హనుమచ్ఛాస్త్రికథలు – 70 యేళ్ళనాటి కథానికలు
శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కవిగా, విమర్శకునిగా ఆంధ్రపాఠకలోకానికి బాగా తెలిసినవారు. తెలుగులో చిన్నకథలకు కథానిక అన్న పేరు రూఢం చేసింది శ్రీ శాస్త్రిగారేనన్నది కూడా ప్రాచుర్యంలో ఉన్న విషయమే. కథానిక నాకు తెలుగులో ఇష్టమైన రచనాప్రక్రియ; కానీ శ్రీ శాస్త్రిగారు రచించిన కథానికలు ఎక్కువగా నేను చదవలేదు – గౌతమీ గాధలు అనే సంకలనం, చెదురుమదురుగా కథాసంకలనాలలో దొరికిన కథానికలు తప్పించి.
హనుమచ్ఛాస్త్రికథలు పుస్తకం కొన్నాళ్ళ క్రితం ఆచార్య వేల్చేరు నారాయణరావుగారి దగ్గర దొరికింది. 1945లో ప్రచురింపబడ్డ ఈ పుస్తకానికి ప్రాస్తావికను (ముందుమాట) మే 14, 1944న శ్రీ శాస్త్రిగారు వ్రాశారు. 13 కథానికలున్న ఈ సంపుటంలో ఒక్క కథకు మాత్రం ఇంతకు ముందు ప్రచురించిన వివరాలు ఉన్నాయి: కళాభాయి అనే కథ 1935 అక్టోబరు ప్రబుద్ధాంధ్రలో ప్రచురింపబడింది. మిగతా కథలకు తేదీలు ఇవ్వలేదు కానీ, ప్రాస్తావికలో, “నేను సుమారు 7,8 ఏండ్ల ఈమధ్య అప్పుడప్పుడూ వ్రాసి ఆంధ్రపత్రిక, భారతి, ఉగాదిసంచిక మొదలైన పత్రికల్లో ప్రకటించిన కథల్లో కొన్నిటిని ఇప్పుడు తొలిసంపుటంగా ప్రచురిస్తున్నాను” అని చెప్పుకొన్నారు కాబట్టి ఈ కథలన్నీ గత శతాబ్దపు నాల్గవదశకంలో (1935 – 1940 ప్రాంతాల్లో) వ్రాసినవని అనుకోవచ్చు. అంటే దాదాపు 70-75 యేళ్ళ క్రితం కథలన్నమాట (1).
ఈ కథల గురించి చెపుతూ, శాస్త్రిగారు “వీటిలో కొన్నిటిని సమాజంలో కుళ్ళును కదిపి, ప్రజల దృష్టిలోకి తేవటానికి ఉద్దేశించాను. కొన్నిటిలో ఒక్కొక్క వ్యవస్థలో విచ్ఛిత్తి విశేషములను చూపడానికి సంకల్పించాను. కొన్ని కేవలం శిల్పం కోసం, వైచిత్రికోసం వ్రాయబడ్డవి కూడా ఇందులో లేకపోలేదు” అన్నారు. ఈ కథాసంపుటంలో కథల గురించి శాస్త్రిగారు సరిగ్గానే చెప్పారు.
ఈ సంపుటంలో చాలా కథలు పూర్తిగా వ్యంగ్యాత్మకాలు. యతిప్రాస మహాసభ, స్వర్ణయోగము, కళాభాయి వంటివి మరీను. కొన్ని కథలు సరదాగా వ్రాసినట్లనిపిస్తుంది. దాదాపు అన్ని కథల్లోనూ సమాజంలోని కొన్ని విపరీతపు తీరుతెన్నులపై విసుర్లు కనిపిస్తుంటాయి. కొన్ని వర్ణనలు, సంభాషణలు కొంటెగా ఉంటాయి. ఈ కథల్లో చాలావరకు స్త్రీలు మాత్రం ఉదాత్తులుగా, దృఢమైన వ్యక్తిత్వము, స్వాభిమానము, ప్రేమ ఉన్న నిండు మనుషులుగా కనిపిస్తారు.
యతిప్రాస మహాసభ, కళాభాయి కథలు ఎవరిపైనో అన్యాపదేశంగా వ్రాసినవని అనిపిస్తుంది. యతిప్రాస మహాసభలో ప్రవేశపెట్టిన మూడో తీర్మానం: “మనలను పీఠికలలోనూ, పత్రికలలోనూ దూషించి యిహపరములకు జెడిన ఛందోదర్పణ పీఠికాకారుడు సీతాపతి, యతిప్రాసలైచ్ఛికమని యుగాదిసంచికలో వ్రాసిన సూర్యనారాయణశాస్త్రి, పద్యములలో యతిప్రాసలు త్రోసి మనపై కత్తికట్టిన హనుమచ్ఛాస్త్రిగారలను తీవ్రంగా గర్హించుచున్నాము”. ఇది అప్పటి సాహిత్యవివాదాలగురించిన వ్యంగ్య కథ అని తెలుస్తుంది. మరి ఆ సీతాపతి, సూర్యనారాయణశాస్రులెవరో తెలీదు. అలాగే కళాభాయి ఎవరో?
ఈ కథల్ని మన చరిత్రలో ఒక సంధియుగపు వాతావరణచిత్రణకోసం చదువవచ్చు. సంస్కృతిలో వస్తున్న కొన్ని మార్పులు, కొత్త భావాల, ఉద్వేగాల వ్యక్తీకరణల వల్ల వస్తున్న సంఘర్షణల చాయలు కొంత తెలుస్తాయి. భాష పసందుగా ఉంటుంది. పాత సినిమాపాటల (ముఖ్యంగా హిందీ) పల్లవులు వినిపిస్తాయి (అప్పటికే చదువుకున్నవారిలో తెలుగుసినిమాలపట్ల చాలా చిన్నచూపు ఉన్నట్టు అనిపిస్తుంది).
నా ఉద్దేశంలో ఈ సంపుటంలో కథలేవీ అంత బలమైన, గుర్తుండిపోయే కథలు కావు. కథావస్తువులు, పాత్రల మనస్తత్వాల చిత్రీకరణలు చాలా పేలవంగా ఉండటం కారణం కావచ్చు. ఏదో విషయం చెప్పదల్చుకుని దాని చుట్టూ ఒక కథ తయారుచేశారేమో అనిపిస్తుంది. అందుకనే కాబోలు ప్రతి కథాసంకలనంలోనూ హనుమచ్ఛాస్త్రి గారు కథానికకి పేరుపెట్టడం గురించిన ప్రస్తావన వచ్చినా, ఆయన కథలకు మాత్రం అంతగా గుర్తింపు లేకపోవడం (గౌతమీ గాథలకు గుర్తింపు ఉన్నా, ఆ కథలేవీ సంకలనాల్లో చూసిన గుర్తు లేదు). ఈ సంపుటంలో కథలే కాక శాస్త్రిగారు వేరే కథలు కూడా వ్రాసినట్లు ప్రాస్తావికలో చెప్పిన మాటల వల్ల తెలుస్తుంది. మౌనసుందరి –ఇతర కథలు అనే సంపుటం ఒకటి వచ్చినట్లు శ్రీకాంతశర్మగారు అన్నారు. ఇంకా ఇతర సంపుటాలున్నాయేమో తెలీదు.
ఈ పుస్తకంలో నాకు ఆసక్తికరమైంది శాస్త్రి గారి ప్రాస్తావిక. ఈ ప్రాస్తావికలో కూడా చిన్నకథలను కథానిక అనడం గురించి చర్చ ఉంది. మారుతున్న కాలానికి, కొత్తగా విస్తృతమైన పాఠకలోకానికి సరిపడే ప్రక్రియ – వచనం, ముఖ్యంగా కథ అని శాస్త్రిగారి నమ్మకం. చిన్నకథ మనకు కొత్త ప్రక్రియ కాదు; విక్రమార్క చరిత్ర, పంచతంత్రం, దశకుమార చరిత్ర వంటి సంస్కృతకావ్యాల్లో చాలా చిన్న కథలు ఉన్నాయి. హనుమచ్ఛాస్త్రిగారి పరిశీలన ప్రకారం, పూర్వకథలలో వస్తుకల్పనా చాతుర్యం ముఖ్యమయితే, ఇప్పటి కథలలో మనః ప్రవృత్తి వైవిధ్యం ఎక్కువ ప్రాముఖ్యం వహించటం చేత కథారూపమే మారిపోయింది.
అగ్నిపురాణంలో ఒక రకమైన గద్యానికి కథానిక అన్న పేరు ఉన్నదిట. ఆ కథానిక “లక్షణమునూ, ప్రాచీననవీన కథాసంచయమునూ జోడించి చూడగా, చిన్న కథలన్నిటినీ కథానికలనడమే ఉచితంగా తోచి, సుమారు ఆరు ఏండ్ల క్రిందట ప్రతిభలో ‘కథానిక’ అనే ఒక వ్యాసం” శ్రీ శాస్త్రిగారు ప్రచురించారు (2). ఆ తరువాత అంతకు ముందు చిన్నకథకు పర్యాయపదాలుగా వాడబడుతున్న కథానక, హ్రస్వకథ, పొట్టికథ అనే మాటలు నశించి, కథానికా శబ్దం నిరూఢమయ్యింది. కొందరు మాత్రం కథానక అన్న పదమే సమంజసమని ఇంకా అంటున్నారట. వారి వాదాన్ని హనుమచ్ఛాస్త్రిగారు పూర్వపక్షం చేసి కథానికా శబ్దమే చిన్నకథకు సరియైన పర్యాయపదమని మరొక్కసారి ఈ ప్రాస్తావికలో వాదించారు. (ఇప్పుడు కథానిక అన్న వాడుక దాదాపు మాయమైనట్లే నాకు తోస్తుంది).
తెలుగులో అప్పటివరకూ ఉన్న కథారచన స్థితిని సమీక్షిస్తూ, “శ్రీ గుడిపాటి వెంకటచలం, వేలూరి శివరామశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలైన ఉత్తమ కథారచయితలు విజృంభించి తెలుగు కథాసాహిత్యానికి గొప్ప దీప్తినిచ్చి భావవిప్లవానికి, నవ్యజాగృతికీ, నూత్న సంస్కారానికి విశేషంగా తోడ్పడారు” అని అన్నారు. ఉత్సాహశీలురైన మరికొందరు యువకథారచయితలపైన కూడా శాస్త్రిగారికి ఆశావహమైన సదభిప్రాయమే ఉంది.
శాస్త్రి గారిది ముందు చూపని, పాతలో గర్హ్యమైనవాటిని వర్జించి, నవజీవనంలో అభిలషించవాటిని ఆహ్వానించే దృక్పథం వారికి ఉందనీ ఈ కథల ద్వారా అర్థమౌతుంది. ముందుమాట వారి పాండిత్యానికి ఉదాహరణ.
—
(డా. ద్వానా శాస్త్రి గారి సంపాదకత్వంలో వెలువడిన మా నాన్నగారులో, హనుమచ్ఛాస్త్రి గారి కుమారుడు, ప్రముఖ రచయిత శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ వ్రాసిన ప్రకారం) బహుముఖ ప్రతిభాశాలి శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి 1911 ఆగస్టు 29న విశాఖ జిల్లా వీరవల్లి తాలూకా మాడుగుల ఆస్థానంలో జన్మించారు. కొవ్వూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠంలో ఉభయభాషాప్రవీణలో ఉత్తీర్ణులయారు. 1934 నుంచి 1964 వరకూ రామచంద్రపురం బోర్డ్ హైస్కూల్లో, 1964 నుంచి 1984 వరకు కావలి జవహర్‌భారతి కళాశాలలో సంస్కృత పండితుడిగా పని చేశారు. తొలి రోజుల్లో నాస్తికుడు; బ్రహ్మ సమాజ పక్షపాతి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, చలం, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగార్లంటే అభిమానం. నవ్యసాహిత్య పరిషత్తు నిర్వాహకుల్లో ఒకరు. మలితరం భావకవుల్లో ఒకరిగా, వ్యాస రచయితగా, ఉపన్యాసకుడిగా మంచి పేరు.
1948-49లలో హెచ్.ఎం.వి వారు నిర్వహించిన పాటలపోటీలో హనుమచ్ఛాస్త్రిగారు వ్రాసిన “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ” పాటకు స్వర్ణ పతకం వచ్చింది. పెండ్యాల సంగీతంలో రావు బాలసరస్వతి పాడిన ఈ పాట చాలా ప్రాచుర్యం పొందింది.
వీరి రచనలు: దక్షారామం, కీర్తితోరణం (ఖండకావ్యాలు); వ్యాసావళి, కాళిదాసు కళామందిరం, సారమతి నన్నయ, ఆరు యుగాల ఆంధ్రకవిత (సాహిత్య వ్యాసాలు); మౌనసుందరి –ఇతర కథలు (కథాసంపుటం); భాసనాటక చక్రం (13 భాసనాటికలు – రేడియో నాటికలుగా). (శ్రీకాంత శర్మగారి వ్యాసంలో ప్రస్తుత కథాసంపుటం గురించి ప్రస్తావించలేదు; అలాగే, బాగా ప్రశస్తి పొందిన గౌతమీ గాధలు కథల సంకలనాన్నీ ప్రస్తావించలేదు. హాలుడి గాథాశప్తశతిని హనుమచ్ఛాస్త్రిగారు తెలుగుసేత చేశారని కూడా నా జ్ఞాపకం) (3).
పండితులూ, సంప్రదాయజ్ఙులూ అయివుండికూడా నవ్యసాహిత్యంపై విద్యార్థుల్లోనూ, రచయితల్లోనూ అభిరుచి కలగజేసిన సాహిత్య కృషీవలుడు శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి 1987 నవంబరు 14న వరంగల్‌లో మరణించారు.
—
(1) తెలుగు రచయితలు – రచనలు 1875-1980 (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి, 1984) ప్రకారం
కళాభాయి కథానిక 1935 అక్టోబరులో ప్రబుద్ధాంద్ర పత్రికలో,
యతిప్రాస మహాసభ 1936 ఆంధ్రపత్రిక ధాత ఉగాదిసంచికలో, మళ్ళీ 1965 ఆంధ్రపత్రిక ఉగాదిసంచికలోనూ,
ఆశ్రమవాసి 1940 ఫిబ్రవరిలో భారతి పత్రికలో,
దొంగలున్నారు జాగ్రత్త 1940 ఆంధ్రపత్రిక విక్రమ ఉగాదిసంచికలో ప్రచురింపబడ్డాయి.
(2) ibid: కథానికను గూర్చి – వ్యాసం ప్రతిభ 1935 1(2) ధాత సంచికలో ప్రచురింపబడింది.
(3) తెలుగు కథాకోశం (తెలుగు అకాడెమి 2005) ప్రకారం:
ప్రస్తుత కథాసంపుటం హనుమచ్ఛాస్త్రికథలు 13 కథలతో 1945లో ప్రచురింపబడింది. విజయదశమి కథాసంకలనం 10 కథలతో 1951లో ప్రచురింపబడింది. గౌతమీ గాధలు కథాసంకలనం 39 కథలతో 1981లో ప్రచురింపబడింది. (మౌనసుందరి – ఇతర కథలు అన్న సంకలనం ప్రస్తావన ఈ పుస్తకంలో లేదు. విజయదశమి సంకలనంలో మౌనసుందరి అన్న కథ కూడా ఉంది).
హనుమచ్ఛాస్త్రి కథలు
శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి (1911-1987)
1945
సరస్వతీ గ్రంథమండలి అనుబంధ మాలిక: 28
Printed and Published by A. Lakshmana Swamy Naidu for
అద్దేపల్లి అండ్ కొ
సరస్వతీ పవర్ ప్రెస్
రాజమహేంద్రవరము
152 పేజీలు; 1 రూపాయి.
Jampala Chowdary
హనుమచ్ఛాస్త్రి గారివి 28 కథలు “మౌనసుందరి ఇతర కథలు” అనే పుస్తకంగా 2006లో అనల్ప వారు (ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు?) ప్రచురించారు. ఆయన వ్రాసిన 29కథల్లో ‘అయిదు రూపాయల నోటు’ అనే కథ మాత్రం దొరకలేదట. ఈ పుస్తకం గతవారం విజయవాడ పుస్తకప్రదర్శనలో చాలా షాపుల్లో కనిపించింది.
Sreenivas Paruchuri
Yes, “maunasundari” is long available, but not selling well. I bought
my copy in 2007. There are more books missing in the above list of publications. Personally speaking I’d like to see a reprint of “gautamee gaathalu” for the rich cultural hist. data it provides. I have very fond memories of reading the column when it was published in Andhrajyoti weekly in 1980. These clippings were the *only* Telugu material in-print
I carried with me, when I left India 22 years ago :-).
By the way, search for “hanumachchhaastrikathalu” (1945) in DLI.
Regards, — Sreenivas
B. Rama Naidu, London, UK
I surprised to know that senior Indraganti was worked in Jawahar Bharathi, Kavali until 1984. As per the details he was born in 1911 and worked until the age of 73? Probably 74?