శతపత్రము – గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ

వ్యాసకర్త: Halley
***************

ఈ వ్యాసం గడియారం రామకృష్ణ శర్మ గారి ఆత్మకథ “శతపత్రం” గురించి. పుస్తకం లభించు చోటు ఇది. తెలుగులో నేను చదివిన ఆత్మకథలలో శ్రీపాద వారి అనుభవాలూ జ్ఞాపకాలూను తర్వాత నాకు ఆ స్థాయి లో నచ్చిన ఆత్మకథ బహుశా ఇదేనేమో . గడియారం రామకృష్ణ శర్మ గారి గురించి తెలుసుకోవాలని అనుకునే వాళ్ళకి ఈ లింకు ఉపయోగపడుతుంది.  ఇది పుస్తకం సైజు వ్యాసంలా అనిపిస్తుందేమో కొందరికి. కానీ మనసుకు నచ్చిన పుస్తకం గురించి ఎంత రాసినా తక్కువే అనిపిస్తుంది కొన్ని సార్లు  . ఇది అటువంటి పుస్తకమే నాకు . బోలెడన్ని విషయాలు తెలిసాయి . ఒక అసాధారణ all rounder జీవిత చరిత్ర ఇది.  ఈ ఆత్మకథ చదవటానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ముందుగా వాటి గురించి కొంత. మొన్నా మధ్యన ఏదో మాట్లాడుకుంటూ ఉండగా మా అమ్మ అలంపూరు గురించీ గడియారం వారి గురించీ ప్రస్తావిస్తూ ఎన్నో ఏళ్ళ కిందట మా నాన్నగారు ఆయనని కలిసారని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వెంటనే నా మిత్రుడొకడు శతపత్రం చాలా గొప్ప పుస్తకమని తప్పకుండ చదవాల్సిందేనని చెప్పాడు. ఇది ఒక కారణం.

నేను బాగా అభిమానించే వ్యక్తులలో ధరంపాల్ గారు ఒకరు . ఆయన గురించి కొంత. బ్రిటీషు వారు అడుగుపెట్టిన భారత దేశం గురించి అప్పటి  వారి సర్వే రికార్డులనే పరిశీలించి ఆ నాటి సంఘం యొక్క వైశిష్ట్యం గురించి ఎంతో పరిశోధన చేసి ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన . ఆయన పుస్తకాలు కొన్ని చదివాక మా యూనివర్సిటీలో (IIIT-H) ఆయనని చాన్నాళ్ల కిందట కలిసాక తెలుగు వారు తమ గురించి తాము రాసుకున్న ఆత్మకథలు లేదా తెలుగు వారి జానపద కళలు కుల పురాణాలు వగైరాలు చదవటం అలవాటు చేసుకున్నాను . ఎందుకంటే “the real work of knowing India as it has been through the centuries would only start when we begin to look at material in Indian languages” అని అన్నారు  ఆయన. అలా చదవటం ప్రారంభించాక తెలుగు పుస్తకాలు చదవటం ద్వారా నాకు తెలిసిన విషయాలు ఇంగ్లీషు పుస్తకాలలో తారసపడలేదు. విశ్వనాథ పుస్తకాలు అరవైకి పైగా చదివి పునరాభ్యాసం చేసుకుంటూ ఉండటానికి కారణం కూడా అదే. గడియారం రామకృష్ణ శర్మ గారి ఆత్మకథ కూడా ఆ కోవలోనిదే! పుస్తకం చదివాక ఒక గొప్ప సాహితీవేత్త, పండితుడు, పోరాటయోధుడు, ఉద్యమకారుడు, మంచి మనిషి, సంస్కర్త గురించి ఎంతోకొంత తెలుసుకోగలిగాను అన్న భావన కలిగింది. ఆయన కాలం నాటి సంఘము దాని తాలూకా సంస్కృతీ కట్టుబాట్లను గురించి కూడా ఎన్నో విషయాలు తెలిసాయి. వీటన్నిటి గురించే ఈ వ్యాసము.

తెలుగు వైదిక బ్రాహ్మణులలో తమది ముల్కినాటి శాఖ అని చెప్పుకొస్తూ “గడియారం” అన్న ఇంటి పేరు వెనుక ఉన్న కథతో ఆత్మకథ ప్రారంభించారు.   తమకు ముందుగా “ఎల్లమ్మ” కులదేవత అని అటు తర్వాత ” ఏడుగురు అక్కదేవరలు” ఇంటి దేవతలైనారని శుభకార్యాల ముందు ఏడుగురు అక్కదేవరలకు పూజ చేసేవారని తెలిపారు. బ్రాహ్మణులకి కూడా ఎల్లమ్మ కుల దేవతగా ఉండేది అని నాకు తెలిసినది ఈ పుస్తకం ద్వారానే. అప్పుడెప్పుడో అక్కదేవరల పాటల గురించి ఒక పుస్తకం చదివాను. బ్రాహ్మణ కుటుంబాలలో కూడా ఇటువంటి ఆచారాలు ఉన్నవి అని సామాన్యంగా ప్రధాన స్రవంతిలో చెలామణి అయ్యే చరిత్ర ద్వారా  తెలిసే అవకాశం తక్కువ. ఇటువంటి వైరుధ్యాల గురించి ఎక్కువగా ఎవరూ రాయరు. ఒక వేళ  తెలిసినా కూడా  ఎవరూ చెప్పరు. చెబితే కొన్ని రాజకీయ సమూహాల అస్తిత్వం దెబ్బ తింటుంది కనుక. మొన్న మొన్నటి వరకు చరిత్ర చెప్పేవిషయంలో గుత్తాధిపత్యం ఆ వర్గానిదే కనుక. ఈ దేశంలోని సాంస్కృతిక వైరుధ్యాలు వాటి మధ్యన సామ్యాలు కోకొల్లలు. లోతైన అధ్యయనం చేస్తే తప్పితే బోధపడదు దానిలోని భిన్నత్వము ఏకత్వము. నేను చదివిన చిన్న పుస్తకం పేరు “శ్రీ అక్కదేవర్ల పాట – A popular folk song of the famous rural deites Sri Akkammagarlu“. రాయలసీమ జిల్లాల్లో ప్రజల్లో కులాతీతంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతర కులాలు ఎన్నింటిలోనో కులదేవతలుగా ఆరాధించబడే గ్రామీణ దేవతలు ఈ అక్కమ్మగార్లు అని అన్నారు అందులో గడియారం గారి ఆత్మకథలో లాగానే . ఈ అక్కమ్మ గార్ల కథలను “ఉరుముల వాండ్లు” అనబడే జానపద సంగీతకారులు ప్రచారం చేసేవారని ఆ పుస్తకంలో ఉన్నది. ఉరుములు అంటూ పిలవబడే తోలు వాయిద్యాలతో ఈ గాథలు చెప్పెడి వారట. అక్కదేవరాలతో పాటు వారి సోదరులు మాధవరాజుల కథ కూడా చెప్పెడి వారట. ఈ అక్కమ్మ గార్లకు బోయలు, కురుబలు, మాధవరాజులకు గొల్లలు, పట్రలు పూజలు చేసే పూజారులుగా ఉంటారట. ఈ సోది అంతా ఎందుకు ఆంటే నేను పాఠశాలలో చదువుకున్న భారత చరిత్రలో ఈ కథలు ఎవరూ చెప్పక ఎదో ఇలాంటి పుస్తకాల ద్వారా అప్పటి చరిత్రను చదివి తెలుసుకుంటున్నాను. మీరూ నాలాగా గవర్నమెంటు పాఠ్యపుస్తక బాధితులు అయితే ఇటువంటివి చదివి ఈ దేశ సంస్కృతిలోని గొప్పతనాన్ని గ్రహిస్తారని రాయటం.

తిరిగి ఆత్మకథలోకి వస్తే తమ వంశం వారికి “జిల్లేడు కొమ్మ” కుల దేవతా వృక్షం అని అన్నారు. కులదేవతా వృక్షాల గురించి నాకు పెద్దగా తెలియదు. ఎప్పుడన్నా తీరిక చూసుకుని అధ్యయనం చేయాలి (అసలు నీకు ఏ విషయం గురించి  తెలుసు నాయనా అని నిట్టూర్పు విడవకండి!  ప్రధానంగా నగరాలలో పల్లెలకు దూరంగా  బాల్యం కలిగిన నా బోటి వాళ్ళకి ఇటువంటివి తెలిసే అవకాశాలు చాలా తక్కువ. ఇటువంటి విషయాలు ప్రధాన స్రవంతిలోకి వచ్చేస్తే ఇందాక చెప్పినట్టు రాజకీయాలు చేసేవారి అస్తిత్వం ప్రశ్నార్థకం అవుతుంది మరి. ఎవరి అజెండాలు వారివి మరి)

తమ వంశం లోని పెద్దలను తలుచుకుంటూ గడియారం వారు ఇలా రాశారు. కొందరు యోగ విద్యలో మంత్ర శాస్త్రంలో ప్రఖ్యాతులని కొందరు పౌరాణికులని అన్నారు. అయితే ఇక్కడ వారి నాయనమ్మ గారి అమ్మ గురించి రాసిన వాక్యాలు నాకెంతో నచ్చాయి. ఆవిడ లోకానుభవం గల సమర్థురాలనీ, భర్త ఉన్నప్పుడు పరిసర గ్రామాల నుండి బ్రహ్మచారులు వచ్చి ఆ ఇంట్లోనే ఉంటూ వేదాధ్యయనం చేసేవారనీ  శిష్యుల కంటే ముందు వేద మంత్రాలు వెంకట లక్ష్మమ్మ (గడియారం వారి నాన్నమ్మ గారి తల్లి పేరు )  గారికి వచ్చేసేవనీ, బ్రహ్మచారులు అపస్వరంతో వల్లిస్తూ ఉంటే ఆమె వంట చేసుకుంటూ విని బైటకి వచ్చి తప్పు సవరిస్తూ సుస్వరంతో చెప్పేదని అన్నారు. ఆవిడ ఎదుట వేదం చెప్పటానికి భయపడేవాళ్ళని గడియారం వారికి ఆయన నాయనమ్మ చెబుతుండేదట. అసలు ఊహించుకోవటానికే భలేగా ఉంది ఈ సన్నివేశం. వుమన్ ఎంపవర్ మెంటుకి బామ్మలాంటిది ఇది . ఈ వెంకటలక్ష్మమ్మ గారి కుటుంబం వారు సంగీత సాహిత్యాలలో, యాఙ్ఞిక విధానాలలో, మంత్ర శాస్త్రాలలో ఆరితేరిన వారని అన్నారు.  ఆ విధంగా వారి పూర్వీకుల గురించి కొంత చెప్పుకున్నాక, తన జననం బాల్యం గురించిన విషయాల గురించి రాశారు రామకృష్ణ శర్మ గారు.

తను చిన్ననాడు చదువుకున్న బడి పంతులు కోమటి చలమయ్య అని చెప్పుకొస్తూ వారి విద్యా విధానం గురించి రాసారు. పొద్దున్న అక్షరాలు మరియు  పెద్దబాల శిక్ష రాయించేవారని, మధ్యాహ్నం ఎక్కాలు “అమరం” అని,  “ఆంధ్రనామ సంగ్రహం” చెబుతూ పలికించేవారనీ,  అక్షరాలు – గుణింతము వచ్చిన వాళ్లకు భాగవతమో ఉత్తర రామాయణమో చెప్పేవారని, చుట్టు పక్కన ఉన్న బ్రాహ్మణ బ్రహ్మచారులు వాళ్ళ ఇంట్లో పౌరోహిత్యం నేర్చుకునే వాళ్ళని రాసారు. ఇప్పుడెవరు చెప్పట్లేదుగా ఇవన్నీ! కనుక తెలుగు పిల్లలకు ఇవన్నీ తెలిసే అవకాశాలు తగ్గిపోయాయి. ఈ మార్పు 1940ల నుంచి మొదలయిందట మరి  (రెఫ్) . ఈ మధ్యన చదివిన మరొక పుస్తకం నీల్ పోస్టుమాన్ రాసిన “Technopoly: The Surrender of Culture to Technology” అన్నది . అందులో curriculum అన్న ఆలోచన యొక్క చరిత్రను గురించి రాస్తూ ఇలా అన్నారు;

A college catalogue, in other words, is a formal description of an information management program; it defines and categorizes knowledge, and in so doing systematically excludes, demeans, labels as trivial—in a word, disregards certain kinds of information. That is why it “makes sense” (or, more accurately, used to make sense). By what it includes/excludes it reflects a theory of the purpose and meaning of education. In the university where I teach, you will not find courses in astrology or dianetics or creationism. There is, of course, much available information about these subjects, but the theory of education that sustains the university does not allow such information entry into the formal structure of its courses. Professors and students are denied the opportunity to focus their attention on it, and are encouraged to proceed as if it did not exist. In this way, the university gives expression to its idea of what constitutes legitimate knowledge.

ఆ విధంగా నా తరానికి అమరం , ఆంధ్ర నామ సంగ్రహం, భాగవత, రామాయణాలు పాఠ్యాంశాలుగా చేర్చనక్కర్లేదు అని ఎవరో నిర్ణయించబట్టే కదా అది తొలగించబడింది . లేదంటే నేను కూడా అవన్నీ చదువుకొనగలిగి ఉండేవాడిని ఏమో. చదవకుండా ఏమి కోల్పోయాను? అంటే నా తెలుగు  జాతి అస్తిత్వంలో ముఖ్యమైన విషయాలను కొన్నిటిని కోల్పోయానేమో. దాని వల్ల లాభమో నష్టమో మరి! “అమరం” చదివితే ప్లేస్మెంట్ గ్యారంటీ ఇవ్వలేము కదా మరి!

తనకు ఈ బళ్ళలో చదివినపుడు చాలా నిర్బంధాలు ఉండేవని, బడికి పోయినప్పుడు వేసుకున్న బట్టలు ఇంటికి రాగానే విప్పి విడిగా పెట్టి ఇంట్లో వేరేవి ధరించవలసి వచ్చేదని రాశారు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తింటే నీళ్లు తాగితే కులం పోతుందని వాళ్ళ పెద్దవాళ్ళ భయం అని రాశారు.

అటు తర్వాత 1929లో శింగవరంలో గడిపిన బాల్యాన్ని పంచుకున్నారు పాఠకులతో గడియారం వారు. తన ఇంటి పక్కన తలారి (బోయ) మల్లన్న కొడుకు తిరిపేలు, ఊరిలో పెద్ద రైతు పచ్చా భీమన్న (కమ్మ) కొడుకు మల్లప్ప తనకు ముఖ్య స్నేహితులని, వీరంతా కలిసి చిన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడుకున్నారని రాశారు. అదే సమయంలో నాటక రంగ ప్రవేశం చేసిన సంగతులు కూడా తెలిపారు (గమనిక: పేరు పక్కన కులం పేరు తో రాసినది గడియారం వారు నేను కాదు! )

అలంపూరులో ఉర్దూ స్కూలులో తన విద్యాభ్యాసం గురించి రాస్తూ మదరసావస్తనియా (మిడిల్ స్కూలు), జమాతే షషుమ్ (ఆరవ తరగతి) అంటూ ఉర్దూ పదాలు పరిచయం చేశారు నాకు. లెక్కలు, చరిత్ర, భూగోళం, దీనియత్ (నీతి శాస్త్రం) అంతా ఉర్దూలోనే ఉండేదని తనకు విద్యాభ్యాసం కష్టమయ్యేదని అన్నారు. ఉర్దూ పాఠాలు అర్థం కాక ఆరవ తరగతి ఫెయిలు అయిన విషయం ప్రస్తావించారు.

తన సాహిత్య వ్యాసాంగము గురించి చెబుతూ లక్షుమపల్లె అన్న ఊరి గురించి చెప్పారు. ఆ ఊరిలో తొగట సంఘానికి చెందిన సాలెవాళ్ళు చాలా మంది ఉండేవారట. వారు నేసిన చీరలు హుబ్లీ ధార్వాడకి ఎగుమతి చేసేవారట (చూడు) . ఆ గ్రామంలో వీధి బడి పంతులు భూపాళం రంగశాయి అని ఉండేవారట. వారు వైశ్యులట. తెలుగులో చక్కని పాండిత్యం గల వారని, భారత భాగవతాది గ్రంథాలకు ప్రతిపదార్థ తాత్పర్యం చెప్పగల దిట్ట అని అన్నారు. మీకు పౌరోహిత్యం మీద ఇష్టం లేదు అంటే సాహిత్యమే చదవండి అని సలహా ఇచ్చారట గడియారం వారికి.

రాత్రి ఎనిమిది గంటలు కాగానే ఊరిలోని రైతులు, ముసలి సాయిబులు వారి ఇంటికి వచ్చి లోకాభిరామాయణం మాట్లాడుకొని వెళ్లిపోయేవారనీ, ఒకనాడు ఒక ముసలి రైతు మేమేలాగూ  రోజూ వస్తున్నాం కదా, ఈ పోచుకోలు కబుర్ల బదులు ఏదైనా పురాణం చెప్పరాదా అని రామకృష్ణ శర్మ గారి చిన్నాయనని ఉద్దేశించి అన్నారట . శర్మ గారు పాడుతూ ఉంటే వారి చిన్నాయన అర్థం చెప్పేటట్టు గా. ఆ విధంగా రంగనాథ రామాయణం మొదలు పెట్టారట. ఈ విషయం గురించి చెబుతూ ఇలా అన్నారు రచయిత. “రాయలసీమలోని పల్లెల్లో ప్రతి ఇంట్లో రంగనాథ రామాయణం , భారతం , భాగవతం , ఉత్తర రామాయణం ఉండేవి . అప్పుడప్పుడు పౌరాణికులు వచ్చి నెలలు నెలలుండి పల్లెల్లో పురాణాలు చెపుతూ ఉండేవాళ్ళు . జనాలు చదువురాని వాళ్ళైనా ఆ గ్రంథాలను అర్థం చేసుకునే జ్ఞానం ఉండేది” అని అన్నారు. ఇటువంటివి విశ్వనాథ నవలలలో చదివాను. ముఖ్యంగా వేయిపడగలు లో ఈ తరహా విద్యా విధానం గురించి చాలా చర్చలే ఉన్నాయి. సెక్యులర్ డిస్కోర్సు లో మనం కోల్పోయింది ఇదే అనుకుంటాను. అప్పుడు విశ్వనాథ నవలలో చదివిన విద్యా విధానం, ఇప్పుడు గడియారం వారి జీవిత అనుభవంలో అచ్చంగా అలానే ఉండటం ఎందుకో బాగా నచ్చింది. అటు తర్వాత తన పద్య రచనాభ్యాసం గురించి కొన్ని సంగతులు చెప్పుకొచ్చారు . ఆ ప్రయత్నంలోనే వేలూరి శివరామశాస్త్రి గారు తనకు  గురువుగా లభించటం గురించిన కథ పాఠకులతో పంచుకున్నారు (చూడు)

సంస్కరణాభిలాష గలిగిన గురువు గారి ఇంట ఆచారాలను చూసి అవాక్కయిన సందర్భాన్ని తలుచుకుంటూ ఇలా అన్నారు. తెలగ కులానికి చెందిన పాలేరు గురువు గారి ఇంటి అవసరాలకి నీళ్లు తీసుకుపోతూ ఉంటే బ్రాహ్మణులు శూద్రులు తాకిన నీళ్లు తాగటం ఏమిటి అని అనుకున్నారట గడియారం వారు  (చూడు) . అయితే మీ గురువు గారికి ఈ పట్టింపులు ఏమి లేవు అని ఆయన భార్య ఎంత సర్ది చెప్పినా వినకుండా పాలేరు బదులు తానే నీరు తోడి ఇచ్చేవారట రామకృష్ణ శర్మ గారు. వేలూరి వారి దగ్గర తన చదువు గురించి చెబుతూ మేఘ సందేశము, మాఘ కావ్యము , జయదేవుని చంద్రాలోకము, లఘు కౌముది, పాణిని సూత్రము  వగైరాల గురించి చెప్పారు.

గురువు గారి వద్ద ఉన్న కాలం నాటి ఎన్నో ఇతర సంఘటనలను పంచుకుంటూ, శిష్యులందరితో కలిసి ఉన్నప్పుడు గురువు గారు తనను  తాటి ముంజలు తినమంటే తాను తన ప్రాంతంలో బ్రాహ్మలు, కోమట్లు ముంజలు తినరని, తనకు ఆ అలవాటు లేదని చెప్పిన విషయాన్ని పాఠకులతో పంచుకున్నారు. వీటిని తింటే దోషం లేదు. నేను చెపుతున్నాను తిని చూడు అని గురువు గారు చెప్పాక ముంజలు రుచి తనకు అప్పుడు తెలిసొచ్చినదని రాశారు. భలే విచిత్రంగా అనిపించింది నాకు అది చదువుతూ ఉంటే. ఇటువంటిదే మనుధర్మ శాస్త్రంలోని కొన్ని విషయాలని చదివి వారి గురువుగారు “స్కౌండ్రల్” అని గట్టిగా అరుస్తూ పుస్తకం బైటకి విసిరికొట్టిన విషయం పంచుకున్నారు. కొన్ని శ్లోకాలు మనువు రాయలేదని ఎవరో కుత్సిత పండితులు అందులో చేర్చిన ప్రక్షిప్తాలనీ వారి గురువు గారి అభిప్రాయమట.

రాయచూరు గుల్బర్గా అలంపురం లో గడిపిన రోజుల విశేషాలు పంచుకున్నారు అటు తర్వాత. గద్వాల మహారాణి అంతః పుర వైద్యురాలు వైద్యం లక్ష్మమ్మ తమకి దూరపు బంధువని రాశారు. అంతఃపుర వైద్యురాలు అని ఒక వృత్తి ఉందని నాకు తెలియదు. ఇదే మొదలు తెలుసుకోవటం. ఇది కూడా ఒక  రకం వుమన్ ఎంపవర్మెంటే కదా మరి. (ఆ మాటకొస్తే “అంతఃపుర వైద్యురాలు” అని గూగుల్ లో కొడితే ఏ రిజల్టు రావట్లేదు. అంటే గూగుల్ కు కూడా తెలియదనే కదా మరి! హి హి హి)

అలంపూరులోని నాటకం కంపెనీ ఏదో నాటక ప్రదర్శన చేస్తూ ఉంటే (ముస్లిము / నిజాము) పోలీసులు ప్రభుత్వాధికారులు తాగి వచ్చి నాటకాన్ని ఆపి ఘజల్స్  పాడమని ఆఙ్ఞాపించారట. అపుడు గడియారం వారూ మరి కొంత మంది కల్పించుకొని తిరిగి నాటకాన్ని ప్రదర్శించేలా చేశారట. ఈ పోలీసుల జులుం చూసి వీరందరికి అసహ్యం వేసి ఇంతటితో ఆపకూడదు అని “ఆంధ్ర యువజన నాట్య మండలి” అని ఒకటి స్థాపించారట. భోగం శ్రీనివాసులు అని ఒకాయన దీనికి సంగీత దర్శకుడట. ఆయన 18 వాద్యాలలో నిపుణుడట.

నిజాము సంస్థాన నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిరంకుశ పాలనాలో ప్రజా పీడనము నిరంకుశముగా సాగేదనీ  హిందువులు బానిసలవలె జీవించేవారని, అటువంటి పరిస్థితులలో ముందు నాటకాలు, తర్వాత గ్రంథాలయోద్యమం, అటు తర్వాత ఉద్యమ రాజకీయాలలోకి  తాను ప్రవేశించిన విషయాలను పంచుకున్నారు.

అప్పటి తెలంగాణా ప్రజలలో కొందరిలో మాతృభాషాభిమానం లేదనీ, తమ ధర్మం మీద మతం మీద అభిమానం లేదని, పై తరగతి ఇండ్లలో తెలుగు వారు కూడా ఉర్దూ మాట్లాడుకొనే వారని, వారికి వేషధారణలో కూడా అచ్చం ముస్లిం వలెనే ఉండటం ఇష్టం అని రాశారు. 1920లలో తెలంగాణ సమాజం గురించి నాకు తెలిసింది తక్కువే తెలంగాణ సాయుధ పోరాటం గురించి నేను చదివినంత మేర ఇది నిజమే అనిపించింది నాకు. ఇదే విషయం సురవరం ప్రతాపరెడ్డి గారు, మాటపాటి  హనుమంతరావు పంతులు గారు కూడా రాశారట అప్పట్లో. 1921లో హైదరాబాదు సంఘ సంస్కరణ సభలో వక్తలు మరాఠీ హిందీ కన్నడ భాషలలో ఉపన్యాసాలు ఇవ్వగా ఒకాయన తెలుగులో ఉపన్యాసం మొదలు పెడితే సభ్యులు గొడవ చేశారట. దానితో తెలుగు పెద్దలకి రోషం వచ్చి తెలుగు జన సంఘం అని ఒక సంఘం స్థాపించారట. అప్పటి జిల్లా ఆంధ్ర సభలకి ఎందరో అగ్రనాయకులు వచ్చారని వారిలో రావి నారాయణ రెడ్డి తప్ప మిగిలిన వారంతా ఉర్దూలోనే ప్రసంగించారని, వారికి తెలుగు రాదనీ, ఈ “తౌరక్యాంధ్రము” గురించి తాను ప్రసంగించానని ఆంధ్ర మహా సభలలో ఈ  పరిస్థితి ఉండరాదని చెప్పానని గోలకొండ పత్రికలో “తౌరక్యాంధ్రము” మీద అప్పుడు ఒక సంపాదకీయం రాయబడిందని రాశారు.

తనకు కుల మతాల పట్టింపు లేనందువలన ఆ విషయం తనకు  ఉద్యమ కాలంలో చాలా ఉపయోగపడిందని రాశారు. అప్పట్లో మాల మాదిగలను ఇతరులెవరూ ఇళ్లలోకి రానిచ్చేవారు కాదని, రచయిత మాత్రము వారిని కార్యకర్తలుగా తీసుకొని ఇంట్లో కూర్చో పెట్టుకునే వారని రాశారు. తన మిత్రుడు ఒకాయన లింగధారి రెడ్ల కి చెందిన వారు  అట. ఒక రోజు సహపంక్తి భోజనము చేస్తూ ఉంటే ఒక హరిజనుడు తనకు నీరు ఇవ్వబోతే అతను అవాక్కయి శర్మగారితో “ఎంత పని చేసినవయ్యా నన్ను బ్రష్టు పట్టిస్తివి కాదయ్యా ” అని అన్నాడట. శర్మ గారు నవ్వి ఊరుకుంటే “బాపనయ్యవి నీకు లేనిది నాకెందుకు” అని తిరిగి భోజనం చేసాడట ఆయన.

గద్వాలలో గ్రామములో 13 సంవత్సరాలకే వైధవ్యం ప్రాప్టించిన ఒక మున్నూరు కాపాయన కుమార్తె గురించిన కథ ఒకటి చెప్పారు. తనకు గాజులు తీయటానికి ససేమిరా ఒప్పుకొని అని అనిందట ఆ అమ్మాయి. అమ్మాయి అన్న ఈ సమస్యకి ధర్మ శాస్త్ర సంబంధ పరిష్కారం చేయమని శర్మ గారి దగ్గరకు వస్తే ఆయన మనుస్మృతి యాజ్ఞవల్క్యస్మృతి, పరాశర స్మృతి వగైరాలు మరణించిన వారికి కర్మలు ఏ విధంగా చేయాలో చెప్పే “యల్లయాజీయం” అన్న గ్రంథం చదివి గాజులు, కుంకుమ పెళ్లి కి ముందు ఉన్నవి కాబట్టి అవి తీయనక్కర్లేదని మెడలో మంగళ సూత్రం చెవిలో తాటి ఆకులు పెళ్లి తో, అనగా భర్తతో  వచ్చినవి అని  అవి మాత్రం తీస్తే సరిపోతుందని తీర్మానించారట. గ్రామం లో ని పెద్దలనందరిని పిలిచి అందరికి అన్ని శాస్త్రాలు వివరించి అర్థం చెప్పి ఒప్పించారట. ఈ తీర్పు చాలా రోజులు చర్చనీయాంశం అయిందట ఆ ప్రాంతంలో.

కర్నూలు దగ్గరి ఒక ఊరులో చాత్తాద వైష్ణవుల కుటుంబం లో రచయిత, మరి కొందరు తలపెట్టిన బాల్య వితంతు వివాహం గురించి ఒక ఆసక్తి కరమైన సంగతి పంచుకున్నారు. “స్త్రీ పునర్వివాహము శాస్త్ర విరుద్ధము అని భావించే పండితులు ఈ వివాహమునకు వచ్చి వాదించ వచ్చును ” అని ప్రకటించారట లగ్న పత్రికలో కానీ ఎవరూ రాలేదట. ఆ తర్వాత రచయిత ఆధ్పర్యం లో మహబూబ్ నగర్, గద్వాల, మన్నెంకొండ, హైదరాబాదులలో విధవా వివాహాలు జరిగాయట.

ఇదేవిధంగా ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినాయన వెలమ దొరల సహవాసమువలన మద్యపానానికి అలవాటు పడితే ఆయనని ఆ ఊరిలోని ఇతర బ్రాహ్మణులు బహిష్కరించారట. తర్వాత ఆయన కుమారుడు వేరే ఊరిలో స్థిరపడి కొన్నేళ్ల తర్వాత కూతురికి పెళ్లి చేస్తే, వరుడి తరఫు వారు ఎవరో ఇది బహిష్కారానికి గురి అయిన కుటుంబము, తండ్రి తప్పు చేసాడు కాబట్టి కొడుకుకి ఆయన సంతతికి సంసర్గ దోషం ఉంది అని అన్నందున ఆ వరుడు ఈయన కూతురితో సంసారము చేయకుండా పదేళ్లు పక్కన పెట్టాడట. చివరికి మీ ఊరి బ్రాహ్మణ సంఘం బహిష్కార  దోషం లేదు అని అంటే తిరిగి కాపురం చేయటానికి మాకేమి అభ్యంతరం లేదు అని అన్నారట. అప్పుడు శర్మగారు పరాశర స్మృతి చదివి వినిపించి కలియుగంలో సంసర్గ  దోషం లేదు అని ఒక పత్రం రాయించి ఊరి బ్రాహ్మణులతో సంతకం చేయించి సమస్యని పరిష్కరించారట.

ఇలానే ఇంకొక సమస్య వచ్చిందట నిర్మల్ గ్రామములో కొందరు బ్రాహ్మణ యువకులు నిత్యమూ శ్రద్ధగా సంధ్యావందనము దేవతార్చనము చేసి ఆఫీసులకి పోయేటప్పుడు మాత్రము యజ్ఞోపవీతము తీసి దేవుని దగ్గర తగిలించి వెళ్లేవారట. పెద్దలు జందెం తీయరాదు అని చెప్పినా వినేవారు కారట. ఆ సమస్యని శర్మగారు ఎలా పరిష్కరించారో తెలిపారు.

తన వివాహం గురించి (శర్మ గారు బాల్య వితంతువును వివాహమాడారు)  దాని ముందూ వెనుకా జరిగిన వివాదాల గురించీ తెలిపారు పుస్తకంలో  తరువాతి పేజీలలో. ఆంధ్రభాష సంస్కృతుల ప్రచారమే ప్రధాన లక్ష్యంగా నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు అని ఒకటి ఏర్పాటు చేసిన వైనం తెలిపారు. అందులో శర్మ గారేకాక బూర్గుల రామకృష్ణ రావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు వంటి పెద్దలెందరో ఉన్నారట.

భారత దేశానికి స్వాతంత్రం రావటము, హైదరాబాదు నవాబు తాను స్వతంత్రంగానే ఉంటాను అని ప్రకటించుకోవడం, ఇతైహాదుల్ ముజాహిదీన్ సంస్థ “ఆజాద్ హైదరాబాద్ ” అని నినదించటము గురించి కళ్లకు కట్టినట్టుగా వర్ణించారు. నవాబు దురాగతాలను ప్రజలకు తెలపటానికి శర్మగారి ఆధాపర్యంలో నడిచిన “భాగ్యనగర్ రేడియో” ఛానల్ గురించి చదువుతూ ఉంటే ఎంతో ఆసక్తి గా అనిపించింది.

ఈ తరుణంలో కల్లూరు అనే గ్రామంలో కొన్ని రోజులు తలదాచుకోవాల్సి వచ్చిందని ఆ గ్రామం సంగతులు చెబుతూ ఇలా రాశారు.“అప్పటి గ్రామాలు కుల మత భేదాలు లేకుండా ఒక కుటుంబం వలె ఉండేవి. భేదభావం లేకుండా అంతా  ఒకరినొకరు అన్న, బావ, మామ, చిన్నాయన, మామ-అల్లుడు, తాతా, మనుమడు అని మగ వాళ్ళు; పిన్ని, పెద్దమ్మ, అత్త, అక్క, వదినె, అవ్వ, మరదలు వరుసలతో ఆడవాళ్ళూ పిలుచుకుంటూ ఎంతో ఆప్యాయతతో ఉంటూ ఉంటే నేను ఆశ్చర్యపడుతూ ఉండేవాణ్ణి  …… నగరంలో కృత్రిమ జీవనానికి అలవాటు పడిన నాకు పల్లెలోని సహజ ప్రేమ వాతావరణం ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగజేసింది”. సరిగ్గా ఇదే విషయం చెబుతూ విశ్వనాథ వారు “శార్వరి నుంచి శార్వరి దాకా” అన్న నవల రాశారు . అది గుర్తుకు వచ్చింది ఈ వాక్యాలు చదువుతూ ఉంటే.

1948లో ఒక ముస్లిం యువకుడు అప్పటికే పెళ్ళైన ఒక హిందూ యువతితో సంబంధం ఏర్పరుచుకొని ఆమెని ముస్లిం గా మార్చి నిఖా చేసుకున్నాడట. శర్మ గారు అతనితో నిఖా రద్దు చేయించి ఆమెకి శుద్ధి చేసి తిరిగి హిందువు గా మార్చారట. అలంపురంలో ఆర్క బ్రహ్మ ఆలయం బాలాఖిల్లా మసీదు గా మారిందని దానిని తిరిగి ఆలయంగా చేసి దాని తాలూకా ఇనాం భూములు దగ్గరలోని మరొక మసీదుకు బదలాయింప చేశానని రాశారు. ఈ ఘట్టాలు చదువుతుంటే నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. అప్పటి దాకా ఇటువంటివి చేసే టైపు అనుకోలేదు శర్మ గారి గురించి నేను.

నేను జరిపిన విచిత్ర వివాహాలు అని కొన్ని సంఘటనలు రాశారు. చదివించేలా ఉన్నాయి. ఎంతో వైవిధ్య భరిత మైన జీవితం శర్మగారిది అని అనుకునేలాగా ఉన్నాయి.

1953 ప్రాంతంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సమక్షంలో జరిగిన ఆంధ్ర పరిషత్తు  సారస్వత సభల గురించీ కొన్ని విషయాలు తెలిపారు.

అప్పటికి వరకు ఉర్దూ యూనివర్సిటీ గా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని హిందీ యూనివర్సిటీ చేద్దామని అనుకున్నదంట నెహ్రు ప్రభుత్వము. సిటిజన్స్ కమిటీ అని ఒకటి తయారయ్యి ఈ విషయమై నెహ్రు కి ఒక మెమోరాండామ్ ఇచ్చిందట. ఈ యూనివర్సిటీ ఈ సంస్థానంలో ఉన్న తెలుగు కన్నడ మరాఠీ ప్రజల డబ్బుతో కట్టినది. నవాబు నిరంకుశత్వంతో ప్రజల భాషను తొక్కి ఉర్దూ యూనివర్సిటీ గా చేసాడు. మీరు కావాలంటే ఇంకొక హిందీ యూనివర్సిటీ కట్టుకోండి కానీ ఉస్మానియాను మాత్రం మాకు వదిలేయండి అని చెప్పారట!

అలంపూరులో మ్యూజియము హై స్కూలు పెట్టటం వెనుక తన కృషిని గురించి కొంత రాశారు.

ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం, కర్నూలు రాజధాని అవటం, చుట్టూతా జరిగిన రభస వగైరాల గురించి చాలా విషయాలు పంచుకున్నారు. అటు తర్వాత ఫజల్ అలీ కమీషన్, విశాలాంధ్ర ఉద్యమం, స్టేట్స్ రీఆర్గనైజషన్ కమిటీ వగైరాల గురించి కూడా చాలా విషయాలు తెలిపారు. అప్పటి కాలం కళ్ళ ముందు మెదిలినట్టు అనిపించింది.

ఆ ఆత్మకథ రచనాశైలిలో ఒక కొత్తదనం ఏంటి అంటే ఒక భాగం కాలానుక్రమణంగా జీవితానుభవాలు రాసినది, ఇంకొక భాగం విషయానుక్రమణంగా రాసినది. ఈ పద్ధతి వేరే ఎక్కడా చూడలేదు నేను.

అలంపురం ఆలయ ధర్మకర్తగా పని చేసిన అనుభవాలనూ ఆ దేవాలయ విశిష్టతను పాఠకులతో సుదీర్ఘంగా చర్చించారు. దేవాలయం దగ్గర షాలి పహిల్వాన్ దర్గా ఉండేదట దానికి మూడు రోజుల ఉర్సు జరిగినపుడు వచ్చిన ముస్లిము యాత్రికులు దేవాలయంలో సత్రాలు మండపాలు ఆక్రమించుకొని మల మూత్ర విసర్జనలు చేసి తాంబూలాలు ఉమ్మి వేసి దేవాలయ పరిశుభ్రతను పాడు చేసేవారట. ఊరిలోని హిందూ పెద్దలు నోళ్లు మూసుకొని దురాగతాలను సహించేవారట. ఇటువంటి పరిస్థితులలో శర్మ గారు ఆ ఉర్సు జరిగినపుడు దేవాలయం వాకిళ్లు మూయించి హరిజన యువకులకు కూలిచ్చి కాపలాగా పెట్టి ఆలయ పరిశుభ్రత ను కాపాడినారట. అప్పటి నుంచి అంటే 1957 నుంచి రచయిత పుస్తకం రాసిన కాలం (2004) దాకా ఇంకెప్పుడు ఆ ఆలయానికి ఈ సమస్య రాలేదుట. ఈ దర్గా తాలూకా కథను కూడా చెప్పారు. ఈ శాలి పహిల్వాన్ 14వ శతాబ్ది లో ఇస్లాం వ్యాప్తికై వచ్చిన పడవదొంగ అని, అతని ఆధ్ఫర్యంలో జోగులాంబ దేవాలయ వినాశనం జరిగిందని, స్థానిక ప్రజలు రెచ్చిపోయి ఆయనని చంపేశారని, అది తెలిసిన బహమనీ నవాబు సైన్యంతో సహా వచ్చి ఈ శాలిపహిల్వానుకు ఒక గోరీ కట్టించాడని, అంతటితో ఆగక క్షేత్రంలోని దేవాలయాలను నిర్మూలించడానికి పూనుకున్నాడని రాశారు. విజయ నగర సామ్రాజ్యానికి చెందిన హరి హర రాయల కొడుకు దేవరాయలు ప్రచండ సైన్యంతో వచ్చి ఈ ముస్లిం సేనను పారద్రోలి దేవాలయాన్ని రక్షించారని రాశారు. ఇటువంటివే మరికొన్ని సంఘటనలు తెలిపారు. దేవాలయల చుట్టూ ఉన్న ముస్లిం గోరీలను తాను తీసివేయించిన వైనం వగైరాలు. ఆగ్రహావేశాలకు లోను కాకుండా ఉండేవారికి ఇవన్నీ సాధారణంగానే అనిపించాలి మరి. రామకృష్ణ శర్మ గారిలోని సంస్కరణాభిలాషను అభిమానించినపుడు సంప్రదాయ భావాలను కూడా గుర్తించాలి మరి.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వగైరాల గురించి మెకంజి కైఫీయత్తుల వైశిష్ట్యాన్ని వివరిస్తూ చెప్పిన విషయాలు నన్నెంతగానో ఆకట్టుకున్నాయి.

ఇంకెన్నో బోలెడు వింతలూ విశేషాలూ పంచుకున్నాక ఆధ్యాత్మిక రంగంలో తన గురువు గురించీ తన మంత్రోపాసన గురించీ కొన్ని విషయాలు తెలిపారు. ఇందులో హిమాలయాల నుంచి వచ్చిన ఒక యోగి సాయంతో  మూలికలతో మైనము తయారు చేసి దానితో బంగారు ఉత్పత్తి చేశారని ఒకాయన గురించిన కథ రాశారు. నమ్మశక్యంగా అనిపించలేదు!

మైసూరులో గణపతి సచ్చిదానంద స్వామి దర్శన సమయంలో తనకు కలిగిన అనుభవాల మూలంగా రమణ మహర్షి ఆశ్రమంలో తనకు అంతకు భిన్నంగా ఎదురైన అనుభవాల ఆధారంగా సచ్చిదానంద స్వామిని గురించి కొన్ని కటువైన వ్యాఖ్యలు చేశారు.

అటు తర్వాత చరిత్ర వాస్తు పరిశోధనల గురించి సుదీర్ఘంగా చర్చించారు. వారి పుస్తకాలు ఒక రెండు మూడు ఈ లంకెలో లభిస్తున్నాయి. తన రచనా వ్యాసాంగం గురించి రాసిన అధ్యాయంలో భారత  దేశ చరిత్ర గురించి తాను రాసిన పుస్తకం గురించి ఇలా రాశారు. “పాశ్చాత్య చరిత్ర కారులు రాసిన మన దేశ చరిత్రలో విషయాలు వారి దృష్టి కోణముతో రాసినారు. అది అట్లుండగా విద్యార్థులు చదువుకొంటున్న 300 పేజీల చరిత్రలో హిందూ యుగము 25 పేజీలు, బౌద్ధ యుగం 50 పేజీలు, మహమ్మదీయ యుగము 100 పేజీలు, బ్రిటీష్ యుగము 125 పేజీలుగా ఉంటుంది. ఇది అన్యాయము” అని అన్నారు. తాను రాసిన చరిత్ర పుస్తకంలో హిందూ యుగానికి అగ్రపీఠం వేసిన విధానం గురించి  చెప్పుకొచ్చారు.

ఈ పుస్తకం దొరికితే చదవాలి ఎప్పుడైనా. ఇటువంటిదే  మాధవ విద్యారణ్య స్వామి చరిత్ర కూడానూ. శర్మ గారు రాసిన చరిత్ర పుస్తకం ఎక్కడన్నా దొరికితే చదవాలి. అదే విధంగా హిందూ ధర్మం మీద కూడా ఒక పుస్తకం రాశారట. ఆ పుస్తకం గురించి చెబుతూ ఇలా రాశారు.

“ఒకానొక కాలంలో భారతీయ మహర్షులు ప్రపంచానికి ఆచార్య స్థానంలో ఉండి విజ్ఞాన చంద్రికలను అందించిన వాళ్ళు. వారి  సంతానమైన మనం ఆ గౌరవానికి దూరమై పశు ప్రాయులుగా జీవిస్తున్నాము. ఇతర ధర్మాల వారి కుతంత్రాలు , అతాచారాలు మితిమీరుతున్నాయి. మన స్వతంత్ర ప్రభుత్వం మతాతీతపు (సెక్యులర్) ముసుగులో ఇతర మతాల వల్ల హిందూ మతానికి జరుగుతున్న అవమానాన్ని , కలుగుతున్న ఆపదను చూస్తూ ఉరుకుంటున్నది. అపరాధులను అభిమానిస్తున్నది. ధర్మ పీఠాధిపతులు, తమ పాద పూజలు, భిక్షా వందనాలకై సంచారాలు చేస్తున్నారు. మన విద్యావంతులలో ధర్మం పట్ల ఆసక్తి లేదు. అమాయక ప్రజలకు ధర్మ పరిజ్ఞానమే లేదు. హిందూ ధర్మం అంటే ఏమీ తెలియని వాడూ దూషిస్తున్నాడు. దీని ఫలితంగా హిందూ సమాజంలో ఆత్మాభిమానము, ఐకమత్యము, బుద్ధిశక్తి, పౌరుషం క్షీణిస్తున్నాయి. మనకు మునుపటి ఔన్నత్యం కలుగవలెనంటే ప్రతివానికీ తన ధర్మాన్ని గురించి, తన ధర్మానికి ఉన్న శత్రువుల గురించి, తన కర్తవ్యాన్ని గురించి సరైన జ్ఞానం కలిగించటమే సరైన ప్రతిక్రియ. ఆ దృష్టితో చిన్న పుస్తకాలను ప్రకటించవలసి ఉన్నది” అని రాశారు.

ఈ పుస్తకం కూడా అంతర్జాలంలో ఎక్కడా తారసపడలేదు. దొరికితే చదవాలి.  ఇది కాక పురుషుల వలె స్త్రీలు ఆచరించాల్సిన నిత్య పూజా విధుల గురించి కూడా ఒక పుస్తకం రాశారట. నాగరిక స్త్రీలు తమ పెద్దలు ఆచరించిన ఆ పూజలు మానుకున్నారని,  ఆరోగ్యానికి మనశ్శాంతికి దూరమైనారని, వీటిని ఆచరిస్తే సుఖ శాంతులతో ఉండగలరు అని రాశారు.

ఇవి కాక ఆయన ఇతర రచనలు సాహిత్య పఠనము చేసిన  యాత్రలు వగైరాల గురించి కూడా చాలా రాశారు.

తన సాంసారిక జీవితం గురించి రాస్తూ “దారిద్రానికి పిల్లలెక్కువ అన్నట్లుగా మాకు 1944 నుండి 1972 సం|| లోగా 28 యేండ్ల కాలంలో 15 మంది బిడ్డలు కలిగారు. వీరిలో 7 మంది మరణించారు. 8 మంది మిగిలినారు” అని రాశారు.

స్త్రీవిద్యను గురించి కూడా కొన్ని అభిప్రాయములను రాశారు. స్త్రీ పురుషులకి విడివిడిగా విద్యాలయాలు ఉండాలని అన్నారు. దానికి అయన జస్టిఫికేషన్ ఆయన ఇచ్చుకున్నారు. అయితే ఇప్పటి విద్యా విధానము పురుషులకే తగినది కాదు అని రాసారు. ఈ చదువు వలన ఉద్యోగం దొరికితేనే బతుకుతాడు, లేకపోతే స్వతంత్రంగా జీవించలేడు అని రాశారు. నాకు విశ్వనాథ దమయంతి స్వయంవరం, పరీక్ష నవలలు జ్ఞాపకం వచ్చాయి ఈ వాక్యాలు చదువుతూ ఉంటే.

తన పిల్లల గురించి రాస్తూ మొదటి ఇద్దరికీ ఉపనయనాలు చేశానని, పెద్దవాడు యజ్ఞోపవీతం ఉంచుకున్నాడని, రెండవవాడు “జగమెరిగిన బ్రాహ్మణునికి జందెంబేలా” అన్న ఆధునిక సూక్తి పాటించాడని రాశారు. తక్కిన కొడుకులు అందరు వామపక్షాభిమానులని తాను నిమిత్త మాత్రుడనని రాసుకున్నారు.

ఒక కుమారునికి సాంప్రదాయ వివాహం చేశానని, మిగిలిన ముగ్గురు కొడుకులు స్వతంత్ర నిర్ణయాలతో వర్ణాంతర వివాహాలు చేసుకున్నారని రాశారు. ఇవి ఆయన పర్సనల్ విషయాలైనప్పటికిని పాఠకులతో పంచుకోవాలని ఆయన విజ్ఞతతో ఆయన రాశారు కనుక నాకు అనిపించిన కొన్ని విషయాలు రాస్తున్నాను ఇక్కడ. ఆ కాలం నాటి తెలుగు సమాజంలో వామపక్ష భావజాల ప్రభావానికి లోను కాని బ్రాహ్మణ కుటుంబాలే లేవు అంటే అతిశయోక్తి లేదేమో . ఒక కడుకు మతాంతర వివాహం చేసుకొని పిల్లలకి “అగ్ని” “సృష్టి” అని పేర్లు పెట్టుకున్నారని రాశారు. ఇటువంటివి కూడా ఆ కాలంలో చాలానే జరిగాయి. పిల్లలకు “సమరం” “లవణం” వంటి పేర్లు పెట్టిన ప్రసిద్ధ సంఘ సంస్కర్త జ్ఞాపకం వచ్చాడు నాకైతే.

వర్ణాంతర వివాహం చేసుకున్న మూడో కొడుకు మీరు అనుమతిస్తే మీ దగ్గరకు వస్తాము అని శర్మ గారికి ఉత్తరం రాశారట. నీవు ఉపనయనం చేసుకోలేదు కాబట్టి నువ్వు శూద్రుడవే, కనుక నీది వర్ణాంతర వివాహమే కాద . మీరు పుట్టక ముందు నుంచి హరిజనులు ఇంటికి వచ్చి నాతో సమానంగా ఉండటం మీకు తెల్సు. మీరు రావటానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పారట. గడియారం రామకృష్ణ శర్మ గారి లో లాగా సంస్కరణాభిలాషి, సాంప్రదాయ వాది కల గలిసి ఉన్న వ్యక్తుల గురించి నేను చదివింది తక్కువే. గొప్పగా అనిపించింది ఆయన వ్యక్తిత్వం ఇది చదువుతున్నప్పుడు నాకు.

ఇవన్నీ చెబుతూ ఇలా రాశారు – వర్ణ వ్యవస్థ ఉత్తమమైనది అని అంటూ ఈ వ్యవస్థ పటిష్టత వల్లనే భారత జాతి ఇస్లాం , క్రైస్తవ జంఝా మారుతాలకు నిర్మూలము కాకుండా స్థిరంగా నిలువ గలిగింది అని. ఆ సత్యాన్ని మరువ రాదనీ రాశారు. చరిత్రను పరిశీలిస్తే, పై రెండు తుఫానుల ధాటికి ప్రపంచంలో చాలా దేశాలు తమ సంస్కృతీ సంప్రదాయాలు నిర్మూలం కాగా అవి క్రైస్తవ, ఇస్లాం దేశాలుగా మారిపోయాయి. ఇది సత్యం అని అన్నారు. వివేకానందులు అన్నట్టు ఆ వ్యవస్థలో లో దోషాలను తొలగించి దాన్ని కాపాడుకోవాలని, వ్యవస్థనే నిర్మూలించాలని అనుకుంటే తర్వాత  పశ్చాత్తాపపడాల్సి వస్తుంది అని తన అభిప్రాయం అని అన్నారు.

ఈ పుస్తకంలో నాకు నచ్చినది ఇదే. తాను చెప్పాలని అనుకున్నది నిర్మొహమాటంగా చెప్పారు. తాను ఆలా ఎందుకు అంటున్నది కూడా సహేతుకంగా వివరించారు. అటు తర్వాత ఎవరి అభిప్రాయము వాళ్ళది అన్నట్టు. ఎలాగూ ఈ రోజులలో అన్ని ధర్మాలు పోయి ఇష్టమనే కొత్త ధర్మం వచ్చింది అని విశ్వనాథ వారు ఎప్పుడో చెప్పకనే చెప్పారు. కాబట్టి ఎవరి ఇష్టానుసారంగా వారు గ్రహించచ్చు ఇట్టి విషయాలని. అయినా ఇలాంటి విషయాలను ఈ కాలంలో ఆత్మకథలో రాయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అయన కాబట్టి రాయగలిగారు.

నేను విద్వాంసుడను కాను, నిత్య జీవితానికి తగిన సంపాదనపరుణ్ణీ కాను. కానీ యోగ్యతను మించి గౌరవ సత్కారాలు పొందాను. దైన్యం లేని జీవితం సాగించాను. ఏమి ఉన్నా  ఏమి లేకపోయినా జగన్మాత అనుగ్రహమున్నదని చెప్పగలను అని అంటూ ఆ జగన్మాత స్మృతి తో ఆత్మకథను ముగించారు.

దాదాపు అరవై పేజీలు గడియారం రామకృష్ణ శర్మ గారి గురించి ఎంతో మంది రాసిన వ్యాసాలు కొసమెరుపు ఈ పుస్తకానికి . కాకపోతే ఇందులో మళ్ళీ కొందరు ఆయన అభిప్రాయాల మీద వారి అభిప్రాయాలని రుద్ది ఇది ఆలా అని ఉండకూడదు. అది ఇలా అని ఉండకూడదు అని విశ్లేషించారు. కమ్యూనిస్టుల పాత్రను తక్కువ చేశారనీ ఒకాయన, ఒకటి రెండు వాక్యాలు  హిందూ తీవ్రవాదం లాగా ఉన్నదని ఇంకొకాయన రాశారు . ఎవరి వాక్స్వాతంత్య్రం వారిది అని అనుకోవాలేమో. ఎవరికి తోచింది వారు అంటారు. గడియారం వారు ఆయనకు తోచింది ఆయన రాసారు పుస్తకంలో . నాకు తోచింది నేను రాసాను ఈ పుస్తకం గురించి. అంతే!

You Might Also Like

8 Comments

  1. సమ్మెట మాధవరాజు

    ఇంత గొప్ప పుస్తకాన్ని రచించిన గడియారం రామకృష్ణ శర్మ గారు తెలంగాణ ప్రాంతము వాడు కాదనేనెపంతో యూనివర్సిటీ వారు దీన్ని పరిగణనలోకి తీసుకొని రాకపోవడం విని చాలా చింతించాను ఈ ప్రాంతీయ సంకుచిత ధోరణులు పోనంతవరకు ప్రగతి సాధ్యం కాదేమో

  2. grk paramahamsa

    ఆత్మకథలలో యిలా నిర్మొహమాటంగా, నిష్కర్షగా నిజాలను చెప్పటం (చదువరులేమనుకొంటారో తనను గురించి అని సందేహించకుండా) అందరికీ సాధ్యంకాదు.. కొంతమంది ” మహానుభావులు” చాలా నిజాలను దాచి లోకులను నమ్మించడానికి అబద్ధాలు వ్రాసుకొన్నారంటుంటారు తెలిసినవాళ్ళు. ఇది నిజం కావచ్చు. కానీ గడియారంవారు తమ “శతపత్రం” లో అనేకానేక విషయాలని, సంఘటనలని వున్నవున్నట్టుగా చెప్పడం వారి నిజాయితీకి, నిబద్ధతకు నిదర్శనం.
    60-65 ఏళ్ల తెలుగు జాతి చరిత్రను అనేక కోణాలలో దర్శింపజేసిన ప్రతిభామూర్తులు శ్రీ గడియారంవారు.ఈ తరం తెలుగు వారు తెలుసుకొని, నేర్చుకొని బ్రతకవలసిన విషయాలు కోకొల్లలు!

  3. Gannamaraju Girijamanoharababu

    ఈ ” శతపత్రము ” ( ద్వితీయ ముద్రణ ) అనుబంధం తో సహా గన్నమరాజు ఫౌండేషన్ పక్షాన ముద్రించాము .. నేను దానికి సంపాదక బాధ్యత వహించాను .. ఆ ప్రతులూ అయిపోయినవిఒకటో వ్రతం రెండో నవోదయా ( హైదరాబాదు ) వారిదగ్గర దొరికితే దొరకొచ్చు … మొదటి ముద్రణ సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి పర్యవేక్షణ లోని ” సుపథ ” పబ్లికేషన్ వారు ప్రచురించారు .. రెండో ముద్రణ లో వారికి పురస్కారం లభించినప్పుడు , వారి మరణానంతరం వారిని గురించి పెద్దల రచనలను ,ఇతర వార్తాంశాలనూ కలిపి ముద్రించాము ..

  4. V SRINIVASA RAO

    పుస్తకం ఎక్కడ దొరుకుతుందో తెలిసింది , మీ రివ్యూ చాలా వివరంగా వుంది , మనస్పూర్తిగా కృతజ్ఞతలు .. శ్రీనివాసరావు v

    1. Srujan

      Where can I get this book..if you have info please let me know

  5. V SRINIVASA RAO

    పుస్తకం ఎక్కడ దొరుకుతుందో దయ చేసి తెలుప మనవి- శ్రీనివాసరావు వి

  6. Lakshmi

    Very exciting to learn about Gadiyaram Ramakrishna Sarma garu. Thank you very much for introducing a forgotten hero. నిజంగా లెక్కల్లో, సైన్స్ లో వంద మార్కుల కోసం జీవితాలు ధారపోస్తున్న మనకి అప్పటి వాళ్ళ saahasam, నాలెడ్జ్ లోతులు, enterprising attitude, జీవితాన్నిసంపూర్ణంగా జీవించగలిగిన ధీర వ్యక్తిత్వాలు అర్ధమయ్యి చావవు. పిల్లల కి వీళ్ళందరి చరిత్రలు అందుబాటులోకి తెస్తే ఎంత బాగుండునో. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆటోమాటిక్ గా అయిపోతుంది.
    మా అమ్మమ్మ వాళ్ళ ఊరి వైపు బ్రాహ్మణులకి గ్రామ దేవతలే ఇలవేల్పులు. చింతలమ్మ కి మొదటి pooja, కొండలమ్మ కి మొదటి పొంగలి లాంటివి నాకూ తెలుసు. అందుకే పై కులాల వాళ్ళ దేవతలు వచ్చి మా దేవతలని ఊరి బయటకి తోసేశారు అనే వాదన నాకు సరిగ్గా అర్ధం కాలేదు. Somewhere along the line, మన సమాజానికి, మన నిజ చరిత్ర కి ఉన్న లింక్ మళ్ళీ ఇలాంటి పుస్తకాల వల్ల restore అయితే అసహనం కాస్త తగ్గుతుందేమో.

Leave a Reply