భాషాసేవకుని కథ

ఆత్మకథా? అంటే – రచయితా, భార్య, సంతానం, తల్లిదండ్రులూ, ఆయన చేసిన ఘనకార్యాలు, వాళ్ళ ఊరు, ఆయన చుట్టూ ఉన్న వాతావరణం, ఇంకా ఆయన అభిరుచులూ, అలవాట్లూ…….

ఊహూ. ఈ పుస్తకంలో తిరుమల రామచంద్ర గారి భార్య ప్రస్తావన ఎక్కడో ఒక్కచోట మాత్రమే వస్తుంది. అది కూడా పేరు మాత్రమే. ఆయన సంతానం గురించిన వివరాలే లేవు. తండ్రి గారి గురించి వినిపిస్తుంది కానీ అందులో ఆత్మౌద్ధత్యం లేదు. తల్లి గారి గురించీ అంతే. ఇక ఆయన అభిరుచులు చాలినన్ని. అయితే వాటి గురించి గొప్పల్లేవు. మరి “ఆత్మ” కథ కాని ఈ “ఆత్మ” కథలోని “ఆత్మ” ఏమిటి?

To see is to love – అని ఒకానొక తాత్వికుడంటాడు. ఆ వాక్యాన్ని లౌకిక ప్రపంచానికి అన్వయిస్తే దానికి నిలువెత్తు ప్రమాణం – తిరుమల రామచంద్ర గారి హంపీ నుంచి హరప్పా దాక అన్న పుస్తకం.

మనుషులందరూ ప్రపంచాన్ని చూస్తారు. సృష్టిలో ప్రతి ఒక్కరికీ విలక్షణమైన, విభిన్నమైన అనుభవాలు ఉంటాయి. అయితే కొందరు మాత్రమే చూచిన వస్తువు వెనుకనున్న భావగతమైన సంస్కారాన్ని పూర్తిగా గ్రహిస్తారు. ఆ గ్రహించిన విషయాన్ని నిసర్గమనోహరమైన కావ్యంలా మలుస్తారు. ఆ చూడడం కనులతో కాక మనసుతో అయినప్పుడే అది సాధ్యం. ఆ అర్హత కలిగిన వ్యక్తి మనస్వి.

తిరుమల రామచంద్ర గారికి మాతామహుల ఊరు రాగంపల్లె (రాఘవంపల్లె). ఆయనకు ఆ పల్లె మాత్రమే కనబడలేదు. దాని వెనుక కథ, కడుపాత్రంతో అలసిపోయి వచ్చిన తాడిమర్రి రాజుకు పచ్చడి మెతుకులతో అన్నం పెట్టిన రాఘవమ్మ అవ్వా, ఆమెకు సభకు పిలిపించి గౌరవించి ఆమెకు ఆ పల్లెను రాసిచ్చిన రాజు కనిపించారు. ఈ ఉదంతం పుస్తకంలో మొదట్లో వస్తుంది. ఇది ఒక కథ కాదు. సంస్కారపు కుప్ప. ఒక సాధారణమైన పల్లెటూరి ముసలవ్వకూ, సంస్థానాధిపతి అయిన రాజుకు ఉన్న సంస్కారానికి, ఔన్నత్యానికి నిలువెత్తు ప్రమాణం. ఆ రాజు, ఆ అవ్వా ఎవరు? మన, మన, మన (అవును మూడు సార్లు కాదు, ముప్పై సార్లు చెప్పాలి వీలైతే) పూర్వీకుల మహోన్నత మూర్తిమత్వం ఇది.

మరి శ్రీకృష్ణరాయలికి గొడుగు పట్టిన గొడుగుపాలుడో? రాయల వారు ఒక్క కోరిక కోరమంటే ఏకంగా నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టమంటాడట ఒక బోయవాడు! అతని మాట విని రాయలు సరేననడమేమిటి? ఎవరిది ఎక్కువ ధైర్యం? ఆ దొణ్ణేనాయకుడు ఏడీ? అదుగో – అతడి దొణ్ణె (బాణాకర్ర) మీద ఏర్పడిన డణాపురం వెనుక ఉన్నాడు. రామచంద్రయ్య గారి జీవితకథలో అమరుడై ఉన్నాడు.

అసలీ పుస్తకం గురించి ఏమని చెప్పాలి?  గోంగూర ఊరగాయను ఎదురుగా పెట్టి దాని గుణగణాలు వర్ణించుము? అని అడిగినట్టుగా?

హంపీ నుండి హరప్పా దాక – పుస్తక శైలి? సంస్కృతంలో దశకుమారచరితం అన్న వచనకావ్యం ఒకటి ఉంది. ఆ కావ్యం చదవటం మొదలెడితే చాలు. ఆ పైన కావ్యం తాలూకు పదలాలిత్యమే పాఠకుడిని చదివిస్తుంది. కాదు కాదు తనవెంట లాక్కునిపోతుంది. తిరుమల రామచంద్ర గారి వచనం కూడా అంతే. పాఠకుడు కాదు, పుస్తకమే చదివిస్తుంది.

ఈ పుస్తకం చదువుతుంటే – అసలీ వ్యక్తి ఏమిటి? అన్న ఆశ్చర్యం కలుగుతుంది. సంస్కృత కళాశాలలో చదువుకునే సాంప్రదాయ బ్రాహ్మణుడు తిరుపతి గోవిందరాజుల స్వామి వారి గోపురం మీద స్వాతంత్రపోరాటంలో భాగంగా జెండా ఎగురవేయటమేమిటి? తెల్లవాళ్ళ ప్రభుత్వానికి విరుద్ధంగా కరపత్రాలు పంచడమేమిటి? భగత్ సింగ్ అనుయాయులతో జైలుశిక్ష అనుభవించటమేమిటి? లాహోర్ లో హవల్దార్ వృత్తీ, వంటవాడుగా, పత్రికా రచయితగా, పత్రికా సంపాదకుడిగా, లేఖకుడిగా ఇన్ని అనుభవాలు చూడటమేమిటి?

విస్మయపరిచే అనుభవాలు రామచంద్రయ్య గారివి.

ప్రతి భాషకూ, భాషాసేవకులు, వైతాళికులు ఉంటారు.  వారికి జాతి ఋణపడి ఉంటుంది, ఉండాలి. అయితే కాలోహ్యయం నిరవధిః, విపులా చ పృథ్వీ అన్నట్టుగా, కాలం అనే ఒక బలమైన ప్రవాహంలో జాతి కొందరిని మర్చిపోవడం జరుగుతుంది. ఆ మర్చిపోవడం నిదానంగా క్రమంగా జరిగితే తప్పు లేదు కానీ, ఒక్క తరంలోనో, రెండు తరాలలోనో జరిగిందంటే ఎక్కడో, ఏదో తప్పు ఉన్నట్టే లెక్క. ఇప్పటి తరానికి మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకరశాస్త్రి, కోలాచలం వెంకటరావు గారు, గన్నవరపు సుబ్బరామయ్య గారు, వాసుదాసు గారు, కాశీనాథుని నాగేశ్వరరావు గారు,యెల్లాప్రగడ సుబ్బారావు గారు ఇలా ఎందరెందరో? వీరందరి గురించి ఎలా తెలుస్తుంది? వారందరితో కలిసి మెలగిన వ్యక్తుల కథలను చదివితే తెలుస్తుంది. హంపీ నుంచి హరప్పా దాక అన్న పుస్తకం చదివితే తెలుస్తుంది.

తిరుమల రామచంద్రయ్య గారు గొప్ప కవి, గొప్ప పరిశోధకుడు, శాస్త్రజ్ఞుడూ, రచయిత, సాహిత్య కారుడు ఏదీ కాకపోవచ్చు. ఆయన ఒక మనస్వి. ఈయన జీవితమే ఒక కావ్యం. ఈ కావ్యారంభం – అంటే తిరుమల రామచంద్రగారి జననం – సరిగ్గా వందేళ్ళ ముందు జరిగింది. ఈ రోజు ఆయన శతజయంతి.

*******************************************************

దండి మహాకవి ఒకానొకరోజు మామల్లపురం దగ్గర సముద్రం ఒడ్డున నుంచుని ఉన్నాడు. అప్పుడక్కడికి ఒక తామరపువ్వు అలలపై తేలుతూ వడ్డుకు వచ్చి పక్కన ఉన్న ఈశ్వరుని పాదాల చెంతకు చేరి ఒక విద్యాధరుడిగా మారి, తన లోకానికి రివ్వున ఎగసిపోయాడు. దండి ఆశ్చర్యపడి, ఆ ఉదంతం తెలియాలని ఆపై పదిహేను రోజులు నిష్టగా ఈశ్వరుని ధ్యానిస్తే, ఈశ్వరుడు కలలో విద్యాధరుని కథ చెప్పాడు. ఆ కథను దండి అవంతీసుందరి కథ అన్న పేరుతో కావ్యంగా మలచాడు.

బహుశా దండియే తిరిగి ఈ జన్మలో రామచంద్రయ్యగా పుట్టాడేమో? ఆ విద్యాధరుడు (విద్యను ధరించిన వాడు) వేటూరి ప్రభాకరశాస్త్రిపాదులై మామల్లపురానికి దగ్గర ఉన్నపట్టణంలో ఉన్నాడేమో? ఆ పురాకృత సంస్కారం చేతనే శాస్త్రిపాదుల అంతేవాసిత్వం రామచంద్రయ్యకు దొరికిందేమో?

దండి కూడా తన రాజు రాజ్యభ్రష్టుడైనప్పుడు పల్లెపట్టులవెంటా, జనపదాల వెంటా, ఊళ్ళోళ్ళూ తిరిగాడు. అందులో భాగంగానే ఆయన అరబ్బీ వర్తకుణ్ణి, అఘోరాను, మోసగత్తెలను, బోయవాళ్ళు గా మారిన బ్రాహ్మణులను, కోడిపందేలనూ, కుండలో అన్నం వండటాన్ని, వేశ్యలను, వేశ్యమాతలను, సన్యాసులను, కపటులనూ ఒక్క మాటేమిటి? ప్రపంచాన్ని చూసి ఉంటాడు. తిరుమల రామచంద్ర గారూ ఆ పనే చేశారు. ఆయన గొప్పవారిలో గొప్పతనాన్ని, సామాన్యులలో కూడా అసామాన్యమైన సంస్కారాన్ని చూచారు. ఆ సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం – హంపీ నుంచి హరప్పా దాక అన్న ఈ ఆత్మకథ.

“ఆత్మ” కథ కాని ఈ ఆత్మకథలోని “ఆత్మ” – మానవుని హృదయ సంస్కారమే.

You Might Also Like

11 Comments

  1. mythili

    చక్కటి సమీక్ష .దండి మహాకవితో ఈ మహానుభావుడిని పోల్చటం గొప్పగా ఉంది.

    తిరుమల రామచంద్ర గారు అచ్చంగా అమృతమూర్తి అనిపిస్తుంది.దేని పైనా ఫిర్యాదు లేకపోవటం ఎంత అరుదయిన మంచితనం! ఇట్లాంటి తూకాన్ని మళ్లీ దువ్వూరి వెంకటరమణశాస్త్రి గారి ఆత్మకథ లో చూస్తాము.తిరుమల రామచంద్ర గారు మంచి అనువాదకులు కూడా.శివరామ కారంత్ గారి నవలని ‘ మరల సేద్యానికి ‘ అని అనువదించారు.అది అద్భుతమైన పుస్తకం .

  2. పద్మవల్లి

    చక్కని పరిచయానికి ధన్యవాదాలు. నాకు ఈ పుస్తకం, దాశరధి రంగాచార్యగారి ‘నా జీవన యానంలో’, శ్రీపాద గారి ‘అనుభవాలూ జ్ఞాపకాలూ’ చదవాలని దశాబ్దం పైగా కోరిక. ఎన్ని సార్లు ప్రయత్నించినా దొరకనే లేదు. మూడోది మాత్రం ఈమధ్యనే చదవగలిగాను. AVKF వాళ్ళ దగ్గర ఉందన్నారు కదా ప్రయత్నిస్తాను. Thanks Again.

    1. డా. మూర్తి రేమిళ్ళ

      పద్మావల్లి గారు,

      శ్రీపాద వారి అనుభవాలు జ్జ్ఞాపకాలు విశాలాంధ్ర లో వున్నాయి. నిన్న కూడా HYD కూకట్పల్లి షాప్లో చూసేను. ఏ గ్రేట్ బుక్.

  3. రవి

    డాక్టర్ మూర్తి గారు,

    ఈ పుస్తకం విశాలాంధ్ర, నవోదయాలలో దొరకవచ్చు. లేదా, ఈ క్రింది లంకె చూడండి.

    http://avkf.org/AVKF/publicat/show_details.php?book=11469&PHPSESSID=e2b987f1cde632fc22e8f6c0f591a9ae

    అజో విభో వారికి డబ్బు పంపితే పుస్తకం మీకు అందజేయగలరు.

    రవి.

    1. Dr.Murthy

      dhanya vadalu sir.

  4. A.Surya Prakash

    నేను మరో 5 నెలలదాకా అమెరికాలోని Minneapolis లో మా చిన్నబ్బాయి నయన్ వద్ద ఉంటాను దీపావళి తర్వాత secunderabad లో ఉంటాను !నా వద్ద ఉన్నది మొదటిముద్రణ! ఆ తర్వాత మూడు నాలుగు ముద్రణలు వచ్చాయి,ఏ పెద్ద పుస్తక విక్రేతవద్ద అయినా ఆ మహా ఆత్మకథ దొరుకుతుందండి!

  5. rahimanuddin

    ఈ రోజు ఆయన శతజయంతి???
    ఏ ఒక్క సాహిత్య సంస్థ అయినా ఈ విషయమై ఏమయినా కార్యక్రమం చెసినదా?

    1. రవి

      అనంతపురంలో స్పందన అన్న సాంస్కృతిక సంస్థ వారు ఏదో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భాగ్యనగరం విషయం తెలీదు.

  6. Dr.Rayadurgam Vijayalakshmi

    ఎంత త్రవ్వినా తరగని ఖని తిరుమల రామచంద్రగారి జీవితం. వారి పుస్తకాలన్నీ వారి మౌలిక పరిశోధనాత్మకతకు అద్దం పట్టే రచనలు, హంపీ నుంచి హరప్పదాకా తో కలిపి. వారి జీవిత చరిత్ర కన్నా ఆనాటి సాంఘిక చరిత్రను, భాషా చరిత్రను……….. ఇంకా ఇటువంటి మనం చూడలేని, మనకు తెలియని ఎన్నో అంశాలగురించి తెలుసుకో గలిగామన్న అనుభూతిని, ఆనందాన్నీ కలిగిస్తుందీ పుస్తకం. రవిగారి పరిచయం బావుంది.
    రాయదుర్గం విజయలక్ష్మి

  7. A.Surya Prakash

    దేశం పట్టుకొని తిరగటం వల్ల గొప్ప ప్రపంచ జ్నానం కలుగుతుంది!భాషా ప్రేమికుడు తిరుమల రామచంద్ర గారు జీవన సమరంలో ఎలా ఢక్కామొక్కీలు తిని నెగ్గుకొచ్చారో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదివితీరాలి!వారి పిపాస జీజ్నాస తెలుసుకొని చదివినవారు భాషాభిమానులుగా మారితీరవలసినదే!నేను దీని మొదటిముద్రణ చదివాను.పుస్తకాల అంగడిదాకా వెళ్లడానికి నాకు వీలుకాక సోదరి కల్పనా రెంటాలను కోరితే ఆ పుస్తకం తెచ్చిపెట్టారు,ఏక బిగిన రాత్రంతా చదివాను!ఆహా ఏం పుస్తకమ్!!

    1. డా. మూర్తి రేమిళ్ళ

      మనలో చాలా మంది రాక రకాల కారణాలతో ఊళ్ళు తిరుగాము, చాలా చోట్ల వాసం కూడా చేస్తాము కానీ విషయ పరిజ్నానము మీద మమకారం, ఆసక్తి వాత్కి తోడు పెట్టుబడీ వుంటే కానీ ఇలాంటి సరస్వతీ కటాక్షం కలుగదు.

      అలాంటి ఈ పుస్తకం గురించి 2 నెలలుగా వెతుకుతున్నాను కానీ ఎక్కడా ( shopls lo, online ) దొరకలేదు.
      @సూర్య ప్రకాష్ గారు ఎక్కడ దొరికిందో చెప్పగలరు . మీరు HYDERABAD లో వుంటే షేర్ చెయ్యగలరా ? safe గా రిటర్న్ చెయ్యడానికి ?

Leave a Reply