సూటిగా, ఘాటుగా, నాటుగా – ఎట్గర్ కెరెట్ కథలు

నా లెక్క ప్రకారం కథలు రెండు రకాలు – ఒకటి, నాకు నచ్చినివి. రెండు, తక్కినివి.  మంచి కథలు, మంచిన్నర కథలు, గొప్ప కథలు ఉండచ్చుగాక, వాటికి కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు ఉండచ్చుగాక, అయినా నా లెక్క ప్రకారం కథలు రెండు రకాలు మాత్రమే!

కథ ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి అన్న కొన్ని రూల్స్ ఉండి ఉండచ్చు. వాటిని తు.చ తప్పకుండా పాటించి అదే ఫ్రేమ్‍లో ఎలాంటి కథనైనా ఇరికించగల కథకులు ఉండి ఉండచ్చు. వాటిలో గొప్ప కథలు ఉండచ్చు. వాటిని గురించి నాకే అభ్యంతరాలూ లేవు. కానీ, అలాంటి రూల్స్ అన్నింటినీ ఉల్లంఘిస్తూ చేసిన రచనల్లో కూడా కొన్ని మంచి కథలు ఉండచ్చు. మంచివో, గొప్పవో కాకపోయినా, నాకు నచ్చిన కథలు ఉన్నాయి. అలా కొత్త పంథాలో నాకు నచ్చేటి కథలు అందించిన  రచయిత, ఇజ్రాయిల్‍కు చెందిన “ఎట్గర్ కెరెట్”. ఈయన హిబ్రూలో రాసిన కథలను ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి. “అనువాదం తర్వాత నా కథలో మిగిలింది పిప్పి మాత్రమే. హ్రిబ్రూ భాషలోని గమ్మత్తంతా అనువాదంలో మిస్ అయిపోతుంది.” అని ఆయనే ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ లైన్ చదవగానే హిబ్రూ రానందుకు నాకు బాధేసింది. ఆ భాషే వచ్చుంటే ఈ కథలు నాకు ఇంకెంతగా నచ్చుండవో ఊహించుకున్నాను. రానురాను అర్థమయ్యింది, కెరెట్ కథలలో అనువాదం తరవాత మిగిలింది  కేవలం పిప్పే అయినా కూడా, అవి ఎంత రిచ్‍గా ఉన్నాయో, అవి ఎంతలా పాఠకుణ్ణి వెంటాడతాయో అని. ఎంత గొప్ప భాషలో చెప్పినా, కథలో సరుకుండాలి. అదున్నప్పుడు, మిగితావన్నీ హంగులే అవుతాయి.

ఎట్గర్ కూడా ఒకట్రెండు యుద్ధాలలో పాల్గొన్నారు. ఈ యుద్ధాల బాక్‌గ్రౌండ్ ఉన్న రచయితలు చేసే రచనల్లో డార్క్ హ్యూమర్ ఉంటుంది. ఉదాహరణకు జోసెఫ్ హెల్లర్, కర్ట్ వాన్‌గట్. వీళ్ళ కథాంశాలు ఎక్కువగా the darker sides of life గురించే ఉంటాయి. అయితే, వాటి ట్రీట్మెంట్ మాత్రం కాస్త హాస్యాన్ని, ఇంకాస్త వ్యంగ్యాన్ని కలుపుతూ, నవ్వించినా, ధీర్ఘంగా నిట్టూర్చేలా కూడా చేస్తాయి. ఎట్గర్ కథల్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ కథల్లోని పాత్రలు ఎక్కడివారైనా, ఏ మతస్థులైనా, వారి వారి నేపథ్యాలు ఎలాంటివైనా, వాళ్ళల్లో ఏదో ఒక అంశం మనకి చాలా దగ్గరగా అనిపిస్తుంది. మనుషులు విసిరివేయబడ్డట్టు ఎంతెంత దూరాన ఉన్నా, ఒకరి నుండి ఒకరు ఎంత వేరుగా ఉన్నా, మనిషిలోని బేసిక్‍గా ఉండేవి అందరిలోనూ అలానే ఉంటాయని గుర్తు చేసేలా ఉంటాయి ఈ కథల్లోని పాత్రలు. అవి ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా, అవి చేసే పనులకు, తీసుకునే నిర్ణయాలకు కారణాలు ఏవైనా వాటిపైన empathy కలుగుతుందేగానీ, హేయభావం కలుగదు.

నేను చదివిన “The Nimrod Flip-Out” అనే కథల సంపుటిలో ఉన్న కథల్లో, నాకు నచ్చిన కథల గురించి రెండేసి మాటలు. “A visit to the cockpit” అనే కథలో యుక్తవయసుకి వచ్చిన అమ్మాయిని తండ్రి వాళ్ళు ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో కాక్‍పిట్ చూడ్డానికి తీసుకెళ్తాడు, వద్దు వద్దంటున్నా. అప్పటికే ఆమె తన బాయ్‌ఫ్రెండ్ కలవడానికని ఆ ఊరు వచ్చి, అక్కడ అతడితో కొన్ని రోజులు గడిపి, తన నుండి దూరంగా వచ్చాక అతడికి వేరొకరితో సంబంధం ఏర్పడిందని తెల్సుకుంటుంది. ఆ విషయం ఇప్పుడు ఫ్లైట్‍లో గుర్తొచ్చి ఏడుస్తుంటుంది. కూతురు ఎందుకు ఏడుస్తుందో కారణాలు తెల్సుకోకుండా, కాక్‌పిట్ అంటూ హడావుడి చేస్తాడు. తన బాధను దిగమింగలేక, తండ్రి చేష్టలను భరించలేక ఆమె అవస్థ పడుతూ ఉండడంతో కథ ముగుస్తుంది. “Surprise Egg” అనే కథలో ఓ ముప్ఫై మూడేళ్ళ యువతి టెరర్రిస్ట్ అటాక్‍లో చనిపోతుంది. ఆమె మృతదేహానికి పోస్ట్-మార్టమ్ చేసినప్పుడు ఆమె శరీరమంతటా ట్యూమర్లు వ్యాపించి ఉండడం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోతారు. దాడి జరగకపోయున్నా ఆమె ఎటూ చనిపోయేది, అంతలా కాన్సర్ వ్యాపించి ఉంది. ఆ ముక్క ఆమె భర్తకు చెప్పటమా, వద్దా అన్నది తేల్చుకోలేకపోతారు డాక్టర్. ఆమె అంత్యక్రియల రోజున కూడా ఆలోచిస్తూనే ఉంటాడు, చెప్పాలా, వద్దా అని. ఆఖరికి చెప్పకుండానే వెళ్ళిపోతాడు. భార్య పోయిన వెలితి ఇంకా అలవాటు పడని రాత్రుల్లో ఆమె భర్త అర్థరాత్రి లేచి కిచెన్‍లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, ఆ రోజు తనే గనుక ఆమెను తీసుకురావడానికి వెళ్ళుంటే, ఆమె ఇంకా బతికే ఉండేదని అతడి ఆలోచన. ఈ కథ రెండు లేయర్లో పనిజేస్తుంది. ఒకటి, ఆ పోస్ట్-మార్టమ్ చేసినవాడి డైలమా. రెండు, భార్యను పోగొట్టుకున్న భర్త గిల్టీ ఫీలింగ్.

“Glittery Eyes”అనే కథలో ఒక స్కూల్ పిల్ల, తన క్లాసులో ఒక అబ్బాయికున్న మెరిసే కళ్ళు కావాలని మారాం చేస్తుంది. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయికి ఎలా వచ్చాయో కనుక్కో, అక్కడికే పోయి తెచ్చుకుందాం అని చెప్పి తప్పించుకుంటుంది. ఈ పిల్ల నిజంగానే వెళ్ళి ఆ పిల్లవాడిని అడుగుతుంది. “దేన్నైనా బలంగా కోరుకున్నప్పుడు కళ్ళల్లో మెరుపు వాటంతట అదే వస్తుందని” అని చెప్తాడు. ఆమె ఎంత కోరుకున్నా ఆమె కళ్ళల్లో ఆ మెరుపు రాదు. ఎందుకని నిలదీస్తుంది. “బలంగా కోరుకున్నా దొరక్కపోతే అలా మెరుస్తాయి” అని చెప్తాడు. అంతలా ఏం కోరుకుంటున్నావ్ అని ఆరా తీస్తుంది. “నీ స్నేహం” అని చెప్తాడు. ఆమె “కుదరదబ్బాయ్.. నేనెక్కడ, నువ్వెక్కడ? అయినా నీలో ఈ మెరిసే కళ్ళు తప్ప ప్రత్యేకత ఏం లేదు. నేనుగానీ స్నేహితురాలిని అయితే ఇహ ఆ ప్రత్యేకతా మిగలదు” అని చెప్పి వెళ్ళిపోతుంది. అతడి కళ్ళు ఇంకా ఇంకా మెరుస్తాయి. ఇందులో పాత్రలు చిన్నపిల్లలే అయినా, వారు మాట్లాడే భాష, భావాలు ఆ వయసుకి తగ్గట్టుగానే ఉన్నా, కోరిక-అది నేరవని బాధను depict చేసే పెద్దల కథలానే అనిపిస్తుంది. “Ironclad Rules”లో ఒక కొత్త జంటకు ఓ ముసలతను తన అనుభవాలు చెప్పే కథ. “A thought in the shape of a story”లో ఒక్కప్పుడు చంద్రుడిపై నివసించేవాళ్ళు ఆలోచనలు వస్తువులుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఇదో ఆసక్తికరమైన కథ.

కథలన్నీ ఒకటి నుండి నాలుగు పేజీలలో పెట్టేంత చిన్న కథలు. కథాంశాలు ఎక్కువగా సిటి బ్రెడ్ యువత ప్రేమలూ, చిరాకులూ, వాళ్ళ అభద్రతల చుట్టూ తిరుగుతాయి. కథనంలో ఒక ease ఉంటుంది. వచనంలో భారీ భారీ వాక్యాలుగానీ, అవసరంలేని ఉపమానాలుగానీ ఉండవు. రోజూవారి సంభాషణల్లో దొర్లే మాటలతోనే కథ మొత్తం చెప్పేస్తాడు. కథాంశంలో సంక్లిష్టతేగానీ కథనంలో ఎక్కడా సంక్లిష్టత ఉండదు. వర్ణనలతో గుప్పించి, పొడిగాటి వాక్యాలు రాయడం ఒక కళ అయితే, ఏమాత్రం ఆర్భాటాలు లేకుండా ఇలా రాయడం కూడా ఒక కళే! ఈ సంపుటిలో అన్ని కథలూ బ్రహ్మాండంగా ఉంటాయని నేను చెప్పను. కొన్ని చదివీ చదవగానే మరుపుకు రావచ్చు. కానీ నచ్చినివి మాత్రం చాలా ఏళ్ళ వరకూ గుర్తుండిపోతాయి.

ఇవి ఈ కాలపు కథలు. ఇప్పటి పరిస్థితులను, ఇప్పటి మనుషులను ప్రతిబింబించే కథలు. కథ అంటే నీతి కథ కానవసరం లేదు. కథ కోసమని హీరోలనో, విలన్లనో సృష్టించక్కర్లేదు. మన చుట్టూరా బోలెడన్ని కథలు. వాటిని సరిగ్గా గమనించి, శ్రద్ధగా రాస్తే ఎంత చక్కటి కథలు పుట్టించచ్చో చూపే కథలు. వీటిలో నలుపు-తెలుపులు ఉండవు. ఇక్కడంతా “గ్రే” షేడ్ మాత్రమే ఉంటుంది. ఆ గ్రే షేడ్‌ ను ఇష్టపడేవారికి ఈ కథలూ నచ్చుతాయి.

Some of his stories on his official site.

His Interview in Paris review

The Nimrod Flip-Out
Etgar Keret
Fiction
Vintage Books, London
Paperback
219

You Might Also Like

2 Comments

  1. Purnima

    Etgar Keret, for you:

    “You have to live in the moment,” the guy in the story will say, then he’ll sleep with her and break her heart. He’ll never act like some shit she can easily drop. He’ll act like Todd. Which means that even while he fucks up her life, he’ll still be kind and nice and exhaustingly intense, and—yes—poignant too. And that’ll make the whole business of breaking it off with him even harder. But in the end, when it happens, she’ll realize that it was still worth it. And that’s the tricky part: the “it-was-still-worth-it” part. Because I can connect to the rest of the scenario like a smartphone to wireless internet at Starbucks, but the “it was still worth it” is more complicated. What could the girl in the story get out of that whole hit-and-run accident with Todd but another sad dent on the bumper of her soul?

    – See more at: http://recommendedreading.tumblr.com/post/46414384572/todd-by-etgar-keret#sthash.AeoXXlkS.dpuf

  2. ఫణీన్ద్ర పురాణపణ్డ

    సర్ ప్రైజ్ ఎగ్ కథాంశం బీభత్సమైన అద్భుతంగా ఉంది… 🙁

Leave a Reply