శ్రీ మధ్బగవద్గీత – పండిత శ్రీ ముక్తి రామోపాధ్యాయ విరచిత భాష్యోపేతము

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్
*****************

ఆర్య సమాజం కి చెందిన శ్రీ ముక్తి రామోపాధ్యాయ గారు భాష్యం చెప్పిన భగవద్గీతని తెలుగులోకి అనువదించారు, పండిత గోపదేవ్ గారు. చాలా కాలం క్రితం చదివిన ఈ పుస్తకాన్ని, మళ్ళీ ఒకసారి చదవాలనిపించింది. కొంచం టైం పట్టినా మళ్ళీ చదివాను. మతపరమైన ఉద్దేశ్యాలతో కాకుండా, కేవలం ఒక మంచి పుస్తకం చదివిన తర్వాత కలిగిన భావాల్ని పంచుకోవడానికి, ఈ వ్యాసం వ్రాస్తున్నాను.

భగవద్గీత కి చాలా మంది భాష్యం చెప్పారు. ఇస్కాన్ వాళ్ళు ప్రచురించిన భగవద్గీత ని చాలా మంది చూసే వుంటారు, చాలా మంది ఇళ్ళల్లో ఆ పుస్తకం వుండే వుంటుంది. కానీ నాకు ఆర్య సమాజం వాళ్ళు ప్రచురించిన ఈ పుస్తకం నచ్చింది. కారణాలు ముందు చెప్తాను.

ఇప్పుడు ప్రామాణికంగా వున్న భగవద్గీత లో (ఇస్కాన్ వారిది కానీ, వేరే వారిది కానీ) మొత్తం 700, లేదా 701 శ్లోకాలు వున్నాయి. కానీ ఆర్య సమాజం వారు ప్రచురించిన గీత లో కేవలం 362 శ్లోకాలు మాత్రమే వున్నాయి. శ్రీ ముక్తి రామోపాధ్యాయ గారి ప్రకారం, వ్యాస విరచితమైన గీత లో కేవలం 362 శ్లోకాలు మాత్రమే వుండేవి. మిగిలినవన్నీ ‘ప్రక్షిప్తాలు’, అంటే తర్వాతి కాలంలో అవి గీత లోకి చేర్చబడ్డాయి. ఇలా చెప్పటమే కాకుండా, ఏ ఏ శ్లోకాలు ఎందుకు ప్రక్షిప్తాలో, వివరంగా చెప్పారు.

అలాగే, అతని ప్రకారం శ్రీ క్రిష్ణుడు దేవుడు కాడు. మనుషులలో ఉన్నతమైన వాడు. ‘భగవాన్’ అనే పదాన్ని సంస్కృతము లో ఉన్నతమైన మనుష్యులకు వాడుతారు. ఇది చదివి తర్వాత, కొంచం ఉత్సుకత పెరిగి, ఇస్కాన్ వారి భగవద్గీత ను, మల్లాది వెంకట క్రిష్ణమూర్తి గారు తెలుగులో ఇచ్చిన తాత్పర్యాలను పక్క పక్కనే పెట్టి కంపేర్ చేసి చూశాను. చిత్రమేమిటంటే, శ్లోకాల సంఖ్యే కాదు, అధ్యాయాల పేర్లు కూడా ఒక్కటిగా లేవు.

నేను గమనించిన ఇంకో చిత్రం ఏమిటంటే, ఆర్య సమాజం వారు ప్రచురించిన గీత లో, 1వ, 12వ, 15వ అధ్యాయాల్లో శ్లోకాల సంఖ్య మిగతా రెండు పుస్తకాల్లో కంటే ఎక్కువగా వున్నాయి. వేరే పుస్తకాల్లో ఎక్కువగా వున్న శ్లోకాలని ప్రక్షిప్తాలు అన్నారు. మరి వారు వ్రాసిన ఈ అధ్యాయాల్లో ఎక్కువగా వున్న శ్లోకాల గురించి చెప్పలేదు. మరి ఈ ఎక్కువ శ్లోకాలు ఎక్కడినుంచి వచ్చాయో తెలీదు. వీరెవ్వరూ కూడా అసలు ప్రామాణికంగా తీసుకున్న గ్రంథం ఏదో ఎక్కడా చెప్పలేదు. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రామాణికమైన పుస్తకం అంటూ వుందో లేదో తెలీకుండా అయ్యింది. అందుకే ఈ పుస్తకాన్ని చదవడానికి నాకు స్వంతమైన కొన్ని ప్రమాణాల్ని నేను పెట్టుకున్నాను.

1. ఈ పుస్తకాన్ని నాస్తికవాదిగా చదవాలి. క్రిష్ణున్ని కానీ, ఇతరుల్ని కానీ దేవుడి గా భావించొద్దు.
2. ఈ పుస్తకాం లోని ఫిలాసఫి ని అర్థం చేసుకోవాలి.
3. మత గ్రంథం లా కాకుండా, పాప పుణ్యాల ప్రసక్తి లేకుండా చదవాలి.
4. జన్మలూ, పునర్జన్మలూ లేవు.

ఇలా వీటికి సంబంధించిన విషయాలని పట్టించుకోకుండా, అసలు విషయం ఏమిటీ అని శోధిస్తూ నా పరిధిలో చదివిన ఈ పుస్తకం నాకు చాలా నచ్చింది. మొత్తం 18 అధ్యాయాలు వున్న ఈ పుస్తకం లో చర్చించిన ముఖ్యమైన విషయం కర్మ సన్యాసం గొప్పదా లేక కర్మ ఫల త్యాగం గొప్పదా. మనిషి పుట్టిన తర్వాత చనిపోయే వరకూ గడిపే సమయమే జీవితం. బ్రతకడానికి మనిషి ఏదో ఒక పని (కర్మ) చేయాలి. చేసిన ప్రతీ కర్మ మనకి ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని సార్లు ఆ ఫలితం సంతోషకరమైనదైతే, మరికొన్ని సార్లు అది దుఃఖ కారణమవుతుంది. అసలు కర్మే చేయకుంటే సుఃఖం, దుఃఖం రెండూ వుండవు, కానీ అప్పుడు మనిషి జీవించడానికి అవకాశం కూడా వుండదు. అలాంటప్పుడు దుఃఖానికి గురవకుండా కర్మ లు చేస్తూ బ్రతకలేమా అన్నది ప్రశ్న. దానికి సమాధానమే ‘కర్మ ఫల త్యాగం’. కర్మ త్యాగం (సన్యాసం) కంటే కూడా కర్మ ఫల త్యాగమే గొప్పది అని గీత చెప్తుంది. ప్రతీ మనిషి, జ్ణానుల నుంచి సామాన్యుల వరకూ అందరు కర్మని చేయాల్సిందే. అప్పుడే లోకం నడుస్తుంది. కానీ ఆ కర్మ వలన కలిగే దుఃఖాన్ని తప్పించుకోవాలంటే, కర్మ ఫల త్యాగం చేయాలి.

మొత్తం 18 అధ్యాయాల్లో అతి కీలకమైనది 3వ అధ్యాయం. అందులోనే కర్మ యోగం గురించి వుంది. పండిత ముక్తి రామోపాధ్యాయ గారి వుద్దేష్యం లో 3వ అధ్యాయమే అత్యంత ముఖ్యమైనది. మిగిలిన అన్ని అధ్యాయాలు కేవలం దీనికి భాష్యాలు అన్నా అతిశయోక్తి కాదు అంటారు.మనిషికి వున్న అతి పెద్ద భయం మృత్యువు. దాన్ని జయించాలి. అంటే మృత్యు రహిత స్తితి కి చేరుకోవాలి. దాన్నే మోక్షం అంటారు అనుకుంటే, మోక్షాన్ని ఎలా చేరుకోవాలి? కర్మ యోగం ద్వారా. కర్మ యోగం అంటే ఫలాపేక్ష లేకుండ కర్మ చేయటం. మృత్యువు అంటే మనిషికి ఎందుకు భయం? జీవితం మీద, శరీరం మీద వుండే కోరిక వలన. మరి ఆ భయం పోవాలంటే, ఆ కోరిక పోవాలి. కాబట్టి చేసే కర్మలు (పనులు) కోరికతో చేయకూడదు. అదే కర్మ యోగం అంటే. ప్రతీ పనిని ఒక ధర్మం లా చేయాలి. ఆ పని చేయబడాలి కాబట్టి చేయాలి. అంతే. దాని ఫలితాన్ని మనం ఆశించనంత వరకు మనకు దాని వలన దుఃఖం కలుగదు.3వ అధ్యాయంలో ఒకసారి ఈ విషయం స్పష్టం చేసిన తర్వాత, మిగిలిన అధ్యాయాల్లో దీనిని సాధించడానికి కావల్సిన మార్గాలు, వుండాల్సిన లక్షణాలు వర్ణింపబడ్డాయి.

అత్యంత క్లుప్తంగా ఇక్కడ నేను చెప్పిన ఈ విషయం, ఆలోచిస్తే చాలా పెద్దది. కొన్ని శతాబ్దాలుగా, కొన్ని కోట్ల మంది పవిత్రంగా భావించే ఒక గ్రంథంలో వున్నది ఇదే అంటే ఆశ్చర్యమే. కానీ, నిజం. అద్బుతమైన విషయం ఏమిటంటే, బుద్దుడి నించి ఈనాటి ఫిలాసఫర్స్ వరకు ఎందరినో ప్రభావితం చేసిన ఒక గొప్ప థియరీ ఇది. ఇది చదివిన తర్వాత, ఇంతకు ముందు చదివిన ఎన్నో పెర్సనాలిటీ డెవలెప్మెంట్ పుస్తకాలు జ్ణాపకం వచ్చాయి. ప్రతీ ఒక్కరు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాల్లో ఇది వుండాలి. ఈ పుస్తకాన్ని కేవలం ఒక పారాయణ గ్రంథంలా కాకుండా, చదివి ఆచరిస్తే, చచ్చాక వచ్చే పుణ్యం, స్వర్గం కన్నా, బ్రతికున్నన్ని రోజులు మనం దుఃఖం లేకుండా వుండొచ్చు.

ఈ పుస్తకం ఆర్య సమాజ్ వారి పుస్తకాల షాపులలో ఇంకా దొరుకుతుంది. ఈ పుస్తకాన్నే సూచించడానికి కారణం, వేరే పుస్తకాల్లో, భక్తి ఎక్కువగా వుండి, అసలైన విషయానికి భాష్యం తక్కువగా వుంది. కొన్ని చోట్ల అయితే, భగవద్గీత పూర్తిగా చదివితే ఇంత పుణ్యం, సగం చదివితే ఇంత పుణ్యం అనే లెఖ్కలు కూడా చూసాను. అందుకే మీరు ఏ పుస్తకం చదవాలనుకున్నా, చదివేటప్పుడు దేనికోసం చదువుతున్నామో, మనస్సులో వుంచుకొని చదివితే ఎక్కువ లాభ పడగలరు.

You Might Also Like

2 Comments

  1. Mallaiah vadla

    I v.mallaiah i want Sri madbhagavadgeeta written by gopadev to purchase how can l purchase from pustakam.org

  2. ఏల్చూరి మురళీధరరావు

    శ్రీ సుధీర్ గారికి
    నమస్కారములతో,

    తవ్విన కొద్దీ బయటపడే నిధుల విలువైన సమాచారంతో ఆత్మీయమైన ఎంతో చక్కని సమీక్షను వ్రాస్తూ శ్రీ గోపదేవ్ గారి రచనను చదవక తప్పని పరిస్థితిని కల్పించారు. వారి ఆస్తికవాద, సంధ్యావందన భాష్యాదుల అనువాదాలను చదివినప్పుడు తోపని ఆలోచనలెన్నో మీ లఘుప్రస్తావికను చదువుతున్నప్పుడు కలిగాయి.

    అభినందనలతో,
    ఏల్చూరి మురళీధరరావు

Leave a Reply