అల్లీ ముఠా
రాసిన వారు: Kata Chandrahaas
***************************
దొంగ ఎవరు? దొర ఎవరు? అనే ప్రశ్నతో నడుస్తుంది “అల్లీ ముఠా” గేయ నాటిక. సమాజం లో పెద్దమనుషులుగా చలామణి అయ్యేవారి మూలాలు వెతికితే దొంగ, దొర పదాలకు అసలయిన అర్థం దొరుకుతుంది. ఈ విషయాన్ని అలవోకగా “అల్లీముఠా” సున్నితమైన హాస్యంతో 60 ఏళ్ళనాడు వ్యంగనాటికగా ప్రచారం లోకి తెచ్చింది.
పొట్టకోసం చిల్లర దొంగతనాలు చేసే సామాన్యజనం ఒక ముఠాగా ఏర్పడి అడవిలో వుంటూ దోపిడీలు చేస్తూ వుంటారు. ఈ ముఠాలో చదువుకున్నవాళ్ళు, చదువురానివాళ్ళు, అన్నికులాలవాళ్ళు ఉంటారు. అందరూ సమానులే. అందరూ గౌరవనీయులే. వాళ్ళ దృష్టిలో వాళ్ళందరూ దొరలే.
దాని నాయకుడు అల్లీబాబా మాటల్లో:
దొంగలని అంటారురా దొరలు మనలా మాటికీ
బీదసాదల దోచకుండా బిరుదు దొరలెటురైరిరా?
‘దొంగ ‘ ‘దొర ‘ అననేలరా? దొంగలే అంటానురా
పగటిదొంగలు వారురా, మరి, రాత్రి దొంగలు మనమురా
ఇంతే భేదమురా! ప్రియ సోదరా!
అడవి మృగములు చూడరా కడుపు నిండితే తినవురా!
బిరుదులందిన మనుజ మృగములు ధరణినంతా మ్రింగురా!
దైవమిచ్చిన ధరణిరా! ఇది ఎవడి అబ్బా సొమ్మురా?
నీకూ నాకూ లేని హక్కు వాడి కెవడిచ్చాడురా?
ముఠాలో కొన్నాళ్ళు ఉండి, అడవి వదిలి, సమాజం లోకి వెళ్ళి పరిస్థితులను లోతుగా అధ్యయనంచేసి అడవికి తిరిగి వస్తాడు చిన్నారెడ్డి. వచ్చీ రాగానే ఒక కొత్త సూత్రాన్ని ప్రతిపాదిస్తాడు.
“సోదరులారా! దోవలుకొట్టి, దోపిళ్ళుచేసి, క్షణక్షణం రాజదండనకు ఎదురు చూస్తూ దిన దిన గండం నూరేళ్ళాయుష్సుగా ఎందుకు కష్టపెట్టుకోవాలి? నాతో రండి. మళ్ళీ ఆ లోకంలోకి పోదాం. పెద్ద మనుషుల్లాగా జీవనం చేద్దాం.” రెండేళ్ళు ఆ లోకంతో కలిసి దాని రహస్యం పూర్తిగా గ్రహించాను అని చిన్నారెడ్డి వూరిస్తాడు. అదేమిటో చెప్పమని అల్లీతో సహా అందరూ కోరుతారు. మనకీ దొంగతనం ఇక వద్దు అని చిన్నారెడ్డి కర్తవ్యం ఉపదేశిస్తాడు. ఏమని?
ఇల్లు కదలకయె ఇలను దోచుకొను
ఇతర మార్గములు కలవుర భాయీ.
తర్వాత దోచుకునే మార్గాలన్నీ వివరిస్తాడు చిన్నారెడ్డి. లిమిటెడ్ కంపెనీ పెట్టు, షేరులు అమ్ము అంటాడు. జ్యోతిష్యం చెప్పు. జగద్గురువు వేషం వెయ్యి. కమిషన్ కొట్టు. ఇంకా–
లైసెన్సులతో లాటరి చేస్తే
లాఫుల్ వ్యాపారమురా భాయీ
లైసెన్సుంటే చాలుర భాయీ
లంకెల బ్రోథెల్ తెరవర భాయీ!
శాస్త్రం చట్టం సమ్మతించితే
దొంగయె దొరరా భాయీ!అర్థరాత్రి నిద్రలేరా భాయీ
ఊరి వెలుపలికి పోరా భాయీ
రాముడి బొమ్మను పాతర భాయీ
వెలసిందని నమ్మించర భాయీ
భజనలు పూజలు చేయర భాయీ
భక్తులు వందలు వస్తార్ భాయీ
బండ్లను కాన్కలు తెస్తార్ భాయీ
దేవుడి పేరిట తినరా భాయీశాస్త్రం చట్టం సమ్మతించితే
దొంగయె దొరరా భాయీ!
చిన్నారెడ్డి ఉపదేశం తో ముఠాలో ఉన్న సభ్యులందరూ మూకుమ్మడిగా–
దోవలు వద్దు దోపిడి వద్దు
దొంగతనం మన కసలే వద్దు
ఇల్లు కదలకయె ఇలను దోచుకొను
ఇతర మార్గములు ఇవిరా భాయీ
అంటూ–
దేవుణ్నే సృష్టిస్తాం భాయీ
దేవుడి గుడి కట్టిస్తాం భాయీ
పదండి పోదాం ప్రపంచమునకు
పదండి పోదాం ప్రపంచమునకు
అని పాడుకుంటూ వెళ్ళిపోతారు.
ఈ వ్యంగ నాటిక స్వాతంత్ర్యం తరవాత రాబోయే పరిణామాలకు అద్దం పట్టిందనడానికి సందేహం లేదు. అల్లి ముఠా వాళ్ళందరూ దేశం మీద పడి శాస్త్ర సమ్మతంగా, చట్టం పరిధిలో ఘరానాదొంగలయిన తీరు తెల్సుకోవాలంటే ఈ నాటిక పూర్తిగా చదవండి.
కొప్పరపు సుబ్బారావు గారు (1896-1959) రాసిన ఈ నాటిక మొదటి ప్రదర్శన 1945లో జరిగింది. 1950 కల్లా వెయ్యికి పైగా ప్రదర్శనలు పూర్తిచేసుకుంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఈ నాటిక ఆశించింది. కానీ జరిగిందేమిటి? జరుగుతున్నదేమిటి? రకరకాల దోపిడీలు జరిగాయి. జరుగుతూనే వున్నాయి– దర్జాగా, రాజాగా. ఎన్నో రెట్లు ఎక్కువగా, దేవుని సాక్షిగా. మనం పేపర్లలో చదువుతున్నవి గాలి కబుర్లు కావు. రోజూ చిదంబర రహస్యాలు బయటపడుతున్నాయి. కొప్పరపు సుబ్బారావుగారు ఇవన్నీ వూహించారు. అరవయ్యేళ్ళకిందటే జాగ్రత్త సుమా అని హెచ్చరించారు. ఫలితం శూన్యం. వ్యవస్థ ఇంకా భ్రష్టుపట్టిపోయింది. పాతరోజులే బెటర్ అనే స్థితికి చేరుకున్నాము. మనం బాగుపడం. ఎందుకు మారతాం? మేరా భారత్ మహాన్ కదా!
కొప్పరపు సుబ్బారావుగారు చాలా నాటకాలు, నాటికలు రాశారు. గేయరచనలు చేశారు. ఆయన జీవితం నాటకానికే అంకితం. చివరికి ఫిరంగిపురంలో స్టేజిమీదే ప్రాణాలు వదిలారు.
అల్లిముఠా గేయనాటిక ఈ మధ్యే వచ్చిన “ప్రసిద్ధ తెలుగు నాటికలు” పుస్తకంలో వుంది.
(Prof. C. సుబ్బారావుగారికి కృతజ్ఞతలతో — కె. చంద్రహాస్.)
muthevi ravindranath
The playwright Late Kopparapu Subbarao garu was a prolific writer contemporaneous with the Late Kaviraju Tripuraneni Ramaswamy Chowdary garu and was a frequent visitor to SOOTHAASHRAMAM in TENALI.He was inspired by the Rationalist ideology of Kaviraju.
Another great work of Kopparapu Subbarao garu was’SHAASTHRA DAASYAM’, a little book with a pungent and vitriolic criticism on the dogmatic beliefs prevalent in those days, especially among the so-called ‘intelligentsia’.This small book , published long ago with an introductory note by the late Tripuraneni Gopichand garu ,was an eye-opener to many in those days.It is the need of the hour even today,and hence needs republication.