Buddha – Karen Armstrong
వ్యాసకర్త: అమిధేపురం సుధీర్
*****************
భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో బుద్దుడి గురించి చదవడం కానీ వినడం కానీ చేసే ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆయన ఫోటోలు, పోస్టర్లు ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం బీ బీ సీ లో వచ్చిన ఒక డాక్యుమెంటరీ చూశాను. Buddha – Genius of the Ancient World దాని పేరు. అది చూసిన తర్వాత, ఆయన మీద ఆసక్తి ఇంకా పెరిగింది. అప్పటివరకూ కొంత తెలిసినా, అసలు ఆయన ఏం చెప్పాడు అనేది తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. అలాంటి సమయం లో కొన్న పుస్తకం ఇది. చదివాక కొంత నిరుత్సాహపడ్డాను. ఇది పూర్తిగా బుద్దుడి జీవిత చరిత్ర కాదు. అలా అని ఆయన చెప్పిన ఫిలాసఫీ కూడా కాదు.
బుద్దుడి జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలను వివరిస్తూ, ఆయన చెప్పిన ఫిలాసఫీ, అందుకు దోహదపడ్డ అప్పటి దేశ కాల పరిస్థితులు. ఈ మూడింటిని కలగలిపి సాగే ఒక కామెంటరీ లాగా అనిపించింది.
2500 సంవత్సరాలకు పూర్వం భారతదేశంలో ఉన్న పరిస్థితులు, ఆ కాలంలో సామాజికంగా, మతపరంగా, మేధస్సు పరంగా ఉన్న పరిస్థితులు, ఆనాటి సిద్ధాంతాలు వాటిని ఏవిధంగా బుద్ధుడు అవగాహన చేసుకున్నాడు. మారుతున్న సమాజానికి తను అనుభవించిన పరిస్థితులను మేళవించి ఏ విధంగా తన సిద్ధాంతాన్ని వివరించాడు అన్నది ఈ పుస్తకంలో బాగా వివరించారు.
ఆర్యావర్తం అయిన నాటి భారత దేశంలో సమాజం నాలుగు వర్ణాలుగా విభజింపబడి ఉంది. వర్ణ వ్యవస్థ ఏర్పడిన కొత్తల్లో, ఎవరైనా వారి జ్ణానం లేదా నైపుణ్యం ఆధారంగా ఒక వర్ణం లోనుంచి మరో వర్ణం లోకి మారే అవకాశం వుండేది. అయితే వర్ణ విభజన అనేది జ్ఞానం లేక నైపుణ్యం ఆధారంగా కాక కేవలం పుట్టుక ఆధారంగా జరగటం అనేది బుద్దుడు జన్మించే నాటికే, సమాజంలో స్థిరపడింది.
బుద్దుడు జన్మించే స్నాటికి అప్పటి సమాజంలో జరిగిన/జరుగుతున్న కొన్ని స్థూల మార్పులు… చిన్న చిన్న తెగలు పోయి, చిన్న రాజ్యాలుగా రూపొందటం. తెగల్లో వుండే ఒక సాముహిక తోడ్పాటు కాకుండా, రాజ్యం అనే ఒక రాచరిక వ్యవస్త రావటం. దానివల్ల ‘రాజుకి అపరిమిత బలం రావడం. ఇది వర్తక, వ్యాపారానికి ఎంతో ఉపయోగపడటం. ఎప్పుడైతే వ్యాపారం మొదలయ్యిందో, లాభం కోసం అప్పటివరకూ సమాజం లో వున్న నైతిక విలువలు మెల్లగా దిగజారటం, ఇలాంటివి మొదలయ్యాయి.
బుద్ధుడు జన్మించడానికి కొంతకాలం ముందు అప్పటికే వేద సమాజం పట్ల విసుగు చెందిన కొందరు మేధావులు తమ సొంత ఆలోచనా శక్తితో, వేదములను మించిన జ్ఞానాన్ని సంపాదించాలని రహస్యంగా పనిచేయడం ప్రారంభించారు. వాటినే ఉపనిషత్తులుగా ఈనాడు మనం చూస్తున్నాము. వీళ్లే కాక, ఆనాటికే మరికొందరు మేధావులు చెప్పిన వివిధ సిద్ధాంతాలు అంటే సాంఖ్య వాదం, కణ సిద్దాంతం, నాస్తిక వాదం ఇవన్నీ కూడా అక్కడక్కడా వినిపిస్తూనే వున్నాయి.
కొంతమంది చేతిలోనే జ్ఞానం ఉండటం అది అందరికీ అందకపోవటం అలాగే నగరీకరణ చెందుతున్న సమాజం, దాని వలన వస్తున్న చిక్కులు. ఇలాంటివన్నీ కలిసి, అప్పటి సమాజంలో, ఒక రకమైన ఆధ్యాత్మిక శూన్యతను ఏర్పరిచాయి. ఎంత రాచరికంలో పెరిగినా, అప్పడు వ్యాప్తి లో వున్న వివిధ వాదాల గురించి బుద్దుడి కి తెలిసేవుంటుంది అన్నది ఒక వాదం.
బుద్ధుడు జన్మించే నాటికే సన్యాసులు, భిక్షువులు మోక్షం కోసమో, జ్ణానం కోసమో సంఘాన్ని వదిలి జీవనం సాగించడం ఉంది. ఏ కారణం వలన బుద్దుడు సుఖమయ జీవితాన్ని వదిలాడో తెలీదు కానీ, బుద్దుడు కూడా అప్పటి సన్యాసులు ఎంచుకున్న మార్గాన్నే ఎంచుకున్నాడు. అయితే, మొదట అందరి లాగానే తను కూడా మోక్షం కోసం బయటి శక్తుల పై ఆధారపడ్డాడు. కానీ తర్వాత, తన దారి మార్చుకొని, తనలోకి చూడటం ద్వారానే ముక్తి పొందవచ్చు అని అర్థం చేసుకొని అదే ప్రపంచానికి కూడా చెప్పాడు.
ఈ పుస్తకం చదివేవరకూ, నేను బుద్దుడు నాస్తికవాదాన్ని చెప్పాడు అనుకున్నాను. కానీ కాదు. దేవుళ్ళు వుండొచ్చు అని అంగీకరిస్తూనే, మనకి మోక్షం కావలంటే మాత్రం మనమే కష్టపడాలి అని చెప్పాడు. అలాగే పునర్జన్మలని కూడా నమ్మాడు. బుద్దుని గురించి ఇలా నాకు తెలియని చాలా విషయాలు ఇందులో తెలిసాయి.నిజానికి బుద్దుడు చెప్పిన సూత్రాలు ఈ కాలానికి కూడా అన్వయించుకోగలిగేంత ప్రాక్టికల్ గా వుంటాయి. ఆయన చెప్పిన ‘నాలుగు సత్యాలు’ ‘అష్టాంగ మార్గం’ ఎప్పటికయినా ఆచరణీయమే కాబట్టే బుద్దుడూ, ఆయన బోధనలూ ఈనాటికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి.
బుద్దుని గురించి, ఆయన చెప్పిన ఫిలాసఫీ గురించి ఎంతో కొంత తెలిసి వుంటే, ఈ పుస్తకం కొంచం ఆసక్తికరంగా వుంటుంది. కానీ, మొదటి సారి బుద్దుడి గురించి తెలుసుకోవాలంటే మాత్రం, ఈ పుస్తకం అంతగా ఉపయోగపడదు.
Leave a Reply