వానకు తడిసిన పువ్వొకటి

వ్యాసం రాసిన వారు: మూలా సుబ్రమణ్యం

[ఈ వ్యాసం మొదట తెలుగుపీపుల్.కాంలో 2005 లో 20 నవంబర్ న ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం.]

‘అనాగరీకపు అబద్ధపు గదుల్లోంచి మనిషి వెతుక్కుంటూ పోవాల్సింది ప్రకృతిలోనికే’ అని కవి ఉవాచ. పట్టణాల్లోని ఇరుకు గదుల్లో కూర్చున్న పాఠకుణ్ణి సైతం చెయ్యి పట్టుకుని తను అనుభూతి చెందిన ప్రకృతిలోనికి అలవోకగా తీసుకుపోగలడు కాబట్టే కవికి అంత ఆకర్షణ.అలా పుస్తకం చదివిన పాఠకుణ్ణి ‘వేధించే ఆలోచనల్ని ఎటో ఎగరగొట్టే వాన చినుకుల్లోకీ’ , ‘పిల్లలొచ్చి పడవలేస్తే తెరలు తెరలుగా నవ్వే కాలవల్లోకీ’, ‘తెల్లవార్లూ మంచులో తడిసే బావి పక్కన లిల్లీ పూలలోకీ’ తీసుకుపోగల పాలపర్తి ఇంద్రాణి ‘వానకు తడిసిన పువ్వొకటి’ కవితా సంకలనంపై ఒక సమీక్ష.

vanaku‘ఆయనలోని కవి చుట్టూ ఉన్న ప్రపంచంపై విరుచుకుపడేవాడు కాకపోవడమే ఆయన కవిత్వం సాధించిన మహోన్నత విజయం’ ఇస్మాయిల్‌ గారి కవిత్వాన్ని విశ్లేషిస్తూ ఎవరన్నారోగానీ ఆ మాటలు ఈమె కవిత్వానికి అతికినట్టు సరిపోతాయి. చుట్టూ ఉన్న ప్రకృతిలో తాదాత్మ్యం చెందుతూ, తనని తాను మర్చిపోయిన క్షణాలనే ఈమె కవి సమయాలుగా గుర్తు పెట్టుకుంది.‘వాన చినుకు పడగానే’, ‘పిల్లలు- కాలువ’, ,‘ప్రయాణం’ , ‘రాత్రి వీధిలో ఒంటరి’ , ‘ఓ సాయంకాలం’ మొదలైన కవితల్లో ఈ విషయాన్ని మనం గమనించవచ్చు.

తడుస్తున్న పువ్వునీ
నిండుతున్న వాగుని
ఎగురుతున్న కప్పనీ

చూస్తునే ఉండగానే
కవితలన్నీ తడిసిపోతాయి
నా మనసులోనే కరిగిపోతాయి
(వాన చినుకు పడగానే)

జారిపడుతున్న పూలనీ
జరిగిపోతున్న వలయాలనీ
చూస్తూ చూస్తూ చూస్తూ
కాళ్ళు ఊపడం మర్చిపోయి కూర్చుండిపోతాను
టీ చల్లారి తరకగట్టిన సంగతే గమనించను
(ఓ సాయం కాలం)

ఈ పాత పెంకుటిళ్ళపైని ఎగిరే మబ్బుల్లోకి చూస్తాను
ఈ కొబ్బరాకుల గలగలల్లోని పాటని పట్టుకుంటాను
ఎవరైనా దాక్కుని గమనించడం నాకిష్టం ఉండదు
(రాత్రి వీధిలో ఒంటరి)

చిరుగాలికి సైతం రెప రెపలాడే సున్నితమైన భావాలు ‘పక్కింటి అమ్మాయి’
‘ఏటో’ , ‘వాన రాకడ’, ‘పూబాల’, ‘పిల్లలు నిద్దరోతున్నారో’ మొదలైన కవితల్లో
మనకి దొరుకుతాయి.

నిమ్మతోపులో కుర్చీ వేసుకుని
నిదురించే నీడల కింద
నీ కవితల దొంతర పట్టుకుని
బద్ధకంగా ఇలా ఉండిపోనీ
(ఉండిపోనీ)

రైయ్యని ఎగిరే గాలిపటాలు
ముందుగదిలో నిశ్శబ్దంగా వేచి ఉంటాయి
(పిల్లలు నిద్దరోతున్నారు)

పక్కింటి అమాయి
కూనిరాగం తీస్తోంది
వాన ధారలు
తడిసిన మల్లెలు
(పక్కింటి అమ్మాయి)

ప్రకృతి , పిల్లలు, అనుభవాలు ,ప్రేమ ఇవే ఈమె కవితల్లో ఎక్కువగా కనిపించినా బండ, వాగు వంటి కొన్ని కవితల్లో అంతర్లీనంగా తాత్వికత కూడా గోచరిస్తుంది.

పూలు రాలి పడ్డప్పుడు
పులకరించి పోకుండా

చినుకు జారి పడ్డప్పుడు
కరిగి నీరైపోకుండా

దుమ్ము మీద పడ్డప్పుడు
చికాకు పడిపోకుండా

కనులు మూసి ఋషిలాగ
కదల కుండ
మెదల కుండ
కాలానికి లొంగకుండ..
(బండ)

ఐతే అక్కడక్కడా ‘అమ్మమ్మ కుట్టిన బొంత’, ‘సైకిలెక్కి చిన్నవాడు’, ‘అల్లరి గాలి’ మొదలైన కవితల్లో పునరుక్తి దోషాలు, రూపం కోసం భావాన్ని తాకట్టు పెట్టినట్లు కనిపించినా కవిత్వంలో ఈమె సాధించిన క్లుప్తత , సరళత నిస్సందేహంగా ఎన్నదగినవే. ఏకాంతంలో హాయిగా చదివి ఆనందించదగ్గ సున్నితమైన కవిత్వం ‘వానకు తడిసిన పువ్వొకటి’.

*********************
ఈ పుస్తకం ఈ బుక్ ను ఈమాట వారి వెబ్సైటులో ఇక్కడ చదవొచ్చు.

You Might Also Like

One Comment

  1. రవి

    .ఆహా…చిన్న గాలితెమ్మెరలా హాయిగా ఉంది సమీక్ష. ధన్యవాదాలు.

Leave a Reply