ప్రపంచము మరిచిన చక్రవర్తులు -విజయనగరాధీశులు
వ్యాసకర్త: సంధ్య యెల్లాప్రగడ
**************
అసలు చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి?
అలా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం: చెట్టు, వేరు లేకుండా పెరుగుతుందా? మనగలుగుతుందా?
నీ మూలాలు నీవు తెలుసుకోలేకపోతే నీవు భవిష్యత్తులో సాధించేదేమిటి?
తన చరిత్ర తనకు తెలియని వారు, సాధించే ఘనకార్యాలు ఏముంటాయి?
మన చరిత్రను తెలుసుకోవటమే కాదు, దానిని గురించి మనకు లభిస్తున్న ఆధారాలను జాగ్రత్త పెట్టుకోవలసిన అవసరము కూడా మనకుంది.
ఈమధ్యలో చుసిన ఒక చిన్న వీడియొ క్లిప్ చాలా చిరాకు పరిచింది.
కొందరు తుంటరులు హంపి లోని స్తంభాలను పగలకొడుతూ, చేసిన దుందుడుకు పనికి నవ్వుతూ తిరగటము. వీరికి, వీరు చేసిన దేశద్రోహం అర్థం అవుతున్నదా? మన భావి తరాలకు అందచెయ్యవలసిన సంపదను మనమే కూల్చు కుంటామా?
మనకు లభిస్తుంది అద్భుతమైన చరిత్రలో, అందునా దక్షణాది చరిత్రలో విజయనగర రాజుల చరిత్ర ప్రత్యేకమైనది. 250 సంవత్సరాలు కాలం పాటు దక్షిణాదిని పాలించి, ప్రజలకు యుద్ధ భయము నివారించి శాంతిని నెలకొలిపిన చక్రవర్తులు వీరు. మనకు విజయనగర రాజుల గురించి విస్తారమైన వివరాలు పొందుపరచిన పుస్తకం రాబర్ట్ స్యుయేల్ రాసిన ‘ఫర్గాటెన్ ఎంపైర్ – విజయనగర ఆ కాంట్రిబ్యూషన్ టు హిస్టరీ అఫ్ ఇండియా’. ఈ పుస్తకం సంపూర్ణమైన వివరాలు పొందుపరచి ఉంటుంది. ఇది మేము చదువుకుంటున్న రోజులలో రిఫరెన్స్ కోసం వాడే వాళ్ళము. కానీ దక్షణాది చరిత్ర తెలుకోవాలనుకునే వారు తప్పక చదవలసిన మంచి పుస్తకం ఇది. ఈ పుస్తకం ఇప్పుడు తెలుగులో కూడా “విస్మృత సామ్రాజ్య విజయనగరం’ అన్న టైటిల్తో ఎమెస్కో వారిచే ప్రచురితమై లభ్యమౌతున్నది. విజయనగర రాజుల చరిత్రకు సంబంధించిన రచనలలో ఈ గ్రంధమే నేటికీ ప్రామాణికం. అందుకు కారణం రాబర్ట్ స్యుయెల్ ఈ గ్రంధాన్ని వ్రాసిన విధానమే.
దీని మొదటి ముద్రణ 1900 లో ప్రచురితమైనదట. ఈ గ్రంథం రచనకు ఉపకరణాలుగా రాబర్ట్ తీసుకున్నది : ఆనాడు వచ్చిన పోర్చుగీస్ యాత్రికులైన డామింగో పెయిన్, ఫెర్నావో న్యూనిజ్ ల కథనాలు, లభించిన శాసనాలు, దేవాలయాలలో లభించిన శాసనాల నుంచి సమాచారం సేకరించి, పరిశీలించి ఒక చోట పొందుపరిచి రాసిన గ్రంథం. రాజకీయ, సామాజిక పరిస్థితులను లభించిన ఆధారాలతో మనకు ఈ గ్రంధంలో అందించారు రాబర్ట్ స్యూయెల్. చరిత్ర ఇష్టపడే వారు తప్పక చదవ వలసిన పుస్తకం ఇది.
ఈ విజయ నగర రాజ్య స్థాపన మీద ఉన్న వివిధ కథనాలను గురించి కూలంకుషంగా చర్చించటంలో మనకు రాబర్ట్ నేర్పు కనపడుతుంది. అన్ని రకాల కథనాలను, వాటి సాధ్యా సాధ్యాలను బేజారు వేసుకొని మనకు తాను నమ్ముతున్న విషయం సూచిస్తాడు. మిగిలిన కథనాలను కూడా వివరించటం, తను నమ్ముతున్న కథను అందులో చేర్చి వివరణలతో ఆ ముగింపుకు రావటానికి కల కారణం వివరించటంతో మొదటి అధ్యాయము ముగుస్తుంది. మనకు ఈ గ్రంథం ఏ విధంగా ఉండబోతుందో కూడా అర్థమౌతుంది.
ఇందులో వాడిన తేదీలు కూడా, వివిధ చరిత్రకారులు సూచించిన తేదీలను విశదీకరిస్తూ, ఏది సరియైనదో సూచిస్తూ, విర్ధారిస్తూ సాగుతుంది. చాల చోట్ల మనకు ‘అథో జ్ఞాపికలు” అని చాల వివరంగా చిన్న నోట్స్ లో ప్రతి అధ్యాయానికి చివరలలో వివరిస్తారు. ఈ నోట్స్ సహాయంతో మనం చరిత్రలోకి ప్రయాణించ వచ్చు సులభంగా. చరిత్రకారులు పరిశీలించేటప్పుడు, ప్రస్తుత కాలానికి, ఆనాటి కాలానికి చాల విషయాలు పొసగవు. వాటిని ఎంతో హేతుబద్దంగా పరిశీలించి, లభించిన ఆధారాలతో చరిత్రను వ్రాయవలసి వస్తుంది.
మన కావ్యాలను చరిత్రకు దర్పణంలా తీసుకోరు. కారణం అందులో అతిశయోక్తి అతిగా ఉంటుందని. కానీ అందులో పరిశీలిస్తే కొంత ప్రజల జీవన శైలి తెలుస్తుందన్నది నిజం. మనకు కృష్ణ రాయలు – నిస్సందేహంగా ప్రజలకు సుస్థిరమైన పాలన అందించారని, గొప్ప రాజని కథనాలు. ఇలాంటి కథలు కాలగర్భంలో కలసిపోకుండా, ముందు తరాలవారికి అందించేవే మన శాసనాలు, స్తూపాలు, దేవాలయాలు. ఒక రకంగా పురాతన దేవాలయా లన్నీ ఒక పురావస్తు శాఖ ప్రదర్శన శాలలు.
ఈ పుస్తకం లో రచయిత ఇలా చెబుతారు:
“అతని (పెయిన్ , పోర్చుగీస్ యాత్రికుడు)వర్ణన ఎంతో ఆసక్తిదాయకం, ఆపైన విలువైనది కూడా. ఎందుకంటే ఇదిలేక పోయినట్లయితే, అసలీ రాజు పరిపాలన చేశాడా అని ప్రపంచం న్యాయంగానే సందేహపడి ఉండేది ” ….
“కానీ, పెయిన్ వర్ణన మన చేతులో ఉంది కనుక, ఇంకా సందేహపు నీడ కూడా అవకాశం లేదు. కృష్ణేదేవ రాయలు పేరుకు మాత్రమే రాజు కాదు. ఆతను నిజంగా సర్వం సహాధికారాలున్న సార్వభౌముడు”….
“మొత్తం దక్షిణ భారతదేశమంతా కృష్ణ దేవరాయలు పాలనలో ఉంది” ..”కృష్ణదేవరాయలు తన సింహాసనం అధిష్టించటాన్ని హంపి దేవాలయం ముందు పెద్ద గోపురం నిర్మించి పండుగ జరుపుకున్నాడు”…
పోర్చుగీస్ యాత్రికులే విజయనగరం గురించి, “ఇది చాల సంపద కలిగిన రాజ్యం. అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభ్యమౌతాయి. ” అని చెబుతారు.
విజయనగరానికి ఉన్న సైన్యం కూడా లెక్కలు చూస్తే అతిశయోక్తిగా ఉంటున్నదని పెయిన్ చెబుతాడు. అతని రిపొర్ట్ లో చాల సార్లు “ఆ లెక్కలు చెబితే మీరు నేను అతిగా చెప్పానని నమ్మరు” అంటూ పూర్తి వివరాలు ఇవ్వడు.
వారి సంపదల గురించి, ఆ నగర వైభవము గురించి వివరించే సందర్భంలో కూడా అవి అతిశయోక్తిగా అనిపించి నమ్మరని సందేహపడుతాడు పెయిన్. దుర్ట్ బార్బోన్ మరో పోర్చుగీస్ యాత్రికుడు విజయనగర సైన్యం గురించి కొంత చెప్పే ప్రయత్నం చేసినా “తన కథనాన్ని విశ్వసించని ప్రమాదమున్నట్లు” చెబుతాడు. అంత సైనవాహిక కలిగి ఉండేది విజయనగరం. రాయలకు 700,000 కాల్బలం, 32600 గుర్రాలు, 500 ఏనుగులు ఉండేవని చెపుతాడు. వారికి ధనం/ ఖజానా సంపదలు,లెక్కలేనంత ఉండేదని కూడా అందరు పాశ్యాత యాత్రికులు చెప్పిన విషయం. ప్రతివారు విజయ నగర వైభవం గురించి ఉటంకించారు. ప్రతి వీధి ప్రజలతో, వ్యాపారులతో కిటకిట లాడుతూ ఉండేదని, వ్యాపారానికి మూల స్తంభంలా ఉండేదని, రత్నాలు, వజ్రాలు కూడా వీధిలో అమ్మేవారని ప్రతి రోజు సంత జరిగేదని కూడా మనకు వీరి రాతలతో తెలుస్తుంది. అవ్వన్నీ ఈ గ్రంధం లో పొందుపరిచాడు రాబర్ట్.
ఈ పాశ్యాత యాత్రికులను ఆకట్టుకున్న విజయనగర దేవాలయాలు కట్టడాల గురించి వివరాలు కూడా ఎంతో వివరంగా ఉంటాయి.
“1528 లో నగరంలో కనిపించే అత్యంత ఆసక్తిదాయకము, కుతూహల పూర్ణమైన కట్టడము నిర్మితమైనది. ఇది విష్ణువు అవతారం నరసింహుని పెద్ద విగ్రహం”.
కృష్ణ రాయలు విజయనగరానికి నీటి సౌకర్యం కోసం నగరం లో చెరువు ఒకటి ఏర్పాటు చేసాడని , ఎన్నో కాల్వల తో నీటి సరఫరా జరిగేదని కూడా వివరాలు మనకు తెలుస్తాయి. నాటి దేశ కాల పరిస్థితులు, స్త్రీ ల పరిస్థితులు, సతీ సహగమనము, బహూభార్యత్వం గురించి వివరాలు కూడా వున్నాయి. వారి నగలు, నగీషీల, ముత్యాల, వజ్రాల వివరాలు కూడా కొంత వున్నాయి. ఆ రాజుల సంపద మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
పండగల గురించి, పండగల సమయములో ఉపవాసము గురించి, ప్రజల ఆత్మవిశ్వాసము గురించి కూడా ఈ యాత్రికులు గ్రంధస్తము చేశారు. ఆ విషయాలన్నీ రాబోర్ స్యుయల్ తన పుస్తకంలో వివరంగా విశదీకరించారు.
మన పురాణ పురుషుల సమయంలో పాశ్యాత్య యాత్రికులు లేరు. అసలు కృష్ణుడు, రాముని సమయంలో ప్రపంచంలో మరో నాగరికత లేదు. అది 5000 సంవత్సరాల పూర్వము కదా. మనకు ద్వారక నగరము సముద్రములో కనిపించినా, మనము మన కృష్ణుని నమ్మము. రాముడు కట్టిన వారధి సముద్రములో వున్నా సందేహ ప్రాణులము. రాముని సందేహిస్తాము. ఎంతో ఉన్నతమైన, ఘనమైన చరిత్ర భారత దేశానికి ఉండటం మన అదృష్టం. వాటిని గురించి రాసిన రామయణము, భారతం మనకు వున్నా, వాటిని నమ్మక, ప్రశ్నించే ప్రజలే నేటి సమాజంలో ఉన్నారన్నది నిర్వివాదం.
విజయనగర సామ్రాజ్యం ఆ ప్రమాదము నుంచి తప్పించుకున్నది. కారణము ఆ సమయంలో కొందరు పాశ్యాత యాత్రికులు సందర్శించటం మనం చేసుకున్న అదృష్టం. పర్షియా నుంచి అబ్దుల్ రజాక్, పోర్చుగీస్ యాత్రికులు, వర్తకులు, రావటమే కాదు, వారు చూసినవి లిఖితం చెయ్యటం, అవి ఇంగ్లీష్ లోకి, అక్కడ నుంచి అనేక బాషలలో తర్జుమా జరగటం, రాబర్ట్ స్యుయల్ వంటి చరిత్ర కారులు గ్రంధస్తం చెయ్యటం భారతీయ చరిత్ర అదృష్టం. వీరి రచనల వలన ప్రపంచంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని ఒక అద్భుతమైన నగరం, సామ్రాజ్యం వెల్లివిరిసినదని ప్రపంచానికి ఎరుక పడింది. లేదంటే అవి కూడా మన పురాణ పురుషుల చరిత్రల వలెనె పుకిట్టి పురాణాలుగా మిగిలి ఉండేవి.
భారతీయ చరిత్ర ఒక తప్పని సబ్జెక్టుగా నేటి పిల్లలకు పాఠశాలల్లో పరిచయం చేస్తే పిల్లలకు తెలిసే అవకాశముంటుంది. భారతీయ చరిత్ర గుర్తు తెచ్చుకొని నేటి యువత ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారు. చరిత్ర అన్నది తప్పక తెలియ వలసిన సబ్జెక్టు. మనం మన జాతి గురించి తెలుసుకొని, మన నేటి వర్తమానం మీద నిలబడి, భవిష్యతులోకి ప్రవేశించాలి. అంతే కానీ , మనకున్న ఆ సంపదను దుందుడుకుగా కొల్లగొట్టటం దేశ ద్రోహం. హంపి శిధిలాలకు ప్రభుత్వం, పురావస్తు శాఖ వారు మరింత బందోబస్తు పెంచితే బాగుంటుంది.
ఇలాంటి జాతీయ సంపదలు మనకు గర్వకారణాలు.
Leave a Reply