హిందీ కవి కున్వర్ నారాయణ్ ఫెస్ట్: లైవ్ బ్లాగ్

కున్వర్ నారాయణ్ ప్రముఖ హిందీ కవి. ఆరు దశాబ్దాల పాటు హిందీ సాహిత్యంలో విశేష కృషి సల్పినవారు. చిన్నకథలు, అనువాదాలు, బాలసాహిత్యం, సాహిత్య వ్యాసాలు, డైరీలు లాంటివి ఎన్నో రాశారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత.

సెప్టంబర్ 19th (అంటే ఇవ్వాళ) ఆయన పుట్టిన రోజు. మొన్న శుక్రవారం మొదలుకుని ఈ రోజు వరకూ ఫేస్‍బుక్ ఆయన పేరిట ఒక ఫెస్టివల్ జరుపుతున్నారు. వాటి విశేషాలని ఇక్కడ పంచుకుంటున్నాను.

(ఫెస్ట్ ఇంకా పూర్తి కాకముందే ఈ వ్యాసం పబ్లిష్ చేయడానికి కారణం, ఎవరికన్నా ఆసక్తి ఉంటే ఈ సాయంకాలం ఈవెంట్స్ అటెండ్ అవుతారేమోనని. ఆ ఈవెంట్స్ గురించి ఇదే వ్యాసంలో రేపటికల్లా అప్‍డేట్ చేస్తాను.)

**********

హిందీ సాహిత్యంతో కొద్దో గొప్పో నాకు పరిచయం బాగానే ఉన్నా కున్వర్ నారాయణ్ గురించి పోయినేడాది వరకూ తెలీదు. ఏదో గూగుల్ చేస్తుంటే ఆయన కవితలు కొన్ని కనిపించాయి. సరళమైన భాష, అంతకన్నా సరళమైన ఇమేజరీ, కానీ గాఢమైన అనుభూతి. నాకు ఎంతగా నచ్చేశాయంటే వెంటవెంటనే కొన్ని కవితలు అనువాదం చేసేశాను. (లింక్ ఇక్కడ: https://aksharf.com/tag/kunwar_narayan/)

ఇక్కడో మాట అనువాదం గురించి చెప్పుకోవడం అవసరం. అనువాదం చేసేటప్పుడు చదవినంత జాగ్రత్తగా, లోతుగా మామూలుగా ఎన్ని సార్లు చదివినా కుదరదు. కవితనో, కథనో ఒక భాష నుంచి మరో భాషకి ఒంపేటప్పుడు దాని నిర్మాణంలో ప్రతి అంశమూ, తీసుకున్న ప్రతి నిర్ణయమూ మనకి బోధపడే అవకాశముంటుంది. అనువాదం చేయడానికి ఒక కవితని ఎన్నుకోవడం రచయిత ప్రతిభకు ఎంత నిదర్శనమో నేను చెప్పలేను కానీ నా మట్టుకు నాకు అనువాదం చేయడమనేది ఎంత చదివినా తనివి తీరిక, దాంట్లో పడి మునకేలాయన్నప్పుడు మాత్రమే జరుగుతుంది.

పోయిన ఏడాది ఈ కవిగారి కవితా సంపుటి ఇంగ్లీష్ అనువాదంలో వచ్చాయి. స్వయాన వాళ్ళ అబ్బాయే అనువాదం చేశారు. దానికి సంబంధించి కూడా కొన్ని ఈవెంట్స్ జరిగాయి ఫేస్‍బుక్, యూట్యూబుల్లో. అవి విన్నాక ఆయన వ్యక్తిగత జీవితం గురించి, చేసిన విశేష సాహిత్య కృషి గురించి మరిన్ని వివరాలు తెలిసాయి.

అప్పటినుంచీ ఆయన రచనలు చదవాలని అనుకుంటూనే ఉన్నాను. ఇంకా కుదరలేదు.

*******

ఒక కవి గానీ, కళాకారులు గానీ చనిపోయి దశబ్దాలూ, శతాబ్దాలూ గడుస్తున్నా కూడా సాహితీవేత్తలు, కళాకారులు, సామాన్యులూ మాట్లాడుకుంటున్నారంటే, సభలూ సమావేశాలూ ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళు చాలా గొప్ప కళాకారులు, వారి కళ కాలానికి ఎదురు నిలిచింది కాబట్టి మహానుభావులు అని వింటుంటాం.

నేనూ నిన్నా మొన్నటి వరకూ అలానే అనుకునేదాన్ని. “చరిత్రలో నిలిచిపోయే కళాకారులు” ఒక మ్యూజికల్ చైర్ గేమ్ లాంటిదనీ, కాలం గడుస్తున్న కొద్దీ కుర్చీలు తక్కువైపోతూ ఉంటే ఎంతో నైపుణ్యం ఉన్న కళకారులకి మాత్రమే చోటు మిగులుతుందనీ అనుకునేదాన్ని. కానీ గత ఏడాది కాలంగా ఫేస్‍బుక్ లో ఆక్టివ్ గా ఉంటూ, ఇటు తెలుగు సాహితీకారులని ఫాలో అవుతూ , అటు జాతీయ అంతర్జాతీయంగా వివక్ష రూపరేఖలతో పరిచయం పెంచుకుంటున్న కొద్దీ నాకు ఈ మ్యూజికల్ చైర్ ఆట మీద విరక్తి వస్తుంది.

“చైర్లు దొరికినవారంతా గొప్ప రచయితలు కానవసరం లేదు. కలర్, జెండర్ మాత్రమే కాక రాసిన జాన్రే బట్టి (లిటరరీ ఫిక్షన్ తప్ప ఏం రాసిన అవార్డులు రావు) కూడా రచయితలకి సముచిత స్థానం లభించడం లేదు. అది అన్యాయం.” అని వెస్ట్ లో కొందరు నొక్కి వక్కాణిస్తుంటే, ఇటు తెలుగులో ఇంకో extreme. ఇక్కడ సోషల్ మీడియాలో ఉగ్రరూపంలో పోస్ట్స్, కామెంట్స్ చేయడం ద్వారా ఆ ఫలనా రచయితకో, కవికో వీళ్ళే కర్చీఫ్ వేసేసి రిజర్వ్ చేసేసట్టు కొందరు ఫాన్స్ ఫీలైతే, ఎలాగైనా ఆ కామెంట్స్ ని తూలనాడి, తిట్టి ఆ కర్చీఫ్ వెనక్కి లాగేసేయాలని చూస్తారు మరికొందరు. “ఆయన రచనలు మాకంత గొప్పగా అనిపించలేదు” అని ఒకరంటే “మీకు చదవడమే రాదు, పొండి” అని ఇంకొకరు అంటారు.

ఈ కుర్చీల ఆటలో లాభపడేది ఎవరో గానీ, నష్టపోయేది మాత్రం నాలాంటి కొత్త పాఠకులు. చదవాల్సినవి ఎప్పుడూ కుప్పలు తెప్పలుగా ఉంటాయి. అంతటి రాశిలో నాకు సరిపడే రచనలు వెతుక్కోవడానికి అసలైతే ఇలాంటి సభలు, నివాళులు పనికి రావాలి. ఒక కవిత, ఒక కథ ద్వారా ఒక రచయిత ఓపెన్ చేసిన డైలాగు నా వరకూ రావాలంటే, నేను దానితో సంభాషించాలంటే, దాన్ని నా దగ్గరకి మోసుకొచ్చేవాళ్ళుండాలి. అలా వాళ్ళు మోసుకురావాలంటే వ్యక్తిగత అనుబంధాలు, ద్వేషాలూ, భావజాలాలూ పక్కకు పెట్టి ఒక unadulterated spirit of lettersని నాకు అందించగలగాలి. అలా అందించాలంటే ముందు వాళ్ళా స్పిరిట్‍ని అనుభూతించగలగాలి. సాహిత్యం ముందు నిలిపి వెనుక haloలా రచయిత పేరు ప్రఖ్యాతలను, గుణగణాలనూ చూపెట్టచ్చు గానీ, రచయితని వ్యక్తిగా ముందు నిలబెట్టి సాహిత్యాన్ని backgroundగా చూపెట్టడం తగని పని అని నా ఉద్దేశ్యం.

*********

ఒక కవిగా కున్వర్ నారాయణ్‍ని పరిచయం చేయడానికి ఈ ఫెస్టివల్‍ని ఎంత జాగ్రత్తగా క్యురేట్ చేశారో తెలుస్తుంది. పైగా, ఇలాంటివి ఫేస్‍బుక్ ఈవెంట్స్ గా పెట్టేటప్పుడు ఒక పేజ్ మీద ఆర్గనైజ్ చేసి అక్కడే అన్నీ ఉండేట్టు చూస్తారు. అలా కాకుండా వీళ్ళు రాజకమల్ ప్రకాషన్ అనే ప్రచురణ సంస్థలాంటి మరికొన్నింటిని కూడా వేదికలుగా కలుపుకున్నారు. హిందీ, ఇంగ్లీషు రెంటిలోనూ ఈవెంట్స్ పెట్టారు.

కున్వర్ నారాయణ్ కవితలు అనేక భాషల్లోకి అనువాదం అయ్యాయి. కథలూ ఇంగ్లీషులో ఉన్నాయి. ఆయన కూడా అనువాదాలు విరివిగా చేశారు. అందుకని ఈ ఫెస్ట్ లో అనువాదాలకి పెద్ద పీటే వేశారు.

“కుమారజీవ” అనే ధీర్ఘ కవితలో ఒక భాగాన్ని పదిహేను భాషల్లో చదివి వినిపించారు. ఆ భాషలన్నీ మనకి ఎటూ రావు. కానీ ఒకటే పద్యాన్ని మళ్ళీ మళ్ళీ వేర్వేరు భాషల్లో వినడం ఒక అపురూప అనుభాతి. అర్థాల వెంపర్లాటలో భాష మొదట శబ్దమనే సంగతి మనం మర్చిపోతుంటాము.


ఇస్మాయిల్ గారు కవిత అనేది “మూగవాని కేక” అని అంటారు. అయితే కవిత చదివేశాక కూడా ఒక అవ్యక్త భావం మన లోపల తిరుగుతుంటుంది. దాన్ని ప్రకటించడానికి మళ్ళీ మనం మాటలే ఆశ్రయిస్తాం. “మాట్లాడలేకపోవడం”, “beyond words” అనేది కాంప్లిమెంట్ చేయడానికి వాడుతుంటాం. అయితే, కొందరు కళాకారులు రంగులలోనూ, గీతలలోనూ, మట్టిలోనూ ఆ అవ్యక్తాన్ని వ్యక్తం చేస్తుంటారు. కున్వర్ గారి కవితలకి ముగ్గురు ఆర్టిస్టుల స్పందన ఈ ఫిల్మ్ లో చూడవచ్చు.

కళాకారులని వారు సృష్టించే కళను బట్టి బారేజు వేస్తుంటాం. వారికంటూ ప్రత్యేకించిన బకెట్లు, షెల్ఫులు ఉంటారు. రచయితలు, కవులు ఒక జట్టు అయితే, చిత్రకారులు, శిల్పులు, నాటకకారులు వేర్వేరు అని డివైడ్ చేసుకుంటాం. పైగా కవుల విషయంలో మరీ ముఖ్యంగా ప్రకృతి నుంచి ప్రేరణ పొంది రాశారంటే మురిసిపోతాం. కానీ సృజనాత్మకతకి అన్ని వైపుల నుంచీ ప్రేరణ వస్తుంది. ప్రధానంగా వేరే కళల నుంచి కూడా. దాన్ని మనం ఒక కవి/రచయిత గురించి మాట్లాడుకునేటప్పుడు చర్చించుకోం. కానీ నేను పైన చెప్పినట్టు ప్రతీ కళారూపం ఒక సంభాషణని/డైలాగ్‍ని మొదలుపెడితే దాన్ని పాఠకులుగా/రసికులుగా ఎలా కొనసాగిస్తామో, రచయితలు/కళాకారులు కూడా అలానే ఆస్వాదించి స్పందిస్తారు.

కున్వర్ నారాయణ్ గారికి ప్రవేశం ఉన్న తక్కిన కళలతో ఆయన రచనా వ్యాసంగాన్ని అర్థం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ కింది సెషన్ నాకు చాలా నచ్చింది.

https://www.facebook.com/watch/live/?v=286395129629568&ref=watch_permalink

ఇందులో షంపా షాహ్ అనే ఆవిడ మాట్లాడుతూ కున్వర్ గారి కథల్లో ఉన్న ఇమేజరీ గురించి చెప్తారు. ఒక ముసలి తండ్రి మొహం చూసి కొడుకు అనుకునే మాటలు: “తండ్రిని చూసినప్పుడు అతనికి మొహం కనిపించలేదు. ముసలితనం కరుడుకట్టుకుపోయినట్టే అనిపించింది. పంట అంతా కోసేశాక ఎండు మొక్కలు ఎండలో వాడిపోతున్న పొలంలా.” ఇది ఇమేజ్‍ని సృష్టించడమే అంటారు ఆవిడ. అలానే ఇంకో కథ గురించి ప్రస్తావించారు. ఆ కథలో ఇరుదేశాల మధ్య సరిహద్దులు రాత్రికి రాత్రి మాయమైపోతాయి. ఇప్పుడు ఎవరు ఏ దేశానికి సంబంధించినవారని అందరికీ తికమక. వెతగ్గా వెతగ్గా సరిహద్దులు దొరుకుతాయి, కానీ నేలపైన కాదు, కాగితం – మాప్ పైన. అప్పుడేం చేస్తారన్నది తక్కిన కథ.

ఇప్పుడిక నేనా కథలు చదవడం ఏ మాత్రం ఆలస్యం చేయలేను. ఆయన అరవై ఏళ్ళు రాశారా, జ్ఞానపీఠ్ వచ్చిందా, పద్మవిభూషణ్ వచ్చిందా, పదిహేను భాషల్లోకి అనువాదం అయ్యారా అన్న వాటి అన్నింటికన్నా ఆ కథల్లో ఆయన ఏం రాశారు, ఎలా రాశారు అన్నదే అతి ముఖ్యం. మిగితావన్నీ జెనరల్ నాలెడ్జ్ కి పనికొస్తాయి కానీ, నాలోని పాఠకురాలని ఉత్తేజపరిచేది ఆయన తన రచనల ద్వారా మొదలెట్టిన డైలాగులు ఎలాంటివి, వాటితో నేనెలా సంభాషిస్తాను.

రచయితలను, కవులను స్మరించుకోవడం వాళ్ళకోసం కాదు. మన కోసం. మన మనుగడ కోసం.

*********

ఈ రాత్రికి కూడా కొన్ని ఆసక్తికరమైన ఈవెంట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది “గోల్కొండ కీ ఏక్ షామ్”. ఇది ఆయన హైదారాబాదులోని గోల్కొండని చూసి వచ్చాక రాసిన కవిత అంట. ఇవ్వాళ ఒక చిన్న ఫిల్మ్ చూపించబోతున్నారు, గోల్కొండ్ కోటలో ఈ కవిత చదువుతూ చిత్రించింది.

“గోల్కొండ కీ ఏక్ షామ్” హిందీ పాఠం

“An Evening in Golconda” అనువాదం చేసింది, వాళ్ళ అబ్బాయి అపూర్వ్ నారాయణ్

ఫిల్మ్ ప్రిమియర్ కి లింక్ ఇక్కడ. (రాత్రి ఎనిమిదింటికి)

కున్వర్ గారి కవితలని ప్రముఖ హిందుస్తానీ సంగీతకారులు, శుభా ముద్గల్ పాడబోతున్నారు. (8.15pm – facebook page లో)

“నావ్ మెఁ నదియా” (River in the Boat) కవితకి కథక్ నృత్య ప్రదర్శన (8:30 pm లింక్ ఇక్కడ)

ఇవ్వన్నీ ఆన్‍లైన్ లో ఎప్పటికి వరకూ ఉంటాయో నాకు తెలీదు. ఆసక్తి ఉన్నవారు ఇవ్వాళ చూడడమే ఉత్తమం.

You Might Also Like

Leave a Reply