ఆగిన చోట మొదలెడదాం!

వ్యాసకర్త: ఎ.కె. ప్రభాకర్
(కె.పి. అశోక్ కుమార్ ‘కథావిష్కారం’ పుస్తకానికి రాసిన ముందుమాట)
***************************

విమర్శ మీద విమర్శ యెంత కష్టమైన పని !  

న సాహిత్య విమర్శ యాంత్రికమైపోయింది. మూస చట్రాల్లో బిగుసుకుపోయింది. పడికట్టు పదాలకింద నలిగిపోతుంది. పాడిందే పాడుతున్నాం. నలిగిన దారుల్లోనే నడుస్తున్నాం. లేదా దారి తప్పి తెలీని దారుల్లో తిరుగుతున్నాం. మార్పు అంటే భయపడుతున్నాం.  సమాచారమే జ్ఞానమనే భ్రమలో కూరుకుపోయాం. సాహిత్యాన్ని సామాజిక శాస్త్రాల వెలుగులో అధ్యయనం చేయడంలో యింకా వెనకబడే వున్నాం. కొత్త విమర్శ పరికరాలను రూపొందించుకోడానికి గానీ వున్న వాటిని మెరుగు పరచుకోడానికి గానీ చొరవ చూపించలేకపోతున్నాం. ఈ కారణాల వల్ల తెలుగులో సాహిత్య విమర్శ బలహీనంగా వుందనో అసలు లేనే లేదనో నిరాశకు లోనయ్యాం. చివరకి విమర్శ వొక దేవతా వస్త్రమైంది. అజ్ఞేయ పదార్థమైపోయింది.

పరామర్శలు పాఠ్యానికి పరిమితమై పోతున్నాయి. స్థలాభావం పేరున పత్రికల్లో సమీక్షలు కేవలం పరిచయ వాక్యాలుగానో గ్రంథ స్వీకారాలుగానో  కుదించుకుపోతున్నాయి. మౌలికమైన పరిశోధనల్ని ప్రోత్సహించే పత్రికలైతే కలికానిక్కూడా కానరావు. విశ్వవిద్యాలయాల్లో రొడ్డ కొట్టుడు మెథడాలజీ నూత్న ద్వారాల్ని తెరవడానికి వుపయోగపడటం లేదు. ఆధిపత్య పీఠాలకు ప్రత్యామ్నాయ స్వరాలు గిట్టవు. వీటిని అధిగమించే ప్రయత్నాలు అరా కోరా మాత్రమే.   చిన్న చిన్న సాహిత్య పత్రికల్లోనో వెబ్ పత్రికల్లోనో విమర్శకులకు కాస్త చోటు, స్వేచ్చ లభిస్తోంది. ఇప్పుడిప్పుడే సామాజిక మాధ్యమాల్లో కొత్త గొంతులు వినిపిస్తున్నాయి. ఆలోచనలు వ్యాపిస్తున్నాయి. అయినప్పటికీ ఛేదించాల్సిన సంకెళ్ళు తెగలేదు.   యెంతసేపూ రాసినదాని గురించి మాత్రమే వ్యాఖ్యానించుకుంటున్నాం. నిజానికి మనం యిప్పుడు రాయనిదాన్ని గురించి యెక్కువ మాట్లాడుకోవాలి. రాయాల్సిన అంశాల గురించి, పద్ధతుల గురించి చర్చించుకోవాలి. కొత్త కోణాలని వెలికి తీయడమే కాదు; కొత్త దృక్పథాలకూ భావధారలకూ తెర యెత్తాలి. విమర్శ భిన్న సమూహాలకు వేదిక కావాలి. తరాలుగా వెలిగా వున్న స్వరాలకు పాదు కావాలి. సమాజంలో చోటుచేసుకునే దృశ్యాదృశ్య చలనాల్ని పట్టుకోవాలి. వెలి చూపుతో పాటు లోచూపు కావాలి.

కథ చెప్పు; కథ మాత్రమే చెప్పుఅన్న సూక్తిని కథకులు పాటించినా పాటించక పోయినా విమర్శకులు సమీక్షకులూ మాత్రం తు చ తప్పకుండా పాటిస్తున్నారు. కథని తిరిగి చెప్పి దాన్నే విమర్శగా బుకాయిస్తారు. కవిత్వ విమర్శ మరీ హీనం. పంక్తులకు పంక్తులు యెత్తి రాయడం అద్భుతం అపూర్వం అమోఘం ఆర్ద్రం అనుభూతం అనడం. కొద్దిగా భిన్నంగా గంభీరంగా  కనపడాలనుకొనేవారు విమర్శనాత్మక విశ్లేషణ అనో విశ్లేషణాత్మక విమర్శ అనో అరిగిపోయిన పరిభాషని ఆశ్రయిస్తారు. కొంతమంది ఒకట్రెండు ఇంగ్లీషు పుస్తకాలు చదివి వాటిలోని సూత్రీకరణలను గుడ్డిగా మన సాహిత్యానికి అన్వయించడానికి ప్రయత్నిస్తారు. ఇంకొందరు యెత్తిపోతల పథకం అవలంబిస్తారు. సజ్జలు తిని సజ్జలు విసర్జిస్తారు. సాహిత్యంలో సాహిత్య విమర్శలో  మౌలిక భావనలకు ఆస్కారం లేకుండా పోయింది.

చాలా సందర్భాల్లో  సాహిత్యంలో సాహిత్య చరిత్రలో విమర్శలో ఖాళీలు వున్నాయని మొత్తుకుంటాం గానీ వాటిని పూరించడానికి యెటువంటి ప్రయత్నమూ చెయ్యం. అరా కొరా ప్రయత్నాలు జరిగినా వాటికి కొనసాగింపు వుండదు. సాహిత్యం జీవితాన్ని మెరుగు పరచేదిగానూ, విమర్శ సాహిత్యాన్ని వున్నతీకరించేదిగానూ వుండాలన్న భావన సైతం  కేవలం శుష్క నినాదమైపోయింది. అందువల్ల తెలుగులో సాహిత్య విమర్శ ఆగిన చోట మొదలుకావాల్సి వుంది. సమాజంలో వేగంగా చోటుచేసుకొనే మార్పుల్ని కొత్త పరిస్థితుల్ని అర్థం చేసుకోడానికి అనుగుణంగా సాహిత్య సిద్ధాంతాల్ని నిర్మించుకోవాలి. అందుకు అవసరమైన ప్రాపంచిక దృక్పథాన్ని యేర్పరచుకోవాలి. కొత్త విమర్శనా పరికరాల్నీ సమకూర్చుకోవాలి. సరికొత్త మెథడాలజీని రూపొందించుకోవాలి.

***

కె.పి. అశోక్ కుమార్కథావిష్కారం చదువుతోన్నంతసేపూ చదివింతర్వాత తెలుగులో సాహిత్య విమర్శ స్థితి – గతులకి సంబంధించిన యెన్నో ఆలోచనలు యిలా నన్ను తొలుస్తూనే వున్నాయి.   కారణం : ఆ యా సందర్భాల్లో విమర్శకుడిగా కథకుల ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాల గురించి , నిబద్ధత నిజాయితీల గురించి , కళా నైపుణ్యాల గురించి,  నిర్దిష్ట స్థల కాలాల్లో వారి రచనలు సాధించిన / సాధించని  ప్రయోజనాల గురించి అతను చేసిన వ్యాఖ్యలే. ఈ వ్యాస సంపుటిలో అశోక్ చేసిన యెన్నో సూత్రీకరణలు ప్రతిపాదనలు ఖండన మండనలు ఆలోచనలకు పురిగొల్పేవిగా వుండటమే.

సాహిత్య విమర్శ అశోక్ కుమార్ కి ప్రధాన వ్యాసంగం. అది అతనికి ప్రవృత్తిగా మొదలై వృత్తిగా పరిణమించింది. మిగతా ప్రాథమ్యాలన్నీ దాని తర్వాతే. అతని సమీక్షో వ్యాసమో అచ్చేయని పత్రిక తెలుగులో లేదేమో! గత ముప్పై యేళ్ళగా సాహిత్యం సినిమా చరిత్ర మొ. సామాజిక శాస్త్ర గ్రంథాల మీద వేలాది సమీక్షలు రాసిన అశోక్ కథా విమర్శ వ్యాసాలతోకథావలోకనంవెలువడి  అప్పుడే అయిదేళ్ళు దాటిపోయింది. అది విమర్శకుల మన్ననలు పొందింది. కథకులకు కరదీపికగా తోడ్పడింది. పరిశోధక విద్యార్థులకైతే ఆకర గ్రంథంగా వుపయోగపడుతోంది. ఇప్పుడు వస్తున్న యీకథావిష్కారందానికి కొనసాగింపే.

దాదాపు పదేళ్లుగా అశోక్ కుమార్ రాసిన వందలాది సమీక్షల నుంచి, ముందుమాటల నుంచి, పరిశోధనాత్మక వ్యాసాల నుంచి యెంపిక చేసిన 20కి పైగా రచనలతో వస్తోన్న ‘కథావిష్కారంకథా విమర్శకుడిగా అతని కృషికి నిలువెత్తు సాక్ష్యం.  కథ పట్ల అతని ప్రేమకు దర్పణం. కథకులుగా యీ తరం పాఠకులకు అంతగా తెలీని కొనకళ్ళ వెంకటరత్నం, సి వేణు, యం రామకోటి, వల్లంపాటి వంటి రచయితల కథలపై రాసిన సమగ్ర వ్యాసాలు అరుదైన రచనల్నీ విస్మృత రచయితల్నీ వెలుగులోకి తేవడానికి అశోక్ పడే తపనను  మరోసారి వెల్లడి చేస్తాయి.

అంపశయ్య నవీన్, పోరంకి దక్షిణామూర్తి, మధురాంతకం నరేంద్ర, బి యస్ రాములు వంటి సీనియర్ రచయితల దగ్గర్నుంచి ఆలస్యంగా కథా ప్రపంచంలోకి అడుగుపెట్టిన ధేనువకొండ శ్రీరామమూర్తి, సీక్వెల్ కథల ప్రయోగం చేసిన భీమరాజు వెంకట రమణల మీదుగా మంచి  కథకులుగా గుర్తింపు పొందిన మంచికంటి, వేముల ప్రభాకర్, ఓదెల వెంకటేశ్వర్లు, పాపులర్ రైటర్ కస్తూరి మురళీకృష్ణ వరకూ భిన్న ప్రాంతాల రచయితల్లో కనిపించే వస్తు రూప వైవిధ్యాల గురించి, కొత్త కొత్త ప్రయోగాల గురించి చేసిన సునిశితమైన పరిశీలనలు యీ వ్యాసాల్లో దర్శనమిస్తాయి.

పాపినేని కథల్లో పరాయీకరణని విశ్లేషించిన వ్యాసం , జొన్నవిత్తుల కథల శిల్ప సౌందర్యాన్ని పట్టుకున్న వ్యాసం, సలీం కథల్లో వస్తు వైవిధ్యాన్ని ఆవిష్కరించిన వ్యాసం, శశిశ్రీ అంతర్లోక బహిర్లోక కథల లోతుల్లోకి తరచి చూసిన వ్యాసం  కథా విమర్శకుడిగా అశోక్ నిశిత దృష్టికి తార్కాణాలుగా నిలుస్తాయి. ఈ సంపుటిలో : పాపినేనిసగం తెరచిన తలుపుకథని శివారెడ్డిఆవలివైపుకవితకి విశ్లేషణగా అశోక్ తీర్మానిస్తాడు. మితిమీరిన సెంటిమెంట్స్ ను పరిహరించుకొని సహజత్వానికే ప్రాధాన్యం యివ్వాల్సిందిగా సలీం ని హెచ్చరిస్తాడు. శిల్పం లేకుండా కథ ఉంటుందా అని జొన్నవిత్తుల కథా సంపుటి శీర్షికపై చర్చని లేవనెత్తి తీర్పుని పాఠకులకే వదిలేస్తాడు. శశిశ్రీ కథల్లో కనిపించే రెండు ప్రధానమైన నిర్దిష్టతలను (సీమ ముస్లిం) స్పష్టపరుస్తాడు. అదే విధంగా ధేనువకొండ కథల్లో  నోష్టాల్జియా రూపంలో వ్యక్తమయ్యే ఒంగోలు స్థానీయతనీ, వేముల ప్రభాకర్ కథల్లోని రావికంటి నేపథ్యంగా వర్ణితమైన తెలంగాణ ప్రాంతీయతనీ, వలస కార్మికుల జీవితాల్ని ఆధారం చేసుకుని రాసిన నరేంద్ర కథల్లో గ్రామీణ ఉత్పత్తి సంబంధాలకూ పట్టణ శ్రమ దోపిడీకీ మధ్య వున్న వైరుధ్యాల్నీ, మంచికంటి కథల్లో వర్ణితమైన గ్రామీణ జీవన సంక్లిష్టతల్ని అశోక్ విశ్లేషణాత్మకంగా పరిచయం చేస్తాడు.

ఒక విధంగా కథలు చదవగానే స్పష్టాస్పష్టంగా   గోచరించే కథకుడి ఆత్మని పట్టుకుని దాన్ని పాఠకులకు చేరవేయడమే ప్రధాన లక్ష్యంగా సాగే ప్రణాళికని తన విమర్శలో అశోక్ నిర్దుష్టంగా  సమర్థవంతంగా నిర్వహించాడని యీ వ్యాసాలు ఆసాంతం చదివితే అర్థమౌతుంది. ఈ క్రమంలో రచయితల్లో కనిపించే లోపాల్ని నిజాయితీతో యెత్తిచూపడానికి సైతం అతను యెక్కడా సంకోచించలేదు.

స్త్రీ పురుష సంబంధాల్ని మనోవిశ్లేషణాత్మకంగా వర్ణించే నవీన్ కథల పాత్రల అంతరంగాల లోతుల్లోకి యిష్టంగా పయనిస్తూనేచేజారిన స్వర్గం’  కథ విషయంలో రచయితతో విభేదిస్తాడు.  ‘స్త్రీ తన శరీరం గురించి, తన అలంకరణ గురించి, లైంగికత, సంతానం గురించి తానే స్వయంగా నిర్ణయం తీసుకోగలదని ఒకవైపు ఫెమినిస్టులు వాదిస్తుంటే, అందుకు విరుద్ధమైన భావజాలంతో యీ కథ 1997లో రావడం ఆశ్చర్యం.అని  విస్తుపోతాడు. నవీన్ పట్ల అశోక్ కున్న అభిమానం అందుకు అడ్డురాలేదు. అదే విధంగా అంతకు ముందు అచ్చైన కథలనే కొద్ది మార్పులు చేసి, శీర్షికలు మార్చి మళ్ళీ  పత్రికల్లో ప్రచురించిన బి యస్ రాములు సాహిత్య అనైతికని ప్రశ్నిస్తాడు. పాటగాడిగా ప్రసిద్ధుడైన కొనకళ్ళ వెంకటరత్నంని కథకుడిగా పరిచయం చేస్తూ పాపులారిటీ కోసం రాసిన అతని సెక్స్ కథల్ని, వైద్య శాస్త్రం అంగీకరించని అశాస్త్రీయ భావాలతో కూడిన కథల్ని తిరస్కరిస్తాడు. అశోక్ ప్రేమతో రాసిన ముందుమాటలు సైతం పొగడ్తలకు పరిమితం కావు. పాపులర్ రచనలు మాని సీరియస్ కథా రచనపై దృష్టి పెట్టమని ఓదెల వెంకటేశ్వర్లుకి హితవు చెబుతాడు. ధేనువకొండసప్తమాధిపతిలో వైద్యశాస్త్రం నేర్చిన డాక్టర్ జ్యోతిషానికి విధేయుడిగా వుండడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. విమర్శకుడిగా అశోక్ లోని నిష్పాక్షికతకు యివి కొన్ని వుదాహరణలు మాత్రమే.     

తెలుగులో తొలి సీక్వెల్ కథల సంపుటి ప్రచురించిన భీమరాజు వెంకట రమణపై రాసిన వ్యాసం, అదే విధంగా  ‘తెలంగాణ కథల్లో ప్రతిఫలించే సామాజిక సాంస్కృతిక పరివర్తనలువ్యాసం అశోక్ కుమార్ పరిశోధనా పటిమకు తార్కాణంగా నిలుస్తాయి. తెలుగులో వచ్చిన సీక్వెల్ రచనలకు సంబంధించి అశోక యిచ్చిన విపులమైన సమాచారం అబ్బురపరుస్తుంది. అదే విధంగా స్పేస్ హారర్ సైన్స్ ఫిక్షన్ హారర్ బ్లాక్ మ్యాజిక్ వంటి వొళ్ళు జలదరించే పాఠకుల్ని నానావిధాలుగా భయపెట్టే వస్తువులతో ప్రయోగాలు చేసిన కస్తూరి మురళీకృష్ణ భయానక (హారర్) కథల్ని విశ్లేషిస్తూ 1932 లోనే స్థానాపతి రుక్మిణమ్మ రాసిన దెయ్యాల కథల గురించి యిచ్చిన సమాచారం కూడా విలువైనది. సమాచారం దానికదే విమర్శ కాదన్న స్పృహతో రాసిన వ్యాసాలివి. లభ్య అలభ్య రచనలెన్నో సేకరించి స్వీయ పరిశోధన జోడించి దాదాపు వందేళ్ళ తెలంగాణ సమాజంలో వచ్చిన పరిణామాల్నీ స్థానిక సామాజిక చరిత్రనీ ఆ యా కాలాల్లో వచ్చిన కథల ద్వారా తెలియజేసిన విధానం మరింత ముచ్చటగొల్పుతుంది. అయితే ఆ వ్యాసం పరిధిని అతను  యే కారణాల వల్లనో 1990 ల వరకే నియంత్రించుకొన్నాడు. మలిదశ తెలంగాణ రాష్ట్రోద్యమ కాలపు కథలు, చరిత్ర పరిశీలించకపోవడం వొక లోటుగానే మిగిలిపోతుంది. నిజానికి అదొక ప్రత్యేక వ్యాసాంశం. దాన్ని అశోకే పూరిస్తాడని ఆశంస.

***

సృజనాత్మక రచయితలకే కాదు ; విమర్శకులకూ (వాస్తవానికి పాఠకులకు కూడా) తమవైన దృక్పథాలు వుంటాయి. విమర్శలో రచయిత దృక్పథమే కాదు విమర్శకుడి దృక్పథం సైతం ఆవిష్కారమవ్వాలి. పాఠ్యానికి మాత్రమే పరిమితం కాకుండా సందర్భానుసారంగా సామాజిక శాస్త్రాల వెలుగులో  విమర్శకుడి నూత్న ఆలోచనలు ఆవిష్కారమైనప్పుడే సాహిత్యంలో కొత్త భావనలకూ సిద్ధాంతాలకూ చోటు లభిస్తుంది. అయితే అవి పునాదిని మరచి పోకూడదు. నేల విడిచి సాము చేయకూడదు. విశాల ప్రజానీకానికి మేలు చేసేవై వుండాలి. ఈ యెరుక విమర్శకుడిగా అశోక్ లో నిండుగా వుంది. అందుకే అతని విమర్శలో సమాజం , దాని శ్రేయస్సు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సామాజిక సంక్షోభం,   మానవ సంబంధాల్లో యేర్పడుతున్న సంక్లిష్టత, కుటుంబ విలువల్లో వస్తున్న మార్పులు చర్చకు వస్తాయి (ఇవి సాహిత్య విమర్శ పరిధిలోకి రావనీ విమర్శకులు రాజకీయాలకు అతీతంగా వుండాలనీ వాదించే వాళ్ళు కూడా లేకపోలేదు).

ప్రభుత్వాల అపసవ్య విధానాల వల్లనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటిని నిరోధించే చర్యలు చేపట్టకుండా ఏవో తాయిలాలు పంచిపెట్టి ఈ సమస్యను అధిగమించాలనుకుంటారు. తిన్నదరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, నష్టపరిహారం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, ప్రభుభక్తి చూపడం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ వ్యాఖ్యానించే రాజకీయ నాయకులున్నంతవరకు ఈ సమస్యకు పరిష్కారం దొరకదు…. ఈ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా రైతు వ్యతిరేక ప్రభుత్వంగానే తయారవుతుంది.

క్రమశిక్షణా రాహిత్యం, బాధ్యతా రాహిత్యం, సమ్మెలు, కొట్లాటలు, ఆడపిల్లలపై వేధింపులు, రసం లేని పిప్పిలాంటి పాఠాలు, అధ్యాపకుల పక్కదార్లు, పాఠాలు వదిలేసి ట్యూషన్లు, సొంత వ్యాపారాలు, పుట్టకొక్కుల్లా రెసిడెన్షియల్ కార్పోరేట్ కళాశాలలు, విద్యార్థిఅధ్యాపకుల మధ్య వర్గ శత్రుత్వం, బూటకపు పరీక్షలు, బూటకపు వాల్యుయేషన్, బతుకుతో సంబంధం లేని విద్యా వ్యవస్థ విద్యను వ్యాపారం చేసిన ఘనత కార్పోరేట్ రెసిడెన్షియల్ కళాశాలలకే చెందుతుంది. ఈ పాపంలో సగం భాగం ప్రభుత్వానిదే. ‘ (పాపినేని కథల్లో పరాయీకరణ)

అడవుల సంరక్షణ, వన్యప్రాణి రక్షణ చట్టాల పేరుతొ గిరిజనుడ్ని అడవుల్లో బతకనీయడం లేదు. స్మగ్లర్లు, అటవీ అధికార్లు, రాజకీయనాయకులు కలిసి  విచ్చలవిడిగా అడవులను నరికి అటవీ సంపదను అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.’ (ఒక ఇతివృత్తం : ఓ కథ, ఓ సినిమా )

పిల్లల మెదళ్లను కలుషితం చేయడంలో మన సినిమాలు, కేబుల్ టీవీల పాత్ర తక్కువేమీ కాదు. మానవత్వపు విలువలకు దూరంగా సంచలనమే ధ్యేయంగా చౌకబారు హింసాత్మక దృశ్యాలతో ప్రజల్ని రెచ్చగొట్టే చానల్స్ ఒకవైపు, సెక్స్ హింసలకు సంబంధించిన సినిమాలు, వీడియో గేములు మరోవైపు విచ్చలవిడిగా మార్కెట్లో దొరకడంతో అవి పిల్లల అభిరుచుల్ని, ఆలోచనా విధానాన్ని మార్చివేస్తున్నాయి.’ (సలీం కథల్లో  వస్తు వైవిధ్యం )

ఇటువంటి రాజకీయ సామాజిక ప్రకటనలు యీ వ్యాసాల్లో చాల చోట్ల కనిపిస్తాయి. ఆ వైఖరి అశోక్ అంతకు మునుపు రాసిన విమర్శలో సైతం వున్నప్పటికీ యీ సంపుటిలో అది  మిక్కుటమైంది. సాహిత్య విమర్శకుడిగా అతని మారిన ప్రాపంచిక దృక్పథానికి వాటిని నిదర్శనాలుగా భావించాలి. అయితే తన దృక్పథాన్ని తాను యెంచుకొన్న కథలకూ కథకులకూ  అన్వయించి చూడడంలోనే అశోక్ పరిణతి వెల్లడవుతుంది.

సాహిత్య విమర్శని సామాజిక విమర్శని విడదీసి చూడలేం అవి రెండూ వొక దానికి మరొకటి పరిపూరకంగా పనిచేయాలి. సాహిత్య విమర్శలో శుద్ధ కళావాదాన్ని ముందుకు తెస్తున్న రోజుల్లో సాహిత్యం కళలు సామాజిక జీవితాన్ని ప్రతిఫలిస్తాయి. దేశమేదైనా ఒక సమస్య పట్ల సృజన శీలురు ఒకే విధంగా స్పందిస్తారుఅని నమ్మి  సమకాలీన సామాజికాంశాల్ని వొక పూనికతో కథా విమర్శలో జోడిస్తూ  అశోక్ లాంటి వాళ్ళు ప్రవేశపెడుతున్న యీ మెథడాలజీ యెప్పుడూ ప్రాసంగికతనీ ప్రత్యేకతనీ సంతరించుకునే వుంటుంది.

అంబల్ల జనార్దన్ బొంబాయి జీవన కథలుసమీక్షా వ్యాసం చూడండి: మొత్తం దానికదే వొక సుదీర్ఘ రాజకీయ సామాజిక వ్యాఖ్యానం అనిపిస్తుంది. స్వలాభాల కోసం ఫ్యాక్టరీ యాజమాన్యాలతో కుమ్మక్కై కార్మిక వర్గ పోరాట సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చే ట్రేడ్ యూనియనిస్టుల కపట రాజకీయాల గురించి చెప్పిన మాటల ద్వారా అశోక్ నిర్దిష్టంగా యెటువైపు నిలబడ్డాడో స్పష్టంగా తెలుస్తుంది.    

పాత తరం కథల్నీ కథకుల్నీ ఆ నాటి సామాజిక సందర్భం నుంచి అంచనా కట్టాలనే స్పృహ మంచి  విమర్శకుడికి ఉండాల్సిన లక్షణాల్లో ప్రముఖమైనది. అది అశోక్ కుమార్ లో పుష్కలంగా కనిపిస్తుంది.  

1960- 70ల్లో సురమౌళి తాడిగిరి పోతరాజు తప్పిస్తే తెలంగాణలో కథకులే కనిపించరు అని నిర్ధారించిన అశోక్ అక్కడ ఆగిపోలేదు. అందుకు కారణాలు అన్వేషిస్తూ  యిటీవల తానే స్వయంగా మలితరం తెలంగాణ కథకుల్ని తవ్వి తీసే పనిలో పడ్డాడు (సంచిక వెబ్ మాగజైన్ లో క్రమం తప్పకుండా అతను రాస్తున్న విలువైన వ్యాసాలు చూడండి). రామకోటి గురి కథ ( అక్టోబర్ 1977) ని విశ్లేషిస్తూ ఎమర్జెన్సీ పై విమర్శ పెడ్తూ రాసిన కథలు దాదాపు లేవనే చెప్పాలి అంటాడు. నిజమే ఎమర్జెన్సీ పై తాడిగిరి పోతరాజు వంటి యే వొకరిద్దరో  మాత్రమే కథలు రాశారు. అవి కూడా తర్వాతి కాలంలోనే వచ్చాయి. నవీన్ చీకటి రోజులు నవల 1978 లో వచ్చింది.

రామకోటి కథన శైలిని రావిశాస్త్రి శైలితో సరిపోల్చి నప్పుడు, వల్లంపాటిరానున్న శిశిరంకథలో శ్రీశ్రీ బుచ్చిబాబు నవీన్ ల చైతన్య స్రవంతి కథనంలో కనిపించే  ప్రవాహ శైలి కనిపించదని గుర్తించినప్పుడు, సలీంఖులాకథని వ్యాఖ్యానిస్తూ వడ్డెబోయిన శ్రీనివాస్ఆమె తలాక్ చెప్పిందికథలోని సాంస్కృతిక అనౌచిత్యాన్ని యెత్తి చూపినప్పుడు, చేతన్ భగత్వన్ నైట్ అట్ ద కాల్ సెంటర్లాంటి నవలలో చెప్పలేకపోయిన అంశాన్ని పాపినేనివర్చ్యుయల్ రియాలిటీకథ ప్రతిభావంతంగా చెప్పగలిగింది అని నిరూపించినపుడు    అతి సూక్ష్మమైన వివరాలు కూడా అశోక్ పరిశీలన నుంచి తప్పించుకోవనీ లోతైన యీ తులనాత్మక దృష్టిని అతను విరామమెరుగని అధ్యయనం ద్వారా మాత్రమే సాధించగలిగాడనీ తెలుస్తుంది.

అదే విధంగా పలమనేరు బాలాజీఏనుగుల రాజ్యంకథని దిస్స నాయకె (శ్రీలంక దర్శకుడు)బిందుసినిమాతో పోల్చి చూపిన నేర్పు అపూర్వం. సాహిత్యంతో  ప్రపంచ సినిమాతో విస్తృతమైన పరిచయం వున్న అశోక్ లాంటి యే వొకరిద్దరో మాత్రమే రాయగల వ్యాసమిది

***.    

కె పి కొన్నిసార్లు కథని మాత్రమే తిరిగి చెప్పే ప్రలోభానికి గురౌతాడని కొన్ని వ్యాసాల్లో గుర్తిస్తాం. అయితే ఆ సందర్భాల్లో అశోక్ వ్యాఖ్యాన  పద్ధతిని ఆశ్రయిస్తాడు. అందువల్ల కథ చెబుతూనే స్వీయాభిప్రాయాల్ని జోడిస్తాడు. అందువల్ల ఆ పంక్తుల మధ్య విమర్శకుడిగా అతని సామాజిక దృక్పథం కూడా వ్యక్తమౌతుంది. కొన్ని సార్లు అక్కడే రచయిత కథన పద్ధతిపైన, రచనా శైలి పైనా  తనదైన సూత్రీకరణల్ని సైతం చేస్తాడు. కథలో రచయిత చెప్పదల్చుకొన్న సామాజికాంశాల్ని సాధారణీకరిస్తూ పాఠకుల దృష్టిని నిర్దిష్టత వైపు మళ్ళిస్తాడు. విస్తృతాధ్యయనం ద్వారా కలిగిన యెరుకతో చేసే తులనాత్మక పరిశీలనలు కూడా సందర్భానుసారంగా జోడిస్తాడు. సాధికారికమైన ఆ జోడింపులు  విమర్శకు నిండుదనాన్ని సాధిస్తాయి.

ఈ వ్యాసాల్లో పదే పదే వ్యక్తపరచిన అభిప్రాయాల ద్వారా కథా విమర్శకుడిగా అశోక్ ఆలోచనలని స్థూలంగా యిలా క్రోడీకరించవచ్చు :

  • కథలో వస్తు వైవిధ్యాన్ని కోరుకుంటాడు.

  • కథనం ఆసక్తికరంగా వుండి కథ రక్తి కట్టాలంటాడు.

  • కథ ప్రయోజనోద్దిష్టమై వుండాలని భావిస్తాడు.

  • కథ పాఠకుల చైతన్య పరిధిని విస్తరింపజేసేదిగా వుండాలని ఆశిస్తాడు.

  • కథాంశం సహజమైనదిగా వుంటే పాఠకుల విశ్వాసాన్ని పొందుతుందని నమ్ముతాడు.

  • కథ పాఠకుల్ని చేరాలంటే ముందుగా రచయిత శైలిలో పఠతనీయత  తప్పనిసరిగా వుండాలని హెచ్చరిస్తాడు.

  • కథనంలో ప్రయోగ వైవిధ్యాన్ని యిష్టపడతాడు , మీదు మిక్కిలి గౌరవిస్తాడు కానీ పాఠకుల్ని చేరని ప్రయోగాన్ని అంగీకరించడు.

  • కథా విశ్లేషణలో శైలీ శిల్పాల మీద కన్నా వస్తు నిర్వహణ  మీదే దృష్టి పెడతాడు (ప్రధానంగా అశోక్ ది వస్తునిష్ట విమర్శ ).

  • కథా గమనంలో మెలో డ్రామాలూ, సినిమాటిక్ ముగింపులూ , కృత్రిమమైన తీర్పులూ  అతనికి నచ్చవు.

  • కథల ముగింపుల ద్వారా రచయిత ఆశయాన్ని ఆవిష్కరిస్తాడు.

  • అసహజమైన ఆదర్శ వాదం రుచించదు.

  • ఆచరణకు సాధ్యం కాని పరిష్కారాలని అంగీకరించడు.

అశోక్ కుమార్ వ్యాస రచనా శైలిలి గురించి వొక మాట చెప్పుకోవాలి. అతని వచనం సరళంగా సూటిగా వుంటుంది. ఆలంకారిక శైలికి అతను ఆమడ దూరం. పత్రికల ద్వారా  స్థిరీకృతమైన ప్రామాణిక వ్యావహారిక భాష అది. నిత్య వ్యవహారంలో వుండే ఇంగ్లీషు పదాలు అతని వచనంలో అలవోకగా దొర్లుతాయి. వాటిని పరిహరించాలని కూడా అతను అనుకోడు. అందువల్ల అతని వచనం వొక వుపన్యాసంలా రిపోర్ట్ లా  అనర్గళంగా సాగిపోతుంది. మౌఖిక భాషా శైలి ఆ వచనానికి జీవధాతువుగా మారడంతో అది కళాత్మకంగా రూపొంది పాఠకుల్ని సహజంగానే ఆకట్టుకుంటుంది (అశోక్ మాటల్లోనే చెప్పాలంటే పఠనీయతని సంతరించుకుంటుంది ).

తెలంగాణ ప్రాంతీయతను గౌరవిస్తూనే  రాగద్వేషాలకు చోటు లేకుండా కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్ర రచయితలందరికీ సమ ప్రాధాన్యం యివ్వడం అశోక్ కుమార్ లో గమనించాల్సిన  మరొక ప్రధాన విషయం. కొనకళ్ళ, సి.వేణు, రామకోటి, వల్లంపాటి, శశిశ్రీ, సలీం, మంచికంటి, ధేనువకొండ, జొన్నవిత్తుల, నరేంద్ర, భీమరాజు, పోరంకి, పాపినేని … యిలా యీ సంపుటిలో యితర ప్రాంతాలవారికి   పెద్ద పీటే వేశాడు. విమర్శకుడు ప్రాంతీయ పరిమితులకు లోబడి వుండకూదదన్నది అశోక్ తరచుగా చెప్పే మాట. ఎల్లలు లేని అవ్యాజ సాహిత్య ప్రేమికుడు మాత్రమే అనగల మాట అది. అందుకు పక్కా హైదరాబాదీ అశోక్కి సలాములు.

***

చివరగా

చేసిన పాపం చెబితే పోతుందంటారు. చిన్న కన్ఫెషన్ తో ముగిస్తాను. చానాళ్లుగా దాదాపు యేడాదిగా యీ వ్యాసాలు నా చుట్టూ నాలో తిరుగాడుతూనే వున్నాయి. కొన్నిసార్లు నా మీద అలిగాయి, కినుక వహించాయి. మరికొన్ని సార్లు బతిమలాడాయి, తిట్టాయి. చాలాసార్లు  ఎందుకిలా వేదిస్తావని చిరాకు పడ్డాయి. రాద్దామని ప్రయత్నించిన ప్రతిసారీ కాళ్ళకో చేతులకో యేదో వొక అడ్డంకి. ఒక్కోసారి వాటినవే పక్కన పెట్టాయి. అమీ తుమీ తేల్చుకోక తప్పనిసరి పరిస్థితిలో రాసిన యీ నాలుగు మాటల్ని పెద్ద మనసుతో స్వీకరిస్తున్న నా ప్రియ నేస్తం అశోక్ కి యేకకాలంలో  క్షమాపణలుఅభినందనలు తెలుపుకుంటూ

కథా విమర్శ అశోక్ చేతిలో ముందు ముందు కొత్త పుంతలు తొక్కాలనీ కొత్త వెలుగులకు ద్వారాలు తెరవాలనీ కోరుకుంటూ … తెలుగు సాహిత్య విమర్శ యివ్వాళ ఆగిన చోట మొదలు కావాలన్న  వాదనని అతను షరతులతోనైనా అంగీకరిస్తాడని ఆశిస్తూ …

పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూసెలవ్.

హైదరాబాదు

డిసెంబర్ 31, 2018.   .కె. ప్రభాకర్

You Might Also Like

3 Comments

  1. Mukunda Ramarao

    రచయితలకు, విమర్శకులకు అందరికీ పనికొచ్చే విషయాలు ఎన్నో ఈ ముందుమాటలో ఉన్నాయి. చివర్లో సారాంసంగా రాసిన Bullet Points మరీ బాగున్నాయి. ఆలశ్యమయినా విలువైన ముందుమాట ఇది. అందుకు ఫ్రభాకర్ గారికి, మంచి పుస్తకాన్ని తెస్తున్న అశోక్ కుమార్ కి అభినందనలు.

    – ముకుంద రామారావు
    – హైదరాబాద్

  2. V.Saivamshi

    అద్భుతం సర్.. పుస్తకంలోని అంశాలను ఆకలింపు చేసుకొని ఇంత సవినయంగా రాయడం తొలిసారి చూస్తున్నా!!

  3. B Narsan

    విలువైన విశ్లేషణకు నిలువుటద్దపు పీఠిక..ఇద్దరు మిత్రుల అక్షరమయ అలాయి బలాయి..

Leave a Reply