ప్రవహించే ఉత్తేజం చే గెవారా – కాత్యాయని

వ్యాసం రాసిపంపినవారు: బొల్లోజు బాబా

ఎందుకంత అవస్థ పడుతున్నావ్! నన్ను చంపటానికొచ్చావని తెలుసు. చంపరా పిరికిపందా! ఓ మనిషిని చంపబోతున్నావు అంతే కదా అని గర్జించాడతను.

కాళ్లలో రెండూ, మోకాళ్లలో రెండూ, చాతీలో రెండు, పక్కటెముకల్లో రెండు, గుండెలో ఒకటీ మొత్తం తొమ్మిది బుల్లెట్లు శరీరంలో దిగబడటం వల్ల మరణం సంభవించిందని అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలిపింది.

******

అలా 1967, అక్టోబర్ 9 మద్యాహ్నం 1:10 నిముషాలకు, బొలీవియా సేనలకు చిక్కిన పోరాటయోధుడు చే గెవారా హత్య జరిగింది. మరణం దేహానికే కానీ ఆలోచనలకు  కాదని చరిత్ర నిరూపించింది.

చే గెవారా మరణించి నాలుగు దశాబ్దాలు నిండాయి. దేశదేశాల విప్లవకారులు, రాజకీయవిశ్లేషకులు అతని గురించి ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. అనుకూలంగానో, వ్యతిరేకంగానో.

గొప్ప రాజకీయవేత్త, మేధావి, దుస్సాహసికుడు, నిజాయితీకల విప్లవకారుడు, ఒంటెత్తు తత్వమనిషి, ఆదర్శవంతమైన నాయకుడు, స్వాప్నికుడు, ప్రేమికుడు అంటూ ఎవరికి తోచినట్లుగా వాళ్లు నిర్వచిస్తూనే ఉన్నారు.

చే గెవారా జీవితంలోని సమకాలీన ప్రాధాన్యతను కాత్యాయని గారు రచించిన చే గెవారా అనే పుస్తకం మనముందుకు తెస్తుంది.

క్యూబా విప్లవోద్యమంలో కార్యకర్తగా అడుగుపెట్టి, ఫిడల్ కాస్త్రో కు కుడి భుజంగా మెసలి, విముక్త క్యూబా రాజ్య పునర్నిర్మాణంలో ప్రధాన పాత్రవహించి, బొలీవియా విమోచనోద్యమంలో అసువులు బాసిన అమరవీరుడు చెగువెరా. ఆయన తన జీవితమంతా అమెరికన్ సామ్రాజ్యవాదం మీద రాజీ లేని పోరాటాన్ని సాగించాడు. జీవితానికీ మరణానికీ సార్ధకత ఉండాలని తపించిన అచ్చమైన మనిషి. మార్పు జీవితమంత విశాలమైనది అని చెప్పిన విప్లవకారుడు.

ప్రభుత్వాలు మానవజాతిని రెండు పరస్పర వ్యతిరేక వర్గాలుగా విభజించే దిశగా వెళితే, నేను సామాన్యులుండే వర్గం తరపునే నిలుస్తానని ప్రకటించుకొన్న విశ్వమానవుడు.

చే గెవారా జీవితమంతా సామ్రాజ్యవాద శక్తులతో జరిపిన పోరాటాలమయం. తన మార్గం అనితర సాధ్యం అనిపించేలా జీవించిన ఒక గెరిల్లా యోధుడు ఇతను. క్యూబా విప్లవవిజయానంతరం లభించిన అధిపత్యాన్ని స్వచ్ఛందంగా వొదులుకొని మరిన్ని ఇతర లాటిన్ అమెరికన్ ప్రాంతాలను విముక్తం చేయాలని మరలా విప్లవపోరాటమార్గన పయనించిన గొప్ప ధీశాలి. ఆ ప్రయత్నంలో బొలీవియా సైనికులకు చిక్కి హత్యచేయబడ్డాడు.

ఈ పుస్తక రచయిత్రి కాత్యాయని గారి శైలి చదువరి రక్తాన్ని పరుగులెట్టిస్తుంది. వర్ణణలద్వారా ఆయా సంఘటనలలోని ఉద్వేగాలు అక్షరాల్లోంచి హ్రుదయంలోకి ప్రవహిస్తాయి. చరిత్రపుస్తకాలకు ప్రధానంగా ఉండాల్సినవి సంఘటనల క్రమం మరియు తదనంతర కాలంలో ఆ సంఘటనల వల్ల ప్రభావితమైన పరిణామాలు. అవి ఈ పుస్తకంలో ప్రతిభావంతంగా ఉండటంచే కధనం ఆద్యంతం ఒకరకమైన భావోద్వేగానికి గురిచేస్తుంది.

ఏ సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా పోరాడేడో, అవే చే గెవారాను కలిపేసుకొని, ఇతని వెంట్రుకలనుంచి డైరీలవరకు వేలానికి పెట్టటం ఒక దురదృష్ట పరిణామం. చే గెవారా పాకేజ్ల పేరిట టూరిష్టులను ఆకర్షించటం, ఇతని బొమ్మని ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన వస్తువుగా మార్చివేయటం, ఇతన్నో టీన్ ఐడోల్గా తయారుచేసి కోట్లు గడించటం వంటివి బాధించే అంశాలు. 2000 సంవత్సరంలో ఈ శతాబ్దిలో పేరుమోసిన 100 మందిలో చే గెవారా ను ఒకడిగా పేర్కొన్న టైం పత్రిక ఏ అసమానత, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతూ చే బులెట్ ను ముద్దాడాడో ఆ పరిస్థితులు ఈనాటికీ ఉన్నాయిఅని వ్యాఖ్యానించింది.

ఏమిటీ మనిషి? ఎందుకలా ప్రవర్తించాడు? ఇతనికేంకావాలి? సుఖమైన జీవితాన్ని వొదిలిపెట్టి ఎందుకలా చిత్తడి బురదలో వందలకిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రాణాలకు తెగించి పోరాడాడు? ఒక మనిషిని శృంఖలాలనుంచి విముక్తుడిని చేయటానికి మరో మనిషిపై తుపాకి గురిపెట్టాలా? అన్న ప్రశ్నలకు చనిపోయే ముందురోజువరకూ   చే  వ్రాసుకొన్న డైరీలలో కొన్ని సమాధానాలు దొరుకుతాయి. ఇతని నిబద్దత, రాజకీయ అవగాహనా, పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్ర్ర్యాలను అందించాలన్న తపన వాటి ప్రతీ పేజీలో కనిపిస్తాయి. మార్పు తీసుకురావటానికి చే గావేరా ఎంచుకొన్న విధానం హింసాపూరితం కావొచ్చు, కానీ ఇతని నిజాయితీని శంకించలేము.

మార్పు అనేది ముగ్గగానే రాలిపడే పండు కాదు, మనమే దానిని రాల్చాలిఅన్న చే గెవారా మాటలే అతని జీవితం. అలాంటి యోధుని జీవితంలోని ప్రతీ ఘట్టాన్ని పొందుపరుచుకొన్న పుస్తకం కాత్యాయని గారు రచించిన చే గెవారా ప్రవహించే ఉత్తేజం.

ప్రతులకు:

హైదరాబాద్ బుక్ ట్రస్ట్

ఫ్లాట్ నెం. 85-బాలాజీ నగర, గుడి మల్కాపూర్, మెహిదీ పట్నం, హైదరాబాద్ – 67

ఫోన్: 23521849

You Might Also Like

6 Comments

  1. kcubev

    చే ఎంచుకున్న మార్గం ఒక బలీయమైన వ్యవస్థీకృత హింసనెదుర్కొనేందుకు సామాన్య జనం చేసే పోరాటమే. అది హింసామార్గంగా కనిపించవచ్చు కానీ అనివార్యం. మీ పరిచయం బాగుంది.

  2. Nani

    Bagundi parichayam…inka entho vundi ayana charitra…

  3. K.Raja Sekhara Raju

    “మార్పు తీసుకురావటానికి చే గావేరా ఎంచుకొన్న విధానం హింసాపూరితం కావొచ్చు, కానీ ఇతని నిజాయితీని శంకించలేము”

    అక్షర సత్యం

    అభినందనలు.

  4. Krishna Rajesh

    మంచి పుస్తకం. కత్యాయిని గారి ప్రయత్నం బాగుంది. ఒక్క పొరాట వీరుడి గూర్చి చక్కగా అని విషయాలు తెలుస్తాయి.

  5. Harith

    ‘చే గెవారా’ కాదు, ‘షే గుఎవర’ అనాలి.

  6. pativada babji

    ee vyasam chaalaa bagundi.cheguvara gurinchi chaala rasaru.
    thanque.
    p,babji

Leave a Reply