కె.ఆర్ మీరా రచనల్లో “అచ్చన్” – 1

చిన్నతనంలో, అంటే పది-పదకొండేళ్ళ వయసులో, వాళ్ళ నాన్నతో బయటకెళ్ళినప్పుడు కె.ఆర్.మీరాని ఒక చోట ఉండమని చెప్పి ఆయన ఇంకో పని మీద వెళ్ళి, ఆవిడ ఎదురుచూస్తున్న సంగతి పూర్తిగా మర్చిపోయారు. ఎదురు చూసి చూసి దిక్కులేక ఎలానో దారి కనుక్కుంటూ ఇంటికి క్షేమంగా చేరారు. అలా తను ఎదురుచూస్తున్న సంగతి మర్చిపోయినందుకు ఆవిడకి వాళ్ళ నాన్న మీద చాలా కోపం వచ్చిందంట. ఆ కోపాన్ని ప్రేరణగా తీసుకునే “And Slowly Forgetting the Tree, I” అనే నవల రాశానని పలు ఇంటర్వ్యూలలోనూ, నేను ఆవిణ్ణి కలిసిన ఏకైక సమావేశంలోనూ చెప్పారు. 

అది విని నాకు చాలా ఆశ్చర్యమేసింది. అలా ఒకచోట ఒంటరిగా ఉండిపోవడమో, దారి తప్పిపోవడమో జరిగితే, భారతదేశంలో ఏ మూల అయినా సరే, ఒక పదకొండేళ్ళ ఆడపిల్లగా భయం, బెదురు, ఏమైపోతుందోనన్న గుబులు సహజం. ఏమి చేయాలో పాలుపోకపోవడం, ఎవర్ని సహాయం అడగాలో, సహాయం చేస్తామన్నవాళ్ళని నమ్మచ్చో నమ్మకూడదోనన్న మీమాంశ ఇవే సరిపోతాయి. అనర్థమేమీ కాకుండా క్షేమంగా గూటికి చేరుకుంటే అదే పది వేలు. ఆ తర్వాత నుంచి ఎవరితో ఎక్కడికెళ్ళినా చేతిలో అడ్రస్, ఫోన్ నెంబర్లు పెట్టుకోవడమో, వెళ్తున్న దారులని గమనించడమో చేయచ్చు. జీవితాంతం ఆ పూట పడిన గుబులు మరుపుకైతే రాదు. అందుకని అవసరానికి మించి అప్రమత్తంగా ఉండడం అలవాటైపోవచ్చు.

ఇవ్వన్నీ సరే గానీ, కోపం వస్తుందా? నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, బాధ్యత విస్మరించినందుకు, న్యాయంగా రావాల్సిన కోపం వస్తుందా? అదీ తండ్రి మీద? కె.ఆర్.మీరాకి వచ్చినట్టు? వచ్చినా అది బాధనీ, భయాన్ని పక్కకు తోసి అచ్చమైన కోపంగా నిలువగలుగుతుందా? “అట్లా వదిలిపెట్టేసావ్, నాకేమన్నా జరిగితే?” అని దేబరింపులా కాకుండా, “అలా ఎలా వదిలిపెడతావ్? నన్నెలా మర్చిపోతావ్? నాకేం జరిగినా అది నీ బాధ్యత కాదా?” అని నిలదీయడం సాధ్యమేనా? 

కె.ఆర్.మీరా రచనల్లో అంతర్లీనంలా కనిపించేది రోషమే అని నాకనిపిస్తుంది. ఎవరి కథ చెప్తున్నా, ఎలా చెప్తున్నా అందులో అంతర్భాగమై ఉన్నది ఈ కోపమే, ఈ అసహనమే! చెప్పడానికి ఆవిడ ఆ ఘటన ఒక నవలకి ప్రేరణ అని చెప్పినా, ఆవిడ రాసిన తక్కిన రచనల్లోనూ నాకు “అచ్చన్” ( మలయాళంలో తండ్రి) పాత్రలకే ప్రాధాన్యత అని అనిపించింది. ఆవిడకి తన తండ్రితో అంత సత్సంబంధాలు లేవని చదివాను. అయితే ఆవిణ్ణి సైకో-అనాలిసిస్ చేసే పని నేను పెట్టుకోవడం లేదు. నా ఆసక్తల్లా ఆవిడ రచనల్లో కనిపించిన తండ్రి-బిడ్డల బంధాల తీరుతెన్నులు, ముఖ్యంగా తండ్రి-కూతుర్ల మధ్య. ఇలా తరచి చూసుకోవడం అవసరమైన పని అని నాకు అనిపించింది. ఎందుకంటే, కె.ఆర్.మీరా ఒక ఫెమినిస్ట్ రచయిత. ఆవిడ రచనలన్నింటిలో అది ప్రధానాంశం. కానీ పితృస్వామ్య సమాజంలో తండ్రిది కీలకమైన, అధికారంగల పదవి, హోదా. పితృస్వామ్య వ్యవస్థలో తేలిగ్గా బలయ్యే కూతుళ్ళకి, ఆధిపత్యం చలాయించే స్థానంలో ఉన్న తండ్రుల మధ్య ఎలాంటి ఘర్షణలు ఆవిడ చిత్రీకరించగలిగారన్నది నా ఆసక్తి.

(గమనికలు:

౧. ప్రస్తుతం ఆంగ్లానువాదంలో ఉన్న ఆవిడ రచనలన్నీ చదివాను. ఏడు నవలలు/నవలికలు, ఒక కథా సంకలనం. వాటినే ఈ వ్యాసాల కోసం పరిగణించాను.

౨. ఒకే రచయిత రచనలు చదివాక వాటిల్లో కనిపించే కొన్ని సారూప్యతలని గుర్తించి, వాటిని ఒకసారి తరచిచూడ్డానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప, ఇదేమీ రిసర్చ్ పేపరు కాదు, నేనేమీ లిటరేచర్ స్టూడెంట్‍ని కాను.

౩. వ్యాసం నిడివి ఎక్కువైన కారణాన రెండు భాగాలుగా వేస్తున్నాను. రెండో భాగం ఇక్కడ. ) 

*******  

కె.ఆర్.మీరా రచనల్లో నాకు దాదాపుగా తండ్రులు కూతుర్ల మధ్య బంధాలు (వాటిల్లో వికటించినవే ఎక్కువగా) కనిపించాయి. వాటిని ఈ కింది వర్గాలుగా విభజించుకున్నాను. ఎంత బాగా రాసినా, ఇవి చివరకి కథలోని పాత్రలే. అందుకనే కథకి అవెంత కీలకం అన్నదాని మీదే బేస్ చేసుకున్నాను. 

  1. కథకి అంతగా కీలకం కాని తండ్రి పాత్రలు: అంటే, కథలో ఆ పాత్రలు లేకపోయినా, అసలు కథకో, కథాగమనానికో పెద్ద మార్పు ఉండబోదని అనిపించినవి. ఈ పాత్రలు లేకపోతే కథలోని గాఢతకి లోటు రావచ్చు. ఇవి లేకపోవడం వల్ల ఒక ముఖ్యమైన పొరని వదిలేసినట్టు అవ్వచ్చు. కానీ కథ అమాంతంగా మారిపోదని నా అంచనా.   
  2. కథలో కీలకమైన తండ్రి పాత్రలు: ఈ పాత్రలు అయితే కథలో ప్రధాన పాత్రలు, లేదా ప్రాధాన పాత్రలతో చాలా వరకూ ముడిపడి ఉన్నవి. ఈ పాత్రలు లేకపోతే అసలు కథ రూపురేఖలే మారిపోతుంది. దీన్ని ఇంకా వర్గీకరించుకోవచ్చు: 
    1. నాన్-అబ్యూజర్ (హింసాయుత, దూషణ ప్రవర్తన లేని పాత్రలు) 
    2. అబ్యూజర్ (తిట్టి, కొట్టి, రాచి రంపాన పెట్టిన, పెట్టగలిగిన పాత్రలు) 

కథకి అంతగా కీలకం కాని తండ్రి పాత్రలు

The Unseeing Idol of Light: 

నవలల్లో కథని ముందుకు నడిపించడమనే పనిజేసే కథ ఒకటి ఉంటుంది. ఈ నవలలో: గర్భవతి అయిన భార్య (దీప్తి) తప్పిపోతే, ఆమెని వెతికే క్రమంలో కంటిచూపుని పోగొట్టుకున్న భర్త (ప్రకాశ్) కథ. నవలకి లోతుని, గాఢతని ఇచ్చే కథాంశాలు కూడా ఉంటాయి. ఈ నవలలో: ప్రకాశ్ తండ్రి జీవితానికి సంబంధించిన కథ. ఆయనొక ప్రముఖ న్యాయమూర్తి. కొడుకంటే పంచ ప్రాణాలు. ఉన్నట్టుండి ఒకనాడు మామిడి చెట్టుకి ఉరేసుకుని చనిపోతాడు. తండ్రి ఎందుకలా చేశాడన్నది కొడుకుని దొలిచేసే ప్రశ్న. భార్యని వెతకడంతో పాటు తండ్రి రహస్యాలని చేధిస్తాడు, ఆయన పాత కాలేజి స్నేహితులని సంప్రదించి. భార్య దొరుకుతుందా, లేదా అన్న ప్రశ్నతో పాటు తండ్రి అసలెందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది కూడా నవలని చివరి దాకా నడిపిస్తుంది. 

ఈ తండ్రికొడుకుల సంబంధాన్ని ప్రధానంగా నడిపించేది వెలితి – absence. ఏడెనిమిదేళ్ళ వయసులోనే తండ్రిని పోగొట్టుకుంటాడు. ఎవరి అంత్యక్రియలు చేస్తున్నాడో కూడా తెల్సుకోకుండా తతంగం పూర్తిచేస్తాడు. అన్నీ అయ్యాక మామిడి చెట్టుకి ఉరేసుకుంది తన తండ్రేనని గ్రహిస్తాడు. అప్పటినుంచి “ఎందుకలా చేశాడు?” అన్నది ఒక చీకటి రహస్యంగా మిగిలిపోతుంది. పట్టువదలకుండా చేధిస్తాడు. తండ్రి కుర్చీలో తానిప్పుడు కూర్చున్నా కూడా ఆ వెలితిని అనుభవిస్తాడు. కనిపించకుండా భార్యని ఎలా వెతుకుతాడో అలానే ప్రాణాలు తీసుకున్న తండ్రి కోసమూ వెతుక్కుంటాడు. 

కథకి ఇంత ప్రధానం కాదు కానీ దీప్తి తండ్రిది కూడా ఆసక్తికరమైన పాత్ర. తల్లిలేని బిడ్డని అల్లారుముద్దుగా పెంచుకుని, చదువు చెప్పించి, మంచి కుర్రాడికిచ్చి పెళ్ళి చేశాక, గర్భవతిగా ఉన్నప్పుడు తప్పిపోతుంది. తండ్రితో కలిసి చేస్తున్న రైలు ప్రయాణంలోనే రాత్రికి రాత్రి మాయమైపోతుంది. అప్పటినుంచి కూతురు వెనక్కి వస్తుంది, వస్తుందని ఎదురుచూస్తూ ఉంటాడు. పదేళ్ళైనా రాకపోయేసరికి ఒకలాంటి వైరాగ్యమో వైకల్యమో అంటుకుని, తన కూతురు దైవాంశతో పుట్టిందని, అందుకే అలా అంతర్ధానమైపోయిందని టివి ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. ఆమె సచ్చరిత్ర రాస్తుంటాడు. ఉన్నట్టుండి ఎక్కడో అన్ని పోలికలు, వివరాలు కుదిరిన ఇంకో ఆడమనిషి కనిపిస్తే తన కూతురేననుకుని శరణాలయం నుంచి ఇంటికి తెచ్చుకుంటాడు. ఆమె తన కూతురు కాదని తేలాక నిరాశతో చనిపోతాడు. 

ప్రకాశ్ కి, అతని తండ్రికి మధ్య బంధాన్ని నిర్వచించింది మరణం – తిరిగి వస్తారనే ఆశ మిగల్చని మరణం. దానికి inverseలో దీప్తి, ఆమె తండ్రికి మధ్య సంబంధం ఉంటుంది. ఆమెది కూడా absence ఏ, కానీ శాశ్వతం కాదు. తాత్కాలికం. ఏ క్షణానైనా ఆమె తిరిగి రావచ్చుననే ఆశ. ప్రకాశ్ తండ్రి చేజేతులారా ప్రాణాలు తీసుకుంటే, దీప్తి తప్పిపోవడం మాత్రం ఆమె ప్రమేయం, ఇష్టం లేకుండా జరిగాయని అందరూ నమ్ముతారు. ఆమె కావాలనుకుని వెళ్ళిపోయుంటే వెతకాల్సిన అవసరం ఉండకపోయేది.

ఈ రెండు రకాల absence వెనుక “అసలేం జరిగింది?” అని తెల్సుకోవాలన్న తపన మాత్రం తప్పకుండా ఉంది. దానికి సమాధనం దొరక్కుండానే దీప్తి తండ్రి చనిపోతాడు. 

Poison of Love: 

ఇందులో తండ్రి పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. ముగ్గురు కూతుళ్ళు. పెద్దమ్మాయి ఐఐటిలో చదువు పూర్తి చేస్తుంది. మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయిస్తారు. అమ్మాయీ ఒప్పుకుంటుంది. కానీ అంతలోనే పరిచయమైన ఒక మాయలోడి వలలో పడి పెళ్ళి రేపనగా వాడితో పారిపోతుంది.

కథ మొత్తం ఈ అమ్మాయి POVలో నడుస్తుంది కనుక, ఆయన ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. అయినా తండ్రి వైపు కథ ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. భార్యకి కాన్సర్ ఆఖరి దశకి చేరుకున్నందుకే కనీసం ఒక పిల్లకైనా పెళ్ళి చేయాలని హడావిడిగా నిశ్చయించిన సంబంధం అది. కానీ కూతురు మాట కూడా చెప్పకుండా వాడితో వెళ్ళిపోతుంది. ఉన్నతాధికారి, సమాజంలో పరువు ప్రతిష్టలు, అంతకు మించి ఇంకో ఇద్దరు అమ్మాయిలకి తండ్రి. అందుకే పెద్ద కూతురితో సంబంధాలు తెంచుకుంటాడు. మిగిలిన ఇద్దరికీ చదువులు కాకముందే, వాళ్ళెలాంటి తప్పుడు అడుగులు వేయకముందే, పెళ్ళిళ్ళు చేసేస్తాడు. 

మాయలోడి మాయలన్నీ మాయమై వాడొట్టి మోసగాడని తెలిసాక పెద్ద కూతురు తండ్రినే ఆశ్రయిస్తుంది. కోపతాపాలకి తావివ్వకుండా ఒంటరిగా ఉన్న ఆయన కూతురికి అన్ని విధాలా అండగా ఉంటాడు. భర్త వచ్చి బతిమాలుకున్నాక కూతురు తిరిగి వెళ్ళడానికి సిద్ధమైతే ఆపడు. ఒక బాధ్యతగల తండ్రికి, సమాజం నియమాలకి లోబడి మసులుకున్నా, తండ్రిగా బిడ్డ మీద, తేటతెల్లంగా కాకపోయినా, మమకారాన్ని చూపించే పాత్ర ఇది.

ఈ రెండు నవల్లోని ఆడపిల్లల తండ్రులు కాస్త ఆధునికంగా ఆలోచించేవాళ్ళు. ఆడపిల్లలకి చదువులు చెప్పించినా పెళ్ళిలోనే “భద్రత” ఉందని నమ్మేవాళ్ళు. సమాజంలో ఒక స్థాయి, ఒక గౌరవం ఉన్నవాళ్ళు కాబట్టి దానికి తగ్గట్టే నడుచుకోవడానికి తాపత్రయపడేవాళ్ళు. వాళ్ళ కూతుర్లూ అలానే నడుచుకోవాలని కోరుకునే తండ్రులు. అలా కుదరని పక్షంలో తండ్రుల పాత్రలు ఎలా మారాయో రెండో భాగంలో చదవవచ్చు – ఇక్కడ.

You Might Also Like

Leave a Reply