పుస్తకం
All about booksపుస్తకభాష

July 2, 2009

శశిరేఖ – చలం

More articles by »
Written by: నరేష్ నందం
Tags:

రాసి పంపిన వారు: నరేష్ నందం, హైదరాబాదు
sasirekha2
గుడిపాటి వెంకటాచలం పేరు తెలియని తెలుగు భాషాభిమాని ఉన్నాడంటే నాకు నిజంగా ఆశ్చర్యమే. చలంపై మీకెటువంటి అభిప్రాయమైనా ఉండవచ్చు. కానీ అతను ఒక ప్రవాహానికి పాదులు తీశాడు. తెలుగు భాషను శాసించాడు. సంఘాన్ని ధిక్కరించాడు. అవసరమైనప్పుడల్లా తన నాయికల గొంతుతో ప్రశ్నించాడు. చలంకు “శశిరేఖ” మొదటి నవలే అయినా అప్పటి సంఘపు నీతి నియమాలను ప్రశ్నించాడు. కానీ అవే పద్ధతులు ఇప్పటికీ కొనసాగటం గమనార్హం. సమాజాన్ని, కట్టుబాట్లను ఒంటరిగా ఎదిరించేందుకు సాహసించిన చలం తన మిగిలిన రచనల్లో ఆ పద్ధతిని కొనసాగించాడు.

చలం తన ఆత్మ కథలో వ్రాసుకున్నది ఆయన శైలి గురించి కొంత తెలియచేస్తుంది:
“నేను రచనలు సాగించేటప్పటికి నాకు తెలీకుండానే, నేను మాట్లాడే భాషలోనే రాశాను. తక్కిన కథలని పుస్తకాల భాషలో రాశాను. అసలు ఆనాడు భాషా ఉద్యమం అనేది ఒకటి ఉందని నాకు తెలీదు. చింతా దీక్షితులు (ఈయన కూడ రచయిత, చలంగారికి సహ ఉద్యోగి) గారినించే విన్నాను గిడుగు రామ్మూర్తి గారి పేరు. వారి శిష్యులు ఆలోచించి, భాషని ఎంతవరకు మార్చవచ్చో తూచి రాసేవారు. ఆ యత్నాలు, మడి కట్టుకోటాలు చదివితేనే నాకు అసహ్యం వేసింది. భాష ఎట్లా మారాలో నాకు శాసించాలని చూసేవారు. భర్తని యెన్ని ముద్దులు పెట్టుకొవాలో శాసించినట్లు. కాని ఈ చలం ఓ వరదల్లె వూడ్చుకొచ్చాడు. నా భాషాధాటికి వారికెంత భయమో! పైగా ఆ భాష, భయంలేని, సంకోచంలేని, భీతిలేని, పాత గోడల్ని పడగొట్టే తీవ్రవాది ఓ master stylist చేతిలో పడ్డది. చాలా త్వరలో వీళ్ళ కృతక భాషలన్నీ కుప్పకూలాయి. చలం శైలిలో, రాతలో అంత తీవ్రత అంత inevitibility అంత భయంకరాకర్షణ ఉండిపోయింది. ఒక్కొక్కరే ప్రతిఘటించబోయి, పరాజితులై, నా భాషనే అనుకరించారు గతిలేక. ఇంకో విధంగా రాస్తే వాటిని చదవరు ఎవ్వరూ. ఈ భాష, ఈ భావాలు వీలులేదు అని ఎంతమంది మొత్తుకున్నా, ప్రజలు ఎగబడి చదువుతున్నారు. రచయితలు, పత్రికలు చలం పేరు చెప్పకుండా చలాన్ని అనుకరించటం ప్రారంభించారు. భాషాదిగ్గజాల మొకాళ్ళూగిసలాడే పాత నీతుల గోడలు విరిగి కింద కూలాయి.” (ఆత్మకథలో 74-75వ పుటలు)

అటువంటి చలం 1921లో వ్రాసిన నవల “శశిరేఖ”. నూటయాభైరెండు పేజీల ఈ నవలను సంక్షిప్తీకరిస్తే..

శశిరేఖ- చలం మాటల్లో చెప్పాలంటే ఏమీ తెలియని ముగ్ధ. అప్పుడే మారుతున్న సమాజంలో నవతరానికి ప్రతినిధిగా కనిపిస్తుంది మొదట్లో. చిన్న వయసులో తనకు ఏమాత్రం ఇష్టం లేని పెళ్లి చేసినందుకు అమ్మతో వాదనకు దిగుతుంది. తనను ఇష్టపడిన రామారావు సీమనుండి వచ్చి తనను వివాహం చేసుకునేవాడు గదా అని ప్రశ్నిస్తుంది. తనకు ఇష్టంలేని వాడితో “కార్యం”కు ఎలా ఒప్పుకోనంటూ నిలదీస్తుంది. థైర్యంగా భర్తతో చెబుతుంది. “నువ్వంటే ఇష్టం లేదు, కార్యం ఇష్టం లేదు, బలవంతం చేయటం న్యాయమా..?” అని. అతను అర్ధం చేసికొనక పోవటంతో కార్యం ముందురోజు రాత్రి తాను ఇష్టపడిన గోవిందపురం లాకుల అధికారి కొడుకు, కృష్ణుడితో ఊరు వదలి వాడపిల్లి వచ్చేస్తుంది.

కృష్ణుడు-శశిరేఖ, ఇద్దరూ ప్రకృతి ప్రేమికులు. అందాన్ని ఆస్వాదిస్తూ అన్నపానాలను మరచిపోయేవాళ్లు. కృష్ణుడు శశిరేఖ తనతో ఉంటే చాలుననుకుంటాడు. ఆమె కోసం వైద్యవిద్యను మధ్యలో వదిలేసి వచ్చేస్తాడు. అప్పుడే పూసిన మొగ్గల్లే ఉన్న తనని అపురూపంగా చూసుకుంటాడు. ఒకరికి ఒకరు ఎదురు ఉంటే చాలు ఆకలిదప్పులు ఉండవనుకుంటారు. వాడపిల్లిలో ఉన్న కృష్ణుడి మితృడు, డాక్టరు సుందర రావు ఆశ్రయం పొందిన వీరు ప్రకృతిని ఆస్వాదిస్తూ కాలం గడిపేస్తారు. మూడేళ్ల తర్వాత తిరిగి సొంతఊరు గోవిందపురం వచ్చేస్తారు, మితృడు సుందర రావుతో సహా!

ఒకనాటి రాత్రి పడవలో షికారుకి వెళ్లినప్పుడు కాలువలో పడిపోతుంది. సుందర రావు దగ్గర వైద్యం చేయించుకుంటుంది. సుందర రావుకి ఆమెపై కోరిక ఉండటం, తనకూ అతనంటే ఇష్టం కలగటం వలన బలవంతంగా అతనితో ఒకరాత్రి గడుపుతుంది. కృష్ణుడిపై ప్రేమ తగ్గిపోయినప్పుడు అతని వద్ద ఉండటం నీతి కాదని సుందర రావుతో ఊరువదలి వచ్చేస్తుంది. తనకోసం ఎదురుచూస్తున్న కృష్ణుడికి తనను మరచిపొమ్మని చీటీ పంపిస్తుంది.

ఈ సంఘటనకు ఉపోధ్ఘాతముగా, చలం అంటాడు.. “ఆమె పాదములకు నమస్కరించి, తాకిన ఆమె దేహమెక్కడ కందునో అని ఆమెను దేవతగ పూజించు భక్తునితో ఆమెకవసరము తీరినది. ఆమెను నలిపి జీవన రసమును పిండి, తాగి మూర్ఛనొందించగల ప్రేమనామె వాంచింఛెను. అగ్ని వలె తాపమున దహించు తృష్ణకు, ఉపశమనముగ మహా ప్రళయ, మేఘముల గర్జించు చండవర్షమే కావలెను.”

శశిరేఖతో ఎన్నో అందమైన ప్రదేశాలు తిరిగిన తర్వాత సుందర రావు బళ్లారిజిల్లాలో ఉద్యోగంలో చేరుతాడు. కాలం గడచిన కొద్దీ, ఆమెను అనుభవించిన కొద్దీ శశిరేఖపై మోహం పోయి ఆమె అతనికి భారంగా కనిపిస్తుంది. అందముగా కనబడేకొద్దీ ఆమెను మాటలతో హింసించాలని చూస్తాడు. చివరికి అతనిపై ప్రేమ మాయమై, అతనిని విడిచి తిరిగి గోవిందపురం వెళ్లటానికి బయల్దేరుతుంది. కానీ సుందర రావుకి ప్రమాదం జరగటం వలన ఆగిపోవలసి వస్తుంది. నెలరోజులపాటు అతనికి సేవలు చేసి ఆరోగ్యం కుదుటపడేలా చేస్తుంది. ఫలితంగా అతను ఆమెతో మళ్లీ ప్రేమగా ఉండాలనుకుంటాడు. సుందర రావుకి వైద్యం చేస్తున్న డాక్టరుని ఎక్కడో చూసిన గుర్తుతో వివరాలు సేకరిస్తుంది. అతనే తనను పెళ్లి చేసుకుంటానన్న రామారావని తెలుసుకుని స్నేహం చేస్తుంది.

రామారావుకి తన గతం గురించి చెప్తుంది శశిరేఖ. బ్రహ్మ సమాజంలో తిరిగే అతను ఆమెను పెళ్లి చేసుకుంటానంటాడు. సుందర రావుని వదలి తనతో వచ్చేయమంటాడు. తీసుకెళ్లి వేరే ఇంటిలో ఉంచి పదిహేనురోజుల తర్వాత పెళ్లి అంటాడు. తనతోపాటే ఉంటానంటుంది శశిరేఖ. పెళ్లికి ముందు కలిసి ఉండటం సమాజం హర్షించదంటాడు రామారావు. ఈలోపు సుందరరావు వస్తాడు. పాతవన్నీ గుర్తు చేసి శశిరేఖను చెన్నపట్నం తీసుకునిపోతాడు. ఆమె తనమీద ఆధారపడి ఉన్నదన్న అహంకారంతో మళ్లీ హింసించటం మొదలుపెడతాడు.

సుందర రావుమీద అసహ్యంతో ఇల్లు వదలి వచ్చిన శశిరేఖను బ్రహ్మమత ప్రచారకుడు, నవజివనదాసు ఆదరిస్తాడు. కన్న బిడ్డలా చూసుకుంటాడు. ఆమె గతం తెలుసుకున్న తర్వాత తనకు తెలిసిన ధర్మారావుతో పెళ్లి చేద్దామనుకుంటాడు. కాని, పెళ్లి మీద ఏమాత్రం నమ్మకం లేని శశిరేఖ గట్టిగా వ్యతిరేకిస్తుంది. ప్రేమ లేని చోట తానుండలేనని, పెళ్లి అంటే ప్రేమను వదులుకోవటమే అంటుంది. అడవిలో స్వేచ్చగా తిరిగే చిలుకను పంజరంలో బంధించటమే పెళ్లి అంటుంది.

తన మనసు మార్చేందుకు బ్రహ్మ సమాజ కార్యక్రమాలకు హాజరుకావాలని కోరతాడు నవజీవన దాసు. కలకత్తాలొ జరిగే సమావేశాలకు హాజరైతే ఆమె గతంలో చేసిన తప్పులను తెలిసికొంటుందనీ, ఈశ్వర ప్రేమకు పాత్రురాలవుందనీ తద్వారా.. ధర్మారావుని పెళ్లి చేసుకుంటుందని ఆశిస్తాడు.

అప్పటికే బ్రహ్మసమాజంలో ఉన్న రామారావు, శశిరేఖను కలకత్తాలో కలుస్తాడు. తనను మోసం చేసిందని నిందిస్తాడు. “నా మనసు నీకే అర్పితం” అంటుంది శశిరేఖ. బ్రహ్మ సమాజంలోని వారిని చూసి ఎంత సంతొషముగా ఉన్నారో అని అనుకుంటుంది. తనను పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉండిపోయేలా ఏర్పాట్లు చేస్తానంటాడు ధర్మారావు. తన మౌనాన్ని అంగీకారంగా భావించిన ధర్మారావు నవజీవనదాసుతో శశిరేఖ పెళ్లికి ఒప్పుకుందని చెప్తాడు.

ఈవిషయం రామారావుకి తెలిసి శశిరేఖను నిలదీస్తాడు. తను, “నేను నీ సొంతం” అంటుంది. పెళ్లికి మాత్రం ఒప్పుకోకుండా తనతో ఉండిపోమంటుంది. మగ స్నేహితుల వలే కలిసి ఉందామంటుంది. వివాహమనే బంధం లేకుండా స్త్రీపురుషులు కలిసి ఉండటాన్ని సంఘం హర్షించదంటాడు రామారావు. పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోమంటాడు. చిన్నప్పుడు చేసిన వాగ్దానాన్ని నిలుపుకునేందుకే తనను పెళ్లి చేసుకుంటానంటున్నావంటుంది శశిరేఖ. సాయంత్రం లోపు నిర్ణయం చెప్పమని వెళ్లిపోతాడు రామారావు.

ఆరోజు సాయంత్రం శశిరేఖ రామారావుని శారీరకంగా కూడా కలుస్తుంది. అంతా అయిపోయాక కళ్లుతెరిచిన రామారావు ఆమెను అక్కడే వదిలేసి వెళ్లి పోతాడు. తన తప్పు తెలుసుకుని తిరిగివచ్చేసరికి ఆమె కొన ఊపిరితో ఉంటుంది. చివరికి అతని చేతిలో కన్నుమూస్తుంది.

———————————————————–
ఈ నవలలో ఉన్న ప్రధాన పాత్రలు ఐదు.
శశిరేఖ, కృష్ణుడు, సుందర రావు, రామారావు, నవజీవన దాసు.

ముందు మాటలో శివశంకర శాస్త్రి అన్నట్లు.. శశిరేఖ ప్రేమైక జీవిని. ప్రేమ లేని చోట తను ఒక్క నిమిషం నిలువలేకపోయింది. రామారావు వచ్చి తనను పెళ్లి చేసుకుంటాడనుకున్న ఆమే.. పెద్దవాళ్లనెదిరించి కృష్ణుడితో వెళ్లిపోయింది. సుందర రావు ఫిడేలు గానం, తీయని మాటల ప్రభావంతో.. అతనిపై ఆకర్షణ పెంచుకుంది. అందము, సౌందర్యారాధనలొ మునిగిపోయే ఆమె అతని ప్రభావంలో పడిపోయింది. ఆవేశంలో అతను ముద్దుపెట్టి, తర్వాత కోపం ఉందా అంటే లేదని చెప్పింది. ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లే ముందు రోజు రాత్రి ఒంటరిగా సుందర రావు ఇంటికి వెళ్లింది. వయసు గారడీ, అతని బలవంతము వలన లొంగిపోయింది. ఉదయం కృష్ణుడి దగ్గరకే వెళ్లమనిన సుందరరావుతో.. “నాకు నీమీద ప్రేమలేకపోతే నా చిటికిన వేలునైనా తాకనిచ్చేదాన్నా మిమ్మల్ని?” అని ప్రశ్నిస్తుంది. అప్పటి వరకు తననెంతో ప్రేమగా పూజించిన కృష్ణుడిని వదలి వెళ్లుటకు ఇష్టంలేకపోయినా.. అతనంటే ఇప్పుడు ప్రేమ లేదు కనుక ఇంకా అతనితో ఉండటం భావ్యం కాదని భావించింది. సుందరరావుతో ఊరు విడిచి వెళ్లిపోయింది. మోహం తీరిన సుందరరావు కౄరత్వాన్ని చూచిన ఆమెకు అతనిపై ప్రేమ తగ్గిపోయింది. తర్వాతి పరిణామాల వలన చిన్ననాటి మితృడు రామారావుతో కలిసి జీవించాలనుకుంటుంది. అతను పెళ్లికి పట్టుపడితే.. పెళ్లి తర్వాత ఇతను మాత్రం వదిలేయడని ఋజువేంటని ఆలోచిస్తుంది. పెళ్లి అంటే స్వాతంత్ర్యమును కోల్పోవటమేనని, “ఒకవేళ పెళ్లితర్వాత ఇప్పుడున్న ప్రేమ పోతే నన్ను ఇష్టం వచ్చినట్లుగా పోనిస్తారా?” అని అడుగుతుంది. తప్పనిసరై పెళ్లికి ఒప్పుకున్నా, సుందర రావు బలవంతముతో మళ్లీ అతనితో వెళ్లిపోతుంది. చెన్నపట్నంలో నవజీవనదాసు ఆశ్రయంలో కొన్నాళ్లు సంతోషంగానే గడిపినా, తనకు పూర్వ జీవితమే బాగుందనిపిస్తుంది. కలకత్తాలో రామారావును మళ్లీ కలిసిన తర్వాత అతని ప్రేమ తప్ప మరేమీ అక్కరలేదనిపిస్తుంది. ఓక రాత్రి అతనితో కలిసిన తర్వాత, అతని ప్రేమను తట్టుకోలేక గుండెనొప్పితో కన్నుమూస్తుంది.

కృష్ణుడు అందాన్ని ఆస్వాదించే వాడైతే.. సుందరరావు అనుభవించాలని చూసేవాడు. కృష్ణుడు శశిరేఖ అమాయకత్వాన్ని, అందాన్ని, దోసిలిలో పట్టి ప్రేమగా చూసుకుంటే.. సుందర రావు ఆమె శరీరాన్ని గుప్పెటలో నలిపి వేశాడు. తనను వదిలి వచ్చిన తర్వాత శసి క్షేమం కోరుతూ కృష్ణుడు ఉత్తరం వ్రాస్తే.. సుందర రావు మోహం తీరిన తర్వాత ఇంట్లోంచి బయటకు గెంటివేసాడు. వీళ్లిద్దరూ భిన్నదృవాళ్లా, నాణేనికి చెరో వైపులా కనిపిస్తారు. శశిరేఖ కృష్ణుడి వద్ద ఉన్నంతకాలం ఆమె కోసం వెంపర్లాడిన సుందరరావు, ఆమె తనతో వచ్చేయగానే ఆమె ఎక్కడికి పోతుందన్న నిర్లక్ష్యము ఏర్పడింది. కొన్నాళ్లకు ఆమె మోయలేని బరువుగా తోచింది. ఫలితంగా ఆమెకు దూరమైనాడు.

రామారావు అప్పటి బ్రహ్మసమాజపు ప్రతినిధి. ఉన్నత విద్యలు చదివినా సంఘం నిర్మించిన చట్రాన్ని, గీసిన గీతను కాదనే సాహసం చేయలేకపోయాడు. చిన్నప్పుడు శశిరేఖకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తపించినా, ఒక చెడిపోయిన స్త్రీని బాగుచేశానన్న పేరు కోసమే అతను నడచుకున్నట్లు కనిపిస్తుంది. వెలుతురులో ఎన్నో ఆదర్శాలు పలికే వారు చీకటిలో తప్పులు ఎలా చేస్తారో, నిగ్రహాన్ని ఎలా కోల్పోతారో రామారావు మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు.

నవజీవనదాసు బ్రహ్మసమాజపు ప్రచారకుడు. తప్పుడుదారిలొ నడచే అమ్మాయిని బాగుచేసి, పాపాలకు పరిహారం చూపి, ఆమెకు ఒక కొత్త జీవితం ఇవ్వాలని ఆశించాడు. ఐతే ధర్మారావుతో ఆమె పెళ్లికి నిరాకరించటం, రామారావుతో సన్నిహితంగా మెలగటం అతనికి కోపం తెప్పిస్తుంది. కాని, ఆమె తన కూతురివంటిదనీ, ఆమె కోరుకున్న జీవితం గడపవచ్చనీ అనే సమయానికి పరిస్థితి చేజారిపోతుంది. ఆమె చనిపోయిన రాత్రి, కలలో దేవదూతలతో అతను “ఈమె ధన్యురాలు, ప్రేమించినది” అనటం ద్వారా మార్పుని ఆహ్వానించినట్లుగా కనిపిస్తుంది.About the Author(s)

నరేష్ నందం10 Comments


 1. మంజరి లక్ష్మి

  ప్రేమలేదని సుందర రావును వదిలిన శశిరేఖ, మళ్ళా సుందర రావు దగ్గర కెళ్ళటం ఆమె కేరక్టర్ను తక్కువ చేసినట్లు కాదా?


 2. వర ప్రసాద్, సీతారామయ్య గార్లకు..

  ఆలస్యంగా జవాబిస్తున్నందుకు ముందుగా నన్ను మన్నించండి.

  చలం గురించి విమర్శ, పరిశీలన చేసేంత స్థాయి నాకు లేదు. ఆయన రాసిన పుస్తకాలను చదివి, నాకు అర్ధమైనదనుకున్న దానినే శశిరేఖ పరిచయంగా రాశాను. 150కి పైగా పేజీల నవలను ఒకటి, రెండింటికి సంక్షిప్తీకరించే సాహసమూ చేశాను.

  నా అభిప్రాయం ప్రకారం..

  తరం మారేకొద్దీ భావాలు చాందసంగా, పద్ధతులు అనాగరికంగా కనిపిస్తాయని నేను నమ్ముతాను. కొద్దిగా ఆధునిక, స్వేచ్చా భావాలు కలిగిన ఏ వ్యక్తి అయినా అలాంటి పద్ధతులను వ్యతిరేకిస్తాడు. ఇప్పుడు మనం అత్యాచారాలను, గృహహింసను, స్త్రీకి ఇష్టంలేని పెళ్లిని వ్యతిరేకిస్తున్నట్లే.. ఆనాటి పద్ధతులను చలం వ్యతిరేకించాడు.

  కొద్దిగా విప్లవభావాలు కలిగిన ఏ వ్యక్తి అయినా.. తనకు చాందసంగా కనిపించిన సంఘటనలను చూసి తట్టుకోలేడు. అలాంటప్పుడు అతను తన పరిధిలో వాటిని వ్యతిరేకిస్తాడు. అతను మామూలు వ్యక్తి అయితే వాటి గురించి తెలిసిన వాళ్లవద్ద వాపోతాడు. వారినుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి మరొకరి దగ్గర ఆ ప్రస్తావన చేయొచ్చా లేదా అని నిర్ణయించుకుంటాడు. ఆ వ్యక్తి కొంచెం సామాజిక స్పృహ కలిగి ఉంటే ఒక ఉద్యమం నడిపిస్తాడు. అదే ఆ వ్యక్తి అధికారంలో ఉన్నవాడైతే.. అలాంటి అనాగరిక పనులను నిషేధించేందుకు కృషిచేస్తాడు.

  కానీ మనం మాట్లాడుకునేది చలం గురించి.
  చలం సామాన్యుడు. సామాజిక స్పృహ కలవాడు. ఉపాధ్యాయుడిగా తరవాతి తరాన్ని తీర్చిదిద్దవలసినవాడు.
  అంతకంటే మించి.. చలం కథకుడు.
  స్కూల్లోని పాతిక మంది పిల్లలకు పెద్దవిషయాలు చెప్పటం కన్నా.. సమాజంలోని పెద్దలకు చిన్న విషయాలను చెప్పటం సులువని తెలిసిన వాడు. అందుకే తాను అనాగరికం, చాందసమని భావించిన వాటిపై తిరుగుబాటు మొదలుపెట్టాడు. కలంపోటు వేశాడు. ఆ కథల్లోని స్త్రీల వంటి పరిస్థితుల్లో ఉన్నవారి ముందు ఒక ఆప్షన్ కనిపించేలా చేశాడు. అదే సమయంలో కొత్తదారిలో పూలు మాత్రమే ఉండవనీ, ఎక్కువ శాతం రాళ్లూ, ముళ్లూ ఉంటాయని హెచ్చరించాడు. ఇంటి నుంచి వచ్చిన మహిళ ఎలాంటి పరిస్థితి అనుభవిస్తుందో, మేకవన్నె పులులు, గోముఖ వ్యాఘ్రాలు ఎలా కాచుకుని ఉంటాయో వివరించాడు. ఎలా అయితేనేం వేలు, లక్షల మంది దొంగతనంగానైనా తనను చదివేలా చేసుకోగలిగాడు. తమ ఇంటి మహిళలు పాడైపోతున్నారని అరిచి గోల చేసిన వాళ్లని ఇంకొంచెం రెచ్చగొట్టాడు. ఒకప్పుడు తనను, తన భావాలను చూసి మండిపడీ, వ్యతిరేకించిన వారి ఇంటినుంచే ఆయన అభిమానులు పుట్టుకొస్తూంటే చూసి నవ్వుకున్నాడు. అంతిమంగా తన గురించి, తన ఆలోచనల గురించి వందేళ్లకు పైగా చర్చ జరిగేలా చూసుకున్నాడు.

  అప్పుడే అలవాటవుతున్న పాశ్చాత్య సంస్కృతినీ, దాని ప్రభావాన్ని ఫీలవుతున్న ఆతరానికి.. చలం మంచే చేశాడు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కావాలనే భావన మహిళ్లల్లో అప్పటికే మొదలువుతోంది. తాము మగవారికి ఏమాత్రం తీసిపోమని, తమపై వారి బోడిపెత్తనమేంటనే స్త్రీలూ, తమ ఇంటిలోని వారిని ఒప్పించి, కాంగ్రెసులో తిరిగిన అమ్మాయిలనూ అప్పటికే చూస్తున్నారు. చలం రచనల్లోని నాయికలు కొంచెం అటూఇటుగా ఆనాటి మహిళల మనస్తత్వాన్నే ప్రదర్శిస్తారు. చలం నాయిక ఒక ధైర్యవంతమైన అడుగు వేసిందంటే.. ఆనాటి మహిళల్లో అలాంటి ఆలోచనలకు బీజం పడుతోందనే అర్ధం. అయితే.. అలాంటి బాటలో అడుగుపెట్టిన స్త్రీ జీవితం ఎలా ఉండబోతోందో చలం హెచ్చరించాడు. అప్పటికే ఆవిధంగా ఆలోచిస్తున్న ఒకరిద్దరికి చలం కథలు ఉత్ప్రేరకంగా పనిచేసి ఉండచ్చు. కానీ కనీసం వందమందినైనా అలాంటి స్టెప్ వేయకుండా నిరోధించి ఉంటాయి. ఎందుకంటే.. మనం ప్రతి జీవితం సుఖాంతం కావాలని కోరుకుంటాం. కానీ చలం కథలు ఎన్ని సుఖాంతమయ్యాయి? అందుకే భవిష్యత్తులో పొయ్యిలో పడేకన్నా.. ప్రస్తుతం పెనంపై జీవితమే బాగుందని అప్పటి మహిళలు భావించి ఉంటారు. ఇందుకు అప్పటి పురుషపుంగవులు చలంకు తప్పకుండా ధన్యవాదాలు చెప్పితీరాలి.

  కానీ ఒకరిద్దరైతే చలం పుస్తకాలు చదివాక ధైర్యం చేసి ఉంటారు కదా? అప్పటికే ఉన్న పరిస్థితుల వల్ల వారు ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. చలం పుస్తకం చదివాకే వెళ్లిపోయి ఉంటారు. అదే అదనుగా దొరికి ఉంటుంది ఆయన విమర్శకులకు. మా ఇంటి బంగారం మంచిదే.. కోమటి కొట్లోని చింతపండే దాన్ని నల్లగా చేసిందని వాదించేవారనుకుంటాను.. తమ కుటుంబంపై మచ్చ పడకుండా చూసుకునేందుకు అందరికీ కనిపించిన ఒకేఒక్క అవకాశం.. చలం, అతని పుస్తకాలు. గుడికి వెళ్లిన వారంతా గంట కొట్టినట్లు, తమ ఇంట్లో తప్పు జరిగిందని భావించిన వాళ్లంతా నెపాన్ని చలంపై నెట్టేశారు. మన ప్రాంతం నుంచీ తరిమేశారు.

  అయితే చలం అదృష్టవంతుడు. పాపుల భారాలు మోసి శిలువ వేయబడిన జీసస్ క్రైస్ట్‌లా.. రచయితలకు మార్గనిర్దేశం చేసేందుకు శిక్ష అనుభవించాడు. అందుకే చలం తర్వాత ఎందరు రచయితలు వచ్చిపోయినప్పటికీ, స్త్రీవాద సాహిత్యమంటే చలం పేరే మనకు గుర్తొస్తుంది. సమాజాన్ని మెప్పించాలన్నా, నొప్పించాలన్నా ఏంచేయాలో తెలియాలంటే చలం సాహిత్యం చదవటం ఒక్కటే మార్గం. మన ప్రయోజనం తాత్కాలికమైతే సమాజానుగుణంగా.. దీర్ఘకాలికమైతే సమాజానికి కొద్దిగా వ్యతిరేకంగా రాయాలని చెప్పకనే చెప్పాడు.

  ————————————-
  ఆరి సీతారామయ్య గారు:
  శశిరేఖ ఈ రోజుకూడా స్వేచ్చగా బతకలేదు సర్. ఆమె కథ తెలిసిన మగవారిలో 10కి 8మంది ఆమెను వేధించేవారు. ఆమెకు కాపురం లేకపోవచ్చుగానీ, కారెక్టర్ ఉంది కదా.. శశిరేఖ కథ ఈరోజు కూడా అలానే ముగిసి ఉండేది.
  వరప్రసాద్ గారు:
  పాతికేళ్లుగా చలంని చదివిన మీకు చెప్పేంత పెద్దవాడిని కాను. మీరు చలాన్ని చదవటం ప్రారంభించినప్పుడు నేను అక్షరాలు దిద్దుతూ ఉండి ఉంటాను. మీ అభినందనలు నాకు ఆశీస్సులు.
  నా అభిమాన రచయితల్లో చలం, శ్రీశ్రీ ముఖ్యలు. నాకు తెలిసినంత వరకూ, నేను అనుభూతి చెందిన వరకూ చలం గురించి పైన రాశాను. జీవితంలో ఒక్కసారైనా చే, శ్రీశ్రీని అభిమానించని చదువరులు మనకు కనిపించరు. శ్రీశ్రీ గురించి రాసేంత సాహసం నేను చేయలేను సర్. ఆయన ప్రతి యువతరానికీ స్ఫూర్తిప్రదాత.

  చలంని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించాలి. శ్రీశ్రీని ఎవరికి వారు అనుభూతి చెందాలి.

  శెలవు.


  • varaprasad

   ముందుగా క్షమాపణలు, ఎందుకంటే రిప్లై ఇవ్వటానికి 380 రోజులు అయినందుకు,మీ విశ్లేషణ మరింత బావుంది,ఒక శతాబ్దం గడిచిపోయినా అయన సృష్టించిన పాత్రలు నేటికీ మనకెదురవుతోనె ఉన్నాయి,అందుకేనేమో గోప్పవాల్లనుకొనేవాళ్ళు ఆయన్ను ఎంత విమర్శించినా చిరస్తాయిగా జనం గుండెల్లోనే ఉండిపోయారు,మీ రాతలతో మళ్లీ చలాన్ని కళ్ళముందు ఉంచారు.ఇలాంటివి చదివినపుడు చలం మళ్లీ పుట్టి మా రాజమండ్రి వీదుల్లో తిరుగుతోన్నట్టు,గోదావరి వడ్డున కాపురం వున్నట్టు అనిపిస్తుంది.వీలైతే మరింత రాయండి.చదువుకుని ఆనందిస్తాం.


 3. ఆరి సీతారామయ్య

  చలం అంటే నాకూ ఇష్టమే. అయినా చలం శశిరేఖను సృష్టించటమే కాదు, చంపేశాడు కూడా. ఆయనకు ఆ రోజుల్లో మరోమార్గం కనిపించినట్లులేదు. స్వేచ్చగా బతకటం అంత సులభం కాదు. అప్పుడయినా ఇప్పుడయినా. ఇప్పటి శశిరేఖలకు ధైర్యంగా స్వేచ్చగా బతికే అవకాశాలున్నాయా? ఇప్పుడు రాస్తే ముగింపు వేరే విధంగా ఉండేదా?


 4. varaprasad

  1920s lo intha dairyamga “SASIREKHA” rayalante adi chalaniki tappa avariki sadyam,ayana ratallo nijalu nirbeetiga cheppadu kabatte chandasavadulu ayannu edo cheyalanukoni emee cheyaleka vimarsalu chesaru,


 5. ఈ పుస్తకం నేను చదవలేదు. ఇప్పుడు చదవాలి.


 6. srinivas.kudupudi

  మీ విశ్లేషణ బాగుంది .


 7. మైత్రేయి గారూ..
  పుస్తకాలను చదవటం నాకు ఇష్టమైన వ్యాపకాలలో ఒకటి.
  చలం నాకు పరిచయమయి కూడా సంవత్సరమే దాటింది.
  కాకపోతే.. వీలైనంత ఎక్కువగా చలాన్ని చదివేందుకు ప్రయత్నిస్తున్నాను.
  చలం ఆత్మకధతో మొదలుపెట్టాను. కానీ మ్యూజింగ్స్ పూర్తిగా చదవలేకపోయాను.
  చలం అంటే ప్రత్యేకమైన అభిమానం, ద్వేషం లేకపోయినా..
  ఆయన ఎందుకు అంత వివాదాస్పదుడయ్యాడని మాత్రం తెలుసుకోవాలనుకుంటున్నాను.
  ఆ ప్రయత్నంలోనే శశిరేఖ కనిపించింది.
  అర్ధం చేసుకున్నదీ, అనిపించినదీ వ్రాశాను.
  అభినందనలకు ధన్యవాదాలు.
  – నరేష్ నందం.


  • varaprasad

   oneyearlo chalanni intabaga chadivarante great,antakante baga rasaru,25 yearsga chaduvutunevunna rani clarity meeru rasindi chadivaka kasta vacchindi,babbabu kasta kalee unnappudu chalam gurincho,sree sree gurincho nalugu matalu mail cheyandi anandistam.


 8. చాల బాగా వ్రాసారు. మీ శ్వేత మయూరం లాగే మీ పుస్తక వ్యాఖ్యానం కూడా స్వచ్చం గా ఉన్నది.
  మీరు అనుకొన్నది వ్రాసారు ఎవరో రుద్దిన అభిప్రాయలు , ఎవరు ఏమనుకొంటారో అని కాక.
  పుస్తకం గూర్చి వ్రాసేటప్పుడు ఆ యా పాత్రలను విశ్లేషించాలి కాని రచయితను, అతని వ్యక్తిత్వాన్ని కించపరచ రాదనే ప్రాధమిక జ్ఞానం లేని వాళ్ళు వ్యాఖ్యలు వ్రాస్తున్న ఈ రోజుల్లో ఇది ఈ సైట్ మళ్ళి చూసేలా చేసింది.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

చలం గారి ఉత్తరాలు వీరేశలింగం గారికి

వ్యాసకర్త: Halley ******* నేను చలం గారి రచనలు పెద్దగా చదివింది లేదు. “మైదానం” చదివాను ఎప్పు...
by అతిథి
8

 
 

అసాధారణ రచయిత – చలం గురించి నండూరి

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. చ...
by అతిథి
17

 
 

పురూరవుడూ, శారదా శ్రీనివాసన్ గారూ, చలం, నేనూ!

అనగనగా ఓరోజు ప్రొద్దుటూరులో పెళ్ళికెళ్ళి, బోరు కొట్టి, రోడ్లను సర్వే చేస్తూ ఉంటే, ఓ ప...
by సౌమ్య
14

 

 

ప్రేమలేఖలు – చలం

వ్యాసం రాసి పంపిన వారు: రమణి చలం గారి ప్రేమలేఖలు గురించి రాయడానికి కొంచం సాహసం చేసాన...
by అతిథి
13

 
 

చం’చలం’-మైదానం

వ్యాసం రాసి పంపినవారు: సింధు “అక్కా, చలం ‘మైదానం’ movie గా వచ్చిందా?” అక్క : లేదనుకు...
by అతిథి
 

 
 
రెండు తురగా జానకీరాణి పుస్తకాలు

రెండు తురగా జానకీరాణి పుస్తకాలు

రాసి పంపిన వారు: మాలతి నిడదవోలు (thulika.net) 1. మాతాతయ్య చలం (వ్యాసం), 2. చేతకాని నటి (కవితలు) 50, 60 దశ...
by అతిథి
16