అమృతం గమయ – దాశరథి రంగాచార్య

దాశరథి రంగాచార్య గారు ప్రముఖ తెలుగు కవి, రచయిత. వీరి రచనలతో నాకు పరిచయం లేకపోయినా కూడా తరుచుగా పేరూ-బోసి నవ్వుతో ఉండే ఫొటో ఆయన పుస్తకాలపై చూస్తూనే ఉన్నాను. చాన్నాళ్ళ క్రితం వార్తలో “అమృతం గమయ” సీరియల్ గా వచ్చింది. అప్పటికి అప్పుడే ఇంటర్ అయిపోయింది నాది. ఆ వయసుకి ఆ నవల భావాల సంగతి అటు పెడితే, భాషను చూసి భయపడి ఎప్పుడూ దాన్ని చదవలేదు. అప్పుడో పేజీ ఇప్పుడో పేజీ చదివి జడుసుకోడం తప్ప. అయితే, ఇన్నేళ్ళ తరువాత ఈ మధ్యే అది చదువుతూ ఉంటే మాత్రం అప్పటి నా అభిప్రాయం కాస్త సవరించుకుని, ఈ నవల ప్రత్యేకతని అంగీకరించాల్సి వచ్చింది.

కథ: ఈ నవల కథ ప్రధానంగా ఓ గ్రామం కథ. ఆ గ్రామం పుట్టుక మొదలు అక్కడ దశాబ్దాల జీవితంలో వచ్చిన మార్పులు, ప్రజల జీవన విధానం, వారి మధ్య ఉన్న మానవ సంబంధాలు, రోజులు గడిచే కొద్దీ ఆధునికత, నాగరికత వారిలోకి చొచ్చుకుపోయిన వైనం, దాని వల్ల వారిలో కలిగిన మార్పులూ – ఇదీ ఈ నవల లోని కథ.

వినడానికి ఇంతేనా అనిపించిందా? అక్కడే ఉంది కిటుకంతా. ఈ నవల మనల్ని ఆలోచింపజేస్తుంది, భయపెడుతుంది, చదివింపజేస్తుంది, “ఆహా!” అనిపిస్తుంది, “అబ్బా!” అనిపిస్తుంది, “అవసరమా!” అనిపిస్తుంది…. హాస్యం పాలు చాలా తక్కువన్న మాటొక్కటి తప్పితే సకల రసాలనూ అనుభవింపజేస్తుంది. అసలు ఈ శైలి నవలకి సరిపడుతుందా? అన్న సందేహం కలిగింది నాకు. సరే, నాకాట్టే తెలుగు నవలలు చదివిన అనుభవం లేదు కనుక ఇది కూడా నవల రాయడంలో ఓ శైలి ఏమో అని సరిపెట్టుకున్నాను. ఈ నవల పై గాంధీజీ ప్రభావం చాలా ఉంది. ప్రధానంగా ఆయన గ్రామ స్వరాజ్యం భావనల ప్రభావం. అడుగడుగునా ఆ ఆదర్శాల ప్రస్తావన సూటిగానో, మరోరకంగానో తొంగిచూస్తూనే ఉంటుంది. చాలాచోట్ల చదువుతూ నేను ఆలోచనల్లో మునిగిపోయాను. ఇదిలా జరిగితే ఎలా? ఇక్కడ రచయిత దెప్పినట్లు నిజంగా జరిగితే మన పరిస్థితి ఏం కాను? నిజంగా ప్రపంచం ఇలాంటి పరిస్థితిలో ఉందా? ఇలా అయితే భవిష్యత్తేమిటి? – ఎన్నో ప్రశ్నలు, భయాలు నాలో ఈ పుస్తకం చదువుతూ ఉంటే.

అన్నింటికంటే ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన భాగం – ఎక్కడ ఉర్దూ/సంస్కృతం వాక్యాలు, శ్లోకాలూ వగైరా వాడినా కూడా అక్కడ వాటికి తెలుగు అర్థాలు ఇవ్వడం. ఈ పుస్తకం భాష కాస్త ఒక మాదిరిగా ఉంటుంది కానీ, అలవాటు పడిపోతారు చదువరులు కొద్దిసేపటికే. రంగాచార్య గురించి నాకు ఆట్టే తెలీదు కానీ, ఈ పుస్తకం చదువుతూ ఉంటే మాత్రం విశ్వనాథ గుర్తు వచ్చారు. ఆయన్ని పాతకాలం అనేసుకుంటే, ఈయన్ని ఆధునిక విశ్వనాథ అనొచ్చేమో. అంటే, భాషా పరంగా అని కాదు కానీ, చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పే విధానం పరంగా. రంగాచార్య గారు విశ్వనాథ అంత తీవ్రంగా రాయరనిపించింది కానీ, వీరి తీవ్రత కూడా తక్కువేమీ కాదు. అవసరమున్న చోట అవసరమైనంత. నవల చదువుతున్నంత సేపూ, ఆ తరువాత కూడా నేను విశ్వనాథ కీ, రంగాచార్యకీ మధ్య పోలిక తేకుండా ఉండలేకపోయాను.

ఈ నవల ఆద్యంతమూ కనిపించే – బోధి, అహమ, ఆత్మానంద స్వామి – ఈ పాత్రల సంభాషణ మాత్రం నాకు మరీ నాటకీయంగా అనిపించింది. ఇలా రాసి దీన్ని “ఫాంటసీ” నవల చేసే బదులు రాయకుండా దాన్ని సాంఘికం చేసి ఉంటే ఈ నవల చెప్పదలుచున్న సందేశం మరి కాస్త సూటిగా చేరేదేమో చదువరులలోకి అనిపించింది. ఇలా చేయడం వల్ల కాస్త ఆధ్యాత్మికత ను నవలలోకి తెప్పించినట్లైంది.  అయినా సరే, ఇది మాత్రం తప్పక చదువవలసిన నవల. గాంధీ సిద్ధాంతాలను ఇంత బలంగా కథలోకి రప్పించిన నవల చదవడం నాకిదే ప్రథమం. విశ్వనాథ గారి గురించి అనిపించినట్లే నాకు రంగాచార్య గారి గురించి కూడా అనిపించింది – ఇతన్ని మీరు ఇష్టపడండి, పడకపొండి -మీ ఇష్టం, కానీ, చదవకుండా మాత్రం ఉండటం కష్టం అని.

You Might Also Like

5 Comments

  1. mesothel

    Thx. Hope to see some more information in future. Auther is the best

  2. kvrn

    ఈ పుస్తకం చాల చక్కగ పరిచయం చేసారు

  3. హెచ్చార్కె

    పుస్తకాన్ని పరిచయం చేసిన తీరు చాల బాగుంది. పుస్తకంలో ఏమి ఆశించవచ్చో తెలిసిపోతోంది. ఎంత చెప్పాలో అంత చెప్పారనేది ‘అమృతం గమయ’కు ఎంత వర్తిస్తుందో ఈ పరిచయ వ్యాసానికీ అంత వర్తిస్తుంది. అభినందనలు.

  4. nintendost

    Article very interesting, I will necessarily add it in the selected works and I will visit this site

  5. ప్రవీణ్

    Simple and effective review.
    ప్రస్థుత తరంలో విశిష్ట రచయిత.
    మీకు వీలైతే వీరు వ్రాసిన “జీవన యానం” కూడా చదవండి.
    “ఈ పుస్తకం భాష కాస్త ఒక మాదిరిగా ఉంటుంది”. రంగాచార్య గారు తెలంగాణ ప్రాంత రచయిత కాబట్టి, బహుశా ఆ మాడలికంలో ఉందేమో ! అది obvious కదా!

Leave a Reply