కె.ఆర్ మీరా రచనల్లో “అచ్చన్” – 2

గమనిక: కె.ఆర్.మీరా రచనల్లో “అచ్చన్” -1 ఇక్కడ చదవచ్చు. దానికి కొనసాగింపు ఇక్కడ.

కథలో కీలకమైన తండ్రి పాత్రలు: non-abuser

The Angel’s Beauty Spot

ఇదో ఆసక్తికరమైన కథ. ఇందులో ఒక ఆడమనిషి పెళ్ళి చేసుకున్నాక, ఒక కూతురు పుట్టాక, భర్తే ఆమెతో దందా చేయించడానికి ప్రయత్నిస్తాడు. అతనికి ఎదురుతిరిగి ఆమె విడిపోతుంది. అయితే కడుపునింపుకోడానికి వేరే మగవాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటుంది. అలా పరిచయమవుతాడు పెళ్ళైన నరేంద్రన్. అతని వల్ల ఒక కూతురిని కూడా కంటుంది. అతని కాపురం అతలాకుతలమవుతుందని గ్రహించి అతణ్ణి దూరం పెడుతుంది. ఒక పూట మొదటి భర్త వచ్చి ఆమెని చంపేస్తాడు, ఇద్దరు కూతుళ్ళు చూస్తుండగానే. 

ఇప్పుడు నరేంద్రన్ ముందున్న ప్రశ్న: ఈ పిల్లలిద్దర్నీ ఏం చేయడం? మొదటి భర్త తాలూకా బంధువులొచ్చి పెద్దమ్మాయిని బలవంతాన తీసుకెళ్ళిపోతారు. చిన్న పాప ఇక నరేంద్రన్ బాధ్యత. “నువ్వు నన్ను దూరం పెడుతున్నావ్… నీకోసం అందర్ని ఎదిరించి వచ్చేసే వాణ్ణే లేకుంటే” అని ఆమెతో బతికుండగా అన్న ఆవేశపు మాటలన్నీ తల్లిలేని కూతుర్ని చూసుకోవాలనేటప్పటికి చల్లారిపోతాయి.

ఎందుకంటే, ఆ పిల్లకి వీడు తండ్రే అయినా సమాజం ఆమోదించని బంధమది కాబట్టి. అక్రమ సంతానం. సమాజం-తండ్రి-కూతురు ఒక త్రికోణమైతే అతను సమాజానికి దగ్గరగా ఉండడానికి, పిల్లకి దూరంగా జరిగిపోయిన పాయింట్. వారసత్వంగా అతను ఇచ్చిన ఏకైక ఆస్తి, ముక్క దగ్గర పుట్టుమచ్చ, అది కూడా లేకుండా ఉంటే బాగుణ్ణు అని అనుకుంటాడు. పాప “అంకుల్” అని పిలిస్తే సరిపోదు కదా, పుట్టమచ్చ వాళ్ళ బంధాన్ని స్పష్టం చేస్తున్నంత కాలం. చివరకి కూతుర్ని అనాథశరణాలయంలోనే దిగబెట్టడానికి సిద్ధపడతాడు.  

The Saga of Krishna 

పైన చెప్పుకున్న సమాజం-తండ్రి-కూతురు త్రికోణమే ఇక్కడ కూడా. అయితే తండ్రి-కూతుళ్ళ బంధం అక్రమమైంది కాదు. అన్ని విధాలా సక్రమమే. లేకలేక కలిగిన బిడ్డ. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆడపిల్లే అయినా చిట్టి కన్నయ్యలా చూసుకున్నారు, కృష్ణ అని పేరు పెట్టుకున్నారు. చక్కగా చదువు చెప్పిస్తుండగా ఆ పిల్ల పాలిట కామపిశాచై పదకొండేళ్ళ పిల్లని సెక్స్ రాకెట్‍లో ఇరికిస్తాడు ఒకడు. పోలీసుల చొరవతో పిల్ల ఎలానో బయటపడుతుంది.

ఎట్టకేలకి ఇంటికొచ్చిన కూతురికి జరిగిన అఘాయిత్యాన్ని చెప్పుకొస్తూ, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడో స్నేహితుడిగా వచ్చినవాణ్ణి ఎలా నమ్మి మోసపోయాడో మనకి తెలియజేస్తాడు కథ మొత్తం. తల్లికన్నా ఎక్కువ కుమిలిపోతున్నట్టు కనిపిస్తాడు. భార్య ప్రస్తావనని అక్కడక్కడా, అదీ అన్నీ బాగున్న రోజులప్పటి ప్రస్తావననే తీసుకొస్తాడు. కూతురిపై జరిగిన అత్యాచారాలకి కృంగికృశించిపోతున్నట్టే అనిపిస్తాడు, కానీ అంతకన్నా ఎక్కువగా సమాజం, పోలీసులు, మీడియా గురించి చింతిస్తుంటాడు. అచ్చంగా unreliable narrator కిందకి రాడు గానీ, కథ పైపైపొరల్లో ఉన్నంత సహానుభూతి ఆ పొరల్ని దాటుకుని పోతే కనిపించదు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడానికి వచ్చిన కూతురిపై అజమాయిషీ చేస్తాడిలా:

Not making out a thing, Krishna opened her legs even more. He threw her a furious look. Those feet with their tinkling anklets were sinking once again into the bruised hood of his self-respect; he couldn’t bear it any more. He spat out in exasperation: ‘Put your legs close together… can’t you at least sit properly?’

తన్ని తగలేసే తండ్రి కాదు. శీలం పొగొట్టుకుంది కనుక బిడ్డని కాదనుకునేంత నిర్దయ మనిషీ కాదు.  “The Angel’s Beauty Spot”లో ఏమో తల్లి ఉన్నంత వరకూ కూతురుని అల్లారుముద్దుగానే చూసుకుంటాడు – ప్రాథమిక బాధ్యత అతని కాదు కాబట్టి. ఈ కథలో ఆమె సెక్స్ రాకెట్లో ఇరుక్కునేంతవరకూ గారాలపట్టీయే. సమాజపు దృష్టిలో మర్యాదని అతిక్రమించినట్టు అవుతుందో అప్పుడు ఈ తండ్రికూతుళ్ళ బంధాలు కూడా బీటలు వారతాయి.

కథలో కీలకమైన తండ్రి పాత్రలు – abuser

And Slowly Forgetting the Tree, I

నేను ఉపోద్ఘాతంలో చెప్పిన నవల ఇది. ఒక డ్రాయింగ్ కాంపిటీషన్‍కి కూతురుని తీసుకెళ్తూ ఒక చోట ఉండమని చెప్పి గిరాకి ఉన్న ఒక వేశ్య దగ్గరకి వెళ్ళి, కూతురి సంగతి పూర్తిగా మర్చిపోతాడు. అదే చెట్టు కింద వేచి చూస్తూ ఉంటే కట్టెలు కొట్టుకునే ఒకడొచ్చి తన గుడిసెకి తీసుకెళ్ళి పదేళ్ళ అమ్మాయిని బలాత్కారం చేస్తాడు. ఆమె ఎలానో తప్పించుకుంటుంది. అయినా ఆనాటి భయంకరమైన ఘటనని మర్చిపోలేదు. 

కథ చెప్పేనాటికి ఆమెది మధ్య వయసు అయినా, ఆ తర్వాత కూడా ఆమె జీవితంలో అనేక ట్రొమాటిక్ ఘటనలు జరిగినా, వాటి వేర్లని, మూలాన్నీ “తండ్రి తనని మర్చిపోవడం” అన్న దాంట్లోనే వెతుక్కుంటుంటుంది. “The memory of her when she was ten. Acchan. The town. Waiting. The Shed. The bar named Peruvazhiyambalam or ‘Wayside Choultry’. The pathos of a girl forgotten by her father.”

ఆ పూట తండ్రి ఒక షెడ్ దగ్గర నించోమని చెప్పి, ముందు బార్‍కెళ్ళి పీకల దాకా తాగి, ఆ తర్వాత వేశ్య దగ్గరకి వెళ్తాడు. అక్కడ రెయిడ్ జరిగి అరెస్టు చేస్తారు. ఈ అమ్మాయి రేప్ చేసిన కట్టెలు కొట్టేవాడిని తప్పించుకుని పారిపోతుంటే పోలీసులు పట్టుకుని అదే జైలుకి తీసుకెళ్తారు. అక్కడ తండ్రికూతుర్లిద్దరూ ఎదురెదురు పడతారు. 

అంతటి మత్తులో కూడా కూతురిపై జరిగిన అఘాయిత్యానికి ఒక షాక్ తగిలినట్టు అవుతుంది. అప్పటి నుంచి “పార్వతి ఎక్కడ?” అని మాటిమాటికి వేశ్యని గురించే అడుగుతాడు. షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా అతను మాత్రం కుదుటపడడు. అతను పూర్తిగా మంచాన పడేసరికి, తల్లే ఇంటి బాధ్యతలు మోయాల్సి వస్తుంది. కూతురికి కూడా ఒక వింత obsession మొదలవుతుంది. తండ్రిలానే ఆమె కూడా పార్వతి గురించే ఆలోచిస్తుంది. కూతుర్ని మర్చిపోయేంతగా ఒక మగాణ్ణి వశబర్చుకునే ఆడది ఎంత జాణతనం, ఎంత నేర్పు కలిగి ఉంటుందోనని, ఒక స్త్రీగా తానెప్పుడూ అంతగా ఆకర్షించలేదనేవే ఆమెకి తరచూ కలిగే ఊహలు.

ఈ కథలో ప్రధాన పాత్రకి, అంటే కూతురు ప్రేమించినవాడికి కూడా తీవ్రమైన మానసిక సమస్యలు ఉంటాయి. వాటికి కూడా ఆమే బలవుతుంది (victim), తండ్రి దురలవాట్లకి బలైనట్టే. సొంత మనుషులే అబ్యూజ్‍కి గురిచేసినప్పుడు దాన్ని normalize చేసుకుంటారు కాబట్టి ఆ తర్వాతి ఎంతటి abusive patterns కనిపించినా, అనుభవిస్తున్నా దాన్ని విస్మరిస్తారనే థియరీలు ఉన్నాయి. ప్రేమ, రక్షణ, గౌరవం పొందడానికి abuseని కూడా స్వీకరించాలనే విధంగా వీరు ఆలోచిస్తారు. అదే ఈ నవల హైలైట్ చేస్తుంది.

Hangwoman

ఇది కూడా ప్రధానంగా తండ్రీకూతుర్ల కథే. ఫణిభూషణ్ గ్రద్ధ ముల్లిక్ దేశంలోనే పేరుపొందిన తలారి. ఒక నేరస్థునికి ఉరిశిక్ష ఖరారైంది, ఉరి తీయడానికేమో తలారికి ఎనభై ఎనిమిదేళ్ళు దాటాయి. వారసత్వంగా ఆ వృత్తిని, ఆ ఉద్యోగాన్ని కొడుకైతే తీసుకోవచ్చు. కానీ ఆ ఉద్యోగం కోసం, దేశంలోనే మొట్టమొదటిసారి, ఒక మహిళ, అతని కూతురు ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం ఏమైంది అన్నదే తక్కిన కథ. 

ఇది బెంగాల్‍లో బెంగాలి కుటుంబంలో జరిగే కథ. చాలా అణగారిన వర్గానికి చెందినవారు. కటిక పేదరికం. తండ్రికి కూతురికి మధ్య అరవై ఐదేళ్ళ అంతరం! తాగేసి తిట్టి కొట్టే రకమే. వీళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని అంత తేలిగ్గా ఏదో ఒక కాటగరిలో పెట్టేయడం కుదరదు. కూతురికి తండ్రిపైన ఎనలేని గౌరవం. తండ్రికి కూతురి పనితనం మీద నమ్మకం. అయినా ఇద్దరూ కొన్ని వ్యవస్థల్లో ఇరుక్కుని ఉన్నారు. పితృస్వామ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అన్నీ వాళ్ళ బంధాన్ని ప్రభావితం చేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఆకలి. 

వారసులకి జన్మనిచ్చే పాత్రల్లోనే మామూలుగా స్త్రీ పాత్రలు కనిపిస్తాయి. ఈ ఒక్క నవలలోనే న్యాయబద్ధంగా ప్రాణాలు తీసే కళని తండ్రినుంచి వారసత్వంగా అందుకుని ఆ హక్కు కోసం పోరాడుతుంది. 

The Gospel of Yudas 

కె.ఆర్.మీరా అన్ని రచనల్లో నా ధ్యాసని విపరీతంగా ఆకర్షించిన తండ్రి పాత్ర, “ది గాస్పల్ ఆఫ్ యూదాస్” అనే నవలలో వాసుదేవన్ అనే పాత్ర. ఇది ఎమర్జెన్సీకి సంబంధించిన నవల. వాసుదేవన్ ఆ కాలంలో పోలీస్ ఇన్స్పెక్టరుగా ఉండి నేరస్తులని, నక్సలైట్లని, ఉద్యమకారులని కాంపుల్లో చిత్రవధలకి గురిచేసిన మనిషి. ఆ కాంప్ నుంచి వచ్చేశాక కూడా ఆ ఆవేశాన్నీ, కోపాన్నీ ఆపుకోలేక భార్యాబిడ్డల మీద చూపించడం అలవాటు అయిపోతుంది అతనికి. ఆ రకంగా అతని కూతురు చిన్నవయసులోనే తండ్రి చేతుల్లో పోలీసు జులం చవిచూస్తుంది. ఆనాటి నేరస్తుల పేర్లు, వాళ్ళని తిట్టే తిట్లు, వాళ్ళని దాచిపెట్టిన రహస్య ప్రదేశాలు ఆమెకి అన్నీ కంఠతా వచ్చేస్తాయి, ఎందుకంటే తను చెప్పే కబుర్లలోని వివరాలన్నీ అడగ్గానే చెప్పకపోతే తండ్రి ఇంకా చితకబాదుతాడు కనుక. 

ఇండియాలో మిలటరి, పోలీస్, స్పై విభాగాల్లో పనిజేసేవాళ్ళకి వచ్చిన మానసిక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా PTSD లాంటి వాటిని గురించి నేను చదివింది తక్కువ. ఈశాన్య రాష్ట్రాల సాహిత్యంలో బాగానే కనిపిస్తుంది కానీ అక్కడ మిలటరీ అంటేనే ఒక వ్యతిరేక భావం ఉంది. కశ్మీరులో కూడా ఉండచ్చు. కానీ తక్కిన non-conflict regionsలో ఆ ప్రస్తావన చాలా తక్కువగా విన్నాను. ఈ నవలలో రచయిత ఒక ఉద్యమకారుణ్ణి ముఖ్య పాత్రగా ఉంచినా, అతణ్ణి చిత్రవధలు పెట్టిన పోలీస్ ఆఫీసర్ కూతురే అతనికోసం పరితపించేలా చేసినా, ఉద్యోగరిత్యా క్రూరత్వాన్ని తొడుక్కుని సాటి మనుషుల పట్ల అమానవీయంగా ప్రవర్తించడమే లక్ష్యంగా పనిజేసినవారిపై కూడా సహానుభూతి చూపిస్తుంది. 

ఈ వాసుదేవన్‍కి ఇంకో సీనియర్ ఆఫీసరు ఉంటాడు, ఆయన్ని పిలవడమే “బీస్ట్” అంటారు, అందరికీ అతనంటే హడలు. “అచ్చన్”గా మాత్రం అతడో దారుణమైన వైఫల్యం. ఒక కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది, ఒక కూతురికి కాన్సర్. ఇంకో కూతుర్ని భర్తే దారుణంగా హత్య చేస్తాడు. తన కుటుంబ జీవితం గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు: 

‘The state is a big machine, kid. A policeman is no more than a bolt or a nut in it. We couldn’t have done anything by ourselves. We were just tools. Tools at the state’s disposal. Each one of us was like that. Only the state mattered. It had to stay. Didn’t God, Lord Krishna himself, say the same in the Bhagavadgita? I used to believe that my children died to atone for my crimes. Most of my colleagues’ families were torn apart. Some became gravely ill. The children of a few have gone astray. Others have lost their homes. Were these nothing more than the consequences of a collective curse from the youngsters whom we brutalized till they threw up gore? I don’t know. We didn’t think like that. I was doing my duty.’

ఉద్యమకారుల బిడ్డలు, చుట్టాలు “మా నరనరాల్లో ఉద్యమ రక్తం పొంగుతుంది” అని గర్వపడుతుంటారు. మరి ఇలాంటి అకృత్యాలు చేసినవాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు? వారి మనోభావాలు ఎలా ఉంటాయి? తండ్రులు చేసిన పాపాలు, నేరాలు పిల్లలకీ వారసత్వంగా వస్తాయా? ఉన్మాదపు సమయాల్లో విచ్చలవిడిగా చెలరేగిన హింసని తర్వాతి తరాలకి ఎలా వివరించాలి?   ఇలాంటి చాలానే ప్రశ్నలు లేపుతుంది ఈ నవల, తండ్రికూతుళ్ళ కథ చెప్తూ. 

******

ఇవి కె.ఆర్.మీరా రచనల్లో నాకు ఆసక్తికరంగా అనిపించిన తండ్రి పాత్రలు. ప్రస్తుతానికి ఇలాంటి patterns కనిపెట్టే పని మాత్రమే పెట్టుకున్నాను. వీటికి ఇంకొన్ని అంశాలు – కులం, మతం, వర్గం వగైరాలని కూడా కలిపి చూడచ్చు. కానీ దానికి కేరళ సామాజిక, సాంఘిక నేపథ్యాలపై అవగాహన అవసరం. ప్రస్తుతానికి అర్థమైన విషయాలు:

౧. ఆవిడ రచనల్లో తండ్రి పాత్రల ప్రాముఖ్యత ఎక్కువ. ఆసక్తికరంగా తండ్రి కూతుళ్ళ బంధాన్ని ఎక్కువగా చూపించారు.

౨. పరువు హత్యలు, ఆస్తి కోసం బలవంతపు పెళ్ళిళ్ళు చేసే క్రూరమైన తండ్రులని సాహిత్యంలోనూ, సినిమాల్లోనూ చూపించేటప్పుడు ఎంత black & whiteగా ఉంటుందో, ఈవిడ రచనల్లో దానికి సంబంధించిన Fifty shades of grey 😛 కనిపిస్తాయన్నమాట. ఫెమినిజం అంటే మగవాళ్ళని దుయ్యబట్టడం అన్న అభిప్రాయం నెలకొన్న సమయంలో మగవాడిని, ముఖ్యంగా తండ్రిని, the prime victim of patriarchyగా చూపించగలగడం, అదీ ఇంత నైపుణ్యంతో చేయడం మీరా సాహిత్యంలోని విశేష గుణం.

౩, “ఇంట గెలిచి, రచ్చ గెలిచి” అన్నట్టుగా ఈ కథల్లో అమ్మాయిలకి మొట్టమొదటి సవాళ్ళే తండ్రులు. ఆ frictionకి నలిగిపోయిన తండ్రులూ ఉన్నారు, చితికిపోయిన అమ్మాయిలూ ఉన్నారు. బహుశా, the system is a big machine, kid! అని అనుకోవాలేమో.

You Might Also Like

Leave a Reply