The Wishmaker – Ali Sethi
విష్ మేకర్ – పాకిస్తాని సమాజం కథ అని ఇదివరలో ఓ సమీక్షలో చూసి ఓహో అనుకున్నాను. రాసినది పాతికేళ్ళ యువకుడు అని తెలిసి – “అబ్బో!” అనుకున్నాను. తర్వాత ఒకదానివెంట ఒకటి, ప్రతి పత్రికలోనూ దీన్ని పొగుడుతూ సమీక్షలు చదివాను. “ఓహో, చదివి తీరాల్సిందే!” అనుకున్నాను. అంతా అయ్యి, చివరకి దీన్ని చదవగలిగాక, తేల్చుకున్నది ఏమిటీ అంటే, హడావుడి ఎక్కువైనంత మాత్రాన నవల గొప్పగా ఉండాలనేమీ లేదు అని. ఒక నవలగా ఇది బాలేదు అని నేను అనను కానీ, తప్పక చదవాల్సిన నవల ఏమీ కాదు.
కథ: ఈ కథలో కొన్ని దశాబ్దాలలో ఓ పాకిస్తానీ కుటుంబంలోని వివిధ వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనలు, దానితో పాటు ఆయా సంఘటనల కాలంలోని సమకాలీన రాజకీయ సామాజిక పరిస్థితులు – ఇదీ క్లుప్తంగా దీని కథ.
కథ గురించి ఇంతకంటే నేనేమీ చెప్పలేను. ఇక ఇక్కడ్నుంచి నా అభిప్రాయాలు.
ఈ నవల చదవడం ద్వారా ఒకప్పటి పాకిస్తానీ రాజకీయ పరిస్థితుల గురించి ప్రాథమిక అవగాహన ఉన్నవారికి కొత్తగా తెలిసేదేమీ ఉండదు. అసలేమీ తెలీని వారికి కాస్త నేపథ్యం తెలుస్తుంది. దాదాపు 400 పేజీలు రాసినప్పుడు – ఎంతో కొంత వివరంగా సామాజిక చిత్రణ ఉంటుంది అని ఆశించడం సహజం. అదీ, ఆ లెవెల్లో ఈ నవల అదీ, ఇదీ అని హైపిచ్చేసాక. కానీ, అక్కడ అటువంటిదేమీ జరగదు. నేను విన్నదాన్ని బట్టి ఈ నవల గురించి ఏదో ఊహించుకున్నా కానీ, కథలోని కుటుంబం గురించి తప్ప మనకి ఇంకేమీ తెలియదు కొత్తగా ఈ పుస్తకం చదివితే. కాలక్షేపానికి చదివి వదిలేయడానికి బానే ఉంటుంది కానీ, అలా కాలక్షేపానికి చదివి వదిలేసే పుస్తకాల్లో కూడా కొంత కొత్త విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఉదాహ్రణకి, John Grisham నవల The Firm ని తీసుకుంటే, అది కూడా నేను అలా కాలక్షేపంగానే చదివాను. కానీ, దానివల్ల నాకు కొన్ని సంస్థల పనితీరు గురించి ప్రాథమిక అవగాహన అన్నా కలిగింది. ఆ లెక్కన చూస్తే, ప్రస్తుత నవల వల్ల మనకి ఒరిగేదేమీ లేదు.
అలాగే, ఏకబిగిన చదివించే గుణం ఏదన్నా ఉన్నా – పైవిధమైన “విజ్ఞానం” ఈ నవల ఇవ్వకున్నా నేను పెద్ద లెక్కెపెట్టేదాన్ని కాదు. ఆ చదివించే గుణం కూడా ఈ నవల్లో లేదు అని నా అభిప్రాయం. కథనం చాలా డ్రై గా అనిపించింది. ఏ విధమైన భావోద్వేగమూ అంత ఎక్కువగా కనబడలేదు. హాస్యం, వ్యంగ్యం, కోపం, ద్వేషం – ఏదీ ఎక్కువా లేదు… సమపాళ్ళలోనూ లేదు. అన్నీ తక్కువే. అంత డ్రైగా ఎలా రాయడం సాధ్యమో అర్థం కాలేదు. అసలు చెప్పదలుచుకున్న విషయం ఏమిటో కూడా నాకు అర్థం కాలేదు. రచయిత పాతికేళ్ళ వాడు, తొలినవల – అంటే, ఆ మాత్రం కంఫ్యూజన్ అతనిలో ఉండడం సహజం కావొచ్చు. కానీ, అట్లాంటప్పుడు ఈ నవల గురించి అంత గొప్పగా చెప్పుకునేందుకు ఏమున్నట్లు? నవలకి ఆ పేరెందుకో కూడా నాకు అర్థం కాలేదు. ఈ పొగడ్తలను విని..నేనేమో… తొలి నవల కి ఇంత పొగడ్తలా… ఇదేదో To kill a mocking bird రేంజ్ debut అనుకున్నా. ప్రచారాన్ని అన్ని వేళలా నమ్మడానికి లేదన్నమాట.
చివరగా చెప్పాలంటే, నవల బాలేదు అని నేను అనను. కానీ, ఆ ప్రచారాన్ని బట్టి నేను ఊహించుకున్నట్లు లేదు. అయితే, అలా ఊహించుకోడం నా తప్పే కావొచ్చు. ఏ విధమైన ఆంచనాలూ లేకుండా చదివితే, బహుశా ఈ నవల నచ్చొచ్చేమో.
పుస్తకం వివరాలు:
The Wish Maker
రచన: Ali Sethi
ISBN: 9780670082537
ఆన్లైన్ కొనుగోలు లంకె ఇక్కడ.
పుస్తకం » Blog Archive » Persepolis
[…] ఊహించలేకపోతున్నాను. మొన్నామధ్య “విష్ మేకర్” చదివినప్పూడూ, ఇప్పుడూ ఒకే విషయం […]