బతుకీత: ఎండపల్లి భారతి

వ్యాసకర్త: చరసాల ప్రసాద్

ఎండపల్లి భారతి గారు రాసిన “బతుకీత” కథా సంకలనం ఈ వారమే నాకు అందింది. ఇంతకు మునుపే ఇదే కథకురాలి నుండీ వచ్చిన “ఎదారి బతుకులు” కథలు ఇంకా మనసునుండీ మాయనందున ఈ పుస్తకం కూడా అందినప్పటినుండీ చదువుదామని కాచుక్కూచున్నాను.

చిన్నప్పట్నుంచీ ఏ పుస్తకం కనిపించినా చదివే అలవాటున్నా చదివింది తక్కువే. నేను చదివిన ఆ కొద్ది కథల్లోనూ ఏ కథా మా ప్రాంతపు బహుజన స్త్రీల జీవితాన్ని ఇంతగా పట్టుకోలేదు. పసుపు పూతలూ, మడి కట్లు, ధూపదీపాలు, వంట్లిల్లు దాటని స్త్రీ జీవితాలు.. లేదంటే పట్టణ, నగర స్త్రీలు, వుద్యోగాలు చేసే స్త్రీలు… ఇవే కథా వస్తువులు. కానీ అటు మొదటి సంకలనంలోని “ఎదారి బతుకులు” లోని కథలయినా ఈ “బతుకీత” సంకలంలోని కథలయినా బహుజన స్త్రీల అచ్చమైన జీవితం. ప్రతి కథా ఒకే కథన పద్దతిలో వుంటే వుండవచ్చు గాక. కానీ ప్రతి కథా గ్రామీణ బహుజన స్త్రీ జీవిత చిత్రణ. బహుజన స్త్రీ అని ఎందుకు నొక్కి చెబుతున్నానంటే ఇవి గ్రామీణ పెత్తందారీ కుటూంబాల్లోని స్త్రీల కథలూ వెతలూ కాదు. వంటిల్లు దాటిరాని అగ్రకుల స్త్రీల కథలూ, కన్నీళ్ళూ కూడా కాదు. ఇవి ఇంతదాకా (నాకు తెలిసి) ఎవ్వరూ చూడని, చూసినా కథా సాహిత్యంలోకి రాని ఇంతుల కథలు. ప్రతి కథలోని ప్రధాన పాత్రలూ స్త్రీలే. మగ పాత్రలు వున్నా అవి కేవలం సహాయక పాత్రల్లాంటివి. కథలనిండా పాత్రలే మాట్లాడతాయి. కథకురాలు కేవలం మనల్ని ఆ సన్నివేశం దగ్గర, ఆ పాత్రల దగ్గర నిలుచోబెడుతుంది. మనకు కేవలం చెవుల్ని, కళ్ళనీ ఇస్తుంది. రచయిత్రి స్వయంగా గ్రామీణ బహుజన స్త్రీ. బయటనుంచి చూసి రాసింది గాక, లోపలినుంచీ చూసి రసింది గనకేమో కథలింత అద్భుతంగా వచ్చాయి. 

ఈ కథలు నాకింతగా నచ్చడానికి మరో కారణం ఈ కథా స్త్రీలలో మా అమ్మనూ, అవ్వనూ మొత్తంగా మావూరి నా చిన్నప్పటి శ్రామిక స్త్రీలను చూడడం కూడా! ఇందులోని యాస, మాండలికం నా యాస కావడం వల్ల. ఆ పక్షపాతాన్ని పక్కన బెట్టి చూసినా ప్రతి కథా ఒక వాస్తవం, ఒక జీవిత చిత్రీకరణ. విస్మరించిన చరిత్ర అక్షరబద్దత. ఆ అక్షరీకరించిన జీవితమూ ఎన్ని రకాలు?  దిగువ బుఱుజు పల్లె ప్రజల బాష, వేషం, తిండి, పని, ఇంట్లోని దొంతరల అమరిక నుండి, జలాటి వివరం వరకూ … ఎన్నెన్ని వివరాలు. అంతేనా ప్రతి కథలో ఎన్నెన్ని సామెతలు, ఎన్ని పొడుపు కథలు! ఈ కథలన్నింటిలో ఎన్ని సామెతలున్నాయో రాస్తే ఓ పెద్ద చిట్టా అవుతుంది. 

ఉదాహరణకు కొన్ని చూద్దాం.

“నా వాల్లొచ్చినారు మునిగే చిప్ప గెంటి, మీవాల్లొచ్చినారు తేలే చిప్ప గెంటి” 

“మనింటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతంతా కాలిందంట”

“చుట్టమై వచ్చి దెయ్యమై పట్టుకున్నంట”

“లత్త గవ్వలన్నీ ఒక దరికి చేరినట్టు”

“బంగారట్ల తోడు, బాయి నీల్లకు పోతా ఉంటే కడవలో నీల్లు కల్లలో పోసి పాయనంట”

“గద్దలు తన్నుకొచ్చిన కోన్ని రాబందులు తన్నుకొని పోయినట్టుంది”

“గుడ్డోడు గువ్వను ఏసినట్టు”

“కూటికి వుంటే కోటికి వున్నట్టు”

“ఏడస్తా రైక ముడ్లు ఇప్పే రకం”

“కూడున్న తావన కుక్కుండదంటారే”

“రంకు నేర్చినమ్మ బొంకు నేర్చకపోతే, గుంతనక్కల పాలైనంట”

ఇలా ఎన్నెన్నో..

ఇక ఎత్తుకున్న కథా వస్తువులు ఎన్నెన్నో.. గత వందేళ్ళ చరిత్ర వుందీ కథల్లో. “జూదం” అనే కథలో రైతు సంప్రదాయ పంటలైను కాదని టమాటాను ఒక జూదం వలే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఎలా మునిగిపోతున్నారూ చెబితే, “ఎబుడూ ఎక్కని గుర్రమెక్కితే…” కథలో తినడమూ, పండించడమూ తెలియని కాలి ఫ్లవర్ పంట వేసి ఎలా నష్టపోయారో తెలియజేస్తాయి.

“భూమిని లోడితే దొరికేది మాయేనంట” కథ పర్యావరణ మార్పులను సూచిస్తుంది.

“ఎవుని సట్లో ఉప్పేసే రాత అడిగొచ్చిందో” కథలో ఆధునిక స్త్రీవాదాన్ని మించిన నీతి వుంది.

“కమ్మం నిలేసిన తొలిసొదిన” అనే కథ స్త్రీలను ఉబ్బించి ఎలా పని చేయించుకుంటారో గుర్తు చేస్తుంది.

“మరుగు లేని పొలిమి” కథ పట్టణాల్లో, నగరాల్లో స్త్రీలకు మరుగుదొడ్లు లేకపోవడం ఎంత ఇబ్బందో, సామాన్యస్త్రీల కష్టం ఎంతనో చెబుతుంది.

“అత్తిరసాలు” కథ అత్తిరసాలు చేయడానికి పడే అవస్థలతో పాటు ఎలా చేయాలో అక్షరీకరించింది.

“మల్లన్నకే మా ఓటు” కథలో వివిధ స్త్రీలు తమ తమ మొగుళ్ళ వల్ల ఎలాంటి భౌతిక, మానసిక హింస అనుభవిస్తున్నారో చెబుతారు. ఇందులో ఒక్కో స్త్రీ తన బాధ చెబుతుంది.. ఈ బాధలు చెప్పుకోవడంలో ఆ స్త్రీల మధ్య అరమరకిల్లేని సంబాషణ వారిని ఆ బాధలనుండి తాత్కాలికంగా అయినా బయట వేస్తుందేమో. అలాంటిదే అందులో పాపులు అనే ఆమె చెప్పే ఈ సమస్య . 

 “అంతలో మా పాపులు ఉండుకొని మాకు ఆసింతకు ఈసింతకు రంపు రాదు గానీ ఒక విషయంలో దప్ప అనే. ఏందంటే అది రెయ్యి. మీ అన్న అడగతానే చిన్న పాపను చూపిస్తే ముంతడు రాగులైన ఇసిరేస్తాను అంటాడు. చిన్న పాపను చూపించినాపొద్దు కోడిగూస్తనే లేసి గ్యాట్లో గొడ్లు ఇవతల గట్టేసి పేడదోసి దిబ్బలకేసి నీళ్ళు అన్నిటికీ బట్టేస్తాడు. నా మింద సూపడ ఎయ్యకుండా అన్ని పన్లూ జేసేస్తాడు. నేను పానం బాగలేకనో అలసి పోయినా పొద్దో, పాలుమారి పాపను చూపించకుండ పొయినాపొద్దు బారెడు పొద్దెక్కినంక లేస్తాడు. మండే అగ్గిలో ఉప్పు బోసినట్లు మొగం చిట్లించుకుంటూ వుంటాడు. ఉప్పురాతి పని అనుకోడు. అసుక్కుమంటే రంపు కొస్తాడు. ఇబుడుండే సమస్యల్లో యాడ ఓకికుండేది అనే మా ఒదిన. ఆ మాటలకు అందరం నగితిమి.”

“అదవ బతుకు” అనే కథ, ఎంత కాలం మారినా, ఎన్ని అధునాతన సౌకర్యాలు, పనిముట్లూ అమరినా స్త్రీ అంటే వుండే అలుసు(అదవ) మాత్రం పోలేదు అని చెబుతుంది.

“పేగుల్లేని ఆడోళ్ళు” కథ శ్రామిక స్త్రీలు అడుగడుగునా ఎలా అధిపత్య మగాళ్ళ చూపులను, దాడుల్ని తప్పించుకుంటూ, వీలుకానిచోట లొంగిపోతూ కుములుతున్నారో చెబుతుంది.

ఇక “మా ఇంటికొచ్చిన నల్ల పెట్ట” కథ అయితే కోడి పుంజునెతుక్కోవడం, గుడ్లు పెట్తడం, పొదగడం, పిల్లలు లేపడం… ఈ అంతటిలో కోడికి, శ్రామిక స్త్రీకి వున్న అనుబంధం చక్కగా వుంది.

అన్ని కథలకీ స్థానిక (మదనపల్లె ప్రాంతం) మాడలికం అద్భుతమైన సొగసు అద్దింది. ప్రతి కథా నలుగురు ఆడవాళ్ళు చేరి చెప్పుకుంటుంటుంటే మనం వింటున్నట్టూ, చుస్తున్నాట్టే వుంటుంది.

******

“బతుకీత” కథలు.

రచన ఎండపల్లి భారతి

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణవెల: రు.120  

You Might Also Like

Leave a Reply