The God of Small Things

1993లో – ఇరవైమూడేళ్ళ క్రితం తననుంచి వేరు చేయబడ్డ తన కవలసోదరుడు ఎస్థప్పన్‌ను కలుసుకునేందుకు – రాహెల్ అనే అమ్మాయి అమెరికా నుంచి అయిమనం గ్రామానికి తిరిగి రావడంతో మొదలవుతుంది – The God of Small Things కథ.

కేరళ బాక్‌వాటర్స్‌లో ఓ చిన్నగ్రామం అయిమనం. రాహెల్-ఎస్థాల అమ్మమ్మ వాళ్ళ ఊరు.

రబ్బర్ చెట్లు, కొబ్బరి చెట్లు, ఓ ఆర్నమెంటల్ గార్డెన్, పచ్చళ్ళ ఫ్యాక్టరీ, ప్లిమత్ కారు – అరవైల్లో ఓ వెలుగు వెలిగిన అయిమనం ఇల్లు ఇప్పుడు కళతప్పి ఉంది.

పప్పచ్చి (తాత) చెల్లెలు బేబీ కొచ్చెమ్మ ఒక్కర్తే ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నది. తనకి తోడు – పనిమనిషి కొచ్చు మరియా, స్టార్ టీవీ, ఎక్కడపడితే అక్కడ దుమ్మూ, మురికి. పురుగులు. చీకటి. గడ్డలు కట్టుకుపోయిన స్తబ్ధత!

ఆ ఇంటి ప్రస్తుత దుర్దశకీ, ఆ కుటుంబం అల్లకల్లోలమవడానికీ దారి తీసిన సంఘటనలు ఒక్క రెండువారాల్లోనే జరిగిపోయాయి.

ఆ సంఘటనల గురించి – సోఫీ మోల్ మరణం గురించి, ‘కిడ్నాప్ మరియు హత్య’ కేసులో నిందితుడైన వెలుతా ఎన్‌కౌంటర్ మరణం గురించి, వెలుతాపై పెట్టినది దొంగ కేసని నొక్కి వక్కాణిస్తూ ‘పారడైజ్ పికిల్స్ అండ్ ప్రిజర్వ్స్’ని ఘెరావ్ చేసిన కామ్రేడ్ పిళ్ళై గురించి – వార్తా పత్రికలు రాసాయి, ఆ రోజుల్లో.

పత్రికలకెక్కని అసలు కథకి రాహెల్-ఎస్థాలు ప్రత్యక్షసాక్షులు. ఆ కథలో వాళ్ళు పాత్రధారులు కూడా.

ఆప్తులను పోగొట్టుకున్న విషాదంతోబాటు “అంతా తమవల్లే జరిగింది” అన్న అపరాధభావనని తలకెత్తుకున్న రాహెల్-ఎస్థాలు.

నిజానికి ఈ కథ రెండు కథలు ఒక్కటిగా అల్లుకున్న కథ.

ఓ పెద్దవాళ్ళ కథ, ఓ చిన్నవాళ్ళ కథ – ఒకదాని కాళ్ళు మరొకటి తొక్కుకుంటూ విషాదాంతానికి సాగిపోయిన కథలు. చిన్నవాళ్ళకథలోంచి – ఆ కథలోని పిల్లల కళ్ళలోంచి, ఊహల్లోంచి, సంతోషాల్లోనుంచి, భయోద్వేగాల్లోనుంచి, ఆశ నిరాశల్లోంచి పెద్దవాళ్ళ కథ ఆవిష్కృతమవుతూ వస్తుంది.

***

సిరియన్ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన అమ్మూ కి అందరిలానే జీవితంలో ఒక అవకాశం వచ్చింది – పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడిపేందుకు, ఎల్లరిలా హాయిగా ఉండేందుకు.

వీధిలో రామయ్య-ఇంట్లో రావణయ్య తండ్రినీ, ఆ తండ్రిచేత రోజూ దెబ్బలు తింటూ రాజీపడుతూ వస్తున్న తల్లినీ, ఓ ఐరిష్ ఫాదరీతో వన్‌వేట్రాఫిక్ ప్రేమలోపడి భంగపడి యావజ్జీవబ్రహ్మచర్యదీక్షను అనుభవిస్తున్న “మాజీ నన్” మేనత్త బేబీ కొచ్చమ్మనూ, అయిమనం గ్రామపు స్తబ్ధజీవితాన్నివదిలించుకొని సాహసించి – ఎక్కడో కలకత్తాలో బంధువుల ఇంట్లో తారసపడ్డ ఓ తాగుబోతు టీ ఎస్టేట్ మానేజర్‌తో మొదట ప్రేమలో, ఆ తరువాత పెళ్ళిలో పడి – పోగొట్టుకున్న ఉద్యోగాన్ని మళ్ళీ తెచ్చుకునేందుకు తనను తార్చబోయిన మొగుణ్ణి ప్రతిఘటించి – దెబ్బలు తిని, తిరగబడి వాడిని చితక్కొట్టేసి, – షిల్లాంగ్‌నొదిలేసి, పిల్లలను వెంటబెట్టుకొని పుట్టింటికి తిరిగి వచ్చేయడంతో తన వన్ అండ్ ఓన్లీ ఛాన్సు ఖర్చయిపోయింది.

శేషజీవితాన్ని ఏ ఆశలూ, కలలూ లేకుండా ఇద్దరు పిల్లల తల్లిలాగా  బాధ్యతగా, విషాద గాంభీర్యంలో గడిపేయకూడదా?

ఊహూ! తనలోని సూయిసైడ్ బాంబర్ తెంపరితనం తనని నెమ్మదిగా ఉండనివ్వదు.

ఎవరిని ప్రేమించాలి?

ఎలా ప్రేమించాలి?

ఎంత ప్రేమించాలి?

పై ప్రశ్నలకు ఏనాడో చరిత్ర చెప్పేసిన సమాధానాలను బేఖాతరీ చేసి, అది గీసిన ఎల్లలను చెరిపేసి మరీ వెలుతాని ప్రేమించింది అమ్మూ .

రాహెల్-ఎస్థాలకి కూడా వెలుతా అంటే ప్రాణం.

పిల్లల్లో పిల్లవాడు వెలుతా.

పిల్లల అమాయక కల్పనలను నిర్లక్ష్యంగా కొట్టిపారేయకుండా, లాలన మాటల్లో కరిగించకుండా – వాళ్ళ కథల్లో తనూ కలిసిపోయి ఆడుకోగల వెలుతా.

చిన్నప్పటి అందమైన నవ్వుని, అకస్మాత్తుగా మొహాన వెలిగే తెల్లని నవ్వుని యవ్వనంలోనూ నిలుపుకున్న వెలుతా.

ఆత్మవిశ్వాసం తొణికిసలాడే వెలుతా.

కంటికి కనబడ్డ ప్రతి చెక్కముక్కలో – నిస్తేజంగా, ఉత్త చెక్కమొహం పెట్టుక్కూచునే చెక్క ముక్కల్లో – ఎవరికీ కనబడని ఆకారాలను, పరికరాలను కనిపెట్టగల మాంత్రికుడు వెలుతా. ఏ యంత్రాన్నైనా లొంగదీసుకోగలిగిన వెలుతా.

విప్లవోద్యమ కార్యకర్త వెలుతా.

అంటరాని పరవ కులానికి చెందిన వెలుతా.

అంటదగ్గ వాళ్ళింట్లో పుట్టనందుకు ఇంజనీరు కాలేకపోయిన వెలుతా.

***

అమ్మూ-వెలుతాల ప్రేమని సమాజం ఆమోదిస్తుందా? ఆశీర్వదిస్తుందా?

“సమాజం” దాకా ఎందుకు? గొప్పింటివారు చేసిన మేళ్ళనన్నినింటినీ గుర్తుంచుకొని కృతజ్ఞతాభారంతో నడుమును క్రుంగదీసుకున్నవెల్యప్పన్ – తన కొడుకు వెలుతాని క్షమించగలుగుతాడా? నడుముకు చీపురు కట్టుకొని తన పాదముద్రలను తానే చెరుపుకుంటూ వెనక్కి వెనక్కి నడిచిన రోజులను మరిచిపోని వెల్యప్పన్? ప్రమాదంలో పోగొట్టుకున్న కుడికన్నుకి బదులుగా మమ్మచ్చి(అమ్మూ వాళ్ళమ్మ) కొనిపెట్టిన గాజుకన్నును ధరించి ధన్యతను పొందిన వెల్యప్పన్?

వెలుతా-అమ్మూల ప్రేమకథ మొదలైన రెండువారాల్లోనే ముగిసింది.

సమాజం ఒప్పని ప్రేమకు లొంగినందుకు వెలుతా ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు.

అమ్మూ ప్రాణాలను పోగొట్టుకోలేదుగానీ తన జీవిత సర్వస్వాన్ని కోల్పోయింది.

ప్రేమ, సమాజ నియమాలు, కుల వివక్ష లాంటి పెద్దవాళ్ళ ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఏడేళ్ళ పిల్లలైన రాహెల్-ఎస్థాలను సైతం అనూహ్యమైన దెబ్బ కొట్టాయి.

పెద్దవాళ్ళ గొడవల్లో, in a moment of absolute non-control, అమ్మూ వాళ్ళిద్దరిని గట్టిగా కసురుకునే సరికి, ఇల్లు విడిచి పారిపోన్నప్పుడు, లండన్‌నుంచి చుట్టపుచూపుగా వచ్చిన కజిన్ సోఫీ మోల్‌ని తమతోబాటు తీసుకెళ్ళక తప్పకపోవడం… మీనచల్ నదిలో కొట్టుకొస్తున్న చెట్టుకొమ్మ దెబ్బకి పడవ తిరగబడి సోఫీ హఠన్మరణం పాలవడం… “అమ్మూ మీద కన్ను వేసి, బలాత్కరించబోయి, విఫలుడై పిల్లలను కిడ్నాప్ చేసుకెళ్ళాడు” అన్న తప్పుడు నేరారోపణను నమ్మి పోలీసులు వెలుతాను చిత్రవధ చేసినప్పుడు రాహెల్-ఎస్థాలు నిస్సహాయ సాక్షులుగా ఉండాల్సి రావడం… ఆఖరికి తల్లి మీద కేసు రాకుండా ఉండేందుకు మరికొన్ని గంటల్లో మరణించనున్నవెలుతాకి విరుద్ధంగా అబద్ధం సాక్ష్యం చెప్పాల్సి రావడం…అసలు కథ బయటపడకుండా బేబీ కొచ్చమ్మ వేసిన ఎత్తుల కారణంగా ఎస్థాను కలకత్తా ఇంటివారికి “వాపసు చేయబడటం”…, అమ్మూ ఇంట్లోంచి గెంటేయబడటం…ఆ తరువాత ఓ నాలుగేళ్ళకి అలెప్పీలో ఓ ఒంటరి లాడ్జింగు గదిలో అమ్మూ ఒంటరిగా మరణించడం…

***

ఈ ఇరవై మూడేళ్ళలో ఎస్థా తన గుల్లలోకి ముడుచుకొనిపోయాడు. సర్దుకుపోవడం, ఎవ్వరికీ బరువవకుండా – ఆఖరికి భూమికీ, ప్రకృతికి కూడా బరువవకుండా బ్రతకడమే లక్ష్యంగా జీవించడం నేర్చుకున్నాడు. తనకి మాట్లాడడం వచ్చునన్న విషయం తానే మరిచిపోయేంత మౌనంగా ఉండడం నేర్చుకున్నాడు.

ఎస్థాని ఆవరించిన మౌనంతో పోల్చదగ్గదే, రాహెల్‌ని ఆవరించిన శూన్యం. లక్ష్యరహితంగా సాగిపోయాయి ఈ ఇరవై మూడేళ్ళు. ఆవరేజి చదువు, మనస్సు పెట్టకుండా చదివిన ఆర్కిటెక్చర్ డిగ్రీ, బస్సెక్కాక కనబడ్డ ఖాళీసీటులో కూలబడ్డట్లు (ఓ అమెరికన్ ఆర్కిటెక్ట్‌తో) వైవాహిక జీవితంలోకి సెటిలయిపోవడం, ప్రైవేటు వేళల్లోనూ వెంటాడే తన నిర్లిప్తతను అర్థం చేసుకోలేని భర్త వదిలేస్తే మళ్ళీ ఒంటరి జీవితంలోకి వచ్చేయడం…

***

రాహెల్-ఎస్థా.

ఒకే ఆత్మని రెండు దేహాల్లోకి పంచేసుకుని పుట్టిన సియామీస్ కవలలు. అపరాధభావనా, ప్రేమరాహిత్యం, తమ నియంత్రణలో అస్సలు లేని ఏవేవో ప్రమేయాల వల్ల భయానకంగా గాయపడ్డవాళ్ళు.

ఇరవై మూడేళ్ళ తరువాత మళ్ళీ కలిసినప్పుడు, ఆ రాత్రి… సమాజం ఏర్పరచిన ప్రేమ సూత్రాలను అతిక్రమించారు.Only that what they shared that night was not happiness,but hideous grief.”

***

కథాక్రమంలో కాస్త ముందుకూ, కాస్త వెనక్కీ ఉయ్యాలలా ఊగుతూ సాగిన కథ పై వాక్యం దగ్గర ఆగినట్లే ఆగి…

మనం నివ్వెరపడి లేచేలోపే, మళ్ళీ కదిలి…

ఏ భయానక పర్యవసనాలకి తలవంచని అమ్మూ-వెలుతాల ప్రణయాన్ని తెరమరుగు లేకుండా వర్ణించి, “నాళెయ్” మళ్ళీ కలుద్దామని ఏరోజుకారోజు పరస్పరం ఆశ్వాసనం చెప్పుకున్న ప్రేమికుల చిత్రాన్నిమన కళ్ళ ముందు నిలిపి…

పాఠకుల మనస్సుల్లో నిలిచిపోతుంది.

అనేకానేకమైన ఇంద్రియ సంవేదనలను ప్రేరేపించి, నవ్వించి, ఇంతలోనే ఆలోచింపచేసి, బాధ పెట్టి, మంట రేపెట్టినందుకు.

***

మరికొన్ని వివరాలు:

1. అరుంధతి రాయ్ రచన; పెంగ్విన్ బుక్స్ ప్రచురణ, 1997లో; 340 పేజీలు

2. కథాకాలం: పందొమ్మిది వందల అరవైలు (ముఖ్యంగా, 1969 చివరి రోజులు)

3. న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన సమీక్ష  (పాతదే. 1997 నాటిది)

4. BBC బుక్ క్లబ్ చర్చలో ఈ పుస్తకం

5. ఫ్లిప్‌కార్టు లింకు (Rs.265/-)

4. అమెజాన్.కాం లింకు (పేపర్‌బాక్ – $11.59/-; కిండిల్ ప్రతి-$9.99/-)

 

You Might Also Like

2 Comments

  1. వురుపుటూరి శ్రీనివాస్

    ఈ నవలపై ఏనాడో మిసిమి పత్రికలో ప్రచురితమైన అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారి వ్యాసానికి లింకు

  2. S. Narayanaswamy

    good show. I hated the novel when I first read it. I don’t know why I read it again. Slowly fell in love with her poetic prose.

Leave a Reply