అంతా మత గవాక్షంలోనుంచే (The clash of civilizations )

రాసిన వారు: చావాకిరణ్
*************

Title: The clash of civilizations and the remaking of world order.

–    Samuel P . Huntington
image_684రచయిత హార్వార్డ్ వివిలో ప్రొఫెసర్. అక్కడే జాన్ యం ఓలిన్ సంస్థ డైరెక్టర్. హార్వార్డ్ అంతర్జాతీయ మరియు ప్రాంత అధ్యయన సంస్థ చైర్మన్. కార్టర్ కాలంలో అమెరికా రక్షణ కౌన్సిల్ మరియు రక్షణ ప్లానింగ్ సంస్థకు డైరెక్టర్. ఫారిన్ పాలసీ పత్రిక కో ఫౌండర్. అమెరికా రాజనీతి శాస్త్ర సమాఖ్య అధ్యక్షుడు. పెక్కు పుస్తకాలు, పత్రాలు లిఖించారు.

1993 ఫారిన్ అఫైర్స్ (విదేశీ వ్యవహారాలు) పత్రికలో “The clash of civilizations” అనే వ్యాసం వచ్చింది. దాని గురించి ప్రపంచ వ్యాప్తంగా చాలా చర్చ జరిగింది. ప్రస్తుత పుస్తకం ఆ వ్యాసాన్నే విశాలం చేసి, వివరణాత్మకంగా వ్రాసినట్టిది.
ఈ పుస్తకం మొత్తం ఐదు విభాగాలుగా విభజించారు.
మొదటి భాగం నాగరికతల ప్రపంచం. ఇందులో రచయిత మనకు ఈ ప్రపంచం ఎలా నాగరికతలుగా విడిపొయిందో చెప్తారు.

మొత్తం ప్రపంచాన్నీ పశ్చిమ, ముస్లిం, సాంప్రదాయ (రష్యన్, గ్రీక్ ) , కన్ఫ్యూజియన్ (చైనా, తైవాన్, ..) హిందూ, జపాన్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఇలా పలు నాగరికతలుగా విడిపోయి, కలిసిపోయి, ఉందని సూత్రీకరిస్తారు. ప్రపంచం ఎలా ఒక్కటికాదో, పలు ఉదాహరణలతో వివరిస్తారు. ఆర్ధికంగా వృద్దిలోకి వస్తున్న ఆసియా దేశాలు, విపరీతంగా జనాభా పెరుగుదలకు లోనవుతున్న ముస్లిం దేశాలు రెండువైపులా పశ్చిమ నాగరికతకు గొడ్డలి పెట్టు అని రచయిత వాదిస్తారు. అమెరికా, రష్యాల ప్రచ్చన్న యుద్దం తరువాత దేశాలన్నీ ఎటవైపు అని కాకుండా నువ్వెవరు అనే ప్రశ్న వేసుకుంటాయి అని రచయిత సూత్రీకరిస్తారు. పశ్చిమ దేశ నాగరికతలు ఇప్పుడు పతనం దిశగా సాగుతున్నాయని అంటారు. ఉదాహరణకు 1919లో వుడ్రో విల్సన్ , లాయిడ్, జార్జ్లు పారిస్ లో కూర్చోని ప్రపంచ పటాన్ని గీశారు. ఏఏదేశాలు ఉండాలి, ఏవి ఉండకూడదు, ఏవి ఎక్కడ ఉండాలి, ఎక్కడ వరకు ఉండాలి వంటి నిర్ణయాలు ఏక పక్షంగా తీసుకున్నారు. 100 సంవత్సరాల తరువాత ఆట్టి నిర్ణయాధికారం ఇహ ఎవరికీ ఉండదు. ఇలా పుస్తకం రెండో విభాగంలో నాకరికతలు ప్రస్తుతం సమతుల్యం మారుతుందని వివరిస్తారు.image_685

మూడో భాగంలో నాగరికతల ఏర్పాటు, నాలుగులో ప్రస్తుత నాగరికతల మధ్య జరుగుచున్న యుద్దాలు  గురించి వివరించారు. బోస్నియా యుద్దం గురించి ఎక్కువ పేజీలు కేటాయించారు. రచయిత చెప్పడం శాంతి అనేది రెండు యుద్దాల మద్య సంధి లాంటిది మాత్రమే, శాశ్వత శాంతి అంటూ ఉండదు.

ఇహ ఐదో విభాగంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో వివరిస్తారు. ఇక్కడ రచయిత చెప్పడం మూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశం చాలా తక్కువ, కానీ వచ్చినా రావచ్చు.
ఒక సంభావ్యత ఇలా వివరిస్తారు.
చైనా, తైవాన్ లు కలిసిపోతాయి. వియత్నాం సముద్రంలో అమెరికా ఆయిల్ కంపెనీలు ఉంటాయి. చైనా వాటిపై ఆంక్షలు పెడుతుంది. యుద్దం మొదలవుతుంది. అమెరికా యుద్దనౌకలూ, చైనా యుద్ద నౌకలూ భీకరంగా పోరాటం మొదలు పెడతాయి. అదే మంచి అదనుగా చైనా జోక్యం చేసుకోలేదు అని ఇండియా , పాకిస్తాన్ పై దాడి చేసి దాని అణు వ్యవస్థను నాశనం చేస్తుంది. హమ్మయ్య పాకిస్తాన్ పని అయిపొయింది అనుకునే సరికి పాకిస్తాన్ కి సాయంగా ఇరాన్ యుద్దంలోకి వస్తుంది. కథ రసకందాయంలో పడుతుంది. ఇండియా వెళ్లి టర్కీ, సైదీల సాయం అడుగుతుంది. షియాలైన ఇరాన్ కి వ్యతిరేకంగా వాళ్లు వస్తారని ఆశిస్తుంది. కాని అప్పటికే ఆ దేశాలు ముస్లిం ఫండమెంటల్స్ ఆధీనంలోకి వెళ్లిపోతాయి. సౌదీ, టర్కీ, ఈజిప్ట్ లు ఇదే మంచి సమయమని తలచి ఇజ్రాయేలుపై దాడి చేస్తాయి. అక్కడికి దగ్గరలో ఉన్న బ్రిటన్, అమెరికా సైన్యాలు సాయం చేసినా ఇజ్రాయేలు ఓటమి అంచుకు వెళ్తుంది  ముస్లిం జనాభా , సౌదీ డబ్బు, ఇరాన్ సాంకేతికం, టర్కీ సాంకేతికం వంటి కారణాల వల్ల. అమెరికా, బ్రిటన్ లు కలసి మిగతా యూరోప్ ని కూడా యుద్దంలోకి తీసుకోని రావటానికి ప్రయత్నిస్తారు, కాని అవి అంత తొందరగా రావు. ఇదే సమయంలో చైనా, పాకిస్తాన్, ఇరాన్ కలిసి బోస్నియాకు అణు బాంబులు స్మగ్లింగ్ చేసి యూరోప్ ను కట్టడి చేద్దాం అని చూస్తారు. కానీ సెర్బియా , బోస్నియాపై దాడి చేసి ఆ అణు బాంబులు నాశనం చేస్తుంది. ఒకటి రెండు అణు బాంబులు వాడబడతాయి. యూరోప్ యుద్దంలోకి వస్తుంది. మద్య ఆసియాలో టర్కీ జోక్యం చేసుకోవటంతో రష్యా యుద్దంలోకి వస్తుంది. ఇంతా భీకరంగా పోరాడతారు. చివరకు ఎలాగో ఒక లాగ ఇండియా, రష్యా, అమెరికా, యూరోప్, బ్రిటన్ లు విజయం సాధిస్తాయి. యుద్దం తరువాత ఇండోనేషియా, లాటిన్ అమెరికాలు అగ్ర రాజ్యాలుగా మారతాయు.
(మక్కీకి మక్కీ కాదు, నాకు గుర్తున్నంత వరకు – కిరణ్ )
ఈ పుస్తకం పక్కా యూరో సెంట్రిక్ పుస్తకం. అంతా మతం కళ్లజోడు పెట్టుకోని వ్రాసిన పుస్తకం. జాగురూకతతో చదవాలి. కానీ తప్పనిసరిగా చదవదగ్గ పుస్తకం. మన ఆలోచనలకు మరో కోణం కలుస్తుంది.

You Might Also Like

3 Comments

  1. satyamevajayathe

    అంతా మతం పేరిట జరగబోయే వినాశనం.
    ఈ రోజు Times of India లో ఇన్నయ్య నరిసెట్టి గారి “PARENTS IMPOSE THEIR BELIEF SYSTEM ON CHILDREN” అని ,Question Answer format లో సంబంధిత ఆర్టికల్ చాలా ఆలోచించవలసిన విషయం ..నేను ఎన్నో సందర్భాల్లో అలాగే అనుకున్నాను ..మన పిల్లలకి మన మతం పిచ్చి అంటగట్టడం ఏమిన్యాయమని ?
    కాని చూస్తుంటే రోజు రోజు కి ..పెరిగిపోతున్న మత సంస్థలు ,అడుగడుగునా జీవితంలో ..శాంతికి అవరోధాలే ..COMMON GOOD అందరి మతం కావాలి …ముఠాలు ..మత మూర్ఖుల సమూహాలు దారిపొడుగునా ..అవరోధాలే …JIDDU KRISHNA MURTI గారి మాటల్లో …The becoming mind is a mind that is always growing,becoming,enlarging,gathering experience as knowledge…”.మతం బుర్రలు” సిమెంట్ కాంక్రీట్ లా ఒక సారి సెట్ అయాక మారవు ..పగలకోట్టాలిసిందే …కనుక మనమందరం మతానికి దూరంగా మనుగడ సాగిద్దాం …

  2. కత్తి మహేష్ కుమార్

    సమకాలీన చరిత్రలో అత్యంత వివాదాస్పద పుస్తకం ఇది. ముఖ్యంగా 9/11 తరువాత ఈ పుస్తకం గురించి,దీనిలోని ప్రతిపాదనల్ని గురించి చర్చించని ప్రదేశం లేదనుకుంటాను.

  3. నాగమురళి

    ఈ పుస్తకం పాత వెర్షన్ చాలా కాలం క్రితమే చదివాను. పెద్దగా నచ్చలేదు.

Leave a Reply