మాతృభాషా మాధ్యమమే ఎందుకు? పుస్తక సమీక్ష

వ్యాసకర్త: మద్దిరాల శ్రీనివాసులు,
టీచర్, త్రిపురాంతకం,
సెల్: 9010619066
**********
పుస్తకం పేరు : మాతృభాషా మాధ్యమమే ఎందుకు?
రచయిత: శ్రీ సింగమనేని నారాయణ
పబ్లిషర్స్‌: జనసాహితి ప్రచురణ
పేజీలు:40
వెల: రూ.20లు.

ఆంగ్ల బోధనా మాధ్యమం, తెలుగు బోధనా మాధ్యమాల గురించి వాదించుకుంటున్న వారందరికీ దిక్సూచి ఈ “ఈ మాతృభాషా మాధ్యమమే ఎందుకు?”

తెలుగు, ఇంగ్లీషు మాధ్యమ బోధనా ఉద్యమకారులు ఇరువురూ కాసేపు వారి భేషజాలను పక్కకు పెట్టి, ఈ పుస్తకాన్ని ఆసాంతం చదవవలసినదిగా నా మనవి. చదివిన తరువాత ఏ మాధ్యమ బోధన ఎందుకు అవసరమో? ఏది సమంజసమైనదో నిర్ణయించుకోండి. రెండు రకాల భావాలు కలిగిన వ్యక్తులు ఎం.ఎల్‌.ఏ లైనా, భాషావేత్తలైనా, మంత్రులైనా, ఉపాధ్యాయులైనా, ఏ వృత్తిలో వారైనా, ఏ ఉద్యమకారులైనా అందరూ పిల్లల తల్లిదండ్రులే కాబట్టి, ముందు తప్పని సరిగా ఓ తల్లి, తండ్రిగా మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి, అలాగే ఈ వాదనలు చేసే వారమంతా, తెలుగు వారమే కనుక, మన భాషా భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ చిరు పొత్తం కొని చదువుతారని నా కోరిక. ఆపై మీ నిర్ణయం మీరు తీసుకోండి.

చాలా కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న ఒక చర్చ “ఆంగ్ల మాధ్యమ బోధన మేలా? తెలుగు మాధ్యమ బోధన మేలా?” అని. ఎక్కువ శాతం ఆంగ్ల మాధ్యమ బోధన అయితేనే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్న వాదనను వినిపిస్తుంటారు. వినిపిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో తెలుగు మాధ్యమ బోధన అయితేనే, ఏ భాషనైనా నేర్చుకోగల సత్తా వస్తుందనేది తెలుగు మాతృభాషా ప్రేమికుల వాదన. ఏదైనా ఎవరికి నచ్చింది వారు, ఆ భాష పైన మక్కువతో వినిపిస్తున్న మాటలు.కానీ, పూర్తి స్థాయిలో ఏ మాధ్యమమైతే సరియైనదో చెప్పగల వారు కొందరే ఉంటారు. అలా చెప్పగలిగిన మేధావి వర్గంలోని గొప్ప వ్యక్తి శ్రీ సింగమనేని నారాయణ గారు.

అయితే, ప్రస్తుత తరుణంలో నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగు మాధ్యమ పాఠశాలల స్థానంలో పూర్తిగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను ఏర్పాటు చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ఈ చర్చ తీవ్రతరమైనది. ఇలాంటి ఈ పరిస్థితులలో ఏ భాషామాధ్యమంలో బోధన చేస్తే సబబైనదో తెలుపగల సత్తా ఉన్న పుస్తకం ఇది.

ప్రస్తుతం చాలా మంది తెలుగు ప్రజలు ఘాటుగా మాట్లాడే కొన్ని మాటలు చూస్తే….

1) ఇంగ్లీషు మీడియం చదివితేనే పిల్లవాడికి మంచి భవిష్యత్తు , ఉన్నత ఉద్యోగం లభ్యమవుతుంది.
2) తెలుగు మీడియం చదవడమంత శుద్ధ దండగ ఇంకోటి లేదు.
3) పిల్లలు చిన్నప్పటి నుండీ ఇంగ్లీషు మీడియంలో చదవకపోతే సరియైన టెర్మినాలజీ, వొక్యాబులరీ రాదు. అపుడు ఎందుకూ పనికిరాడు.
4) ప్రాథమిక స్థాయిలో తెలుగు మీడియం చదివిన వాడు పెదై ్దతే ఏ భాషనైనా నేర్వగలడు.
5) పేదవారి పిల్లలకు ఉన్నత పదవులు, ఉద్యోగాలు రావడం ఇష్టం లేనివారే ఆంగ్లమాధ్యమం వద్దని వాదిస్తారు.
6) ఇంగ్లీషు భాష పుస్తకాలలోనే విజ్ఞానం ఎక్కువగా దొరుకుతుంది.
ఇలాంటివి… వినిపిస్తున్నాయి.

ఇలాంటి ప్రశ్నలన్ని ఎంత తప్పో ఈ పుస్తకంలో సమాధానాలు ఇచ్చారు రచయిత. అంతేకాదు, ఇలాంటి వారందరికీ రచయిత వేసిన ప్రశ్నల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. 1) ఆంగ్ల మాధ్యమ బోధన అవసరమని భావించి వచ్చే మీటింగులకు వచ్చే ఎంత పెద్ద ఉద్యోగులైనా, అధికారులైనా వారంతా పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారేనా? 2) ఇంగ్లీషు మీడియంలో బోధిస్తున్నాం అని చెప్పుకుంటున్న ప్రయివేటు పాఠశాలలు తరగతి గదులలో మాతృభాష ఉపయోగించకుండా బోధించగలరా? 3) చదువంటే ఇంగ్లీషేనని, చదువంటే ర్యాంకులేనని, చదువంటే డాక్టర్లు, ఇంజనీర్లు, ఏంసిఏలే అని అమాయకంగా నమ్మి బలైపోతున్న వాళ్ళు 90శాతం పైగా ఉన్నారని ఎంతమందికి తెలుసు? 4) ఇంగ్లీషు మీడియం పై గ్రామీణ ప్రాంత ప్రజలు ఎందుకంత మోజు చూపుతున్నారు? వాస్తవాలు ఏమిటి?5) ఇంగ్లీషు మీడియంలో చదివిన వారు ఎంతశాతం పెద్ద ఉద్యోగాలు పొందుతున్నారు? 6) ఇంగ్లీషు మీడియంలో చదివి పెద్ద ఉద్యోగాలు, పాలక వర్గాలలో ఉన్న వారు తెలుగు ప్రజలతో ఏమాత్రం వ్యవహరించగలుగుతారు? 7) భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎందుకు ఏర్పడ్డాయి? అని.

ఇంగ్లీషు భాషను వద్దని అనడంలేదు రచయిత. ఏభాషనైనా ద్వేషించడం అనర్ధదాయకమే అంటారు. ఆంగ్లభాషను ద్వేషించకండి అన్నారు. కానీ, వాస్తవాలు గ్రహించాలన్నారు. ఆ వాస్తవాలు ఏమిటో? గ్రహించకపోతే, మున్ముందు తెలుగు అనే మాట వినిపించకుండా పోయే ప్రమాదముంది అన్నారు. ఆ ప్రమాదాలేమిటో ప్రతి తెలుగువారూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన మాతృభాష ఉనికిని కాపాడుకునేందుకు ఈ పుస్తకం తప్పకుండా చదివితీరాలి.

మాతృభాష మన తెలుగు గురించి, మన భాషకున్న విలువ గురించి, దానిపై తెలుగు వారికి ఉండాల్సిన స్పృహ గురించి చక్కగా వివరించారు ఇందులో నారాయణ గారు. తెలుగు వారి బాధ్యతలను గూర్చి, మన తెలుగుకు ఆంగ్లమాధ్యమం వలన రాబోయే కాలంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి పుష్కర కాలం నాడేే హెచ్చరించారు సింగమనేని గారు. ఈ ఆంగ్ల మాధ్యమ బోధనా విధానం వెనుక దాగి ఉన్న రాజకీయపు కుట్రలున్నాయన్న వీరు అవేమిటో తెలుసుకోవడానికైనా చదవాలి. మన భాషను మనం కాపాడుకోవాలి.

తెలుగు భాషా పరిస్థితి ఇప్పటికే ఎలా ఉందో? ఎలా నలిగి పోతున్నదో? ఈ పుస్తకం చివర ప్రముఖ జాతీయ చిత్రకారుడు, మా మిత్రుడు శ్రీ వెంటపల్లి సత్యనారాయణ గారు వేసిన కార్టూన్‌ చూస్తే తెలుగు ఎంతగా నలిగిపోతున్నదో? తెలుస్తుంది. ఈ చిత్రం చూసిన ఏ తెలుగు వారూ ప్రాథమిక స్థాయిలో ఆంగ్లభాషా మాధ్యమం కావాలని కోరుకోరు. 2015 ఆగష్టు 29న మొదటి ముద్రణకు నోచుకున్న ఈ పుస్తకం ఇప్పటికి మూడవ సారి ఇటీవలే 2019 నవంబరు 30న గురజాడ 104వ వర్ధంతి నాడు ముద్రితమయింది.

ఎంతో విలువైన సమాచారం ఉన్న ఈ పుస్తక ప్రతులకు మైత్రీ బుక్‌ హౌస్‌, జలీల్‌ వీధి, కార్ల్‌మార్క్‌ రోడ్డు, విజయవాడ-520002 అనే చిరునామాలో గానీ, 9177979622 అనే సెల్‌ఫోన్‌ నెంబరు నందు గానీ సంప్రదించవచ్చు.

ప్రస్తుత పరిస్థితుల గురించి ఈ రచయితతో డిబేట్‌లు కూడా నిర్వహించవచ్చు. వీరి ఫోన్‌ నెంబరు కూడా ఈ పుస్తకంలో ఇవ్వబడింది. పూర్తి వివరాలకు డా|| బి.అరుణ, ప్రధాన కార్యదర్శి , జనసాహితీ , 30-7-8, అనపర్తి వారి వీధి, అన్నదాన సమాజం రోడ్‌, దుర్గాగ్రహారం, విజయవాడ-520002. సెల్‌:7075957010.

”ప్రపంచంలోని ఏ భాషయైనా పరబాషా సంపర్కం కలిగి ఉండాల్సిందే. మాతృభాషలో మాట్లాడగలిగేంత సౌలభ్యం పరాయి భాష ఎంత నేర్చుకున్నా, అందులో ఉండదు”

You Might Also Like

One Comment

  1. VENTAPALLI SATYANARAYANA

    సమకాలీణంగా చర్చ నీయాంశమైన మాతృభాష విషయమై చక్కటి సామాచారంతో గ్రంథ రచన చేసిన రచయిత సింగమనేని గారికి ఆ గ్రంధం ఫై ఎంతో చక్కటి విశ్లేషణ చేసిన మద్దిరాల గారికి అభినందనలు .నాకుతెలియకుండా భాష దుస్థితి పై నేను ఎప్పుడో వేసిన నా కార్టూన్ ని బుక్ కి బ్యాక్ కవర్ గ వాడి ప్రాచుర్యం కల్పించిన రచయితకు మరొక్కసారి అభినందనలు
    SN VENTAPALLI (వెంటపల్లి సత్యనారాయణ )

Leave a Reply