సీనే మే జలన్

వ్యాసకర్త: మహమ్మద్ ఖదీర్‌బాబు
*****************
పెద్ద సుఖంగా ఏమీ ఉండదు.

రంజాన్ ఖుబ్దానాడు సజ్దాలో మోకరిల్లిన సమూహం మధ్య కుతూహలం నిండిన ఒక పసివాడు లేచి నిలబడి చుట్టూ చూస్తే గతకాలపు కళకళ అంతగా కనిపించదు. మెరిసే బట్టల పెరపెర, నవ్వే కళ్ల మిలమిల కానరావు. నమాజు అయ్యాక ఒకరి కంఠాన్ని ఒకరు కావలించుకుంటున్నప్పుడు ‘అమ్మయ్యా నువ్వైనా ఉన్నావ్’ అని ఒకడనుకుంటే ‘నువ్వు మాత్రమే ఉన్నావ్’ అని మరొకడనుకుంటాడు.

మొహర్రమ్ వస్తే పిలిచి, పుస్తకం అడిగి, చందా రాసి, వందనోటును పొందిగ్గా మడిచి డబ్బాలో వేసే చొక్కాలేని, జంధ్యపు బొజ్జగల శెట్టిగారు అవుపించి బహుకాలం అయ్యింది. గుండం తొక్కేనాడు చుట్టూ మూగే జనాలలో చాకళ్లు, మంగళ్లు, జంగమోళ్లు, గొర్రెలు మేపేవాళ్లు, బండ్లు కట్టి పొలాలకు వెళ్లేవాళ్లు మూగి, మన పండగే అన్నట్టు ఆగి, పెద్ద పీరును పట్టుకుని చిన్నపాటి పూనకంతో ఆమ్మని ఎర్ర నిప్పుల అలావాలోకి నడిచి వెళ్లే టైలర్ అబ్బాస్‌ను ఆ చివరకు రాగానే ఇంటి మనిషే అన్నట్టు జవురుకునే ఆ దగ్గరితనాలు పలుచనబడిన ఆనవాలు చూడొద్దనుకున్నా కంట పడుతూనే ఉంటుంది. పీర్ల ఊరేగింపులో పులివేషం కట్టే సాయెబుల కుర్రాళ్లు, మాల పిలకాయలు అలాగే కలిసి కదను తొక్కడం చూశారా మీరైనా? ఆ సమయంలో మోగే మాదిగ తప్పెట్ల జాడ ఎక్కడ?

కొండ మీద స్వామి తిరునాళ్లకు లైట్లు వేయాల్సింది కరీమ్ భాయే అని అనుకుంటున్నట్టు లేదు. ‘టోపీ లేదు… చేతిగుడ్డ చాలా… పాతేహాకు ఖర్జురం తీసుకోవాలా’ అని దర్గా ముంగిట్లో నిలబడి అడిగే కన్నయ్య, వేణు, తిరుపాలు అంతే ప్రియంగా ఫోన్లు ఎత్తుతున్నారా లేదా అని సందేహం. ఊదుకడ్డీలు అమ్మే అమీర్‌జాన్, లాటరీ టికెట్లను అరచి ఇచ్చే పెద్ద పంతులు కలిసి, ఒకరి కష్టాలు మరొకరు పంచుకుంటూ, చెక్కబల్లను నునుపు చేసేలా తీరిగ్గా టీ తాగి చాలాకాలం అయ్యిందనేది రూఢీ అయిన సంగతి. ఇరుగుపొరుగు అమ్మలక్కలు బూబమ్మలను పేరు పెట్టి పిలిచి ఆ పేర్లు నోరు తిరక్క హాయిగా నవ్వే తంతు దాదాపుగా లేనట్టే.

లోపలగా ఉన్నవాళ్లు వేరు చేయబడుతున్నారు.
వేరు చేయబడినవారు వెలివేయబడుతున్నారు.

దేశ విభజన అనే దారుణకాండ తర్వాత ముస్లింలు పడవలసిన మాటలు పడగా, పొందవలసిన నష్టం శాశ్వతంగా పొందగా ఎరుకతో, ప్రయత్నంతో సాగిన ఈ స్నేహం రెండు మూడు దశాబ్దాలుగా బాహాటపు కలుషితానికి లోను కావడంతో ఏర్పడిన దాఖలాలే ఎక్కడ చూసినా. రెండు దూలాలు ఉన్న ఈ దేశపు ఇంటిలో ఒక దూలానికి ఏమైనా పర్వాలేదనుకుంటున్నారు మంచిది. అంటుకున్న చెద కలపను మింగి గోడల వరకు రాకుండా ఉంటుందా? పునాదులకు చేరకుండా ఉంటుందా?

పెద్ద సుఖంగా లేదు.
మర్యాదలను కట్టిపెట్టి ఇప్పుడు కడుతున్న ఫ్రేము అంత ప్రియంగా లేదు.

క్రికెట్‌లో ఒకరిద్దరు లేకుంటే ఎలా అనుకునేవారు గతంలో. ఎన్నికలలో ఒకటి రెండు సీట్లు ఇవ్వకపోతే ఎలా అనుకునేవారు వెనుకటికి. ఇంటర్వ్యూ బోర్డులో మతచెత్తను చెత్తబుట్టలో ఉంచినంత కాలం అదిగో ఆ నూగుమీసాల పాతబస్తీ కుర్రానికి ఉద్యోగం వచ్చేది. కలెక్టర్లు కాకపోయినా ఆర్‌డివోలు కనిపించేవారు. డీన్‌లు కాకపోయినా లెక్చరర్లు కనిపించేవారు. ఒక్క ముస్లిం టీచరు లేని హైస్కూల్‌లో బెల్ కొట్టే అటెండర్ పోస్టయినా ముస్లింకు దక్కేది. భూమి ఉంటే ఎకరానికి ఎనిమిది వేలు వస్తుంది. భూమి లేదు. సైకిల్ రిపేర్ షాపుకు ఎనిమిది రూపాయలు కూడా ఇవ్వరు. వేల కోట్ల రుణమాఫీలన్నీ రూపంలో రైతులవి. సారంలో ముస్లిమేతరులవి. అందులో చిల్లిగవ్వ ముస్లింలకు దక్కదు. ముస్లింలకు ఉన్నవి ‘మదీనా చికెన్ సెంటర్’లు. పౌల్ట్రీలన్నీ ముస్లిమేతరులవి. తక్కెడ అటూ ఇటూ ఊగితే పర్వాలేదు. కాని ఒక పళ్లెం గాలికి గిరికీలు కొడుతోంది. ఒకటి బరువుతో జబర్దస్తీగా ఉంది.

పెద్ద సుఖం లేదు- ఇన్ని పడుతూ ఇన్ని సహిస్తూ తిరిగి మాటలు పడటంలో. నిందను మోయడంలో. బలవంతపు బాధ్యత వహించడంలో. అనవసరంగా కవ్వింపబడటంలో. ఏం చేయాలో తోచక కుమిలి ఏడ్వడంలో. ఎదురు తిరగడానికి వీల్లేనంత భీతావహంగా బతకడంలో.

నేనేం తింటున్నాను, నా మదరసా ఎలా ఉంది, ఎవర్ని ప్రేమిస్తున్నాను, పెళ్లయ్యాక ఎలా విడిపోతున్నాను, ఎందరిని కంటున్నాను… ఇవి కావాలి ఇప్పుడు. చదువులో, ఉద్యోగాల్లో, పురోగామి రంగాల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి మతం అడ్డు వస్తుంది. చట్టాలు చేయడానికి రాదు. ఈ చట్టాలు వల్లవేసే అడ్వకేట్ల కమ్యూనిటీలో ముస్లింల సంఖ్య ఎంత? హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో ముస్లింల ప్రాతినిధ్యం ఎంత? ప్రధాన భుక్తిదాైరైన పోలీసు, సైన్యం రిక్రూట్‌మెంట్లలో ముస్లింలకు ఎంత వాటా వదిలారు? ఆఖరకు పేదలకు రేషన్ ఇచ్చే షాపులలో అతిపేదలైన ముస్లింలకు ఎన్ని దక్కాయి?

బాహ్యమైన హక్కులపై నోరెత్తకుండా ఉండేందుకు అంతర్గత విషయాలపై వొత్తిడి, ప్రమేయం, నిర్దేశం, తీర్పు. ప్రజాస్వామిక దేశంలో అత్యంత అప్రజాస్వామికమైన పాలన ఒక వర్గం అనుభవిస్తున్నప్పుడు నిరసన సంగతి దేవుడెరుగు కనీసం నోరెత్తే పరిస్థితి లేదనేది చేతగానితనంతో అంగీకరించాల్సిన వాస్తవం. అల్పసంఖ్యాకులపై ప్రతాపం చూపడం, ఇది వరకే ఓడినవారిపై కొత్తగా విజయం సాధించాననుకోవడం నేటి హీనమైన వినోదం. అమానుష క్రీడ.

ఇటువంటి సమయంలో మనిషి పెద్దగా అరవడం ఉండదు. లోలోపల పెనుగులాడటమే ఉంటుంది. తనను తాను మెలిపెట్టుకోవడమే ఉంటుంది. తన నొప్పికి తానే అల్లాడటం ఉంటుంది. తన నిస్సహాయతకు తానే అపరాధభావంతో కుమిలిపోవడం ఉంటుంది. కడుపున పుట్టిన పిల్లలు కల్లాకపటం ఎరగని వయసులోనే వివక్ష ఎదుర్కొనడం చూసి విలవిలలాడటం ఉంటుంది. అల్ప సంఖ్యాకుల ఇంటి ఆడది మరింత పీడితురాలు. ఆ స్త్రీ రోదిస్తూ తల మొత్తుకుంటుంటే భరించలేక పారిపోవాల్సి ఉంటుంది.

ఇదంతా ఈ కథల్లో ఉంది. అఫ్సర్ కథల్లో ఉంది.

ఈ కథలన్నింటా ఒక కథకుడున్నాడు. అతడికి ఇంటర్ కాలపు ఒక జీవితం ఉంది. కాలేజీ రోజుల జ్ఞాపకం ఉంది. పుట్టి పెరిగిన ఊరితో అనుబంధం ఉంది. వలస రావడం ఉంది. పట్నపు బతుకులోని బేజారు ఉంది. ఆ తర్వాత మారిన పరిస్థితులను చూసి గందరగోళ పడటం ఉంది. తన సమూహం కంటే పెద్ద సమూహం మతం ఆధారంగా వత్తిడి పెడుతున్నప్పుడు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కావడమూ ఉంది.

అలాంటి ఘడియన్నింటినీ ఆ కథకుడు కథలు చేశాడు. అందుకు అఫ్సర్ ఒక వాహిక.

ఈ కథలలో కథకునికి కలవరపరిచిన ఒక ముఖ్యమైన అంశం- బాలల మనుసుల్లో విషబీజాలు నాటడం. అందమైన బొమ్మలతో ఆడుకోవాల్సిన పిల్లలకు మతం ఒక దెయ్యపుబొమ్మలా మారి వారిని జ్వరపీడితులను చేయడం ఈ కథకుడు మూడుసార్లు కథనం చేశాడు. ‘సాహిల్ వస్తాడు’, ‘చమ్కీ పూల గుర్రం’, ‘తెలంగీ పత్తా’… ఈ కథల్లో పిల్లలు ఈ ఆకుపచ్చ, కాషాయ రంగులు పడక దద్దుర్ల రియాక్షన్‌తో వేదన పడటం చూస్తాం.

ఈ కథలలో కథకుడు పలాయనవాదులను చూసి కలత పడతాడు. తనలోని పలాయనవాదిని చూసి సిగ్గు పడతాడు. సంసార వ్యాపారాలని మోయలేని ముస్లింలు మురీదులు, ముర్షద్‌లుగా, అల్లావలీలుగా మారి గదులకు పరిమితమై వచ్చేపోయేవారిని ఆశీర్వదిస్తూ కూచుంటే ఆ కుటుంబం ఏమవుతుందో ఆ ఇంటి స్త్రీలు ఏమవుతారో ‘ముస్తఫా మరణం’లో చూపించి పాఠకుల వైపు చూస్తాడు. అలాగే తన సమూహం కోసం తెగించి, ఏవో కొన్ని పనులు చేసి, అర్ధాంతరంగా చనిపోయిన మిత్రుడిని చూసి అతడిలా చేయవలసిన బాధ్యతను తప్పించుకున్నందుకు సిగ్గుపడి, పిచ్చివాడు కావడంలోని నిజాయితీని చూపించి ‘ఒక తలుపు వెనుక’ కథతో బతికి బట్ట కడతాడు. 1992 బాబ్రీ మసీదు విధ్వంసం కేవలం కట్టడపు విధ్వంసం కాదు. ఒక సమూహపు మానసిక విధ్వంసం. ఆత్మవిశ్వాసపు విధ్వంసం. ఆ పనికి ఏదో మేరకైనా ప్రతిస్పందన చూపలేని సగటు ముస్లింల నిస్సహాయతను ‘ముస్తఫా మరణం’ చాలా సూక్ష్మంగా పట్టుకుని నమోదు చేయగలింది.

అరబ్బీ, ఉర్దూ చదువులు చదువుకున్న ఒక ముస్లిం కన్నా చెప్పులు కుట్టి బతుకుతున్న ఒక దళితుడు మెరుగైన జీవనం గడుపుతున్నాడని ఈ కథకుడు ‘ధేడి’ కథలో చెబితే కాదనడానికి మన దగ్గరున్న ఏ సర్వేలూ సాయం రావు. వక్ఫ్ బోర్డు స్థలాలతో సహా ముస్లింల ప్రయివేటు ల్యాండును కూడా రోజు రోజుకు ఏదో ఒక వంకతో, బలవంతంగా లాక్కుపోతున్నారని, ముస్లింలను నేల లేని వారిని చేస్తున్నారని ‘గోరీమా’ కథతో చెప్తే ఔననడానికి న్యూస్‌పేపర్‌లలో వార్తలు చాలు.

గడ్డాలు పెంచి జుబ్బాలు వేసే మతస్థాయి వద్దని, తురకవాడల్లో ఉండరాదని, సెక్యులర్ ముస్లింగా బతకడానికి ప్రయత్నిస్తున్న ముస్లింలు క్రైసిస్ ఎదురైనప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా మారక తప్పని పరిస్థితిని ఎదుర్కుంటున్నారని ‘తెలంగీ పత్తా’లో కథకుడు చెబుతాడు. మెజారిటీలతో రాసుకుపూసుకు తిరిగిన ముస్లింలే మతకలహాల్లో ఘోరకలుల్లో ఎక్కువగా చంపబడ్డారని ముస్లింలకు తెలిస్తే వారి ఎదుట మిగిలే దారి ఏమిటో? ఈ దేశం కాదని అమెరికా వంటి దేశాలకు వలస పోయినా అక్కడ వారికి ఎలాంటి మానసిక అవస్థ ఎదురవుతున్నదో ‘ఛోటీ దునియా’లో చదవాలి.

ఈ కథకుడు చెప్పిన ‘సహేలీ’ కథ లైంగిక ప్రాధాన్య ఎంపికలో ఏ మతంలోనైనా స్త్రీలు తమ పద్ధతులను తాము ఎంచుకుంటారని ఇందుకు ఇస్లాం కూడా మినహాయింపు కాదని సంకేతం ఇస్తాడు. ఈ కథలో ఇద్దరు స్త్రీల మనసు, దేహాల ముడి ఉంది. కథ అంత వరకే చెప్పింది. కాని ఈ స్త్రీలు ఒకరు హిందు, ఒకరు ముస్లిం అని తెలిస్తే ఈ సమాజపు ప్రతిస్పందన ఏమిటో చూడాల్సి ఉంది. బీజం పరాయి మతానిదైనప్పుడు వచ్చే అభ్యంతరం తెలుసు. పంచుకునే దేహం పరాయి మతానిదైనప్పుడు ఎటువంటి అభ్యంతరం చెబుతారు?

అఫ్సర్ కవిగా చేసిన సాధన విస్తృతమైనది. కాని కథారచనలో ఆ కవి అడ్డుపడకుండా, కథను నిర్మించడంలో కథకుణ్ణే ముందు నిలబెట్టి సఫలం కాగలిగాడు. నేపథ్యాలు చెప్పడంలో, కథ తాలూకు మూడ్‌ను సెట్ చేయడంలో, కథ ద్వారా పాఠకుణ్ణి గాఢంగా అలుముకోవడంలో అతని గెలుపు ఉంది.

తెలుగు ముస్లిం కథ అనేక పార్శ్వాలు పట్టి చూపుతున్న వర్తమాన సందర్భంలో అఫ్సర్ కథల చేర్పు ఆ బల్లకు మరో గట్టి కాలు ఏర్పాటు చేసినట్టయ్యింది. తెలంగాణ ప్రాంతపు అర్బన్, ఎడ్యుకేటెడ్, సెక్యులర్ ముస్లిం సైక్‌ను, సంఘర్షణను అఫ్సర్ ఈ కథలలో చాలా వివరంగా నమోదు చేసి ఆ ఖాళీని నింప గలిగాడు. ఇంకా చెప్పాలంటే ఆ ఏరియాను స్కోర్ చేశాడు. కథకుడి ఉనికి అతడి కథలను పరికించినప్పుడు వాటిని ఇతడు మాత్రమే రాయగలడు అని గ్రహించడంలో ఉంటుంది. వీటిలోని కొన్ని కథలు అఫ్సర్ మాత్రమే రాయగలడు. కనుక కథకునిగా అతని ఉనికి ప్రమేయపూర్వకమైనది, ప్రభావపూర్వకమైనది.

అఫ్సర్ కవిత్వాన్ని సాధన చేసినంత విస్తృతంగా కథను కూడా సాధన చేసి ఉండాలి. అప్పుడు ఈ కథలన్నీ ఇంకా సులువుగా నెరేట్ అయిఉండేవి. కథలను ‘ఫస్ట్ పర్సన్’లో ఎక్కువగా చెప్పడాన్ని ఇతనిలో మనం గమనిస్తాం. కొన్ని కథల్లోని రానెస్‌ని నగిషీలతో చెరిపి ఉండవచ్చు. కాని… రుద్ధ కంఠాలు సరైన శ్రుతిలో పలకాల్సిన పని లేదని పాఠకునికి అనిపిస్తుంది.

కథకునిగా అఫ్సర్ తర్వాతి దశ ఇప్పటికిప్పుడు ఊహించడం కష్టం. కాని రాసే చేతిని రాయించే పరిణామాలు నిత్యం చోటు చేసుకుంటున్న ఈ దేశం అతణ్ణి ఊరకే ఉండనిస్తుందా అని సందేహంగా ఉంది. కలాన్ని బొడ్డులో దోపుకుని తెగింపుతో కలబడే పరిస్థితులు మున్ముందు ముస్లిం రచయితలకు వస్తాయి.

దాదాపు పాతికేళ్లుగా పరిచయం ఉన్న ఈ మిత్రుడు, అఫ్సర్, ఇప్పటికి ఇలా కథలతో ముందుకు వస్తున్నందుకు సంతోషిస్తున్నాను. కథకుడు మానవ సమూహపు వేదనను చెప్పి తీరాల్సిందే అని అనుకుంటే అత్యంత వేదనలో ఉన్న సమూహపు కథలతో అతడు ముందుకు వస్తున్నందుకు ఇంకా ఎక్కువ సంతోషపడుతున్నాను.

ఆస్తిపాస్తులకు నోచని కథకులకు సాటి కథకుల పుస్తకాలు కూడే ఆస్తే. అఫ్సర్‌కు ఇటువంటి ఆస్తి మరింత పోగుపడాలని సాటి కథకులు కూడా ఆ ఆస్తికి పొంగిపోవాలని అభిలషిస్తున్నాను.

ఈ కథలను చదవండి.

సుఖంగా అనిపించవు. ఊపిరిలో జ్వలనాన్ని ఛాతీలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలా అనిపిస్తే గనక మీలో మనిషి ఇంకా మిగిలి ఉన్నట్టు. మీ చర్మం ఆకుపచ్చ, కాషాయ వర్ణాలను దాటి ఒక మానవ వర్ణాన్ని కోరుకుంటున్నట్టు.

ఆ మానవ వర్ణ పరివ్యాప్తికి ప్రయత్నించినందుకు అఫ్సర్ కంఠానికి గంధం పూస్తున్నాను. సలాములు అర్పిస్తున్నాను.

– మహమ్మద్ ఖదీర్‌బాబు
విజయవాడ పుస్తక ప్రదర్శనలో తొలి ముస్లిం తెలుగు కథకుడు ‘షేక్ హుసేన్ సత్యాగ్ని’కి జరిగిన సత్కారంలో
పాల్గొని వచ్చిన మరుసటి రోజున.
డిసెంబర్ 7, 2018.

You Might Also Like

One Comment

  1. Dr. Farooq

    ఎక్సలెంట్ ఎస్సే. చాల బాగా వ్రాసారు. సమాజాన్ని కాసి వడపోసి, స్వానుభవాన్ని మేళవించి, భావోద్వేగంతో వ్రాసిన వ్యాసమిది. కథలను, రచయితని పొగుడ్తూనే తనదైన ముద్రతో వెలిగిపోయారు ఖదీర్ బాబు గారు.

Leave a Reply