కన్యాశుల్కం – 19వ శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు
వ్రాసిన వారు: భైరవభట్ల కామేశ్వరరావు
(ఇవాళ గురజాడ 150వ జయంతి సందర్భంగా ఈ వ్యాసం.)
*************
నిజానికీ పుస్తకానికి యింత చిన్న పరిచయం ఏమాత్రం న్యాయం చెయ్యదు. ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యడానికి నాకు పెద్ద అర్హత కూడా లేదు. అయినా దీని గురించి హడావిడిగా యీ చిరుపరిచయాన్ని వ్రాయడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, యీ రోజు గురజాడ అప్పారావుగారి 150వ జయంతి కావడం.
కన్యాశుల్కం నాటకాన్ని గురించి వందల సంఖ్యలో వ్యాసాలు వచ్చాయి. పుస్తకాలు కూడా వెలువడ్డాయి. నాకు తెలిసినంతలో యివన్నీ చాలావరకూ కేవలం ఆ నాటకం మీదనే దృష్టి సారించి చేసిన విశ్లేషణలు. నాటక నిర్మాణం, పాత్ర చిత్రణ, సంభాషణలు, అందులోని సాంఘిక దురాచారాలు, ప్రదర్శనీయత మొదలైన అనేక ఆంశాలను విశ్లేషించే విమర్శ అది. అది రచనాపరైక దృష్టి. అంటే ఒక రచనను విమర్శించేటప్పుడు కేవలం ఆ రచనకు అంతర్గతమైన విషయాలపై మాత్రమే దృష్టి నిల్పడం. ఏ రచనకైనా అలాంటి విమర్శ అవసరమే. అందులోనూ కన్యాశుల్కం లాంటి క్లాసిక్‌ని విశ్లేషించడానికి విస్తృతమైన విమర్శే కావలసి వస్తుంది. అయితే, యిలాంటి విమర్శకు ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి దాటాక యిక కొత్తగా చెప్పేందుకేమీ ఉండదు. కన్యాశుల్కం మీద వచ్చిన శతాధిక విమర్శలలో అనేకం చర్వితచర్వణాలవ్వడానికి యిదొక కారణం. ఈ పుస్తకం మాత్రం అలాంటిది కాదు. ఇది అసలు మామూలు విమర్శ కాదు. పరిశోధక విమర్శ. అంటే, ఎన్నెన్నో విషయాలను సేకరించి, సమీకరించి, విశ్లేషించి, ఆ విశ్లేషణలోంచి కొన్ని సిద్ధాంతాలను సూత్రీకరించడం అన్నమాట. ఇలాంటి విమర్శ తెలుగులో చాలా అరుదుగా కనిపిస్తుంది. పుస్తకం పేరే యిందులోని విషయ విస్తృతిని సూచిస్తోంది కదా! పందొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన ఆధునిక భారతీయ నాటక సాహిత్యం మొత్తం దీని పరిధి. బెంగాలీ, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, హిందీ, ఒరియా, కన్నడ భాషల్లో వచ్చిన సాంఘిక నాటకాల అధ్యయనం ఇందులో ఉంది. ప్రపంచ సాహిత్యానికి కూడా కొంత స్థానముంది. ప్రత్యేక ప్రకరణాలు కేటాయించకపోయినా, తమిళ మళయాల నాటకాల ప్రస్తావన కూడా ఉంది. అంతటి విశాలమైన వేదికపై కన్యాశుల్కాన్ని నిలబెట్టి, ఆ కాలంలో ఆయా భాషలలో వచ్చిన ఆధునిక నాటకాల ఆవిర్భావ వికాసాలనూ, వాటి వెనకనున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తూ, ఆ నాటకాలతో కన్యాశుల్కాన్ని పోలుస్తూ, కన్యాశుల్కం విశిష్టతను విశ్లేషించే గ్రంథమిది. దీనినే తులనాత్మక పరిశీలన/పరిశోధన అంటారు. ఇంతటి విస్తృతమైన పరిశోధన చేసి దానిని గ్రంథస్థం చేసినవారు డా. యు.ఎ. నరసింహమూర్తిగారు (ఇతనుకూడా మా విజయనగరం అతనే! :).
తులనాత్మక పరిశోధన వలన చాలా ప్రయోజనాలున్నాయి. ఒక ఊళ్ళో ఒక పెద్ద మేడ ఒకటి ఉందనుకుందాం. అది ఆ ఊరంతటికీ పెద్ద మేడ. కాని అది ఆ జిల్లా కంతటికీ పెద్ద మేడా, రాష్ట్రానితంతకీ లేదా ప్రపంచానికంతకీ పెద్ద మేడో కాదో ఎలా తెలుస్తుంది? ఆ ఊరిని దాటి బయట ప్రపంచంలో ఉన్న మేడలను కూడా చూడగలిస్తే, వాటితో పోలిస్తే యీ మేడ స్థానమేమిటో తెలుస్తుంది. అలాగే ఒక రచనను ఇతర భాషా రచనలతో తులనాత్మకంగా పరిశీలిస్తే, ఆ రచన గొప్పదనానికి సంబంధించి కొంత సార్వజనీనమైన నిర్ధారణలు చేయగలిగే అవకాశం లభిస్తుంది. రచన విలువను కొలిచే కొన్ని అదనపు తూకపు రాళ్ళు దొరుకుతాయి. ఉదాహరణకు, తులనాత్మక పరిశీలన ద్వారా, మధురవాణికి సరితూగే పాత్ర భారతీయ నాటకాలలో ఎక్కడా లేదని సాధికారికంగా చెప్పగలిగారు నరసింహమూర్తిగారు. అంతే కాదు, విశ్వసాహిత్యంలోని ప్రసిద్ధమైన కేమిలీ, విలీ, నోరా, లేడీ జూలీ వంటి స్త్రీపాత్రలను కూడా పరిశీలించి వాటిలోని పరిమితులను చూపించి, “మధురవాణి పాత్రలో క్రమోన్మీలితము, మానవతాపూర్ణము, లోపరహితము, సహజము, స్వాభావికము అయిన సమగ్రత కనిపిస్తుందని” కచ్చితంగా చెప్పగలిగారు. విశిష్టతను సాధికారికంగా నిరూపించడమే కాక, తులనాత్మక పరిశీలన కొన్ని పొగడ్తలను అతిశయోక్తులుగా గుర్తించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, “మన దేశ భాషలన్నింటిలోనూ, పూర్తిగా వచనంతో అందులోనూ పాత్రోచితమైన వ్యవహార శైలిలో మొట్టమొదటి సారిగా నాటకం రాసింది గురజాడ అప్పారావుగారనే అనుకుంటాను” అన్న శ్రీశ్రీ అభిప్రాయం తప్పని యీ పరిశోధన ద్వారా నిర్ద్వంద్వంగా తేలింది. ఈ విధంగా విశ్వసాహిత్యంలో, ముఖ్యంగా ఆధునిక భారతీయ నాటకాలలో, కన్యాశుల్కం స్థానాన్ని సరిగ్గా అంచనా వెయ్యడానికి యీ తులనాత్మక పరిశోధన ఎంతగానో ఉపయోగపడింది.
ఒక రచనను తూచేందుకే కాదు, దాన్ని సరిగా అర్థం చేసుకొనేందుకు కూడా తులనాత్మక పరిశీలన ఉపయోగ పడుతుంది. ఒక ఆలయం ఉంది. అందులో మనోహరమైన శిల్పాలున్నాయి. సామాన్య ప్రేక్షకులు వాటిని చూసి ఆనందిస్తారు. అయితే ఆ శిల్పాలలో అనేక రీతులుండవచ్చు. కొన్ని శిల్పాలు కాకతీయ శిల్ప రీతిలో, మరికొన్ని దక్షిణాది రీతిలో, యిలా రకరకాలుగా ఉండవచ్చు. వాటిలో ఆ అంతరాలు, వైవిధ్యాలు సామాన్య దృష్టికి అందవు. వివిధ శిల్పశాస్త్ర రీతులతో పరిచయం ఉన్నవారు వాటిని గ్రహించగలుగుతారు. అలా గ్రహించ గలిగినప్పుడు మరింత గొప్ప అనుభూతిని పొందగలుగుతారు. ఒక రచనలో కూడా, ఇలా సామాన్య పఠనానికి అందని సూక్ష్మ విషయాలు తెలుసుకోగలిగినప్పుడు మనసుకు ఒక కొత్త చైతన్యం వస్తుంది. అలాంటి కొత్త కాంతిని ప్రసరించడానికి తులనాత్మక పరిశీలన ఎంతో దోహదపడుతుంది. ఉదాహరణకు కన్యాశుల్కంలో మొదటి అంకంలోనే గిరీశం వెంకటేశంతో మాట్లాడుతూ ఇలా అంటాడు:
“యిదే బంగాళీ కుఱ్ఱవాడైతే యేం జేస్తాడో తెలిసిందా? తాతయేది, తండ్రియేది కఱ్ఱపట్టుకొని చమ్డాలెక్కగొడతాడు…”
ఇది చదివినప్పుడు – ఇక్కడ గిరీశం బెంగాలీ కుఱ్ఱవాళ్ళ గురించి ఎందుకలా మాట్లాడాడు? ఆ కాలంలో బెంగాలీ కుఱ్ఱవాళ్ళందరూ అలా పొగరుగా ఉండేవారా? – మొదలైన ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ పుస్తకంలో, ఆ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. విలియం డరోజియో అనే అతడు కలకత్తాలో పుట్టి పెరిగిన యురేషియన్. అతడు సనాతన హైందవ ఆచారాలను తూర్పారబట్టి, పెద్దలను ధిక్కరిస్తూ, దైవదూషణ చేస్తూ ఒక రకమైన తిరుగుబాటును తీసుకువచ్చాడు. అతని అనుయాయిలను డరోజియన్లు అనే వారు. వారు చివరికి వ్యసనపరులుగా, నిర్వ్యాపారులుగా, రాజకీయ మత సాంఘిక విషయాలతో శుష్కోపన్యాసాలు చేసే మిథ్యాభిమానులుగా తయారయ్యారు. వీరిని నిరసిస్తూ మధుసూదన దత్తా బెంగాలీలో “ఎకైకీ బోలే సభ్యతా” అనే ప్రహసనాన్ని రచించారు. కన్యాశుల్కం నాటకంలో గిరీశంలో సరిగ్గా యీ డరోజియన్ల లక్షణాలే కనిపిస్తాయి. పైన అతడన్న మాటలలో “బంగాళీకుఱ్ఱవా”డన్న పదంలో సూచించినది యీ డరోజియన్లనే. దాని వెనకాల యింత కథ ఉన్నదన్న మాట!
రచన నేపథ్యాన్ని గురించి ఒక విస్తృతమైన అవగాహన కలగడానికి కూడా తులనాత్మక పరిశీలన ఉపయోగపడుతుంది. గొప్ప రచన యేదైనా హఠాత్తుగా ఆకాశంనుండి ఊడిపడదు. దాని వెనక ఒక చారిత్రక నేపథ్యం, సామాజిక వాతావరణం ఉంటాయి. వాటిని అర్థం చేసుకోడానికి తులనాత్మక పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం చదివితే, పందొమ్మిదవ శతాబ్దిలో, వివిధ భాషా సమాజాలలో నెలకొని ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల గూర్చి మనకు తెలుస్తుంది. ఆంధ్రదేశంలో పరిస్థితులకు, భారతదేశంలోని యితర ప్రాంతాల పరిస్థితులకు మధ్యనున్న సామ్యము, భేదము ఆకళింపుకొస్తాయి. ఈ నేపథ్యంలో కన్యాశుల్కం నాటకాన్ని మరింత సరిగ్గా అర్థం చేసుకోడానికి వీలు చిక్కుతుంది. దీని వల్ల కొన్ని ప్రచారంలో ఉన్న అపప్రథలు తొలగిపోయే అవకాశం కూడా కలుగుతుంది. ఉదాహరణకు, కన్యాశుల్కం నాటకంలో ప్రస్తావించిన సమస్యలు కేవలం ఒక ప్రాంతపు కులానికి మాత్రమే పరిమితమైనవని ఒక దురభిప్రాయం ప్రచారంలో ఉంది. కాని, “భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన సమస్యలే ఈ నాటకేతివృత్తంలో ఉన్నాయి గానీ కొత్త సమస్య ఒక్కటీ లేదు. కన్యావిక్రయం, బాల్య వివాహం, వితంతు పునర్వివాహం, వేశ్యాగమనం, మూఢాచారాలు, అవినీతి, సనాతన నూతన వ్యవస్థల మధ్య ఏర్పడిన సంఘర్షణ – ఇన్ని ప్రధాన సమస్యలు కన్యాశుల్కంలో కనిపిస్తాయి. వివిధ భారతీయ భాషలలో నాటకకర్తలు ఈ సమస్యల మీద గురజాడ కంటే ముందుగానే నాటకాలు రాసారు. అయితే ఇన్ని సమస్యలనూ ఏ నాటకకర్తా స్వీకరించలేదు. ఇందులో ఒకటి లేదా రెండు సమస్యలను మాత్రమే వారు ప్రధానంగా ఎంచుకున్నారు.” అని, నరసింహమూర్తిగారి మాటల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే, నాచ్-ఏంటీ నాచ్ సమస్య వెనకనున్న కారణాలను, కన్యావిక్రయం, వితంతు పునర్వివాహము మొదలైన విషయాలలో ఆనాటి భారతదేశపరిస్థితులను వివరంగా అర్థం చేసుకోడానికి యీ పుస్తకం చాలా తోడ్పడుతుంది.
ఒక గొప్ప రచన వెలువడేందుకు ప్రతిభ ఒక్కటే సరిపోదు. వ్యుత్పత్తి కూడా చాలా అవసరం. తులనాత్మక పరిశీలన ద్వారా ఆ వ్యుత్పత్తి ఎంతటిదో తెలిసే అవకాశముంది. ఉదాహరణకు, రచనాశైలిలో, పాత్ర చిత్రణలో పాశ్చాత్య నాటకాల ప్రభావం కన్యాశుల్కం మీద ఎలా ఉన్నదో తెలియడం ద్వారా గురజాడకు ఆంగ్ల సాహిత్యమ్మీద ఉన్న పట్టెంతటిదో మనకు తెలుస్తుంది. కన్యాశుల్కంలో The Widow అనే కవితకి, కాశీనాథ్ ఘోష్ రాసిన ఒక ఇంగ్లీషు పద్యంతో ఎంత పోలిక ఉందో వివరిస్తూ నరసింహమూర్తిగారు ఇలా అంటారు,
“వితంతు సమస్యను గూర్చి తనకు ముందు కొన్ని దశాబ్దాల క్రిందట ప్రారంభమైన సాహిత్య చైతన్యాన్ని ఆకళించుకోడంలో గురజాడ కనబరచిన శ్రద్ధ ఈ రెండు పద్యాలను సరిపోల్చి చూచిన వారికి స్పష్టపడుతుంది. ఒక ఇతివృత్తాన్ని గ్రహించి దానిని సమగ్రమైన నాటకంగా మలచడానికి ఇతివృత్త సంబంధమైన భిన్న భిన్న పార్శ్వాలను, భిన్న భిన్న కోణాలనుండి అధ్యయనం చేయడానికి ఎంత శోధించాడో, సమకాలీన భావధారకు అనుకూల పక్షంలో ఎంత గాఢంగా ప్రతిస్పందించాడో, తాను గ్రహించిన సమస్యకు సంబంధించిన పూర్వ పర వస్తు సంగ్రహణకు ఎంత నిర్విరామంగా కృషి చేసాడో, సంస్కృతాంధ్ర ఆంగ్ల సాహిత్య మథనంతో పదునెక్కిన తన మేధను, ప్రజ్ఞా పాటవాలను, తన సృజన చైతన్యంలో ఎలా గర్భీకరించాడో సహృదయ సారస్వతేయులకు కన్యాశుల్కం విశదం చేస్తుంది.” కన్యాశుల్కం మాట ఎలా ఉన్నా ఈ పుస్తకం చదివితే ఆ విషయం తప్పక విశదమవుతుంది!
పరిశోధక విమర్శే అయినా, బృహత్ గ్రంధమే అయినా, ఈ పుస్తకంలో చదివించే లక్షణం పుష్కలంగా ఉంది. కేవలం సిద్ధాంతాలను వల్లెవేస్తూ పోకుండా, ఎక్కడికక్కడ దృష్టాంతాలు, ఉదాహరణలు చూపిస్తూ విశ్లేషణ సాగడం వల్ల నాకెక్కడా విసుగనిపించ లేదు. అవసరమైన చోట్ల పదునైన వాక్యాలతో చక్కని వ్యంగ్యాన్ని కూడా పండించారు. కన్యాశుల్కంలోని పాత్రల గురించి వివరిస్తూ “గాడిదకొడుకుల” గురించి వివరించిన భాగం, దానికొక మంచి ఉదాహరణ. ఒక రెండు మచ్చు తునకలు:
“ప్రపంచ సాహిత్యంలో గాడిదను గురించి ఎందరు, ఏ విషయాలను ఎలా ఎలా రాసేరో మనకు వివరంగా తెలియదు. కాని ఈ విషయంలో తెలుగు కవి మాత్రం మహాగొప్పవాడు. ఒకే ఒక్క వాక్యంలో, చమత్కారం ఉట్టిపడేలా, ఒకసారి విన్నవాడు జీవితాంతం మరిచిపోడానికి వీల్లేనట్లుగా “గాడిద కొడుకు”ను గూర్చి ఒక కందపద్యం రాసేడు కవి చౌడప్ప. ఈ విషయంలో దీనికి సాటివచ్చే పద్యం ఇంకొకటి ఎక్కడ వెదకినా దొరకదు. తెలుగువాడు కాపీ కొట్టని భావం ఇదొకటి. అటు దక్షిణదేశపు కొసలో కవి చౌడప్ప ఈ గాడిదకొడుకును కవిత్వంలో కెక్కిస్తే – ఇటు ఉత్తరాంధ్ర సాహిత్యపీఠం విజయనగరంలో మళ్ళీ గురజాడ తన నాటకాన్నంతటినీ గాడిద కొడుకులతో నడిపేడు.”
“ఈ నాటకంలో ప్రతివాళ్ళూ ఎదటివాళ్ళను గాడిదకొడుకులుగా చూపించడానికే ప్రయత్నించేరు… ఇలా ఒకర్ని ఒకరు ఎక్కువసార్లు గాడిదకొడుకుల్ని చేసుకున్నారు. కాని అగ్నిహోత్రావధాన్లను కరటకశాస్త్రి ఒక్కడే, అదైనా ఒక్కసారే గాడిదకొడుకుని చేసాడు. అది అగ్నిహోత్రావధాన్లకు అవమానకరంగా తోచిందో ఏమో! ఆ లోటు తీర్చుకోవడానికి తనను తానే మూడుసార్లు గాడిదను చేసుకున్నాడు. చెరువు గట్టున హంగామాలో “దొంగ గాడిదకొడకా! అయ్యవారేడ్రా?”, “దొంగ గాడిదకొడకా! నువ్వే వాణ్ణి నా యింట్లో పెట్టేవు”, “యీ గాడిదకొడుకు యింగ్లీషు చదువు నా కొంపముంచింది”, అంటూ వెంకటేశాన్ని సహజ వాత్సల్యంతో సంభావించడం వలన తనకు తానొక గుర్తింపు తెచ్చుకున్నాడు.”
మచ్చుకి నాకు తోచిన ఓ నాలుగు ఉదాహరణలిక్కడ యిచ్చాను కాని, 720 పేజీల యీ బృహత్ గ్రంథంలో ఉన్న వివరాలు, వివరణలు, విశ్లేషణలు లెక్కకు మిక్కిలి! ఈ పుస్తకం సమగ్రత గురించి, అందులో చర్చించబడిన విషయాల మంచి చెడ్డల గురించి, అంచనా వేసే శక్తి నాకు లేదు. ఒకటి మాత్రం చెప్పగలను, విస్తృత పరిశోధన అంటే ఎలా ఉండాలో చూపించడానికి ఈ పుస్తకం ఒక గొప్ప ప్రమాణంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ బృహత్ పరిశోధనకు నరసింహమూర్తిగారు చేసిన కృషి చాలా దొడ్డది. వివిధ భాషలలోని నాటకాలను సేకరించడానికి, ఆయా ప్రాంతాలలో పర్యటించి, అక్కడి సాహిత్యవేత్తలతో చర్చించి, ఆయా నాటకాలకు అనువాదాలు వ్రాయించుకొని, వాటిని ఒక దగ్గరకు చేర్చి పరిశోధన సాగించారని ముందుమాట వల్ల తెలుస్తోంది. పుస్తకం ప్రతిపుటలోనూ ఆ కృషి ప్రతిఫలిస్తోంది. ఈ కృషిని రాష్ట్రప్రభుత్వం వారు గుర్తించారు. ఈ ఏడాది గురజాడ 150వ జయంతి సందర్భంగా గురజాడ పేర యేటేటా సాహిత్య పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. తొలిసారిగా యీ ఏడాది యిస్తున్న పురస్కారాలలో నరసింహమూర్తిగారికి కూడా ప్రత్యేక పురస్కారం అందిస్తున్నారు. ఇంత హడావిడిగా యీ పరిచయం ఇప్పుడు వ్రాయడానికి మొదట చెప్పని రెండో కారణం ఇది! ఈ సందర్భంగా శ్రీ ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తిగారికి నమఃపూర్వక అభినందనలు. శ్రమతో, కష్టంతో కూడుకున్న పనే అయినా, యీ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది (నాకు తెలిసి అలాంటి ప్రయత్నమేదీ ఇంకా జరగలేదు). అలా జరిగినప్పుడే భారతీయ అంతర్జాతీయ సాహిత్యవేత్తలకు కన్యాశుల్కం గొప్పదనాన్ని గూర్చి మరింత అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రపంచ స్థాయిలో కన్యాశుల్కానికి మరింత గుర్తింపు లభిస్తుంది. ఈ పుస్తకంలో నరసింహమూర్తిగారన్న మాటలతో యీ పరిచయాన్ని ముగిస్తాను:
“గురజాడ అభిమానులు ‘ప్రపంచపు నూరు పుస్తకాలలో కన్యాశుల్కం ఒకటీ’ అన్నారు. ఈ మాట తెలుగువారు కాక ఇతర ప్రాంతీయభాషలవారో, ప్రపంచ భాషలవారో అంటే తృప్తిగా ఉంటుంది. ఆ అంగీకారాన్ని సాధించడం తెలుగువారి బాధ్యత”.
పుస్తకం వెల: Rs. 375
ఇది ఆన్లైన్లో కొనుక్కోడానికి avkf.orgలో లభిస్తోంది
manjari.lakshmi
పరిచయం బాగుందండి
డింగు
గురజాడ వారి కన్యాశుల్కం చదవండి.
http://samputi.com/app_data/telugu/literature/kanyasulkam.pdf
పంతుల గోపాల కృష్ణ
చాలా గొప్ప పుస్తకాన్ని పరిచయం చేశారు.ధన్యవాదాలు. నేనీ పుస్తకాన్నిఒకటి రెండు సంవత్సరాల క్రిందటే చదివాను.శ్రీ నరసింహమూర్తిగారి కృషి శ్లాఘనీయం. మీరన్నట్లు ఈ పుస్తకం ఇంగ్లీషులోకి తర్జుమా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.