తెలుగుకథతో నా తొలి పరిచయం

ఫోకస్ తెలుగు కథ అన్నప్పుడే అనుకున్నాను – దీనికి రాసేటన్ని తెలుగు కథలు నేను చదివుండను, లైట్ తీస్కుందాం అని.
నేను అనుకున్నట్లే, నచ్చిన కథేమిటి? అని ఆలోచించిన ప్రతిసారీ నాకు వేరే భాష కథలు గుర్తొచ్చేవి. వేరే భాష కథల తెలుగు అనువాదాలు కూడానూ. 🙂 ఆ మధ్యన చదివిన “శ్రీపతి” గారి “సత్యజిత్ రాయ్ ఎవరు?” అన్న సంకలనంలోని కథ “నక్సలైట్ రాత్రులు” నాకు అప్పట్లో పదే పదే గుర్తొచ్చిన కథ. అయితే, ఇప్పుడు నేను రాయబోయేది దాని గురించి కాదు. నాకు తెలుగు కథ అంటే ఇది అని పరిచయం చేసిన మనుషుల కథ(ల) గురించి.

నాకు తెలుగు కథ పరిచయమైంది చిన్నపిల్లల కథలతోనే. తెలుగులో రాసిన కథలు పరిచయమైనవి కూడా రష్యన్ అనువాదాలైన పిల్లల కథలతోనే. వయసు పెరిగేకొద్దీ, కథలంటే ఉన్న మక్కువ కొద్దీ, ఇతర భాషల కథల అనువాదాలు – ప్రధానంగా రష్యన్, ఫ్రెంచ్ కథల ఆంగ్లానువాదాలు – చదవడం మొదలుపెట్టి, Chekov జపంలో పడ్డాను కానీ, మనకీ కథలున్నాయనీ, కథకులున్నారనీ నేను గుర్తించలేదు. నా సుధీర్ఘ నిద్ర నుండి నన్ను లేపి – మామూలుగా కాదు, ఓ కుండెడు నీళ్ళు పోసి లేపేసినవి, నన్ను ఆ నీళ్ళలో వానావానావల్లప్పా ఆడించినవీ – శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి కథలు, కొ.కు. కథలు, జరూక్ శాస్త్రి కథలు. (నాకు గుర్తున్నంతవరకూ ఇవే నేను చదివిన తొలి “తెలుగు” కథలు)

వీటిల్లో మొదట శ్రీపాద వారి కథల గురించి చెబుతాను – నాకెంత ఇష్టమంటే, మా ఇంట్లో ఉన్నవి అన్నీ ప్రతి కథా ఓ పదిసార్లైనా చదివేసి ఉంటాను. భలే ఎంటర్టైనింగ్. ఆ భాష, ఆ హాస్యం – నాకు భలే ఇష్టం. అలాగే, కొన్ని కథల్లో చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఊరూ, ఇల్లూ మారి – ఈ కథలన్నీ చదివి చాలారోజులౌతోంది కానీ, మామూలుగా అయితే, ఏమీ తోచని ఏ రాత్రైనా నా బెడ్ టైమ్ రీడింగ్ – “వడ్లగింజలు” , “ఇల్లుపట్టిన వెధవాడపడుచు”, “తాపీమేస్త్రీ…దీక్షితులుబియే” (పేరు గుర్తులేదు), “కలుపు మొక్కలు”, “ఇలాంటి తవ్వాయి వస్తే”, ’షట్కర్మయుక్తా”, “కీలెరిగిన వాత”, “అరికాళ్ళకింద మంటలు”, “గూడుమారిన కొత్తరికం”, “యావజ్జీవం హోష్యామి”,”కన్యాకాలే! యత్నా ద్వరితా!” – ఒకటా రెండా – శ్రీపాద వారి కథలు ఏవి కనబడితే అవి. ఎన్నిసార్లు అవి చదివుతూ పడుకోలేదో, ఎన్నిసార్లు ఆ భాష చదువుతూ, దాని అందానికి అబ్బురపడుతూ, దానిలోని హాస్యానికి నవ్వుకుంటూ పడుకోలేదో!

తరువాత కొ.కు కథలు – నా బెడ్ టైమ్ రీడింగ్ కాదు. డేటైమ్ రీడింగ్. పదిహేడేళ్ళప్పుడు మొదటిసారి చదివాను. నాకో కొత్త ప్రపంచంలాగా అనిపించింది. కథల్లో చాలా ఆలోచనలు, మనలో కలిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఆ కథలోనే దొరికేసినట్లు అనిపించేది. కథ రాసిన పద్ధతికి నాకు కొ.కు. నచ్చేశారు అని నేను అనలేను. కానీ, కథల వల్ల నాకు కలిగిన ఎడ్యుకేషన్ కు నచ్చారు. తరువాతి కాలంలో ఆయన వ్యాసాలనీ, ఉత్తరాలనీ – ఆయనేది రాస్తే దాన్ని, దొరికింది దొరికినట్లు నేను చదివేంత అభిమానం ఆయనపై పెంచుకునేందుకు పునాది మాత్రం ఆయన కథలే. అప్పట్లో నాకు కొ.కు. కథలు విపరీతంగా నచ్చేవి. ఇప్పుడు మళ్ళీ చదువుతే అంత నచ్చవేమో అని ఇప్పుడు అనుమానంగా ఉంది. 🙂 ఎందుకో మరి.

జరూక్ శాస్త్రి కథల సంకలనం “శరత్ పూర్ణిమ” – నాకు చాలా ఇష్టమైన కథల సంకలనం. మొన్నామధ్య ఇంటికెళ్ళినప్పుడు కూడా ఓ నాలుక్కథలు మళ్ళీ చదివా. ఎంత భావుకత ఉందో అంత కదిలిస్తాయి. భాష కూడా ఎంత సరళంగా, నాబోటి వాళ్ళకి కూడా అర్థమయ్యేలా ఉండింది. (మొదటిసారి చదివేనాటికీ, ఇప్పటికీ నా తెలుగు కాస్త ఇంప్రూవ్ అయింది అనుకోండి, అది వేరే విషయం). ఇందులోని టైటిల్ కథ “శరత్ పూర్ణిమ” నాకు చాలా ఇష్టం. అలాగే, ఇందులో ఉన్న కథల్లో చాలామటుకు ఇష్టం నాకు – తెలుగు జీవితాల్లో ఉన్న వాస్తవాలు కళ్ళ ముందు కదులుతాయి.

ఆ తరువాత అప్పుడప్పుడూ ఇతరుల కథలు, వాటి మీద వ్యాఖ్యానాలు, ఇవే కాక మేగజీన్లలోనూ, వెబ్జీన్లలోనూ కథలు చదవడం అలవాటైందనమాట. ఫోకస్ ఫోకస్ అనగానే నా ఫోకస్ ఫ్లాష్‍బ్యాక్ కి వెళ్ళింది…..

You Might Also Like

6 Comments

  1. నరసింహారావు మల్లిన

    మల్లాది రామకృష్ణశాస్త్రిగారి పుస్తకాలు కూడా చదవండి. ముఖ్యంగా కృష్ణాతీరం. నేను గోదావరి జిల్లావాడిని. అయినప్పటికీ కృష్ణాతీరం ఎంతబాగా నచ్చిందంటే ఇప్పటికి కొన్ని పదులసార్లు చదివాను. ఇంకా ఎన్నిసార్లు చదువుతానో నాకే తెలియదు.

  2. అరుణ పప్పు

    ‘సత్యజిత్ రాయ్ ఎవరు’ అన్న కథాసంకలనం రచయిత శ్రీపతిగారు. వారి దగ్గర తప్పకుండా దొరకుతుందా పుస్తకం. వారి చిరునామా : బి -22, రవీంద్రనగర్‌, హబ్సిగూడ, హైదరాబాద్‌ 500 007.
    సెల్‌ : 99594 25321.

  3. కొత్తపాళీ

    @ వెంకటరమణ .. వడ్లగింజలు కథలో చివరికి వచ్చే సమస్య .. చదరంగపు గడిలో వడ్లగింజల్ని రెట్టింపు చేస్తూ పోవడం .. ఇది బహుశా చాలా పాత సమస్య/కథ అయుండచ్చు. సుబ్రహ్మణ్యశాస్త్రి గారి కథలో గొప్ప నిజానికి అది కాదు .. ఆ పాత్రల వ్యక్తిత్వం, శంకరప్ప పట్టుదల, మహారాజు ఔదార్యం, పెద్దమ్మ వాత్సల్యం, నేస్తగాళ్ళ విశ్వాసం, ప్రత్యర్ధుల అధికార మదం, అన్నిటినీ మించి ఆయన ఆ కథ చెప్పే తీరు .. అదీ అసలు గొప్ప ఆ కథలో.

  4. sriram velamuri

    సత్యజిత్ రాయ్ ఎవరు అన్న పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా

  5. మురళి

    తాపీమేస్త్రి రామదీక్షితులు బి.ఏ.

  6. వెంకటరమణ

    శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి కథల పుస్తకం ‘పుల్లంపేట జరీచీర ‘ కొన్నాను. రెండు మూడు కధలు కూడా చదివాను. అందులో ‘వడ్లగింజలు ‘, ‘కలుపు మొక్కలు ‘ ఇంకా ఏవో చదివాను. వడ్లగింజలు లోని కధ పల్లెటూర్లో చెప్పుకుంటే చిన్నప్పుడు విన్నాను కానీ, ఆయనే మొదటగా ఈ ఆలోచన చేశారని తెలిసేసరికి ఆశ్చర్యపోయాను.

    చెఖోవ్ కధలు, సత్యజిత్ రయ్ కధలు అంత బాగుంటాయా అండీ ! ?,
    మీరు చెప్పిన కధలు చదవాలని అనిపిస్తుంది. కానీ ముందు తెలుగు వాళ్ళ కధలు చదివాకే అటువైపు వెళతా. 😀

Leave a Reply