మన బంగారు ఖజానా – ముద్దుకృష్ణ వైతాళికులు

నేను మా లైబ్రరీలో ఎప్పుడూ కనీసం రెండు ప్రతులు ఉంచుకునే పుస్తకాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది ముద్దుకృష్ణ సంకలనం చేసిన వైతాళికులు. ఈ రెండు ప్రతుల వెనుక కథేమిటంటే నేను అమెరికా వచ్చిన కొత్తలో నా దగ్గర వైతాళికులు కాపీ ఒక్కటే ఉండేది. ఆ పుస్తకాన్ని చికాగోలో ఎవరో మిత్రులు అరువు తీసుకువెళ్ళారు. అంతే, చాలాకాలంపాటు ఆ పుస్తకం అతీ గతీ తెలీలేదు. ఎప్పుడన్నా చదువుకొందామన్నా, ఏదైనా రిఫరెన్సుకోసమని వెదుక్కున్నా వైతాళికులు లేక చాలా ఇబ్బంది పడేవాణ్ణి. తదుపరి ఇండియా ప్రయాణంలో వైతాళికులు రెండు ప్రతులు కొనుక్కున్నాను. నేను డేటన్‌లొ పదేళ్ళు ఉండి చికాగో తిరిగి వచ్చాక ఇంకో మిత్రుడి ఇంట్లో నా పాత వైతాళికులు కాపీ కనిపించింది లెండి. మొహమాటం పడకుండా ఇది నాదే అని చెప్పి వెనక్కు తెచ్చేసుకున్నాను.

వైతాళికులు పుస్తకాన్ని మొదటిసారి చూసింది గుంటూర్లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న రోజుల్లో. ఏదో అంతర్‌కళాశాలల పోటీలో నాకో, జయప్రకాష్ నారాయణ్‌కో ఈ పుస్తకం బహుమతిగా వచ్చింది. ఒక్కసారి పుస్తకం తెరిస్తే రత్నాలగనిలో అడుగు పెట్టినట్లనిపించింది. కళ్ళు జిగేల్‌మనేలా తెలుగు కవితా ప్రకాశం. ఎటు చూసినా అపారకవితా సంపదలు. పలువన్నెలతో, వివిధ చాయలలో అపురూపమైన రత్నాలు, మణిమాణిక్యాలు. ఆలీబాబా గుహలో అడుగు పెట్టినప్పుడు, సింద్‌బాద్ రత్నాలలోయలో పడినప్పుడు ఇలాగే ఉండి ఉంటుందేమో! గతశతాబ్దపు తొలిభాగంలో వెల్లివిరిసిన నూతన కవితా ప్రక్రియ విశ్వరూపం ఈ సంకలనంలో కనిపించింది. అబ్బురపడుతూ, ఆర్తిగా, ఆకలిగా, ఆరాటంగా ఈ కవితల్ని చదువుకొన్నాము.

పుస్తకం తెరవగానే

 

ఏ దేశ మేఁగినా, ఎందు కాలిడిన
ఏ పీఠమెక్కినా, యెవ రెదు రయిన
పొగడరా, నీ తల్లి భూమి భారతిని,
నిలుపరా, నీ జాతి నిండు గౌరవము!

సూర్యుని వెలుతురుల్ సోకునందాక,
ఓడల జెండాలు ఆడునందాక,
నరుడు ప్రాణాలతో నడుచునందాక,
అందాక గల ఈ యనంత భూతలిని
మన భూమి వంటి చల్లని భూమి లేదు!
పాడరా నీ తెన్గు బాలగీతములు,
పాడరా నీ వీర భావభారతము!

అంటూ మొదటి పుటలోనే రాయప్రోలు  సుబ్బారావు జన్మభూమి ప్రబోధం.

పేజీ తిప్పితే

దేశమును ప్రేమించుమన్నా,
మంచి అన్నది పెంచుమన్నా;

స్వంత లాభము కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్!
దేశమంటే మట్టి కాదోయ్,
దేశమంటే మనుషులోయ్!

అంటూ దేశభక్తి ప్రబోధం చేస్తూనే

ఆకు లందున అణగి మణగీ
కవిత కోయిల పలుకవలెనోయ్,
పలుకులను విని దేశ మం దభి
మానములు  మొలకెత్తవలె నోయ్!

అంటున్నమహాకవి గురజాడ అప్పారావు.

అంతేనా! మూడో కవితలో

లేవు దివ్య తురంగముల్, లేవు కరులు,
ప్రజలె యా తేరు మోకులఁ బట్టువారు,
వాయుజవమునఁ దారకాధ్వమున నేగు
నంతరాయశతంబులనైన దాఁటి!

తేరు జాడల నెత్తురు పాఱి పాఱి
బంగరుంబంటఁ బండించె  బక్క నేలఁ,
జక్రనేములు దాఁకిన స్థలము లెల్ల
సస్యలక్ష్మికిఁ గల్యాణశాల లయ్యె

అంటూ స్వాతంత్ర్య రథాన్ని స్వాగతిస్తాడు దువ్వూరి రామిరెడ్డి.

ఇక నాల్గవ పద్యంలో

గోదావరీ పావనోదారవాఃపూర
మఖిలభారతము మాదన్న నాడు,
తుంగభద్రా సముత్తుంగ రావముతోడ
కవులగానము శ్రుతిఁ గలయు నాఁడు,
పెన్నానదీ సముత్పన్న కైరవదళ
శ్రేణిలో తెన్గు వాసించునాడు
కృష్ణాతరంగ నిర్ణిద్ర గానముతోడ
శిల్పమ్ము తొలిపూజ సేయునాడు!
అక్షర జ్ఞానమెఱుఁగదో యాంధ్రజాతి,

విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుఁ బాట పిచ్చుకగూండ్లు కట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశల యందు!

అంటూ ఆంధ్ర పౌరుషాన్ని గానం చేస్తున్న విశ్వనాధ సత్యనారాయణ.

అప్పటికి ఆధునిక తెలుగు కవిత్వంతో నాకు పరిచయం బాగా తక్కువ. త్వమేవాహం, మహా ప్రస్థానం, బసవరాజు అప్పారావు గేయాలు, అమృతం కురిసిన రాత్రి మాత్రమే చదివాను. విశ్వనాథ, బాపిరాజుల నవలలు చదివాను కాని కవితలు చదవలేదు. కృష్ణశాస్త్రి సినిమా పాటలు కొన్ని మాత్రం తెలుసు. మిగతా కవుల పేర్లు వినడమే కాని అప్పటిదాకా చదివింది లేదు. ఆ అజ్ఙానపు స్థితిలో ఈ పుస్తకం చేతికి వచ్చింది.  మంత్రనగరి ద్వారాలను తెరచింది.

లోపలికి వెళితే,

ఆఁగుఁ మాఁగుము తెరువరీ,
ఆయాసఖేదము నపనయింపుము
మా గృహాంగణకుసుమసముదయ

మధువు లియ్యవిగో!

అంటూ కొడవటిగంటి వెంకటసుబ్బయ్య గారు ఆతిథ్యము ఇస్తారు.

 లేవకే నా యెంకి, లేపకే నిదర,
ఈ పాటి సుకము నే నింతవర కెరగనే

తెలివి రానీయకే,
కల కరిగిపోతాది,
ఒక్క నేనె నీకు
పెక్కు నీవులు నాకు

లేవకే నా యెంకి, లేపకే నిదర,
ఈ పాటి సుకము నే నింతవర కెరగనే

అంటూ కలలోన  నా యెంకి తో కబుర్లు చెబుతూ నండూరి సుబ్బారావు కనిపిస్తారు.

తెల్ల మబ్బుల కెరటాల తేలిపోవు
నట్టి భవదంతరిక్ష ప్రయాణము గన
ఇనుపతలుపుల నడమ వసించు మాకు,
నుల్ల మూహాతరంగాల నూగుచుండె

అంటూ జైలులో చందమామతో కబుర్లు చెబుతున్నారు కొడాలి ఆంజనేయులు.
కానీ, ఒక రాత్రి

గగనమంత నిండి
పొగలాగు క్రమ్మి
బహుళ పంచమి జ్యోత్స్న
భయపెట్టు నన్ను

అంటున్న శ్రీశ్రీకి ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగా కనిపిస్తుంది జాబిల్లి.

ఆ రోజుల్లో ఏ డిబేట్ పోటీల్లో పాల్గొనడానికి వెళ్ళినా, మాతో పాటు వైతాళికులు ఉండేది (మా జట్టులో ఇప్పటి లోక్‌సత్తా నాయకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, ఈ మధ్యే పద్మశ్రీ అవార్డు నందుకున్న, హైదరాబాదు NIMSలో ఆర్థోపిడీషియన్, డా. లావు నరేంద్రనాథ్; ఇంగ్లీషుటీములో జేపీతో పాటు ప్రజారాజ్యం పార్టీలో వ్యవస్థాపక కార్యదర్శిగా పని చేసిన డా. మిత్రా, ప్రస్తుతం నార్త్ డకోటాలో ఉంటున్న డా. వాణీ రామారావు ఉండేవారు). చాలా కవితలు కంఠోపాఠమే ఐనా, అవసరానికి తగ్గ పంక్తులు వెతుక్కుని సందర్భోచితంగా కలుపుకునేవారం. అప్పటి మా విజయాల్లో వైతాళికుల పాత్ర తక్కువేమీ కాదు.

 

ఈ యెగిరిన ఇనుపడేగ
ఈ పండిన మంట పంట,
ద్రోహాలను తూలగొట్టి,
దోషాలను తుడిచిపెట్టి,
స్వాతంత్ర్యం –
సమభావం –
సౌభాత్రం –
సౌహార్దం
పునాదులై ఇళ్లు లేచి
జనావళికి శుభం పూచి-
శాంతి, శాంతి, కాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజ మవుతుంది!
ఈ స్వర్గం ఋజు వవుతుంది!

పతితులార!
భ్రస్టులార!
బాధసర్పదష్టులార!
దగాపడిన తమ్ములార!
ఏడవకం డేడవకండి!
వచ్చేశాయ్, విచ్చేశాయ్
జగన్నాథ
జగన్నాథ
జగన్నాథుని రథచక్రాల్
జగన్నాథుని రథచక్రాల్
రథచక్రాల్
రథచక్రాల్

రథచక్రాల్ రథచక్రాల్
రా రండో! రండో! రండి!
ఈలోకం మీదేనండి!!
మీ రాజ్యం మీరేలండి!!!

 

గతశతాబ్దం మొదట్లో కొత్త వెల్లువగా వస్తున్న నవయుగపు కవిత్వంలో వివిధ గళాలని ఒకచోట చేర్చి యుగలక్షణాలను పాఠకులకు పరిచయం చేయటానికి ఉద్దేశించిన సంకలనం ఇది. ఈ సంకలనం మొదట ప్రచురించబడింది 1935లో.  గత శతాబ్దపు మొదటి మూడు దశాబ్దాలు ఒక చారిత్రక సంధి సమయం. తెలుగు సాహిత్య చారిత్రక సంధి సమయం కూడా. తెలుగునాట భావకవిత్వపు వాయువులు ఉధృతంగా వీస్తున్న రోజులు. ఆంగ్ల సాహిత్యంతోనూ, ఇతర పాశ్చాత్య సాహిత్యంతోనూ పరిచయాలు పెరిగిన ఒక కొత్త తరం వీరేశలింగం, గిడుగు, గురజాడల ఉత్తేజంతో కొత్త ఛందస్సులు, కొత్త వ్యాకరణాలు, కొత్త లక్షణ గ్రంథాలు సృష్టించుకొంటూ కొత్త దారులలో పరవళ్ళు తొక్కుతూ ఉరకలు వేస్తున్న సమయం. స్వాతంత్ర్యోద్యమం దేశాన్ని పట్టి ఊపేస్తున్న సమయం. దానికి తోడు అప్పుడే కొత్తగా వస్తున్న ఆంధ్ర రాష్ట్రోద్యమం, సోవియట్ రష్యా స్పృహతో అప్పుడే పరిచయమౌతున్న కమ్యూనిస్ట్ ఉద్యమం. వీటన్నిటికీ తోడు వ్యావహారిక భాషోద్యమం. కొత్త చదువుల వల్ల నేర్చిన కొత్త కవితల రీతులు.  భావ కవిత్వం తెలుగు కవితాసీమను రాజ్యమేలటం మొదలుబెట్టింది. కృష్ణశాస్త్రి వంటి కవులు ఊరూరా తిరిగి తమ కవిత్వాన్నే కాక నవ్యకవిత్వంలో ఇతర కవుల కవితల్ని కూడా వేదిక మీద గానం చేస్తూ శ్రోతలకు, పాఠకులకు పరిచయం చేస్తున్న రోజులు. నవ్య కవితా సమితి వంటి సంస్థలు సాహిత్యసామ్రాజ్యా న్నేలుతున్న రోజులు. తన బాధను అందరి బాధ చేసిన కృష్ణశాస్త్రి తన ప్రేయసిని విశ్వప్రేయసి చేసిన రోజులు.

ఆమె కన్నులలో ననం తాంబరంపు
నీలి నీడలు కలవు;

వినిర్మిలాంబు
పూర  గంభీర శాంత కాసార చిత్ర
హృదయములలోని  గాటంపు నిదుర చాయ
లందు నెడనెడ గ్రమ్ము;

సంధ్యావసాన
సమయమున నీపపాదపశాఖికాగ్ర
పత్రకుటిలమార్గములలోపల వసించు
ఇరుల గుసగుసల్ వానిలో నిపుడు నపుడు
వినబడుచునుండు;

మరికొన్ని వేళలందు
వానకారుమబ్బుల మెయివన్నె వెనుక
దాగు భాష్పమ్ము లామె నేత్రములలోన
బొంచుచుండును

ఎదియొ అపూర్వ మధుర
రక్తి స్ఫురియించు కాని అర్థమ్ము కాని
భావగీతమ్ము లవి…

(ఆమె కన్నులుదేవులపల్లి కృష్ణశాస్త్రి)

వైతాళికులు సంకలనకర్త ముద్దుకృష్ణ  స్వయంగా రచయిత; సాహిత్య వాసనలున్న కుటుంబంనుంచి వచ్చినవాడు. తాత ముద్దు నరసింహం గారు 1840లోనే వ్యావహారిక భాషలో హితసూచని అనే పుస్తకాన్ని వ్రాశారు. ముద్దుకృష్ణకు సాహిత్యం, నాటకాలు అంటే అభిమానం. సంస్కృతాంధ్రాంగ్ల  సాహిత్యాలలో పరిచయమూ, పరిజ్ఙానమూ సంపాదించుకున్నాడు. జాతీయోద్యమంలో పాలు పంచుకొన్నాడు. దేవులపల్లి, చింతా దీక్షితులు, తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి మొదలగువారికి సన్నిహితుడు.  ముద్దుకృష్ణ రాసిన అశోకం నాటకం ఒక సంచలనం. 1934లో జ్వాల అనే పత్రికను నిర్వహించాడు; పేరైతే చాలా వచ్చింది కానీ ఎక్కువ కాలం నిలువలేదు.  కొన్నాళ్ళు సినిమారంగంలోనూ పనిచేశాడు.

ముద్దుకృష్ణ పేరు తెలుగుసాహిత్యంలో చిరస్థాయిలో నిలబడేట్లు చేసింది మాత్రం వైతాళికులు సంకలనం. ఈ పుస్తకం మొదటగా 1935లో ప్రచురితమైంది. మొదటి ప్రచురణ చాలా అందంగా ఉండేదని వేల్చేరు నారాయణరావుగారు చెబుతుంటారు. మూడు నాలుగేళ్ళ క్రితం తానా ప్రచురణల తరపున మొదటి ముద్రణ రీతిలో ఒక మేలు ప్రతిని ప్రచురిద్దామని తలపెట్టాం కాని కారణాంతరాల వల్ల ఆ పని జరగలేదు. వైతాళికులు ఇప్పటివరకూ చాలా పునర్ముద్రణలు పొందింది. నా దగ్గర ఉన్నవి 8వ ముద్రణ (1973 మే), 11వ ముద్రణ (1994 ఫిబ్రవరి). ఈ మధ్యకూడా (2005 ప్రాంతాల్లో) ఇంకో ముద్రణ వచ్చిందని విన్నాను.

పుస్తకం  అందం ఆకారానికే పరిమితం కాదు. అందులోఉన్న అద్భుత కవితాసౌందర్యానిదే ప్రథమ స్థానం.

కవికొండల వెంకటరావు శివరాత్రి ప్రభ చూడండి:

కాలకంఠుని నాగసర్పము
కుబుస మూడ్చీ పడగ బుస్సంది
రెండు నాల్కలు గండు మీసాలట్లు దూసింది
చెవులు మోసింది;
నాగసొర మూదేది యెవరోయి,
రాగ మొలికించేది యెవరోయి?
కాఱునల్లని  కాళరాత్రి!

నొసట గొసరిన మూడోకన్ను
నివురులూదిన కొలిమిఁ దెగడి
నెగడి ద్రిప్పింది
పొగలు గప్పింది;

కమ్మ రయితే ఇనుము కరగ
సోమ రయితే చలిని కాగ;
ఎవరు వచ్చేరోయ్?
ఎవరు మెచ్చేరోయ్?
కాఱునల్లని  కాళరాత్రి!

అర్థభాగపు మహంకాళీ
కర్థమది కాలేదొ
ఏమో?

పునుకులా గలగలలు వింటూ
కునుకు గన్నాదో?
నాధునీ వద్దనదు నాట్యము,
నాధునీ కద్దనదు …
అరరే ఆడిపోతున్నాయ్!

వాడి ముమ్మొనవాలు,
హుత భుక్,
అజ కపాలం
ఢక్క డుబడుక్
నాల్గుసేతుల నాడు లౌతున్నాయ్!
అశ్శరభ! శరభ!
పందెమూ వేసేది యెవరోయి?
కుందనము గాసేది యెవరోయి?
కాఱునల్లని కాళరాత్రి!

ప్రభలలో ప్రభ నిలుప నెవరోయి
ప్రభలలో ప్రభ గలుప నెవరోయి,
కాఱునల్లని  కాళరాత్రి!

 

స్థలవిస్తరణభీతితో మొత్తం పద్యం ఇవ్వలేదు కానీ ఎన్నిసార్లు చదివినా అచ్చెరువు కలిగించే కవిత. ఇలాంటి కవితలెన్నో ఈ సంకలనంలో.

ఆంగ్లంలో  Francis Turner Palgrave 1861లో Golden Treasury పేరిట ప్రచురించిన ఉత్తమ కవితాసంకలనం ఇప్పటికీ ప్రసిద్ధం; కొత్త చేర్పులతో పునర్ముద్రణలు పొందుతూనే ఉంటుంది. ముద్దుకృష్ణ వైతాళికులు మనదైన బంగారు ఖజానా. తెలుగు కవితారత్నాలను ఎంపికతో ప్రోది చేసి, జాగ్రత్తబెట్టి ముందుతరాలకు అందిస్తున్న కోశాగారం.

(సశేషం)

తా.క.

1. ఈ పుస్తకంలో కవితలతో పాటు కవుల పేర్లు పూర్తిగా ఇవ్వడం తక్కువ; రాయప్రోలు, గురజాడ, రామిరెడ్డి ఇలా ఉంటాయి. జీవిత పరిచయాలలో మాత్రం పూర్తి పేర్లు ఉన్నాయి. పాఠకుల సౌలభ్యంకోసం ఈ వ్యాసంలో పూర్తి పేర్లే వాడాను.
2. నా దగ్గర ఉన్న రెండు ముద్రణలకు మధ్య భేదాలు ఉన్నప్పుడు, 1973 ముద్రణను ప్రామాణికంగా తీసుకున్నాను (అచ్చుతప్పులు స్పష్టంగా తెలిసినప్పుడు తప్ప).
3. ఈ వ్యాసంతో ఉన్న ముద్దుకృష్ణ చిత్రం తురుపుముక్క బ్లాగు అలనాటిపత్రికలు చిత్రాల్లోంచి తీసుకున్నాను.

________________________________________________________________________

వైతాళికులు
సంకలనం
ముద్దుకృష్ణ (1899 ఫిబ్రవరి 7 – 1973 ఫిబ్రవరి 6)
మొదటి ప్రచురణ: 1935 సంక్రాంతి;  జ్వాల ప్రచురణలు

ఇటీవలి ముద్రణలు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

26 గురు కవులు; 191 కవితలు

You Might Also Like

16 Comments

  1. మణి వడ్లమాని

    కవితలన్నీ ఒక్క చోట చేర్చి తెలుగుకవితలపేరు(హారం) ను మన అందరికి కాన్కగా ఇచ్చిన శ్రీ ముద్దుకృష్ణ గారు . ఈ బృహత్కార్యాన్ని చెయ్యడం లో ఎన్నో కష్ట నష్టాలు కి ఓర్చి ఈ ‘వైతాళికుల” సంకలనం అందించారు

    ఇంత మంచి పుస్తక పరిచయాన్ని చేసిన శ్రీ చౌదరిగారు గారికి ధన్యవాదాలు.
    రెండు భాగాలుగా చెప్పినకాని,ఆయనకి ఇంకా చెప్పాలనే తపన కనిపిస్తోంది.అందుకే ఇది ఒక భాండాగారం యెంతచెప్పిన తనివితీరదు అన్నారు.

    చౌదరిగారూ,మీ దగ్గర వున్న దాదాపు నలభై ఏళ్ళు పుస్తకం లానే, నా దగ్గర కూడా వుంది అది మా నాన్నగారికి ఒక కవి మిత్రుడు బహుశ 19 63-64 లో కాబోసు మద్రాసు లో ఇచ్చారుట. ఆ తరువాత నేను రెండు ఏళ్ళ క్రితం ఇంకో కొత్త పుస్తకం కొన్నాను. కానీ చాల విచిత్రం గ కొత్త పుస్తకం పోయి. మా నాన్నగారి జ్ఞాపకం గ వున్నా ఆ పాత పుస్తకమే వుంది.

    యెంత మంది కవులో ఎన్ని భావాలో అందరు కూడా దాచుకోవలసిన అపురూపమైన పుస్తకం అని నా భావన

  2. మన బంగారు ఖజానా – ముద్దుకృష్ణ వైతాళికులు – 2 | పుస్తకం

    […] మన బంగారు ఖజానా – ముద్దుకృష్ణ వైతాళికులు […]

  3. బొల్లోజు బాబా

    చర్చ బాగుంది
    నాకు చాలా సార్లు అనిపించిన ఒక విషయం
    శ్రీశ్రీ, తిలక్ లు తమను తోటి మానవులకంటే చాలా ఉన్నతమైన స్థానంలో ఊహించుకొని సాహిత్య సృష్టి చేసారనిపింస్తుంది. బహుసా ఆ గుణం వల్లే వారి సాహిత్యం అజరామరమైనది అయ్యిందేమోకూడా.
    ఉదాహరణకు – నరజాతి సమస్తం….. చిన్నమ్మా తోకతెగిన ఎలుకలు వీళ్ళు …. వంటి పంక్తులు

    అది ఒక కవిత్వ సంవిధానమే తప్ప అప్రజాస్వామికమని అనుకోలేం.
    బొల్లోజు బాబా
    పి.ఎస్. దాదాపు ఇవే ఆలోచనలతో ఇదివరలో నేచేసిన ఒక కామెంటు ఇక్కడ
    http://dprathap.blogspot.com/2008/10/blog-post.html

  4. Srinivas Nagulapalli

    సౌభ్రాత్రం అంటే సొంత తల్లికి పుట్టకపోయినా అంతే ఆత్మీయతతో ఉండడం. సౌభ్రాత్రాన్ని ఆశించి సాటివారిని భ్రష్టులారా అంటే మరి నేనేమవుతాను? వారితోబాటే కాబట్టి నేను సైతం భ్రష్టున్ని కాదా? సమభావాన్ని కాంక్షిస్తూ ఎదుటివారిని పతితులారా అని అంటే మరి నేనో? సమభావం కదా నాకుంది కాబట్టి నేనూ పతితుడనైపోనూ? “పతితులారా భ్రష్టులారా” అంటే నేను కాదు, అది నేను కానివారు మాత్రమే అనుకున్నప్పుడే అనగలిగే మాట, చేసే సంబోధన. ఇట్లాంటి సౌభ్రాత్రం సమభావం ఉంటే ఇంకేం సౌహార్దం మిగిలింది ఏపాటి శాంతి పెరిగింది?

    అందుకే ‘పతితులారా! భ్రష్టులారా! మా ఇంటికి భోజనానికి రండి, లేదా మా పార్టీకి వోటెయ్యండి” అని మనం వాడం ఏ సందర్భంలోనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా. వాటిలో ధ్వనించేది నింద మాత్రమే, సొంతానికి వాడినా ఆత్మనిందే. పరస్పర భిన్నమైన ఇటువంటి ప్రయోగాలతో ఓదార్చడం, ఓదార్చడానికి ప్రయత్నించడం చదివితే నవ్వురాక ఇంకేం వస్తుంది. నవ్వుకోక చేసేదేముంది.
    ===========
    విధేయుడు
    _శ్రీనివాస్

    1. Jampala Chowdary

      @శ్రీనివాస్ నాగులపల్లి:

      ఇప్పుడు నేనూ నవ్వుతున్నాను.

  5. Srinivas Nagulapalli

    మరొక్క మాట.
    ఈ రోజు ఏ విద్యార్థైనా, ఏ టీచరైనా, ఏ రచయితైనా, ఏ నాయకుడైనా, చివరకు ఏ ఆత్మీయులైనా సరే, ఏ అంశం గురించైనా రాస్తూ
    “పతితులారా
    బ్రష్టులారా” అన్న పదప్రయోగాలతో చెప్తే హర్షిస్తామా? అట్లే, శ్రీశ్రీ కవితలను పదాలను ఎంతగా అభిమానించినప్పటికీ ఆ పదాలను ఎవరైనా వారైనా, ఎప్పుడైనా ఎక్కడైనా, అంటే ఆక్షేపణీయమే. వారిని సాదరంగా గుర్తించడానికి గౌరవించడానికి అవి అడ్డు కూడా కాదు అనిపిస్తుంది.
    ==========
    విధేయుడు
    _శ్రీనివాస్

  6. Srinivas Nagulapalli

    నిజమే, వేరే గేయాలు పదాలు గురించి కాదు నా మాట. ఆక్షేపించినవి ఉదహరించిన పంక్తులన్నింటినీ కూడా కాదు కదా. కొన్ని specific గా స్పష్టంగా ఉటంకించినవి మాత్రమే.

    “పతితులార, బ్రష్టులారా” అని తిట్టి మరీ, “ఏడవకండేడవకండి” అని అంటే ఎవరు నవ్వుకోరు? ఎందుకు నవ్వుకోరు? అట్లా కాదు, పతితులారా బ్రష్టులార అని శ్రీశ్రీ ఎవ్వరినీ తిట్టడంలేదు అని అనిపిస్తే ఏ మాత్రమూ అర్థం కాలేదన్న మాటే.
    =========
    విధేయుడు
    _శ్రీనివాస్

    1. Jampala Chowdary

      @శ్రీనివాస్ నాగులపల్లి:

      పతితులు అంటే పడిపోయినవారు; భ్రష్టులు అంటే వెలివేయబడ్డవారు. బాధాసర్పదష్టులు అంటే బాధ అనే పాము చేత కాటు వేయబడ్డవారు. ఈ మాటలేవీ – వాటంతటవే – తిట్టుమాటలు కావు. కాకువునీ, సందర్భాన్నీ చూసుకోవాలి.

      బ్రదుకు కాలి, పనికి మాలి, శనిదేవత రథచక్రపుటిరుసులలో నలిగిన దీనులు, హీనులు, సఖులవలన పరిచ్యుతులు, జనులవలను తిరస్కృతులు, సంఘానికి బహిష్కృతులు, జితాశువులు, చ్యుతాశయులు, హృతాశ్రయులను హతాశులై ఏడవకండని చెపుతూ, వారి బాధలు గాథలు తన కవగతమౌతాయని, మొయిల్దారిన బయల్దేరిన జగన్నాథుని రథచక్రాలని వారికోసం భూమార్గం పట్టించి, సవనం, సమరం చేసి, స్వాతంత్ర్యం, సమభావం, సౌభాత్రం, సౌహార్దం పునాదులై ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి శాంతి జగమంతా జయించేలా చేస్తానని ఓదారుస్తున్న కవి వారిని తిడుతున్నాడని మీ కనిపించి, ఆ మాటలకు నవ్వొస్తే, సరే!

  7. Srinivas Nagulapalli

    మంచి పుస్తక సమీక్షకు జంపాలగారికి కృతజ్ఞతలు.

    ప్రతిభావంతులైన కవుల కవితా సంకలనంలో శ్రీశ్రీ వంతుగా చేర్చిన పదాల గురించి ఒక్క మాట.

    > “ద్రోహాలను తూలగొట్టి
    > దోషాలను తుడిచిపెట్టి

    > పతితులారా!
    > బ్రష్టులార!
    > ఏడవకండేడవకండి!”

    Rhyming శబ్దప్రవాహమున్నా, తిట్టు ఎప్పుడూ కవిత కన్నా పైత్యమే. కాదు, తుడిచిపెట్టని దోషమే. అప్పటి వారు ఏడ్చారో లేదో కాని, ముందు తరాలవారు నవ్వుకునేలా రాసిన పదాలను ఏరుకొని “వైతాళికులు” అన్న పుస్తకంలో వేసుకోవడం అభిరుచి కన్నా అభిమానాన్నే తెలుపుతుంది. జలపాతంలాగా పదాలగారడితో శబ్దవిన్యాసంతో పంక్తులను పరవళ్ళు తొక్కించడం ఈ శతాబ్దపు కవులలో శ్రీశ్రీ గారిని మించి మరెవ్వరూ చేయలేదేమో అనిపిస్తుంది. జలపాతంలో “కొట్టి”నట్టు వినిపించే కనిపించే దూకుడుతనం, కవితలో జీవితంలో సైతం ఉండడం ఆశ్చర్యం కాదు. ఎన్నో శ్రీశ్రీ గారి రసవంతమైన పదాలున్నా వీటినే సంకలనంలో చేర్చడం ఆశ్చర్యం.
    ===========
    విధేయుడు
    _శ్రీనివాస్

    1. Jampala Chowdary

      @ శ్రీనివాస్ నాగులపల్లి:

      శ్రీశ్రీ జగన్నాథ రథచక్రాలు గేయం నుంచి ఈ పదాలు (పాదాలు?) మాత్రమే వైతాళికులు సంకలనంలో ఉన్నాయని మీరు భావిస్తున్నట్లున్నారు. ఆ గేయం మొత్తం ఈ సంకలనంలో ఉంది. నేను ఒక్క ఆఖరుభాగాన్ని మాత్రమే ఉదహరించాను (ఈ వ్యాసంలో కొన్ని గేయాలు పూర్తిగా ఇచ్చినా చాలావరకూ కొంత కొంతగా మాత్రమే ఇచ్చాను). ఈ గేయమే కాక శ్రీశ్రీ “వంతు”గా ఈ సంకలనంలో ఇంకా చాలా పదాలు, గేయాలు ఉన్నాయి. ఈ వ్యాసంలోనే పైన ఒక్కరాత్రి నుంచి కూడా కొన్ని పంక్తులు ఉదహరించాను కదా?

      జగన్నాథ రథచక్రాలు గేయం చదివి కాని ఈభాగం చదివి కాని ఎవరు నవ్వుకుంటున్నారు?
      పతితులార, భ్రష్టులార అని శ్రీశ్రీ ఎవరినో తిడుతున్నారని అనిపిస్తే ఈ గేయం ఏ మాత్రమూ అర్థం కాలేదన్నమాటే.

  8. M.V.Ramanarao

    second edition may never come. But another book containing the works of
    later poets(upto 1970)and edited by Nanduri Rammohanarao,named as “Mahasankalpam ‘ was published.It may be available in ViSalandhra book shops. -ramanarao

  9. Akkiraju Bhattiprolu

    Now I understand why I never managed to win any prizes. I got my hands onto this book (new edition) only last year. But I have read and heard quite a bit about this book by then. There are also people who questioned this collection if I am not wrong. Hope the second or the next part will cover all that and put them in context for us. Can’t wait..

  10. M.V.Ramanarao

    నా దగ్గర కూడా 1994ప్రతి విశాలాంధ్ర వారిది ఉన్నది.పూర్వపు రోజుల్లో వైతాళికులు ‘ ని ఆధునిక కవిత్వానికి బైబిల్ లాగ చూసేవారు.సహజంగానే తరవాతి తరం కవులు సినారె,దాశరథి ,ఆరుద్ర,తిలక్ వంటి వారి కవితలు ఇందులో లేవు.కాని,అప్పటికే పేరుపడిన జాషువాగారి కవితలని ఇందులో చేర్చలేదని దళిత కవులు విమర్శిస్తూ ఉంటారు.ఇంతకాలంతర్వాత,అది బుద్ధిపూర్వకమా లేక పొరపాటా అనేది చెప్పడం కష్టం.ఏ సంకలనమైనా సంపూర్ణం కాదు కదా.నేను కూడా అప్పుడప్పుడు చదివి స్ఫూర్తిని పొందుతూ ఉంటాను.

  11. చంద్రహాస్

    చౌదరిగారూ,
    మీ వ్యాసం బాగుంది. అయ్యో మీ కాపీ “వైతాళికులు” శిథిలావస్థలో వుందే అని బాధగా వుంది. 1935 మొదటి ఎడిషన్ hard bound. చాలా అందంగా ముద్రించారు. సంకలనంలో కవితలన్నీ రసగుళికలే. మీ ఖజానాలో ముద్దుకృష్ణ సంకలనం “నవీన కావ్యమంజరి” (1959 ప్రచురణ) కూడా చేర్చి నలుగురికీ చెప్పండి.

    1. Jampala Chowdary

      దాదాపు నలభై ఏళ్ళుగా నలుగుతున్న పుస్తకం ఎలా ఉంటుంది చెప్పండి. 1994 ముద్రణ ప్రతులు రెండు ఉన్నాయి కాని, వాటికన్నా ఈ ముద్రణే ఇష్టం. కారణాలు వ్యాసం తరువాయి భాగంలో.

      మొదటి ముద్రణ ప్రతి చూడలేదు కానీ, దాని గురించిన ప్రశంసలు చాలా విన్నాను. వివరాలు తెలిపినందుకు కృతఙతలు.

Leave a Reply