ముంగారు వానకు తడిసిన మట్టివాసన
“కొల్లబోయిన పల్లె” అనే ఈ కథాసంపుటిలో –
సిద్ధాంతాల బరువు లేదు.
ఉపదేశాల గోల లేదు.
రాజకీయాల గొడవలేదు.
మిరుమిట్లు గొలిపే శైలి లేదు
వాస్తవానికి అందని “మంచి” ని చేసే సాహిత్యపు భ్రమలు లేవు.
మట్టిని వదిలి పూలపరిమళాల భావుకత్వంతో తేలిపోయే చప్పరింతలు లేవు.
కరువులో పుట్టి, కష్టాల మధ్య పెరిగి, దుఃఖాన్ని ఆర్తిగా మార్చుకుని, ఆ ఆర్తి ద్వారానే తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి తెలుసుకున్న, తెలుసుకుంటున్న, తెలుసుకుంటూ తనను తాను చదువుకుంటున్న – ఒకానొక సీమ రైతు రచయిత అంతరంగపు ఆవిష్కరణలు ఈ కథలు . ఉహూ…కథలు కావు. వాస్తవికతకు దర్పణాలు.
కథల్లో దొరిలే పాత్రలు, నేపథ్యం నిత్యజీవితంలో కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ కథాసంవిధానంలో కల్పనలు తప్ప వస్తువులో కృతకమైన కల్పితాలు లేవు. ఆంధ్రదేశానికి మారుమూల, కరవుసీమ అనంతపురం జిల్లాలో కర్ణాటక సరిహద్దులో జీవన చిత్రాలను రాసుకున్న అత్యంత సాధారణ గ్రామీణుల కథలు ఇవి.
సాధారణంగా చాలామంది పాఠకులకు ఒక బలహీనత చూచాయగా కనిపిస్తుంది. “గొప్ప” రచయితలందరూ గొప్ప కథలు రాస్తారని. నిజమో, అబద్ధమో తెలియదు. అయితే ఆ భావన వెనుక – “గొప్ప” కథలను తెలుసుకోవాలన్న కుతూహలం కన్నా, “గొప్ప”తనాన్ని నమ్ముదామన్న తహతహ ఎక్కువ అనిపిస్తుంది. ఇది మనిషి సహజమైన బలహీనతో లేక బుద్ధివిశేషమో మరి. గొప్పవైన కథల అన్వేషణలో పడి “గొప్ప” సంగతేమో కానీ కాసేపు నేలపైన కుదురుగా నిలబెట్టే రచనలను మనం మర్చిపోయే అవకాశం ఉంది. అలా తేలికగా మర్చిపోగల మరువరాని కథకులు మనకున్నారు. వారి సరసన కథకుడు చేరగలడు.
ఈ కథలన్నిటా మూలసూత్రం అనంతపురం జిల్లా కరవు. ప్రాకృతికమైన కారణాల ద్వారా ఏర్పడిన ప్రమాదం కన్నా మనిషి స్వార్థపు పర్యవసానాల ద్వారా వచ్చిన విపత్తుగానే కథకుడు గుర్తించడం కనబడుతుంది. కథల్లో చిలక్కొట్టిన జాంపండులా చిలికిన మాండలికం. విభిన్నమైన తెలుగు నుడికారాలు, సామెతలు. వీటిని కలబోసుకున్న నేలబారు మనుషుల, నేలబారు జీవితాల సారం ఈ పుస్తకం. కథకుడు నీతిసూత్రాలు చెప్పడు. సిద్ధాంతాలు మాట్లాడడు. ధర్మోపదేశాలు చెయ్యడు. కథ మాత్రమే చెపుతాడు. చల్ల చిలికితే వెన్న తట్టు తేలినట్టు – కథ ద్వారా అందమైన నీతి, చిక్కని నిజాయితీ ఉబికి బయటకొస్తుంది.
మచ్చుకు ఓ మూడు కథలు.
*******************
కొండయ్య – కొండంత మనసున్న రైతు. ఎదురైన ప్రతి మొలకకూ పదును నీరు పెట్టి కాపు కాస్తాడు. మానవనాగరికతకు చిహ్నమైన నీటిని నది పేరు పెన్నమ్మగా తన కూతురుకు పెట్టుకుంటాడు. పెన్నమ్మ పెద్దదయ్యింది. వ్యవసాయం కలిసిరాక ఉబుసుపోకకు చదువుకున్న చదువు సాయంతో పట్టణంలో టీచరు అయింది. “చక్కెర ఎలా వస్తుంది?” – అంటే స్టోరులో కార్డు చూపిస్తే వస్తుంది అని సమాధానం చెప్పే పిల్లలకు పాఠాలను వాస్తవిక స్పృహతో నేర్పుతుంది. రైతుబిడ్డగా తనకు అబ్బిన విద్యలో భాగంగానే ఊళ్ళో విద్యార్థుల ఇళ్ళ దగ్గరున్న పెరిగే చెట్లన్నీ నీరసంగానూ, ఊరి చెరువుగట్టునున్న చెట్లన్నీ బలంగానూ పెరగటం గుర్తించింది. అందుకు కారణమూ ఊహించింది. అంతే కాదు. తన స్కూలు ముందున్న దెయ్యంచెట్టునూ చూసింది. ఆ దెయ్యంచెట్టును ఒక్క ఉగాది రోజు మాత్రం మామిడి చెట్టుగా మార్చి దాని ఆకులు తెంపుకుని బోడి చేసే పట్టణవాసుల అనాగరికతను చూస్తుంది. మట్టికి, చెట్టుకు మంచి చెయ్యని పట్టణవాసుల కుహనా సంస్కృతికి మనసు నొచ్చుకుంటుంది. చదువుకంటే విద్యను ప్రజలకు చెబుతుంది పెన్నమ్మ. ఆమె మాటలను పట్నవాసులకన్నా పల్లెటూరి వాళ్ళు బాగా అర్థం చేసుకోవడం కొసమెరుపు.
ఈ కథ మధ్యలో ఒక చిన్న పాప, తన టీచరు పెన్నమ్మను ఒక చిన్న విషయం అడుగుతుంది – “చెట్లు మనుషులలా నడవలేవు కదా, మరి వాటికి ప్రాణం ఉందని నమ్మటం ఎట్లా?” – ఈ ప్రశ్నకు టీచరు పెన్నమ్మ చెప్పే సమాధానం విద్య తెలిసిన పల్లెటూరి వ్యక్తి మాత్రమే చెప్పగలిగినంత అందంగా, అనాయాసంగా కథారచయిత పెన్నమ్మ చేత చెప్పిస్తాడు.
(వృత్తి) విద్య గొప్పదా? చదువు గొప్పదా?
“ఉగాది” అన్న కథలో పై విషయం నిదర్శనాత్మకంగా బయటకు వస్తుంది.
*******************
పుట్టు గ్రుడ్డి ఎద్దులప్ప ఎందుకూ పనికిరాని దండగమారి బ్రతుకని అందరికీ అలుసు. ఈ ఎద్దులప్ప ఇంట్లో అందరూ తినగా మిగిలిన సంకటిని నీళ్ళమజ్జిగ పోసుకుని కాలేకడుపు చల్లార్చుకుంటాడు. ఆపైన ఏ గడ్డివామికో, పశువులకొట్టానికో కాపలా. ఎద్దులప్ప కళ్ళు గుడ్డివైనా అంతరంగం గుడ్డిది కాదు. ఊపిరిచప్పుడుతో గడ్డివామి దగ్గర మసలే మనుషులను, పశువుల ప్రవర్తనను అంచనా కట్టగలడు.
ఓ రోజు తన ఇంటికి జీవనాధారమైన ఎనుము తప్పిపోయింది. గుడ్డివాడైన ఎద్దులప్ప ఒక చిన్న పిలగాడి సాయంతో పక్కూరికి ఎలబారి, ఎనుమును, పెయ్యనూ ఎలా గుర్తుపట్టి కనుక్కున్నాడనేది మరొక కథ.
చాలా సులభంగా కనిపించే ఇలాంటి కథ వ్రాయడానికి చాలా సూక్ష్మపరిశీలన, ఒక గుడ్డివాని మనసును చదవగల శక్తి, నేర్పు, సున్నితత్వమూ, అంతకన్నా ఎక్కువ దమ్ము కావాలి. సహజమూ, సుందరమూ, సాధారణమూ అయిన కథ ఆర్తిగా ఉంటుంది. సహజత్వంలోని సౌందర్యభావం అపురూపమైనది.
*******************
అనగనగా ఒక పల్లె. ఎగువన పదునైన వానబడితే దిగువకు పరవళ్ళెత్తే పెన్న ఒడ్డున రైతులపాలిట నందనవనంలాగా ఉంది. అది కానుగులపల్లె. మనిషికి స్వార్థం ఎక్కువయ్యింది. ఆ స్వార్థంతో ఎగువన నీళ్ళకు అడ్డుకట్టలు వేశారు. ఇక్కడ పల్లెలో సోమరితనాన్ని వ్యవస్థీకరించడం మొదలయ్యింది. దగ్గరలో ఉన్న ఊర్లో కర్మాగారం వచ్చింది. రూకలరావు గారి పుణ్యాన కానుగులపల్లె ఇటుకలపల్లెగా రూపాంతరం చెందింది. అక్కడికి రాజకీయం చేరింది. కుర్చీరావుగారొచ్చారు. మనుషులను విడదీశారు. వాళ్ళల్లో తక్కువజాతిగా వర్గీకృతమైన జనాలను ఉద్దరించడానికి కుర్చీరావు బామ్మర్ది అవకాశరావు బయల్దేరాడు. సంతకాలు పెట్టగల చదువు నేర్పసాగారు. క్రమంగా ఆ పల్లెలో జనాభా వలసపోయింది. ఇప్పుడది కొల్లబోయిన పల్లె.
మార్క్సిజాన్ని తెలుసుకోవడానికి, వస్తుమార్పిడి – ద్రవ్యమార్పిడి పర్యవసానాన్ని అంచనాకట్టడానికి, శ్రమదోపిడీ పద్ధతులను ఊహించడానికి మార్క్స్ అవసరం లేదు. కళ్ళ ఎదుట నిజాలు చూస్తే చాలు. ఈ కథ మొత్తం ఈ జిల్లాను గురించిన సంక్షిప్తమైన గాథగా చెప్పుకోవచ్చు. ఇంతకంటే స్పష్టంగా సూటిగా సీమ తాలూకు పరిస్థితిని కథ రూపంలో చెప్పిన కథలు బహుశా అరుదు.
*******************
20 కథల్లో ఓ మూడుకథల క్లుప్తమైన సారాంశం ఇది. ఈ మూడుకథలకంటే మంచి కథలు, మించిన కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. ఒకరకంగా చూస్తే – కథాసంపుటికి ఈ పరిచయవ్యాసం సరైన న్యాయం చెయ్యదని చెప్పాల్సి ఉంటుంది.
సీమ మాండలికం సొబగులు చిక్కగా అద్దుకున్న మాటలు – గుడుగు (ఉరుము), అవిటిని (వాటిని), యావుది (ఏది), మించు (మెరుపు), జాలిమాను (తుమ్మచెట్టు), కసువుపాసు (గడ్డిపోచ), పొల్లాపగలు (ఎప్పుడూ), వరమానం (గిట్టుబాటు) మెరవణి (జాతర), తెలిసేల్లేదు(తెలిసేది లేదు) – వంటివి కోకొల్లలు.
కొన్ని సామెతలు, నుడికారాలు –
కూలిసేస్తే కుండ గాలే లేకుంటే ఎండగాలే,
ఉత్తోడా బట్టగప్పు అంటే రెండుకాళ్ళు మిందేసెనంట
నన్ను ముట్టుకోవాకు నామాలకాకి
ఉప్పు దిన్నంత దప్పి శానా
ఉత్తర జూసి ఎత్తర గంప
గువ్వను గుడ్లను మింగి గుడ్లు మిటకరించే అడవిపిల్లి మాదిరి
…
…
కొందరు కథలు రాస్తారు. కొందరు చెబుతారు. ఇవి రెండవకోవకు చెందినవి. ఆకాశవాణి కడప కేంద్రంలో వినిపించిన, వినిపిస్తున్న కథలు. కొన్ని కథల్లో వెగటు, అక్కడక్కడా తీవ్రమైన నిర్వేదం ఉన్నాయి. అయితే అవాస్తవికత లేదు. మాండలికం ఇతర ప్రాంతాల పాఠకులను రవ్వంత ఇబ్బంది పెట్టవచ్చు. అయితే అర్థం కానంత ఇబ్బంది రాదు.
సీమ కథను పరిపుష్టం చేసిన కథకులు ఎందరో ఉన్నా, కథల్లో సంభాషణలే కాక, కథ చెప్పే పద్ధతిలోనూ మాండలికపు సొబగులు అద్దటం మొదలుపెట్టిన కథకుడు బహుశా నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు. చిదంబరరెడ్డి గారి కథల్లో ఈ ధోరణి కనబడుతుంది. ఈయనది అనంతపురం జిల్లా మాండలికం. ఈ కథాసంపుటి మొదట్లో “నేను నడిచిన దారి” పేరిట కథకుడు తన స్వీయానుభవాలను చెబుతాడు. కథలను చదివిన తర్వాత ఈ ఉపోద్ఘాతాన్ని చదవడం మంచిది. రచనకు స్వీయజీవితానుభవం అవసరం గురించిన ఒక దృష్టాంతం కనిపిస్తుంది.
కాగితం అనే మట్టిపై రచయిత కలం అనే తొలకరి చిలికితే పులకరించి గాలిలోకి గుప్పుమన్న పచ్చిమట్టి తాలూకు సౌరభాలు “కొల్లబోయిన పల్లె” అనే కథా సంపుటిలో కథలు. రవ్వంత మనసు పెట్టుబడికి కొండంత వరమానం.
(పాలపిట్ట ప్రచురణ)
Sadlapalle Chidambara Reddy
సోదరా!! నాలో చిన్నప్పటినుండి ఒక వెళితివుండేది.సినిమాల్లోకాని,కథల్లో కాని నేను చూస్తున్న సమాజం,ఇక్కడి సమస్యలు,భాష…ఎక్కడా కనిపించదే??అని.17సం.వయస్సులోనే రచనలు ప్రారంభించినా భావసారూప్యతగల రచయిత కాని,కవి కాని నాకు తెలియదు.దాని జతకు భయంకరమయిన అనారోగ్యం ప్రతిక్షణం నన్ను నేను బ్రతికించుకొనే ప్రయాస.40సం.వయస్సు వచ్చాకే నా భాషలో కూడా రాయవచ్చని,ఇక్కడి సమస్యలకూ కథా గౌరవం వున్నదని డా.పెద్దిరెడ్డిద్వారా అటువంటికథలు చదివి తెలుసుకోవడం జరిగింది.
ఉద్యోగవిరమణ తర్వాత రెండు పుస్తకాలు ప్రచురించి(అప్పటికి ఆరోగ్యం కొంత కుదుట బడింది)మనరాష్ట్రం,ఇతర కొత్త ప్రదేశాలూ చూడాలనుకొన్నాను.1999 లో నేర్చుకొన్న కవిత్వం రాసే పద్ధతిమీద మనసుపడింది.రైతుగా నా అనుభవాలనే కవిత్వీకరించడం ప్రారంభించా.పాఠకులనుంచి మంచి స్పందన,అయిదారు బహుమతులూ వచ్చాయి.మాప్రాంతం గురించి చెప్పాల్సింది చాలావుంది.కారామాష్టారుకూడా మానేపథ్యంలో నవల రాయమన్నాడు.కొంతరాసి వదిలేయడం జరిగింది.అయితే నేనను కొన్నదంతా అక్షరరూపం పొందే అవకాశమొచ్చింది.
నాపుస్తకాలను దాదాపు అన్నిపత్రికలకూ పంపడం జరిగింది.జ్యోతిలో తప్ప ఎక్కడా సమీక్ష రాలేదు.వాటిగురించి మరిచిపోయాక నన్ను గురించి ఏమాత్రం తెలియని మీరు కథలగురించి హృదయాన్ని తడిమేవిధంగా చక్కని పరిచయం చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
Thirupalu
//సిద్ధాంతాల బరువు లేదు.
ఉపదేశాల గోల లేదు.
రాజకీయాల గొడవలేదు.
మిరుమిట్లు గొలిపే శైలి లేదు
వాస్తవానికి అందని “మంచి” ని చేసే సాహిత్యపు భ్రమలు లేవు.
మట్టిని వదిలి పూలపరిమళాల భావుకత్వంతో తేలిపోయే చప్పరింతలు లేవు.
కరువులో పుట్టి, కష్టాల మధ్య పెరిగి, దుఃఖాన్ని ఆర్తిగా మార్చుకుని, ఆ ఆర్తి ద్వారానే తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి తెలుసుకున్న, తెలుసుకుంటున్న, తెలుసుకుంటూ తనను తాను చదువుకుంటున్న – ఒకానొక సీమ రైతు రచయిత అంతరంగపు ఆవిష్కరణలు ఈ కథలు . ఉహూ…కథలు కావు. వాస్తవికతకు దర్పణాలు.//
ఇలా రాయడం కూడా ఒక రాజకీయమే. వాస్తవం అంటే అసలు అర్దమేంటి? ఏ కోణం నుండి ఇది వాస్తవం? రచయిత టోన్ ఏంటి? వాస్తవం అంటే కళ్లకు కనపడెదా? అది కూడా చూసే వారి కళ్లను బట్టి ఉండదా? ఎవరి కళ్ల నుండి చెబుతున్నారు? ” నామిని సుబ్రమొణ్యం నాయుడుకి ఏ టోన్ లేదా? అది ప్రజల జీవితం అయితే వారు ఏ సంస్కృతి నుండి వచ్చారు? వారి చుట్టు ఉన్న పరిసరాలేమిటి? వారు కష్టాలు పడుతునారంటె దానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నలేమి రావా? ఇవి నాకొచ్చిన సందేహాలు. విపరీతమైన వైతే వదిలేయండి.
తృష్ణ
పరిచయం ఆసక్తికరంగా ఉందండి. ధన్యవాదాలు.
Narayanaswamy
బ్యూటిఫుల్.
“”“గొప్ప” కథలను తెలుసుకోవాలన్న కుతూహలం కన్నా, “గొప్ప”తనాన్ని నమ్ముదామన్న తహతహ ఎక్కువ అనిపిస్తుంది. “”
Very valid observation. Not only in literature but in many experiences.