కథ కంచికి…

..మనం ఇంటికి.

మడతకుర్చీలో తాతయ్యా, పెరట్లో బాదం చెట్టు గట్టుకింద అమ్మమ్మా, మనవలకు జానపద కథ చెబితే ఆ కథ  ఇందాకటి  వాక్యంలా అందంగా, అలవోకగా, సాంత్వనగా ఉంటుంది. కథ చివర్లో బూచి మీద మంచి గెలుస్తుంది. ఆ  ముగింపు – కథను కంచికి పంపేసి బుడతణ్ణి ఇంటికి తీసుకొచ్చి నిదురపుచ్చుతుంది. బిడ్డ మనసులో ఆనందం – నిద్రలో చిరునవ్వై, కథ చెప్పిన తాతయ్య గుబురు మీసాలమాటున ఒదిగిపోతుంది.

ఇంతకూ బుర్రమీసాల తాతయ్యకూ, ముగ్గుబట్ట తల మామ్మకూ కంచి అంటే ఎందుకంత ఇష్టం? కథలన్నీ కంచికే ఎందుకెళతాయి? ఏ ఉజ్జయినికో, పాటలీపుత్రానికో వెళ్ళచ్చుగా? ఎవడైనా పిల్లవాడు ఇలాంటి కొంటె ప్రశ్నడిగితే వాడికి ఈ సామెత కు కారణమైన ఓ కావ్యం గురించీ, ఆ కావ్యం వ్రాసిన ఓ అద్భుతమైన కవి గురించీ చెప్పాలి.

అదుగో – ఆ సంస్కృత గద్య కావ్యమే దండి విరచిత దశకుమార చరితమ్.

*******************************************************************************************
కొన్ని ఉపఖ్యానాలు

1. అనగనగా ఓ దొంగలగుంపు. ఆ గుంపులో మాతంగుడొకడు. ఓ సారి ఆ దొంగలగుంపు ఓ బ్రాహ్మణ్ణి దోచుకోబోతే, మాతంగుడు అడ్డుపడ్డాడు. దొంగల గుంపు ఇది సహించలేకపోయింది. మాతంగుణ్ణి చంపేసింది. చనిపోయిన మాతంగుడు యమలోకమెళ్ళాడు. అక్కడ పెద్దాయన లెక్కలవీ చూసి, “ఈతడికి పూర్ణాయుష్షు. తిరిగి భూలోకం పంపమ”ని చిత్రగుప్తుణ్ణి ఆదేశించారు.పంపే ముందు ఓ మారు యమలోకాన్ని చూపించి మరీ పంపారు. ఇలా తిరిగి భూమికి వచ్చిపడ్డ మాతంగుడు, తదనంతరం ఓ రాజకుమారుడి సాయంతో ఓ బిలం ద్వారా పాతాళలోకం ప్రవేశించి, అక్కడో చక్కని చుక్కను పెళ్ళాడి, పాతాళరాజ్యాన్ని ఏలాడు!యమలోకం చూసి ఉండటం వల్ల దర్మాన్ని తప్పక పాలించేడు!

2. అనగనగా ఓ వేశ్య. పేరు కామమంజరి. ఈవిడకు అందం, ధనం తో బాటూ పొగరూ ఎక్కువే. ఓ సారి తన తోటి వేశ్యతో మాటామాటా పెంచుకుని, తన అందానికి ఏలికలు కూడా దాసోహం కావాల్సిందేనంది. నీకు చేతనయితే నగరం బయట ఆశ్రమం కట్టుకుని జీవిస్తున్న మరీచి మునిని ఆకర్షించమని సవాలు విసిరింది రెండవ ఆవిడ. కామమంజరి ఆ సవాలును స్వీకరించింది. ముని చుట్టూ నెమ్మదిగా ఉచ్చు బిగించింది. ముగ్గులోకి లాగింది. ఆ అమాయక ముని ఈవిడ మాయమాటలకు లోబడి పోయేడు. దాసోహమన్నాడు.

పందెం గెలవగానే ఆ వేశ్య మునిని ఛీత్కరించింది. ముని భ్రష్టుడయాడు. అప్పుడా మునిని అపహారవర్మ అనే ఓ యువకుడు కలుసుకున్నాడు.జరిగింది తెలుసుకున్నాడు. వంచనకు వంచనతోనే బుద్ధి చెప్పాడు.ఆ వేశ్యను బికారిగా చేశాడు.వేశ్యాలంపటుడైన ఆ దేశపు రాజునూ దింపి, తనే రాజయ్యాడు. ప్రజలను సుఖంగా పాలించాడు.

3.అనగనగా ఓ రాకుమారుడు. ఈతడి తండ్రి ఒకానొక యుద్ధంలో ఓడిపోయి అడవులు పట్టిపోవడంతో, పాపం ఈ రాకుమారుడికి రాజ్యం లేదు. ఊరూరా తిరుగుతూ అవంతీ రాజ్యానికి వచ్చాడు. అక్కడ అవంతి సుందరిని చూశాడు. రాకుమారీ ఈతణ్ణి చూసింది. చూపులు కలిశాయి. మోహంలో పడ్డారిద్దరు. వీరిద్దరూ కలవాలి. రాజ్యం లేని రాకుమారుడికి కుమార్తెనివ్వడానికి రాజు ఒప్పడుకదా! ఎలా! అప్పుడా వూరికి ఓ గారడీవాడొకడొచ్చాడు. అతడు మన రాకుమారుడికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ గారడీవాడు రాజును ఆశ్రయించి తన విద్యలు ప్రదర్శించి రాజును మంత్రముగ్ధుణ్ణి చేశాడు. చివరి అంశంగా, అచ్చం రాజు కుమార్తెలా ఓ అమ్మాయిని సృష్టించి, అమ్మాయికి రాజు కళ్ళముందే వివాహం చేస్తానన్నాడు. రాజు సరేనన్నాడు. అదే అదనుగా నిజమైన రాకుమారికి, రాజ్యం లేని రాకుమారుడికి వివాహం జరిపించేశాడు. ఆ తర్వాత రకరకాల మలుపులు తిరిగి చివరికి సుఖాంతమయింది.

4. రత్నోద్భవుడనే ఓ యువకుడు. చిన్నతనంలోనే వ్యాపారరీత్యా దేశాంతరం వెళ్ళిపోయేడు. ఇబ్బడిముబ్బడిగా ధనం సంపాదించేడు. సువర్ణద్వీపానికి చెందిన సువృత్త అనే అమ్మాయిని పెళ్ళాడేడు. ఆమె గర్భం దాల్చింది. ఆమెను, అంతులేని ధనాన్ని వెంటబెట్టుకుని, తన మాతృదేశానికి బయలుదేరాడాయన. విధివక్రించింది. నావ మునిగి పోయి, భార్యాభర్తలిద్దరు విడివిడిగా తీరానికి కొట్టుకు వచ్చేరు. అక్కడ ఓ దాది సహాయంతో ఆమె ఓ బాబును ప్రసవించింది. అయితే దురదృష్టవశాత్తూ, ఆ శిశువును ఓ యేనుగు తీసుకెళ్ళింది. ఆ బాబు అక్కడినుంచి రక్షింపబడి, రత్నోద్భవుడి మిత్రుడికి దొరుకుతాడు.ఆతడు శిశువుకు పుష్పోద్భవుడని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుతాడు. పుష్పోద్భవుడు పెరిగిపెద్దవాడై, సాహసయాత్రలకెళతాడు. అలా ఓ అడవిలో ఓ చెట్టుక్రింద సేద దీరుతుండగా, తనముందు ఉండచుట్టుకుని, ఆకాశం నుంచి పడబోతున్న ఓ వృద్ధశరీరాన్ని గమనించి, ఛప్పున పట్టుకుంటాడు. ఆ మనిషికి శీతలోపచారాలు చేసి, తన కథ తెలుసుకుంటాడు. అతడెవరో కాదు తన తండ్రి రత్నోద్బవుడే.

ఇంతలో ఓ స్త్రీ ఆర్తనాదం వినిపిస్తుంది. అది విని ఆ దాపున ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ స్త్రీని రక్షిస్తాడు. ఆమె పుష్పోద్బవుడి తల్లి. ఇలా తల్లితండ్రులను కలుసుకున్న పుష్పోద్భవుడి ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత మెల్లగా ధనం సమకూర్చుకుని, నగరంలో బాలచంద్రిక అనే ఓ యువతిని వివాహమాడి సుఖిస్తాడు.

– ఇలాంటి అద్భుతమైన కథోపకథలతో, అడుగడుగునా అబ్బురపరుస్తూ సాగే కథల సమాహారం దండి దశకుమారచరితము. ఈ కావ్యం క్లుప్తంగా, పదిమంది రాకుమారుల సాహస యాత్రల కథాకథనం.

క్లుప్తంగా కథ

పాటలీపుత్రానికి రాజు రాజహంసుడు. ఈయన మాళవదేశ రాజు మానసారునితో యుద్ధం చేసి గెలుస్తాడు. గెలిచినా కూడా మానసారుని రాజ్యాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. అవమానపడిన మానసారుడు ఈశ్వరుణ్ణి అర్చించి, ఓ ఆయుధాన్ని పొంది, రాజహంసునిపై దండెత్తి, ఆతణ్ణి జయిస్తాడు. యుద్ధంలో ఓడిపోయిన రాజహంసుడు, ఆతని భార్య మంత్రులు కొందరు ఓ అడవిని చేరుకుంటారు. అక్కడ రాణి యశోమతి, రాజవాహనుడనే పుత్రుణ్ణి ప్రసవిస్తుంది. మంత్రుల కుమారులు కూడా చిత్రవిచిత్రంగా ఎక్కడెక్కడో పుట్టి, ఈ అడవిని చేరుకుని ఒకే దగ్గర చేరుతారు. వీరు దశకుమారులు. రాజవాహనుడు,సోమదత్తుడు, పుష్పోద్భవుడు,ఉపహారవర్మ, అపహారవర్మ, ప్రమతి, మిత్రగుప్తుడు, మంత్రగుప్తుడు, విశ్రుతుడు, అర్థపాలుడు వీరి నామధేయాలు. వీరు వామదేవుడనే ముని వద్ద అన్ని విద్యలు నేర్చి, సాహస యాత్రలు చేస్తారు. తిరిగి ఒకరొకరుగా కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు వారి వారి అనుభవాలను కథలుగా చెబుతారు. చివరన అందరూ కలిసి మాళవ రాజ్యాధినేత మానసారుని జయించి రాజ్యం కైవశం చేసుకుంటారు.

తెర వెనుక..

కావ్యకర్త దండి – స్వయానా కిరాతార్జునీయ కావ్యకర్త భారవి మహాకవికి మునిమనవడని చెప్పుకున్నాడు. ఏడవ శతాబ్దం ఈయన కాలం. కంచినేలిన పుష్కరమిత్రుని ఆస్థానకవి ఈయన. తన రాజ్యం శత్రువుల వశమవడంతో, కొన్నాళ్ళపాటు దండి మహాకవి అడవులు, జనపదాల పట్టున తిరిగేడుట. కంచి అంధ్రకు దాటునే ఉంది కాబట్టి, ఈ కవికి ఆంధ్రులనూ, వారి జీవన విధానాన్ని తప్పక చూసి ఉంటాడు. అందుకనేమో ఆంధ్రుల సాంఘిక జీవనంలోభాగమైన కోడి పందాల గురించి చెబుతాడు ఓ చోట. అలానే ఈ సాహస యాత్రలలో కిరాతులై కులభ్రష్టులైన బ్రాహ్మణులను, గారడీ వాళ్ళనూ, కుటిలనీతి గల వేశ్యలను, దొంగలు, ధూర్తులు, వర్తకులు, అఘోరా, అరబ్బీ వర్తకుడు, ఆశ్రమవాటికల మాటున తాపసులు, ఇలా అప్పటి సమాజానికి చెందిన ఎందర్నో కవి పరిచయం చేస్తాడు. అనేక సామాజిక ఆచారాలను విస్తృతపరుస్తాడు. అడుగడుగునా అబ్బురపరుస్తాడు.ఈ కథలలో విశేషమేమంటే, నాయకుడు కనబడడు. ధీరోదాత్తతా అదీ అన్న శషభిషల్లేవు.ఎంచక్కా కథ సాగిపోతుంటుంది. పాఠకుడు పరవశిస్తూ ఉంటాడు!

*******************************************************************************************

కొన్ని అభాణకాలు..

కవిర్దండీ కవిర్దండీ భవభూతిస్తు పణ్డితః |

త్వమేవాహం త్వమేవాహం న సంశయః ||

సాక్షాత్తూ సరస్వతీదేవి దండిని నీవే కవివి అని పలికిందట.

జాతే జగతి వాల్మీకౌకవిరిత్యభిధా 2 భవత్ |

కవీ ఇతి తతో వ్యాసే కవయస్త్వయి దండిని ||

లోకాన వాల్మీకి పుట్టగానే “కవి” అన్నమాట పుట్టిందట. “కవీ” అన్న ద్వివచనం వ్యాసుల వారు పుట్టిన తర్వాత పుట్టింది. ఆ తర్వాత ఎన్నదగిన కవి దండి మాత్రమేనట.

దండినః పదలాలిత్యమ్..

దండినః పదలాలిత్యం భారవేరర్థ గౌరవమ్ |
ఉపమా కాళిదాసస్య  మాఘే సన్తి త్రయోగుణాః ||

సంస్కృత లౌకిక సాహిత్యంలో గద్యం రెండు రకాలు. పశుపక్ష్యాదులు పాత్రధారులుగా నీతిని బోధించేవి మొదటి రకమైతే, (పఙ్చతంత్రం, హితోపదేశం వగైరా) రసోపవిష్టమై, మానసికోల్లాసాన్ని కలిగించే ఉత్కృష్ట రచనలు రెండవరకం.  రూపకసాహిత్యం పద్యగద్యసహితమైనా అది ఎక్కువగా ప్రాకృతభాషాధారితమైనది, భాషణాసహితమైనదీను. కథాకథిత వర్ణనావృత గద్య – కాదంబరి, దశకుమారచరితమ్, కథాసరిత్సాగరం, బృహత్కథామంజరి,భేతాళపంచవిశతి, సింహాసనద్వాత్రింశిక వంటి కావ్యాలలో లభ్యమవుతున్నది.

బాణభట్టుని కాదంబరి ఓజోగుణప్రధానమై, ప్రౌఢమై, సమాసభూయిష్టమైతే, దండి దశకుమారచరిత లలితము, సుందరమూ,సరళమూ. కథలెంత హాయిగొలుపుతాయో, శైలి అంత కమ్మగా ఉంటుంది. సంస్కృత అధ్యయనాభిలాషులకు కూడా ఇదొక పెన్నిధి.

ఇక అలంకారాలకు, జాతీయాలకు, వర్ణనలకు ఈ కావ్యం ఓ తేనెపట్టు. సప్తమాశ్వాసం, మంత్రగుప్తుని కథ మొత్తం నిరోష్ట్యం. అందులోనూ ఔచిత్యమేమిటంటే – మంత్రగుప్తుడు తన సాహసయాత్రలో భాగంగా ఓ సుందరిని పొందాడు. ఆ సుందరి మంత్రగుప్తుని పెదవి కొరికింది. ఆ తీయటి బాధతో ఆతడు కథచెప్పడం మొదలెట్టాడు. అలా కథ నిరోష్ట్యమయింది.

కథా? ఆఖ్యాయికా?

సంస్కృత గద్యాన్ని స్థూలంగా కథ, ఆఖ్యాయిక అని రెండు రూపాలుగా విభజించారు లాక్షణికులు. ఆఖ్యాయిక అంటే స్వయంగా చెప్పుకునే కథ. (Autobiography). కథ అంటే కవి పాఠకునికి చెప్పే ఆఖ్యానం. దండి మహాకవి స్వయంగా ఓ గొప్ప లాక్షణికుడు. ఈయన కావ్యాదర్శం అనే ఓ లక్షణగ్రంథాన్ని విరచించాడు. కవి ఈ గద్యభేదాలను దశకుమారచరిత కావ్యానికి వర్తింపజేయలేదు. ఈ కావ్యంలో దశకుమారులు ఎవరి కథ వారే చెప్పుకున్నా కూడా ఇది ఆఖ్యాయిక కాదని దండి స్పష్టీకరణ.

కృతజ్ఞతలు

దండి దశకుమారచరితకు తెనుగులో 12 వ శతాబ్దంలో మూలఘటిక కేతన పద్యానువాదం చేసి మహత్గ్రంథం గా వెలయించారు. ఈ కావ్యాన్ని తిక్కన మహాకవికి అంకితం చేశారు కేతన. సంస్కృత కావ్యాన్ని ఆధారం చేసుకున్నా, ఇందులో తెలుగు సంప్రదాయాలను, ఆచారాలను, ఆనాటి సమాజాన్ని యథోచితంగా కవి వర్ణించాడు.  అయితే సంస్కృత కావ్యానికి వచ్చినంత పేరుప్రతిష్టలు తెనుఁగుసేతకు ఎంచేతో వచ్చినట్లు లేదు.

దశకుమారచరితం – పూర్వపీఠిక, దశకుమారచరిత (ముఖ్యభాగం), ఉత్తరపీఠిక అని మూడు భాగాలు. ఇందులో పూర్వపీఠికకు పాటిబండ్ల మాధవరావు గారు హృద్యమైన టీకాతాత్పర్యసహిత అనువాదం కూర్చారు. సంగమేశం గారు మొత్తం కావ్యాన్ని సరళమైన తెనుఁగు కథగా చెప్పారు. ఇవి రెండూ, కేతన తెనుగుకావ్యం DLI లో దొరుకుతున్నవి. ఇంకొన్ని ప్రచురణలు కూడా జాలంలో లభ్యం. విద్వాన్ విశ్వం గారు కూడా పూర్తికథను సరళ గద్యలో తెనిగించారు. ఆంగ్లంలో what ten young men did అన్న పేరుతో అనువదింపబడినది ఈ పుస్తకం. మోతిలాల్ బనార్సిదాసు వారి ఎమ్.ఆర్. కాలే – దశకుమారచరితమ్ పరిష్కరణ లభిస్తున్నది.ఖరీదు 395/-.

ఈ మధ్య కాలంలో వచ్చిన అనేక జానపద కథావస్తువుల మూలాలు దండి దశకుమారచరితంలో ఉన్నవి. యమలోకానికి వెళ్ళిన మనిషి తిరిగిరావడం, వేశ్య ఉత్తముణ్ణి వంచించడం, రాకుమారిని మాంత్రికుడు యెత్తుకువెళ్ళడం ఇటువంటి కథల ఛాయలు మరెన్నో దశకుమారచరితం లో కనబడుతవి. ఇది కథలకు
కాణాచి. కంచిలో రూపుదిద్దుకుని అచ్చమైన భారతీయ కథాసాహిత్యానికి ఆటపట్టయిన పెన్నిధి. మన సాంస్కృతిక వారసత్వం.

*******************************************************************************************

అవును. తాతయ్య, మామ్మ చెప్పే కథలన్ని కంచికే చేరుతాయి.

కథ కంచికి, మనం ఇంటికి. సరేనా?

You Might Also Like

11 Comments

  1. సుదర్శన్

    దండినః పదలాలిత్యం భారవేరర్థ గౌరవమ్ |
    ఉపమా కాళిదాసస్య మాఘే సన్తి త్రయోగుణాః
    ఈ శ్లోకం గురిన్చి నేనెప్పుడో చిన్నప్పుడు విన్న తమాషా కథ- భోజుడు వేటకి వెళ్ళినప్పుడల్లా ఈ నలుగురినీ వెంట తీసుకుపోయేవాడట. రాజుగారు వేటలో ఉండగా ఏమీ తోచక కవులు సరదాగా అప్పుడప్పుడూ వంట చేసేవారట. దండి వండిన ఉప్మా బాగా మెత్తగా లలితంగా తయారైందట. మరుసటి రోజు భారవి వండిన ఉప్మా సగం సగమే ఉడికిందట (అర్థ గౌరవమ్). మూడవ రోజు రాజు గారు కాళిదాసు వండిన ఉప్మా మెచ్చుకుంటూ “ఉపమా కాళిదాసస్య” (కాళిదాసు వండిన ఉప్మాయే ఉప్మా) అన్నాడట. నాలుగవ రోజు మాఘుడు చేసిన ఉప్మాలో పై మూడు గుణాలూ కనిపించాయట రాజు గారికి !

  2. సుదర్శన్

    మన ప్రాచీన తెలుగు కవుల గురించే అస్సలు తెలియని ఈ తరానికి సంస్కృత కవుల గురించీ వారి కావ్యాల గురింఛీ తెలియజెప్పడానికి పూనుకున్న మీ ప్రయత్నం శ్లాఘనీయం. కొనసాగించండి.

  3. భాషాసేవకుని కథ | పుస్తకం

    […] దాక – పుస్తక శైలి? సంస్కృతంలో దశకుమారచరితం అన్న వచనకావ్యం ఒకటి ఉంది. ఆ కావ్యం […]

  4. రవి

    హెచ్చార్కె గారు, మీ కవితల్లాగే ఆహ్లాదంగా వ్యాఖ్య వ్రాశారు. పొగడ్త కాబట్టి మరింత తీపి. :-). ఓ చిన్న విషయం చెప్పాలనిపిస్తున్నది. మృచ్ఛకటికం వ్యాసంలా ఈ వ్యాసం విపులంగా వ్రాయాలని అనుకున్నాను. మృచ్ఛకటికంలో చోరుడికి, ఈ కావ్యంలో చోరుడికి కొంత సామ్యం ఉంది. అలానే కావ్యంలోనూ. అవన్నీ ముచ్చటిస్తూ రాద్దామనుకుని, అంత పట్టూ, ఓపిక రెండూ లేక ఇలా సంక్షిప్తంగా ముగించాను.

  5. హెచ్చార్కె

    రవి గారూ, మీరేం చేసినా ఇంత బాగా చేస్తారా? ఇంతకు ముందు కూడా చూశాను. చెప్పదలచుకున్నది, పాఠకుడికి రాగల సందేహాలు దృష్టిలో పెట్టుకని విపులంగా, అదే దమయంలో వ్యర్థాలు లేకుండా…! ‘కథ కంచికి’ మీద మొదట ఆసక్తి పుట్టించి, చిట్ట చివర చెప్పడం కూడా బాగుంది, ఒక మంచి కథ లాగే.

  6. Arnavam

    chala bagundi!

  7. Srinivas Vuruputuri

    “కవిర్దండీ కవిర్దండీ…” గురించి.

    పొత్తూరి వేంకటేశ్వర రావు గారి ‘వ్యాస ప్రభ’ లో నేను చదివిన కథ వేరు.

    Copy-paste from a RaccabaMDa post (posted by Sri J K Mohana Rao gAru)

    6) ఇప్పుడు ఒక చిన్న కథ. నాకు చిన్నప్పుడు మా
    అమ్మగారు వినిపించారు ఈ కథను-
    కాలిదాసు, భవభూతి, దండి ముగ్గురు ఒక చోట ఉన్నారట.
    అప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షమయినదట వారికి. ఆమె
    ఇలా చెప్పినదట-
    దండీ దండీ కవిర్దండీ
    భవభూతిస్య పండితః
    (కవులలో దండి గొప్పవాడు
    పండితులలో భవభూతి గొప్పవాడు)
    ఇది విన్న కాలిదాసుకు కోపం వచ్చిందట.
    సరస్వతిని ఇలా అడిగాడట-
    కోఁహం రండా
    (నేనెవరో)
    దానికి సరస్వతీదేవి ఇలా చెప్పిందట-
    నేనే నీవు!

  8. Srilalita

    బాగా వివరించారు. అభినందనలు.

  9. రవి

    మాలతి గారు, సౌమ్య గారు, ధన్యవాదాలండి.

  10. సౌమ్య

    Thanks for introducing!

  11. మాలతి

    చాలా మంచి వ్యాసం. అభినందనలు.
    – మాలతి

Leave a Reply