రక్త స్పర్శ – “శారద” కథల సంకలనం

సమీక్షకుడు: మద్దిపాటి కృష్ణారావు.

[2005 సెప్టెంబరు 24 వ తేదీన DTLC (Detroit Telugu Literary Club, USA) వారి మీటింగులో జరిగిన చర్చ సందర్భంగా రాసిన సమీక్ష]

*****************************************************************************************
1936 లో తన పన్నెండవ యేట బ్రతుకుతెరువు కోసం తండ్రితో ప్రస్తుత తమిళనాడులోని పుదుక్కోటై నుండి తెనాలి వచ్చిన ఎస్. నటరాజన్ “శారద” అనే పేరుతో వ్రాసిన కథల సంకలనం ఈ రక్తస్పర్శ. రక్తస్పర్శ కథతో ప్రారంభమై మొత్తం 35 కథలు గల ఈ 194 పేజీల సంకలనాన్ని ప్రచురించిన వారు తెనాలి శారద సాహిత్య వేదిక సంస్థ.

sarada2కథలనన్నిటినీ సమగ్రంగా పరిశీలిస్తే వస్తు విషయంలో దేనికదే విలక్షణమైన కథ. ఏ రెండు కథలూ ఒకే మూసలో పోసినట్టుండకపోవడం ఈ రచయిత ప్రత్యేకత. ఎన్నుకున్న వస్తువులన్నీ సామాన్య ప్రజల జీవితం చుట్టూ పరిభ్రమించడమే కాక వాటి పరిధి కూడా చాలా విశాలమైంది. సత్రంలో వింతప్రేమ దగ్గర్నుంచి పరస్పరం మోసగించుకున్న వ్యభిచారులు చంద్రమతి హరిశ్చంద్రుడు వరకు, దైవత్వం మూర్తీభవించిన రాజారాం జీవితసారం నుండి గురివింద చందంగా ప్రవర్తించిన సంస్కార హీనుడు వరకు, వింతలోకం లోని ఆదర్శాల వెల్లువ నుండి ఆంధ్రా రిపబ్లిక్‌ను కోరికల గుర్రాలెక్కించడం వరకు, ఎక్కడా తిరిగి చెప్పకుండా చెప్పిన భిన్న వస్తువులే. అన్ని కథల్లోని పాత్రలు (ఆఖరికి ఊహాలోకాల్లో నడిపిన కథల్లో కూడా) మనల్నో మన ప్రక్కవారినో అనుక్షణం తలపిస్తూనే ఉంటాయి. స్త్రీ పాత్ర చిత్రణలో చలాన్ని గుర్తుకు తెచ్చినా (రచయితపై చలం, కొకుల ప్రభావం సంకలనంలో పొందుపరచిన అభిప్రాయాల్లో చదవవచ్చు), శారద స్త్రీ పాత్రలు చలం పాత్రలకంటే చాలా పాజిటివ్ అనిపిస్తాయి. విప్లవ ధోరణి కంటే క్రియాశీలత స్పష్టంగా కనిపించడమే అందుకు కారణమేమో. రక్తస్పర్శలో అనసూయ తమ్ముడికిచ్చిన సమాధానంలోను, మరలోచక్రం లోని స్త్రీ ఆత్మకథలోను, సంస్కారహీనుడులో కామేశ్వరి తుది నిర్ణయంలోను, ఇలా ప్రతీ స్త్రీ పాత్రలోను ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యవహార్తలే కనిపిస్తారు.

చక్కని శైలిలో వ్రాసిన ఈ కథలన్నిటిలోనూ శిల్పం మాత్రం చాలా పేలవంగా ఉంది. కొత్తవార్త, గెరిల్లా గోవిందు లాంటి కథల్లో వస్తువు కూడా అంతంత మాత్రమే. ఎక్కడొ ఒకటి రెండు కథల్లో మినహాయించి, ప్రతీ కథా ఇంచుమించు మొదలు పెట్టగానే ఏం జరుగుతుందో, ఎలా ముగుస్తుందో కూడా చెప్పెయ్యొచ్చు. అయితే చక్కటి భాష, శైలి, రచయిత సూక్ష్మ పరిశీలన కథను చివరిదాకా చదివింపజేస్తాయి. రచయిత ఊహాశక్తికి అద్దంపట్టే వింతలోకం, కోరికలే గుర్రాలైతే వంటి కథలు కొందరికి అమితంగా నచ్చితే, మరి కొందరికి అసలు నచ్చలేదు.

ఈ సంకలనంలో ఉన్నవి అన్నీ కథలే కాదు, నాలుగు రాజకీయ వ్యంగ్య వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. గొప్పవాడి భార్య చదువుతున్నప్పుడు ఒక ప్రక్క వ్యంగ్యానికి ముగ్ధులవుతూ కూడా అందులోని విషాదాన్ని గుర్తించకుండా ఉండలేం. సంస్కర్త, సామాన్యుడి సంభాషణ (సంస్కరణ) నిజంగా సార్వకాలికమే.

ఇంత చక్కటి సాహిత్యాన్ని సృష్టించిన రచయిత జీవితం గురించి తెలిసినప్పుడు ఆశ్చర్యపడక తప్పదు. నటరాజన్ జీవితకాలం కేవలం 31 సంవత్సరాలు (జననం:1924, మరణం: 1955). అందులో, పుట్టింది మొదలు పన్నెండేళ్ళ వరకు తమిళ ప్రాంతంలోనే పెరిగాడు. అంటే తన జీవితపు ఉత్తరార్ధంలో కేవలం 19 సంవత్సరాల్లో మాత్రమే తెలుగు నేర్చుకునే అవకాశం, వ్రాయడం జరిగాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పెరిగాడు కాబట్టి కాస్తో, కూస్తో తెలుగు తెలుసనుకున్నా, ఇంత చక్కటి భాషా, శైలి అలవడే అవకాశాలు, వయసూ కూడా పుదుక్కోటై లో ఉండవనే చెప్పవచ్చు. అదీగాక, తండ్రితో తెనాలి వచ్చింది ఏ వ్యాపారానికో, విలాస జీవితానికో కాదు, పొట్టకూటి కోసం. తెనాలిలో గడిపిన జీవితమంతా కూడా హోటల్ పనివాడిగా! నోటికి కంచానికి ఉన్న దూరాన్ని అధిగమించడానికి నిత్యం ప్రయత్నిస్తూనే, పరాయి భాషని నేర్చుకుని, ఇంత చక్కటి సాహిత్యాన్ని సృష్టించగలగడం అతని మేధాశక్తికి, పట్టుదలకు, అవిరళ కృషికి నిదర్శనాలు. ప్రతి కథలోను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని క్షుణ్ణంగా చూపించగలగడం అతని పరిశీలనాశక్తిని ఋజువు చేస్తుంది. కథలన్నీ చదివితే ఆనాటి ఆంధ్రా పారిస్ సామాన్య జీవితం మన కళ్ళముందు ప్రత్యక్షమవుతుంది.
********************************************************************
గమనిక :ఈ వ్యాసం కాపీరైట్లు DTLC వారివి.
అలాగే, ముఖచిత్రం పంపినందుకు అరి సీతారామయ్య గారికి ధన్యవాదాలు. ఈ పుస్తకం ప్రచురణ వివరాలు సంపాదించడానికి వెబ్లో ప్రయత్నించినా దొరకలేదు. ఇది చదివినవారికి తెలిసిన పక్షంలో editor@pustakam.net కు వివరాలను పంపగలరు.
– పుస్తకం.నెట్ బృందం.

You Might Also Like

9 Comments

  1. VEERAIAH

    sarada kadalu rakthasparsalo cheppinavi 35 maathrame, avi kakunda chalakadalu nati sahitya pathrikalu “telugu swathanthra, jyothi, abudaya, rerani, prajasakthi etc., Jyothi pathrikalu 1948 to 1955 pathrikalu ekkadaina dorukuthunte dayachesi samaacharam evvagalaru.

    K.Veeraiah, Research Scholar. Topic: “Sarada Rachanalu anuseelana”

  2. పుస్తకం » Blog Archive » జీవిత వాస్తవాల శారద

    […] శారద కథల సంకలనం – రక్తస్పర్శ పై పుస్తకం.నెట్ లో ఇదివరలో వచ్చిన సమీక్ష ఇక్కడ. […]

    1. Deepu

      I want this book pls tell me the details how to by this book

  3. మాలతి

    రక్తస్ఫర్శ సంకలనం నవోదయ, విజయవాడ,లోనూ శారదకథల సంకలనం (1998)విశాలాంధ్ర, హైదరాబాదులోనూ దొరుకుతాయని ప్రచురించారు వారు. ప్రయత్నించి చూడగలరు.

  4. చౌదరి జంపాల

    @రావు పంగనామముల:
    oka padELLa kritaM (raktasparSa punarmudaNa poMdina okaTireMDELLaki) Saarada navalalu oka saMpuTaMgaa punarmudriMcabaDDaayi.

  5. రావు పంగనామముల

    మరో నవల “అపస్వరాలు” కూడా అదేపత్రికలో వచ్చింది.

  6. రావు పంగనామముల

    ఇతను వ్రాసిన ‘మంచీ-చెడు’ ఆంధ్ర సచిత్రవారపత్రికలో 1955 లో అనుకుంటాను సీరియల్ గా ప్రచురింపబడి చాలామంది పాఠకుల మన్ననలను పొందింది. తెనాలి-విజయవాడలలోని హోటళ్ళలో సర్వరుగా పనిచేస్తూ మాతృభాషగాని తెలుగులో ఆయన చేసిన కృషి అర్ధంతరంగా అకాలమృతి కారణంగా ఆగిపోయింది. ఈ కథల లాగానే ఇతర రచనలుకూడ మళ్ళీ వెలుగులోకి తీసుకొని వచ్చేప్రయత్నమేమైనా జరుగుతున్నదేమో తెలుసుకోవాలని వున్నది.

  7. jaganmohan

    I felt very happy to see details about writer Sarada’s book.I read 3 of his novels. He is really good at writting.

Leave a Reply