రండి … రాజకీయాల్లోకి

లోక్‌సత్తా పార్టీ ఆవిర్భావం తరువాత, నాకు పరిచయం ఉన్న నా ఈడు స్నేహితులు కొద్ది మంది ఏదో ఒక విధంగా ఆ పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం మొదలుపెట్టారు. అలాగని వాళ్ళవాళ్ళ ఉద్యోగాలు గట్రా మానుకుని కాదు. తీరిక వేళల్లో అన్నమాట. లోక్ సత్తా పార్టీ వారి ప్రకారం – సమాజాభివృద్ధి కోసం పనిచేసే ఒక రాజకియ పార్టీతో పనిచేయాలంటే, పార్టీ జెండాలు పట్టుకుని ఊళ్ళమ్మట తిరుగుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయనక్కర్లేదు. మన రోజూవారి ఉద్యోగం, పనులు చేసుకుంటూనే కొంతసమయం సమాజం కోసం వినియోగించవచ్చు. అది ఎలాగంటే…. : అంటూ ఈ దిశలో సాగిన ఒక ఉపోద్ఘాతం ఈ పుస్తకం.

“పరిపాలన పూర్తిగా ప్రజల చేతుల్లోనే ఉండాలంటే, అవినీతి లేని భారతదేశాన్ని చూడాలంటే కొత్త తరం యువత రాజకీయాల్లోకి రావాల్సిందే” – లోక్‌సత్తా అధ్యక్షుడు జేపీ అన్న పై వాక్యమే ఈ పుస్తకం రాయడం వెనుక ఉద్దేశ్యం, ఈ పుస్తకం సాధించదలుచుకున్న లక్ష్యం. చిన్న చిన్న సెక్షన్లుగా విడగొట్టి మన దేశంలో పరిపాలనా వ్యవస్థలోని సమస్యలను గురించి మొదట చెప్పి, మార్పు కావాలంటే రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలి అని చెబుతూ, ఈ దిశగా వెళ్ళాలనుకుంటే ఎక్కడ నుండి మొదలుపెట్టాలి? ఎవరితో కలిసి పని చేయాలి? – వంటి విషయాలతో కూడిన FAQ వంటి పుస్తకం ఇది.

ఏముందీ పుస్తకంలో?

మన రాజకీయాలు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాయో మొదట క్లుప్తంగా ఉదాహరణలతో చెప్పి – అసలు ఈ పరిస్థితి బాగవుతుందా? అన్న ప్రశ్నతో మొదలుపెట్టారు చర్చ. ఇక్కడే ప్రజాధనం ఎలా ఖర్చవుతోంది, వివిధ రంగాల్లో అవినీతి ఎలా పెచ్చరిల్లుతోంది? ఈ విధంగా మన వ్యవస్థ పతనం కావడంలో మామూలు పౌరులమైన మన పాత్ర ఎంత? – వీటిపై క్లుప్తంగా చెప్పాక, ఈ పరిస్థితుల్లో కూడా ప్రయత్నిస్తే వ్యవస్థ బాగుపడే సూచనలు ఉన్నాయి అంటూ, ఇటీవలి కాలంలో కాస్త మెరుగుపడ్డ పరిస్థితుల గురించి ప్రస్తావించారు.

ఈ దిశలోనే మొదలైన లోక్ సత్తా వారి “సురాజ్య ఉద్యమం ఉద్దేశ్యాలు, లక్ష్యాలు ..ప్రజలు చైతనవంతం కావాల్సిన అవసరం గురించి కూడా క్లుప్తంగా చెప్పాక, అసలు ఈ పుస్తకం ఎందుకు రాశారో ఆ విషయంలోకి వచ్చారు.

అదే – రాజకీయాలంటే ఏమిటి? అందులోకి రావాలంటే ఎలాంటి అనుభవం కావాలి? కొత్తగా ఆసక్తి చూపుతున్న యువతీ యువకులు ఎలాంటి పనుల ద్వారా రాజకీయాల్లోకి క్రమంగా అడుగుపెట్టవచ్చు (ఉదా: క్షేత్రస్థాయి అవగాహన, కార్య నిర్వహణ)? ఇలా అడుగుపెట్టాలి అనుకునేవారికి కావాల్సిన ప్రాథమిక సమాచారం ఎక్కడ లభిస్తుంది? కావాల్సిన విషయ పరిజ్ఞానం ఎక్కడ సంపాదించుకోవచ్చు? రాజకీయ శిక్షణ ఎంత అవసరం? ఎక్కడ పొందవచ్చు? : ఇవన్నీ ఈ పుస్తకంలో చర్చించబడ్డ అంశాలు. అలాగే, రాజకీయాల్లో చేరాలి అనుకుంటే లోక్ సత్తానే ఎందుకు ఎంచుకోవాలి – అన్నది కూడా అంతర్లీనంగా ఉన్న ఒక థీం ఈ పుస్తకంలో.

పుస్తకమే చిన్నది. ఇంతకంటే వివరంగా నేను రాశానంటే బాగోదు. కనుక, నాకు నచ్చిన, నచ్చని కొన్ని అంశాలని ప్రస్తావిస్తాను.

నాకు నచ్చిన కొన్ని అంశాలు:
* పుస్తకం మొదట్లోనే కొందరు పార్టీ సభ్యులైన యువకులు క్లుప్తంగా చెప్పుకున్న తమ అనుభవాలు ఉన్నాయి. చాలా తక్కువ వాక్యాలే ఉన్నా, నన్ను బాగా ఆకట్టుకున్నాయవి.
* ఒక రాజకీయ పార్టీ ఇలా యువతీయువకులకోసం పిలుపునిస్తూ పుస్తకం వెలువరించడం అన్నది నేను ముందు ఎప్పుడూ చూడలేదు (అదే, నేనెప్పుడూ ఇలాంటివి చదవలేదు). నాకు ఈ ఆలోచన బాగా నచ్చింది.
* అలాగే, రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషించాలనుకునే వారికి ఒక కెరీర్ గ్రాఫ్ వంటిది స్కెచ్ చేసిన విధానం నాకు నచ్చింది.

నచ్చని కొన్ని అంశాలు:
* నిజంగా ఈ పుస్తకం ఎవర్ని ఉద్దేశించి రాశారో, వారు చదివి, ఉత్సాహవంతంగా లోక్ సత్తాలో చేరి వారి సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలి అంటే – ఈ పుస్తకం దానికి చాలా చిన్నది అని అనిపించింది. ఈ వివరాల వల్ల, బహుశా ఎలాగో త్వరలో క్రియాశీలకంగా ఏదో చేయబోయే వారు లాభపడతారు కానీ, ఆ సరిహద్దుల్లో లేకుండా, ఆ అసక్తి అంతగా చూపెట్టని వారికి ఈ పుస్తకం అంత ఆకర్షణీయంగా ఉండదు, ఒక వేళ చదివినా, అంత compelling గా ఉండదు – అనిపించింది నాకు. దానికి మరింత శ్రమతో, మరీంత వివరంగా, కొంచెం పెద్ద పుస్తకమే రాయాల్సి ఉంటుంది అనుకుంటాను.

* అన్ని గణాంకాలకీ ఆధారమైన రిపోర్టుల తాలూకా రిఫరెన్సులు కూడా జతచేసి ఉంటే, పుస్తకానికి ఒక నిండుదనం, ఒక కొత్త విలువ వచ్చి ఉండేవి అని అనిపించింది.

* అలాగే, నా మట్టుకు నాకు, పుస్తకం చదివాక దొరికిన సమాధానాలకంటే కలిగిన సందేహాలే ఎక్కువ. ఒక విధంగా అది మంచిదే అయినా కూడా, పాలనా వ్యవహారాలలో లోక్ సత్తా వారి పాత్ర గురించి, సాంఘిక జీవితంలో లోక్ సత్తా వారి కార్యకలాపాల గురించి మరింత వివరంగా రాసి ఉంటే బాగుండేది అనిపించింది.

* ధర కొంచెం ఎక్కువనిపించింది కానీ, ఇటీవలి కాలంలోనే మరిన్ని వివరాలతో, కొంచెం ధర తగ్గించి మరీ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు అని తెలిసింది.

ఇందాకే అన్నట్లు, మామూలు యువతీయువకులని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తూ, ఏం చేయొచ్చో ప్రాథమిక అవగాహన కలిగిస్తూ, ఒక రాజకీయ పార్టీ వెలువరించిన పుస్తకాలు నాకింకేవీ తెలియదు కనుక ఇలాంటి పుస్తకం ఒకటి తెచ్చినందుకు సురేశ్ గారికి, లోక్‌సత్తా పార్టీకీ అభినందనలు.

****
పుస్తకం వివరాలు:
రండి … రాజకీయాల్లోకి – యువతకు జేపీ పిలుపు
రచన: సురేశ్ వెలుగూరి
ముద్రణ: నవంబర్ 2012
పేజీలు: 83
వెల: 80 రూపాయలు (లైబ్రరీ కాపీ – 100 రూపాయలు)
కాపీలకు: imprexindia@gmail.com, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుందట.
(రెండవ ముద్రణ ఇటీవలే వచ్చింది. వివరాలు తెలియవు.)

You Might Also Like

3 Comments

  1. nadeem ansari

    సెలవు రోజుల్లో మాత్రమేనా ? వృత్తి రాజకీయ వాదులను ఎదుర్కొనడానికి ఈ పద్దతి పనికి రాదు.వాళ్ళు ఎల్లప్పుడూ రంగంలో సిద్దంగా ఉంటారు.

    జయ ప్రకాశ్ నారాయణ్ నడిపిన సంపూర్ణ క్రాంతి గురించి చదవండి. ఎమర్జెన్సీ పూర్వాపరాలు తెలుసుకోండి. లిబరలైజేశన్ తరవాత
    విడగొట్టీ – రెచ్చగొట్టి – బేరమాడే పద్దతి ఎందుకొచ్చిందో ఆలోచించండి. రాజకీయం వీకెండ్ హాబీ కాదు. సమయం వెచ్చించాలి. అవ్వా బువ్వా
    రెండూ కావాలంటే మల్టీప్లెక్స్ కి వెళ్ళాలి.

    1. సౌమ్య

      >>సెలవు రోజుల్లో మాత్రమేనా ? వృత్తి రాజకీయ వాదులను ఎదుర్కొనడానికి ఈ పద్దతి పనికి రాదు.వాళ్ళు ఎల్లప్పుడూ రంగంలో సిద్దంగా ఉంటారు.
      -నాకు అర్థమైనంతలో, ఈ పుస్తకంలో “రాజకీయాల్లో భాగం పంచుకోవాలంటే, మీ కెరీర్లు వదిలేస్కోనక్కర్లేదు” అన్నారే తప్ప, “రాజకీయాలు కెరీర్ కావాలి అనుకుంటే సెలవు రోజుల్లో మాత్రమే పని చేసుకోవచ్చు” అనలేదు. సెలవుల్లో చేసే దాన్ని హాబీ అంటారు కానీ కెరీర్ అనరు కదా!రెంటికీ తేడా ఉంది. అందరూ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో మునగాలి అనుకోకపోవచ్చు. వారాంతాల్లో ఎన్.జీ.వో.లతో పనిచేసే వారికి మల్లే, ఖాళీ వేళల్లో ఏ పార్టీకో కార్యకర్తగా పని చేయాలి అనుకోవచ్చు. ఆ ముక్క అన్నది అలాంటి వారికోసం – అని నేను అనుకుంటున్నాను.

  2. Suresh Veluguri (Author of the book)

    మంచి సమీక్ష రాసినందుకు కృతజ్ఞతలు సౌమ్యా.

    క్లుప్తంగా రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి పుస్తకం క్లుప్తత గురించి, రెండోది లోక్‌సత్తా కోణం గురించి.

    ఈ పుస్తకం ముందుమాటలోనే దీన్ని ఎందుకు రూపొందించారో స్పష్టంగా రాశాను. రాజకీయాలను మార్చుకోవాలంటే కొత్తతరం భాగస్వామ్యం ఖచ్చితంగా అవసరం. ఇవ్వాళ్టి మన యువతీయువకుల్లో దేశాన్ని మార్చుకోవాలనే మంచి స్పృహయితే కనిపిస్తోంది కానీ, దానికి అవసరమైన విషయ పరిజ్ఞానం కనీస స్థాయిలో కూడా లేదని చెప్పడానికి నేను మొహమాటపడడం లేదు. పాజిటివ్‌ థింకింగ్‌ వారికున్న గొప్ప వరం. వారికి అవసరమైన సమాచారాన్ని, కనీసస్థాయి మార్గదర్శకత్వాన్ని ఇవ్వగలిగితే చాలు. ఇక పౌరసమాజమే వారికి పాఠాలు నేర్పిస్తుంది. దానికి పెద్ద పెద్ద గ్రంథాల అవసరమే లేదు. ఈ చిన్న పుస్తకం ద్వారా నేను చెప్పదలచుకున్నది అదే. పుస్తకం కావాలనే క్లుప్తంగా, అవసరమైనంత మేరకు సమాచారాన్నిస్తూ, కేవలం యువత రాజకీయాల్లోకి రావల్సిందేనన్న కోణం నుంచి రాశాను. ప్రతిదానికీ గణాంకాలు గూగుల్‌ ద్వారా చాలా సులభంగా దొరికిపోతున్నాయి. నిజమైన ఆసక్తివున్నవారు ఆ డేటాను ఎలాగైనా సంపాదించుకుంటారు. లాజిక్‌ చుట్టూ తిరిగే ఇవ్వాళ్టి తరానికి మరీ అరటిపండు ఒలిచి చెప్పాల్సినంత అవసరం వుందని కూడా నేననుకోను.

    రెండోది – లోక్‌సత్తా కోణం. రాజకీయాలను లోక్‌సత్తా / జయప్రకాష్‌ నారాయణ్‌ కోణం నుంచి చూడడం పరిణతికి గుర్తుగా భావిస్తాన్నేను. ఈ పుస్తకంలో నేను ప్రస్తావించిన అంశాలన్నీ లోక్‌సత్తా చెప్పే విద్య, వైద్యం, ఆరోగ్యం, అభివృద్ధి, ఎదిగే అవకాశాల చుట్టూనే తిరుగుతాయి. దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా ఈ కోణాన్ని ప్రామాణికంగా తీసుకోదు. ఒక సాధారణ వ్యక్తిగా నేను చెప్పడం కంటే జేపీ కోణం నుంచి చెప్పడం పుస్తకానికి నిండుదనాన్నిస్తుంది, ఎక్కువమందికి సమాచారం చేరే ఆస్కారముంటుంది కాబట్టి ఆ కోణాన్ని ఎంచుకున్నాను.

    అలాగే, ఈ పుస్తకం ద్వారా నేను యువతీయువకులను లోక్‌సత్తా లోకి మాత్రమే రమ్మని చెప్పడంలేదు. అల్టిమేట్‌గా రాజకీయాల ప్రయోజనం, పరమార్థం ప్రజాజీవితంలో మార్పుల కోసం పనిచేయడమే. కాబట్టి అందరూ రాజకీయాల్లో భాగస్వామ్యం తీసుకోవాలి. అందుకోసం తమకు నచ్చిన ఏ రాజకీయ పార్టీనైనా ఎంచుకోవచ్చు, వారితో కలిసి పనిచేయవచ్చు. ఒక చాప్టర్‌లో ఇది వివరంగా రాశాను. ప్రత్యేకంగా లోక్‌సత్తా సాహిత్యం ఇవ్వడం కోసమైతే ఈ పుస్తకం అవసరమే లేదు. లోక్‌సత్తా అవగాహనా సాహిత్యమంతా – కొన్ని వేల పేజీల మెటీరియల్‌ ఉచితంగా పార్టీ వెబ్‌సైట్‌లో లభ్యమవుతోంది. బయట రచయితల పుస్తకాలు కొన్ని మార్కెట్లో, కినిగెలో కూడా దొరుకుతున్నాయి.

    ఇక పుస్తకం ధర రు.80 పెట్టక తప్పలేదు. మొదటి ఎడిషన్‌ను అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో తీసుకురావడం, విశాలాంధ్ర, ప్రజాశక్తి సహా ప్రముఖ ఏజెన్సీలన్నీ తమ కమీషన్‌ రేట్లను 45 నుంచి 50 శాతం దాకా తీసుకువెళ్ళిపోవడంతో ఈ ధర అనివార్యమైంది. అయితే ఇప్పుడు రు.30 ధరకు సాధారణ ముద్రణ కాపీ కూడా తీసుకువచ్చాం.

    మంచి సమీక్ష రాయడం ద్వారా పుస్తకానికి మరింత విలువ సృష్టించినందుకు మరోసారి కృతజ్ఞతలు.

Leave a Reply