మన బంగారు ఖజానా – ముద్దుకృష్ణ వైతాళికులు – 2

ముద్దుకృష్ణ వైతాళికులు పై చౌదరిగారి పరిచయ వ్యాసంలో మొదటి భాగం ఇక్కడ.

 

1935 వరకూ తెలుగు కవితా నవప్రస్థానంలో పాలు పంచుకొని పేరు పొందిన రచయిత లందరూ దాదాపుగా వైతాళికులు సంకలనంలో ఉన్నారు. 191 కవితలు. 26 గురు కవులు. గురజాడతో మొదలు బెట్టి శ్రీశ్రీ వరకూ. నండూరి సుబ్బారావువి  పదమూడు కవితలు. విశ్వనాధ, వేదులలవి చెరు పన్నెండు.  నాయనివి పదకొండు. అబ్బూరి, రాయప్రోలులవి చెరు పది. శ్రీశ్రీవి ఎనిమిది (అప్పటికి మహాప్రస్థానం కవితలలో చాలా భాగం ఇంకా రాయలేదు; పుస్తకం రావడానికి ఇంకో ఇరవయ్యేళ్ళు పట్టిందనుకోండి).

ఇరవై కవితలతో పెద్దపీట వేసింది మాత్రం కృష్ణశాస్త్రికే!

ప్రాణ సఖుడె నాకోసము పంపినాడు
పల్లకీ యన హృదయమ్ము జల్లుమనియె;
వీడని వియోగమున వేగు మ్రోడు మేను
తలిరు దోరణమై సుమదామ మాయె!

చెదరు చేతుల నెటొ కయి సేసుకొంటి
మొయిలు వసనమ్ములో ప్రొద్దుపొడుపు నగలొ,
ఏదొ కాలుచు హాయియో – ఏదొ తేల్చు
భారమో యేమొ సైరింప నేర నైతి!

కొసరునడల తూగాడుచు కూరుచుంటి
పూలపల్లకిలో పూలమాల నేను!
“ఓ” యనగ, “నొహొహో” యనగ బోయవాండ్రు,
దారి బడి నిల్చి చూచె నూరూరు నాడు!

“ఓ” యనగ, “నొహొహో” యనగ బోయవాండ్రు,
వీటి వెలుపల మేల్కొనె తోట తెరువు!
“ఓ” యనగ, “నొహొహో” యనగ బోయవాండ్రు,
తోట పొలిమేర కాలువ తొనకె నిదుర!

ప్రణయ పల్లకి పల్లకీ! ప్రసవభర వ
సంతవల్లిక పల్లకీ! శక్రచాప
వక్రరేఖ పల్లకీ! మధుస్వప్నశాఖ
పల్లకీ!

దేవులపల్లి కృష్ణ శాస్త్రిపల్లకీ

 

ముగ్గురే స్త్రీలు ఈ సంకలనంలో: చావలి బంగారమ్మ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, సౌదామిని (బసవరాజు రాజ్యలక్ష్మమ్మ).

అందాలు తానె  చూసింది,
నీటిలో చందాలు తానె చెప్పింది
నాతోటి,
వొడ్డున్న మందార వొంగి బొట్టెట్టుకుని
అందాలు తానె చూసింది!

జుట్టెల్ల విరియబోసింది
మందార బొట్టెట్టి చెదిరి రాలింది
గట్ల గుండెలు కలగ, మెట్ల కన్నులు చెదర –
వొంగున్న మందార వొంగియే ఉండి ఆ
అందాలు తానె చూసింది,
నాతోటి
మందార మాటలాడింది!

(బంగారమ్మ – నీడ)

 

వేల్చేరు నారాయణరావుగారు ఆధునిక తెలుగు కవిత్వాన్ని ఆంగ్లీకరించిన పుస్తకం అమెరికన్ ఎడిషన్ Hibiscus on the Lake లో శీర్షిక కవిత – బంగారమ్మ గారి నీడకు అనువాదం.

భవ మెంతొ భారమై పరుగులెత్తే వేళ,
శీర్ణమై నాగుండె శిథిలమయ్యే వేళ
కన్నుగవలో నొక్క కాంతిపుంజము దాల్చి
చిన్నినవ్వులు మోముపై చిందులాడగా,
ప్రేమతో మనసిచ్చి, ప్రీతితో నను దేర్చి,
రమ్యమధురాలాప రసము నాపై  చిల్కి,
నడకలో నొకవింత నాట్యమాడుచునుండ
పలుకులో నొకతీపి పలుకరించుచునుండ,
ఇరులు నీ నవ్వుతో విరిసిపోవగజేసి,
మాటిమాటికి నాలొ మమత పెంపొందించి

వచ్చి లాలించేటి ప్రియుడా
నన్ను మచ్చికల నలరించు ప్రియుడా!
హెచ్చయిన ప్రేమసుధలిచ్చి
నన్ను వగల మరపించేటి ప్రియుడా!

(విశ్వసుందరమ్మ – ప్రియుడా!)

బసవరాజు అప్పారావు గారి భార్య రాజ్యలక్ష్మమ్మ (రాజ్యలక్ష్మి?) సౌదామిని పేరుతో ప్రసిద్ధి పొందిన కవయిత్రి.

చలి గడగడ వడకించెను
జగతిఁ గ్రమ్మె నంధకార
మచ్చటచట మినుకు మినుకు
మను దీపిక లో నాధా!

ఈ నిసిరాతిరి నొంటిగ
ఏ కానని దేశాలను
కుందెదొ, నిశ్శబ్దములో
విందువొ, నా యార్తగీతి!

(సౌదామిని – ఆర్తగీతి)

వైతాళికులు సంకలనం రాయప్రోలు దేశభక్తి ప్రబోధంతో మొదలౌతుంది. శ్రీశ్రీ మహాప్రస్థానం ఈ సంకలనంలో ఆఖరు గేయం. గేయాల వరుసకు ఒక పద్ధతి ఉందా అని ఆలోచించాను కాని నాకైతే తెలీలేదు.  కవితల ఎంపికలో కృష్ణశాస్త్రి ప్రభావం చాలా ఉందని వాడుకలో ఉన్న మాట.

ఈ పుస్తకానికి ముద్దుకృష్ణ (శీర్షిక ఏమీ పెట్టకుండా) వ్రాసిన ముందుమాటలో తెలుగు సాహిత్యప్రస్థానంలో పరిణామాలను పురాణ యుగం, ప్రబంధ యుగం, అంధ యుగం, నవయుగాలుగా విభజించి యుగలక్షణాలను బహుక్లుప్తంగా వివరించారు. సంకలనంలో కవుల గురించి, కవితల ఎంపిక గురించి ఈ ముందుమాటలో ఏమీ చెప్పలేదు.

1973, ఆ తరువాయి ముద్రణలలో తుమ్మల వెంకట్రామయ్య గారు “సంస్మృతి” పేరిట వ్రాసిన ముద్దుకృష్ణ జీవితాన్ని పరిచయాన్ని చేర్చారు.  ఆయన చెప్పినదాని ప్రకారం ఈ సంకలనం తయారు చేస్తున్నప్పుడు రచయితలనుండి తానాశించిన ప్రోత్సాహ  ప్రోద్బలాలు ముద్దుకృష్ణకు లభించలేదట.

ఈ సంకలనం గురించి ఎక్కువగా వినిపించే విమర్శ – అప్పటికే పేరు ప్రఖ్యాతులు గడించుకొన్న గుఱ్ఱం జాషువా కవితలేవీ ఈ సంకలనంలో ఉండకపోవడం. జాషువా దళితుడు కావటంవల్లే ఈ వివక్ష అని చాలామంది అభిప్రాయం. ఏవో కారణాల చేత జాషువా తన కవితలని ఈ సంకలనంలో చేర్చటానికి అనుమతి నిరాకరించాడని సాహితీ వ్యవహారాలు బాగా తెలిసిన మిత్రులొకరు నాతో అన్నారు. నిజానిజాలు కచ్చితంగా చెప్పగలిగిన జాసువా, ముద్దుకృష్ణ ఇద్దరూ ఇప్పుడు లేరు. ఇద్దరిలో ఎవ్వరూ బహిరంగంగా ఈ విషయం గురించి మాట్లాడినట్లు నేనెక్కడా చదువలేదు.

తుమ్మల వెంకటరామయ్యగారి ప్రకారం, వైతాళికులు సంకలనంలో మొదట ముద్దుకృష్ణ ఎదుర్కొన్న సమస్య ఆనాటి కాల్పనిక కవితలో, నవ్య సాహితిలో ఏర్చి కూర్చే కవితలు ఒకే ధోరణిని ప్రతిబింబించే దశకు చెందటం. ఈ సంకలనానికి ఎన్నుకున్న కవితల  రచనలో, భావంలో వైవిధ్యం ఉండేలా; రచనా పరిణతిని ప్రతిబింబించేలా ఉండేట్లు చూసుకోవాలి. ఆ విషయంలో ముద్దుకృష్ణ సఫలీకృతమయ్యారనే చెప్పాలి.

వైవిధ్యానికి ఒక ఉదాహరణ ఈ క్రింది కవిత – చిన్ని మబ్బులు అనే ఈ కవిత ఎవరు వ్రాశారో గుర్తు పట్టగలరా?

కన్నె కాటుక కళ్ళు
చిన్న నాథుని చూచి,
కదలులాడిన వేళ
కందళించిన వేళ
ఆకాశమధ్యాన అట నొక్క తెలి మబ్బు
మెరపులా మెరిసిందిలే!
వెలుగులో వొరిసిందిలే!

తొలి చిన్ని చూలాలు
కొలసిగ్గు ప్రేమతో,
విభుని చూచిన వేళ
విన్నబోయిన వేళ
బఱపు మిన్నులలోన ఒక నీలి తెరమబ్బు
సంజలో తారిందిలే!
జాలుగామారిందిలే!

తొలికాన్పు పసిపాప
సాకనేరని బాల,
తెలవోయి పతి జూచి
కళవళించిన వేళ
తూర్పుకోనలో తొంగిలించిన మబ్బు
తెగ పరుగులె త్తిందిలే!
సొగసులు పోయిందిలే!

ఇది పాషాణపాకప్రభువు అని వెక్కిరించబడ్డ విశ్వనాధ సత్యనారాయణ వ్రాసింది అంటే నమ్ముతారా? కవిగా విశ్వనాధ విశ్వరూపాన్ని నేను చూడ మొదలెట్టింది ఈ సంకలనంలోనే. నీ రథము  అనే విశ్వనాథ పద్యాన్ని చదివిన ప్రతిసారీ గుండె బరువెక్కుతుంది.

ఓ ప్రభూ! నీ రథమ్ము దీక్షాప్రణీత
నిధుర వేగమ్ము పరువులు వెట్టుచుండె
నా శరీరమ్ము  దాని క్రిందఁ బడి నలిగి
నలిగి పోయిన యది రక్తనదము లింకి

దివ్య తేజో విరాజ త్త్వదీయ రథము
ఈ గతుకు డేమి యనియైన నాగలేదు,
నా విరోధించిన హఠా న్నినాదమునకు
వెనుదిరిగి యైన మఱి చూచుకొనగలేదు;

నాదు రక్తంబు నీ రథ చోదకుండు
కడిగివేయును రేపు చక్రములనుండి,
అచటి బహుజనరక్త చిహ్నముల యందు
నాది యి దని గుర్తేమి కనపడును సామి?
(విశ్వనాధ సత్యనారాయణ —  నీ రథము)

 

ఈ సంకలనంలోని కవితలలో విపరీతమైన వస్తు వైవిధ్యముంది; శైలీ వైవిధ్యముంది. దృక్పథ వైవిధ్యమూ ఉంది. దైవ భక్తి, దేశభక్తి, ప్రకృతి, ప్రేమ, శృంగారం, విరహం, ప్రజాసంక్షేమం, జీవన వర్ణనం, తత్వం వగైరా అనేక రకాల వస్తువులు. పలురకాల ఛందస్సులు. రకరకాల గతులు, వడులు. బాపిరాజు కలంతో చిత్రించిన వరదగోదావరీ ప్రవాహం చూడండి (బాపిరాజు నవలలన్నీ అప్పటికే చదివేసినా, ఆయన కవిత్వాన్ని మొదటిసారి అనుభవించిందీ ఈ పుస్తకంలోనే).

ఉప్పొంగిపోయింది గోదావరీ – తాను
తెప్పున్న యెగిసింది గోదావరీ!

కొండల్లొ ఉరికింది
కోనల్లు నిండింది
ఆకాశగంగతో
హస్తాలు కలిపింది,

ఉప్పొంగిపోయింది గోదావరీ – తాను
తెప్పున్న యెగిసింది గోదావరీ!

అడివి చెట్లన్నీని
జడలలో తురిమింది
ఊళ్ళు దండలు గుచ్చి
మెళ్ళోన తాల్చింది,

ఉప్పొంగిపోయింది గోదావరీ_తాను
తెప్పున్న యెగిసింది గోదావరీ!

వడులలో గర్వాన
నడలలో సుడులలో
పరవళ్ళు తొక్కుతూ
ప్రవహించి వచ్చింది

ఉప్పొంగిపోయింది గోదావరీ – తాను
తెప్పున్న యెగిసింది గోదావరీ!

శంఖాలు పూరించి
కిన్నెర్లు మీటించి
శంకరాభారణ రా
గాలాప కంఠియై

ఉప్పొంగిపోయింది గోదావరీ_ తాను
తెప్పున్న యెగిసింది గోదావరీ!

నరమానవుని పనులు
శిర మొగ్గి వణికాయి
కరమెత్తి దీవించి
కడలికే నడిచింది,
ఉప్పొంగిపోయింది గోదావరీ – తాను
తెప్పున్న యెగిసింది గోదావరీ!

(అడివి బాపిరాజు – వరద గోదావరి)

అంతా వరదలూ ఉధృతాలే కాదు, పసితనపు ప్రేమలు కూడా ఈ సంకలనంలో అలరిస్తాయి.

కాగితమ్మున,  పసినాడు కట్టి, కత్తి
పడవ పాఱుడునీటిలో  విడిచినావు
పాలబుగ్గలపై నవ్వు తేలిపోవ,
చిన్ని క్రేగంటి చూపుల నన్ను జూచి!

ఏను పసి బాలకుడను, ని న్నేమరించి,
తోది చెలికాండ్రు నవ్వులు తూరుపె త్త
తడిసి ముడతలు పడిన యా పడవ నెటులొ
తెచ్చి, నా పూవుటెద ప్రతిష్ఠంచుకొంటి!…

(నాయని సుబ్బారావు – కత్తిపడవ)

ఈ సంకలనాన్ని ఏ పేజీ దగ్గర తెరచినా పర్వాలేదు. అద్భుతమైన కవిత కళ్ళ ముందుంటుంది. ఒకదాని తరవాత ఒకటి అలా ఓపికున్నంత సేపు చదువుకోవటమే.

బసవరాజు అప్పారావుగారి గేయాలు ఇంతకుముందే పరిచయమైనా ఆ లలితగీతాల్ని మళ్ళీ ఆస్వాదించాను ఈ పుస్తకంలో

కోయిలా కోయిలా
కూయబోకే!

గుండెలూ బద్దలూ
చేయబోకే!
కోయిలా కోయిలా
కూయబోకే!

తీయని రాగాలు
తీయబోకే!
తీపితో నా మనసు
కోయబోకే!
కోయిలా కోయిలా
కూయబోకే!

చిట్టినీ జ్ఙాపకం
చేయబోకే,

చింతతో  ప్రాణాలు
తీయబోకే
కోయిలా కోయిలా
కూయబోకే!

(బసవరాజు అప్పారావు – కోయిల)

 

నీ పుట్టదరికి నా పాప లొచ్చేరు,
పాప పుణ్యముల వాసనే లేని
బ్రహ్మ స్వరూపులౌ పసికూనలోయి!
కోపించి బుసలు కొట్టబోకోయి!

నాగుల్ల చవితికీ నాగేంద్ర, నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

చీకటిలోన నీ శిరసు తొక్కేము,
కసిదీర మమ్మల్ని కాటేయబోకు,
కోవపుట్టాలోని కోడెనాగన్న
పగలు సాధించి మా ప్రాణాలు దీకు!

నాగుల్ల చవితికీ నాగేంద్ర, నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి!

(బసవరాజు అప్పారావు — నాగుల చవితి)

 

నోరి నరసింహశాస్త్రి ఒక దశలో ప్రణయ కవితలు వ్రాసేవారని తెలుసా మీకు?

బింబఫలముల బోలు నీ పెదవు లెపుడు
ఈ యధరమంటి వేడి ముద్దిచ్చె. నపుడె,
అంకితంబయ్యె నా హృదయంబు నీకు,
నృపతిముద్రాంకితంబైన లేఖయట్లు!

సిగ్గుపొరదాటి, పటుభుజాశ్లేషమందు
ఎప్పు డీ సఖితనువు బంధించినావొ,
అర్పితంబయ్యె నపుడె నా యాత్మ నీకు,
రణపరాజితుడైన శాత్రవుడువోలె!
  ( పరాజయము –నోరి నరసింహశాస్త్రి)

 

దీపావళినాడు వేదుల విషాదాన్ని చూసి

జగతి యీనాఁటి యీ మహోత్సవమునందు
మునిఁగి యానందమునఁ బొంగిపోవుచుండ
ఇటు రగులుకొల్పి రెవరు నీ హృదయమందు
నణఁచుకొని యున్న ఘోరదుఃఖాగ్ని నిపుడు?

అని ప్రశ్నిస్తున్న నిశీధినికి

కాఱుకొన్న యమాసచీఁకటులనడుమ
నే నొకండనె ఈ శూన్యగృహమునందు
అదురువడిపోయి మరణవాద్యమ్ములట్లు
గుండియలు గొట్టుకొన నేడ్చుకొనుచుంటి!

విస్మృతోదంతములు శూన్యవీధులందు
నావలెనె మౌనముగ వెళ్ళిపోవుచున్న
ఓ నిశీధిని! నీ గభీరోదరమున
దొరికె నీ దురదృష్టవంతునకుఁ జోటు!

అంటూ సమాధానం చెప్పిన కవిని చిమ్మట ఇలా ప్రశ్నించింది:

బాణసంచుల ఫెళ ఫెళార్భటులు విరిసి
దశదిశాంతరములఁ బ్రతిధ్వనులనీన
పేదవడియున్న మౌనజీవితపుటాశ
లిపుడు మ్రోగించుకొనుచుంటివేల నీవు?

దానికి కవి సమాధానం:

నన్ను నిరసించువారి యానందమందు
నాకు భాగమ్ము వల దొక్కనాఁటికైన,
చీఁకటులఁ జీల్చికొనివచ్చు నీ కరాళ
గానరవములనే నా సుఖమ్ము కలదు! …

మృత్యుగర్జాప్రవాహగంభీరమైన
విధి నిద్దురవోవు ప్రేమజీవితములోన
సంఘటిలిన ప్రవాసదుస్స్వప్న వ్యథల
మడతలను సర్దుకొనుచుందు మాయకుండ!

తెగిపడిన పూలదండ లెత్తు నమర్చి,
అంధకారమ్ము సందిట నదుముకొనుచు,
నెవరికొఱకొ పదేపదే యెదురుచూచు
నా యెద కొనర్తుఁ గృత్రిమానందభిక్ష!

మ్రొక్కినకొలదిఁ గాలితోఁ ద్రొక్కుచున్న
యీ కఠినలోకమెల్ల బహిష్కృతమ్ము;
రండు, చిమ్మటలార! ఈ రాత్రివేళ
నా వలెనె పాడుకొను మీరె నాకు సఖులు!

(దీపావళి నాడు  – వేదుల సత్యనారాయణ శాస్త్రి)

అంతా విరహమూ విషాదమే కాదు, చేనులో సరసాలూ ఉన్నాయి. (జొన్నచేను – పింగళి_కాటూరి (పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు)

కంకి వెడలిన యా లేతకారుజొన్న
చేనిపైఁ బిట్టలం దోలు చిన్నవాఁడ,
దారిఁ బోయెడివారలఁ బారఁ జూచి
విసరుమా సుంత వడిసెల,

వెనుక నదిగొ
కంకి తినుచున్న యది గోరువంక, ఇంత
యాలసించిన నిలుచునా? చాలదూర
మెగిరిపోయిన దప్పుడే!

అంటున్న చిన్నదానితో

సెనగ పూరైక దొడిగిన చిన్నదాన,
చిలుక యొక్కటి వ్రాలె నా మలుపునందు
నెంతతోలిన  పోవ దే నేమి సేతు?

యేను వచ్చెదఁ దొందరయేల నీకు
దోసపండొక్కటియుఁ దొరకలేదె?
యీ దరిం గల, వే గోసి యిత్తు రమ్ము!
కఱ్ఱ లిట నొత్తుగా నుండెఁ గాన నీకు
దొరకలే, దదే మా మంచెదరిని గలవు
కోసియుంచితి రమ్ము నీ కొఱకు నేను

అని మంచెదరికి పిలుస్తున్నాడు ఆ చిన్నవాడు.

1973 మే ముద్రణలో (అప్పటి వెల ఆరు రూపాయలు) రచయితల జీవిత సంక్షిప్త పరిచయాలు ఉన్నాయి.  రచయితల ఛాయాచిత్రాలు మాత్రం కొందరివే ఉన్నాయి. చిత్రమేమిటంటే ఫొటోలున్న రచయితల పరిచయాలు, ఫొటోలతో ఒకసారి, ఫోటోల్లేకుండా ఒకసారీ ఉంటాయి. రెండూ ఒక్కలా ఉండవు. 1/8 డెమీ పుస్తకం. మంచి కాగితం. జాగ్రత్తగా ముద్రించారు. ఫొటోలన్నీ చక్కగా వచ్చాయి. ఫొటోలు, జీవిత విశేషాలు ఇదివరకు  అసమగ్రంగా ఉన్నలోపాన్ని సరిదిద్దటానికి ముద్దుకృష్ణ చాలా శ్రమించాడట. ఈ ముద్రణ వెలువడటానికి మూడు మాసాల ముందు ముద్దుకృష్ణ మరణించాడు.

1994 ఫిబ్రవరి ముద్రణ చూస్తే మాత్రం చాలా నిరుత్సాహం కలుగుతుంది. పుస్తకం సైజు మారింది; ధర 35 రూపాయలైంది. పల్చటి కాగితం. అవతల పక్క అక్షరాలు ఇవతల పక్కకు కనిపిస్తుంటాయి. సిరా కూడా బాగానే ఆదా అయినట్లుంది తేలిగ్గా ఉన్న ఫాంటుతో. 73లో బాగా ముద్రణ అయిన ఫొటోలు 94కు అలుక్కుపోయాయి. అప్పట్నుంచీ అవే బ్లాకులు వాడుతున్నారో ఏమిటో ఖర్మ. 73 ముద్రణలో ఉన్న ముద్దుకృష్ణ ఫొటోను 94 ముద్రణలో చేర్చటానికి జాగా దొరికినట్లు లేదు పాపం. విశాలాంధ్రవారికి పుస్తకాలు అమ్మటమే తెలుసు కాని పుస్తకాలను ప్రేమించటం, క్లాసిక్స్‌ని గౌరవించడం, ప్రచురణలో మంచి ప్రమాణాలు పాటించడం, నాణ్యతను చూసుకుని గర్వించడం తెలీదేమో అనిపిస్తుంది. అచ్చుతప్పులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి; అక్కడికదే అదృష్టం. కాకపోతే, పద విభజన, విరామచిహ్నాలు, ద్రుతం,  బండి ‘ఱ’ల వాడుక వంటి విషయాలలోనూ, కొన్ని పదాలలోనూ రెండు ముద్రణల మధ్య చాలా తేడాలు ఉన్నాయి.

94  తర్వాత వచ్చిన ముద్రణల నాణ్యత ఎలా ఉందో నాకు తెలియదు.

ఆఖరుగా గురజాడ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రిల గేయాలు

మనిషి చేసిన రాయి రప్పకి
మహిమ కల దని సాగి మొక్కుతు
మనుషులంటే రాయి రప్పల
కన్న కనిష్టం
గాను చూస్తావేల? బేలా.
దేవు డెకడో దాగె నంటూ
కొండ కోనలు వెతుకులాడే
వేలా?
కన్ను తెరచిన కానబడడో!
మనిషి మాత్రుడి యందు లేడో?
యెరిగి కోరిన కరిగి
యీడో ముక్తి?

(గురజాడ అప్పారావు – మనిషి)

నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!

నేను సైతం
విశ్వ వృష్టికి
అశృవొక్కటి ధారపోశాను!

నేను సైతం
భువనఘోషకు
వెర్రిగొంతుక విచ్చిమ్రోశాను!


నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్ల రేకై పల్లవిస్తాను!

నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను!

నేను సైతం
భువనభవనపు
బావుటానై పైకి లేస్తాను!

(శ్రీశ్రీ — జయభేరి)

 

మ్రోయింపకోయ్ మురళి,
మ్రోయింపకోయ్ కృష్ణ!
తీయ తేనియ బరువు
మోయలే దీ బ్రతుకు,
మ్రోయింపకోయ్ మురళి,
మ్రోయింపకోయ్ కృష్ణ!

మురళిపాటకు రగిలి
మరుగు నీ వెన్నెలలు,
సొగయు నా యెద కేల
తగని సౌఖ్యజ్వాల!

మ్రోయింపకోయ్ మురళి,
మ్రోయింపకోయ్ కృష్ణ!
తీయ తేనియ బరువు
మోయలే దీ బ్రతుకు,
మ్రోయింపకోయ్ మురళి,
మ్రోయింపకోయ్ కృష్ణ!

కాలు చల్లదనాలొ
కనలు తీయదనాలొ,
వలపు పిల్లనగ్రోవి
పిలుపులో సొలపులో!

మ్రోయింపకోయ్ మురళి,
మ్రోయింపకోయ్ కృష్ణ!
తీయ తేనియ బరువు
మోయలే దీ బ్రతుకు,
మ్రోయింపకోయ్ మురళి,
మ్రోయింపకోయ్ కృష్ణ!

వలదోయి, అలము
నీ కలలలో నిదురింతు
భరమోయి నీ ప్రేమ
వరమే నేటి రేయి!

మ్రోయింపకోయ్ మురళి,
మ్రోయింపకోయ్ కృష్ణ!
తీయ తేనియ బరువు
మోయలే దీ బ్రతుకు,
మ్రోయింపకోయ్ మురళి,
మ్రోయింపకోయ్ కృష్ణ!

(దేవులపల్లి కృష్ణశాస్త్రి  — నేటి రేయి)

ఈ సంకలనం మన సాహిత్య చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయానికి కరదీపిక.
తెలుగుని ప్రేమించే ప్రతివారూ చదవవలసిన పుస్తకం.
ప్రతిగ్రంథాలయంలోనూ అనేక ప్రతులు ఉండవలసిన పుస్తకం.

ముద్దుకృష్ణకు నేను, నాతోపాటు తెలుగు జాతి, ఎంతో ఋణపడి ఉన్నామని నా నమ్మకం

తా.క.

1. ఈ పుస్తకంలో కవితలతో పాటు కవుల పేర్లు పూర్తిగా ఇవ్వడం తక్కువ; రాయప్రోలు, గురజాడ, రామిరెడ్డి ఇలా ఉంటాయి. జీవిత పరిచయాలలో మాత్రం పూర్తి పేర్లు ఉన్నాయి. పాఠకుల సౌలభ్యంకోసం ఈ వ్యాసంలో పూర్తి పేర్లే వాడాను.
2. నా దగ్గర ఉన్న రెండు ముద్రణలకు మధ్య భేదాలు ఉన్నప్పుడు, 1973 ముద్రణను ప్రామాణికంగా తీసుకున్నాను (అచ్చుతప్పులు స్పష్టంగా తెలిసినప్పుడు తప్ప).

*********

వైతాళికులు
సంకలనం
ముద్దుకృష్ణ (1899 ఫిబ్రవరి 7 – 1973 ఫిబ్రవరి 6)
మొదటి ప్రచురణ: 1935.

ఇటీవలి ముద్రణలు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

26 గురు కవులు; 191 కవితలు

You Might Also Like

One Comment

  1. sudha

    వైతాళికులు సంపుటాన్ని చాలా బాగా పరిచయం చేసారు. అభినందనలు. కృతజ్ఞతలు. విశ్వనాథవారి చిన్నిమబ్బులు కోసం వెతుకుతూ ఇటు వచ్చాను. నారథము ఇంతకుముందు ఎన్నోసార్లు చాలా వ్యాసాలలో చూసి ఉన్నాను కానీ చిన్నిమబ్బులు పుస్తకంలో బాగా గమనించి చూసిన గుర్తేలేదు. ముద్దుకృష్ణగారు జీవించి ఉన్నప్పుడు తగిన ప్రోత్సాహం దొరికి ఉంటే బాగుండేది. జాషువా గారి రచనలు లేకపోవడం చిత్రమే. పుస్తక ప్రచురణలో విశాలాంధ్రవారి దృక్పథాన్ని కూడా బాగా వివరించారు. వాళ్ళకి తెలిస్తే బాగుండును.

Leave a Reply