“నిద్రితనగరం” : ఒక నిర్ణిద్ర అనుభవం

ఆధునిక కవిత్వంలో ప్రకృతిప్రేమికత్వం అరుదుగా కనిపించే లక్షణం. ఆధునిక కవులకి ప్రకృతి కంటే ముఖ్యమైన విషయాలు ఎక్కువైపోవడం బహుశా ఒక కారణం. వారసలు ప్రకృతిదృశ్యాలకి దూరమైన పరిసరాల్లో పుట్టి పెఱగడం మఱో కారణం. అభ్యుదయవాదాల అతివేల ప్రాబల్యం చేత కవిహృదయాలలో మానవప్రేమ అతిశయించి ప్రకృతికి స్థానం కుచించుకు పోయిందేమో ననిపిస్తుంది. ప్రకృతినీ, మానవుణ్ణీ వేఱుచేసి, వారిద్దఱి మధ్యా అభూతపూర్వమైన ఘర్షణని ఊహించుకుంటూ, అతణ్ణి ప్రకృతి మీద ద్వేషాత్మక విజేతని చేసి మాట్లాడే శైలి కొద్ది దశాబ్దాలుగా వాడుకలోకి వచ్చింది. సమాజాలూ, వాదాలూ, ఇజాలూ, అజెండాలూ, నిబద్ధతలూ పెచ్చుమీఱి ప్రకృతిని మర్చిపోయిన పురుష కవుల్నీ, వారిని గుడ్డిగా అనుసరించే మహిళల్నీ సుతారంగా ఒక మొట్టికాయ మొట్టి ప్రకృతి వైపు వారి సావధానాన్ని తిరిగి మళ్ళించడానికి ఆ ప్రకృతే తన జీవస్వరూపాలైన కవయిత్రుల ద్వారా యత్నిస్తోంది కాబోలు ననిపిస్తుంది, ఈ మధ్య వెలువడుతున్న కొన్ని సంకలనాల్ని చదివినప్పుడు !  ప్రకృతిని ప్రేమించాలంటే అందులో కొంతకాలమైనా జీవించాలి. కానీ ఒక్ఖ జీవించడమే కాదు, ప్రకృతి మధ్యనే పుట్టి అక్కడే పెఱిగిన కవయిత్రి శ్రీమతి డాక్టర్ వైదేహిశశిధర్. ఆమె రచించిన నిద్రితనగరం కవితాసంకలనం పేరులోనే నగరం. నిజానికి అంతస్సారమంతా ప్రకృతిప్రేమమయం.

1969 ప్రాంతాల్లో జన్మించిన డా|| వైదేహిశశిధర్ గుంటూరుజిల్లా రేపల్లె దగ్గఱ నగరం అనే అందమైన కుగ్రామంలో తన అందమైన బాల్యాన్ని గడిపారు. ఇంటర్మీడియట్ తరువాత విశాఖపట్నంలో వైద్యవిద్య నభ్యసించి అమెరికా వెళ్ళారు. అక్కడ న్యూజెర్సీ రాష్ట్రంలో వైద్యురాలుగా స్థిరపడ్డారు. ఆ దంపతులకు ఇద్దఱు అమ్మాయిలు. వైదేహివాళ్ళ నాన్నగారు శ్రీ C.S.రావుగారు వృత్తిరీత్యా ఆంగ్ల అధ్యాపకులు కావడం, అయినప్పటికీ ఆంధ్రసాహిత్యంలో కూడా లోతైన పరిజ్ఞానం కలిగి ఉండడం – ఇవన్నీ కవయిత్రి కావ్యకళా పరిణామానికి చాలా సానుకూలంగా దోహదించినట్లు కనిపిస్తున్నది. “నా మాట” అనే శీర్షికతో వ్రాసిన నాందీవాక్యాలలో కవయిత్రే ఇలా తెలియజేశారు :

“సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం పట్ల నా ఆలోచనలు రూపుదిద్దుకొనటంలో పరోక్షంగా మా నాన్నగారి ప్రభావం బలీయంగా ఉంది. ఎన్నో సాయంత్రాలు హైస్కూల్ నుంచి వచ్చి హడావిడిగా బాగ్ ఓ మూలకు విసిరేసి, నేరేడు చెట్టుకిందో, యూకలిప్టస్ కొమ్మల కిందో, పడకకుర్చీలో సేదదీరే మానాన్నగారి దగ్గరకు పరుగెత్తి ఆయనతో కవిత్వం గురించి, కవిత్వంలో స్థాయిభేదాల గురించి, కవిత్వం పట్ల ప్రముఖకవుల నిబద్ధత, నిజాయితీల గురించి, కవిత్వంలో ఇజాలు, వాదాలు, కవిత్వానుభూతి గురించి రకరకాలుగా చర్చించుకోవటం, వివిధ వచన పద్య కవితల్ని గొంతెత్తి చదువుకోవటం (భోజనానికి ఆలస్యమవుతుందని మా ఇద్దర్నీ మా అమ్మగారు విసుక్కునేంతవరకూ) నాకు చాలా ఇష్టమైన జ్ఞాపకాలు.”

సకలలోక వందనీయమైన ప్రతిభామతల్లిక హఠాత్తుగా ఆకాశంలోంచి ఊడిపడదనీ, కాలేజీలలో అస్సలు పుట్టదనీ, ఇలాంటి సాంస్కృతిక నేపథ్యాలూ, పరిసరాలూ, వారసత్వాలూ, బంధుత్వాలూ, సన్నివేశాలూ ఎన్నో ఎన్నెన్నో సమ్మేళించి వాటిల్లోంచి అంతిమ ఫలస్వరూపంగా ప్రతిభామూర్తులూ, కళాఖండాలూ ప్రాదుర్భవిస్తాయనీ నేను మొదట్నుంచీ భావిస్తూ వచ్చాను. నా అభిప్రాయాలకి డా.వైదేహిశశిధర్ ఒక తార్కాణం కావడం మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తున్నది. చేసేది రక్తమాంసాల్ని విశ్లేషించే వైద్యవృత్తి అయినా ఆమె హృదయం మాత్రం ఊహల ఉయ్యాల కావడం ఆసక్తికరం. ముఖ్యంగా విదేశాలకి వెళ్ళిన తదుపరి తమ మూలాల్ని టోకుగా మర్చిపోయేవారే అధికంగా ఉన్న జనాభాలో ఇంత బాగా ఆ గడ్డ మీద మాతృభాషా రచనాప్రావీణ్యాన్ని స్వంతం చేసుకున్న తెలుగువారు తారసిల్లితే చాలా ఆనందం కలుగుతుంది. ఈ పుస్తకానికి ఆచార్య చేకూరి రామారావుగారు ముందుమాట వ్రాస్తూ శ్రీమతి వైదేహిని “అచ్చమైన కవితాస్వరూపిణి” గా అభివర్ణించారు. “వైదేహి ఏం వ్రాసినా వెంటనే కవిత్వమైపోతుంది” అని వ్యాఖ్యానించారు. నిజమేననిపిస్తుంది, అందఱమూ అనుభవించే సందర్భాలూ, భావాలే ఆమె చేతిలో శక్తిమంతమైన కవితలుగా పోతపోసుకుని సాక్షాత్కరించడం గమనిస్తే !

నువ్వు లేనప్పుడల్లా అనే కవిత చూడండి !

“……………………………..
నువ్వు లేనప్పుడల్లా
ధృవాగ్రాలపై పేరుకొన్న కఠిన శీతాకాలపు
కర్కశహిమంలా ఘనీభవిస్తుంది
ఎంతకీ కరగని కాలాన్ని ప్రవహింపచేయాలని
ఎన్ని ఆలోచనల దీపాలని వెలిగిస్తాను”

అలాగే “నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య” అనే కవితలో కవయిత్రి గీచిన పదచిత్రాలు.

“అసహనం నీ చేతిలో రిమోట్‌లా ఒదిగి
ఆలోచనల ఛానెళ్ళను అస్తవ్యస్తంగా మారుస్తుంది
…………………………………….
ఎందుకో ఒక్కోసారి
నీతో మాట్లాడకపోయినా
మాట్లాడుతున్నట్లే ఉంటుంది. “

ఈ సంకలనానికి తన పేరుని అరువిచ్చిన అసలుకవిత “నిద్రితనగరం” చూడండి. ఇది రాత్రిచీకట్లలోకి జాఱుకున్న విశాఖ మహానగరం మీద :

“……………………………………………………….
తెల్లని పొగమంచుపరదాలలోకి
విశాఖ నిశ్శబ్దంగా తప్పుకుంటోంది
దేవకన్యల తారాహారాలు నేలకు జారాయేమో
నగరం జడలో దీపాల మాలల్ని అలంకరించుకుంది
నిద్రిస్తున్న నగరసౌందర్యాన్ని నిర్నిమేషంగా చూస్తూ
కలల అలల మీద తేలుతున్న నావల్ని
దక్షిణపు గాలి ఆగి ఆగి అలవోకగా స్పృశిస్తుంది
ఏ హరిణనయన చేతి అమృతభాండంలోంచి తొణికిన వెన్నెలో
సముద్రం మీద చెల్లాచెదరైన ముత్యాల సరంలా పరచుకుంది”

డా.వైదేహి కవితలో సంస్కృతం పాలెక్కువ. అయినా ఆ పదప్రయోగాలన్నీ ఆ సందర్భానికి అవసరమే కావడం విశేషం. ఈ పుస్తకమంతట్లోకీ నాకు బాగా నచ్చిన కవిత “జ్ఞాపకాలు.”

జ్ఞాపకాలు…
మనోవృక్షంపై కువకువలాడుతూ వాలే విహంగ సమూహాలు
చల్లగా సుతారంగా తాకే మలయమారుత సదృశాలు
పరిమళప్రవాహంలో తేల్చివేసే పుష్పనికుంజాలు
హృదయప్రాంగణంలో ప్రజ్వలించే దీపమాలికలు
నేను ఏనాడో తప్పిపోయిన సతత హరితారణ్యాలు

ఇలా ఈ కవితా సంకలనంలో మొత్తం 32 ఖండికలున్నాయి. వీటిల్లో కొన్ని కవయిత్రి భారతదేశంలో ఉండగానే వ్రాసినవి. ఈ కృతిని పర్యాలోచించే యోగ్యత నాకుందో లేదో తెలీదు. అయినా సాహసించి సమీక్షించడం జఱిగింది. ఎందుకంటే వచనకవితాప్రక్రియ వ్యక్తిగతంగా నాకు అభిమానపాత్రం కాదు. కానీ వైదేహిగారి విశిష్ట రచనాశైలే నన్నింతవఱకు లాక్కొచ్చింది. వచనకవులు తమ ప్రతిభని కేవలం అమూర్తభావాల (abstractions) అభివ్యక్తి మీద వెచ్చించడం చూసి నేనప్పుడప్పుడు విచారగ్రస్తుణ్ణవుతాను. దీని మూలాన కవిత సామాన్యమానవులకి ఇంతకుముందు కంటే దూరమైపోయింది. కవిత ఈ రోజుల్లో Modern Art లాంటి ప్రక్రియలా మారింది. ఎంత వ్యావహారికంలో వ్రాసినా కవితలు అర్థం కావాలంటే భావాలకి ఒక సంఘటనా నేపథ్యం (backdrop of events) అవసరం. ఇవే భావాల్ని ఏదో ఒక కథతో జోడించి అందులో భాగంగా చెబితే అవి హత్తుకుపోతాయి. ఈ ప్రక్రియనే పూర్వులు వస్తుకవిత అన్నారు. రెండోది, ఈ కవయిత్రికి గొప్ప శబ్దవ్యుత్పన్నత ఉండడం వల్ల అభివ్యక్తివైశారద్యం మెండు. రచనపై స్వభావోక్తి చెలాయింపు తఱచు. ఛలోక్తీ, చమత్కారమూ ఆట్టే లేకుండా ప్రతిభావాన్నీ డైరెక్టుగా, అతివిపులంగా చెప్పేస్తున్నట్లు ఉండడం వల్ల కొంచెం క్ఌప్తత, ధ్వని (suggestivity) పాళ్ళు పెఱిగితే బావుంటుంది. ఆ రకంగా పరిపూర్ణ కవితాంశకి ఇంకాస్త అవకాశముందేమో ననిపిస్తున్నది.

(నిద్రితనగరం – కవితలు ; కవనం – శ్రీమతి డా. వైదేహిశశిధర్ ; ప్రచురణ – 2009 ;  క్రౌన్ సైజు పేపర్‌బ్యాక్ ; పుటలు – 76 ; వెల – (ఇండియాలో) రు.50, (అమెరికాలో) $ 5 ; ప్రతులకు – అన్ని ప్రముఖ పుస్తకపంపిణీ సంస్థలూ )   

You Might Also Like

2 Comments

  1. G Purushoth Kumar

    తెలుగు ఖతుల గురించి మీతో మాట్లాడాలి.

  2. బొల్లోజు బాబా

    nice review

    its a wonderful book with very good poetry

    వచనకవులు తమ ప్రతిభని కేవలం అమూర్తభావాల (abstractions) అభివ్యక్తి మీద వెచ్చించడం చూసి నేనప్పుడప్పుడు విచారగ్రస్తుణ్ణవుతాను. దీని మూలాన కవిత సామాన్యమానవులకి ఇంతకుముందు కంటే దూరమైపోయింది.

    pai vaakyaalu akshara sathyaalu

Leave a Reply