కొత్త కెరటాలు

పుస్తకరూపంలో వచ్చిన ఆంధ్రవారపత్రిక “తెలుగు వెలుగులు” గురించి సూరంపూడి పవన్ సంతోష్ గతవారం పుస్తకంలో పరిచయం చేశారు. అలాగే తెలుగు పెద్దల్ని చిన్న చిన్న వ్యాసాలతో పరిచయం చేసే ప్రయత్నం మళ్ళీ 1970ల్లో ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో జరిగింది. వారు పెట్టుకొన్న శీర్షిక – కొత్త కెరటాలు. ఆ కొత్త కెరటాల్ని ఒక పుస్తకంగా మళ్ళీ ఐ.వెంకట్రావుగారి మోనికా బుక్స్ సంస్థే “తెలుగు వెలుగులు” ప్రచురించిన మరు సంవత్సరమే ప్రచురించారు. ఈ పుస్తకానికీ మంత్రసాని పనిచేసింది శ్రీరమణగారే.

1970 సెప్టెంబరులో ‘ఆరుద్ర’తో మొదలుబెట్టి డబ్భైవారాలు సాగి ‘ఆధునిక తెలుగు వనిత’తో ఈ కొత్త కెరటాలు శీర్షిక ముగిసింది. అప్పట్లో నాకు తెలీలేదు కానీ, తెలుగు వెలుగులు శీర్షికని అనుసరించినట్లే కనిపిస్తుంది. ఐతే రేఖా చిత్రాలు ఉండేవి కాదు. సాధారణంగా పరిచయం చేయబడుతున్న వ్యక్తి ఫొటోతో ఒక పేజీలో ఈ వ్యాసాలు ఉండేవి. పత్రిక మొదట్లోనే ఒక ఎడమపక్క పేజీలో ఈ శీర్షిక ఉండేదని గుర్తు. అప్పట్లో ప్రతివారం తప్పకుండా చదివేవాణ్ణి.

“తెలుగు వెలుగులు” కాలంలో ఆంధ్రవారపత్రికలో సహసంపాదకులుగా ఉన్న నండూరి రామ్మోహనరావుగారు తర్వాత ఆంధ్రజ్యోతిలోకి మారారు. దినపత్రిక వ్యవహారాలు చూస్తుండేవారు. “కొత్త కెరటాలు” శీర్షిక ప్రారంభించటంలో వారి పాత్ర ఎంత ఉందో తెలీదు కానీ (ఎంతో కొంత ఉండే ఉంటుందని నమ్మకం) ఈ శీర్షికలో ఎన్నార్, రామం, శేఖర్ పేర్లతో చాలా వ్యాసాలు వ్రాశారు. వ్యాసాల్లో ఎక్కువ భాగం వ్రాసింది మాత్రం అప్పట్లో వారపత్రిక సంపాదకులుగా వ్యవహరిస్తున్న పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు (పి.ఎస్). ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (ఐ.ఎస్), భరాగో కూడా చాలా వ్యాసాలు వ్రాశారు. సంగీతజ్ఞుల గురించి ఎక్కువగా నూకల, క్రీడాకారుల గురించి తాజీప్రసాద్ (ఆయన ఆంధ్రజ్యోతిలో క్రీడావిశేషాలు వ్రాస్తుండేవారు) వ్రాశారు. శంకరమంచి (సత్యం), పన్నాల (రంగనాథ భట్టు), రజని (బాలాంత్రపు రజనీకాంతరావు), హరి (పురుషోత్తం), ఇంకొందరు కొన్ని పరిచయాలు వ్రాశారు.

ఈ వ్యాసాల్లో పరిచయం చేయబడ్డవారు:

రచయితలు: ఆరుద్ర, దాశరథి, సినారె, ఆత్రేయ, అజంతా, కుందుర్తి, రావిశాస్త్రి, బీనాదేవి, రంగనాయకమ్మ, కౌసల్యాదేవి, యద్దనపూడి, లత, కాళీపట్నం రామారావు, గొల్లపూడి మారుతీరావు, ముళ్ళపూడి వెంకటరమణ, దిగంబర కవులు, వరవరరావు, కొమ్మూరి వేణుగోపాలరావు, ఎన్.ఆర్.నంది, గణేష్ పాత్రో, గజ్జెల మల్లారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి, కె.వి. రమణారెడ్డి, మాలతీచందూర్, రావి కొండలరావు, రారా, ఎద్దుల బాలశౌరిరెడ్డి

భాషా శాస్త్రవేత్తలు: ప్రొ. భద్రిరాజు కృష్ణమూర్తి, చేకూరి రామారావు, తూమాటి దోణప్ప

సంగీతకారులు: బాలమురళీకృష్ణ, వోలేటి వెంకటేశ్వర్లు, నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, ఏల్చూరి విజయరాఘవరావు, దండమూడి రామమోహనరావు, చిట్టిబాబు, నేదునూరి కృష్ణమూర్తి, వాసా కృష్ణమూర్తి, షేక్ చినమౌలా, అన్నవరపు రామస్వామి, టంగుటూరి సూర్యకుమారి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.

క్రీడాకారులు: జి.ఎస్. దీక్షిత్, మహమ్మద్ హసన్ (చదరంగం), జగన్నాధ్ (టేబుల్ టెన్నిస్), క్రికెటర్ మంగళహళ్ళి లక్ష్మీనరసు జయసింహ, బాడ్మింటన్ పిచ్చయ్య

నర్తకులు: యామినీ కృష్ణమూర్తి, కోరాడ నరసింహారావు, లంకా అన్నపూర్ణ, వేదాంతం సత్యనారాయణ శర్మ, సంపత్కుమార

రంగస్థల కళాకారులు: కుప్పిలి వెంకటేశ్వరరావు (కె.వి.రావు), పద్మలత, మిమిక్రీ వేణుమాధవ్, నండూరి సుబ్బారావు (ఏ.ఐ.ఆర్)

చిత్రకారులు: బాపు, చంద్ర, కొండపల్లి శేషగిరిరావు, ఎస్.వి.రామారావు, సంజీవదేవ్

శాస్త్రజ్ఞులు: డా. యలవర్తి నాయుడమ్మ, డా. ఓ.ఎస్.రెడ్డి, ప్రొ. సుభద్రాదేవి, ప్రొ. రామచంద్రరావు, తెలుగు టైప్‌రైటర్ నిర్మాతలు ప్రకాశరావు-కామేశ్వరరావు

వైద్యనిపుణులు : డా. సుభద్రాదేవి, డా. రామలింగస్వామి,

ఇంకా, ప్రచురణకర్త మద్దూరి నరసింహారావు (ఎమెస్కో), గ్రంథాలయోద్యమ కార్యకర్త వెలగా వెంకటప్పయ్య.

ఈ శీర్షికలో రాజకీయ నాయకులెవర్నీ పరిచయం చేయలేదు.

పరిచయాలు పొగడ్త వ్యాసాలుగా మిగిలిపోలేదు. అవసరమైనచోట్ల విమర్శలూ ఉన్నాయి. ముఖ్యంగా పురాణంగారిచేతిలో కొన్నిసార్లు పొగడ్తలకన్నా వెటకారాలే ఎక్కువ కనిపించాయి. కౌసల్యాదేవిగారి పరిచయం శీర్షిక: వక్రభ్రమణం. లత – ఒకప్పుడు రాధ, ఇప్పుడు యశోద అట. ముళ్ళపూడి వెంకటరమణగారు రాయని భాస్కరుడయ్యారు. అక్కడక్కడా వెటకారాలు ఉన్నా, విషయానికే పెద్ద పీట. వివిధ రచయితలు వ్రాయటం వల్ల శైలీభేదాలున్నా, క్లుప్తంగా, అర్థవంతంగా వ్రాయాలని ప్రయత్నించడం వల్ల ఈ వ్యాసాలన్నీ సమగ్రంగా, చదివించేట్లుగా ఉన్నాయి. అజంతా పై నంపాసా వ్రాసిన దీర్ఘ కవితలా ఉన్న వ్యాసం మిగతా వ్యాసాలకంటే పెద్దది.

కొన్ని మెరుపులు, చురకలు:

ఆరుద్రకుమాత్రం ఎక్కదలచుకున్న రైలు సకాలానికే వచ్చింది.

వద్దనే మిత్రుల మాట తోసేసి వచనగేయం పాడడం, అర్దాంగి పిలచినా పలక్కుండా అర్థరాత్రి కవిత్వం రాయడం అతని (కుందుర్తి) హాబీలు…కొత్తను సృష్టించటానికి కోతి వలె చిందులు తొక్కక్కర్లేదంటూ ఆయన చిందులు తొక్కుతారు.

ఎవరింటికేనా వెళ్ళినప్పుడు వారి గురించి వ్రాసెయ్యటం, మనింటికెవరైనా వచ్చినప్పుడు వచ్చిన వారి గురించి వ్రాసెయ్యటం ‘రచయిత్రు’లకి అలవాటు చేసింది మాలతీచందూర్ గారేనంటారు.

చిన్నప్పుడెప్పుడో ఆయన (రావిశాస్త్రి) శివుడి పార్టీ. ఇప్పటికీ ఆయనకి పార్టీలంటే ఇష్టం.

పాప్యులారిటీ ఒక నేరం కాకపోతే బాపు నిజమైన సృజనాత్మక చిత్రకారుడు.

తెలంగాణా సాహిత్యోద్యమం ఒక రత్నాల వీణ అయితే, ఆ వీణకు రాగతంత్రి దాశరధిగా, తాళతంత్రి నారాయణరెడ్డిగా జ్ఞాపకం వస్తారు.

జ్వాలాముఖి (రాఘవాచారి) సంస్కృతనాటకాల్లో ధూర్తవిటుణ్ణి మించిన రణపెంకి.

అతను (గజ్జెల మల్లారెడ్డి) రైటర్ గా గొప్పవాడా, ఆపరేటర్ గా గొప్పవాడా అంటే చెప్పటం కష్టమేమీ కాదు. గొప్ప ఆరేటర్ అని తడుముకోకుండా చెప్పవచ్చు.

అజంతాకు ఆర్డర్ అంటే గిట్టదు. డిజార్ఢర్ అంటే ఇష్టం.

తెలుసుకోవలసిన చాలామంది తెలుగు వ్యక్తుల గురించి ఇతరత్రా తెలియని చాలా విషయాలు ఈ వ్యాసాలలో ఉన్నాయి. ఇటీవలే మరణించిన కొండపల్లి శేషగిరిరావు, భద్రిరాజు కృష్ణమూర్తిల గురించి యూలజీలు చదివాక వాళ్ళు కొత్తకెరటాలుగా ఉన్నరోజుల్లో వ్రాసిన వ్యాసాలను మళ్లీ చదవటం కొద్దిగా వింతగా అనిపించింది.

బహుశా నాకు, ఇంకొద్దిమందికే గుర్తున్న రెండు విషయాలు – డా. సుభద్రాదేవిపై “స్త్రీ ధన్వంతరి” వ్యాసం వ్రాసింది మా కాలేజీ పూర్వ విద్యార్థి, తదుపరి రాజ్యసభ సభ్యుడుగా పనిచేసిన డాక్టర్ యలమంచిలి శివాజీ. ఈ వ్యాసం వచ్చినప్పుడు డా. సుభద్రాదేవి మా గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢైరెక్టరుగా పనిచేసిన డా. పులిమిరి రామలింగస్వామిని పరిచయం చేసిన కె.వి. – నా గురువు, మార్గదర్శి, మిత్రుడు డా. కడియాల వాసుదేవరావుగారు (బయోకెమిస్ట్రీ ఆచార్యులు). “కింగ్‌సైజు సిగరెట్‌లాగా బారుగా, ఆప్తమిత్రుల అభిప్రాయభేదంలా సన్నగా ఉండి…” అంటూ సాగే ఆ వ్యాసం ప్రారంభం నాకు ఇన్నాళ్ళ తర్వాత కూడా గుర్తుంది.

పుస్తకాల పురుషుడు అంటూ వెలగా వెంకటప్పయ్యగారిని పరిచయంచేసిన రాధాకృష్ణ శ్రీరమణగారేమో అని నా అనుమానం. మేటి చతురంగ కిరీటి అంటూ మహమ్మద్ హసన్ని పరిచయం చేసింది ఆరుద్ర అని గుర్తు (ఈ పుస్తకంలో వ్యాసరచయిత పేరు లేదు). నాకు హసన్ కీర్తి ముందు తెలిసింది ఈ వ్యాసంతోనే. కొన్నేళ్ల తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్ లో ఇంటర్ మెడికల్ ఛెస్ టూర్నమెంట్ రిఫరీగా ఉన్న హసన్ సాబ్ తో ఛెస్ ఆడి ఓడిపోవడం ఒక మంచి జ్ఞాపకం.

ఈ పుస్తకంలో ఉన్నవారిని 1970లలో కొత్త కెరటాలు అనటం కొద్దిగా అతిశయోక్తే. చాలామంది అప్పటికే పాత కెరటాలు (లబ్ధప్రతిష్టులు). కొన్ని కెరటాలు అప్పటికే అలల స్థాయికి తగ్గాయని కూడా అనుకోవచ్చు. కాని అప్పటి 25ఏళ్ళ వరవరరావు, దాదాపు అంతే వయసున్న చంద్ర, అప్పటి వర్థమాన గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వంటివారికి మాత్రం ఈ శీర్షిక తగిందే.

అప్పట్లో అంత పేరున్న లంక అన్నపూర్ణ, పద్మలతవంటి వారి గురించి ఆ తర్వాత ఎప్పుడూ విన్న గుర్తు రావడం లేదు. ఈ కొత్త కెరటాల్లో చాలా భాగం బెజవాడ చుట్టూనే తిరిగాయి అని ఒక అపవాదు ఉంది అన్నారు శ్రీరమణగారు ముందు మాటలో. నాకు అలా అనిపించలేదు.

పుస్తకంలో అచ్చుతప్పులు దాదాపుగా లేనట్టే. అక్షరాలు ఇంకొద్దిగా పెద్దవిగా ఉండి, మార్జిన్లు ఇంకొద్దిగా ఉంటే చూడ్డానికి, చదువుకోవడానికి ఇంకా బాగుండేది. పుస్తకంగా ప్రచురించి ఈ వ్యాసాలు మొదటిసారో, మరోసారో చదువుకొనే అవకాశమిచ్చినందుకు శ్రీరమణగారికి, మోనికా బుక్స్ కు కృతజ్ఞతలు చెప్పటం మన ధర్మం. పుస్తకాలు కొనటంలో మన అలవాట్లు తెలిసినవాడిని కాబట్టి తెలుగు వెలుగుల్లా ఈ పుస్తకమూ విశాలాంధ్ర వెనుక అలమరల్లో ఇంకా ఉన్నా ఆశ్చర్యపడను.

* * *

అలనాటి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక
కొత్త కెరటాలు
ప్రముఖుల వ్యాససంపుటి
అక్టోబరు 2003
మోనికా బుక్స్
ప్లాట్ నం. 103, రోడ్ నం. 71
నవనిర్మాణ్ నగర్, జూబ్లీ హిల్స్
హైదరాబాద్ – 500 033
156 పేజీలు. 75 రూ.

You Might Also Like

5 Comments

  1. Srinivas Nagulapalli

    మంచి పుస్తకానికి మంచి పరిచయం ఎంతొ ఓపికతో అందించినందుకు జంపాలగారికి కృతజ్ఞతలు.

    మంచి వచనం యొక్క రుచిని అందించడం పుస్తకం యొక్క హైలైట్! “తెలుగు వెలుగులు” పుస్తకాన్ని గుర్తుకు తెస్తుంది కూడా. రెండు మూడు పేజీలు మించకుండా, సంగ్రహంగా, రాసిన తేదీనాటికి సమగ్రంగా, అయినంత సమతౌల్యంతో వ్యక్తుల పరిచయాలను అందించిన కృషి ప్రశంసనీయం. ఎప్పుడో అచ్చైన వాటిని ఏరి కూర్చి మళ్ళీ అందించడం మరింత ప్రశంసనీయం.

    సాధారణంగా “అమ్మ” అన్న అక్షరాలతో అంతమయ్యే పేర్లు ఆడవారికి ఉంటాయి, అందుకు భిన్నంగా అనిపించింది డాక్టర్ నాయుడమ్మ గారి పేరు. డాక్టర్ నాయుడమ్మ గారి పరిచయం లో వారు మాడిపోయిన బల్బులు తిరిగి ఉపయోగించొచ్చు అని చెప్పారన్న అంశం గుర్తుండిపోయింది. (అప్పట్లో) బల్బుల లో వాడే తీగల మెటల్స్ ను ఎంతో ఖర్చుతో దిగుమతిచేసుకునేవారట. తిరిగి ఉపయోగిస్తే ఏంతో ఖర్చు ఆదా. ఆ ప్రయత్నం వివరాలు ఇంకేమైనా ఇంకెక్కడైనా దొరుకుతాయా అన్న ప్రశ్న మిగిల్చింది. టెర్రరిస్ట్ విమాన కూల్చివేతలో అంతటి ప్రతిభామూర్తి, శాస్త్రవేత్త, పరిపాలనా దక్షుని దుర్మరణం గురించి ఒక్క వాక్యమైనా చేర్చకపోవడం ఆశ్చర్యం.

    ఈ పుస్తకంలో ప్రశంసకు నోచుకోని అర్హతను సంపూర్ణంగా సంపాదించుకున్నది ఒక్కటే! ముందు మాట సైతం అందించిన పుస్తకం, కనీసం ముద్రణకు ముందుగా ఒకటి రెండు మాటలైనా పుస్తకంలోని పరిచయాలకు చేర్చి పునర్ముద్రణ కాలం నాటి పాఠకులకు సహాయంగా update చేయకపోవడం, ఎంతసేపూ వెనకచూపే కాని, ఏ మాత్రం ముందు చూపు లేదు అనిపించింది. ఒక పేజీ సాంతం ముందు మాట వ్రాసిన శ్రీరమణ గారు కూడా దీన్ని గుర్తించకపోవడం ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం. కనీసం గతించిన వారి వివరాలను, ఫలాన నాడు పాపం పోయారని చెప్పకపోవడం పెద్ద వెలితి. ఉపయోగపడే రెండు మాటలను వివరాలను ఒరిజినల్ కు ఏ ఇబ్బంది కలిగించకుండా, కింద బ్రాకెట్లు పెట్టో, లేక చిన్న సైజు అక్షారలతోనో, ఇంక మరేదో విధంగానైనా పాఠకునికి అందించకపోవడం, పైసలిచ్చి పుస్తకం కొన్న పాఠకుని పట్ల గౌరవం చూపించ లేదనిపించింది.
    ======
    విధేయుడు
    _శ్రీనివాస్

  2. pavan santhosh surampudi

    పుస్తకాలు కొనటంలో మన అలవాట్లు తెలిసినవాడిని కాబట్టి తెలుగు వెలుగుల్లా ఈ పుస్తకమూ విశాలాంధ్ర వెనుక అలమరల్లో ఇంకా ఉన్నా ఆశ్చర్యపడను.
    ఈ పుస్తకం దొరుకునా? దొరకదా? అనుకుంటున్న నా ఆశకి ఆయువు పోశారు. మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు కృతఙ్ఞతలు.

  3. Jampala Chowdary

    పరిశోధించాల్సిన విషయమే.

  4. Srinivas Vuruputuri

    >> సంగీతజ్ఞుల గురించి ఎక్కువగా నూకల…
    నూకల వారి గురించి ఇందులో ఉన్న వ్యాసాన్ని రాసింది చాగంటి కపాలేశ్వరరావు గారు అనుకుంటా. శ్రీపాద పినాకపాణి శిష్యులు ఈ కొత్త కెరటాల్లో నలుగురున్నారు. తెలుగు వెలుగుల్లో పినాకపాణి గారున్నట్లు లేదు.

  5. Sreenivas Paruchuri

    “కింగ్‌సైజు సిగరెట్‌లాగా బారుగా, ఆప్తమిత్రుల అభిప్రాయభేదంలా సన్నగా ఉండి…” అంటూ సాగే ఆ వ్యాసం … Isn’t this Mullapudi’s sentence on Chakrapani? Regards, Sreenivas

Leave a Reply