అమరం : ఒకనాటి మన జాతీయ పాఠ్యపుస్తకం

“అమరం అమఱితే కావ్యాలెందుAmaramకు, కాల్చనా ?” అని తెలుగులో ఒక సామెత ఉంది. అమరకోశాన్ని క్షుణ్ణంగా అభ్యసించాక సంస్కృత పదపరిజ్ఞానం కోసం పంచకావ్యాలు చదవనక్కఱలేదని దీని భావం. ఈ సామెత రావడానిక్కారణం ’అమరకోశం’ అనే ప్రాచీన సంస్కృత నిఘంటువు (dictionary). పంచకావ్యాలంటే – కాళిదాసు వ్రాసిన రఘువంశం, కుమారసంభవం, మేఘదూతం, మాఘుడు రచించిన శిశుపాలవధ, భారవి ప్రణీతమైన కిరాతార్జునీయం. బ్రిటీషువారు భారతదేశానికి రాకముందు మన ప్రాచీన గురుకుల పాఠశాలల వ్యవస్థలో పై తరగతుల (higher classes) పిల్లలకి అమరకోశంతో పాటు ఈ అయిదు పుస్తకాలూ తప్పనిసరి వాచకాలు (text books) గా నిర్దేశించబడ్డాయి. ఇవి కాక ఆంధ్రదేశ పాఠశాలల్లో మఱో అయిదు తెలుగు కావ్యాల్ని కూడా ఆంధ్ర పంచకావ్యాలుగా భావించి పిల్లల చేత చదివించేవారు. ఈ పుస్తకానికి ఈ రోజున కూడా సంప్రదాయ సాహిత్య వర్గాల్లో మంచి గిరాకీ, ఆదరణా ఉన్నాయి. మహాకవులుగా పేరుపడ్డవారంతా – అంటే గుఱ్ఱం జాషువా, శ్రీశ్రీ, విశ్వనాథ మొ|| ఆధునిక కాల కవులతో సహా అందఱూ తమ చిన్నప్పుడు అమరకోశ పాఠకులే. ఎందుకంటే అమరకోశ అభ్యాసం, ఆ పదసంపత్ పరిజ్ఞానం మన వాక్కుల్లో కలిగించే విశిష్ట పరిణామం అనన్య సామాన్యమైనది. అది ప్రసాదించే శైలి, గాంభీర్యం, పాఠకుల మనస్సు మీద కలిగించే అధికార పూర్వకమైన సమ్మోహనం నిరుపమానమైనవి. చదువుకుంటూ పోతే మనం క్రమంగా పదాలతో ప్రేమలో పడిపోతాం. మేఘగంభీరమైన కంఠస్వరానికీ, అత్యంత స్పష్టమైన తెలుగు ఉచ్చారణకీ పేరుమోసిన కీ||శే|| ఎన్.టి. రామారావుగారు కూడా తన బాల్యంలో అమరకోశాన్ని అభ్యసించే ఉంటారు. బహుశా అందుకనే ఆయన హయాంలో కొంతకాలం పాటు దాన్ని ఒక పాఠ్యపుస్తకంగా అమలు జఱిపారు. కానీ ఏ కారణం చేతనో ఆ ప్రయోగాన్ని కొనసాగించలేకపోయారు. నేను కూడా చిన్నప్పుడు కొన్నివందల అమర శ్లోకాలు భట్టీయం పట్టి తదనంతర కాలంలో సాహిత్యపరంగా మిక్కిలి లాభపడ్డాను. ఇప్పుడు మావాడిక్కూడా నేర్పిస్తున్నాను. ఒక వంద శ్లోకాల దాకా వచ్చాడు వాడు.

అట్నుంచి నఱుక్కురా !

అమరాన్ని రచించినది అమరసింహుడనే నిఘంటుకారుడు. ఆయన ఏ కాలీనుడో, ఏ ప్రాంతీయుడో, ఏ కులస్థుడో నిర్ధారించడానికి తోడ్పడే వివరాలేవీ ఆ గ్రంథంలో లేవు. కానీ బౌద్ధుడనే వ్యవహారం పరంపరాగతంగా వస్తున్నది. దాని మీద ఒక కథ కూడా చెబుతారు. భారతదేశంలో బౌద్ధం క్షీణిస్తూ వైదికమతం మళ్ళీ పుంజుకుంటున్న దశలో ఒక వైదిక రాజు తన రాజ్యంలో వైదికానికి మారడానికి ఇష్టపడని మొండిబౌద్ధు లందఱినీ నఱికించేస్తున్నాడట. అలా ఒకరోజున అలాంటివాళ్ళు 1,500 మందిని పట్టుకొని తెచ్చి నిలబెట్టి వరసా నఱికేస్తున్నారట. ఆ వరసలో మొట్టమొదటివాడు మన అమరసింహుడు. ’నఱకండి’ అని ఆజ్ఞ అయినాక తలారి అమరసింహుడి దగ్గఱికొచ్చి ఖడ్గం ఎత్తబోతే అమరసింహుడు ’అట్నుంచి నఱుక్కురా’ అని కోరాడట. తలారి ’సరే’ నని అటు వెళ్ళాక, తన వంతు వచ్చేలోపు అమరసింహుడు ఆశువుగా 1,500 శ్లోకాల్లో నామలింగానుశాసనం చెప్పాడంటారు. ’అట్నుంచి నఱుక్కురావడం’ అనే తెలుగు జాతీయం అప్పట్నుంచే ప్రచారంలోకి వచ్చిందని కూడా అంటారు. ఈ కథని విశ్వసిస్తే ఆ వైదిక రాజూ, ఈ అమరసింహుడూ – ఇద్దఱూ బహుశా తెలుగువాళ్ళే అయ్యుండాలి. అయితే ఆ వధ్యస్థలిలో అతడు చెప్పిన వందలాది శ్లోకాల్ని ఎవరు అంత ధారణాశక్తితో జ్ఞాపకం ఉంచుకొని పొల్లుపోకుండా లోకానికి వెల్లడి చేశారో తెలియదు.

దీనికి గ్రంథకర్త పెట్టిన అసలు పేరు ’నామలింగానుశాసనమ్’. కానీ అమరసింహుణ్ణి బట్టి దీనికి జనంలో అమరకోశమనే పేరు ఖాయమైంది. నామమంటే పదం. పదాల్ని వాటి లింగాలతో సహా నిర్దేశించి (అనుశాసించి) చెప్పేది కనుక రచయిత దీన్ని ’నామలింగానుశాసన’మన్నాడు. తెలుగులో పదాల లింగనిర్ధారణ బహు తేలికైనది. సంస్కృతంలో బహుకష్టమైనది. మనకి మానవపురుష, దేవతాపురుష వాచకాలన్నీ పుల్లింగం. మిహతా సృష్టి యావత్తు నపుంసక లింగం. ఇదీ మన భాషలో బండగుర్తు. వ్యాకరణపరంగా తెలుగులో స్త్రీలింగం ఉన్నప్పటికీ ఆచరణత్మకంగా మాత్రం ఉనికిలో లేనట్లే లెక్క. ఎందుకంటే ఏకవచనంలో దాన్ని నపుంసక లింగంలో విలీనం చేసేసి మాట్లాడతారు (వచ్చింది) . బహువచనంలో దాన్ని పుల్లింగంలో విలీనం చేస్తారు (వచ్చారు). మనది అర్థాన్ని ఆశ్రయించి ఏర్పడే లింగనిర్ధారణ (grammatical or semantic gender). అంటే ఆ పదం యొక్క అర్థం తెలిస్తే దాని లింగం కూడా చెప్పేస్తాం. కానీ సంస్కృతంలో మాత్రం అలా కుదఱదు. ఉదాహరణకి ’భార్య” అని అర్థమిచ్చే సంస్కృత పదాలు మూడు తీసుకుందాం. జాయా, కళత్రమ్, దారాః వీటిల్లో మొదటిది స్త్రీలింగం. రెండోది నపుంసకలింగం. మూడోది పుల్లింగం. భార్య పుల్లింగం ఎలా అవుతుందని మూర్ఛపోకండి. అదంతే ! ఆ భాష తత్త్వమే అలాంటిది. కొన్నిసార్లు లింగం మారిపోతే అర్థమే మారిపోతుంది. ఉదాహరణకి ’మిత్త్రమ్” అని నపుంసక లింగంగా వాడితే నేస్తమని అర్థం. ’మిత్త్రః’ అని పుల్లింగంగా ప్రయోగిస్తే సూర్యుడని అర్థం. కాబట్టి సంస్కృత పదాల లింగనిర్ధారణ పద్ధతికి నైఘంటిక లింగం (lexical gender) అని పేరు. అంటే దాన్ని తెలుసుకోవాలంటే ప్రయోగాన్ని బట్టి పోవాల్సిందే, లేదా నిఘంటువు చూడాల్సిందేనని భావం. మన స్వకీయమైన ఇంగితజ్ఞానం మీద ఆధారపడ్డం శుద్ధదండగ. ఈ అయోమయాన్ని నివారించడానికే అమరసింహుడు నామలింగానుశాసనాన్ని రచించాడు. అంటే దానర్థం – దీన్ని రాసేనాటికి సంస్కృతం పఠన, పాఠనాల్లో ఉంది కానీ సామాన్య ప్రజల వ్యవహారంలోంచి మటుకు జాఱిపోయి ఉండొచ్చు. అందుకే ’ఏ పదం ఏ లింగం ?’ అనే విచికిత్స ఆనాటి పండితవర్గాల్లో బయల్దేఱింది. భాష సజీవంగానే ఉంటే ఈ సందేహాలు రావు కదా !

అమరంలో అసలేముంది ?

అమరకోశాన్ని ’వర్గీకృత సంస్కృత పదజాలం’ (classified Sanskrit vocabulary) గా అభివర్ణించవచ్చు. (ఈ రకమైన పుస్తకాలు ఈ రోజుల్లో ఇంగ్లీషు భాషక్కూడా లభిస్తున్నాయి, Roget’s Thesaurus మొదలైనవి) అయితే ఇది ఈనాడు పాశ్చాత్య పద్ధతిలో రచించబడుతున్న నిఘంటువుల్లా అకారాది (alphabetical order) గానో, వచనంలోనో కాక, విషయక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ధారణ కనుగుణమైన చిన్నిచిన్ని అనుష్టుప్ శ్లోకాలుగా వ్రాయబడింది.కారణం – ఇది పాశ్చాత్య నిఘంటువుల్లా ఆచూకీ (reference) కోసం కాక, విద్యార్థులు ధారణ చేయడం కోసం, వారు భాష మీద అతితక్కువ కాలంలో పట్టు సాధించడం కోసం ఉద్దేశించబడింది. అలాగని రచయిత వక్తవ్య విషయాన్ని ఎక్కడా పల్చన చెయ్యలేదు, తగ్గించలేదు. దీన్ని అభ్యసించాక పాఠకుడికి రమారమి 10,000 (పదివేల) సంస్కృత పదాల మీద పట్టేర్పడుతుంది. ఈ కృతిని ఆద్యంతం పర్యాలోచించినప్పుడు ఇదేదో రచయిత ప్రాణసంకటావస్థలో కొట్టుమిట్టాడుతూ చెప్పిన హడావిడి పుస్తకంలా కనపడదు. అమరసింహుడికి మంచి రచనా ప్రణాళిక ఉంది. మనకి సాహిత్యభాషలో తారసపడే పదాలన్నింటినీ అతడు కొన్ని వర్గాలుగా విభజించుకొని ఒక్కొక్క వర్గానికి సంబంధించిన వస్తు-వ్యక్తి- విషయాదుల యొక్క పర్యాయపదాల్ని (synonyms) క్రమానుగతంగా శ్లోకబద్ధం చేస్తూ పోయాడు.

ఇందులో మూడు కాండలున్నాయి.

౧. ప్రథమకాండ – మంగళాచరణము, పరిభాష, స్వర్గవర్గం, వ్యోమవర్గం, దిగ్వర్గం, కాలవర్గం, ధీవర్గం, వాగ్వర్గం, శబ్దాదివర్గం, నాట్యవర్గం, పాతాళవర్గం, భోగివర్గం, నరకవర్గం, వారివర్గం అనే విభాగాలున్నాయి. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 330.

౨. ద్వితీయకాండ – భూవర్గం, పురవర్గం, శైలవర్గం, వనౌషధివర్గం, సింహాదివర్గం, మనుష్యవర్గం, బ్రహ్మవర్గం, వైశ్యవర్గం, శూద్రవర్గం. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 750.

౩. తృతీయకాండ – విశేష్యనిఘ్నవర్గం, సంకీర్ణవర్గం, నానార్థవర్గం, అవ్యయవర్గం, లింగాదిసంగ్రహవర్గం, పున్నపుంసకలింగశేషం, త్రిలింగశేషం. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 483.

కొన్ని మచ్చుతునకలు :

అమరసింహుడు వివిధ విషయాలకిచ్చిన పర్యాయ పదాలు చాలా ఆసక్తికరంగా హృద్యంగా ఉంటాయి.

దేవతల పేర్లు – అమరులు, నిర్జరులు, త్రిదశులు, విబుధులు, సురులు, సుపర్వులు, సుమనులు, ఆదితేయులు, ఋభులు, అస్వప్నులు, అమర్త్యులు, అమృతాశనులు, బర్హిర్ముఖులు, క్రతుభుక్కులు, గీర్వాణులు, బృందారకులు.

అమృతానికి – పీయూషం , సుధ.

మబ్బుల వరుస – కాదంబిని, మేఘమాల

సూర్యుడు – సూర, అర్యమన్, ఆదిత్య, ద్వాదశాత్మన్, దివాకర, భాస్కర, అహస్కర, బ్రధ్న, విభాకర, భాస్వాన్, వివస్వాన్, సప్తాశ్వ, హరిదశ్వ, ఉష్ణరశ్మి, వికర్తన, అర్క, మార్తాండ, మిహిర, అరుణ, పూషన్, ద్యుమణి, తరణి, చిత్రభాను, విభావసు, త్విషాంపతి, అహర్పతి, భాను, హంస, సహస్రాంశు, తపన , సవితా(తృ), రవి, అంశుమాలిన్, ఖద్యోత, లోకబాంధవ, తమిస్రహన్, పద్మినీవల్లభ మొ||

స్త్రీ – యోషిత్, యోషా, యోషితా, నారీ, అబలా, సీమంతినీ, వధూ, ప్రతీపదర్శినీ, వామా, వనితా, మహిళా.

అమరసింహుడు బౌద్ధుడనే అభిప్రాయంతోనో, మఱేంటో గానీ అమరకోశం తరువాత యాదవప్రకాశాచార్యుని వంటి వైదిక గురువులు అంతకంటే విపులమైన వైజయన్తీ ఇత్యాది నిఘంటువులని నిర్మించినప్పటికీ అవి అప్రసిద్ధంగానే మిగిలిపోయాయి. ఎవరూ వాటి జోలికే పోలేదు. అమరసింహుడు బౌద్ధుడైనప్పటికీ, అందఱు దేవతల కన్నా ముందు గౌతమ బుద్ధుడి నామాలు పేర్కొనడం ఒక్కటి మినహాయిస్తే, తతిమ్మా చోట్ల ఆ ఛాయలేమీ గోచరించనివ్వలేదు. వైదిక/ పౌరాణిక దేవీదేవుళ్ళ నామాలూ తదితర వివరాల నిమిత్తం రమారమి అఱవై శ్లోకాలు కేటాయించాడు. అందువల్లనే ఇది బౌద్ధుల్లో కన్నా వైదికుల (హిందువుల) లోనే ఎక్కువ ప్రాశస్త్యాన్ని పొందింది. అమరాన్ని అనుసరించి తెలుగులో పైడిపాటి లక్ష్మణకవి, అడిదం సూరకవి మొ||వారు ఆంధ్రనామసంగ్రహం, ఆంధ్రనామశేషం, సాంబనిఘంటువు మొదలైన అచ్చతెలుగు పద్యనిఘంటువుల్ని నిర్మించారు. తెలగాణ్యుడైన తూము శ్రీరామదాసకవి ఆంధ్రపదనిధానం అనే మహా నిఘంటువుని కూర్చారు. ఇంతమంది వివిధ కాలాల్లో, వివిధ ప్రాంతాల్లో ఒక వ్యక్తి ననుసరించారంటే, ఇప్పటికీ అనుసరిస్తున్నారంటే అది నిస్సంశయంగా అతని గొప్పతనానికి ఎత్తిన పతాకమే కదా !

అమరకోశానికి ఉన్న అఱవై భాష్యాల్లో అయిదు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయని ప్రకాశకులు తెలియజేస్తున్నారు.  ప్రస్తుతం సమీక్షించబడుతున్న అమరకోశ ప్రచురణ అన్నమాచార్యుల మనుమడైన తాళ్ళపాక తిరువేంకటార్యులు కూర్చిన సంస్కృతాంధ్ర మిశ్రమైన గురుబాల ప్రబోధికా వ్యాఖ్యతో సహా ముద్రించబడింది. ఏ కారణం చేతనో ఇది లోకంలో లింగాభట్టీయంగా ప్రసిద్ధి చెందింది.

(అమరకోశము – సంస్కృత పద్యనిఘంటువు ; రచయిత – అమరసింహుడు ; వ్యాఖ్యాత – తాళ్ళపాక తిరువేంకటాచార్యులు ; పుటలు – 1,000 ; ప్రచురణ – శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్, హైదరాబాద్ ; వెల – రు. 300 ; ప్రతులకు – 2-22-311/97 వెస్టర్న్ హిల్స్, కూకట్ పల్లి, హైదరాబాదు – 500072)

You Might Also Like

16 Comments

  1. ఉరుపుటూరి శ్రీనివాస్

    అమరకోశం వనరుల కోసం – https://sanskritdocuments.org/doc_z_misc_amarakosha.html

  2. Dr.B. Anil kumar

    తాడేపల్లి వారికి పాదాభివందనం
    అద్భుతముగా చెప్పారు.
    డా.బోలుగద్దె అనిల్ కుమార్
    9502568218

  3. తాడేపల్లి

    అమరకోశానికి సంబంధించిన ఆ ప్రాచీన కథని ఇటీవలి సంఘటనలకు అనువర్తించినట్లు కనిపిస్తోంది. వెంకటాద్రినాయుడుగారు దొంగల్ని చంపినది వాళ్ళని మంటల్లో వేసి కాల్చడం ద్వారా అని ఒకచోట చదివాను. వాళ్ళని అంత బీభత్సంగా వధించినందుకు ఆయన ఏదో ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నాడట.

  4. Chowdary Jampala

    సత్యం శంకరమంచి అమరావతి కథల్లో అట్నుంచి నరుక్కురావటం గురించిన కథ ఒకటి ఉంది. ఆ కథలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఒక దోపిడీ దొంగల ముఠాకు మరణదండన విధిస్తే, ముఠా నాయకుడు అట్నుంచి నరుక్కురమ్మని కోరతాడు.

  5. భావకుడన్

    తాడేపల్లిగారు
    చాలా మంచి పరిచయం. ధన్యవాదాలు. అమరకోశం pdf ఉంది నా దగ్గర. ఎవరైనా శ్లోకాలను పటిస్తూ సీడీ కాని mp3 గాని చేసి ఉంటె తెలియపరచగలరు.
    భవదీయుడు
    రాఘవేంద్ర

    1. chakravarthi

      అయ్యా,
      మీ దగ్గరున్న ఆ PDF ను దయచేసి నాకు పంపించగలరా?
      నా మెయిల్: chakravarthi.net@gmail.com

  6. రాకేశ్వర రావు

    బట్టీయం వేయఁదలచిన వారికి తెలుఁగులో అమరం

    తాడేపల్లి గారు, ఒక సారి తృతీయఖాండ చూసి అక్కడ ప్రాణిఖాండ అని వచ్చింది మధ్యలో దాన్ని సరిఁజేయగలరా?

  7. Rao Vemuri

    చాల బాగుంది. పుల్లింగం, పుంలింగం – ఈ రెండింటిలో ఏది ఒప్పో ఇన్నాళ్ళూ తెలియక ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు తెలిసింది. ధన్యవాదాలు. ఇంకా ఇటువంటి వ్యాసాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

  8. నరసింహారావు మల్లిన

    నా దగ్గఱ అమరసింహుని సంగ్రహ అమరకోశం చెన్నుభట్లవారి టీకతో ఉన్న పుస్తకం వున్నది. కాని మీ అమరకోశం పరిచయం చదివిన తరువాత భాగ్యనగరం నుంచి రాకేశ్వర గారి ద్వారా జయలక్ష్మీ పబ్లికేషన్స్ వారి పుస్తకం తెప్పించుకొని చదవటం ప్రారంభించాను. ఓహ్!! మీరు వ్రాసినట్లే దీనిని చదువుతుంటే ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. కేవలం చదవటం కాదు . ధారణ చెయ్యాలి. అప్పుడే దీని ప్రత్యేక ఉపయోగాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతాం. దీనిని ఓసారి పూర్తిగా చదివిన తర్వాత మళ్ళీ నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను. నాదగ్గఱ లక్ష్మణకవి గారి ఆంధ్రనామ సంగ్రహం కూడా ఉంది.తూము శ్రీరామదాసకవి ఆంధ్రపదనిధానం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా ?

  9. maitreyi

    thank you. I must get this book for my kids.

  10. ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

    చక్కటి సమీక్షండీ తాడేపల్లివారూ. పరిచయపునిడివి కొంచెం పెరిగినా వివిధవర్గాలని తేలికగా ఒకటీ లేదా రెండు ముక్కల్లో వివరించి ఉంటే (ఉదాహరణకి: భోగివర్గమంటే పాములగుఱించిన వర్గము, వనౌషధివర్గంలో రకరకాలైన కూరగాయలకి సంబంధించిన వివరాలు కూడా వస్తాయి) ఇంకా రమ్యంగా ఉండేదండీ.

    నమస్సులతో
    రాఘవ

  11. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

    “సంస్కృతం నేర్చుకోవాలనుకునే వారు అమరం వల్లె వేయటం తప్పనిసరా?”

    తప్పనిసరే.

    “పదాల రిఫరెన్స్ కోసం అమరం వాడలేమా?”

    వాడలేం.

    “అమరసింహుడు భోజుడి నవరత్నాలలో ఒక రత్నం అని వాదన ఉన్నట్లు విన్నాను. ఇది ఎంతవరకు నిజం?”

    నిజం కాదు. నవరత్నాలున్నది విక్రమార్కుడి ఆస్థానంలోనే గాని భోజుడు దగ్గఱ కాదు. విక్రమార్కుడి నవరత్నాలలో ఉన్న అమరసింహుడు, ఈ అమరసింహుడు ఒకే వ్యక్తి కాకపోవచ్చు. ఎందుకంటే ఆ విక్రమార్కుడు వైదిక మతాభిమాని. కాని ఇప్పుడు కొందఱు చరిత్రకారుల అభిప్రాయంలో విక్రమార్కుడి దగ్గఱ ఉన్నట్లుగా చెప్పబడుతున్న నవరత్నాలు కట్టుకతే తప్ప వాస్తవం కాదు. ఎందుకంటే ఆ నవరత్న పురుషులు వేఱువేఱు కాలాలకి చెందినవారని, వారిని అనవసరంగా ఒకే శ్లోకంలో గుదిగ్రుచ్చారని తెలుస్తున్నది.

    “ఇది ‘పుంలింగం’ కదా ?”

    పుల్లింగం సరైనదే. పుంలింగం సంధిచేయని (విసంధి) రూపం. పుల్లింగం సంధిచేసిన (సంహిత) రూపం. ఇక్కడ సంస్కృత వ్యాకరణానుసారం ‘పు’ పక్కన ఒక అర్ధానుస్వారం కూడా ఉండాలి. అదొక్కటే మిస్సింగ్.

    1. leol

      http://www.teluguthesis.com/2020/06/amarakoshamu-gurubala-prabodhika.html చూసి అమరకోశం ఊరికనే తిరగవేస్తే నాకు కలిగిన అన్ని అనుమానాలు మీ పరిచయం పై వ్యాఖ్య వల్ల తీరాయి తాడేపల్లి గారు. ఎంతో కొంత సంస్క్రతం నేర్చుకోవాలని ఆశగా ఉంది.

  12. వేణు

    తాడేపల్లి గారూ,

    ‘అమరకోశం’ గురించి మంచి వివరాలు అందించారు. ధన్యవాదాలు! ఈ వ్యాసంలో మీరు ‘పుల్లింగం’ అని రాయటం చూసి, ఆశ్చర్యం వేసింది. ఇది ‘పుంలింగం’ కదా ?

  13. రవి

    చాలా అమూల్యమయిన పుస్తకాన్ని పరిచయం చేశారు. కొన్ని సూచనలు కావాలి.

    సంస్కృతం నేర్చుకోవాలనుకునే వారు అమరం వల్లె వేయటం తప్పనిసరా?
    ఆంగ్ల నిఘంటు పద్ధతి కి అలవాటు పడి, అమరంలో ఏదైనా వెతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే, అమరం అక్షరాల వరుసలో ఉండదు. పూర్తీగా వల్లె వేయటం కాకుండా, పదాల రిఫరెన్స్ కోసం అమరం వాడలేమా? దీనికి మరేదయినా పద్ధతి ఉందా?

    ఒక చిన్న అనుమానం.
    అమర సింహుడు భోజుడి నవరత్నాలలో ఒక రత్నం అని వాదన ఉన్నట్లు విన్నాను. ఇది ఎంతవరకు నిజం?

  14. Manohar

    verygood review….
    very useful for people like me.

Leave a Reply