తెలుగు వెలుగులు

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్
*********

ఏ పుస్తకాల షాప్ లోనో, బుక్ ఎగ్జిబిషన్ లోనో ఈ పుస్తకం మొదట చూసుంటే నేను కొనేవాడినే కాదేమో. కానీ మొదట ముళ్ళపూడి వెంకట రమణ గారి “కోతికొమ్మచ్చి”లో ఆనాటి ఆంధ్రపత్రికలో పనిచేస్తుండగా తెలుగువెలుగులు అన్న శీర్షికను శివలెంక శంభుప్రసాద్ గారు సూచించడం, కొన్ని వ్యాసాలూ వ్రాసి చూపించడం, ఆపై ఎడిటోరియల్ బృందం అందరూ శంభుప్రసాద్ గారు పెట్టిన ఒరవడి అనుసరించి ప్రముఖులైన తెలుగువారి గురించి వ్రాయడం వంటివి చదివాను. మరీ ముఖ్యంగా వ్యాసాల గురించి చెప్తూ-

“వివిధ రంగాలలో గొప్పగొప్ప విజయాలు సాధించి పేరు గడించిన తెలుగువారి గురించిన పదచిత్రాలు. పదిహేను ఇరవై వాక్యాలలో-కావ్యం లాంటి వ్యాసం వ్రాయాలి. ఆ వ్యక్తి జీవితజీవన సమగ్రరూపాన్ని పాఠకుడి మనసులో కల్పించాలి. దానిని బాపూ రేఖాచిత్రాలతో కంటికి చూపించాలి. భయం, పక్షపాతం, మొహమాటం ఉండకూడదు. ఉంటే చెడును కూడా చెప్పి నొప్పించాలి. నొచ్చుకున్నవాళ్ళు మెచ్చుకోవాలి. అన్నీ ఒక్క పేజీకి లొంగాలి.” అనీ ఆపై “ప్రతీ వ్యాసాన్నీ అయిదారుగురం చిత్రిక పట్టేవాళ్ళం.”
-అని రాయడంతో ఆ వ్యాసాలపై ఆసక్తి బాగా పెరిగిపోయింది.

కానీ నాకు అప్పుడు తెలియదు ఈ వ్యాసాలన్నీ ఒజ్జుపెట్టి అచ్చేసిన పుస్తకం ఒకటుందని. అలా ఉండగా ఒకనాడు (న) మా ఊళ్ళో(తాడేపల్లిగూడెం) విశాలాంధ్ర పుస్తక రథం వచ్చి వుండగా ప్రతి పుస్తకాన్ని సోదా చేస్తూండగా నా కంటపడింది-అలనాటి ఆంధ్ర సచిత్రవారపత్రిక తెలుగువెలుగులు” అన్న పేరుతో. అలా ఆ పుస్తకం కనుగొని కొని చదివానన్నమాట.

రమణగారు ఊరించినదానికి పుస్తకం ఏమాత్రం తక్కువలేదు. వ్యాసాలన్నీ 1959-61 మధ్య కాలంలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వారంవారం ధారావాహికగా ప్రచురించబడ్డాయి. ఇందులో వచ్చిన తెలుగువెలుగులు రాజకీయం, కళ, సాహిత్యం, సినిమా, క్రికెట్ వంటి వివిధరంగాలకు చెందినవారు. పుస్తకంలో ఎడమవైపు పేజీలో బాపు వేసిన రేఖాచిత్రం, కుడివైపు పేజీలో వారి గురించి పదునుగా, క్లుప్తంగా వాక్యచిత్రాలు. వ్యాసాలు వ్రాసింది ఒకరుకాదని ముందుగానే “కోతికొమ్మచ్చి”, ముందుమాటల ద్వారా తెలిసినా వ్యాసాలూ చదువుతూ పోతుండగా ఒకరే వ్రాసారేమోనన్న భ్రమలో పడిపోయాను.

ఏదో తెలుగువెలుగులన్నారు కదాని ఈ వ్యాసాలన్నీ భజన కార్యక్రమం పెట్టవు. అవసరమైనవారికి అవసరానికి తగ్గ చురకలు తగిలిస్తాయి. మరీముఖ్యంగా రాజకీయులకు మాత్రం మిగిలిన వారికంటే ఎక్కువగానే తగిలాయి. ఆచార్య ఎన్.జీ.రంగాపై వ్యాసం ఐతే పూర్తిగా విమర్శే. మచ్చుకు కొన్ని వ్యాక్యాలు చూడండి-“మొదటి మార్క్స్, తరవాత గాంధీ, ఆ తరవాత రంగా అని నిడుబ్రోలు రాజకీయ పాఠశాల విద్యార్థులు నేర్చిన పాఠము. రాష్ట్రరాజకీయాలు చేజిక్కకపోవుట వల్లనే వాటిని వదిలి యావద్భారత రాజకీయాలను వీలుగా చేబట్టారు. ఆ రంగంలోనూ సాధించినది లేదు” – అని ఒకవాక్యం. “ఏ క్షణంలో ఏది చేయకూడదో అది చేస్తారు రంగాగారు” అని గాంధీజీ అన్నారు – అని మరొక వాక్యం. అసలు వ్యాసం ప్రారంభంలోనే “వీరికి మొదటిస్థానం దక్కదు. రెండవస్థానం సొక్కదు” అంటారు. రంగా వైఫల్యాలూ,  వాటికిగల కారణాలూ విశ్లేషించిన వ్యాసంగా చెప్పుకోవచ్చు.  ఇంత రాసినా కించిత్ అతి, కాస్తయినా దూషణ ఉన్నట్టుగా అనిపించదు. వారి వ్యక్తిత్వంలో ఓటమి ఓ ముఖ్యభూమిక అయినప్పుడు దాన్ని కేంద్రంగా చేసుకునే వ్రాయాలన్న ధోరణి కనిపిస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ గురించి వ్రాస్తూ “సత్యనారాయణ గారు గనుక నన్నయ తిక్కనల కాలాల్లో ఉంది ఉంటే కవిత్రయం కాక కవిచతుష్టయం అనేవారేమో అని నమ్మేవారు కూడా లేకపోలేదు” అని వ్రాసారు. ఉన్నమాటే అయ్యుండవచ్చు కానీ ఒకవిధంగా ఇదీ చిరాకే.

చమత్కారం, వాక్యాల సొగసు గురించి చెప్పుకోవాలంటే నా మాటల్లో చెప్పడం కష్టం. దానికీ వ్యాసాల్లోంచి కొన్ని శాంపిల్ ముక్కలు ఇస్తాను.

“ఒకప్పుడు ఒక పెద్దమనిషి ఆయనను చూసి నవ్వాడు నువ్వు డైరెక్టరేమిటని. నిదానస్థుడు ప్రసాద్ మాటకు మాట జవాబు చెప్పలేదు. తన సమాధానాన్ని 15 సంవత్సరాల జీవితంలోకి అనువదించి చూపించాడు” (ఎల్.వి.ప్రసాద్)

“తలగడలుగా వాడుకోవడానికి చాలినన్ని రచనలు ఆయన చేయలేదు కాని నవ్యసాహిత్యంలో వారికొక ప్రముఖస్థానం గడించి పెట్టడానికి  ఆ వ్రాసినవి చాలు” (దేవులపల్లి కృష్ణశాస్త్రి)

“ఈనాడు కొందరు పెద్దల రచనలు చదువుతూంటే ‘వీరీపాటికి విరమిస్తే బాగుంటుంది స్మీ!’ అనిపిస్తుంది-అయితే పరిణతప్రజ్ఞులు శ్రీ శివరామశాస్త్రి తిరిగి విజృంభించి కథారచన సాగిస్తే ‘ఆంధ్రవాణికి ఈపాటికి ప్రపంచంలో పట్టం కట్టుకోలేమా!’ అన్నంత ధీమా కలుగుతుంది” (వేలూరి శివరామశాస్త్రి)

-ఇలా వుంటాయి ఆ వాక్యాలు. అయినా పదిహేను ఇరవై వాక్యాల్లో ఒక్కో ప్రముఖుని సమగ్ర వ్యక్తిత్వ చిత్రణ చేయబూనిన వారి వాక్యాలు, ఒక్కో వాక్యమూ దాదాపు అయిదారుగురు కలిసి చిత్రికపట్టిన వాక్యాలు ఎంత గొప్పగా ఉంటాయో మీరు ఊహించుకోగలరు లెండి.

ఇది చాలా సంకుచిత దృష్టి అని ఈసడిస్తారేమో కాని, ఆంధ్రకవిత మొట్టమొదటి నుంచి ఆరువేల వారి ఇంట (ఆరువేల నియోగులు తెలుగు బ్రాహ్మణులలో ఒక శాఖ) పెరిగి పెద్దదై చిక్కని ఒయ్యారాలోలికించింది, వారిలో శిల్పవేత్తలు కొందరు పద్యవిద్యకొక సొగసు, తూగు, అగరు సువాసనల గుబాళింపు కలిగించారు. నేటి కవయిత్రులలో ఆ అనూచాన మాధురిని సంరక్షిస్తున్న కవి కాటూరి వారే అంటే అతిశయోక్తి కాదేమో!”(కాటూరి వెంకటేశ్వరరావు)

“ఏమైనా రెడ్డిగారు అలనాటి రెడ్డిరేడుల చిటారుకొమ్మ” (కొండా వేంకట రంగారెడ్డి)

-వంటి వ్యాఖ్యానాలలో కులప్రసక్తి, కులప్రశంస మొదట ఆశ్చర్యంగా అనిపించింది. కాని కులకట్టుబాట్లు నిలిచివున్న నాటికాలంలో ఎదిగిన మనుషుల గురించి కులప్రస్తావనతో వ్రాయడంలోని ఔచిత్యం, కులాన్ని సామాజికవర్గం అంటూన్న(పిల్లి అంటే మార్జాలం అన్నట్టు) రోజుల్లోవి కావు ఈ వ్యాసాలన్న స్పృహ కలిగినాక ఆ వాక్యాలు అసహజంగా అనిపించలేదు.

ఈ వ్యాసాలూ ఎవరు వ్రాసారో? ఏమిటో? ఆంధ్రపత్రికలో వచ్చిననాడు పాఠకులకు తెలియదు. వారు ఒకే చేతిమీదుగా వస్తుందనుకునేవారట. కోతికొమ్మచ్చిలో రమణగారు వ్రాసినదాని ప్రకారం శివలెంక శంభుప్రసాద్, ముళ్లపూడి వెంకటరమణ, నండూరి, తిరుమల రామచంద్ర, పిలకా, తెన్నేటి సూరిలతో పాటు నలుగురైదుగురట. ఎవరు ఏవ్యాసం వ్రాశారూ అంటే.. సినీ ప్రముఖుల గురించీ, ఈమని శంకరశాస్త్రి గురించీ ముళ్లపూడివారు వ్రాశారన్నది దాదాపు ప్రచురించిన నలభై యేళ్లకు బాపూరమణీయం ద్వారా బయటపడింది. నండూరివారు తమ అక్షరయాత్రలో దేవులపల్లి, ఇంకా మరికొందరివి ప్రచురించారట. కోతికొమ్మచ్చిలో ఉన్న వివరాలను బట్టి రంగా, విశ్వనాథ, ద్వారం వేంకటస్వామి నాయుడు, గుర్రం జాషువాలను గురించిన వ్యాసాలు శివలెంక శంభుప్రసాద్ వ్రాసారని ఊహింపవచ్చు. ఇక మిగిలిన రచయితలు ఏ వ్యాసాలు వ్రాశారో.. వీరితో పాటు వ్రాసిన ఆ కొందరు ఎవరో తెలియదు. ఏది ఎలా వున్నా మామిడిపండు ఎవరు పండించారో తెలియకుంటే రుచి తరిగిపోదుగా.. పున్నమో, పాడ్యమో తెలియనంత మాత్రాన వెన్నెల తరిగిపోదుగా.. ఇదీ అంతే. ఈ అరుదైన విలువైన వ్యాసాలను సంకలనం చేసి,  శ్రమించి కాపీరైటు, పబ్లిషర్నీ వెతుక్కుని ఈ రూపంలో వచ్చేందుకు కృషి చేసినవారు శ్రీరమణ. వారి కృషి అమూల్యం.

తెలుగువెలుగులు వ్యాసాలవల్ల అపూర్వరచనలు చేసిన వేలూరి శివరామశాస్త్రి  గురించి, వారి అద్భుత కథా శిల్పాల గురించీ తెలిసింది. వారి రచనలు దొరకబుచ్చుకుని చదవాలనే వెతుకులాటలో వున్నాను. కోతికొమ్మచ్చిలోంచి ఇందులోకి వచ్చి పడ్డట్టు ఇందులోంచి వేలూరి వారి కథల్లో పడాలి. అలానే మరెందరో తెలియని హేమాహేమీల పరిచయం చదవగలిగాను. తెలుసనుకున్నవారి గురించి తెలియనివి తెలిశాయి. అత్యద్భుతమైన వచనం చదవగలిగాను. ఇంతకు  మించి ఏం కావాలి.

తెలుగు వెలుగులు
వెల: రూ.85/-
పేజీలు: 173
ప్రచురణ: మోనికా బుక్స్
ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌస్ మరియూ అన్ని ప్రముఖ పుస్తకాల షాపులూ

You Might Also Like

4 Comments

  1. కొత్త కెరటాలు | పుస్తకం

    […] “తెలుగు వెలుగులు” గురించి సూరంపూడి పవన్ సంతోష్ పరిచయం చేశారు. అలాగే తెలుగు పెద్దల్ని చిన్న చిన్న […]

  2. leo

    మంచి పుస్తకం పరిచయం చేసినందుకు థన్యవాదాలు. కొని దాచుకోవలసిన పుస్తకం.

  3. Jampala Chowdary

    1996 మేలో ఫిలడెల్ఫియాలో డెలవేర్ వాలీ తెలుగు సంఘం సంబరాల సందర్భంగా బాపు గారిని అతిథిగా పిలచి బాపు చిత్రప్రదర్శన జరిపారు. ఆ సంఘం అప్పటి అధ్యక్షులు పత్తి ప్రసాద్ గారు ఈ తెలుగు వెలుగు శీర్షిక గురించి కాసేపు అభిమానంగా బాపు గారితో మాట్లాడి ఆ వ్యాసాల కాపీలు దొరుకుతాయా అని వాకబు చేశారు. దొరికితే నాక్కూడా అని నేనూ అడిగేసాను. మహానుభావుడు బాపుగారు మద్రాసు తిరిగి వెళ్లగానే మొత్తం వ్యాసాలన్నీ జిరాక్స్ కాపీలు పంపించారు. అప్పుడు మొదటిసారి చదివి అబ్బురపడుతూ ఆనందించాను.

    ఈ వ్యాసాలు అన్నేళ్ళ తర్వాత ఒక పుస్తకంగా రావటానికి ముఖ్య కారకుడు శ్రీరమణగారు (బాపుగారికి వ్యాసాల కాపీలు అందించిందీ ఈయనేనట, తర్వాత తెలిసింది). మోనికా బుక్స్ ఐ. వెంకట్రావుగార్ని ఒప్పించి, ఈ పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చారు.

    ఇలాంటి ప్రయత్నమే 1970ల్లో ఆంధ్రజ్యోతి వారపత్రికవారు చేశారు. ఆ వి,యాలు ఇంకోసారి.

    1. pavan santhosh surampudi

      ఈ వ్యాసాలు ఈ రూపంలో ప్రచురితం కావడానికి శ్రీరమణ గారు చేసిన కృషి అభినందనీయం. ఈ వ్యాసాలకు వెనుక ఆయా వ్యాసాల్లోని వ్యక్తుల గురించిన సంక్షిప్త వివరాలు ఇవ్వడం కూడా శ్రీరమణ గారే చేసివుంటారని నా అభిప్రాయం. కాని సంపాదకునిగా ఆయన పేరు వేసుకోలేదు.
      //ఇలాంటి ప్రయత్నమే 1970ల్లో ఆంధ్రజ్యోతి వారపత్రికవారు చేశారు.//
      పుస్తకరూపంలో వచ్చిందా? దయచేసి వీలుచూసికుని వివరంగా వ్రాయండి.

Leave a Reply