదుకుల భూషణ్.
“మన సమీక్షలు కొంత కాలం చదివాక చదివితే మనకే నచ్చక పోవచ్చు”;
అన్న వాక్యాన్ని ఇలా చదువుకోవలసిందిగా మనవి.
“మన సమీక్షలు కొంత కాలం తర్వాత చదివితే మనకే నచ్చక పోవచ్చు”
తమ్మినేని యదుకుల భూషణ్.
ఇది విమర్శ కాదు.కేవలం సమీక్ష. బూకర్ అవార్డ్ గ్రహీత (2005 ) జాన్ బాన్విల్
పారిస్ రివ్యూ కిచ్చిన ఇంటర్వ్యూలో విమర్శకు సమీక్షకు గల భేదాన్ని ఎంతో చక్కగా
విశదీకరించాడు. జాన్ బాన్విల్ స్వయానా ఎన్నో పత్రికలకు సమీక్షకుడు అన్న విషయం మరువ రాదు.
” విమర్శ ,సమీక్ష ఒకటి కాదు.విమర్శకుడు చేసే పని వేరు.పాఠకులకు పుస్తకాన్ని పరిచయం చేయడం వరకే సమీక్షకుని పని.ఒక రచనకు తగు స్థానం కల్పించడం
విమర్శకుడు మాత్రమే చేయగలిగిన పని .సమీక్ష పై పై పరామర్శ.పుస్తకం చదివాక మనలో కదిలే తొలి ఆలోచనలకు అక్షర రూపం.కాబట్టి ,మన సమీక్షలు కొంత కాలం చదివాక చదివితే మనకే నచ్చక పోవచ్చు. ఒక రచనను చదివాక మనలో కదిలే తొలి ఆలోచనలే
సమీక్షలో చోటు చేసు కొనేది.* అవి తప్పు కావచ్చు.ఒప్పు కావచ్చు(కాబట్టే ,సమీక్షలను పుస్తకంగా ప్రచురించే అవసరం లేదని నా అభిప్రాయం.)కానీ ,విమర్శ అలా కాదు,అది ఒక దూర దృష్టిని ప్రసాదిస్తుంది.”
విమర్శకులను ఏ భాషలోనయినా వేళ్ళమీద లెక్కించవచ్చు.సమీక్షకులు కోకొల్లలు.
ఇటువంటి వాక్యాలను నేను ఒక నవలాకారుని నుండి కలలో కూడా ఊహించలేదు.
పేరు తెచ్చుకోవడం మీద నీషే వాక్యాన్ని ఉటంకిస్తాడు బాన్విల్ “” నీవు గాడిద నెక్కి ఊరేగితే గాని జనాలు ఈలలు వేసి, చప్పట్లు కొట్టరు” .
సౌమ్య
Hmm…. ఒక్క టపాలో ఇలా ఇన్ని పుస్తకాల వివరాలు తెలుపడం అన్న ఐడియా బాగుంది. ఎటొచ్చీ, ఈ విమర్శ మరీ ఘాటుగా ఉందేమో అనిపించింది. బహుశా, అలా అనిపించడం తీవ్రత భరించలేని నా బలహీనత వల్ల కావొచ్చు…