హేతువాదం అపోహలు, అపార్థాలు – గుమ్మా వీరన్న

వ్యాసకర్త: తుమ్మా భాస్కర్
******
విశ్వం విశాలమైనదేగాక చలనశీలి, పరిణామశీలి. విశ్వంలోని సంఘటనలు నియమానుసారంలో జరుగుతున్నాయి. అట్టి విశ్వం నుండి జీవపరిణామ క్రమంలో ఉద్భవించిన మనిషి అదే విశ్వం నుండి హేతుత్వాన్ని అలవరుచుకున్నాడు. దాని వల్లనే ప్రకృతిలోనే అనేక సంఘటనలకు కారణాలను తెలుసుకొని ముందుకు సాగుతున్నాడు. ఆ క్రమంలో సరియైన శాస్త్రీయ విజ్ఞానం పెరగని ఆదిమ కాలంలో దైవ భావన మొదలైంది. దాని నుండి మతం ఏర్పడి సరియైన శాస్త్రీయ అవగాహన లేకపోవడంతో మతవాదం పెరుగుతున్నది.

మతవాదం మత్తులో కొట్టుకుపోతున్న వ్యక్తులు, వ్యక్తికి, సమాజానికి అవసరమైన హేతువాదంపై అనేక అపోహలు, అపార్థాలను ఆరోపిస్తూ విమర్శించసాగారు. హేతువాదంపై సరియైన అవగాహన లేని వారే దానిని విమర్శిస్తారంటూ, దానికి సరియైన రీతిలో సమాధానమిస్తూ గుమ్మా వీరన్న వ్రాసిందే ఈ పుస్తకం.

ఈ పుస్తకంలో హేతువాదాన్ని అపార్థం చేసుకుంటూ ముగ్గురు వ్రాసిన పుస్తకాలను లేదా సంచికలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని వాటికి సమాధానమిస్తూ వ్రాయడం జరిగింది. అంతేగాక హేతువాద ఉద్యమాలలో పాల్గొంటున్నవారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనవచ్చా లేదా అనే దాని గురించి కూడా తన అభిప్రాయాన్ని వ్రాసారు. కమ్యూనిస్టులు హేతువాదులేనా? అంటూ కూడా వ్రాయడంలో వెనుకాడలేదు. చివరలో హేతువాదమనేది మానవవాదానికి దారి తీస్తుందని ముగించారు.

భయం ద్వారా తప్ప స్వేచ్ఛ ద్వారా మనుషులను మార్చలేమంటూ డి.వి.ఆర్.కె.రావు తన హేతువాద ఉద్యమ సాఫల్య-సాధ్యాసాధ్యాలు, అనే వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ఖండిస్తూ రచయిత వివరణ ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు హేతువాద సంఘాలలో పనిచేసిన ఎన్.వి.బ్రహ్మం తాను వ్రాసిన ‘కళాశాస్త్ర వివాదంలో హేతువాది హేతువాదం’ అనే పుస్తకంలోని హేతువాదంపై గల అపోహలు, అపార్థాలతో కూడిన విషయాలను ఖండిస్తూ రచయిత వివరణ ఇచ్చారు. అదే విధంగా ప్రొ.రామచంద్రయ్య తెలిపిన అభిప్రాయాలను ఖండిస్తూ రచయిత వివరణ ఇచ్చారు. హేతువాదంపై అనేక మందికి ఉన్న అపోహలకు, అపార్థాలకు రచయిత ఇచ్చిన సమాధానాలు తృప్తినిచ్చాయనే చెప్పవచ్చు.
హేతువాదమనేది సిద్ధాంతం కాదు, అదొక సహేతుక ఆలోచనా విధానం. ఇది సైన్సు, శాస్త్రీయ దృక్పథంతో ముడిపడింది. దీని ప్రధాన లక్ష్యం మనిషి శ్రేయస్సు, సమాజ హితమే. దీనిని ఏ అంశానికైనా సంధించవచ్చు, ఫలితాన్ని రాబట్టవచ్చు.

హేతువాదాన్ని విశ్వం యొక్క ఉనికికి సంధించినపుడు పదార్థవాదం, భౌతికవాదం, భౌతిక వాస్తవిక వాదం బయటపడతాయి. కుల, మత వర్గాది సమిష్టి తత్వాలకు సంధించినపుడు అవి అసత్యాలుగాను, సంకుచిత తత్వాలుగాను తేలిపోతాయి. బానిసత్వ, నియంతృత్వాలకు సంధించినపుడు అవి మానవ వ్యతిరేక తత్వాలు గాను, సమానత్వం, ప్రజాస్వామ్యం వాటికి ప్రత్యామ్నాయ విధానాలుగాను నిరూపితమవుతాయి.

సైన్సు అనేది సత్యావిష్కరణ ఒక్కటే సాధనం కాదని, అది అర్థం చెప్పలేని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రీయేతర పద్ధతులపై ఆధారపడాలనే వాదానికి రచయిత సమాధానమిస్తూ మెదడుతో కాక మరో అంగంతో ఆలోచించడం ఎలాగైతే అసాధ్యమో, సైన్సు ద్వారా కాక యితర విధానాల ద్వారా సత్యాలను తెలుసుకోవడం అంతే అసాధ్యమంటాడు. ఏ విషయాన్నైనా సైన్సు ద్వారానే అర్థం చేసుకోగలిగిన మేరకు అర్థం చేసుకోగలం. ఇతర సాధనాల మీద ఆధారపడాలని వాదించేవారు సైతం సైన్సు మీద మాత్రమే ఆధారపడినా, ఆ విషయాన్ని సరిగా గుర్తించనందువల్లనే అలా వాదించగలుగుతున్నారంటూ వివరణ ఇచ్చాడు. అంతేగాక సైన్సు, హేతువాదాన్ని మినహాయిస్తే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మరో సాధనమే లేదంటాడు.

సైన్సు వస్తువుల యొక్క లక్షణాలను మాత్రమే తెలుసుకుంటుంది, చల్లదనం, మెత్తదనం, సౌందర్యం వంటి అనుషంగిక లక్షణాలను, గుణాలను తెలుసుకోజాలదనే వాదన తప్పంటూ రచయిత సమాధానమిచ్చారు.

మానవుడు తన సుఖసంతోషాల కోసం సృష్టించుకున్న అనేక అంశాలలో యోగాలు, కళల వంటివి కూడా ఉన్నాయి. వాటిని వినోద సాధనాలుగా వినియోగించుకోవచ్చునేగాని సత్యసాధనాలుగా పరిగణించడానికి మాత్రం వీలుండదన్నారు. వస్తువులు వాటి లక్షణాలు, వ్యాపారాలు మానవుల ఇంద్రియాలతో సన్నికర్షత్వం పొందినపుడు ఏయో రకాల స్పందనలు ఏయే విధంగా కలుగుతాయో, ఏ విధంగా కలగడానికి వీలుందో వాటిని కృత్రిమంగా సైతం కల్పించడానికి వీలుందో సైన్సు వివరించగలదు. అలాగే సౌందర్యం వంటి అనుషంగిక గుణాలు ప్రధానంగా వస్తుగతం కన్నా వ్యక్తిగతమే. ఈ విధంగా కళలు వంటి వినోద సాధనాలకు కూడా శాస్త్ర జ్ఞానమే పునాది అవుతుంది.

నీతి, విలువలు వంటి వాటికి హేతువాద పరంగా సమాధానలిచ్చాడు. మానవుడు హేతుబద్ధుడైనపుడు నీతిబద్ధుడవుతాడు. హేతుత్వాభివృద్ధికి, వ్యక్తులలోని నైతిక ప్రమాణాల పెరుగుదలకు అవినాభావ సంబంధం ఉంది. అలాగే సత్యం, ధర్మం, నీతి మున్నగు విలువలన్నీ హేతువుతో ముడిపడి ఉన్నవే. ఉద్వేగాలను రెచ్చగొడితే విలువలు వృద్ధి చెందవు.

చాలా మందికి చైతన్యం, పదార్థం వీటిలో దేని నుండి ఏది సృష్టి జరిగిందనేది ప్రశ్న. చైతన్యమనేది పదార్థ లక్షణంగానే అర్థం చేసుకోవాలిగాని దానికి భిన్నంగా మాత్రం కాదు. అది పదార్థాన్ని ఆశ్రయించే లక్షణమైనపుడు అది ఆ పదార్థం లేకుండా ఉండడానికి వీలుండదు. అంటే పదార్థ రహితమైన చైతన్యం ఉండదని అర్థం. అలాగే మెదడుకున్న విశిష్ట లక్షణం భావాల ఉత్పత్తి. అంటే మెదడు లేకుండా భావాలు లేవు.

ఈ విధంగా రచయిత అనేక విషయాలకు హేతువాదం పరంగా సమాధానాలిచ్చాడు. దేవుడు ఏ విధంగా లేడో శాస్త్రీయంగా వివరణ ఇచ్చాడు. అవినీతి గురించి వివరిస్తూ అవినీతి అంటే కేవలం డబ్బు అక్రమంగా మార్పిడి జరిగితేనే కాదు. చిత్తశుద్ది లేకుండా బాధ్యతగా పని చేయకపోవడం కూడా అని చెప్పారు.

చెకుముకి పత్రికా సంపాదకులు ప్రొ. ఎ.రామచంద్రయ్య ప్రజాశక్తి దినపత్రికలో హేతువాదం, కమ్యూనిస్టులకు సంబంధించి వ్రాసిన వ్యాసంలో నాస్తికవాదులనబడే వితండవాదులకన్నా శాంతియుతమైన మత విశ్వాసాలున్న వారిపైనే వామపక్షవాదులకు గౌరవం ఎక్కువ. హేతువాదులందరూ నాస్తికులు కారు, ప్రతి హేతువాదీ అభ్యుదయవాది కానక్కరలేదు, కానీ ప్రతి కమ్యూనిస్టూ గొప్ప అభ్యుదయవాదంటూ తెలిపారు. దీనికి స్పందించిన గుమ్మా వీరన్న నియంతృత్వ, మతానుకూల కమ్యూనిస్టులు హేతువాదులా? అంటూ మాధానమిచ్చారు.

హేతువాదమనేది జాతి కులమత భేదాలతోపాటు కమ్యూనిస్టులు చెప్పే వర్గ భేదాన్నీ, వర్గ వాదాన్నీ తిరస్కరిస్తుంది. నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తుంది. అందువలన కార్మిక వర్గ నియంతృత్వాన్ని ఆమోదించే కమ్యూనిస్టులు ఏ రకంగాను హేతువాదులు కాజాలరని రచయిత వివరించాడు.

హేతువాదం చాలా విస్తృతమైనదని, అది ఆదిమ మానవుడి నుండి ఆధునిక మానవుడిదాక కొనసాగిన లక్షల సంవత్సరాల ప్రయాణంలో మానవుడి అభ్యుదయానికి దోహదం చేసిందని చెప్పారు.

రచయిత, సేవా కార్యక్రమాలు-హేతువాద వైఖరి పేరున వ్రాసిన వ్యాసంలో హేతువాద ఉద్యమంలో పని చేసేవారు చేయవలసింది భావవిప్లవ పోరాటమేగాని సేవా కార్యక్రమాల ప్రచారం కాదు, కారాదు అంటూ గట్టిగా చెప్పారు. ఎందుకంటే, మనకున్న అత్యంత విలువైన స్వల్ప వనరులను, శక్తి సామర్ధ్యాలను వాటికి వెచ్చించడం వివేకవంతమైన చర్య అనిపించుకోదన్నారు.

ఈ మాట వాస్తవమైనా రచయిత ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోలేదనుకుంటాను. భావ విప్లవ ఉద్యమాలలో పని చేస్తున్న చాలామంది నిరుద్యోగులు కాదు. చాలామంది ఉద్యోగులో, వ్యాపారులో, శ్రమజీవులో గానో ఉన్నారు. వారు ఉద్యమంలో పాల్గొంటూనే తమ వృత్తులను చేస్తున్నారంటే అలా చేయవచ్చా—ఎవరైనా తమ వృత్తులను చేస్తూ తమకు దొరికిన తీరిక సమయాన్ని ఉద్యమ కార్యక్రమాలు లేనపుడు సేవాకార్యక్రమాలకు కేటాయించడంలో ఇబ్బందేమిటి—అలాగే సామాజిక సేవా కార్యక్రమాలనేవి ఆచరణీయమైన హేతువాదంలోని భాగాలేగా, ఈ విషయంలో రచయిత అభిప్రాయంతో విభేదిస్తున్నాను.

ఈ పుస్తక రచయితయైన గుమ్మా వీరన్న ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఆయన హేతువాదంపై అనేక పుస్తకాలను వ్రాసారు. ఆయన ఒకవైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. పదవీ విరమణ పొందినప్పటి నుండి యింకా చురుకుగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. హేతువాద సాహిత్యం, కావలసినంత లభ్యం కాకపోవడం వలన, అనేక మందిలో హేతువాదంపై పెక్కు అనుమానాలు, అపోహలుంటున్నాయి. వాటిని నివృత్తి చేయడానికి రచయిత ఈ పుస్తకాన్ని వ్రాసారు. ప్రముఖ హేతువాది, ఉద్యమకారుడు రావిపూడి వెంకటాద్రిగారు పరిచయం వ్రాయడం, ఈ పుస్తకానికి, వన్నె తెచ్చిందని చెప్పవచ్చును. హేతువాదాన్ని వలిచి పెట్టారు ఆ పరిచయ వాక్యాలలో. 150 పేజీలు కలిగిన ఈ పుస్తకం అందరూ చదవదగింది.

ఈ పుస్తకాన్ని ఇక్కడ చదవవొచ్చు లేదా దిగుమతి చేసుకోవచ్చు.

డెమి 1’8 పరిమాణం లో, 150 పుటలు
ప్రథమ ముద్రణ: 2012
ధర: రూ.80/-
లభ్యమయ్యే ప్రదేశాలు:
1) గుమ్మా వీరన్న సెల్: 986 668 1927 e-mail: gveeranna1952@gmail.com
2) నవోదయ బుక్ హౌస్, ఆర్యసమాజ్ ఎదుటి వీథి, కాచిగూడా కూడలి వద్ద, హైదరాబాద్.
3) ఎడిటర్, హేతువాది, చీరాల- 523155

You Might Also Like

Leave a Reply