నిర్వచనం – ఘంటశాల నిర్మల
సమీక్షకుడు – మద్దిపాటి కృష్ణారావు
[2004 ఆగస్టు 21 వ తేదీన DTLC (Detroit Telugu Literary Club, USA) లో జరిగిన చర్చ సందర్భంగా రాసిన సమీక్ష]
*******************************************************************
ఘంటశాల నిర్మల గారు 1978 నుండి 2000 వరకు వ్రాసిన కవితలను నిర్వచనం అనే పేరుతో 2002 లో సంకలనంగా ప్రచురించారు. ఇందులో మొత్తం 47 కవితలున్నాయి. ఎవరైనా ముందుమాట లాంటిదేదైనా వ్రాసి పుస్తకాన్ని పరిచయం చెయ్యడం మాట ఎలా ఉన్నా, కనీసం రచయిత్రి గురించి నాలుగు వాక్యాలైనా లేవు! రచయిత్రి స్వంతంగా ప్రచురించిన (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి సహకారంతో) పుస్తకం కావడం వలన తనగురించి తానే చెప్పుకోవడం ఏం బాగుంటుందనుకున్నారో ఏమో?!
కవిత్వానికి ముఖ్య లక్షణం భావ సాంద్రత అయితే, పాఠకులను ఆయా స్థల కాల పరిస్థితుల్లోకి మంత్రముగ్ధుల్లా నడిపించ గలగడం మంచి రచనకు నిదర్శనం అయితే, రచనల్లోని అనుభవాలు రచయితవి తప్ప వేరొకరివి కావడానికి వీల్లేదు అనిపించడం రచయిత సూక్ష్మ పరిశీలనా శక్తికి అద్దం పడుతుంది అనుకుంటే, ఇవన్నీ నిర్మల గారి కవిత్వానికి సరిగ్గా సరిపోతాయి. వీరి కవిత్వంలో జఠిలమైన పదాల మోతాదు కొంచెం ఎక్కువగా ఉందనిపించినా, భాష ప్రయోగంలోను, వినియోగంలోను అప్రస్తుతాల్ని మాత్రం ఎంచలేం. సాధారణంగా రచయితలు తాము వ్రాసిన కవితలన్నిటిలోకీ తమ హృదయాలకు దగ్గరగా ఉండే వస్తువులపై అల్లిన కవితల్లో ఉన్న పటిష్ఠత, పరిపక్వత మిగిలిన వాటిల్లో కనిపించదు. ఇది అత్యంత సహజం. అందరికీ అన్నీ నచ్చాలని లేదుగదా! కానీ నిర్మల గారి సంకలనంలోని కవితలన్నీ చదివేశాక ఈవిణ్ణి ఒక మూసలో పోసో, ఒక చట్రంలో బిగించేసో చేతులు దులిపేసుకోవడం మనవల్ల కాదు. ఉదాహరణకు చూడండి –
ఫెమినిస్టు మానిఫెస్టో తయారు చేస్తూ తీరా పోరే మొదలయితే నష్టానికి బాధ్యులం మేం కాదు సుమా! అని హెచ్చరించగలిగిన వీరే నవ్వుల్ని బియ్యబ్బంతుల్లా విరజిమ్మ గలరు కూడా. అలాగే రోడ్డు ప్రమాదంలో మరణించిన బాలుణ్ణి చూసి పరితపించి రూపాయికోసం అడ్డంగా పరిగెత్తే పిల్లల్ని తయారుచేసే మనమూలాలనిండా తప్పులేనని ఎలుగెత్తి చాటగలరు, నిస్సారంగా నడుస్తున్న సంసారాల్లోని దొంగాటను చిరునవ్వే పెదాల వెనక చిట్లే నొసల ముళ్ళపూలను గుర్తించగలరు, ఎ కాల్‌గళ్స్ మోనోలాగ్లో అధమత్వానికి ఆవలను చూడగలరు, నిజ గీతం తో స్వచ్చమైన ప్రేమకు హృదయావిష్కరణ చెయ్యగలరు, అంతలోనే రంగుల చీకటిలో వస్తు వినియోగ ప్రచారంపై వ్యంగోక్తులూ విసరగలరు. శుద్ధ యదార్ధవాదిని స్వప్నకీలల పుటం వేసి అవ్యక్తంగానే వ్యక్తం చెయ్యగలరు. చెట్లను నిర్లక్ష్యం చెయ్యడంపై రేపటి పాపాయి ఉయ్యాలకు చేవగల కర్ర కావాలి అని చెప్పడంలో భావ సాంద్రత హరిత పత్రంలో కనిపిస్తుంది. ఇన్ని వైవిధ్యమైన వస్తువుల మీద అన్నిటిపైనా సమంగా సూక్ష్మమైన అవగాహనతోను, సరళమైన భాషతోను, సెలయేటి ప్రవాహపు శైలితోను కవిత చెప్పగలగడం నిర్మలగారి బహుముఖ ప్రతిభను చాటుతుంది. అయితే, ప్రతీ కవితలోనూ విషాద ఛాయలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మొదట్లో వ్రాసిన నాలుగు కవితలు (స్వప్న పాత్ర, ఫీనిక్స్…లా, ఛ…లికాలం, బిందుమాధురి) 1989 లో వ్రాసిన పాపాయి బడికెడితే… ల్లో తప్ప మిగిలిన కవితలన్నిటిలోనూ వాస్తవికత గుర్తుకు తెచ్చే విషాదం దోబూచులాడుతూనే ఉంటుంది.
చేదు నిజం బాధాకరమేగదా మరి! తీసుకున్న ప్రతి వస్తువుతోను మమేకమై పరిశీలించడం నిర్మల గారి కవిత్వంలోని ప్రత్యేకత. అందుకేనేమో, ఈ కవితలన్నీ రచయిత్రి స్వానుభవాలే అన్న అభిప్రాయం చాలా మందికి కలిగింది. కావచ్చు, కాక పోవచ్చు. అలంకరించుకుని ప్రేమతో ఎదురు చూసే భార్యకు బయటెక్కడో నిశి జాగరణ చేసి వచ్చి అసలు ఎదురుచూపులెందుకన్న ప్రశ్నల చురకత్తి లాంటి పాత పాట చదివినప్పుడు, బాలసర్స్వతికి పాటపువ్వు చాటున జ్ఞాపకం హఠాత్తుగా గ్రామఫోను ముల్లు దిగిందని వివరించినప్పుడు, అమ్మ చెంపలమీద చిట్లిన కన్నీటి బిందువుల్లో తలక్రిందులుగా యాక్సిడెంట్‌లో శవమైన కొడుకుని చూపించినప్పుడు ఇవి కేవలం ఊహలేనని అనడం మాత్రం చాలా కష్టం!
కవిత్వంపై ప్రత్యేకమైన మక్కువ ఉన్నా లేకపోయినా చదివించి, పలవరింపజేసి, మళ్ళీ చదివించగల ఈ కవితా సంకలనంలో, స్త్రీవాదులకు, ప్రపంచీకరణ వ్యధులకు, సాధారణ సంసారులకు, సంసార బాధితులకు, పర్యావరణ పరిరక్షకులకు, ప్రేమికులకు, వియోగులకు, మాన్యులకు, సామాన్యులకు కూడా కావలసినన్ని నిర్వచనాలు, నిర్మల వచనాలూ ఉన్నాయి.
*******************************************************************
ఈ వ్యాసం కాపీరైట్లు DTLC వారివి.
Leave a Reply