స్ఫూర్తిదాయని, జ్ఞానదాయని, సలహాదాయని, సన్నిహిత సఖి – మాలతీచందూర్

ఈ వారం Time పత్రికలో మార్టిన్ లూథర్ కింగ్ Civil Rights March on Washington/ I Have a Dream ప్రసంగం 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రచురించిన వ్యాసాలు చదువుతుంటే ప్రముఖ సువార్త గాయని (gospel singer) మహాలియా జాక్సన్ ప్రస్తావన కనిపించింది. ఆవిడ పాటలెప్పుడూ నేను వినలేదు. కాని ఆవిడ పేరు, ఆవిడ ప్రముఖ గాస్పెల్ సింగర్ అని నాకు దాదాపు నలభైఐదేళ్ళ క్రితమే తెలుసు. ఆ పేరు నాకు ఎక్కడ తగిలినా ఆవిడ గురించి మొదటిసారి ఆంధ్రప్రభ వారపత్రికలో చదవటం గుర్తు వస్తుంది. మహాలియా జాక్సన్ 1960లలో ఒకసారి మద్రాసు వచ్చి ప్రదర్శన ఇచ్చారు. ఆ ప్రదర్శన గురించి, ఆమె గురించి ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రమదావనం పేజీలలో మాలతీ చందూర్ ఒక వ్యాసం వ్రాశారు. కొత్తగా ఉన్న ఆ పేరు, అప్పటికి తెలియని ఒక కొత్త ప్రక్రియ (గాస్పెల్ సింగింగ్) జ్ఞాపకాలలో నిలచిపోయాయి. మహాలియా జాక్సన్ పేరు ఎప్పుడు తగిలినా, మాలతీ చందూర్ వెంటనే జ్ఞాపకం వస్తుంది. ఇలా మాలతిగార్ని మళ్ళీ గుర్తు చేసుకున్న రెండో రోజునే ఆవిడ మరణవార్త వినటం కొద్దిగా బాధ కలిగించింది.

వెనక్కి తిరిగి చూసుకుంటే మాలతీ చందూర్‌గారి ద్వారా నాకు మొదట పరిచయమైన విషయాలు ఇలాంటివి చాలానే ఉన్నాయి. నాకే కాదు, చాలా తరాల తెలుగు పాఠకులకు ఆమె కొత్త విషయాలు నేర్పారు. ముఖ్యంగా మధ్య తరగతి గృహిణులకు ఆమె ఇచ్చిన స్ఫూర్తి అపూర్వం. ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రమదావనం శీర్షికతో ఆమె వ్యాసాలు వ్రాయటం, పాఠకుల జవాబులకు ప్రశ్నలు ఇవ్వటం మొదలుబెట్టిన సమయం (1953), మన సాంఘిక చరిత్రలో ఒక సంధి సమయం. అప్పటికి తెలుగు చదువుకోవటం వచ్చిన మహిళల సంఖ్య బాగా పెరిగింది. అలా తెలుగు చదవగల మహిళలలో చాలా భాగం నగరాలలో, పట్టణాలలో, లేక తమదిగాని పల్లెటూళ్ళలో ఉద్యోగాలు చేస్తున్న భర్తల్తో కాపురాలు చేస్తున్నవాళ్ళు. అంతకు ముందు తరాల వారు జీవించటానికి అవసరమైన విషయాలను ఉమ్మడి కుటుంబాలలో మిగతావారిని చూసి నేర్చుకొనేవారు. అప్పుడు ఆడవారు చేసే పనులు తరతరాలుగా వారసత్వంగా వస్తున్నవే. కానీ ఈ కొత్త తరం స్త్రీల అవసరాలు వేరు. వేగంగా మారుతున్న జీవితానికి అవసరమైన మెళకువలు చెప్పటానికి అందుబాటులో పెద్దవారు లేరు. ఉన్నా, ఇవి వారికి తెలిసిన విషయాలు కావు. కొత్త వంటలు, కొత్త పనిముట్లు, కొత్త అలంకరణలు. భర్త ఉద్యోగానికి, పిల్లలు బడికి వెళ్ళినప్పుడు వచ్చే ఖాళీ సమయాన్ని పూరించుకోవలసిన కొత్త అవసరం. వర్తమానాన్ని, భవిష్యత్తుని మరింత బాగు చేసుకోవటం ఎలా అన్న సందిగ్ధ సమయం. కొత్త సమస్యలను ఎలా ఎదుర్కోవాలా అన్న కలవరం. ఆ సమయంలో వారందరికీ తోడుగా సహాయకారిగా కనిపించింది మాలతీ చందూర్. తెలిసిన వంటలు సులభంగా చేయటం, కొత్త వంటలు నేర్చుకోవటం, ఇల్లు అందంగా తీర్చిదిద్దుకోవటం, పిల్లల్ని పెంచటం, ఆరోగ్యంగా ఉండటం వంటి విషయాలన్నీ ప్రమదావనం శీర్షికలో చర్చింపబడేవి. గృహ జీవితాన్ని సానుకూలంగా ఎలా చేసుకోవాలో చెపుతూనే, దానితో పాటు మానసిక జీవితాన్ని ఎలా వైశాల్యం చేసుకోవచ్చో, ఆలోచనపథాన్ని ఎంత విస్తృతం చేసుకొవచ్చో సోదాహరణంగా చూపిస్తూ మాలతీ చందూర్ గృహిణుల్లో ఒకరిగా ఉంటూనే వారికి ఆదర్శప్రాయంగా అయ్యారు.

మా అమ్మగారితరం చదువుకున్న ఆడవారికి మాలతీ చందూర్ అంటే హీరో(యిన్) వర్షిప్ ఉండేది. ఆవిణ్ణి దగ్గర స్నేహితురాలుగానో, కుటుంబసభ్యురాలిగానో భావించేవారు. తమకు ఏం సమస్య వచ్చినా ఆవిడ దారి చూపించగలదు అన్న నమ్మకం వారికి ఉండేది. ఎవరితోనూ పంచుకోలేని సమస్యలను ఆమెతో పంచుకొంటూ ఆమె సలహాలనడగడం మొదలుబెట్టారు. వారికి ఆమె ఇచ్చే జవాబుల్లో మిగతావారుకూడా తమ సమస్యలకు సమాధానాలు వెతుక్కునేవారు. తెలుగులో ఆమెకంటే ముందెవరైనా అడ్వైస్ కాలమిస్టులు ఉన్నారేమో నాకు తెలీదు కాని, ఆవిడంత పేరు పొందిన అడ్వైస్ కాలమిస్టులు మరొకరు లేరని నిస్సందేహంగా చెప్పగలను. అంతే కాదు ఆవిడ నడిపినన్నాళ్ళు సలహాల శీర్షిక (అడ్వైస్ కాలమ్) నడిపినవారు కూడా లేరు. 1953లో మొదలుబెట్టి 2013 వరకూ ఆవిడ పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే వున్నారు. 2004లో ఆంధ్రప్రభ వారపత్రిక మూతపడే వరకూ ‘జవాబులు’ శీర్షిక నిర్వహించారు. ఆ తరువాత స్వాతి వారపత్రికలో ‘నన్ను అడగండి’ శీర్షిక చనిపోయేవరకూ కొనసాగించారు. ఇంత కాలం – దాదాపు 60 సంవత్సరాలు – సలహాల శీర్షిక నిర్వహించినవారు అన్యభాషలలో ఒకవేళ ఉంటే, వారి సంఖ్య చాలా తక్కువగానే ఉండి ఉంటుంది. ఆవిడ జవాబుల్లో కొంటెతనం ఏమాత్రం ఉండేది కాదు. అవతలవారిపైన సానుభూతి ఎప్పుడూ కనిపించేది. అందుచేత పాఠకులు ఆమెను ఏ విషయం అడగటానికైనా సంకోచించేవారు కాదు. ఒక దశలో వారానికి అయిదువందల ఉత్తరాలు వచ్చేవని 1985 తానా సావెనీర్‌కు ఆమె వ్రాసిన వ్యాసంలో చెప్పారు (ప్రమదావనం పేర ఆమే వ్రాసిన వ్యాసం).

చాలాకాలం పాటు వంటల పుస్తకం అంటే మాలతీచందూర్ గారిదే. ఆవిడ వ్రాసిన వంటలు – పిండివంటలు పుస్తకం విపరీతమైన ప్రజాదరణ పొందింది. (సేవరీస్ అన్న పదం మొదటిసారి చూసింది ఆ పుస్తకంలోనే). బహు తరాల వంటిళ్ళ సందేహాలను తీర్చి ఆత్మవిశ్వాసాన్ని అందించిన ఈ పుస్తకం దాదాపు 30 ముద్రణలు పొందటంలో ఆశ్చర్యమేమీ లేదు.

మాలతి గారు మంచి చదువరి. తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాలు రెండూ చాలా ఆసక్తిగా చదివేవారు. చదివిన పుస్తకాలని పదిమందికీ పరిచయం చేయటానికి కృషి చేశారు. పియూసీ చదివే రోజుల్లో అనుకుంటా మాలతీచందూర్ గారి పాతకెరటాలు పుస్తకం చేతికొచ్చింది. అప్పటికి ఇంగ్లీషులో పుస్తకాలు చదవటం తక్కువ. ఆ పుస్తకంలో ఆవిడ ప్రఖ్యాతి పొందిన పాశ్చాత్య నవలలను సంక్షిప్తంగా పరిచయం చేశారు. ఇప్పటికీ నాకు “గాన్ విత్ ద విండ్” అంటే ముందు ఆవిడ రాసిన పరిచయమే గుర్తొస్తుంది (చాలా నాటకీయంగా మొదలౌతుంది ఆ పరిచయం). ఆ నవలా పరిచయాలు నాకు ఆంగ్ల సాహిత్యం చదవటానికి దారి చూపించాయి. “ఉదరింగ్ హైట్స్”, “మదాం బొవరీ”, “టు కిల్ ఎ మాకింగ్ బర్డ్” వంటి పుస్తకాల గురించి నేను మొదట తెలుసుకొంది మాలతిగారి ద్వారానే. తెలుగు నాడి పత్రికలో మేము నిర్వహించిన నవలా పరిచయం శీర్షికకు ఈ పుస్తకమే స్ఫూర్తి. ఈ కృషిని మాలతి గారు స్వాతి పత్రికలో పాత కెరటాలు శీర్షికలోనే చివరివరకూ కొనసాగిస్తూనే ఉన్నారు. జయకాంతన్ పుస్తకమొకదానికి (“ఇల్లు విడచిన గంగ” అని అస్పష్ట జ్ఞాపకం) ఆమె అనువాదం ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా చదివిన గుర్తు. శివశంకరి తమిళనవలలనూ ఆవిడ అనువదించారు.

చిన్నప్పుడు మాలతీ చందూర్ పేరు చాలా తమాషాగా అనిపించేది. ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రమదావనం శీర్షికలో ఆమె వ్యాసాలు, జవాబులు చాలా ఆసక్తికరంగా ఉండేవి. ఆవిడ జవాబుల్లో కనిపించే వస్తువైవిధ్యమూ, విస్తృత పరిజ్ఞానమూ ఆశ్చర్యపరిచేవి. ఇంకొద్దిగా పెద్దై స్వంతంగా చదువుకొంటూ విషయాలు తెలుసుకోవటం మొదలు పెట్టాక ఆమె జవాబులు నచ్చటం మానేశాయి. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అవసరంలేని విషయాల గురించి చెప్తూ పాండిత్యప్రదర్శన చేస్తున్నారనిపించి విసుగువచ్చేది. (ఈ మధ్య స్వాతిలో కొన్ని సమాధానాలు చదువుతున్నప్పుడు మాత్రం, అవసరమైనప్పుడు నిర్మొహమోటంగా, నిష్కర్షగా సమాధానం చెప్పటం గమనించాను.) ఇంకొద్దిగా పెద్దయ్యాక, ఆవిడ అప్రస్తుతంగా చెప్పిన విషయాలైనా పాఠకులకు కొత్త సంగతులు తెలియటం ఎంతోకొంత ప్రయోజనాన్నే కలిగిస్తాయి అన్న స్పృహ వచ్చాక, ఆ చిరాకు తగ్గింది.

ఈ జనవరిలో విజయవాడ బుక్ ఎక్జిబిషన్‌లో మాలతీచందూర్‌గారి నవలలు కొన్ని దొరికాయి – శతాబ్ది సూరీడు, ఆలోచించు, భూమిపుత్రి, కాంచన మృగం వగైరా. అవి చదువుతుంటే మాలతీ చందూర్‌కు నవలా రచయిత్రిగా రావల్సినంత పేరు రాలేదేమో అనిపించింది. మాలతీ చందూర్‌గారి జీవితంలో ముఖ్యభాగమంతా మద్రాసులో గడిచివుండొచ్చు కానీ ఆమెకు ఆంధ్రదేశపు మట్టివాసన బాగా తెలుసు. మనుషుల ప్రవర్తన గురించి, అంతరంగ విశ్లేషణ గురించి కూడా బాగా తెలుసు. తెలుగులో చదివితీరవలసిన పుస్తకాలలో శతాబ్ది సూరీడు ఒకటి. మాలతీ చందూర్ నవలల పైనా, ముఖ్యంగా శతాబ్ది సూరీడుపైనా వోల్గా సహితలో సవివరమైన వ్యాసాలు వ్రాసినట్టు గుర్తు. (మాలతీ చందూర్ కు సాహిత్య అకాడెమీ అవార్డు తెచ్చిపెట్టిన హృదయనేత్రి పుస్తకం నేనింకా చదవలేదు). ఆవిడ కొన్ని మంచి కథలు కూడా వ్రాశారు.

మాలతి గారిని, ఎన్నార్ చందూర్ గారిని 1995లో మద్రాసులో వారి ఇంట్లోనే కలిశాను. చికాగో తానా సమావేశాలకు వారు ఆహ్వానితులు. అప్పుడు నేను సంపాదకుడిగా వెలువరించిన తెలుగు వెలుగు (సావెనీర్)‌కు తెలుగు పత్రికల్లో అంతకుముందు 20 ఏళ్ళలో వచ్చిన మార్పుల గురించి నా కోరికపై వ్రాసిన వ్యాసం ఇచ్చారు. చూపులకు, మా వూళ్ళలో పరిచయమైన కుటుంబాలలో పెద్దావిడలాగా కనిపించారు. నిరాడంబరంగా, స్నేహశీలిగా, భోళాగా అనిపించారు. ఏవో కారణాలచేత ఆమె తానా సమావేశాలకు రాలేదు. ఆ విషయంలో ఆమె ప్రవర్తన ఆమెపై నాకున్న గౌరవాన్ని చాలా తగ్గించింది. మళ్ళీ ఈమధ్య ఆమె నవలలు చదివాకగానీ అప్పుడు వచ్చిన చిరాకు పూర్తిగా వదల్లేదు.

ఎవరైనా చనిపోయినప్పుడు వారు లేని లోటు తీర్చలేనిదనడం సామాన్యం. కానీ మాలతీచందూర్ విషయంలో అది నిజమేనేమో. చాలా చిన్నతనంలోనే పత్రికలకు వ్రాయడం మొదలుబెట్టిన మాలతీచందూర్ 83 ఏళ్ళు వచ్చినా, ఆరోగ్యం బాగా లేకపోయినా, చివరిరోజులవరకూ చదవటమూ, వ్రాయటమూ కొనసాగిస్తూనే ఉన్నారు. తనకు తెలిసిన, తను చదివిన విషయాలను పాఠకులతో పంచుకొంటూనే ఉన్నారు. ఆమెతో సరిగా సాహితీ వ్యాసంగం చేసినవారు తక్కువ. ఆమె సమకాలికులందరూ ఎన్నడో కలం విడచిపెట్టారు. ఆమె మరణంతో ఇరవయ్యవశతాబ్దపు ఉత్తరభాగంలోని ఒక తెలుగు సాంస్కృతిక చిహ్నం మాయమయ్యింది. కొన్నిదశాబ్దాలపాటు మధ్యతరగతి తెలుగు ఆడవారిపైన, ఇతర పాఠకులపైన ఆవిడ ప్రభావం గణనీయమైంది. వారికి ఆమె స్ఫూర్తిదాయని, జ్ఞానదాయని, సలహాదాయని, అన్నిటినీ మించి సన్నిహిత సఖి.

You Might Also Like

16 Comments

  1. kothapalli ravibabu

    Came to know several new things about the literary work of Malathi chandur. Very informative article.

  2. ramachary bangaru

    శ్రీమతి శివశంకరి గారి తమిళ నవలను మాలతి చందూర్ గారు ” ఓ మనిషి కధ ” పేరిట అనువాదం చేయగా క్వాలిటి పబ్లిషర్సు విజయవాడవారు ప్రచురించినది.. మద్యపానం వల్ల మనిషి ఎంతగా పతనమవుతున్నాడు అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారు.మొదట ఈ అనువాద నవల స్వాతి మాసపత్రికలో సీరియల్ గాను, తరువాత స్వాతి సపరివార పత్రికలో సీరియల్ గా వచ్చింది.

  3. Koppula Hemadri

    జంపాల గారికి అప్పుడప్పుడు మాలతీ చందూర్ గారి జవాబుల సరళిపై విసుగు రావడంలో న్యాయముంది! ఆరోజుల్లో (1957-1970) నేనూ ‘పేర్లు’ పెట్టేవాడిని! సందు దొరికితే చాలు తనకు తెలిసినదంతా జవాబు రూపంలో చెప్పేసేదని! అదటుంచితే, ‘ప్రమదావనం, జవాబులు’ ఆడా, మగా భేదం లేకుండా అందరూ చదివేవారు. నేను ‘కొప్పుల హేమాద్రికాదేవి’ అనే కలం పేరుతో ఉత్తరం రాస్తే ‘పసికట్టి’ చివాట్లు కూడ పెట్టింది! కాని తరువాత ‘కుర్ర కుంక’నని తెలిసినా సహ్యాద్రి కనుమల్లో నేను అనుభవించి పులకరించిన ప్రకృతి దృశ్యాల వర్ణనలకు ‘జవాబులు’ పేజిల్లో చోటిచ్చింది! వీటిలో ఒక సంఘటనను నా “కొప్పులవారి కతలూ… కబుర్లూ” లో “రెక్కలు విప్పిన ప్రకృతి!” గా శీర్షిక పెట్టాను. ఆర్నెల్ల క్రితం ఒక ప్రతిని పంపాను. పుస్తకం అందినదో లేదో తెలియదు. అందితే చదివిందో లేదో తెలియదు! ఇంతలో ఈ వార్త! నాకు నచ్చని వార్త!

  4. pavan santhosh surampudi

    ఆవిడ అనువదించిన జయకాంతన్ నవల “కొన్ని సమయాల్లో-కొందరు మనుషులు” నేను చదివాను. నన్ను బాగా కలవరపెట్టిన నవల అది. ఐతే “ఇల్లు విడిచిన గంగ” నేను చదవలేదు. “కొన్ని సమయాల్లో-కొందరు మనుషులు” నవలలో కథానాయకి పేరు గంగ కావడం, ఆమె కూడా ఇల్లువిడిచివెళ్ళే ఇతివృత్తం ఆ నవలలో ఉండటం బట్టి చూస్తే బహుశా చౌదరిగారు ఆ నవల పేరు మరిచిపోయి ఇల్లు విడిచిన గంగ అన్నారేమోనని నా ఊహ. ఆ నవలలో హీరోయిన్ పదహారేళ్ల వయసులో ఓ ఇరవయ్యైదు ఏళ్ల అపరిచితుని కారెక్కి అత్యాచారం పాలవుతుంది. ఆమె ఏడుస్తూ తల్లికి చెప్తే, తల్లి ఊరూ వాడా ఏకం చేసేలా గోల చేస్తుంది. నిజంగానే ఊరూ వాడా ఏకమై ఆమె అన్నగారింటినుంచి తరమబడి, పెళ్లీ పేరంటాలు లేకుండా చదువుతూ వివాహం కాకున్నా, బొట్టూ కాటుకలతో వైధవ్యం అనుభవిస్తుంది. చదువుకుని, ఉద్యోగం చేస్తూ ఒంటరిగా బతుకుతున్న ఆమె ఓ పదిహేనేళ్ల తర్వాత ఆ అపరిచిత రేపిస్టును పరిచయం చేస్కోగా అనుకోకుండా వారి మధ్య వింత ప్రేమబంధం శారీరిక బంధానికావల మొగ్గతొడుగుతుంది. ఆ విచిత్రమైన నవల జయకాంతన్ రాసిన ఓ కథకు(అందులో తల్లి రేప్ కు గురికాబడ్డ పిల్లను స్నానం చేయించి ఇంట్లోకి తీసుకొచ్చి, మరెప్పుడూ పొరపాటున కూడా అపరిచితుల్ని నమ్మవద్దు, ఇక ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని చెప్పడంతో పూర్తవుతుంది) వచ్చిన విమర్శలకు సమాధానంగా రాశారాయన.
    ఐతే నిజంగా అవి జయకాంతన్ రాయగా మాలతీ చందూర్ తమిళం నుంచి తెలుగులోకి అనువదించిన రెండు వేర్వేరు నవలల పేర్లు అయ్యే అవకాశమూ లేకపోలేదు లేదా మొదట “ఇల్లు విడిచిన గంగ”గా ఉన్న పేరు “కొన్ని సమయాల్లో కొందరు మనుషులు”గా మారి ఉండనూవచ్చు.

    1. Jampala Chowdary

      జయకాంతన్ వ్రాసిన సిల నేరంగలిల్, సిల మణితర్గల్ అనే పుస్తకానికి అనువాదం – కొన్ని సమయాలలో కొందరు మనుష్యులు. ఈ నవల తమిళంలో సినిమాగా కూడా వచ్చింది. గంగ పాత్ర ధరించిన నటి లక్ష్మి 1976లో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా రజత కమలం అందుకొన్నారు.

      జయకాంతన్‌దే ఇంకో నవల గంగై ఎంగే పోగిరాల్ (ఇల్లు విడచిన గంగ). సిల నేరంగిలల్…కు ఇది కొనసాగింపు (అట).

      1977/78 ప్రాంతాలలో ఆంధ్రజ్యోతి వారపత్రికలో మాలతీచందూర్ అనువదించిన జయకాంతన్ నవల ఒకటి సీరియల్‌గా ప్రచురితమైంది. నాకు వివరాలు సరిగ్గా గుర్తు లేవు. బాలి వేసిన పులి మీద స్వారీ చేస్తున్న ఒక అమ్మాయి బొమ్మతో ఆ సీరియల్ వచ్చేదని, కథానాయిక పేరు గంగ అని, ఆ అమ్మాయి ప్రవర్తన నిర్లక్ష్యంగానూ, కొంత తిరుగుబాటుతనంతోనూ ఉంటుందని గుర్తు.

      నేను మా గుంటూర్ ఫిల్మ్ క్లబ్ ద్వారా సిల నేరంగిలల్… చూసేశాకే ఈ నవల సీరియల్‌గా వచ్చిందని గుర్తు. ఈ సీరియల్, ఆ సినిమా ఒకటి కాదు అనుకొంటున్నాను. అప్పటి విషయాలు తెలిసిన వారెవరైనా వివరాలు చెప్పగలరేమో.

      మాలతీ చందూర్ సిల నేరంగిలల్… కు చేసిన అనువాదం నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ప్రచురణ కదా. అది ఆంధ్రజ్యోతిలో సీరియల్‌గా కూడా వచ్చి ఉంటుందంటారా?

    2. pavan santhosh surampudi

      జయకాంతన్ “అగ్ని ప్రవేశం” కథ రాస్తే వచ్చిన దుమారానికి సమాధానంగా “కొన్ని సమయాల్లో కొందరు మనుషులు” నవల రాశారని తెలుసు. ఐతే దానికి కొనసాగింపుగా “ఇల్లు విడిచిన గంగ”(కొన్ని సమయాల్లో… నవల చివర్లో గంగ విచ్చలవిడిగా ప్రవర్తించే స్థితికి వెళ్లిపోతుంది. మీరు చెప్పేక అనిపించింది ఆమె అలా అయ్యాకా ఈ నవల ప్రారంభమౌతుందేమోనని) రాశారా? భలే విచిత్రంగా ఉందే ఒకదానికొకటి కొనసాగింపుగా ఎంత సాహిత్యం రాశారో ఈయన.

  5. Sujatha

    ఎవరైనా చనిపోయినప్పుడు వారు లేని లోటు తీర్చలేనిదనడం సామాన్యం. కానీ మాలతీచందూర్ విషయంలో అది నిజమేనేమో. _______________

    అవును, ఆమె మరణించిన నాటి నుంచీ నాకూ ఇలాగే అనిపిస్తోంది. 84 ఏళ్ళ వయసు కదా,మరణం సహజమే అని మరో పక్క అనిపిస్తున్నా కూడా!

    ప్రమదావనం గురించి చాలా విషయాలు చర్చించడం బాగుంది ఈ వ్యాసంలో!

    A complete Tribute…

  6. mani vadlamani

    నా చిన్న తనం లో నాన్నగారు మొదట ఆంధ్రప్రభ వార పత్రిక రాగానే చదేవిది ‘ప్రమదావనం’ ఆవిధంగా ఆవిడ పీరు మాకు చిన్నతనం లోనే తెలిసింది. చౌదరీ గారు రాసినట్లు ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి.. నా కు ఆవిడ లో నచ్చినవి ‘ఆవిడ అనువాదం చేసిన’ ఇంగ్లీష్ నవలలు’ వాటి కోసం ప్రతి నెల స్వాతి మాస పత్రికని కొనుక్కొనేదాన్ని. ఆవిధంగా ఆ అనువాద నవలలద్వారా తెలియని ప్రపంచాన్ని తెలిసుకొనే అవకకాశం కలిగింది నిజంగా ఆవిడ రాసిన ది చదువుతూవుంటే ఒరిజినల్ఇంగ్లీష్ నవల చదివినంత ఆనందం వేసేది. కేవలం ఆమెఅనువాద రచనల కారణంగానే ఒరిజినల్ ఇంగ్లీష్ చదవటానికినాకు ఉత్సహం వేసేది
    అందుకే ఆవిడ అసలు నవలను కూడా చదివి ఆనందించండి అని చెప్పేవారు.
    ఆవిడ మూలంగా ఇంగ్లీష్ నవలలు చదివే పరిఙ్ఞానం పెరిగిందని నేను చాల గొప్పగా చెప్పుకొంటాను.
    ఆవిడ రచనల ద్వారా తప్ప నేను ఎప్పుడు కూడా ఆవిడని పెర్సనల్ గా చూడటం తటస్థించలేదు.
    అయినకాని ఆవిడా నాలో చదవాలి అనే జిజ్ఞాసాను నింపారు.

    అందుకే అందరి హృదయాలలో ఆ మహామనిషి ఎప్పటికి చిరస్థాయిగా వుంటారు

  7. వేణు

    కొన్నితరాల మహిళా పాఠకుల సందేహాలూ, సమస్యలకు మాలతీచందూర్ గారి సలహాల, సూచనల విలువైన కంట్రిబ్యూషన్ గురించి మీ వ్యాసం చక్కగా వివరించింది. ప్రమదావనాన్ని మగవారు కూడా బాగానే చదివేవారు.

    ఈ సందర్భంగా తానా ప్రత్యేక సంచిక వ్యాసం లింకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సుదీర్ఘకాలంగా నడుస్తున్న తన శీర్షిక గురించి ఆమె భావాలు తెలుసుకోవటం బాగుంది.

    మీ శీర్షికలోని (ముగింపు వాక్యాల్లో కూడా) విశేషణాల చివర ‘.. దాయని’ అనే మాట బదులు ‘… దాయిని’ అని ఉండాలనుకుంటాను.

    1. Jampala Chowdary

      దాయి, దాయ – రెండూ సరి ఐనవే అనిపిస్తుంది, నిఘంటువులను బట్టి.

  8. sathyavathi

    మాలతీ చందూర్ గారికి మంచి నివాళి. ఆమె ప్రమాదావనం ప్రారంభించిన సమయంలో నేనింకా హైస్కూల్.అయినా ఆవిడ పరిచయం చేసిన ఇంగ్లిష్ నవలలు డిక్షనరీ పక్కన పెట్టుకుని మరీ చాద్వడం అలవాటు చేసుకుని తరువాత ఇంగ్లిష సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాను. ఇష్టాలు మొదలయ్యే రోజుల నాటి స్పూర్తిదాయని ఆమె నాకు

  9. Jampala Chowdary

    పుస్తకంలో ఇంతకు ముందు శతాబ్ది సూరీడు నవలకు సుజాతగారి పరిచయం
    http://pustakam.net/?p=7421

  10. Jampala Chowdary

    మాలతీచందూర్ గారి జీవితంపై సమగ్రంగా అనిపించిన వ్యాసం, మిత్రుడు రెంటాల జయదేవ వ్రాసింది – http://ishtapadi.blogspot.com/2013/08/blog-post_6582.html

    1. Jampala Chowdary

      ఈ వ్యాసంలో లేనిది, మరో చోట చదివింది – స్వతంత్రం వచ్చాక (1947)లో మద్రాసులో జరిగిన మొదటి రిజిష్టర్ వివాహం మాలతిగారిదేనట.

  11. cbrao

    మీ మాటలు మాలతీ చందూర్ వ్యక్తిత్వాన్ని, రచనా పటిమనూ సరిగా ఆవిష్కరించాయి. ఈ వ్యాసం చక్కటి నివాళి ఆ స్నేహశీలికి. ఆమె రచనలు పెక్కుమంది స్త్రీలను, మంచి రచనలు చదివే పాఠకులుగా మార్గ నిర్దేశనం చేసాయి.

  12. తృష్ణ

    @jampaala gaaru, మాలతీ చందూర్ గారి గురించి మీ వ్యాసం ఇక్కడ వస్తుందని అనుకున్నానండీ…:)

    మా ఇంట్లోనూ, మా పిన్నిలు,పెద్దమ్మల ఇళ్ళల్లో మాలతి గారి ‘ప్రశ్నలూజవాబులు’, ‘పాత కెరటాలు’,’ప్రమదావనం’, ఇతర వ్యాసాల తాలూకూ కట్టింగ్స్ తో చేయించుకున్న బైండింగులు ఇంకా భద్రంగా ఉన్నాయి. నాకు మాలతీచందూర్ పరిచయమైంది కూడా ఆ బైండింగుల ద్వారానే ! ఆవిడ నవలల్లో ‘హృదయనేత్రి’, ‘మనసులో మనసు’ చాన్నాళ్ల క్రితం కొని చదివాను కానీ ఆవిడ ఇతర వ్యాసాలంత ఎక్కువగా మనసుకు హత్తుకోలేదవి..
    but మీరన్నట్లు “కొన్నిదశాబ్దాలపాటు మధ్యతరగతి తెలుగు ఆడవారిపైన, ఇతర పాఠకులపైన ఆవిడ ప్రభావం గణనీయమైంది. వారికి ఆమె స్ఫూర్తిదాయని, జ్ఞానదాయని, సలహాదాయని, అన్నిటినీ మించి సన్నిహిత సఖి.”
    బాగా చెప్పారు.

Leave a Reply