మిత్తవ – మంచికంటి కథలు

రాసిన వారు: అరి సీతారామయ్య
(April 2008 లో DTLC వారి మీటింగ్లో జరిగిన చర్చ)

మంచికంటి రాసిన “మిత్తవ” ఇక్కడ అందరికీ తెలిసిన కథే. 2003 తానా కథల పోటీలో బహుమతి గెల్చుకున్న కథ. ఈ కథతోబాటు 2003-2006 మధ్యకాలంలో మంచికంటి రాసిన 12 కథలను క్రాంతి ప్రచురణలు (ఒంగోలు) వారు మిత్తవ పేరుతో ఒక సంకలనంగా ప్రచురించారు.

ఈ కథలు చదువుతుంటే ఒంగోలు ప్రాంతం పల్లెటూళ్ళల్లో ఉన్నట్లే ఉంటుంది. జీవితాన్ని దగ్గరనుంచి చూసి అనుభవించినవన్నీ తన కథల్లో నిక్షిప్తం చేస్తున్నాడు మంచికంటి అన్నాడు కాట్రగడ్డ దయానంద్, ముందు మాటలో.

గత పది సంవత్సరాల్లో చిన్నచిన్న గ్రామాల్లో ప్రజాజీవితంలో వచ్చిన మార్పులు ఈ కథల్లో కళ్ళకు కట్టినట్టు కనపడతాయి. బతుకుదెరువుకోసం కూలిపనికెళ్ళాల్సొచ్చిన పసిపిల్ల… పొలాలమ్ముకుని వేరేవృత్తుల్లోకి దిగాలనుకుంటున్న బిడ్దలతో భూమితో సంబంధం తెగ్గొట్టుకోలేక పోరాడుతున్న పెద్దవాళ్ళూ… దరిద్రంకంటే రెండోపెళ్ళివాడితో సంబంధమే మంచిదని కూతురుకు నచ్చజెప్తున్న తల్లీ… వ్యవసాయం చేసి బ్రతకలేక, ఎవ్వరికీ చెప్పుకోలేక, అర్ధరాత్రి భార్యాబిడ్డలతో సొంత వూరొదలిపెట్టి వెళ్తున్న రైతూ… చితికిపోతున్న కుటుంబాల గొడ్డూగోదలను కాజెయ్యాలని పన్నాగాలు పన్నే దళారులూ… పొగాకు కంపెనీలో సూపర్వైజరు బెడద ఒకవైపూ, ఇంట్లో భర్త అనుమానాల వేధింపు మరోవైపూ – వీటితో సతమతమౌతున్న పల్లెటూరి పడుచూ… వీరి జీవితాలు మంచికంటి కథల్లోని కొన్ని కథాచిత్రాలు.

మంచికంటి శక్తి అంతా అతని భాషే. అతను ఎవరిమధ్య జీవిస్తున్నాడో వాళ్ళ భాష అన్నాడు శివారెడ్డి, ముందుమాటలో. కొండకట్టెలూ కోనేటినీళ్ళూ తెచ్చినట్టు తెగ నీలుగుతాడు. నేను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు అంటుంటాడు. పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా… గోతికాడ గుంటనక్కలాగా కాసుక్కూర్చుని… రోలుబోయి మద్దెలతో మొరబెట్టుకున్నట్టుంది. ఏమీలేనమ్మకు ఏడుపుల శృంగారము, కలిగినమ్మకు కడుపుల శృంగారము. మట్టిమీద బెమ మట్టిలో పుట్టినోళ్ళకే తెలుస్తదిరా. ఇంటికి ఆవ కొలతకి తవ్వ కావాల. మంత్రాలకి చింతకాయలు రాలటానికి… కర్రా ఇరగనియ్యవు, పామూ సావనియ్యవు. మోచేతినీళ్ళు తాగిరావాలా… మూతులునాకే మాటలు. మనుషులకి గాక మానులకొస్తయ్యా కష్టాలు.

పుస్తకం నిండా ఇలాంటి భాష చదివి ఎన్నాళ్ళయిందో!

ప్రతులకు:All major booksellers in AP and
Manchikanti
Beach Road,
Kothapatnam,
AP 523 286
India
Price: Rs. 60.

గమనిక :ఈ వ్యాసం కాపీరైట్లు DTLC వారివి.

You Might Also Like

One Comment

  1. జె. యు. బి. వి. ప్రసాద్

    ఈ “మిత్తవ” కధ నేను 2003 లో చదివాను. అప్పుడు ఒక చిన్న అభిప్రాయం రాసి, రచ్చబండలో పోస్టు చేశాను. ఇప్పుడు అదే అభిప్రాయం, ఇక్కడ పోస్టు చేస్తున్నాను. అచ్చు తప్పులు దిద్దడం, కామాలు పెట్టడం తప్ప, ఏమీ మార్చ లేదు ఇప్పుడు. ఇప్పుడు ఆ కధ గానీ, అందులో విషయాలు గానీ, ఏవీ గుర్తు లేవు.
    ====================================================================

    కథ పేరు…… “ మిత్తవ”
    రచయిత …… “మంచికంటి వెంకటేశ్వరరెడ్డి”

    కథ: భయంకరమైన కరువు వల్లా, నీటి ఎద్దడి వల్లా, భర్త ఇల్లు వదిలి పోతే, ఒక పేద స్త్రీ, పిల్లలతో పుట్టింటికి చేరి, కష్టాలు పడి, పిల్లల్ని చంపి, తను ఆత్మహత్య చేసుకుంటుంది.

    కొన్ని మంచి విషయాలు
    ————–

    1. కరువు కాటకాల వల్ల పేద ప్రజలు ఎన్నెన్ని కష్టాలు పడతారో రచయిత చిత్రీకరించారు.
    2. అవసరం వున్నంత కాలం మనుషుల్ని వాడుకుని, అవసరం తీరేక ఎలా వదిలించుకుందామని చూస్తారో కూడా చెప్తుంది ఈ కథ.
    3. చాదస్తం, మనుషుల మూర్ఖత్వాన్ని వైద్యం విషయంలో ఎలా చూపిస్తారో కూడా చెప్తుంది ఈ కథ.

    కొన్ని మంచి కాని విషయలు
    —————-

    1. “మిత్తవ” అన్న పదానికి అర్థం తెలియలేదు ముందర. కథ చివరిలోకి వచ్చాక, మిత్తవ అంటే మృత్యువు అని అర్థం అయింది. అప్పుడు, చిన్నప్పుడు చదువుకున్న తెలుగు పాఠాలు గుర్తొచ్చాయి. మృత్యువు – ‘ప్రకృతీ’, మిత్తి – ‘వికృతీ’. ఈ “మిత్తి” అన్న పదం లోంచి పుట్టుకొచ్చిన మాట అన్న మాట “మిత్తవ” అంటే. ఈ విషయం ముందే అర్థం అయితే బాగుణ్ణనిపించింది. ఈ విషయం కూడా తప్పయితే అది నా ఖర్మ. నాలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఇంకెంత మంది వున్నారో అని కూడా అనిపించింది.

    2. ఎన్నో కష్టాలు పడి, కుటుంబ హత్యలకీ, ఆత్మహత్యలకీ దారి తీసిన పాత్ర కథ ఇది. ఏమీ అభివృద్ధికరంగా లేదు ఈ కథ. పుట్టింట్లో చేసిన చాకిరీ బయట ఎక్కడ చేసినా, తల్లీ, పిల్లల కడుపులు నిండక పోవు. అదే ఈ తల్లికి బయట కష్ట పడి (అంటే బాగా చదువుకునీ, బయట ఎదో జీవనాధారం వెతుక్కోలేక దౌర్భాగ్యపు మొగుళ్ళకి బానిసల్లా పడివుండే ఆడవాళ్ళ లాగా) పని చేయడం రాదా అంటే, అదీ కాదు. జీవితం అంతా కష్ట పడి పని చేస్తూనే వుంది ఈ మనిషి. పుట్టింటి నుంచీ వెళ్ళిపోయి, ఎక్కడో కాయకష్టం చేసుకుంటూ, పిల్లలని బతికించుకున్నట్లు చూపడమే అభివృద్ధికరమైన విషయం. అప్పుడు కథ పేరు మారిపోతుంది లెండి. కథ పేరు కోసం పాత్రలని చంపడం అన్న మాట.

    3. “మిత్తవ” అని కథకి పేరు పెట్టినంత మాత్రాన మనుషులని ఎడా పెడా చంపెయ్యనక్కర లేదు. ఆఖరిలో ముసలావిడ పరిగెత్తుతూ రాయి తగిలి పడి పోయి చచ్చిపోవడం చాలా కృతకంగా వుంది. ఈ చావు, కథకి గానీ, రచయిత చెప్పదలుచుకున్న విషయానికి గానీ, అవసరం లేదు. ఈ కథకి “చావులు” అని పేరు పెడ్తే, ఇంకా సరి పోయేది.

    4. బొమ్మ కథకి తగినట్టు లేదు. తప్పుగా వుంది. “మిత్తవ” కథ కూడా అందరికీ దుఃఖాంతం. ఆ మనిషి పిల్లలని తీసుకుని, పుట్టిల్లు వదిలేసి, ఎక్కడో కాయకష్టం చేసి, పిల్లలని బతికించుకుంటుందేమో నని ఆశ పడ్డ వాళ్ళ ఆశలను నేల రాసేస్తూ, వాళ్ళని చంపేశారు రచయిత. వాళ్ళకి తోడుగా, ఒక ముసలావిడని కూడా కలంతో చంపేశారు రచయిత. “మిత్తవ” అనే పేరు కథకి పెట్టుకున్నాక ఆ మాత్రం చావులన్నా కథలో లేకపోతే ఏం బావుంటుందీ బొత్తిగా?

    — జె. యు. బి. వి. ప్రసాద్

Leave a Reply