పుస్తకం
All about booksఅనువాదాలు

October 2, 2013

సంస్కార – 2

More articles by »
Written by: Jampala Chowdary
Tags: , , ,

(మొదటి భాగం ఇక్కడ)
***
అర్థరాత్రి ప్రాణేశాచార్యులకు మెలకువ వచ్చింది. ఆయన తల చంద్రి ఒడిలో ఉంది. చంద్రి నగ్నశరీరం ఆయన బుగ్గలకు తగులుతూ ఉంది. చంద్రి చేతులు అతని వెన్నును, తలను నిమురుతున్నాయి. తానెక్కడున్నాడో అర్థం కాలేదు. చిన్నతనంలో తల్లి ఒడిలో సేదతీరుతున్న అనుభవం గుర్తుకువచ్చింది. కొంత సమయం గడిచాక ఆయనకు పూర్తి మెలకువ వచ్చింది. రాత్రి జరిగినది కల కాదని అర్థమయ్యింది. లేచి కూర్చుని “చంద్రీ” అని పిలిచారు. ప్రాణేశాచార్యులు తనని కోప్పడతాడో, ద్వేషిస్తాడో అని చంద్రి భయపడుతూంది. ఓ మూల ఆమెకు ఈ కలయిక వల్ల తనకు సంతానం కలిగితే బాగుండునన్న ఆశ కూడా ఉంది. చంద్రి మౌనంగా ఉండిపోయింది.

“చంద్రీ, రేపు ఉదయం బ్రాహ్మణులందరి సమక్షంలో ఏం జరిగిందో చెప్పేస్తాను. ఒకవేళ నాకు ధైర్యం చాలకపోతే నువ్వే చెప్పాలి. అగ్రహారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కుని నేను కోల్పోయాను. నారణప్ప శవానికి అంత్యక్రియలు నేనే చేస్తాను. ఇంకొకరిని ఆ పని చేయమని చెప్పే అధికారం నాకు లేదు” అన్నారు ప్రాణేశాచార్యులు. ఈ మాటలు అన్నాక అప్పటిదాకా ఆయనను ఆవరించి ఉన్న నిస్స్సత్తువ మాయమయ్యింది.

వాళ్ళిద్దరూ అడవినుంచి ఊళ్ళోకి బయల్దేరారు. ఆచార్యులని ముందు పోనిచ్చి చంద్రి వెనుక నడవసాగింది. ప్రాణేశాచార్యులను ఈ పరిస్థితికి తెచ్చినందుకు ఆమెకు బాధగా ఉంది. కానీ ఆత్మవిమర్శతో మథనపడటం చంద్రి లక్షణం కాదు. ఆమె తొందరగానే తనను సంబాళించుకొంది. ప్రాణేశాచార్యుల వెంట వెళ్ళకుండా ఆమె నారణప్ప ఇంటికి వెళ్ళింది. ఇల్లంతా దుర్వాసన. మెట్లెక్కి గదిలోకి వెళ్ళి చూస్తే శవం ఉబ్బిపోయి కుళ్ళిపోతూ ఉంది. ఇంటినిండా చచ్చిపడి ఉన్న ఎలుకలు. తనను ఇంతగా ఆదరించిన నారణప్ప శవం రెండురోజులుగా అలాగే పడి ఉండటం ఆమెను బాధించింది.

పిచ్చిపట్టిన దానిలా చంద్రి ఊరిబయటకు పరిగెత్తింది. బండి కట్టే శేషప్పను లేపింది. “శవాన్ని తీసుకొచ్చి వెంటనే తగలెట్టేద్దాం; ఇంట్లో కట్టెలు చాలా ఉన్నాయి” అని అడిగింది. శేషప్ప భయపడ్డాడు. “బ్రాహ్మణ శవాన్ని అట్లా అపవిత్రం చేస్తే నాకు పుట్టగతులు లేకుండా పోతాయి” అని నిరాకరించాడు. చంద్రికి ఏం చేయాలో పాలుపోలేదు. నారణప్ప ఇంట్లో ఆమె చూసింది తనకు తెలిసిన నారణప్పను కాదు. అక్కడ ఉంది శూద్రుడు కాదు, బ్రాహ్మణుడు కాదు. ఒక శవం మాత్రమే.

చంద్రి ముస్లిములు ఉండే పేటకు వెళ్లింది. చేపలమ్ముకునే అబ్దుల్ బారిని లేపింది. పూర్వం డబ్బు అవసరం వచ్చినప్పుడు సాయపడ్డాడని నారణప్ప అంటే అతనికి కృతజ్ఞత ఉంది. చంద్రి చెప్పిన మాట వినగానే వెంటనే బండి తీసుకొనివచ్చి ెవరికీ తెలియకుండా నారణప్ప శవాన్ని, కట్టెలని స్మశానానికి తీసుకొనివెళ్ళి వెంటనే చితిపేర్చి నిప్పంటించాడు. చంద్రి తన బట్టల్ని, నగల్ని మూటకట్టుకుని రాత్రికిరాత్రే ఊరువిడచి తన స్వగ్రామం కుందపురంవైపు వెళ్ళిపోయింది. వెళ్ళేముందు ప్రాణేశాచార్యులని కలసి ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టుకొందామనుకున్న కోరికను అదుపులో పెట్టుకొంది.

ఇంటికి తిరిగి వచ్చిన ప్రాణేశాచార్యుడి మనస్సు అల్లకల్లోలంగా ఉంది. భార్యకు మందు ఇస్తుండగా ఆయన కాళ్ళు చేతులు వణికి మందు చిందిపోయింది. ఆమె బక్కచిక్కిన రోగిష్టి శరీరాన్ని చూస్తుండగా ఆయన జీవితంలో మొదటిసారి అందమూ, అందవిహీనమూ అనే విషయాలు స్ఫురణలోకి వచ్చాయి. అప్పటి వరకూ ఆయన ఉద్దేశంలో సృష్టి అంతా భగవంతునికి అర్పించటానికే. మొదటిసారిగా ఆయనకు అందం పట్ల కోరిక జనించింది.

సర్వపరిత్యాగం చేసి సన్యాసం తీసుకోవాలని ప్రాణేశాచార్యులకు చిన్నప్పుడే ఉండేది. పుట్టుకతోనే రోగిష్టి ఐన పన్నెండేళ్ళ భాగీరథిని వివాహం చేసుకోవటం తాను చేయాల్సిన త్యాగాల్లో ఒకటిగా భావించి పదహారేళ్ళ వయసులో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను తల్లితండ్రుల దగ్గర ఉంచి కాశీ వెళ్ళి చదువుకుని తిరిగివచ్చి చుట్టుపక్కల గొప్ప పండితుడిగా పేరు పొందాడు. సుఖాల పట్ల ఆశలేకుండా నిరంతరం భగవదారాధనలో మునిగితేలుతూ గడిపాడు. ఇంతకాలం తాను గడిపిన జీవితం, తన నమ్మకాలు అర్థం లేనివేమో అన్న భయం ఆయన్ను సతమతం చేయటం మొదలుబెట్టింది.

ఇన్నాళ్ళూ ఏ అనుభవమూ లేకపోవడం చేత తాను భగవత్సేవలో కాలం గడిపాడు. కామాన్ని తాను వదులుకున్నా, కామం తనని వదలలేదు. తనలో పులిలా పొంచుకు కూర్చుని, అవకాశం రాగానే విజృంభించింది. తనకూ, నారణప్పకూ తేడా ఏముంది? ఇంతకు ముందెప్పుడో నారణప్ప తనను వెక్కిరిస్తూ విసిరిన సవాలు గుర్తుకువచ్చింది. “ఒక్కసారి బయటకు పోయి (వ్యాసమహర్షిలా) ఒక మత్స్యగంధితో సుఖపడు. అప్పుడు తెలుస్తుంది నిజంగా జీవించడమంటే” అన్నాడు నారణప్ప. తనకు నిజంగానే జీవితమంటే తెలీదా?

తెల్లవారాక అగ్రహారీకులు ప్రాణేశాచార్యుల దగ్గరకు వచ్చారు. ఆయన చంద్రి కోసం చూశారు. ఆమె ఎక్కడా కనిపించలేదు. రాత్రి జరిగిన విషయం, నారణప్ప సుఖాన్ని తానూ పంచుకున్న విషయం, అక్కడ వారందరికీ చెపుదామనుకున్నారు. కానీ వెనుకాడారు. తమ సందేహ నివృత్తికి ఎదురుచూస్తున్న వారందరి నమ్మకమూ, విశ్వాసమూ భగ్నంచేసే ధైర్యం ఆయనలో లేకపోయింది. అరచేతుల్లో చెమట పట్టింది. జీవితంలో మొదటిసారి అబద్ధంచెప్పాలి, నిజాన్ని దాచిపెట్టాలనే కోరికలు మనసులో మెదిలాయి. ఐనా భగవంతుని ప్రార్థించి ధైర్యాన్ని కూడతీసుకొని నోరు విప్పారు. కానీ ఆయన నోటినుంచి “నాకేం పాలుపోవటం లేదు. మారుతి దారిచూపించలేదు. నేను అజ్ఞానిని. మీకెలా తోస్తే అలా చేయండి” అన్న మాటలు వచ్చాయి.

ప్రాణేశాచార్యులు ఇలా మాట్లాడటం అగ్రహారీకులని నిరాశపరచింది. ఇక లాభం లేదు, కైమారం ఆశ్రమానికి వెళ్లి అక్కడి శంకరాచార్యులనే అడగాలని నిశ్చయించుకున్నారు. శవం ఉన్న ఊళ్ళో ఏమీ తినకూడదు కాని, ఊరు బయటకు వెళితే మైలస్నానాలు చేసి, ఏమన్నా తినవచ్చు. మగవారందరూ కలసి గురువుగారి ఆశ్రమానికి బయలుదేరారు. ఆడవారినందరినీ బళ్ళెక్కించి పుట్టిళ్ళకు పంపేశారు. ఊళ్ళో ఇళ్ళకప్పుల పైన రాబందులు యథేచ్ఛగా కొలువు తీరాయి. ఊరు బయలుదేరిన తర్వాత మొదటి మజిలీ దగ్గర దాసాచార్యులకు నలతగా అనిపించింది. కొద్దిగా జ్వరం కూడా ఉన్నట్టుంది. ఆయన అక్కడే ఆగిపోయాడు.

ఊళ్ళో మిగిలిపోయిన ప్రాణేశాచార్యులు భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ తనకు మార్గం చూపమని కోరుకున్నారు. ఇంట్లో దేవుడిపటాల ముందు ఒక ఎలుక పడింది. అపసవ్యంగా తిరుగుతూ గిలగిలా కొట్టుకుని చచ్చిపోయింది. దాన్ని బయటపడవేశారు. బయట ఇళ్ళమీద రాబందులు, కాకులు ఒకటే గోల చేస్తున్నాయి. అగ్రహారమంతా నిర్మానుష్యంగా ఉంది. ఒకటే దుర్వాసన అగ్రహారమంతా వ్యాపించి దుర్భరంగా ఉంది. భార్యకు ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. కాసేపట్లో ఆమె ప్రాణం విడచింది. ప్రాణేశాచార్యులు పక్క ఊరుకు నడచివెళ్ళారు. అప్పటికే అక్కడ దాసాచార్యులు మరణించాడు. ఆయనకు అంత్యక్రియలు చేసిన బ్రాహ్మణులనే తనతో పాటు తీసుకొచ్చి భార్య శవాన్ని కూడా దహనం చేశారు. స్మశానవాటికలో ఆయన్ని ఒక్కణ్ణే విడచి అందరూ వెళ్ళిపోయారు. కారుతున్న కన్నీటిని ఆపే ప్రయత్నం చేయకుండా ఆయన తన వంటిలోని నిస్సత్తువ కరిగిపోయేదాకా ఏడుస్తూ ఉండిపోయారు.

స్మశానంనుంచి ప్రాణేశాచార్యుడు తిరిగి ఇంటికి వెళ్ళలేదు. తన ఇంటినీ, సంపదలనీ వదిలేసి, ‘తన కాళ్ళెక్కడికి తీసుకువెళితే అక్కడికే పోదా’మని నిశ్చయించుకొని నడవడం మొదలుబెట్టారు.

అగ్రహారీకులు శంకరాచార్యులని కలిశారు. “నారణప్ప బ్రాహ్మణ్యాన్ని వదలినా, బ్రాహ్మణ్యం అతన్ని వదలలేదు. అందుచేత అతనికి బ్రాహ్మణ పద్ధతిలోనే సంస్కారాలు చేయాలి. ఐతే అతని పాపపరిహారార్థం అతని ఆస్తి మొత్తం మఠానికి అర్పించాలి” అని గురువుగారు తీర్పు ఇచ్చారు. ఆస్తి మొత్తం మఠానికి ఇచ్చేయాలన్న విషయం జ్ఞాతులకి రుచించకపోయినా సరేనని ఒప్పుకొన్నారు. ఈలోపు ఇంకో ఇద్దరు బ్రాహ్మణులు కూడా అస్వస్థులయ్యారు. వారిని అక్కడే వదిలేసి వెనక్కి బయలుదేరారు.

ఊరు విడచి బయలుదేరిన ప్రాణేశాచార్యులు అడవిలో ప్రయాణం సాగించారు. పూర్వం ఆయన మనసు బాగోకపొతే భగవన్నామ స్మరణ కానీ యోగ సాధనకానీ చేసి మనసును స్థిమితపర్చుకొనేవారు. కానీ ఇప్పుడు ఆ పని చేయబుద్ధికావటం లేదు. అలా చేయటం జీవితపు అనుభవాలని కృత్రిమంగా అణచివేయడమే. ఆ అలవాటు అణచుకొని జీవితాన్ని పూర్తిగా అనుభవం చేసుకొని అవగతం చేసుకోవాలేమోనని ఆయనకు అనిపించింది.

అడవిలో ఆయనను కలసిన ఒక పశువులకాపరి తన భవిష్యత్తు చెప్పమని అడిగాడు. సమాధానం చెప్పడానికి ప్రాణేశాచార్యులు వెనుకాడారు. మైలలో ఉన్నానని తప్పించుకున్నారు. ఎప్పుడూ లేని ఈ భయం తనని ఎందుకు ఆవరించుకుంది అని ప్రశ్నించుకున్నారు. పూర్వపురోజుల్లో ఇలాంటి సందేహాలకు పురాణాలలో, ధర్మశాస్త్రాల్లో వెతుక్కునేవాడు. కాని ఈ అడవిలో ఇప్పుడు ఆ పని చేయలేడు.

నిన్నటివరకూ తాను తన ఇష్టప్రకారం ఎన్నుకున్న మార్గాన జీవించాడు. నారణప్ప ఇష్టప్రకారం ఎన్నుకున్న మార్గాన నారణప్ప జీవించాడు. కాని ఉన్నట్టుండి ఒక్క క్షణం, తాను దుర్బలస్థితిలో ఉండగా జరిగిన విషయం తన ప్రమేయం లేకుండానే తన జీవితాన్ని మార్చివేసింది. ఈ మార్పుకు కర్త ఎవరు? తనంతట తాను చేయనిదాని ఫలం తాను అనుభవించటమేమిటి? జరిగినదానిలో తన పాత్ర ఎంత? ఒకవేళ ఇప్పుడు వెళ్ళి చంద్రిని తనంతతానుగా కలసి కోరిక తీర్చుకొంటే ఆ పనికి తానే నిర్ణయభూతుడు, కర్త అవుతాడు కదా. అప్పుడు తనను తాను ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాడా? పూర్వం మహర్షులకు, యోగులకు ఇటువంటి సమస్యలు, సందేహాలు ఉండేవా? వాటిని వారు ఎలా పరిష్కరించుకునేవారు?

samskara-3ప్రాణేశాచార్యులకు కాశీలో తన సహాధ్యాయి మహాబల గుర్తుకువచ్చాడు. చాలా తెలివైనవాడు. ఏకసంథాగ్రహి. భగవంతుడి పట్ల మోహావేశంతో ఉండేవాడు. “భగవంతుడిని చేరటానికి దారి ఏమిటి? భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆ భగవంతుడితో మనం నిత్యమూ మమేకం కావాలి” అనేవాడు. అటువంటి మహాబల ఉన్నట్టుండి చదువుకు దూరమయ్యాడు. కనిపించటం మానేశాడు. అతని కోసం ప్రాణేశాచార్యులు చాలా వెతకవలసి వచ్చింది. ఒకరోజు ఒక ఇంటిముందు మహాబల హుక్కా పీలుస్తూ కనిపించాడు. అతన్ని తనతో పాటు తెసుకుపోవటానికి ప్రాణేశాచార్యులు ప్రయత్నించాడు. “ప్రాణేశా, నువ్విక్కణ్ణుంచి వెళ్ళిపో” అని మహాబల చెపుతున్నా ప్రాణేశాచార్యులు తన మొండిపట్టు మానలేదు. చివరికి విసిగిపోయినా మహాబల లేచి, “సరే, నీకు నిజం కావాలి గదా, చెపుతున్నా విను. నేను చదువు మానేశాను. ఇప్పుడు ఎలా ఉంటున్నానో తెలుసుకోవాలని ఉందా? చూడు.” అంటూ తలుపు తెరిచాడు. లోపలికి తొంగిచూసిన ప్రాణేశుడికి బొంతమీద అస్తవ్యస్తంగా పడుకొని ఉన్న ఒక స్త్రీ కనిపించింది. ఆమెని చూస్తే వారకాంత అని వెంటనే తెలుస్తుంది. “అర్థమయ్యింది గదా. ఇక నాగురించి విచారించకు. వెళ్లిపో” అన్నాడు మహాబల. ఒళ్ళు జలదరిస్తుండగా అక్కణ్ణుంచి తిరిగి వచ్చేశాడు. ప్రాణేశాచార్యులు. “నేనెప్పుడూ మహాబలలా చెడిపోను. ఇందుకు వ్యతిరేకంగా జీవిస్తాను” అని ప్రతిజ్ఞ పట్టాడు. అప్పట్నుంచీ అలాగే జీవిస్తూ వచ్చాడు. నారణప్పను ఎప్పుడు చూసినా మహాబల గుర్తుకువచ్చేవాడు. తనకు తెలియకుండానే నారణప్పను సంస్కరించి మహాబలపై తన గెలుపును చాటుకోవాలని ఇప్పటివరకూ ప్రయత్నిస్తున్నాడని ప్రాణేశ్వరాచార్యులకు ఇప్పటికి అర్థమయ్యింది. “నీ దారిని నిర్దేశించుకునే శక్తి నీకు ఉన్నదని ఇంకా అనుకుంటున్నావా? ఇన్నాళ్ళూ ఉన్న నీ అభిజాత్యం ఇప్పుడేమయ్యింది. ఒక స్త్రీని కలసిన సుఖంలో అన్నీ మాయమయ్యాయా?” అని మహాబల తనను నిలదీసినట్లనిపించింది. ఇప్పుడు తాను కూడా చంద్రి దగ్గరకు వెళ్ళి మహాబల, నారణప్పల వలే తయారైతే తన మనసులో ఉన్న సందేహాలకి సమాధానాలు దొరుకుతాయేమోననిపించింది.

ఆలోచనలతో సతమతమౌతూ అడవిదారిన పోతున్న ప్రాణేశాచార్యులను, వడిగా నడుస్తున్న పుట్టన్నఅనే యువకుడు కలిశాడు. తాను మాలెర కులస్ధుణ్ణని, మెలిగెలో జరుగుతున్న రథోత్సవానికి వెళ్తున్నానని చెప్పాడు. ప్రాణేశాచార్యుణ్ణి మాటల్లో పెట్టటానికి ప్రయత్నించాడు. అతనితో మాట్లాడటం, అసలు ఈ సమయంలో తనతో ఇంకోమనిషి ఉండటం ప్రాణేశాచార్యులకు ఇష్టం లేదు. ముక్తసరిగా సమాధానాలు చెప్పి అతన్ని వదిలించుకోవాలని చూశాడు. ఐనా అడవిదారిలో తనకో తోడు దొరికిందని సంబరపడుతున్న పుట్టన్న ఇదేమీ గమనిచకుండా తన గురించి చెప్పుకుపోతూ ఆయన గురించి ప్రశ్నలడుగుతూ ఆయన్ని వదిలిపెట్టకుండా వెంటనే నడుస్తున్నాడు. కాలక్షేపం కోసం చిక్కుప్రశ్నలు వేయడం మొదలుబెట్టాడు. ప్రాణేశాచార్యులు (తెలిసినా) సమాధానాలు చెప్పకపోతే తానే చెప్పేసి పరాచకమాడాడు. తనదగ్గరున్న బెల్లం, కొబ్బరిముక్కలను ఆయనతో పంచుకున్నాడు. ఆకలితో ఉన్న ప్రాణేశాచార్యులు కృతజ్ఞతతో వాటిని తీసుకొన్నాడు.

దారిలో కాసేపు పుట్టన్న మాట్లాడకుండా నడుస్తుండగా ప్రాణేశాచార్యుడు చిక్కుప్రశ్నల గురించి ఆలోచించాడు. నారణప్ప దహనసంస్కారం ఒక చిక్కు ప్రశ్న. దాన్ని విప్పటానికి తాను ధర్మశాస్త్రాలమీద ఆధారపడ్డాడు. ఆ సమస్యకి సమాధానం అగ్రహారానికంతా సంబంధించిందని అనుకున్నాడు. దాన్ని తన ఒక్కడి సమస్యగా తీసుకుని పరిష్కరించి ఉంటే ఏమయ్యేది? చంద్రితో జరిగిన విషయం తాను సమస్యగా ముందు ఊహించనిది. ఇప్పుడు అది తన ఒక్కని సమస్యేనా? తన పట్ల, చంద్రి పట్ల, తన భార్యపట్ల, అగ్రహారం పట్ల తన దృష్టి మారింది కదా? ఇది తన ఒక్కని సమస్యే ఎలా అవుతుంది? ఇలా ఆలోచిస్తూ, పుట్టన్న మాటలు వింటూ మెలిగె చేరుకున్నారు.

అగ్రహార బ్రాహ్మణులంతా తిరిగి దూర్వాసపురం చేరుకునేసరికి దాసాచార్యుడు, భగీరథి మరణించారని తెలిసింది. ప్రాణేశాచార్యులు ఎక్కడికెళ్ళారో తెలియలేదు. నారణప్ప ఇంట్లోకి వెళ్ళి శవాన్ని చూడటానికి, బయటకు తీసుకురావడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. సరే, ప్రాణేశాచార్యులు వచ్చాకే చూద్దాంలే అని అందరూ వేచి ఉండటానికే నిర్ణయించుకున్నారు.

మెలిగె దేవాలయంలో రథోత్సవం సందర్భంగా తిరునాళ్ళు జరుగుతుంది. తనను ఎవరైనా గుర్తుపడతారేమోనని ప్రాణేశాచార్యులకు భయం పట్టుకుంది. ఎందుకంత భయం? నారణప్ప అగ్రహారంలో చంద్రితో ఏ వెరపూ లేకుండా ఉండలేదూ? మరి తన భయానికి మూలకారణమేమిటి? తిరునాళ్ళలో చాలా సందడిగా ఉంది. అందరూ హడావిడిగా ఉన్నారు. ఎత్తైన గడపై దొమ్మరసాని లాఘవంగా విన్యాసాలు చేస్తూంది. చుట్టూ ఉన్న ప్రతివారిలోనూ ఏదో ఉత్సాహం. తిరునాళ్ళలో ఉన్న అన్నిటినీ ఆనందించాలన్న ఉద్వేగం అందరిలోనూ కనిపిస్తుంది. పుట్టన్నలోనూ అన్నిటినీ అనుభవించాలన్న ఉత్సాహం కనిపిస్తుంది. ఏదీ పట్టకుండా ఉంది తనే. ఈ పుట్టన్నతో ఇక్కడకి రావటం ఘటన కాబోలు. అందరిలా అన్నిటినీ పట్టించుకోవడం అనుభవించడం నేర్చుకోవాలనే ఇక్కడకు తీసుకువచ్చాడేమో?

పుట్టన్న ప్రాణేశాచార్యులను బలవంతంగా ఒక బ్రాహ్మణ హోటలుకు తీసుకువెళ్ళి బెంచీ మీద కూర్చోబెట్టి, వద్దంటున్నా రెండు కాఫీలు ఆర్డరిచ్చాడు. ఈ వేదాంత శిరోమణి ఇట్లా కాఫీహోటలు బెంచీ మీద కూర్చోవటం ఎవరైనా చూస్తే బాగుంటుందా? అయినా ఇట్లాంటి భయాలన్నిటినీ తాను వదల్చుకోవాలి. దాహంగా ఉన్న ప్రాణేశాచార్యులకు కాఫీ రుచిగానే అనిపించింది. అక్కడనుంచి కొంతముందుకు సాగేక పుట్టన్న ఉన్నట్టుండి ఆగిపోయాడు. అక్కడ కోడిపందాలు జరుగుతున్నాయి. కోడిపుంజులు కసిగా పోరాడుతున్నాయి. చూస్తున్న వారందరి కళ్ళన్నీ ఆ కోడిపుంజుల్లాగా తీవ్రంగా, తీక్షణంగా, క్రూరంగా ఉన్నాయి. ఆ ఆవేశంలో ఆక్షణాన వారు మమేకమైపోయారు. పుట్టన్న ఒక కోడిమీద పందెం కాసి పన్నెండణాలు గెలుచుకున్నాడు. అతని ఉత్సాహం మరింత పెరిగింది.

ఆచార్యులకు కుందపురం వెళ్ళటానికి దగ్గర డబ్బులు లేవని గుర్తుకు వచ్చింది. తనచేతికి ఉన్న బంగారు కడియాన్ని అమ్మిపెట్టటానికి పుట్టన్న సాయం చేశాడు. తనకు సాయం చేయటానికి తహతహలాడుతున్న పుట్టన్న తాను వదిలించుకుందామనుకున్నా వదలకుండా తనతోనే ఉంటున్నాడు. ఇట్లా ముడులు పడుతూ ఉంటే ఎవరి జీవితం వారిదేనని ఎలా అనగలం?

పుట్టన్న పక్కనే ఉన్న తోటలో ఉండే స్నేహితురాల్ని కలవాలని వెళ్తూ తనతో పాటు ప్రాణేశాచార్యులనూ తీసుకువెళ్ళాడు. పుట్టన్న కలవడానికి వచ్చిన స్త్రీ పేరు పద్మావతి. మాలెర కులపు స్త్రీ. ఒంటరిగా ఉంటుంది. పుట్టన్న ప్రాణేశాచార్యుల గురించి గొప్పగా చెప్పాడు. ఆమె ఆయనకు నీళ్ళూ, తాంబూలమూ ఇచ్చి సపర్యలు చేసింది. ఆమె అందం ఆయన్ను ఆకర్షించింది. రాత్రికి అక్కడే పడుకుంటే పోతుంది కదా అన్నాడు పుట్టన్న. తన సన్నిహితులు మరణించారు. తాను మైలలో ఉన్నాడు. ఇక్కణ్ణుంచి తాను వెంటనే వెళ్ళిపోవాలి. ఐనా ఆ మాటలేవీ బయటకు అనలేదు ప్రాణేశాచార్యులు. “గుళ్ళో బ్రాహ్మణులకు సంతర్పణలు చేస్తున్నారు. అక్కడ భోంచేసి మళ్ళీ ఇక్కడకు వద్దాం” అన్నాడు పుట్టన్న.

తిరునాళ్ళలో తిరుగుతండగా, శివమొగ్గలో ప్లేగు వ్యాధి వ్యాపించిందని, అక్కడకూ ఎవరూ వెళ్ళకూడదని, అందరూ టీకాలు వేయించుకోవాలన్న చాటింపు వినిపించింది.

ప్రాణేశాచార్యులు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. పాతికేళ్ళg క్రమశిక్షణగా బ్రతికన బతుకును వదలివేసి లౌకికుడుగా మారాలా? ఏది ఏమైనా నారణప్ప శరీరానికి ఇంకా సంస్కారం జరగలేదు. ఆ పని పూర్తిచేయడం తన ప్రథమ కర్తవ్యం. ఇలా ఆలోచిస్తుండగానే గుడి వచ్చేసింది. బయట జనాల హడావుడి భరించలేక గుడిలోకి వెళ్ళిపోయారు ప్రాణేశాచార్యులు. లోపలికి వెళ్ళాక మళ్ళీ ఆయనను శంకలు బాధించాయి. మైలగాలి సోకితే రథం కదలదు అని భక్తులు నమ్ముతారు. అట్లాంటిది మైలస్నానం కాకుండానే తాను ఏకంగా గుళ్ళోకే వచ్చేశాడు. ఇట్లా ఆలోచిస్తూ ఉండగానే ఎవరో తనను చేయిపట్టుకుని తీసుకెళ్ళి బంతిలో కూర్చోబెట్టి ముందు అరటాకు వేసి తిండి పదార్థాలు వడ్డించారు. ఎవరైనా తనను ఇప్పుడు చూసి గుర్తుపడితేనో? ఇదేమిటి? తాను దేన్నీ ధైర్యంగా చేయలేకపోతున్నాడు. రాత్రికి పద్మావతితో పడుకుంటే తనలో ధైర్యం పెరుగుతుందా? చంద్రితో కలసి ఉంటే? లేక తన జీవితమంతా ఇట్లా ప్రతిదాన్నీ శంకిస్తూ గడపాల్సిందేనా?

“ఇప్పటివరకూ నా చేతలు నా నిర్ణయాల వల్ల జరిగినవి కాదు. ఇతరుల నియమాలు, నిర్ణయాలు నా జీవితాన్ని శాసిస్తూ వస్తున్నాయి. నేనంతట నేను నిర్ణయాలు తీసుకోవటం మొదలుబెట్టాలి. నారణప్ప అంత్యక్రియలు నేనే చేసి ఉండాల్సింది. కానీ నేనొక్కణ్ణే చేయలేను. ఇంకో ముగ్గురు కావాలి. ఇతరులు కల్పించుకోకుండా జీవితంలో ఏ పనీ జరగదు. చంద్రితో జరిగిన విషయం ఎవరికీ తెలియకపోయినా అగ్రహారం మొత్తం ఆ విషయంతో ముడిపడి ఉంది. అందుచేత నా విషయాలు ప్రపంచం మొత్తంతో ముడిపడి ఉన్నాయి.

“అగ్రహార బ్రాహ్మణులకు నిజం చెప్పకపోయినా, నారణప్ప శవానికి అంత్యక్రియలు చేయకపోయినా, నేను భయంనుంచి విముక్తుణ్ణి కాను. చంద్రితో కలసి జీవించాలని నేను నిర్ణయం తీసుకున్నా అది అసంపూర్ణమే, భయవిహితం కాదు. ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి రావాలి. ప్రతి విషయమూ తేటతెల్లంగా బహిర్గతమవ్వాలి. ఏం చేసినా బాధ తప్పదు. విషయాలు దాచి ఉంచితే జీవితమంతా భయంతో మెలగవలసిన వాడినౌతాను.”

ప్రాణేశాచార్యుల ఆలోచనలు ఇలా సాగుతుండగానే, బంతిలో వడ్డన చేస్తున్న ఒకాయన ప్రాణేశాచార్యులను గుర్తుపట్టనే పట్టాడు. “అయ్యో స్వామీ మీరు ఇక్కడ తిండమేమిటీ? పెద్దాయన చూస్తే మీకు సరైన మర్యాదలు చేయటం లేదని మమ్మల్ను కోప్పడతాడు. ఉండండి, ఆయన్ను పిలచుకువస్తాను” అంటూ హడావిడిగా పరుగెత్తాడతను. ప్రాణేశాచార్యులు వెంటనే బంతి నుండి లేచి బయటకు వెల్లిపోయారు.

ఎంగిలిచెయ్యి శుభ్రం చేసుకున్నారు. దీపాలు వెలిగించే వేళ అయ్యింది. అగ్రహారంలో దీపాలు వెలిగించి ఎన్నాళ్ళయిందో. “ఇప్పుడు నడక మొదలుబెడితే అర్థరాత్రికల్లా అగ్రహారానికి చేరుకోవచ్చు. బ్రాహ్మణులందరి ముందూ నన్ను బయటపెట్టుకుంటాను. జరిగింది వాళ్ళతో చెప్పేటప్పుడు, దేనికీ నేను పశ్చాత్తాపం చూపను. నేను పాపిని అన్న బావన తోచనివ్వను. లేకపోతే ఈ ద్వైదీభావాన్ని జయింపలేను. ఆ తరువాత మహాబలను కలసి అతనితో ‘మనం మనల్నేరూపంలో నిర్మించుకొంటామో నిస్సందేహంగా అదే మనది ఔతుంది’ అని చెప్తాను. ‘అదే సత్యమైతే, మంచి అన్న దానిపై నిజంగా ఎవరికీ కోరిక ఉండదా’ అని మహాబలతో చర్చించాలి.” అని నిర్ణయించుకున్నారు ప్రాణేశాచార్యులు.

బయటకు వచ్చాక కనిపించిన పుట్టన్నతో తాను వెంటనే దూర్వాసపురానికి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పాడు. ఆయన ఆ రాత్రి అక్కడ గడపడం లేదని పుట్టన్న నిరుత్సాహపడినా, దూర్వాసపురం వైపు వెళుతున్న బండి ఒకటి కనిపిస్తే వాళ్ళతో మాట్లాడి ప్రాణేశాచార్యులను బండి ఎక్కించాడు.

నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద బండి సాగిపోతూంది. దూరంగా అప్పుడప్పుడూ కేకలు, డప్పులమోతలు. గుట్టలు ఎక్కుతున్న బండెడ్లు భారంగా ఊపిరి తీస్తున్న చప్పుడు. వాటి మెడలో గంటల మోత. ఇంకో నాలుగైదు గంటల ప్రయాణం. ఆ తర్వాత?

ప్రాణేశాచార్యులు ఆతృతగా, ఆశగా ఎదురుచూస్తున్నారు.

* * *

ఇలా ఈ పుస్తకం అసంపూర్తిగా సంపూర్ణమౌతుంది.

Author Photo_UR Ananthamurthyఇది ఉడిపి రాజగోపాలాచార్య (యు.ఆర్.) అనంతమూర్తి మొదటి పుస్తకం. 1965లో, అంటే ముప్పైమూడేళ్ళ వయస్సులో వ్రాశాడు. బర్మింగ్‌హాం యూనివర్సిటీలో పిహెచ్‌డీ చేస్తుండగా ఇంగ్మర్ బెర్గ్‌మన్ The Seventh Seal చిత్రాన్ని గుర్చి చర్చించుతున్నప్పుడు నీ అనుభవాల ఆధారంగా నువ్వెందుకు ఒక పుస్తకం వ్రాయకూడదూ అని తన ప్రొఫెసర్ అన్న ఫలితంగా ఈ నవల పుట్టిందట. అన్నట్టు, అనంతమూర్తి చిన్నతనంలో దూర్వాసపురంలో సంస్కృతం చదువుకున్నాడు అని వికిపీడియా భోగట్టా.

అత్తిపట్ కృష్ణస్వామి (ఏ.కే.) రామనుజన్‌ను ఈ పుస్తకం చదివిన వెంటనే ఆకర్షించింది. తన జూనియర్, స్నేహితుడు గిరీష్ కర్నాడ్‌తో తన అభిప్రాయాల్ని వెంటనే పంచుకున్నాడు. గిరీష్ కర్నాడ్ ద్వారా ఈ పుస్తకం పఠాభిని చేరింది. దీన్ని చలనచిత్రంగా తీయాలని సోషలిస్ట్ పార్టీ పెద్దలు పఠాభికి సూచించారట. అప్పటికి గిరీష్ కర్నాడ్ ఇంగ్లండ్‌ నుంచి తిరిగివచ్చి నాటక రచయితగా, నటుడిగా, ప్రయోక్తగా పేరు పొందుతున్నాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన టాం కోవన్ అనే ఛాయాగ్రాహకుడు వీరికి పరిచయమయ్యాడు. వీరందరూ కలసి చిత్రనిర్మాణానికి పూనుకొన్నారు. నారణప్ప పాత్రను పి.లంకేష్, చంద్రి పాత్రను స్నేహలతారెడ్డి పోషించారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి – బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీస్తుందన్న కారణంతో – ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ నిరాకరించింది. పఠాభి పోరాటం చేసి సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. సంస్కార ఉత్తమ చలనచిత్రంగా జాతీయస్థాయిలో రాష్ట్రపతి స్వర్ణకమలం, కొన్ని అంతర్జాతీయ బహుమతులు గెల్చుకుంది. సోషలిస్టు పార్టీకి చెందిన స్నేహలతా రెడ్డిని ఎమర్జెన్సీరోజుల్లో జైల్లో పెట్టారు. జైలులో ఆమె ఆరోగ్యం దెబ్బతిని, విడుదలైన కొద్దిరోజుల్లోనే చనిపోయారు. ఆ రోజుల్లో అదొక సంచలన వార్త.

* * *

పుస్తకం పరిణామంలో చాలా చిన్నదే. వేగంగా చదవగల, ఒడుపుతో రాసిన కథే. కానీ చాలా సాంద్రత, గాఢత ఉన్న ఈ చిన్న పుస్తకం అనేక విషయాలను స్పృశిస్తుంది. చాలా ప్రశ్నలను మన ముందు నిలబెడుతుంది. కొన్ని ప్రశ్నలు సామాజిక సంబంధాలకు సంబంధించినవి. కొన్ని ఆచారవ్యవహారాలకు సంబంధించినవి. మరికొన్ని ఆధ్యాత్మికమైనవి.ఇంకొన్ని మానసిక పరిణామాలకు సంబంధించినవి. ఉపరితలంలో చూసి ఈ పుస్తకాన్ని కులసంబంధాల చర్చగానూ, బ్రాహ్మణత్వ వ్యతిరేక రచనగానూ భావించడం కద్దు. నా ఉద్దేశంలో రచయిత ఈ పుస్తకంలో అన్వేషించిన తాత్వికత పరిధి దీనికన్నా విశాలమైనది. మరింత మౌలికమైనది.

కథ ప్రారంభంలో ప్రాణేశాచార్యులు స్థితప్రజ్ఞత, ఆత్మస్థైర్యం ఉన్న వేదాంత పండితుడు, జ్ఞాని. ఆ అగ్రహారీకులకు కొండంత అండ. అతిస్వల్పవ్యవధిలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన మూలాలను కదిలించివేస్తాయి. అంతటి వేదాంత శిరోమణి ఉన్నట్లుండి విపరీతమైన అస్థిత్వ వ్యథ (existential angst)కు గురి అవుతాడు. ఆ వ్యథలో, తన అస్తిత్వాన్ని ఆయన పునఃమూల్యాంకనం చేసుకుని సంస్కరించుకుని పునర్నిర్మించుకునే క్రమంలో చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. జీవితం సామాజికమైనదా లేక వ్యక్తిగతమైనదా? సంఘానికీ వ్యక్తికీ మధ్య ఉన్న వైరుధ్యాలు, పరస్పరాధార ప్రవృత్తుల మధ్య తూకం సాధ్యమా? మనిషి జీవితంలో జరిగే సంఘటనలకు, ఆ మనిషి తీసుకునే నిర్ణయాలకు మధ్య (కర్మ, కర్తల మధ్య) సంబంధమేమిటి? జీవనక్రమంలో స్వతంత్ర నిర్ణయాల (free will) పాత్ర ఏమిటి? మంచిగా జీవించడం అంటే ఏమిటి? మహాబల, నారణప్ప మంచిగా జీవించారా, లేదా? మరి ప్రాణేశాచార్యుడి సంగతో? ధర్మార్థకామాలను పూర్తిగా తిరస్కరించి మోక్షాన్ని సాధించడం సాధ్యమా?

ఇన్ని ప్రశ్నలు రేకెత్తిన ఈ నవల తేలిక సమాధానాలేమీ ఇవ్వదు. ఏ.కే. రామానుజన్ తన వెనుకపలుకు (afterword) లో ఈ విషయాలని చాలా ఆసక్తికరంగా చర్చించాడు.

* * *

ఇది తన మొదటి పుస్తకమే ఐనా ఈ నవలను అనంతమూర్తి నిర్మించిన పద్ధతి ఆసక్తికరమైనది. అగ్రహారంలో ప్రాణేశాచార్యుల దైనందిన జీవితంతో సాదాసీదాగా మొదలౌతుంది. ఉన్నట్టుండి నారణప్ప చావు వార్త తెలుస్తుంది. కొంతసేపటిలోనే పుస్తకంలోని ప్రధాన సమస్య పాఠకుల ముందు నిలుస్తుంది. ఐతే ఆ సమస్య తేలికది కాదని దానికి చాలా పొరలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ పొరల్ని నెమ్మదిగా వలుస్తుండగానే ఊరిలో ప్రబలుతున్న ప్లేగు వ్యాధి ఇంకొక సమస్యను ముందు పెడుతుంది. ఇంతలో అకస్మాత్తుగా ప్రాణేశాచార్యులతో చంద్రి కలయిక. పాఠకుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ వడిగా, ఆసక్తికరంగా, ఉత్కంఠగా సాగుతుంది. ప్రాణేశాచార్యులు ఊరు విడచాక కథనం మలుపు తిరుగుతుంది. ఒక పక్క బహిర్ప్రపంచపు ఆకర్షణలు, ఇంకోపక్క పుట్టన్న అమాయకపు వాగుడు, జీవనశైలి, మరోపక్క ప్రాణేశాచార్యుడి గాఢ తాత్విక స్వగతం. ఈ మూడుపేటల అల్లికలో బిగి సడలకుండా రచయిత చాలా నేర్పు చూపిస్తాడు. అగ్రహారంలోనూ, అడవిలోనూ, తిరునాళ్ళలోనూ వాతావరణకల్పన, తక్కువమాటల్లోనే అతినైపుణ్యంగా చేయటం చూస్తే ఇది మొదటి రచనాప్రయత్నం అంటే నమ్మబుద్ధి కాదు. పాత్రలు, సన్నివేశాలు కళ్ళముందు నిలబడతాయి.

పుస్తకం మొదట్లో చాలా ఉన్నతంగా కనిపించిన కథానాయకుడిలో కథాగమనంలో జరిగిన పరిణామాలను రచయిత చిత్రించిన విధానంలో గొప్ప పరిణతి కనిపిస్తుంది. లోతైన తాత్విక విషయాలను చర్చించటానికి ఇటువంటి ఆసక్తికరమైన ప్రాతిపదికను నిర్మించటం రచయిత ప్రతిభకు తార్కాణం.

పుస్తకపరిచయం మరీ విస్తృతమౌతుందని నవలలో వచ్చే చాలా పాత్రలనూ, సంఘటనలనూ నేను ప్రస్తావించలేదు. పుస్తకం నిండా చాలా హాస్యమూ, వ్యంగ్యమూ ఉంటాయి. పుస్తకాన్ని వేగంగా చదివింపచేస్తాయి. ఆ వ్యంగ్యమూ, హాస్యమూ బ్రాహ్మణులని కించపరచేవిగా ఉన్నాయన్నది ఈ పుస్తకంపై ప్రధాన ఆరోపణ.

* * *

fl18_Ramanujamఏ.కే. రామానుజన్ అనువాద ప్రతిభను గూర్చి తప్పనిసరిగా చెప్పుకోవాలి. కన్నడ నవలను ఇంగ్లీషు నవలగా మార్చటంలో అతను సఫలీకృతుడయ్యాడు. కొన్ని కన్నడ మాటలు యథాతథంగా వాడినా, నవల నడక ఎక్కడా ఇబ్బంది పెట్టదు. ఇంగ్లీషు ఇబ్బందిగా అనిపించదు. ఈ నవలకు అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి రామానుజన్ అనువాద నైపుణ్యం కూడా ముఖ్యకారణం. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో దక్షిణ ఆసియా విభాగంలో ఆచార్యుడిగా పనిచేసి, కవిగా, అనువాదకుడిగా, దార్శనికుడిగా చాలా పేరు గడించిన రామానుజన్ అకాలంగా మరణించడం వల్ల చాలా నష్టపోయాము.

* * *

(ముందస్తు క్షమాపణలతో, కొంత సొంత డబ్బా లాటి జ్ఞాపకం) సంస్కార పదం ఈ నవలలో అంతగా కనిపించదు. మొదటి తెలుగు అనువాదం వచ్చిన రోజుల్లో హాస్టల్లో నా రూములో ఈ పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, నా జూనియర్, మిత్రుడు వరదా మోహన్ కిషోర్, అసలు ఈ పుస్తకానికి సంస్కార అన్న పేరు ఎలా నప్పుతుంది అని అడిగాడు. అప్పుడు నేను సంస్కార అన్న పదానికి ఉన్న అనేక అర్థాలు, దాదాపు ప్రతి అర్థంతోనూ ఈ నవలకు సంబంధం ఉండడం గురించి వివరించడం, అంతగా మెచ్చుకోని నా రూమ్మేట్ సత్యనారాయణరెడ్డి ‘భలే చెప్పావ్ చౌదరీ’ అని మెచ్చుకోవటం బాగా గుర్తు. ఈ ఆంగ్లానువాదం ప్రారంభంలో సంస్కార పదానికి నిఘంటువులో ఉన్న పలు అర్థాలు ఇవ్వడం, రామానుజన్ వెనుకపలుకు (afterword) లో కూడా ఈ అర్థాల గురించి ప్రత్యేకంగా చర్చించడం చూస్తే, నాకు పాత సంగతులు గుర్తొచ్చి సరదాగా అనిపించింది.

* * *

Samskara – A Rite for a Dead Man
U.R. Anantha Murthy
Translation / Afterword – A.K. Ramanujan
Oxford University Press
1978
141 pages.About the Author(s)

Jampala Chowdary

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానాకు 2013-2015కు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, 2015-2017కు అధ్యక్షుడిగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.10 Comments


 1. kotari mohan rao

  SANSKAARA the very apt title as patabhi thougt of the same, its reformation of the caste ism, the doldrums of the PRANESWARA’S thoughts, the vision. praneswaraa….his thoughts n experience to chandri are a high ecstatic ideology, the orthodox ideologies still preventing so many writers not to expose what they wanted to tell, as in the case of VADDERA CHANDI DASS, who happened to be silent inhis later life. JAMPAALA GARU HAT OFF TO U.


 2. మెర్సీ సురేష్ జజ్జర

  రెండవ భాగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసాను. మొత్తానికి ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు సర్ దన్యవాదాలు


 3. madhuranthakam narendra

  choudhary gaaroo,
  SAMSKARA is one of my all time favorite novels.
  a classic is a different kind of mine which can never be completely extracted, the more you extract the ore(meaning) the more you can find out and the quantity and quality the reader can extract depends upon the ability of the reader.
  lot of research is done on it and it would be a fertile ground for future research.
  congratulations for introducing a classic


 4. “ఒక్కసారి బయటకు పోయి (వ్యాసమహర్షిలా) ఒక మత్స్యగంధితో సుఖపడు.” అని రాశారు. నాకున్న అతి తక్కువ భారతం విజ్ఞానం ప్రకారం, వ్యాస మహర్షి మత్స్యగ్రంధి కుమారుడు. మత్స్యగ్రంధికీ (సత్యవతికీ), పరారుశ మహర్షికీ పుట్టినవాడు.ఇతనే భారతం రాసిన వాడూ, దృతరాష్ట్ర, పాండురాజ, విదురులకు జన్మ నిచ్చిన తండ్రీ.
  ఒక సారి చెక్ చెయ్యండి, నేను తప్పుగా గుర్తుంచు కున్నానేమో.
  – ప్రసాద్


 5. pavan santhosh surampudi

  ఈ సంక్షిప్త అనువాదం చదివాకా నాకు అనిపించినది ఇది.
  శాస్త్రజ్ఞానం/పుస్తకజ్ఞానం(రెండూ ఒకేవిషయానికి వేర్వేరు రూపాలు కదా) మాత్రమే పరమమని భావించి లౌకికజీవనాన్ని విస్మరించిన ఓ వ్యక్తి కథగా చెప్పుకోవచ్చు. ఆయన సత్యాన్వేషణగా భావించుకోవచ్చు. ప్రాణేశాచార్యులు తన జీవనయానంలో మళ్లీ చంద్రితో అనుభవానికి పూర్వం జీవించిన జీవితాన్నే సరియైందిగా ఎంచుకుని తిరిగివెళ్ళొచ్చు. ఐతే అది పూర్వంలా సారవిహీనంగా(నవల రచయిత పాఠకులతో భావింపజేసినట్టు) అవదు. ఏ సిద్ధాంతమైనా మానవజీవితానుభవానికి ప్రత్యామ్నాయం కాదు. ఇదే అంశం రహస్యజీవితంలో జన్మించిన ఒక కమ్యూనిస్ట్ యువకుని కోణంలో రాసినా, మరే ఇతర మతసిద్ధాంతాలలో తలమునకలుగా జీవిస్తున్న వారి గురించి రాసినా మార్పేమీ ఉండదు. ఎవరు ప్రవచించిన సిద్ధాంతాలైనా జీవితాన్ని జీవించి తెలుసుకోవడానికి ప్రత్యామ్నాయం కాదు. ఆ విధమైన అనుభవాలు ఉన్నవారు ఆ సిద్ధాంతాన్ని ఆదరించి ఆమోదిస్తే వేరే విషయం గానీ సిద్ధాంతానికి అనుగుణంగా అనుభవాలు పొందేవారికైతే జీవితంలో ఒక స్థితికి వచ్చాకా ఏదో సంఘటనతో పేకమేడలా పడిపోతుందా సిద్ధాంతమంతా.
  ఐతే పూర్తిగా నవల చదవనివాణ్ణి కాబట్టి ఇదంతా ఈ వరుసటపాలపై నా ప్రతిస్పందనగానే గుర్తించగలరు.


 6. చాలా ఆసక్తికరంగా విపులంగా సమీక్షించారు. సమాధానాల కంటే ప్రశ్నలు ఎక్కువ మిగిల్చేది చదువరి గా కొంత అసంతృప్తి మిగిల్చినా (closure లేకపోవడం వల్ల) వ్యక్తిగా ఆలోచింపచేస్తుందేమో అనిపిస్తుంది నాకు. చాలా మంది ఈ పుస్తకం గురించి గొప్పగా చెప్పారు. కానీ ఈ మాత్రం కథ తెలిసాకా చదివితే ఉత్కంఠ ఉండదేమో.

  సినిమా పుస్తకానికి దీటుగా తీశారా ?


 7. Srinivas Vuruputuri

  జంపాల చౌదరిగారికి

  బావుంది మీ పరిచయం.

  >> అసలు ఈ పుస్తకానికి సంస్కార అన్న పేరు ఎలా నప్పుతుంది అని అడిగాడు…

  నిన్నా మొన్నా నేనూ ఇదే ఆలోచిస్తున్నాను (మీ పరిచయంలోని మొదటి భాగం చదివాక). బహుశా “అంతిమ సంస్కారం” అనే సెన్సులో వాడి ఉంటారేమోనని అనుకున్నాను. A rite for a dead man అని ముఖచిత్రం మీది ఉపశీర్షికలో చూసాను. అంత్యక్రియల నేపథ్యంలో జరిగిన కథ కదా!

  ఇంతకీ ఈ నవలకి కథాకాలం ఏమిటో చెబుతారా?

  శ్రీనివాస్


  • Jampala Chowdary

   The novel was first published in 1965.
   Based on some of the language and references, Ramanujan speculated that the period of the novel would be 1930s or 40s.
   As Anantha Murthy was born in 1932, I would speculate it is more likely the 40s and early 50s. Remember that Anantha Murthy was supposed to have studied Sanskrit in Durvaasapura itself as early part of his education.


  • Jampala Chowdary

   From p.1479, A Kannada-English Dictionary by the Reverend F. Kittel, Mangalore, 1984 (as reprinted in the book, Samskara)

   Sam-s-kara
   1. Forming well or thoroughly, making perfect, perfecting; finishing, refining, refinement accomplishment
   2. Forming in the mind, conception, idea, notion; the power of memory, faculty of recollection, the realizing of past perceptions
   3. Preparation, making ready, preparation of food, etc., cooking, dressing …
   4. …
   5. Making sacred, hallowing, consecration, dedication, consecration of a king, etc.
   6. Making pure, purification, purity
   7. A sanctifying or purificatory rite or essential ceremony (enjoined on all the first three classes or castes.
   8. Any rite or ceremony
   9. Funeral obsequies.

   A similar litany can be seen by searching http://andhrabharati.com/dictionary/index.php for the Telugu word, సంస్కారం.

   Now, let your creative juices flow! 🙂  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

యు.ఆర్.అనంతమూర్తి

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసం మొదట చినవీరభద్రుడు గారు ఫేస్బుక్ లో ప్ర...
by అతిథి
0

 
 

సంస్కార – 1

1970లో సంస్కార అనే కన్నడ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా జాతీయస్థాయిలో ఎంపిక అయ్యింది. ఆ కన్న...
by Jampala Chowdary
27