పుస్తకం
All about booksపుస్తకాలు

April 26, 2014

మధుబిందువులు

More articles by »
Written by: అతిథి
Tags: ,
వ్యాసకర్త: కాదంబరి
******
“మధు బిందువులు” పేరు చూడాగానే బోధపడ్తుంది, ఇవి సున్నిత భావాల కవితలు అని. శ్రీమతి సులోచనా సింహాద్రి చిత్రణలోని సుకుమార భావాలకు ప్రతిబింబాలు ఇందులోని కవితలు, ఈ మధు బిందువులు. శ్రీమతి సులోచనా సింహాద్రి 60 సంవత్సరాల వయసులో వెలువరించిన సంపుటి మధు బిందువులు. ఈ చక్కటి పేరును అనుకోకుండా అందించిన వారు డా. ఆచార్య తిరుమల. ముందుమాటలో “మధు లోచని”లో ఆచార్య తిరుమల వెల్లడించిన వాక్కులు మధు బిందువులు సంపుటికి జూకా మల్లెలై గుబాళించినవి.

“మధు బిందువులు” ని సులోచనా సింహాద్రి తన పతిదేవులు కీ|| శే|| పి. సిమ్హాద్రిగారికి photo వేసి “అంకితం” ఇచ్చారు.

సులోచనా సింహాద్రి “అంకితం” లో-

“నలుబదేండ్లు నగుమోముతో; మురిపించావు!
మాటలతో మెప్పించి మరపించావు! ………
ప్రేమ దృక్కులు ప్రసరించి, నీ అడుగు జాడలలో నడిపించావు!
కష్ట సుఖాలు కలిసి పంచుకున్నాము, నీలో కలిసి నీ ఆశయాలు తీర్చితి;
నన్ను ఒంటరిని చేసిన ఈ కాలమునకు ఓర్చితి!
అనునిత్యం నాలో నిను దర్శించి, ఆనందాశ్రువులతో నిన్ను అభిషేకించి,
అంకితముగా ఈ మధు బిందువులై రాలితి!
నీ పవిత్ర పదములపై వాలితి||

– అని కృతజ్ఞతతో పేర్కొన్నారు.

సులోచనా సింహాద్రి మొదటి కవిత “నేను” ఆమె జీవిత చిత్రము అనవచ్చును.

“ఆశల అంతస్థుపై నిలిచి ఆనందించాను; ఆనందాన్ని అందరికి పంచాలని ప్రయత్నించాను,
అంతరంగంలో అనుభవాలను రంగరించాను, ఆవేదనల అగ్ని ఖడ్గాల్ని అంతం చేసాను, ఆశయాల అనుబంధాల్ని దృఢీకరించాను,
అనాధలకు ఆశ్రయాన్ని కల్పించి ఆదుకున్నాను, అనురాగ సుగంధాల్ని ఆస్వాదించాను ………”

-అంటూ ఇలా పేర్కొన్నారు “అకారణ ఆవేశాగ్నులకు ఆహుతయ్యాను….” ఈ మాట పఠిత మనసును చివుక్కుమనిపిస్తుంది. ఆ తర్వాతి వాక్యం ఇది.
“అమూల్యమైన తనూజులను ఆశీర్వదించాను,
ఈ జీవిత చరమ చరణాన్ని, ఆలపిస్తున్న నేను,
నా హృదయాలయంలో, నీ ఆత్మను ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాను!
అవ్యక్తమైన అక్షర సౌందర్యాన్ని, క్షణాల అద్దాల్లో దర్శిస్తున్నాను!” – “నేను”లో ఆమె తన భర్తనుగూర్చి అర్చనా సుమమాలతో తెలిపారు.

సులోచన గారి నిష్కల్మష మానస జల’దర్శనములు’ (mirrors) ఇందులోని ప్రతి అక్షరమున్ను! ఆమె కవితల్లోనే కాక, మొదటి పేజీలలో స్నేహ మంజరీ సౌరభాలను వెదజల్లిన వాక్యాలు ఉన్నవి. “అంకితం” తర్వాతి పేజీ “ఆంతర్యం!” వచనములో ఆమె అభిప్రాయాలను నుడివారు, అవి వానజల్లుతో తడిసిన పుడమి సౌగంధాలను తెచ్చినవి. ఇందులోని దాదాపు అన్ని వాక్యాలనీ ఉటంకించవలసి వస్తున్నదీ అంటే అది ఆమె భావశబలతకు కలిగి ఉన్న గొప్పశక్తి!- అని చెప్పగలము.

“ఆవిర్భవించిన ప్రతి భావాన్ని విని ఆనందించి,
ఆశీర్వదించిన అమ్మకు అభివందనములు.
నా మనసు భావోద్రేకమయినది.
ప్రేమాభిమానాల కోసం ఆరాటం,
సాహిత్యాభిలాష, కవిత్వానందానుభూతి
నా భావాలను అందరికి చెప్పాలన్న తహతహ
నాకు ప్రేరణ కలిగించి ఈ కవితలు మనో వేగంతో జలజల రాలాయి!”

ఆమె కవి కౌస్తుభ తిరుమల గారికి, డా|| కృష్ణకుమారి గారికి (బహుశా నాయని కృష్ణకుమారి ఐ ఉండవచ్చు), తన గేయాలను ముద్రించిన ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, విశ్వ రచన, జాగృతి, పక్ష పత్రికలు మున్నగు వారికి, అలాగే విశ్వసాహితి సంస్థ అధ్యక్షులు శ్రీ పోతుకూచి సాంబశివరావు గారికి కృతజ్ఞతలను తెలిపారు.. ఆమె – తనపై మాతృభావంతో అండగా నిలిచిన కొరుప్రోలు మాధవరావు గారికి శుభాశీస్సులు పలికారు. ఈ గేయ సంపుటి విషయంలో తనలో ఒక భావాన్ని కుసుమింపజేసిన శ్రీమతి పి.కుసుమ కుమారిగారికి స్నేహ సుమాంజలులు. అంతే కాదు! ‘నా మీద అభిమానంతో ఈ సంపుటిని మీకు అందిస్తున్న స్వరసుధ సంస్థకు, ముఖ్యంగా కార్యదర్శి మధుగారికి, అందంగా ముద్రించిన మాధవి ప్రింటర్స్-గణేశ్ బాబుకు నా ఆశీస్సులు అని పేరు పేరునా ధన్యవాదాలు తెలిపిన తీరు, ఆమె మంచి హృదయానికి ప్రతిబింబమే! తర్వాత Bio-Data ను విపులంగా ఇచ్చారు. 1927 లో జన్మించిన సులోచన గారు తమ కాలం విలువ తెలిసిన మనీషి. ప్రతి క్షణాన్నీ సత్కార్యాలకు, ఆశయ సాధనకు వినియోగిస్తూ బతుకు బాటలో ముందుకు నడిచారు.

ఈమె “మధు బిందువులు” 63 పేజీల అక్షర చిత్రములు ఉన్న బొమ్మలకొలువులు. “ప్రేమ” అనే మొదటి కవితతో ఆమె సుకుమార ఆలోచనలు కల వ్యక్తి- అని తెలుస్తుంది.

“ప్రేమతో నిండిన పిలుపు కోసం, ప్రేమ లాలించే మనిషి కోసం ,
ప్రేమ కరిగిన హృదయం కోసం , ప్రేమ చూసే కనుల కోసం,
ప్రేమ నొలికించే మాటల కోసం , వేచి ఉన్నా వేచి ఉన్నా;
ఎన్నటికో ఆ తరుణం! ఎన్నటికో వీక్షణం? …..
– కర్పూరం లాంటి మధుర స్వప్నం కరిగిపోయింది…. మధుమాసం మనోహర పుష్పాల పరిమళాలు ప్రసరించింది; పూజామందిరం ఘంటల రవళుల భక్తిగానం శ్రావ్యం చేసింది” అంటూ ‘రాగంతో అనురాగం రంజిల్లిన విధానాన్ని’ పూసగుచ్చారు ఆమె. (ఐతే ఘంటల నాదము- అనాలేమో!?)

అకారాది క్రమములో ప్రేయసీ ప్రియుల ఊహలను వర్ణించిన చమత్కార వల్లరి ఇది.

“అత్తరి వేచి యుండె నతడు;
క్షణమొక యుగముగ తోచుచుండె నతనికి!
ఆమె అందానికి ముగ్ధుడై వలచి విరహమొందె …….
అంకితమయి పోతి అంతఃకరణమందు,
అహ! హ! హ! ప్రేమ భంగుల వన్నెచిత్రము లింతె కాదా!”

***************************,
భావ వీచికలు- ఏడు కవితలు సందేశాత్మకతతో ఆలోచనాత్మకంగా ఉన్నవి.

“హిందూ సమిష్ఠి కుటుంబాన్ని కట్టి ఉంచేవి;
కఠిన శాసనాలు కావు ప్రేమపాశాలు” (-1-) అని శ్రీమతి సులోచన నొక్కి చెప్పారు.

“మనసు అనే మహాసముద్రంలో; అలలు ఆలోచనలు;
ఉప్పొంగి పోయి తిరిగి;
ఆ మహాసముద్రంలోనే; అదృశ్యం అయిపోతాయి” (-7-)
అనే అందమైన వ్యక్తీకరణ.

“కవితా కాంక్ష” – “కనులకు కునుకు పట్టే సమయం కాదిది;
కనులు మూయక కాచుకునే/. అంతా నిశ్శబ్దం!” అన్నారు. ;

-5- కొంత నిరాశను చిప్పిల్లిన కవిత:-
“చింత లేని రోజు ఉన్నదా? … నిజానికి నిలకడ ఉన్నదా? . త్యాగానికి విలువ ఉన్నదా? స్నేహానికి హద్దులున్నవా? స్త్రీకి స్వాతంత్ర్యమున్నదా?”

-6, 7, 8, 9- భక్తి కవితలు.

“దేవాధిదేవ అని స్తుతియించితి నేను ……
పరమ పావన పరాత్పరా! ….. పుణ్యాల పంటలు పరమేశు పదములు;
భక్తితో చదివితి నీ చరితం భాగవతము; హరి నామ సంకిర్తనమే నా జన్మ సార్ధకము,
నీ నామ స్మరణమే నా ఆంతర్య మందిరాంతర ప్రతిధ్వనుల సంగమం!”
సంగీతమును ఆస్వాదించే తీరు (కవిత-8-) లోనిది.
“సరిగమల రాగాలు సంగీతము; వెల్లువలై విరిసేను సంగీతము;
వరదలై పారేను ప్రేమ సంగీతము…….. నాదమై నా హృదయం; పొంగి పొరలేను; సరాగాల సంగీతముల; మానస మయూరి నాట్యమాడేను.”

*************,

ఉత్తమపురుషలోని -12- ఆమె వ్యక్తిత్వానికి ఆనవాలు.
కష్టాలలో ధృతిని వీడకుండ, తన వారికి సైతం మార్గదర్శనం చేయగల ప్రౌఢ వనితగా ఆమె ద్యోతకమౌతుంది.

“నీ చిఱునవ్వును నేనే! నీ అశ్రుబిందువును నేనే;
కంటకాల మధ్య వికసించిన పూవును నేనే ;
నడుమ నీటిలోని నీ ప్రతిబింబాన్ని నేనే;
నిను వీడని నీడను నేనే;
నిను వీడి సోపానముల నెక్కినది నేనే;

నీ జీవనసాగరంలో నావను నడిపినది నేనే;
సంసారపుటెడారిలో దారి చూపినది నేనే;
నీ మోడై పోయిన జీవితాన్ని చిగురించినది నేనే;
నీ చీకటి జీవితానికి దివ్యమైన జ్యోతిని నేనే ; –

నీలో కోటి దీపాలు పెరిగించింది నేనే ; నీవు నేనే , నేను నీవే!”

******************************,
ఆ ప్రతి అణువు నొక రసతరంగిణీ భావమై;
ఆ భావములు నదులై పారు, జలధిలో అలలులా పొరలిపోవాలి;
నా కన్నీటి గాధ లేమని వివరింతు;
వినే వారెవ్వరు? విస్మరించేవారే గాని!

-6- పరమ పవిత్రమ్యిన ప్రేమను పొందితి;
నిన్ను పరిణయమాడి; నలుబది వత్సరములు;
నాల్గు క్షణములా అదృష్టము;
భోగ్యనయితి భాగ్యనైతి; నీవు లేక అభాగ్యనైతి;
జీవితాన్ని భరించుట ఇక ఎటులనో!
“- 6 –— (పేజీ 47)

*******************;
ఈ లోకం (-3-) స్త్రీ మూర్తిమత్వమును రూపు దిద్దిన ప్రయత్నం చేసారు.
“స్త్రీ మాతృ మూర్తి ; స్త్రీ సౌందర్య మూర్తి;
ఆమెలో ఏం చూస్తావు?; ఓ మానవుడా! —
ఆమె త్యాగము, ప్రేమ; అణువంత నీలో ఉందా?;
ప్రేమలోనే పుట్టి ప్రేమకోసమే త్యాగం చేస్తుంది……… .”

అని చెబ్తూ ఆమె కవిత్వ శైలిలో కొత్త దనాన్ని ప్రవేశపెట్టారు. ఒక పట్టికలాగా అనిపిస్తుంది కానీ, సొగసైన బొమ్మలకొలువు వంటి పదముల కూటమి ఇక్కడ ఉన్నది.

“అందము ఆనందము; ప్రళయము ప్రణయము;
ప్రశాంతము ప్రావీణ్యము; రౌద్రము రసజ్ఞత;
శాంతము శౌర్యము; ధీరత్వము దీనత్వము;
ఛిద్రూపి బహురూపి; మిళితమైన స్త్రీలో ఏం చూస్తావు?; ఓ మానవుడా!’…..
ఆమె త్యాగము, ప్రేమ; అణువంత నీలో ఉందా?
ప్రేమలోనే పుట్టి, ప్రేమ కోసమే త్యాగం చేస్తుంది”

**************
వృద్ధాప్యము జీవితములోని అంతర్భాగము, నిరాశతో గడపకూడదు, ఆదర్శముల ఆచరణకై ప్రయత్నించాలి. ఈ కాన్సెప్టు కలిగిన వారు ధన్యులు. ఆమె సానుకూల దృక్పధము ముదావహం. “చిగురుటాకులో ఉన్న అందం; పండుటాకులోనూ ;ఉండటమే జీవనలీల, సొగసును; ఆనందించగలగడమే జీవితానికి అర్ధం; ఇదే సుమా! పరమార్ధం!”

***************
పదే పదే ఒకే పదమును ఉపయోగించడం పద్య, కవితలకు, ఒకింత సొబగు మెరుపును తెస్తుంది. జీవితం:- శీర్షిక లోని పూ గుచ్ఛములు; పద వాక్యాలు:

రుధిరం ఎఱుపు; క్రోధం ఎఱుపు; వెలుగు తెలుపు;
శాంతం తెలుపు;
ఆకులు పచ్చన; ఆనందం పచ్చన;
చీకటి నలుపు; దుఃఖం నలుపు; రంగు రంగుల భావాలే జీవితం

“ఓ జీవితమా! మనసు లేని; మమత లేని నీవురాబోకు; నా హృదయం లోకి; నా దరి చేరకు, నీవు రాబోకు ..” ఈ పై భావం కాస్త తికమకగా ఉన్నది.

“జీవిత సమరంలో సాహసం; సంతోష సాగరంలో సంగమం; హాస్య లాస్యాలతో హర్షం; క్రోధానలంలో హిమ బిందువులు;…….
జాలిగుండెలో కరుణామృతము; జాలువారుగా ప్రవహించి;
పిల్ల కాలువలై విరిసి నదులై పారి; మహాసముద్రంలా పొంగిపొరలాలి.”

‘చుక్కాని లేని ఓ జీవితమా! సంసార సాగరాన మునిగితివా; విజ్ఞానం అనే ఓడలో; వైరాగ్యం పొంది; భగవధ్యానం తెడ్డుగా స్వీకరించు; అదే జీవితానికి పరమావధి’

**************;

-8- ‘జీవితం ఒక కొలను; వానజల్లుకి కొలను ఉప్పొంగుతుంది .. …
నిడివి తెలియని జీవితం; తన ప్రతిబింబాన్ని కొలనులో తనివార చూస్తుంది’

**************
భగవానుని సాక్షాత్కారమునకై పరితాపం కవితలలో నిబద్ధపరిచారు ఈమె. (పేజీ24):
“ఈ జీవకోటిలో నీవొక; పరమాణువువి; దానిలో ఐక్యమై పో”

-11- “ఏటి కా దరి నీవుంటి; ఏటికీ దరి నేనుంటి; జగమంతా నీలోనే ఉన్నది;
నీ దరి చేరుట నెటులో; నావ లేదు, ఈదగ లేను;
నీ దరి చేరుట ఎటులో; మార్గము చూపుము దైవమా!”

అలతి అలతి పదాల కూరిమి కవిత ఇది.
************,
సంఘ సేవా కార్యక్రమములలో క్రియాశీలతతో పాల్గొన్న ఈమె – ఈ కవితలో వెలిబుచ్చిన దేశ భక్త్యావేశసంరంభభావాలు ; దేశభక్తి దీప్తిగా –
“దేదీప్యమైన దీపము వెలిగించు;
తేజముతో ప్రజ్వరిల్లు దీపము వెలిగించు;…
దేశ సౌభాగ్యాన్ని వెలిగించు;
వెలిగించు, వెలిగించు;
దివ్యమైన దీపము వెలిగించు;”
అంటూ సందేశం ఇచ్చారు కవయిత్రి

*****************,;
కలియుగం:-
“వసుధైక కుటుంబకాన్ని వాస్తవ చిత్రంగా దర్శించండి’ – అన్నారు. వృద్ధాప్యం చరమాంకంలో పలకరించే దశలో కవయిత్రిగా కదిలేభావాలను సులభంగానే చిత్రించగలిగారు. ఆమె కొన్నిసార్లు భవ్య ఆశావహ దృక్పధాన్ని వెల్లడించారు. మరి కొన్నిసార్లు నిరాశా వాక్కులు వెల్లడి చేసారు.
“ఈ వృద్ధాప్యంలో నా జీవితం ఎవరి కోసం?;
ఓ జీవితమా! నీకు పరిహాసమా?;
జీవిత సంధ్యలో ప్రేమానురాగాల కోసం;
కొట్టాడుతూ ఈ నిశీధి గుండెలో;
ఒంటరి తనం భయంకరంగా వెంటాడుతూంది! ……
…నేనిక ఓర్వ లేను దైవమా!; నీ దరి చేర్చుకో;”

******************,
సరోజినీ నాయుడు పద్యం వంటి చక్కని కవిత- “నడుస్తూంది జీవితం”:
యవ్వనంలో – పచ్చనిచివురులు,
పసిపాపల ముద్దులొలికే మాటలు;
వయసులోనే, కొడుకులు, కూతుండ్రు మనవల; ప్రేమానురాగాలు, మమకారాలు;
వృద్ధాప్యంలో ఎండిన ఆకులు, చలనం లేని శిలలు;
చేయూత నిచ్చే సమయాన వారి మాటలు; హృదయాన్ని దహించే ఆరని మంటలు

కొన్ని సార్లు నిరాశా వాక్కులను సులోచనా సింహాద్రి కలం నుండి వచ్చినవి. కొన్ని పోలికలు నైస్. “మేలలో దొరకని తాయిలం లాంటిది” (పేజీ 31); పండుగలనూ, పసి పిల్లలనూ ఇష్టపడే సులోచనా సింహాద్రి తన భావాలకు “అక్షర రూపము”ను ఇచ్చారు. ఐతే నేటి సమాజంలోని ఆర్ధిక అసమానతలను కూడా కవితాత్మకంగా విశ్లేషించారు.

“తేజంతో ప్రజ్వరిల్లే చిచ్చు బుడ్లా?
హృదయాల పొంగి పొరలే ఆశ నిరాశల అఘాధాలా;
ఏది దీపావళీ? ఏది దీపావళీ?’ (page 32);

**********************;

“భోగి పండుగ వచ్చింది; చలిచలి గిలిగిలిగిలి;
భోగి మంటలు; ఎక్కడ చూసినా భోగి మంటలు;
బాలికల పట్టు పావడాల గరగరలు;
నవ వధూవరుల నును సిగ్గు దొంతరలు;
అలంకరించిన బసవన్నల డూడూలు;
రైతన్నల పల్లెపదాలు; పసిడి ఛాయల ధాన్య రాసులు, భోగి పండుగ వచ్చింది..’
అని తెలుపుతూ, శ్రీమతి సులోచనా సింహాద్రి

“మేలు కలయికలు” లో
‘రేగుపండ్ల పులుపుతో కొత్త చెఱకు తీపి మేళవింపులు, గానకచ్చేరీలు;
హరిదాసు మేళ తాళాలు; శిల్ప కళలు బొమ్మల కొలువులు;
సంక్రాంతి కవి సమ్మేళనాలు; పాతకొత్తల మేలు కలయికలే;
మన భోగి పండుగ” మానసోల్లాసముతో’ అన్నారు.

కనుమరుగౌతూన్న అందమైన సంప్రదాయాలను పాఠకుల నేత్రాలలో బొమ్మ కట్టిస్తూనే ఉంటాయి ఇలాటి చక్కని పదచిత్రాలు ఎన్నో!

పసిపాప కిలకిలలు:-
“పసిపాప కిలకిలలు; సెలయేటి గలగలలు;
అమ్మ చిరునవ్వులే; చిరుగాలి రెపరెపలు;
చెట్ల గుబురులో చిరుగాలి రెమ్మల రెపరెపలు……”
ఈ భావాలు అన్నీ ‘మనసు వింతగా గతంలోకి జారుకున్న వైనము మనల్ని చకితుల్ని చేస్తుంది.

-2- “నా పాలు త్రాగి ఆనందంతో కేరింత లేసిన; నా పాపవేనా నీవు?
నీ వొడిలో పాపను చూసి నీవే తల్లివైనావని మురిసేను;
నా పక్కన గ్రక్కున నా వొడి లో చేరి కొంగులో;
తలదాచుకున్న ముద్దులొలికే పాపడవేనా నీవు:
తలనెరసి పిల్లల తండ్రి వైనందుకు గర్వించాను;
అలనాడు చూసిన మీలోని నా పాపలంతా ఏరి? ఏరి? ఎక్కడ?”

– 3 – “చిన్నారి పాపల్లారా! చిట్టి చిట్టి పాపల్లారా!! అందరూ రారండి!
అందమైన పాపల్లారా! రారండి! రారండి!
అల్లరి చేద్దాం! అమ్మ వొడిలో చేరుదాము! అందరూ రారండి!” ( page 35 )

శ్రీమతి సులోచన ఆధునిక స్త్రీ- గూర్చి, పాతతరవాళ్ళకు ఉండే ఒపీనియన్సునే చెప్పారు. ఇంగ్లీష్ మాటలను తెలుగు లిపితో ఇచ్చిన పద్ధతి కాస్త నవ్వు తెప్పిస్తుంది.

“చీరలు రవికలు పోయి; జీన్స్ టీ షర్టులు వచ్చె;
వాలుజడలు సిగలు పోయి; బాబ్ కట్స్ వచ్చె;
పసుపు పారాణి పోయి; స్నోలు పౌడర్లు మేకప్ లు వచ్చె;
కళ్ళకు కాటుక పోయి; ఐ లైనర్లు వచ్చె; తాంబూలం పోయి;
లిప్ స్టిక్ వచ్చె పెదాలకు;
చేతులకు కాళ్ళకు; మేనీక్యూర్ పెడిక్యూ ర్ /; …. ‘
అంటూ తనవైన కొన్ని అభిప్రాయాలను నిష్కర్షగా చెప్పేసారు.శ్రీమతి సులోచనా సింహాద్రి ఇలాగ – ‘ప్రేమలు తక్కువ షోకులు ఎక్కువ; సంసారం పట్టించుకోరు’
**************
ఊహాలోకం:-
‘ఏ లోకంలో నీవు నేను కలుసుకున్నాము;
ఆ లోకంలోనే మళ్ళీమళ్ళీ కలుసుకుందామా?’ –
అంటూన్న శ్రీమతి సులోచన గారి ఆందోళనలలో కొంత కన్ప్యూజన్లు ఉన్నవనిపిస్తుంది.

“వద్దు! వద్దు! విడిపోవద్దు!
మరల మరల కలుసుకుందాము; ఈ లోకంలో…..”

కొంత అస్తవ్యస్తంగా అనిపించినా, సౌమ్యత అంతస్సూత్రంగా సులోచన గారి “ఊహాలోకం” సాగినది.

“కనుల నీరు నిండెను; కాననంలో దారి కానరాకున్నది;
మబ్బు క్రమ్ముకుని చీకటయినది; హృదయంలో అలజడి చెలరేగినది;
ముఖాన స్వేదబిందువులు రాలుచున్నవి; దారి చూపు దైవమా;
పతి లేని, వొంటెరి దాన్ని!; దారి చూపు దైవమా!” {10} ;
**************
మనసులో కన్నీటి అంజలి :- అనే విభాగంలో ప్రతి అక్షరము- కన్నీటి తేమగాలి తాకిన ఆర్ద్రతా నీరదమే!

-2-
“నాహృదయం విచ్ఛిన్న మయిపోతూంది; ఓర్చుట నెటులో;
నీవు విడనాడి నాల్గు వత్సరములు గడిచినవి;
నేను నీ వియోగ మరి నెట్లు ఓర్తునో; (ది ~ రి?)
ఐక ఎన్ని రోజులీ జన్మ; ఈ అశ్రువుల కంత మెపుడో;
నాల్గు వత్సరముల నాడు నీ వెంతయో; నాలుగు గంటల సమయంలో; నాతో బాసలు చేసితివి; మరి కొన్ని గంటలకు; నీ అసువులు బాసితివి; (బాపి – అని ముద్రారాక్షసం ఇక్కడ):
నా అశ్రువులు ధారలై పారుతున్నవి;
నీ అనుంగు పుత్రుల నడుమ నను విడిచితివి;
ఔర! ఏమి సేతు? నేనేమి చేతు!
నేనేమి తప్పిదములు చేసినానో క్షమియింపుము;
నన్నీ బంధాల నుండి విముక్తి చేయుము;
ఓ నాధా! ఓ దైవమా!”

-3- “ఈ అవనిలో ; అనంతమయిన (నీ) అనుబంధం; అనుక్షణం (నా) అంతరంగంలో; ఆరాటం; ఆనందం; అనుభవము; ఆశ్రయం; అనురాగం; – మరపురాని మధుర క్షణాలుగా; మమతల మల్లికా సుమాలుగా నిలిచి మనసు; బృందావనిన పరిమళాలను వెదజల్లుతున్నాయి ప్రతి నిముషము! ప్రతీ క్షణం; నీ లాస్యం మరువలేను; నీ తీక్షణ వీక్షణం; నా కనులలో నిలిచినవి; నా హృదిలో అలజడిని; అశ్రువుల జడివాన కొలుచుచున్నది.”

**************************,

-16- నీ చిరునగవు నా చిదానందాలు;
నీ కనుసన్న నా మధుర బాసలు;
నీ అడుగు జాడ నా రాజమార్గాలు

-18- మమతలే నింపావు జీవితంలో;
చివరికి మధుర స్మృతులే నిల్పినావు;
ఏ తీరు ఏ తెన్ను కానరాకున్నాది;
నా అధరాలు అదురుతున్నాయి;
నా మేను వణుకుచున్నది ;
నాలోని శక్తులుడిగినవి; జీవచ్ఛవమైతి;
నా కేది దారి? నీ పాదముల చెంత చేరుటకు;
ఎవరు? ఎవరు ? నాకీ శిక్ష విధించారు;
నేనే పాపము చేసితో;
పరమపద సోపానముల నే రీతి ఎక్కుదును;
నీ దివ్య దర్శనమెప్పుడో?
ఈ నిశీధి ఆర్ణవంలో జ్యోతుల నెక్కడ గాంచెద;
కాలం కదలిపోతూంది; {చెద;}
జీవితం ఆగేదెప్పుడు? ……
కథలు కారుణ్యాలయి; గాధలు అగాధములయినవి;
నా మొర లెవరాలకింతురు?

************************************,
-19- ఈ మనసు ఏల? ఈ మమకారాలు ఏల?
“నీలి నీడను నడుస్తాను: నీ ఛాయను చరిస్తాను :
నీ హృదిలో హర్షిస్తాను; ……..?”

-23-“మరువలేను నిన్ను;
మలుపు లేదు నా మనుగడలో; …”
-24- ఓ విధీ! ఏమిటి నీ నిర్ణయం:
ఓ మదీ! ఏమిటి నీ ఆశయం:
ఓ తుదీ! నీదే గెలుపు.”

-25- నీ చెంత నేనెంత; నీ లోకమే నా లోకము;
నీ చెంత నేనెంత? ఆవంత గాక! అణువంత గాక! -27-

పగిలెను హృదయ కలశము; అతుకుట ఎటులో”

“సులోచనా సింహాద్రి గారి అంతరాంతరాళలో నుంచి ఈ ఉవ్వెత్తున ఎగసిపడిన భావ తరంగాలు. అందుచేతనే ఇందులోని ప్రతి అక్షరాన్నీ ఉటంకించవలసి వస్తూన్నది. ఆమె జీవిత కాంచన కలశం లో నింపిన కవితా సీమలో చిలికిన విషాదముతో కూడిన తీపి గత స్మృతుల మధు బిందువులు ఇవి.

-28- నీవేనా ; నా హృదిలో;
నా మదిలో; నీవేనా;
అనురాగ మాలికలు అల్లినది;
వివిధ కుసుమాల; సుగంధాలు వెదజల్లినవి;
అవి ముత్యాల సరాలై; నా కంఠాన్ని అలంకరించినవి;
అవి రత్నాల రాశులై; నా హృదయాన్ని స్పృశించినవి;
ప్రతి ముత్యం ఒక ప్రేమ వాక్కుగా;
ప్రతి రత్నం ఒక ప్రేమ దృక్కుగా;
ప్రతి పుష్పం ఒక అనురాగ బంధంగా వెలిసినది; ;
ఆ చూపులే నన్ను అయస్కాంతంలా ఆకట్టుకున్నాయి;
అవి మరువరాని మధురానుభూతులైనాయి;
ఆ తీరాలు పవిత్రమయినవి;
ఆ ప్రేమ ఫలించి ఆ నోము పండింది;
ఆ చూపులే జీవిత పధాన్ని నడిపించినవి;
అయినా; ఈ నాడు జీవితంలో
ఆ చూపులే కానరావు ఇక. (58 పుట);

“సులోచనా సింహాద్రి తన మనవళ్ళకు పంచిన మాధుర్యాలు; నా ముద్దుల మనుమడు స్వధీప్ ను ఉద్దేశించి:- అనే కవిత ఉన్నది.

“నా కనులు నిను లాలించెనోయి
నిదుర పోవోయి;
నీ కనులలో నా మమత కురియుచున్నాది;
నా కనులలో నీ నవ్వు వికసించెనోయి;
నా హృదయమంతా నీ నవ్వు వికసించెనోయి;
నీ కోసమే నా జీవితమోయి ;
నా కోసమే నీవు ఉద్భవించావోయి;
నాతో నీ తెలిసి తెలియని బాసలు చేసేవోయి; ||

నీ ముద్దుల మురిపాలతో; మురిపించావోయి;
నీ లాలింపు కోసమే నే గానం చేసానోయి;
నా కనులు నిను లాలించెనోయి;”

*******************************,

అమ్మ:- అనే శీర్షిక – కవిణి ఎడదలోని సౌకుమార్య భావ నళినముల విరబూతలు;

“అమృతమయమయిన ప్రేమనిచ్చిన అమ్మవు;
మమత నిచ్చిన మాతృమూర్తి వీవు;
కష్టముల కోర్చి త్యాగము చేసిన త్యాగమూర్తివీవు;
కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాని ప్రార్ధిస్తూ;
ఈ నీ డెబ్భయ్యవ సంవత్సరములో,
రిక్త హస్తములతో;
నీ పాదములకు నమస్కరిస్తున్నా;
మా తల్లి చల్లని చూపులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తున్నా”

ఇక్కడ తన యొక్క కన్నతల్లిని గూర్చిన కవితనూ, అదే పట్టున – తానే అమ్మ ఐ, తన బిడ్డలా పట్ల బాధ్యతలను నేరవేర్చినట్టి జననిగా తన ఆచరణలనూ ఒకే సూత్రంలో కూర్చారు సులోచనగారు,రెండింటికీ విడిగా ఉప శీర్షికలు పెడ్తే బాగుండేదేమో!?

“ఆనందమయిన అమ్మగా;
ప్రేమమయమయిన అమ్మగా;
ముద్దులు కురిపించిన అమ్మగా;
మీ ఆశలు తీర్చిన అమ్మగా;
మీ విద్యాబుద్ధులు గరపిన అమ్మగా;
మీ అభివృద్ధి ఆశయంగా అలరించాను;
మీ కాంతి నిచ్చే కనులలో;
మెరసిపోతున్న మురిపాలు;
రునగవుల దరహాసములు;
ముత్యాల పలుకుల జల్లులు;
ముఖాన్న చిందేటి అందాలు;
నా జీవితానికి మేటి అలల నురగల వెలుగుతళుకులు;
నా మేటి మేధావి పుత్రుడవు సుధీర!
నా బంగారు కలలే పండించావు శోభ!
నా జీవితానికి రేఖనే గీచావు సురేఖ!
నా ఆశయాలకు రూపాన్నిచ్చేవు స్వరూప!”- (page 62) ;

మధు బిందువులు:- అనే కవితను కొసమెరుపుగా చేర్చారు.

“వసంతాన్న ప్రేమ చిగురించె మమకారాలు –
ఆనందం ఆర్ణవమై;
శిశిరం మంచు కరడు కట్టిన హృదయమై;
హేమంతాన్న హృదయం కరిగి
అనుభవాల అనుబంధాలతో అలరారి;
గ్రీష్మంలోఆశ్రుపూరితమై;
లోకం పోకడలను గుర్తించే జీవితము;
ఈ జీవిత ఋతువుల విశ్లేషణే;
భావ పరంపరలై మదిలో వీచికలై;
కవితలై ఉద్భవించిన మధు బిందువులు”
****************************

జనవరి 1993లో 500 ప్రతులు ముద్రణ జరిగింది.
అప్పటి అడ్రసు: –
కృష్ణపురి కాలనీ. 38- వెస్త్ మారేడుపల్లి, సికిందరాబాదు;
****************************
Madhu binduvulu

Sulochana Simhadri
About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వెండివెన్నెల: మళ్లీ మళ్లీ నిర్మించిన సినిమాల ముచ్చట్లు

వ్యాసకర్త: కాదంబరి ************* వెండి తెరకు శీతల వెన్నెల భాష్యాలు వెలయించిన పుస్తకం ‘వెండ...
by అతిథి
0

 
 

సాహితీ నీరాజనం – శ్రీ చీమకుర్తి శేషగిరిరావు

వ్యాసకర్త: కాదంబరి ******* ఆంధ్రస్య మాంధ్ర భాషా చ| న అల్పస్య తపసః ఫలం|| అని అప్పయ్య దీక్షిత...
by అతిథి
2

 
 

“శృంగార నైషధము” విశ్లేషణ – కొల్లా శ్రీకృష్ణారావు

వ్యాసకర్త: కాదంబరి ****** “కవికీ, కంసాలికీ సీసం లోకువ.” అని నానుడి. కంసాలి లోహమైన ‘సీ...
by అతిథి
0

 

 

పద్మావతి కృషి

వ్యాసకర్త: కాదంబరి ******* పోట్లూరి పద్మావతి అనేక ఆధ్యాత్మిక పుస్తకములను రచించారు. అన్న...
by అతిథి
1

 
 

కాళికాంబా సప్తశతి

వ్యాసకర్త: కాదంబరి *********** “ముడుమాల” ఒక మారుమూల పల్లెటూరు. ఐతే ఆ చిన్ని కుగ్రామం గొప్ప అ...
by అతిథి
2

 
 

అక్క మహాదేవి సమగ్ర వచనాలు

వ్యాసకర్త: కాదంబరి ******* కర్ణాట సీమను వచన కవితాసీమను సాహిత్యముతో పరిపుష్ఠం చేసిన మహామ...
by అతిథి
3