ఆలోచింపచేసే ‘నాలుగోపాదం’ – దాట్ల దేవదానం రాజు
రాసిన వారు: బొల్లోజు బాబా
(ఈ వ్యాసంలోని కొంత భాగం 18 ఏప్రిల్ నాటి ’సాక్షి’ పత్రికలో వచ్చింది. లంకె ఇక్కడ. )
*********************
వృద్దాప్యాన్ని వస్తువుగా తీసుకొని రాసే సాహిత్యంలో అధికభాగం నిరాశ, మృత్యుభీతి, దైవచింతన, ‘గతకాలమె మేలు’ వంటి భావనలు ఆక్రమించుకోవటం పరిపాటి. కానీ శ్రీ దాట్ల దేవదానం రాజు వ్రాసిన ” నాలుగో పాదం” దీర్ఘకవితలో వాటి స్థానంలో కృతజ్ఞత, జీవన వైచిత్రి, మానవజీవిత ప్రవాహగతి వంటి భావనలు ఉండి వృద్దుల పట్ల మనభాద్యతను గుర్తుచేస్తుంది.
ప్రతి ఒక్కరూ దినాంతాన ఆ సూదిబెజ్జం గుండా సాగాల్సిన వాళ్లమే. అయినప్పటికీ మనచుట్టూ ఉండే వృద్దనయనాల జలగీతాలకు హృదయం ఒక్కోసారి తలుపులు మూసేస్తుంది. బహుసా ఆధునిక జీవన ఒత్తిడులో లేక హరించుకుపోతున్న మానవత్వవిలువలో కారణాలు కావొచ్చు. బాల్యం కౌమారం యవ్వనం మాదిరిగా వార్ధక్యం కూడా ఒక దశ ఒక వాస్తవం, మనిషిని సజీవంగా భూమిలోకి తొక్కే నాలుగోపాదమూను.
మాతృగర్భంలో
జీవాణువు ఏదో అదాటునపడి
దేహదీపం వెలుగుతుంది ….
-అంటూ ఈ దీర్ఘకవిత ఒకజీవి పుట్టుకతో మొదలై బాల్య కౌమార యవ్వన దశలలోని భిన్న పార్శ్వాలను స్పృశించి ముదిమితనపు మహోదృత విశ్వరూపాన్ని కళ్లముందు నిలబెడుతుంది. మొదటిపాదం: బాల్యం ఓ చందమామ. కనపడుతూనే ఉంటుంది కానీ చేతికందదు. జీవితంలో ఎంతదూరం ప్రయాణించేసినా బాల్యపు పరిమళం ప్రతిఒక్కరికీ అపురూపమే! దీన్నే కవి ఇలా అంటాడు –
బాల్యం క్షణాలు లెక్కించుకుంటే చాలు
కన్నీటి మడుగులు ఎన్నైనా ఈదొచ్చు
ఎన్నో అడుగుల దూరానికి
ప్రధమపాదపు దశ ఇది.
రెండో పాదం: ఎన్నో సంశయాలు, సందిగ్ధాలు, వైరుధ్యాలు, ఉద్వేగాలు పెనవేసుకొన్న కౌమారదశ వర్ణన ఇలా సాగుతుంది.
బాల్య యవ్వనం మధ్య
అత్యంత కుతూహలపు వంతెన
పుటుక్కున తెగేంత
పూలదారాల కౌమారం ఇది.
మూడో పాదం: అస్థిత్వ తపన, గుర్తింపుచైతన్యం, ఆధిపత్యంకోసంపోరాటం, క్షణక్షణం మారే చిత్తప్రవృత్తుల సందోహం – వెరసి మూడోపాదమై జీవితాన్ని వెలిగించే యవ్వనకాలాన్ని
ఎగసిపడే కెరటాలసందడి
ఉద్వేగాల అంచున పరుగులు
పులకరింతల పలవరింతల
తేజోవంత ముద్రల యవ్వనకాలం …. అని మనముందు నిలుపుతాడు కవి.
ఇక నాల్గవపాదం: యవ్వనాన్ని దాటగానే వార్ధక్యపు బాల్యంలో ప్రవేశించినట్లే. వృద్దాప్యపు రెక్కల ధ్వనిని, వెలిసిపోతున్న రంగుల స్వరూపాన్ని, ముడుతలు పడుతున్న అస్థిత్వాన్ని, నర్తించి నర్తించి అలసిపోయిన ఓ జీవితపు శూన్యచూపుల్నీ అత్యద్బుతంగా కవి అక్షరీకరించారు. అలసిన మనసుకు ఒక చిన్న పలకరింపు, కాస్తంత నమ్మిక చాలునన్న విషయం ఈ క్రింది వాక్యాల్లో బంధిస్తాడు కవి.
గది తలుపులు తెరచే ఉన్నాయి
తొంగిచూసి చేతులూపి
వడివడిగా పరుగులు తీస్తావేమిరా
మంచం అంచున ….. పోనీ ముళ్లమీద కూర్చుని
ఒక కధచెప్పి నిద్రపుచ్చరా కన్నా….
మందులు మాకులు వద్దు
రోజూ వచ్చి కాసేపు మాట్లాడరా అబ్బాయ్ …
వృద్దాప్యపు ఇనపపంజరం దేహంపై దిగగానే ఇక ప్రపంచంతో సంబంధాలు తెగిపోవటం అనివార్యమౌతుంది. కుటుంబం, లోకం ప్రదర్శించే అనాదరణ మరింత కృంగదీస్తుంది. అపుడు
ప్రపంచమంతా నాలుగు గోడలుగా
సమాధాన పడిపోయి – ఏకాకిగా
పిలుపుల పలకరింపులకు …. దూరంగా
కాలందెబ్బ తగిలినట్లుంటావు …..
-అనటం నేటి వాస్తవ దృశ్యానికి పట్టిన అద్దంలా అనిపిస్తుంది.
ఈ దీర్ఘకవిత సన్నని చిరుజల్లులా మొదలయి, జడివానగా సాగి ఓ చండ భీకర కుంభవృష్టిగా మారి చదువరులను తనలోకి లాక్కొంటుంది. ప్రారంభంలో లలిత లలిత పదబంధాలతో మొదలెట్టి నెమ్మది నెమ్మదిగా ఒక గతిని, ఊపును ఇచ్చుకుంటూ చివరకు వెళ్లే కొద్దీ లోతైన పదచిత్రాల ఘాఢతతో మంచి పఠనానుభవాన్ని కలిగించటం కవి నిర్మాణ చాతుర్యం. చదవటం పూర్తయ్యాక ఒక రకమైన ప్రకంపన స్థితిలో హృదయం ఉండిపోతుంది చాలాసేపు.
కొన్ని పదచిత్రాలు
క్షణాల్ని రోజులుగా లెక్కించుకుని
అదేపనిగా ఎదురుచూస్తుంటావు
పండురాలదు బతుకు పండదు.//
వణుకుతున్న చేతుల్తో అయినా
వీడ్కోలు సంతకం పెట్టాల్సిందే//
చర్మం మీద
మైనపుపొరలా
ఘనీభవించిన దిగులు//
ఓడిన చీమూ నెత్తురు//
మళ్లీ మళ్లీ చెపుతున్నా
కాసింత సమయాన్ని కేటాయించు
వాళ్ల సమక్షాన్ని ప్రేమించు
కనీసం ఊరడించు. ….. నాలుగో పాదం సారాంశవాక్యమిది. మానవత్వానికి తన బాధ్యతను గుర్తుచేస్తూ ఓ కవి చెప్పిన ఈ దీర్ఘకవిత చివరి మాట. వృద్దులపట్ల ఈ సమాజానికున్న దృక్పధాన్ని ప్రశ్నిస్తూ సందర్భోచితంగా వచ్చిన ఒక చక్కని రచన.
ఈ పుస్తకానికి శ్రీ మునెపల్లి రాజు, శ్రీ గుడిపూడి లు ముందు మాటలు వ్రాసారు. బాపు గీసిన ముఖచిత్రం ఆలోచింపచేసేలా ఉంది. ఈ పుస్తకం ” నాన్ గామ్ పాదమ్” పేరుతో తమిళం లోకి అనువదింపబడింది.
కాపీలకు:
విశాలాంద్ర, నవోదయా బుక్ షాపులలో సంప్రదించవచ్చు.
వెల: 40 రూపాయలు
రచయిత మెయిల్: datla.devadanamraju@yahoo.com
Shanmukha Charya
క్షణాల్ని రోజులుగా లెక్కించుకుని
అదేపనిగా ఎదురుచూస్తుంటావు
పండురాలదు బతుకు పండదు.//
వణుకుతున్న చేతుల్తో అయినా
వీడ్కోలు సంతకం పెట్టాల్సిందే//
చర్మం మీద
మైనపుపొరలా
ఘనీభవించిన దిగులు//
మృత్యువు ముందు
ఓడిన చీమూ నెత్తురు//
మళ్లీ మళ్లీ చెపుతున్నా
కాసింత సమయాన్ని కేటాయించు
వాళ్ల సమక్షాన్ని ప్రేమించు
కనీసం ఊరడించు. …
@@@ప్రస్తుతం , మా తల్లి గారి స్తితి , యెంత చక్కగా చెప్పారు తనొక అర్ధాంగి , మాతృ మూర్తి ,, సోదరి,, అయినా, చివరి రోజుల్లో అలా అనారోగ్యం లో పది వుండటం చాల బాధ పడుతున్నారు
rayraj
బావుంది. నిజం! వృద్దాప్య సమస్య గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన సమయమిది.
prem
Baagundi