చందనపు బొమ్మ – అరుణ పప్పు

“చందనపు బొమ్మ” అరుణ పప్పు రాసిన కథల సంపుటి. ఇందులో గత ఐదారేళ్ళగా వివిధ పత్రికల్లో వెలువడిన కథలు మొత్తం పది ఉన్నాయి..

ముందుగా “ఎవరికి తెలియని కథలివిలే?” అనే కథలో, కొత్తగా పెళ్ళైన జంటల్లో లైంగిక సమస్యలను గురించి ఒక ఫీచర్ రాయాల్సిన మహిళా జర్నలిస్టు కథ. ఒక పక్క డెడ్‍లైన్ ముంచుకొచ్చేస్తూ, బాస్ చేస్తున్న హడావుడి మధ్య ఈవిడకున్న మొహమాటాలు అవీ వదిలి, రంగంలోకి దూకుతుంది. ఆ పై ఏం జరిగిందనేది తక్కిన కథ. ఒకే కథలో వైవాహిక జీవితంలో తలెత్తే సమస్యలతో సతమతమవుతున్న యువత గురించి, ఒక జర్నలిస్టు రోజువారీ ఉద్యోగంలోని సవాళ్ళ గురించి, శారీరక సంబంధాలతో పాటు మానసిక సంబంధాల పరిధిని గురించి ఈ కథ ఆలోచింపజేస్తుంది.

“ఏకాంతంలో చివరిదాకా” అనే కథ కొంచెం సంక్లిష్టమైనది. ఒక్కోసారి ఇద్దరి మధ్య గాఢానుబంధం ఏర్పడిపోతుంది. కానీ ఆ బంధం ఎంత గాఢంగా అల్లుకున్నా, ఒకరికొకరు అపరిచితులే అన్న స్పృహ కలిగించేటువంటి సందర్భాలూ వస్తాయి. ఒక పాత్రికేయురాలిగా ఒకానొక పేరొందిన రచయితతో ఏర్పడిన అనుబంధం ఆయన మృతితో ఏ తీరానికి చేరుకుందో హృద్యంగా చెప్పే కథ ఇది.

“వర్డ్ కాన్సర్” కథ ఇంతకు ముందు పొద్దు.నెట్ నేను చదివి ఉన్నాను. ఇందులో నరేటర్‍కు వర్డ్ కాన్సర్ అని తెలుస్తుంది, అంటే కారణాంతరాల వల్ల ఆ మనిషి ఒంట్లో కుప్పలకు కుప్పలు పదాలు పేరుకుపోతాయి. దానిపైన ruminationయే తక్కిన కథ.

“ఈ కానుకనివ్వలేను” అన్న కథలో అమెరికాలో స్థరపడ్డ ఓ మధ్యవయస్కుడు తన పరిసర ప్రాంతాల్లో ఏ తెలుగువాడు ఎలాంటి దుర్మరణం పాలైనా, ఆంధ్రదేశంలోని అతని కుటుంబీకులకు ఆ వార్తను తెలిపి, మృతదేహాలను వారికి పంపేందుకు సాయం చేస్తూ ఉంటాడు. మృతుల కుటుంబాలవారికి ఓ చేదు అనుభవంలో భాగంగా గుర్తుండిపోతాడు. అతగాడిని ఆ వ్యధ నుండి బయటకు లాగే ప్రయత్నం చేస్తుంది వాళ్ళావిడ. ఈ కథకు నరేటర్ ఆవిడే! మిడ్-లైఫ్ క్రైసిస్‍ను బాగా చూపించగలిగారు ఇందులో.

తర్వాతి కథ “24×7 క్రైమ్ – ఇప్పుడిదే సుప్రీమ్” అన్నది నాకు చాలా నచ్చిన కథ. ఇందులో ఓ ఇరవై నాలుగు గంటల క్రైం ఛానల్ ప్రోగ్రామ్ డిజైనింగ్ గురించి చర్చలు ఉంటాయి. లొగొ డిజైన్ నుండి గంట గంటకూ ఛానెళ్ళో రావాల్సిన ప్రోగ్రామ్స్ గురించి స్టాఫ్ తలో ఓ సలహా ఇస్తుంటారు. నవ్వు బాగా వచ్చినా, ఇందులోని నిజాలు మాత్రం నిట్టూర్చేలా చేస్తాయి.

పుస్తకానికి పెట్టిన పేరు కలిగిన కథ “చందనపు బొమ్మ”. పిల్లలు ఆడుకునే బొమ్మల్లో కూడా స్టేటస్ సింబుల్ వెతుక్కుంటే పసిపిల్లల మనసుల్లో ఎంత అలజడి కలగవచ్చో తెలియజెప్పే కథ.

“కరిగిపోయిన సైకత శిల్పం” – ఎన్నో ఏళ్లుగా పుస్తకాలను అమ్మిన ఓ కొట్టు యజమాని కథ. పుస్తకాలను అమ్ముతూ ఎందరో ఆత్మీయులను పొందిన ఆయన, కొట్టును మూసివేయాల్సి వచ్చినప్పుడు అనుభవించిన మానసిక క్షోభ, అనారోగ్యం గురించి అతని కస్టమర్-ఫ్రెండ్స్ లో ఒక లేడీ జర్నలిస్ట్ మనకు చెప్పుకొస్తుంది. ఈ కథను చదివేటప్పుడు “కదంబి” పుస్తకాల కొట్టుతో పాటు, బెంగుళూరు గత కొన్నేళ్ళుగా మూతపడిపోతున్న పాత పుస్తకాల షాపులు గుర్తొచ్చాయి.

“భ్రమణకాంక్ష” – కొందరు ఎంత తిరిగినా మొదలెట్టిన చోటుకే వస్తుంటారు. కొందరు కాలు కదపకపోయినా అంతా చుట్టేసి వస్తారనే ఆసక్తికరమైన అంశంతో నడిచే కథ ఇది.

“ఒక బంధం కావాలి” కూడా కొంచెం సంక్లిష్ట కథ. పిల్లల్లోని మానసిక వ్యాధులు, దానికి తల్లిదండ్రులు స్పందించే తీరు ఈ కథకు మూలం.

“లోపలి ఖాళీలు” అనే కథలో మన నిత్యం సతమతమయ్యే సమస్య “ఇంతున్నా ఇంకేదో వెలితి”ని గురించి చర్చించే కథ. వృత్తిపరంగా విజయాలను అందుకున్నా మానసికంగా కృంగిపోతున్నా ఒక మనిషి, తన సైకాలకిస్ట్ – ఫ్రెండ్ తో నడిపే సుధీర్ఘ సంభాషణ ఈ కథ.

పై కథల గురించి నా అభిప్రాయాలు:

నేను తెలుగు కథలు చదవటం మానేసి చాన్నాళ్ళు అవుతుంది. అందుకని అసలు ఎట్లాంటి కథలు వస్తున్నాయో, వాటి మధ్యలో ఈ కథలు ఎలా ఉన్నాయో అన్నవాటిపై నేను వ్యాఖ్యానించలేను. అయితే కథలను ఇష్టంగా చదువుకునే వ్యక్తిగా మాత్రం ఈ కథల్లో కొన్ని నచ్చినవి ఉన్నాయి, నచ్చనవీ ఉన్నాయి.

కీలక పాత్రలు జర్నలిజాన్ని వృత్తిగా చేపట్టినవారు కావటం వల్ల జర్నలిస్టులకుండే ఒత్తిళ్ళు, వాళ్ళకి ఏర్పడే పరిచయాలు తదితర విషయాల గురించి తెల్సుకునే వీలు కలిపిస్తాయి. ముఖ్యంగా మీడియాను ఆడిపోసుకోవటంలో బిజి అయిపోయే మనకు, కెమారాకు వెనకున్నవారు, పత్రికలకు రాసేవాళ్ళూ  అన్నీ తమ ఇష్టానుసారంగా చేయరని, వాళ్ళూ ఒక వెల్లువలో కొట్టుకుపోతున్నారని గ్రహింపు తెచ్చే కథలివి.  దాదాపుగా అన్ని కథలూ నగర, పట్టణ వాతావరణంలో నడిచేవే! ఓ కథలో, జూబ్లీహిల్స్ లో ప్రయాణాన్ని జీవితంలోని ఒడిదుడుకులతో పోల్చటం నచ్చింది నాకు. పైగా పాత్రలన్నీ టెక్నాలజిని వాడుకోవటంలోనూ, ఆ టెక్నాలజి వారధిగా ఏర్పడిన బంధాల గురించి ఆసక్తికరమైన కోణాలు కనిపించాయి.

అధిక శాతం కథలు first person narrationలో నడవటం వల్ల వరుసబెట్టి కథలు చదివేటప్పుడు ఒకే మనిషివి వేర్వేరు అనుభవాలా? అని అనిపించింది, అక్కడక్కడా! కొన్ని చోట్ల కథల్లో ఎంచుకున్న వాతావరణం, అలానే ఎందుకుందో అర్థం కాలేదు. ఉదా: “చందనపు బొమ్మ” కథలో వాళ్ళు సిటిలో ఉన్నా, ఊరవతల ఉన్నా కథాపరంగా ఎలా తేడా వచ్చేదో అర్థం కాలేదు. అలాగే, “కరిగిన సైకత శిల్పం”లో పాత్రికేయురాలు కరాచి బుక్ ఫెస్టివల్కు వెళ్తుంది. “కరాచి” అనగానే నేనేదో అయిపోతుందనుకున్నాను. ఆ తర్వాత జరిగే కథ కరాచిలో జరిగినా, హైదరాబాదులో జరిగినా ఒకటేననిపించింది నాకు.

ఒకట్రెండు కథలను వదిలేసి, మిగితావన్నీ ఓ సమస్యను ఎస్టాబ్లిష్ చేయటం, దాన్నింకా లోతుగా పరిశీలించే వీలు కల్పించటం, ఆ తర్వాత దానికో పరిష్కారం చూపటం అన్నట్టుగా సాగాయి. ఓ కథలో ఒక సమస్యకు పరిష్కారం చూపితీరవలసిన అవసరం లేదని నా నమ్మకం. ఒక్కోసారి పరిష్కారాలకన్నా ముందు సమస్యలను గుర్తించటం ముఖ్యం. వాటిని అర్థంచేసుకోవడం ముఖ్యం. అలా సమస్యను లేవనెత్తి, దాని అనేక పార్శ్వాలు చూపెట్టటంతో ఏ కథ అన్నా ముగుస్తుందనుకున్నాను గానీ, అలాంటివేవీ కనిపించలేదు.

ఇవి గొప్ప కథలా? అని నన్ను అడిగితే చెప్పలేనుగానీ, చదువబుల్ కథలని మాత్రం చెప్పగలను. ముఖ్యంగా పాత్రలని స్టీరియోటైప్ చేయకుండా, ఎంతో కొంత ఆలోచించదగ్గ అంశాలను మన ముందుకు తెచ్చే కథలివి.  అయితే, కథాకథనాల విషయంలో, పాత్రలను చెక్కటంలోనూ, వాటి చుట్టూ ఉన్న environmentను ఎంచుకోవటంలో ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మరింత చక్కని, చిక్కని కథలు వస్తాయి. అంతటి ఓపిక, తీరిక ఈ కథా రచయిత్రికి కలగాలని నేను ఆశిస్తున్నాను.

 

You Might Also Like

3 Comments

  1. చైతన్య

    సమీక్ష బాగుంది. ‘కరిగిపోయిన సైకత శిల్పం’ అన్న శీర్షిక చూశాక కలిగిన సందేహం, సైకత శిల్పం కూలిపోతుంది, లేదా చెదిరి పోతుంది కానీ కరిగిపోతుందా? మంచుశిల్పం కరిగిపోతుంది. రచయిత్రి అలా ఎందుకు పేరుపెట్టారో.

  2. చదివించే అరుణ పప్పు కథలు | పుస్తకం

    […] కథల సంపుటి పై వచ్చిన మరో పరిచయ వ్యాసం ఇక్కడ. Title:చందనపు బొమ్మAuthor:అరుణ పప్పుGenre:FictionRelease […]

  3. satyavati kondaveeti

    Hi poornima
    can i publish this review in bhumika.

    satyavati
    9618771565

Leave a Reply