పుస్తకం
All about booksపుస్తకభాష

June 22, 2011

మా నాన్నగారు

More articles by »
Written by: Jampala Chowdary

తల్లి గురించి మాట్లాడినంతగా తండ్రిగురించి మాట్లాడుకోవటం మనకు కొద్దిగా తక్కువే. ఐనా గత రెండేళ్ళల్లో తండ్రుల గురించి పిల్లలు చెప్పుకొన్న పుస్తకాలు కొన్ని వచ్చాయి. బుజ్జాయి తన తండ్రి దేవులపల్లి కృష్ణశాస్త్రితో గడిపిన జీవితం గురించి రాసిన నాన్న-నేను పుస్తకాన్ని ఇంతకుముందు సౌమ్య పరిచయం చేశారు. స్వర్ణయుగ సంగీత దర్శకులు పుస్తకంలో ఆ సంగీత దర్శకుల పిల్లల ఇంటర్వ్యూలు ఉన్నాయి. గతవారం పరిచయం చేసిన తెలుగుపద్యమూ-మానాన్న కూడా ఒక తండ్రికి కుమారుడు ఇచ్చిన కితాబే.

మా నాన్నగారు ఈ కోవ పుస్తకాలలో విశిష్టమైనది. ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ ద్వా.నా.శాస్త్రిగారు చాలా శ్రమపడి కీర్తిశేషులైన 62మంది ప్రసిద్ధ సాహితీవేత్తల జీవిత కథలు –వారి పిల్లలు చెప్పగా, సేకరించి ప్రచురించారు. వీటిలో 25 వ్యాసాలు ముందు ఆంధ్రభూమి పత్రికకోసం సేకరించారు. ఆంధ్రభూమి ఆ శీర్షిక ఆపివేసినా ద్వానాశాస్త్రిగారు విరమించకుండా విశ్రమించకుండా ఈ జీవితచరిత్రలను సేకరించారు. ముందుమాటలో చెప్పినదాని ప్రకారం ఇంకొందరు సాహితీవేత్తల పిల్లలు సహకరించి ఉంటే మరిన్ని జీవితచరిత్రలు తెలిసేవి. ఈ సాహితీవేత్తల మగపిల్లలకన్నా ఆడపిల్లలే ఎక్కువగా సహకరించారట ఈ ప్రయత్నానికి.

1882లో పుట్టిన శ్రీ గొబ్బూరి వేంకటానంద రాఘవరావుతో మొదలైన ఈ వ్యాసపరంపర 1934లో పుట్టిన (1999లో మరణించిన) శ్రీ వాకాటి పాండురంగారావుగారి గురించి వారి కుమార్తె అపరాజిత రాసిన వ్యాసంతో ముగుసింది. ఈ మధ్యలో ఎందరో లబ్ధ ప్రతిష్టులు – జనమంచి శేషాద్రి శర్మ, ఒడ్డిరాజు సోదరులు, వేటూరి ప్రబాకర శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, పింగళి కాటూరు కవులు, దీపాల పిచ్చయ్య శాస్త్రి, జాషువా, బాపిరాజు, మొక్కపాటి, అబ్బూరి, సురవరం, గడియారం వెంకటశేషశాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు, కృష్ణశాస్త్రి, గురుజాడ రాఘవశర్మ, గరికపాటి మల్లావధాని, నాయని, నోరి, వేదుల, తుమ్మల, ఆండ్ర శేషగిరిరావు, కందుకూరి రామభద్రరావు, పువ్వాడ శేషగిరిరావు, బులుసు వేంకటరమణయ్య, కొత్త సత్యనారాయణ చౌదరి, సుద్దాల హనుమంతు, ఖండవల్లి లక్ష్మీరంజనం, నార్ల, కొనకళ్ళ వెంకటరత్నం, సుంకర సత్యనారాయణ, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, రావూరు వెంకటసత్యనారాయణ రావు, దివాకర్ల వెంకటావధాని, జంధ్యాల పాపయ్య శాస్త్రి, వనమామలై, కొవ్వలి, తిరుమల రామచంద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు, చాసో, పాలగుమ్మి పద్మరాజు, దేవులపల్లి రామానుజరావు, మా గోఖలే, బోయి భీమన్న, మధునాపంతుల, తిలక్, రావి శాస్త్రి, అనిసెట్టి, కుందుర్తి, దాశరథి కృష్ణమాచార్య, తూమాటి దోణప్ప, బలివాడ కాంతారావు, ఉషశ్రీ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, శశాంక, మధురాంతకం రాజారాం, నాగభైరవ కోటేశ్వరరావు, కేతవరపు రామకోటిశాస్త్రిల గురించి వ్యాసాలున్నాయి. పుట్టినరోజుల ప్రకారం వరుసకూర్చారు.

ఆడిటోరియంలో నుండి రంగస్థలంపై నటుణ్ణి చూసేవారికన్నా, గ్రీన్‌రూంలో నుండి చూసేవారికి ఆ నటుడి గురించి ఎక్కువ తెలుస్తుంది అన్నారు ముందుమాట రాసిన ఎం.వి.ఆర్. శాస్త్రి (నిజానికి ఈ పుస్తకానికి ఐదు ముందు మాటలు ఉన్నాయిలెండి, అది వేరే విషయం). ఈ పుస్తకంలో కొందరు సాహిత్యంగురించి మాట్లాడినా, ఎక్కువమంది తమ తండ్రుల వ్యక్తిగత జీవనానికి, తమ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలగురించి మాట్లాడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుచేత,  ఇంతకు ముందు తెలీని వేరేకోణం నుంచి వారి గురించి తెలుసుకోవటానికి ఈ వ్యాసాలు బాగా ఉపకరించాయి. ఈ జీవితచిత్రాలలో ప్రేమ, ఆరాధన ఎక్కువగానూ,   విమర్శనాత్మక దృష్టి తక్కువగానూ ఉన్నాయని ఒప్పుకోవాలి.  ఈ వ్యాసాలన్నీ కలిపి చదువుతుంటే ఒక శతాబ్దపు సాంఘిక, సాహిత్య చరిత్రలు కొద్దికొద్దిగా తెలుస్తాయి.

సంకలనకర్త డా.ద్వానాశాస్త్రి తమ తండ్రిగారి గురించి కొన్ని వివరాలు తెలిపారు. అలాగే ముందుమాటలు రాసినవారిలో ఒకరిద్దరు కూడా తమ తండ్రులను గుర్తు చేసుకున్నారు. పుస్తకాన్ని ద్వానాశాస్త్రిగారు తమ తండ్రి శ్రీ ద్వాదశి వెంకట శివరామకృష్ణశాస్త్రిగార్కి అంకితం ఇవ్వటం సముచితంగా ఉంది.

పుస్తకం చదువుకోవడానికి వీలుగా సరళమైన శైలిలో ఉంది. ప్రతి వ్యాసంలోనూ, సాహితీ వేత్త, వ్యాసకర్తల ఫొటోతోలతోపాటు జీవిత వివరాలు, సాహిత్య సేవలో ముఖ్యాంశాలు పొందుపరిచారు. రిఫరెన్సు పుస్తకంలా ఉపయోగపడుతుంది. పుస్తకాన్ని అందంగా ముద్రించారు. అచ్చుతప్పులు ఎక్కువగా కనిపించలేదు. పుస్తకానికి బాపుగారు అందించిన ముఖచిత్రం ఎప్పటిలాగానే అందంగానూ, భావస్ఫోరకంగానూ ఉంది.

ఈ శీర్షికలో వ్యాసాలు తెస్తే బాగుంటుందని సంకల్పించి, శ్రమకోర్చి ఈ పుస్తకాన్ని తెచ్చిన డా. ద్వా.నా.శాస్త్రి కృషి అభినందనీయం.

మా నాన్నగారు
కీర్తిశేషులైన అరవైరెండు మంది సాహితీప్రముఖుల జీవిత విధానాలు
డా. ద్వా.నా.శాస్త్రి
కిన్నెర పబ్లికేషన్స్
2-2-647/153, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ
హైదరాబాద్ 500 013
ఫోన్: 040- 2742 6666
విశాలాంధ్ర ద్వారా పంపిణీ
379 పేజీలు; 400 రూ/ 25 డాలర్లు

ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో గతంలో తృష్ణ గారు రాసిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.

***********************************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
***********************************About the Author(s)

Jampala Chowdary

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానాకు 2013-2015కు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, 2015-2017కు అధ్యక్షుడిగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.17 Comments


 1. Srinivas Nagulapalli

  జంపాలగారికి కృతజ్ఞతలు ఈ పుస్తకం గురించి మళ్ళీ గుర్తుచేసినందుకు. మళ్ళీ అని ఎందుకంటే ఇందులోని కొన్ని భాగాలు ఆంధ్రభూమిలో ఇదివరకు చదివి ఆనందించినవి తిరిగి గుర్తుకుతెచ్చినందుకు. మొదట్లో వచ్చిన భాగాలు చదివినవారికి, చదవనివారికి, చదివి మరచినవారికి, అందరికీ సౌలభ్యంగా ఉండేటట్లు అందించడం సముచితం.

  ఎంతో శ్రమతో పరిశ్రమతో దీన్ని అందించిన ద్వానాశాస్త్రిగారి కృషికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇది అయిపోయిన పుస్తకం కాకుండా, మరిన్ని సాహితీవేత్తల గురించి మరిన్ని విషయాలు వారు అందించాలని ఆశ.

  “ఇట్లాంటి పుస్తకాల వల్ల సాహిత్యప్రయోజనమేమి ?” అన్నది మంచి ప్రశ్న. సాహిత్యానికి ఉండే ప్రయోజనమే ఇట్లాంటీ పుస్తకాలకు కూడా ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే, మనిషి వేరు, మనిషి కళ, ప్రతిభ వేరు కాదు.
  అంతర్లీనమైన మనిషి ప్రతిభ అనుకోకుండా దైనందిక జివితంలో సైతం తొంగి చూస్తుంటుంది, అప్రయత్నంగా. ఇక అసాధారణమైన సాహితీవేత్తల విషయంలో వేరేగా ఎందుకుంటుంది? ఆలోచనామృతంగా ఏదైనా సాహిత్యం మనల్ని ఆకట్టుకుంటే, దాన్ని అందించిన వారి నిత్యజీవితంలో సైతం అదే ఆలోచనా రీతులు,దృష్టి దృక్పథాలు ఆసక్తిని కలిగించడం ఆశ్చర్యం కాదనిపిస్తుంది. గొప్ప నటుడు గ్రీన్ రూంలో సైతం గొప్పగానే నటిస్తాడు, కాదు, జీవిస్తాడేమో!
  =========
  విధేయుడు
  -శ్రీనివాస్


 2. ఈ పుస్తకం ఆవిష్కరణ విశాఖపట్నంలో జరిగినప్పుడు సభకు కొంచెం సేపు ముందర,సభానంతరం ద్వానాశాస్త్రి కొన్ని విషయాలు చెప్పారు.అవికొందరి సభ్యతసంస్కారాలకు సంబంధించినవి,అవి ఇక్కడ అప్రస్తుతం అయితే విన్ననాలాంటి వారు ఆయావ్యక్తుల ప్రవర్తనకు కాస్తంత బాధపడ్దమాట మాత్రం నిజం.మిత్రులద్వారా తెలిసిందేమంటే ద్వానాశాస్త్రి గారు ప్రస్తుతం ఈ పుస్తకానికి అనుబంధంగానో స్వతంత్రంగానో మరొక పుస్తకం తెస్తున్నారని,అది నిజమవ్వాలని కోరుకుందాం.
  మానాన్నగారు పుస్తకం లాగానే విశాఖపట్నానికి చెందిన సాహితీవేత్తలతో వీడియో ఇంటర్వ్యూలు తీసుకొద్దామని కొంతమందిమి ఒక ప్రణాళిక వేసాం.వీడియోకెమెరా,వగైరాలున్నా స్పాన్సర్ల కొరతవల్ల ఆ కార్యక్రమం మూతపడింది.


 3. SIVARAMAPRASAD KAPPAGANTU

  @Pustakam.net

  అవును మీ వ్యాఖ్యతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇదొక సాహిత్య చర్చా వేదిక. ఇక్కడ సామాజిక వర్గాల అనవసర ప్రస్తావన తీసుకురావటం వలన కొంత స్పందించాల్సి వచ్చింది. ఈ వేదిక లో వ్యాసం వ్రాయబడిన పుస్తకం గురించి, ఆ పుస్తకంలో ఉన్న వస్తువు గురించి చర్చ జరిగితేనే బాగుంటుంది. అనవసర విషయాల ప్రస్తావన తేకుండా ఉంటేనే మంచిది.

  లలితా స్రవంతిగారూ,

  బాగా చెప్పారు. ఈ మధ్య అతి చిన్న విషయాలలోంచి కూడ స్వామ్యాలు, ఇజాలు, సామాజిక వర్గ దృక్పథాలు లాగటాలు ఎక్కువైపోయి అదే సాహిత్య చర్చ అనిపించేట్టు చేస్తున్నారు.

  “మా నాన్నగారు” చక్కటి పుస్తకం, తెలుగు సాహిత్యంలో ఉన్న మహామహులందరి గురించి వారి వారి పిల్లలు వ్రాయటం అద్భుతమైన విషయం, ఒక చక్కటి సాహిత్య ప్రక్రియ. సాహిత్య కారులుగా మనకు తెలిసిన రచయితలు, ఇళ్ళల్లో ఎలా ఉండేవారు, తండ్రి పాత్ర ఎలా పోషించారు అన్న కోణాలను స్పృశిస్తూ చక్కటి సాహిత్య ప్రయోగం చేశారనిపిస్తున్నది సమీక్ష చదువుతుంటే. ఈ సారి విజయవాడ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొనవలసిన పుస్తకంగా జాబితాలో చేర్చుకున్నాను.


 4. @పుస్తకం.నెట్
  సరిగ్గా నేనూ ఇదే అనుకుంటున్నాను. పుస్తకం.నెట్లోని వ్యాసాల్లో పుస్తకం గురించి కాని చర్చ జరగడం ఇది దాదాపు మొదటిసారి కావచ్చు, చివరిసారీ కావాలి.
  @రమణ గారు,
  ఇక పుస్తకం సాహిత్య ప్రయోజనాల విషయానికి వస్తే, అసలా ప్రశ్నే అసందర్భంగా ఉంది. ఆత్మకథలకు ఎలాంటి సాహిత్య ప్రయోజనాలుంటాయో ఇలాంటి మ్యూజింగ్స్ కీ అలాంటి సాహిత్య ప్రయోజనాలే ఉంటాయి.
  పుస్తకం శీర్షిక విషయానికి వస్తే.. ఆ పుస్తకంలో వ్యాసకర్తల్లో ఎక్కువమంది..నాన్న గారూ అనే పిలిచారు. అందుకే పుస్తకానికి నాన్నగారని పేరుపెట్టారు. రమణగారు అలాంటి వ్యాసాలతో పుస్తకం తెస్తే నాన్న అని పేరు పెట్టవచ్చు. ఆయన నాన్నా అని పిల్చారు కనుక.అసలు ఇందులో చర్చకి ఆస్కారం ఎక్కడుంది. వాళ్లెందుకలా పిలిచారు అన్నదాని గురించే అయితే మీరు మీ బ్లాగులో రాసుకుంటే పోయేది కదా.


 5. పుస్తకం.నెట్

  అందరికీ ఒక విజ్ఞప్తి: దయచేసి అందరూ వ్యాసం గురించి గానీ, దాని విషయం గురించి గానీ, అన్నింటికీ మించి పుస్తకం గురించి గానీ చర్చకు పరిమితం కాగలరు.
  -అడ్మిన్.


 6. lalitha sravanthi

  అమ్మ దగ్గర చనువు ఎక్కువ, అమ్మది అవ్యాజ్యమైన ప్రేమ. అంత మాత్రానా తన మీద గౌరవం లేనట్టు కానే కాదు. నా పిల్లలకు మాత్రం నేను నాన్న గారు అనే అలవాటు చేస్తాను. భక్తి, గౌరవం అన్నది మొదట పిలుపు నుంచీ మొదలౌతాయి. నా భర్తను నా పిల్లలు అన్ని రకాలు గా గౌరవించాలి అనే నేను కోరుకుంటాను. అలాగే నా భర్త కూడా పిల్లలతో చనువుగాను ఉండాలి అని ఆశిస్తాను. ఇదేదో నేను పితృస్వామ్య ను బలపరుస్తున్నందుకు కాదు, నేను పైన చెప్పిన సామాజిక వర్గానికి చెందిన దాన్ని అని అసలే కాదు


 7. శివరామప్రసాద్ కప్పగంతు

  @రమణ గారు

  ఒక పుస్తకం, ఆ పుస్తకానికి పెట్టిన పేరు గురించి చర్చ జరుగుతుండగా సామాజిక వర్గ ప్రస్తావన తేవటం దేనికి? మీ జవాబులో అంత వ్యంగ్యం దేనికి పరుష పద ప్రయోగం దేనికి. గుంటూరు వాళ్ళు బెజవాడ వాళ్ళు అని వేర్పాటు వాదం చెయ్యటం దేనికి. మీరు వ్రాసిన జవాబు మరొకసారి మీకున్న ప్రెజ్యుడీస్ తెలియచేస్తున్నది. మీరు ఉండే ప్రాంతల్లో అలా పిలుస్తూ ఉంటే అదే వ్రాయాలికాని, ఆ సామాజిక వర్గం మొత్తం అలా పిలుస్తుంటారు అన్న దురభిప్రాయాన్ని కలగచేసేట్టుగా వ్రాయటం దేనికి? మీకు తెలియని విషయం మీద జనరలైజేషన్ దేనికి? మీకు తెలిసినది మాత్రమే ప్రపమంచం మొత్తం అనేసుకుంటూ ఉంటారు అని వ్రాసేయటం మీ అహంకారాన్ని సూచిస్తున్నది అని మీకు తెలిసినట్టులేదు.


 8. రమణ

  శివరాం ప్రసాద్ గారు ,
  మనం పుట్టిన ప్రాంతం , సామాజిక నేపధ్యం బట్టే మన భాష ఉంటుంది . ద్వా.నా.శాస్త్రి తన తండ్రిని ” అయ్యా ” అని పిలవరు . అలాగే నామిని తన తండ్రిని ” నాన్నగారు ” అని పిలవరు . నేను ఒక సామాజిక వర్గాన్ని ” దారుణంగా ” అవమానించినట్లుగా అభిప్రాయపడ్డారు . మీ అభిప్రాయం తప్పు . కొన్ని వర్గాల వారు దున్న మాంసాన్ని ఇష్టంగా తింటారు . అది వారి ఆహారపు అలవాటు . అట్లాగే మన భాష , సంబొధనలు కూడా .
  నేను గుంటూరు బ్రాడీపేటలో పుట్టి పెరిగాను . ఇంకా పెరుగుతూనే ఉన్నాను . నాకు ” నాన్నగారు ! సినిమాకెళుతున్నానండి .” .. ” అమ్మా ! ఒక కప్పు కాఫీ ఇవ్వవే ” వంటి పిలుపులు / భాష చిరపరిచితం . నేను ఆ సామాజిక వర్గం వాడిని కాదు కాబట్టి అబద్దాలు రాస్తున్నానని మీరు భావిస్తే నే చెప్పేదేమీ లేదు . మరి మా గుంటూరు వాళ్ళు మీ బెజవాడవాళ్ళంత జ్ణానులు కారేమో !
  మీ వర్గం వారికి ఏదో ఆపాదిస్తున్నానని అనటం ( నేను కేవలం నా అబ్సర్వేషన్ మాత్రమే రాశాను . ) మీ దురభిమానాన్ని సూచిస్తుంది . తండ్రులు , తల్లుల గూర్చి రాయటంలో ఎటువంటి సాహిత్యప్రయోజనం లేదనే అభిప్రాయం కూడా రాశాను . వాస్తవానికి ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తారనుకున్నా . కానీ మీకు మాత్రం సామాజిక వర్గ ప్రస్థావన మాత్రమే దారుణంగా అనిపించింది . సంతోషం .


 9. రమణ కుమార్

  అందరికీ,
  పుస్తకం పేరు ” మా నాన్నగారు. ”
  ఏ సామాజిక వర్గం వారైనా ( కులం అన్న పదానికి బదులుగా ఈ పదాన్ని వాడుతున్నట్టయితే ” కులం ” లో ఉన్న చెడు ఏమిటి ? ” సామాజిక వర్గం ” లోవున్న మంచేమిటి ? అనేది ఓ పెద్ద జవాబు దొరకని ప్రశ్న )
  స్త్రీలయినా పురుషులైనా ( రెండూ అయినవాళ్ళూ లేదా కానివాళ్ళతో సహా ) ఎవరయినా సరే మూడో మనిషిని గురించి చెప్పేటప్పుడు ” గారు ” అనే గౌరవ వాచకంతోనే సంభావిస్తారు. అమ్మని ” ఏంటే ” అనే కుసంస్కారి అయిన పురుషాహంకారి కూడా తల్లి గురించి మూడో మనిషితో ” మా అమ్మ గారు ” అనే చెబుతారు తప్ప ఏకవచన ప్రయోగం చెయ్యరు. రమణ, సౌమ్య, నాగమురళి, కళ్యాణి, రామ, శివరామ ప్రసాద్ గార్లలో ఎవరయినా అలాంటి ఏకవచన ప్రయోగం చేసేవాళ్ళెంతమందిని చూశారో ఒకసారి గుర్తుచేసుకోండి. ఇక్కడ తల్లినెలా పిలుస్తున్నారు తండ్రినెలా పిలుస్తున్నారు తల్లికి లేని గౌరవం తండ్రికి దక్కడం వెనుక ఉన్న కుట్రలూ కుతంత్రాల గురించి చర్చ సాగుతోంది.
  నిజానికి పిలుపులనేవి సెకండ్ పెర్సన్ లో మాత్రమే వుంటాయి.
  కానీ ఇది “మా నాన్న గారు ” అనే థర్డ్ పెర్సన్ గురించి వాళ్ళ పిల్లలు చెప్పిన విషయాలని సేకరించిన పుస్తకం కాబట్టీ ఈ పుస్తకానికి సంబంధించినంతవరకూ ” గారు ” అనే గౌరవ వాచకం చర్చనీయాంశం కానే కాదు.
  అలాగే ఎమ్వీఆర్ శాస్త్రిగారు ధ్వని ప్రధానంగా చెప్పిన మాటలవి. ప్రేక్షకులు చూసేది కృతకమైనదీ గ్రీన్ రూంలో చూసే వారికీ ఆ రంగుల వెనుకనున్న అసలు ముఖాలు కనిపిస్తాయనేది ఆయన ఉద్దేశం. ఆ గ్రీన్ రూంలో చూసేవాళ్ళుకూడా ఆయా నటుల ముఖాలమీద ముసుగులు కప్పుతారనేదే ఆరోపణ అయితే దాన్ని ఆ ఆరోపణచేసిన వారికే వదిలెయ్యడమే మంచిది. ఎందుకంటే ఒక్కోసారి అలంకరణలే అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. అలాగే కొన్ని ముఖాలమీద ముసుగులు వెయ్యడం వల్ల కూడా ప్రత్యేకమైన ప్రయోజనాలుండవచ్చు.


 10. శివరామప్రసాద్ కప్పగంతు

  నేను విజయవాడ సత్యనారాయణపురంలో పుట్టి పెరిగిన వాణ్ణి. రమణగారు “…తండ్రిని ‘ నాన్నగారు ‘ అనీ , తల్లిని ‘ ఏమే ‘ అని పిలిచే అలవాటు కొన్ని సామాజిక వర్గాల్లో మాత్రమే ఉంది . ఎక్కువ మంది ఆ వర్గీయులే కావున .. రచయిత ఆ శీర్షిక పెట్టి ఉండొచ్చు…” అని అభిప్రాయపడ్డారు

  ఆ సామాజిక వర్గమే నాది కూడాను! కాని మా ఇంట్లో కాని, మా బంధువుల ఇంట్లోకాని, తెలిసిన వాళ్ళ ఇంట్లో కాని, “నాన్నగారు” సంబోధన వినపడలేదు. ఈ మాట కొద్దిగా ఫ్యాషనబుల్ అనిపించుకునే అతి కొద్ది కుటుంబాల్లోనే ఉన్నది కాని, పూర్తిగా ఒక సామాజిక వర్గానికి అంటగట్టటం తప్పే కాదు, దారుణం. అమ్మను “ఏమే” అని పిలిచినప్పుడు, నాన్నను ఏరా అని పిలుస్తారా! అమ్మను, “అమ్మా” అని, నాన్నను, “నాన్నా” అని పిలవటం మాత్రమే మాకు తెలిసిన పిలుపులు.

  ద్వా నా శాస్త్రి గారు పుస్తకానికి పేరు పెట్టేప్పుడు ” మా నాన్న” బదులుగా “మా నాన్నగారు” అని గౌరవంగా పెట్టి ఉంటారు కాని, ఇదేదో సామాజిక వర్గం మొత్తాన్ని ప్రతిబింబించటానికి కాదని నేను అభిప్రాయపడుతున్నాను. వారి తండ్రి గారి కాలంలో “నాన్న గారు” అనే కృతకమైన సంబోధన లెనే లేదు. ఇది గత నాలుగు-ఐదు డశాబ్దాల్లో వచ్చిపడిన పద ప్రయోగం, ఒక శాతంగా కూడ లెక్క కట్టలేనంత తక్కువ మంది చేత సంబోధనల్లో వాడబడుతున్న మాట.


 11. రమణ

  ” ఆడిటోరియంలో నుండి రంగస్థలంపై నటుణ్ణి చూసేవారికన్నా, గ్రీన్‌రూంలో నుండి చూసేవారికి ఆ నటుడి గురించి ఎక్కువ తెలుస్తుంది అన్నారు ముందుమాట రాసిన ఎం.వి.ఆర్. శాస్త్రి .”
  ఈ వ్యాఖ్యని నేను ఒప్పుకోను . ఒక నటుణ్ణి గ్రీన్ రూం లోంచి చూసేవారికి ఎక్కువ తెలిసేదేమిటి ? చుట్ట కాలుస్తాడా ? బీడీ కాలుస్తాడా ? మందు తాగుతాడా ? లేదా ? లాంటి పనికి మాలిన విశేషాలు తప్ప ! ఇట్లాంటి పుస్తకాల వల్ల సాహిత్యప్రయోజనమేమి ?
  ఈ మధ్య కాలంలో అసలు సాహిత్యాన్ని ఒదిలేసి .. కొసరు విషయాల పట్ల ( సినిమా నటుల వ్యక్తిగత జీవిత విశేషాలు హాటు కేకులు ) కొంతమంది శ్రద్ధ చూపిస్తున్నారు . రచయితలు ఆకాశం లోంచి ఊడిపడలేదు . మనలాంటి సాధారణ వ్యక్తులే . దుర్భర దారిద్ర్యం అనుభవించిన శారద గూర్చి ఎవరూ రాయరు . శ్రీరంగం నారాయణబాబు గూర్చి కూడా రాయరు . శ్రీశ్రీ గనక నాకు ” నాన్నగారు ” అయినట్లయితే .. అసలు మా నాన్నగారు మద్యమెప్పుడూ ముట్టలేదనీ , అన్నీ అపోహలనీ రాస్తాను .
  గొప్ప రచయితలు , కవులు మందు , సిగరెట్టు తాగుతూ మరియూ తాగకుండా .. పంట్లాం , చొక్కాతోనో లేదా పంచ , ఉత్తరీయం తోనో .. పెళ్ళి చేసుకుని గంపెడు మంది పిల్లలతో సంసారాన్ని ఈదుతూనో లేక అసలు పెళ్ళే చేసుకోకుండానో .. గొప్ప రచనలు చేశారు . మారుతున్న సమాజానికి అణుగుణంగా ఆ రచనలు బతకొచ్చు . లేదా సహజమరణం పొందొచ్చు .
  చిన్న ఉదాహరణ . నేను గుంటూరు మెడికల్ కాలేజిలో చదివేప్పుడు ఒక ఫంక్షనుకి రావిశాస్త్రి వచ్చారు . నా స్నేహితుడు రావిశాస్త్రి సిగరెట్ బ్రాండ్ ఏమిటో తెలుసుకోటానికి తహతహ లాడాడు . ఆ బ్రాండ్ సిగరెట్ తాగుతూ తను కూడా ఒక అల్పజీవిని స్రుష్టించగలననే నమ్మకంతో !
  కామెంట్ కొంత హార్ష్ గా ఉంది . క్షమించగలరు .


 12. ఈ పిలుపులు కొంచెం క్లిష్టమైనవే. మేము తండ్రిని “నాన్న”, తల్లిని “అమ్మ” అని పిలిచినా, వేరొకరితో చెప్పినప్పుడు “మా నాన్నగారు/అమ్మగారు ఇలా” అని అనేవాళ్ళం. ఐతే, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు “నాన్న చెప్పారు” – “అమ్మ చెప్పింది” అనడం కద్దు. పితృస్వామ్యం? ఏమో?. ఇప్పుడు మా పిల్లలకీ ఇంచుమించు అదే నేర్పుతోంది నా భార్య :).
  ఒక ఎక్సప్షన్ ఏమిటంటే మా తాతగారు మా నాన్న గురించి “ఏరా మీ నాన్న వచ్చాడా” అంటే మాత్రం “నాన్న వచ్చాడు” అనే వాళ్ళం అదేమిటో.
  ఈ విధంగా చూస్తే, ఈ పుస్తకం లో ఉన్న తండ్రులందరి గురించీ వాళ్ళ వాళ్ళ పిల్లలు బయటి వాళ్ళతో చెబుతున్నారు కాబట్టి “గారు” అనడం నాకు వింతగా అనిపించలేదు.


 13. కళ్యాణి

  “నాన్నగారు “అనేది పితృస్వామ్య భావజాలానికి ప్రతీకా ? అని అడిగారు.
  అవును !
  అది ఖచ్చితంగా పితృస్వామ్య భావజాలమే.


 14. పిలుపుల గురించి కొంత ‘చర్చ’ జరుగుతున్నట్టుంది కాబట్టి ఓ సరదా భోగట్టా. మాకు తెలిసిన ఓ పెద్దాయన వాళ్ళమ్మగారిని ‘అమ్మగారూ’ అని పిల్చేవారు. (నాన్నని ‘నాన్నగారూ’ అనేవారని ప్రత్యేకంగా చెప్పక్కరలేదనుకుంటా). అమ్మ మీద కోపం వచ్చినప్పుడు, ‘అమ్మగారూ, కాస్త నోరుమూస్తారా’ అని కసిరేవారు.


 15. రమణ

  తెలుగు నిఘంటువులో ‘ నాన్న ‘ పదం ఉంది . కానీ .. ఈ ” నాన్నగారు ” అనే పదం ఉందో లేదో తెలీదు . నాకు మాత్రం ‘ నాన్న ‘ లో ఉన్న ఆప్యాయత ‘ నాన్నగారు ‘ లో ధ్వనించదు . నేను మా నాన్నని నాన్నా అనే పిలిచాను . నా పిల్లలు నన్ను నాన్నా అనే పిలుస్తారు . ఈ ‘ నాన్నగారు ‘ అనే పిలుపు పిత్రుస్వామ్య భావజాలానికి ప్రతీకా ? ఆంగ్లంలో ఇట్లాంటి ఇబ్బందులు లేవు . పెద్దలని గౌరవించటం మన సంప్రదాయమంటూ .. ” రావిశాస్త్రీయం ” కాస్తా ” రావిశాస్త్రిగారీయం ” గా మారిస్తేనే ఇబ్బంది .
  మనవి .. నా స్నేహితులలో నాన్నగారు ! నాన్నగారండీ ! అని పిలిచేవాళ్ళు ఉన్నారు . అది వారి ఇష్టం . అలా పిలిచేవారెవరూ నా అభిప్రాయలని అపార్ధం చేసుకోరాదని విజ్ణప్తి . ఇది కేవలం చర్చ కోసమే .


 16. సౌమ్య

  >>తల్లిని ‘ ఏమే ‘ అని పిలిచే అలవాటు
  -తల్లిని ఏమే అని పిలుస్తారా??? ఆ పిలిచే వాళ్ళు నాన్నని మాత్రం నాన్న గారూ అంటారా??? ….. షాకింగ్!
  అమ్మని “నువ్వు” అని..నాన్నని “మీరు” అని మాట్లాడే వాళ్ళని చాలామందినే చూశాను….. (మా ఇంట్లో నువ్వు అనే అనే వాళ్ళం ఇద్దరినీ. అమ్మ నాన్నని మీరు అన్నా, పిల్లలు నువ్వు అనడం ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తుంది..హీహీ)


 17. రమణ

  ఇటువంటి ప్రయోగం వేరే ఏదైనా భాషలో జరిగిందా ? ” నాన్నగారు ” బదులుగా ” నాన్న ” అనుంటే బాగుండేది . తండ్రిని ‘ నాన్నగారు ‘ అనీ , తల్లిని ‘ ఏమే ‘ అని పిలిచే అలవాటు కొన్ని సామాజిక వర్గాల్లో మాత్రమే ఉంది . ఎక్కువ మంది ఆ వర్గీయులే కావున .. రచయిత ఆ శీర్షిక పెట్టి ఉండొచ్చు . అదే తమ తల్లుల గూర్చి రాస్తే ” అమ్మగారు ” అనే శీర్షిక కింద ఈ తరహ వ్యాసాలు ప్రచురించబడతాయా ? ఆలోచించవలసిందే .  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 

 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1