కర్మయోగి శ్రీ శోభన్‌బాబు ఆదర్శజీవితం

తెలుగునాట సినీహీరో శోభన్‌బాబు పేరు తెలియనివారుండరు. మా తరంవాళ్ళమంతా ఆయన అభిమానులమే. ఎన్.టి.ఆర్, ఏయెన్నార్‌లకి కాస్త వయసుమళ్ళుతూ ఉన్న దశలో, చిత్రసీమ క్రమక్రమంగా నలుపు-తెలుపు కాలఖండంలోంచి ఈస్ట్‌మన్ కలర్‌కి మారుతూ ఉన్న సంధియుగంలో నాటి యువతరానికి శోభన్‌బాబే ఆదర్శ కథానాయకుడయ్యారు. ఒక సహజ అందగాడుగా, కుటుంబ – ప్రేమకథా చిత్రాల సెంటిమెంటల్ హీరోగా మహిళాప్రేక్షకుల్ని ఆకర్షించగలగడం కూడా ఒక కారణం. అందానికి తగ్గట్టుగా హుందాతనం (dignity) చెక్కుచెదరకుండా నటించే తన గంభీర మూర్తిమత్త్వం అనేక నవలాధారిత చిత్రాలకి ఆయన్నొక ఆటోమేటిక్ ఎంపికగా మార్చింది. మూడున్నఱ దశాబ్దాల పాటు 230 కి పైగా తెలుగుచిత్రాలలో నటించి “హీరో అంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి” అని ప్రజల మనస్సులలో ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పిపోయిన ప్రాతఃస్మరణీయ ఆచార్యపీఠం కీ.శే. శోభన్.

అలాంటి మహానటుడి మీద ఆకెళ్ళ రాఘవేంద్రగారు ’శోభన్‌బాబు జీవితచరిత్ర’ అనే అమూల్యమైన గ్రంథాన్ని వెలువరించి అశేష ఆంధ్రావళికి మహోపకారం చేశారు. ’పరుగు ఆపడం ఓ కళ’ అనేది ఉపశీర్షిక. శోభన్ అభిమానులు ఈ పుస్తకాన్ని చదవకముందు తమకి ఆయన మీదున్నది కేవలం పిచ్చిఅభిమానం మాత్రమేనని తెలుసుకుంటారు. ఎందుకంటే, ఒక మనిషిలో ఒక పార్శ్వాన్ని మాత్రమే చూసి అభిమానించడమో, ద్వేషించడమో – ఇదే సాధారణంగా అందఱమూ చేసేది. కానీ ఆ మనిషి గుఱించి సమగ్రంగా తెలుసుకున్నాక అభిమానంతో పాటు గౌరవం కూడా కలుగుతుంది. ఆ వ్యక్తిమీద తమకున్నది వెఱ్ఱి అభిమానం కాదనీ, దానికి తార్కిక కారణాలున్నాయనే మానసిక పరితోషం లభిస్తుంది. కీ.శే. శోభన్ గుఱించి అసలు మనమెందుకు అదనంగా తెలుసుకోవాలి ? వందలాది సినిమాలలో నటించినందుకా ? వందలాది కోట్లు సంపాదించినందుకా ? ఈ రెండే కారణాలైతే అవసరం లేదు. ఎందుకంటే ఈ పనులు చాలామంది చేశారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. కానీ శోభన్ జీవితంలో ఉన్నవి కేవలం ఈ రెండూ కావు. ఆయన సమగ్ర వ్యక్తిత్వం ఒక మహాసముద్రం లాంటిదనుకుంటే ఈ రెండూ అందులో రెండు ఉపరితల కెఱటాల కంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగినవి కావు. ఆయన తన జీవితం ద్వారా ఇచ్చిన సందేశం ఈ రెంటికీ పరిమితం కాదు.

ఈ పుస్తకాన్ని మూడొంతులు వ్రాసినది నిజానికి ఆకెళ్ళగారు కాదు, స్వయంగా శోభన్‌బాబే. అందుకే కథనమంతా “నేను” అంటూ ఉత్తమపురుషలో సాగుతుంది. అయినా ఇది ఆత్మకథ కాదు. ఎందుకంటే శోభన్ ఆత్మకథేదీ వ్రాసి ఉండలేదు. ఆయన వివిధ సందర్భాలలో పాత్రికేయులకి లిఖితపూర్వకంగా వ్రాసిచ్చిన జవాబులూ, మిత్రులకీ, సన్నిహితులకీ వ్రాసిన ఉత్తరాలూ, ఆ రోజుల్లో శోభనే స్వయంగా రచించిన పత్రికావ్యాసాలూ, కవితాసంకలనాలూ, డైరీలూ అన్నీ కలబోసి ఒక వరుసక్రమంలో కూర్చి జీవితచరిత్రలా సంతరించారు ఆకెళ్ళ. ఇదొక అపూర్వ శిల్పసంవిధానం. చాలా కొత్త ప్రక్రియ. దీన్ని వర్ణ్యాకర సంవిధానం అనవచ్చు. ఈ విషయమే ఆకెళ్ళగారిలా చెప్పుకున్నారు : “శోభన్ ఆయా సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో చెప్పిన అంశాల్నే ఓ క్రమంలో రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఒక్కటంటే ఒక్క కల్పన కూడా చేయలేదు.”

శోభన్ సినిమావ్యాసంగం మొదట్లో ఎంత వ్యథాభరితంగా, అవమానాల మయంగా, దినదినగండంగా, నిరాశా నిఃస్పృహల భూయిష్ఠంగా గడిచిందో ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. బిలియనీర్ అందాల శోభన్ వెనుక ఉన్న నిఱుపేద కన్నీళ్ళ శోభన్ ని తొలిసారిగా ఈ పుస్తకం ఆవిష్కరిస్తుంది. ఎన్ని సినిమాఛాన్సులొచ్చినా అద్దె కట్టలేని దుఃస్థితి. యజమాని కరెంటూ నీళ్లూ కట్ చేయగా శోభన్ తన కుటుంబంతో సహా కటికచీకట్లో గడిపిన కాళరాత్రులు. దొఱక్కదొఱక్క దొఱికిన వీరాభిమన్యు హీరోఛాన్సు తరువాత కూడా శోభన్ మద్రాసువీథుల్లో సైకిల్ మీదే తిరగాల్సిన దురవస్థ. వాయిదాల మీద కొన్న సెకండ్‌హ్యాండు కారుని ట్యాక్సీగా మార్చుకుని డ్రైవరుగా జీవితాన్ని గడపాలనే నిర్ణయానికి రావడం, భార్య ధైర్యం చెప్పిన మీదట ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం. “ఈ రంగంలో నేను పైకి రాను, రాలేను, సున్నితహృదయుణ్ణయిన నేను సినిమాలకి పనికిరాను. ఇంటికెళ్ళిపోదాం” అని శోభన్ దుఃఖించడం – ఇవన్నీ హృదయాన్ని కదిలిస్తాయి. మద్రాసులో ఇలాంటి జీవితాన్ని ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, సుమారు పదేళ్ళపాటు శోభన్ గడిపారంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఒక వర్గీయ గుర్తింపు ఉంటే చాలు, అదే సినిమారంగంలో విజయానికి వీసా అని నమ్మేవారు ఈనాడు కనిపిస్తారు. అది నిజంగా నిజం కాదని శోభన్ జీవితం మనకి సుస్పష్టంగా తెలియజేస్తుంది. తన వర్గీయ నేపథ్యం ఆయనకి ఇసుమంత కూడా ఉపయోగపడలేదు. అంతే కాదు, హేమాహేమీల్లాంటి ఎన్టీయార్, ఏయెన్నార్‌ల పరిచయం గానీ, ఆశీస్సులు గానీ ఆయనకి పూర్తిగా ఉపకరించినట్లు కనిపించదు. ఇంగ్లీషులో self-made man అంటారు చూడండి. అదే శోభన్ జీవితం. ఎందుకంటే ఆయన కేవలం తెఱమీది హీరో కాదు, వాస్తవ జీవితంలో కూడా హీరోయే. కనుకనే ఎన్నో ప్రతికూల పరిస్థితులకి ఎదురొడ్డి, పోరాడి ఆఖరికి అదే మద్రాసులో విజేతల మధ్య దేదీప్యమానుడై నిలిచారు. అయితే తాను పడ్డ కష్టాల్ని మఱువలేదు. కనుకనే గుప్తదానాలు చాలా చేశారని సన్నిహితులంటారు. శోభన్ కూడా అలా చేస్తున్నట్లు ఒక సందర్భంలో వెల్లడించడం గమనార్హం.  తానొక పెద్ద దానకర్ణుడని అందఱూ చెప్పుకోవాలనే కీర్తికండూతి లేకపోవడమే ఈ గుప్తదానాల వెనక ప్రేరణ.

దురభ్యాసాలకీ, అనవసరమైన అటాచిమెంట్లకీ జీవితాంతం కోరి దూరంగా, సుదూరంగా ఉండిపోయిన శోభన్ జీవితపు లోతులు బాగా తెలిసినవారు. విలువలూ, ప్రాముఖ్యాలు అర్థమైనవారు. తన మీద అభిమానంతో తమ సమయాన్నీ, ధనాన్నీ వృథా చేసుకోవద్దని అభిమానులకి తఱచుగా సలహా ఇచ్చేవారు. సినిమావాళ్ళక్కూడా ఒక మంచి కుటుంబజీవితం ఉండాలని తపించేవారు. కనపడ్డ ప్రతినటుడికీ, నటికీ ఆ విషయాన్ని పదేపదే గుర్తుచేసి బోధించేవారు. అందుకే తాను కూడా సాయంకాలం ఆఱైతే షూటింగులూ, గీటింగులూ అన్ని నిర్మొహమాటంగా కట్టిపెట్టి ఇంటికెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారు. జీవితానికి తృప్తి అవసరమనీ, గొప్పతనాల వెంటపడితే దానికి అంతులేదనీ, అమెరికాకి అధ్యక్షుడైనా ఆ దాహం తీఱదనీ అనేవారు. ఉద్యోగులలాగే సినిమానటులు కూడా ఒక వయసొచ్చాక రిటైర్ అవ్వాలని చెప్పేవారు. తాను అలాగే 59 వ యేట స్వచ్ఛందంగా రిటైరయ్యారు. “తృప్తిపడితే అభివృద్ధి ఎలాగండీ ?” అని ఒకసారి మెగాస్టార్ చిరంజీవి అడిగితే “మేము (సీనియర్లు) తృప్తిపడకపోతే తప్పు. మీరు (జూనియర్లు) తృప్తిపడితే తప్పు” అని సమాధానమిచ్చారు. అలాగే “మీరు ఎప్పుడూ ఏ హీరోయిన్‌కీ లొంగలేదా ?” అని ఒకసారి ధైర్యం చేసి అడిగిన విలేఖరికి “ఒకే ఒక్కసారి లొంగిపోయాను. దాన్నుంచి బయటపడ్డానికి చాలా సమయం తీసుకుంది” అని నిష్కల్మషంగా జవాబిచ్చారు. ఈ తరహా నిజాయితీ విఖ్యాత పురుషులలో చాలా అరుదు. 70 లలో ప్రచురించిన “నా కథానాయికలు” అనే వ్యాసాల సీరియల్ లో తన హీరోయిన్లందఱినీ స్వంత చెల్లెళ్ళుగా భావిస్తున్నట్లు పేరుపేరునా తెలియజేశారు. ఒక అన్నయ్యగా ఆయనకి వాళ్ళ దగ్గఱ చనువు కూడా అలాగే ఉండేది. ఆ క్రమంలో జయప్రదకి నీరసశ్రీ అని పేరుపెట్టారు.

స్వతహాగా చాలా కోపిష్ఠినని చెప్పుకున్న శ్రీ శోభన్ అన్ని విషయాల్లోనూ ఆత్మనిగ్రహాన్ని అలవఱచుకోవడానికి చాలా సంవత్సరాలు సాధన చేశారు. కాఫీ అంటే ఆయనకి ఒకప్పుడు చాలా ఇష్టమట. అప్రయత్నంగానే ఆ అలవాటు మానుకున్నారట. కానీ ఒకసారి విమానంలో వెళుతున్నప్పుడు కాఫీ ఆఫర్ చేస్తే తీసుకోలేకా, తీసుకోకుండా ఉండలేకా మానసికంగా అవస్థపడి, తరువాత తీసుకుని, వాసన చూసి పక్కన పెట్టేశానన్నారు. “శోభన్ ఆస్తికుడా ? నాస్తికుడా ?” అనే విషయంలో వివాదం ఉంది. ఆయన ఎప్పుడూ ఏ దేవాలయాన్నీ సందర్శించలేదనేది మాత్రం నిజం. కానీ నిరంతరం గీతాపారాయణలో మునిగి తేలుతూండేవారు. తన ఏకాంతమందిరంలో ధ్యానమార్గాన్ని అవలంబించేవారు. ఒకసారి అడిగితే “నేను దైవాన్ని కాదు, దైవత్వాన్ని నమ్ముతాను” అని చెప్పారు. పార్టీలిచ్చేవారూ కారు. తీసుకునేవారూ కారు. సన్మానాలకీ సత్కారాలకీ కూడా ఆమడ దూరంలో ఉండేవారు. జనంతో కలవకుండా ఎల్లప్పుడూ ఏకాంతవాసాన్ని అభిలషించేవారు. మల్లెపువ్వు సినిమా తరువాత తన సినిమాల జయాపజయాల విషయం పట్టించుకోవడం కూడా మానేశారు. “యథాశక్తి నటించడం వఱకే నా పని. ఫలితం నాకు సంబంధం లే”దని చెప్పేవారు. తనని సన్మానించాలనుకునేవారిని ప్రయత్నపూర్వకంగా నిరుత్సాహపఱిచేవారు. “ఇలాంటివాటికి అలవాటుపడితే ఎప్పుడూ అవి కావాలనిపిస్తుంది. వేఱే ఎవఱికైనా సన్మానం జఱుగుతూంటే అసూయ కలుగుతుంది. వాళ్ళని విమర్శించాలనిపిస్తుంది. ఎందుకిదంతా ?” అని ప్రశ్నించారు. అందుకే తెలుగుసినిమా వజ్రోత్సవాలక్కూడా హాజరు కావడానికి ఇష్టపడలేదు.

నూటికి నూఱుశాతం ఉండలేకపోయినా, తీఱిక లేని షెడ్యూళ్ళ మధ్య ఒక మంచి భర్తగా, మంచి తండ్రిగా ఉండాలని శోభన్ శాయశక్తులా ప్రయత్నించారు. సినిమావ్యాసంగపు తొలినాళ్ళలోనే తనకీ, తన భార్యకీ మధ్య మూడో వ్యక్తికి అవకాశమివ్వరాదని దృఢంగా నిశ్చయించుకున్నట్లు తెలియజేశారు. చనిపోయేనాటికి దిట్టమైన ఆరోగ్యంతోనే ఉన్నారు. ఆ ఆత్మవిశ్వాసం వల్లే 90 ఏళ్ళకి తక్కువ కాకుండా బతుకుతానని చెప్పేవారు. కానీ 71 ఏళ్ళకే కన్నుమూశారు.

తినబోతూ రుచెందుకు ? కొని చదవండి !

(శోభన్‌బాబు జీవితచరిత్ర – పరుగు ఆపడం ఓ కళ ; కూర్పరి – ఆకెళ్ళ రాఘవేంద్ర : ప్రచురణ – బండ్ల పబ్లికేషన్స్, 2-2-1130/24/1/D/1, ఇండియన్ బ్యాంకు వెనుక, శివమ్ రోడ్డు, కొత్తనల్లకుంట, హైదరాబాదు – 500 044. ఆంధ్రప్రదేశ్ ; ఎడిషన్ – 2009 ; క్రౌన్ సైజు పేపర్‌బ్యాక్ ; పుటలు – 372 ; వెల – రు.200 ; ప్రతులకు – బండ్ల పబ్లికేషన్స్ మఱియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలూ) 

You Might Also Like

15 Comments

  1. చంద్రచూడ్

    మనకేమో ఉన్నతంగా ప్రవర్తించడం చాతకాదు. దానికి తోడు మనకు దినామ్ తారసపడేవన్నీ పెట్టీ మెంటాలిటీసే. అందుకని ఎవరన్నా ఉన్నతంగా ప్రవర్తించారంటే నమ్మకం కలగని సినికల్ మానసికస్థితిలో జీవిస్తున్నాం. శోభన్ గారి గురించి ఇక్కడ రాసినవి అతిశయోక్తులనే ముందు లోకం ఆయన గురించి ఏమనుకుంటున్నదో ఒక్కసారి ఈ లింక్ ఓపెన్ చేసి చదవండి బాబూ !

    http://www.vaartha.com/content/1714/shobhan-babu-life-like-book.html

  2. S

    “రాసేటప్పుడు ఆలోచించద్దూ?”
    ఈ ఒక్క వాక్యం చాలు. బ్రహ్మానందం గారి వ్యాఖ్య ఎంత దూషణా పూరితంగా ఉందో తెలియడానికి. “శోభన్ బాబు ఆ పొగడ్తలకి తగినవాడు కాదు” అని బ్రహ్మానందంగారు తమ అభిప్రాయం వెలిబుచ్చితే సబబుగా ఉండేది, “(తాడేపల్లిగారు) రాసేటప్పుడు ఆలోచించద్దూ” అనడం ఏ విధంగా చూసినా వ్యక్తిగత నింద.

    “శోభన్ బాబు ప్రాతఃస్మరణీయ ఆచార్యపీఠం” అన్నది పూర్తిగా తాడేపల్లిగారి వ్యక్తిగత అభిప్రాయం. తాడేపల్లిగారు ఎక్కువ పొగడ్తలు కురిపించకూడదని ఎవరు అన్నారు? ఆయన బ్రహ్మానందం గారిని వ్యక్తిగతంగా దూషించనంతవరకూ ఆయన వ్యక్తిగత స్వేఛ్చనీ, అభిప్రాయాలనీ ఎవ్వరూ కాదనలేరు. పీరియడ్.

    “ఈ మధ్య పుస్తకం.నెట్ లో ఇటువంటి అతి సమీక్షలు ఎక్కువయ్యాయి.”
    “పుస్తకం డాట్ నెట్ వ్యక్తిగత అభిప్రాయాలకి వేదిక, ఎవరికి తోచినది వారు రాయచ్చు, ఫలానా లాగే రాయాలనేమీ లేదు” అని పాపం పుస్తకం డాట్ నెట్ వాళ్ళు ఇప్పటికి బోల్డన్ని సార్లు చెప్పుకున్నారు. పుస్తకం డాట్ నెట్ లో రాసే వ్యాసాల నాణ్యత, authenticity ( కనీసం fact checking కూడా) పరీక్షించడం పుస్తకం డాట్ నెట్ వారెప్పుడూ చేసినట్లు తోచదు. ఎడిట్ చేసి, పరిష్కరించిన వ్యాసాల వేదిక పుస్తకం డాట్ నెట్ కాదు. పుస్తకం డాట్ నెట్ పర్సనల్ బ్లాగుని మించినది కాదు, నిష్పక్షపాత సమీక్షలని పుస్తకం డాట్ నెట్ లో ఎందుకు ఆశించడం?

    శొభన్ బాబుని పొగిడినందుకు బ్రహ్మానందం గారు ‘తాడేపల్లి గారు అనాలోచితంగా రాస్తున్నరని’ ఇలా నిందా పూర్వకంగా దూషించడం బ్రహ్మానందంగారి
    సంస్కారాన్ని బయట పెడుతోంది. అటువంటి వ్యాఖ్యని ప్రచురించకుండా ఉన్నందుకు వారు తాడేపల్లిగారికి కృతజ్ఞతలు చెప్పాలి.

    నా ఈ వ్యాఖ్యని ప్రచురించినందుకు నేను పుస్తకం డాట్ నెట్ వారిపట్ల కృతజ్ఞతతో ఉంటానని హామీ ఇస్తున్నాను. 🙂

    శుభమస్తు.
    -S

    1. విశాఖన్

      శోభన్ సంస్కారం గురించి చిత్రపరిశ్రమలో ఇప్పటికీ కథలుకథలుగా చెప్పుకుంటారు. మూడు సినిమాలు తీసి ఆర్థికంగా దెబ్బతిన్నాక మహానటి సావిత్రి పట్టుదలగా నాలుగోసారి ప్రయత్నిద్దామని చెప్పి1973 లో ఒకరోజు శోభన్‌కి ఫోన్ చేసారంట “నీతో మాట్లాడాలి. అర్జెంటుగా ర”మ్మంటూ ! సరేనని శోభన్ ఆవిడింటికి వెళ్ళారంట. “నేను ఇంకో సినిమా తీయాలనుకుంటున్నాను బాబూ. నువ్వందులో హీరోగా నటించాలి” అని చెప్పారంట. ఆమెకి ఏమని చెప్పాలో శోభన్‌కి అర్థం కాలేదంట. ఆమె అప్పటికే ఆర్థికంగా దెబ్బతిందని ఆయనకి తెలుసు. కానీ అంతటి సీనియర్ నటి ముందు “వద్దండీ ! మీ వల్లకాదు. నేను చెయ్యలేను.” అని నోరువిప్పి చెప్పడానికి సాహసించలేకపోయారు. ఒప్పుకుంటే ఆమె మళ్లీ నష్టపోవచ్చు. ఒప్పుకోకపోతే ఆమెకి కోపం రావచ్చు. ఎటూ తేల్చుకోలేక డోలాయమానంలో పడి చివరికి ఓ మాటన్నారంట. “అక్కయ్యగారూ ! మీరెప్పుడు సినిమా తీసినా మీరిచ్చే రోల్ చేయడానికి నేను రెడీ. కానీ నాకు మీరేమీ ఇవ్వనవసరం లేదు” అని ! సినిమా అన్నాక దాని ఖర్చులో 20 – 30 శాతం హీరో పారితోషికమే ఉంటుంది కాబట్టి కనీసం అలాగైనా ఆమెని సేవ్ చేద్దామని ఆలోచించారు శోభన్. నిజానికి ఈ మాటలు జరుగుతున్న సమయానికి ఆయన పరిశ్రమలోని అగ్రహీరోలలో ఒకరు. అలాంటాయన ఊరికే నటిస్తాననడం చాలా గొప్పవిషయం. ఆయన పైకి చెప్పకపోయినా ఆయన ఉద్దేశం సావిత్రిగారికి అర్థమైంది. నవ్వుతూ ఆయన్ని సాగనంపారు. కానీ మళ్ళీ సినిమా తీసే ప్రతిపాదన మాత్రం విరమించుకున్నారు.

      అలాగే తనకి తొలిహిట్ సినిమా అవకాశం ఇచ్చిన చటర్జీగారికి శోభన్ ఒకమాట ఇచ్చారంట. “మీరు ఎప్పుడు సినిమా తీసినా మీరిచ్చే అమౌంట్‌ తో తృప్తిపడతాను” అని ఆ మాటకి జీవితాంతం కట్టుబడి ఉన్నారు.

      అదే విధంగా రెండు సినిమాల విషయంలో అనుకున్న బడ్జెట్ దాటిపోవడం మూలాన ఆ నిర్మాతలు శోభన్ గారికి కమిట్ అయిన అమౌంట్ ఇవ్వలేకపోయారు. అయినా శోభన్ గారేమీ ఫీలవ్వలేదు. “సినిమా విడుదలయ్యాక హిట్ అయితేనే ఇవ్వండి. లేకపోతే నా గురించి మీరు అనవసరంగా అప్పులపాలు కావద్దు. నష్టం మనందరిదీ అనుకుందాం” అని సోభన్ వాళ్ళని ఓదార్చారు. అయితే అనుకోకుండా అవి హిట్ అవ్వడం, ఆర్నెల్ల తరువాత వాళ్ళు ఆ అమౌంట్స్‌ని శోభన్‌గారికి చెల్లించడం జరిగింది.

      వీరాభిమన్యు సినిమాషూటింగ్ నాటికి శోభన్ గారొక అనామక నటుడు. ఆ అలుసుతో సీనియర్ విలనైన రాజనాలగారు ఒక సన్నివేశ చిత్రీకరణ బాగా రాకపోయేసరికి శోభన్‌‌గారిని “పనికిమాలినవాడు, Useless fellow” మొదలైన తిట్లతో బాగా దూషించారు. అదే రాజనాలగారు చాలా సంవత్సరాల తరవాత ఆర్థికబాధల్లో పడి నిరుపేదగా మారి సహాయం కోసం శోభన్ ఇంటితలుపు తడితే శోభన్‌గారు ఆ పాతగొడవలేవీ మనసులో పెట్టుకోకుండా ఆయన్ని సగౌరవంగా ఆదరించి ఆర్థిక సహాయం చేశారంట.

      తనకి అపకారం చేసినవాళ్ళ గురించి పల్లెత్తు మాట అనడానిక్కూడా శోభన్ ఇష్టపడేవారు కారు. వాటి గురించి ఆయన్నడిగితే “సైలెన్స్ సైలెన్స్, పిన్‌డ్రాప్ సైలెన్స్. ఇదే నా సమాధానం” అనేవారు.

      ఇలా శోభన్‌గారి దగ్గర నేర్చుకోదగ్గ సద్గుణాలెన్నో ఉన్న మాట వాస్తవం. మన జీవితంలోనే అలాంటి ఘట్టాలెదురైతే ఆయన చూపిన సంస్కారంలో పదోవంతు కూడా మనబోటోళ్ళం చూపించలేం.

      ఒక మనిషి మనకి ఏమిచ్చాడనేది కాదు. తన జీవితం ద్వారా మనకి ఏం నేర్పాడనేది చూడాలి. ఇచ్చినది త్వరగా ఖర్చయిపోతుంది. నేర్పినది శాశ్వతంగా ఉంటుంది. ఆఫ్టరాల్, శోభన్ దగ్గరున్నదంతా మనం మెచ్చి (ప్రేక్షకులం) ఆయనకిచ్చినదే. కక్కిన కూటి కాశించినట్లు ఆయన్నుంచి మనం ఆశించడమేంటి ? సిగ్గుచేటు.

  3. కుమార్‌దత్తా

    Tadepalli has aptly described Late Sobhan as a Karmayogi. Yogi does not mean just the one who does breathing exercises sitting alone in a hut, though Sobhan did this also. The word applies to those who don’t allow themselves to be carried away by the pride , vices, allurements and evil impacts of the world even as they continue to live and work in the same world just like other ordinary mortals.

    There 3 types of people in the world. Those who sink down and get lost the moment they stepped into the ocean of life. There are others who manage to stay afloat somehow but are washed away by the rough currents in an unknown direction. But few mind their actual goal and swim against the powerful currents exactly to the shores they wanted. Sobhan belonged to this rare last category. Unlike many of us, he successfully mastered his emotions well and lived life according to his own terms, no matter what his immediate surroundings were.

    Also a word on the the criticism above. Society in general develops a father feeling towards its male celebrities at whose demise, it breaks down as if its own father has departed. Similarly, it bursts into a fit of rage and anger when someone criticizes him as if its own father was attacked. One should bear this tendency in mind before passing making adverse remarks on the celebrities whom a nation holds dear.

  4. రాఘవుఁడు

    మామూలుగానైతే ఈ సమీక్ష చదివి ఊరకుండేవాడినే. తాడేపల్లివారు ఎలాంటివారో, ఆయన ఆలోచనలేమిటో చాలా కాలంగా (గడచిన ఐదు సంవత్సరాలకు పైగా) గమనిస్తున్నవాడిగా, ఈ సమీక్షకు వచ్చిన రెండవ వ్యాఖ్య నాకు కొంచెం బాధ కలిగించింది. ఐనా, సమీక్ష అన్న శబ్దానికి అర్థమే “సమీక్షాకారుడు చూచిన”దని కదా. 🙂

    వ్యాఖ్య వ్రాసి కాలం వృథా చేసుకోవటం…” 🙂

  5. ఓబుల్ రెడ్డి

    ఆకెళ్ళగారు రాసినవి అతిశయోక్తులూ, అబద్ధాలూ అనేవారు తమకి శోభన్ గురించి తెలిసిన ఆ గొప్పనిజాలేంటో సాక్ష్యాధారాలతో సహా ఈ సైట్ లో బయటపెట్టి ఆ తరవాత మాట్లాడితే జనం మెచ్చుకుంటారు. నిష్పాక్షికతంటున్నారు ! అంత పెద్దపదాలకి అవసరం, అగత్యం ఏముందిక్కడ ? అయ్యా ! ఇది ఒక ప్రఖ్యాత తెలుగుసెలిబ్రిటీ యొక్క జీవితచరిత్రండీ ! ఇద్దరు లిటిగెంట్ల మధ్య కోర్టుకేసు కాదు, మనం మధ్యలో కూర్చుని తీర్పు తీర్చడానికి !

  6. surfizen

    గొర్తిగారి అసహనపు వ్యాఖ్యలు ఖండించదగినవి. మనుషుల గురించి ఏమీ తెలుసుకోకుండా ఊరికే నోటికొచ్చినట్లు మాట్లాడడం, చేతికొచ్చినట్లు రాయడం మంచి సంప్రదాయం కాదు. అసలు ఆకెళ్ళగారి పుస్తకాన్ని చదవకుండానే ఏదేదో మాట్లాడేశెయ్యడం చూస్తే ఈ విమర్శలకి అసలుకారణాలు వేరే ఉన్నాయేమోననే అనుమానం కలుగుతోంది. ప్రతివాళ్ళూ మనకేదో చేసేయాలి, లేదా తవ్వి తలకెత్తేయాలి, లేకపోతే వాళ్ళ ఊసే ఎత్తకూడదు అనే ధోరణి మంచిది కాదు.

    కళాకారులతో ప్రజలకి మానసిక అనుబంధం ఉంటుంది. సినిమాహాల్ లోంచి బయటికొచ్చేసాక ఆయనెవడో, మనమెవరో అనే పరిస్థితి కాదు. వాల్ల వ్యక్తిగత పర్సనాలిటీ ఎలాంటిదనేది కూడా మనకు కావాలి. ఇక్కడ తాడేపల్లిగారు వ్రాసినదేదీ ఆయన సొంతం కాదు. ఆ పుస్తకంలో ఉన్నదే క్లుప్తంగా ప్రెజెంట్ చేశారు. సమీక్షలు వ్రాసేటప్పుడు ఆ పుస్తకంలో అసలేముందో తెలియజేయడం ఆయనకి మొదట్నుంచీ అలవాటే. కాకతాళీయంగా ఆ పుస్తకానికి విషయం అయిన వ్యక్తి ఆయనకి అభిమానపాత్రుడు కూడా కావడం వేరే విషయం. ఇదే తాడేపల్లి గతంలో సావిత్రిగారి గురించి ఇదే శైలిలో వ్రాసినప్పుడు అది ఎవరూ ఖండించలేదేం ? స్త్రీద్వేషి అంటారని భయమా ? తాడేపల్లిగారు రాయలేదు గానీ నిజానికి సావిత్రిగారిలో ఉన్న చాలా లోపాలు శోభన్ గారి జీవితంలో లేవు.

    ప్రతిజాతికీ కొంతమంది ఐకాన్స్ ఉంటారు. వాల్లు రకరకాల రంగాలకి చెంది ఉంటారు. అలాగే మన తెలుగువాల్లలో కూడ కొందరు ఐకాన్స్ ఉన్నారు. వాల్లు వృత్తిరీత్యా ఏంటనేది మనకు అనవసరం. అందరమూ ఏదో వృత్తి చేసుకొని బతక్క తప్పదు కనుక ! మనం బయటివాళ్ళతో చెప్పుకోవడానికి, మన జాతిని వారికి పరిచయం చేయడానికీ, పరువుమర్యాదలతో ప్రపంచంలో తలెత్తుకు నిలబడడానికీ అవకాశం ఇచ్చే జాతిరత్నాలే ఈ ఐకాన్సు. అటువంటి తెలుగు ఐకాన్సులో శోభన్ ఒకరు. మనోల్లని మనమే అనుకుంటే అందులో అర్థమేముంది ?

    శోభన్ గారు గొప్ప మానవుడు. గుప్తదాత, సంఘసేవకుడు. ఈనాడు సినిమారంగంలో ఖచ్చితమైన పనివేళలూ, సినిమా కార్మికులకి PF, ఇన్శ్యూరెన్సు మొదలైన సౌకర్యాలు ఏర్పడడానికి కారకుడు. సినీ ప్రపంచపు రంగుల వలయంలో పడి కుటుంబాల్ని విస్మరించవద్దనీ, దురలవాట్లు చేసుకోవద్దనీ సినిమావాల్లకి నేర్పిన ఆదిగురువు. ఇది నిజానికి సినిమావాల్లకే కాదు, మనకందరికీ గుణపాఠమే. ఎంత హీరోయిన్లయినా ఆడవాల్లని తోబుట్టువులుగా చూసుకోవాలనే ఆయన ఆదర్శం మాత్రం ప్రచారంలోకి రాలేదు. అందుకే ఈరోజుకీ తెలుగమ్మాయిలు ఆ రంగంలో అడుగుపెట్టలేకపోతున్నారు. హీరోయిన్లందరినీ ముంబైనుంచి తేవాల్సి వస్తున్నది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే సత్యాన్ని ఆచరించి చూపినవాడు శోభన్.

    సమీక్షలున్నది మనుషుల్ని బోనెక్కించి జడ్జ్ చేయడానికి కాదు. పుస్తకాల్ని పరిచయం చేసుకోవడానికి ! గొప్పవ్యక్తుల గురించి గొప్పవిషయాలు తెలుసుకోవడానికి ! ఒకరిని జడ్జ్ చేయడానికి మనమెవరం ? మన స్థాయి ఏపాటిది ?

    తాడేపల్లిగారినుంచి ఇలాంటి సమీక్షలు భవిష్యత్తులో మరెన్నో రావాలని ఎదురుచూస్తున్నాను.

  7. రవి

    గొర్తి వారి విమర్శ సహేతుకంగానే ఉంది. తూలనాడినట్టు, కించపర్చినట్టుగా లేదు. సినిమా చూస్తాం, బయటకొచ్చిన తర్వాత అతని పేరు, అతని విన్యాసాలు గుర్తుండవలసిన అవసరం లేదు.

    >>““హీరో అంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి” అని ప్రజల మనస్సులలో ఒక ఉన్నత ప్రమాణాన్ని >>నెలకొల్పిపోయిన ప్రాతఃస్మరణీయ ఆచార్యపీఠం కీ.శే. శోభన్.”

    హీరో సినిమాకు మాత్రమే పరిమితం. సినిమాలో పోరాటాలు, నృత్యాలు, దానాలు, ధర్మాలు ఏవైనా చేసుకోనివ్వండి. సినిమాకే అతడు హీరో. బయట జీవితంలో “హీరో” ఎలా ఉంటే ఎవరికెండుకు? ఆయన జీవితాన్ని హీరో కాని ఇతరుల జీవితాలకు అన్వయించుకునే ప్రమాణాలెందుకు?

    పుస్తకం మీద సమీక్ష సాధ్యమైనంత నిష్పాక్షికంగా ఉంటే బావుంటుందని వ్యక్తిగతంగా నేనూ భావిస్తున్నాను.

  8. ravi

    99% శాతము సామాన్య ప్రజలకు, జీవితములొ (మిగిలిన 1%) సక్సెస్ అయిన వ్యక్తులు ఎప్పుడూ ఆదర్సప్రాయులే. అలాంటివారినుండే స్పూర్తిని పొందాలి. అలాంటి గొప్పవారిలొ ఉన్న ఒకటి లేక రెండు చిన్న తప్పులను చూపి వారిని అగౌరవ పరచడము తగదు, వారు ఏవరు అయినాకాని (ఏ కులమైనా, మతమైనా లేక దేశమైనా).

    గొర్టి అన్నారు, శోభన్ బాబు ఏమైనా మదర్ తెరెస్సానా అని? ఆమే ఏవరు. ఒక కిరస్తానీ మిషనరి. వారి పని హిందువులను కిరస్తానీలుగా మత మార్పిడి చేయడము. దానిలొ బాగంగా schools, hospitals, orphanage నడపడము వారు ఎన్నుకున్న మార్గము. ఎందు కంటే ఆ విదంగా మత మార్పిడి చేయుట సులభము కాబట్టి.

    కాని ఏమి తెలియని కొంతమంది మూర్ఖులు అలాంటి వారికి (కిరస్తానీ మిషనరీలకు) గొప్పతనాన్ని ఆపాదించి, ఇండియన్లలొ ఎవరైనా మంచి పనిచేస్తే, దానిని కుల దురహంకారముతొ లేక మరే ఇతరకారాణాలతొ కించపరచడము ఆచారము అయింది. అందుకే ఇండియన్ గొప్పతనము ఒక తెల్ల కిరస్తానీ మిషనరి గుర్తించిన తరువాతనే, మనము గుర్తించడము జరుగుతుంది. ఇది ఇండియన్ల దౌర్భాగ్యము. మనలొ వున్న గొప్పవారిని గుర్తించడము మనము ముందుగా నేర్చుకొవాలి.

    తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు.

  9. కృష్ణ

    నమస్తే

    శోభన్ బాబు గారి గురించి మీరు రాసినది సత్యమే. నాకు పుస్తకాల ద్వారా మాత్రమే తెలుసు.
    కాని కొన్ని వ్యాఖ్యల విషయం లో గొర్తి బ్రహ్మానందం గారి తో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మీరు గురు భావం తో నే రాసి వుంటారు అందులో సందేహం లేదు.
    కొన్ని సార్లు ప్రస్తావించే విషయం ఇష్టమైనది ఐతే మన ప్రమేయం లేకుండానే కొంత అతిశయోక్తి ఉంటుంది.
    నటన పరంగా, జీవితం పరంగా గాని శోభన్ బాబుగారు ఉన్నతులే అందులో ఏ సందేహం లేదు. కాని కొంచం అతిశయోక్తి ఉన్నమాట వాస్తవం.
    ఉన్నది ఉన్నట్టు (practical గా ) రాస్తే, మీ మీద మరింత గురు భావం పెరుగుతుంది.

    కృష్ణ

  10. తాడేపల్లి హరికృష్ణ

    అవకాశాలకోసరం దశాబ్దన్నర పడిగాపులు కాచి చివరికి సఫలురైన శొభన్ బాబు వంటి వారి కార్య దీక్ష, అందుకు వెనకాల ఉన్న ఆయన కుటుంబసభ్యుల సహకారమూ ఆరాధ్యాలేను. ఎన్.టీ.ఆర్, ఏ.ఎన్.ఆర్, ఎస్.పీ.బీ, ఘంటసాల, రేలంగీ ఇలా చెప్పుకుపోతే చలనచిత్రసీమల్లో శిఖరాగ్రాలెక్కిన వాళ్ళందరూ ఒకనాడు టీ నగర్లోనో, ట్రిప్లికేనులోనో, మాంబళంలోనో చిన్నవాటాల్లో అనామకులుగా రంగప్రవేశం చేసినవాళ్ళేను. ఓ పూట తినీ ఓపూట తినకా కష్టపడ్డ వాళ్ళేను. [ఇటీవల నేపధ్యగాయకుడిగా ప్రసిద్ధుడైన నాగూర్ బాబు గారు కూడా తనకి అవకాశల్లేని రోజుల్లో టీ.నగర్లో ఉన్న సవాలక్ష కళ్యాణమండపాల్లో ఏదో ఒకటి ఎప్పుడూ జరుగుతూనే వుంటుందనీ, వాటిల్లో దూరి కడుపు నింపుకునేవాడిననీ ఒక టీవీ ప్రోగ్రాం లో తెలియజేశారు]. కానీ ఇలా గ్రంధస్థం చెయ్యబడిన ప్రతి ఒక్క మహావ్యక్తి లెక్కకీ, అ సినీ సామ్రాజ్యలక్ష్మి చెయ్యి అంటీ అంటనట్టే జారిపోయి కాలప్రవాహంలో కొట్టుకుపోయిన ఆర్తులెందరో అంతకి శతాధిక సంఖ్యలో వున్నారు. [పూలరంగడు సినిమాలో “చిగురులు వేసిన కలలన్నీ” (శొభన్ బాబు గారి పాట) పాటకి నేపధ్యాన్నిచ్చిన KBK మోహన్ రాజు గారు నేపధ్యగాయకుడిగా స్థిరపడ్డానికి తానెంత విఫలప్రయత్నాలు చేసిందీ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు]. శ్రమతత్పరతా, కార్యదీక్షా, అంకితభావమూ, ఆత్మాశ్రయమూ అన్ని సందర్భాలలోనూ ఆరాధ్యాలేనూ. కానీ అవి ఆయావ్యక్తులకి లౌకిక ప్రయోజనాలని సాధించిపెట్టినప్పుడు వాటి గురుత్వం మరింతగా కొనియాడబడుతుంది.

  11. Brahmanandam Gorti

    Mr.Lalita Balasubrahmanyam,

    I didn’t use any abusive language or any offending comments. Publishing your comment and deleting mine shows your fear of not taking criticism on the articles.

    This shows how pustakam.net is partial towards certain people by showing their favoratism.

    Before you make allegations towards me, let the other readers decide if I made the personal allegations or not.

    -Brahmanandam

  12. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

    గొర్తి సాయిబ్రహ్మానందం గారికి నమస్కారములు.

    ఆర్యా ! వ్యక్తిగత ఆక్షేపణాశైలిలో దివంగత శోభన్ గారినీ, సమీక్షకుణ్ణీ కూడా కించపఱుస్తూ వ్రాసిన మీ వ్యాఖ్యని ప్రచురించజాలనందుకు విచారిస్తున్నాను. మీకు శోభన్ పట్ల ఏ విధమైన సెంటిమెంటూ లేకపోవచ్చు. మీకు ఆయన జీవితచరిత్ర ముఖ్యమైనది కాకపోవచ్చు. కానీ దేశంలో కోట్లాదిమందికుంది. వాళ్ళల్లో నేనొకణ్ణి. మాకు అది ముఖ్యమే. మాలో లేనివీ, శోభన్ గారిలో ఉన్నవీ అయిన సద్గుణాలు చాలానే ఉన్నాయి. అవి మాకు తెలుసు. అందుకనే ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం జఱిగింది. అవకాశముంటే, ఈ పుస్తకాన్ని అన్ని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్లకీ ఒక పాఠ్యపుస్తకంగా నేను సిఫారసు చేస్తాను.

  13. Brahmanandam Gorti

    మరీ ఇన్ని అతిశయోక్తులా?

    ““హీరో అంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి” అని ప్రజల మనస్సులలో ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పిపోయిన ప్రాతఃస్మరణీయ ఆచార్యపీఠం కీ.శే. శోభన్.”

    ప్రాతః స్మరణీయ వ్యక్తా? సినిమాల్లో బాగా నటించారు; కాస్త చెప్పుకోదగ్గ వ్యక్తి అని రాయచ్చు కదా? ఈ మధ్య పుస్తకం.నెట్ లో ఇటువంటి అతి సమీక్షలు ఎక్కువయ్యాయి. ప్రాతః స్మరణీయులు అంటే ఇంత చులకనా రాసిన వారికి. ఆచార్య పీఠమా? అంటే అర్థం తెలుసా? ఎందుకంత మితిమీరిన పొగడ్త? ఏవైనా పేరున్న వారు మహా వ్యక్తుల్లా, ఆదర్శపురుషుల్లా కనిపిస్తారు, లోపల ఎన్ని లొసుగులున్నా! ఈయనేవయినా మదర్ తెరెస్సానా, మహాత్మా గాంధీనా?

    నటుడు బాగా నటించారు, అనండి పరవాలేదు.

    ఈ క్రింది వాక్యం చూడండి:

    “అలాంటి మహానటుడి మీద ఆకెళ్ళ రాఘవేంద్రగారు ’శోభన్‌బాబు జీవితచరిత్ర’ అనే అమూల్యమైన గ్రంథాన్ని వెలువరించి అశేష ఆంధ్రావళికి మహోపకారం చేశారు”

    అమూల్యగ్రంధమా ఈయన జీవిత చరిత్ర? Too much. అక్షరాలకయినా హద్దుండాలి. కలానికి అక్షరాలు లోకువలా వుంది.
    పుస్తక సమీక్షల మీద సమీక్షలు రాయాల్సిన అగత్యం దాపురిస్తోంది తెలుగు సాహిత్యానికి.
    పుస్తకం బాగోగులు రాయండి. విశేషాలు చెప్పండి. కాదనరు. కానీ ఇలా ఆకాశానికి ఎత్తేయడం ఎవరికి ప్రయోజనం?

    రాసిన మిమ్మల్ని కించపరచాలని కాదు. రాసేటప్పుడు కాస్తయినా ఆలోచించద్దూ?

    వ్యాఖ్య రాసి నా కాలం ఎందుకు వృధా అనుకున్నాను. కానీ ఉండబట్టలేక రాస్తున్నాను.

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  14. చిన్ని ఆశ

    రంగుల లోకంలో ఉన్నా, దానిని కేవలం వృత్తిగానే తీసుకుని చాలా ఆదర్శమైన జీవితం గడిపిన శోభన్ బాబు గారి జీవితం ప్రతి తెలుగు వారూ చదివి తెలుసుకోదగ్గది.

Leave a Reply