మహానటి సావిత్రి : వెండితెర సామ్రాజ్ఞి-2 (సమాప్తం)

(ఈ వ్యాసం యొక్క తొలిభాగాన్ని కూడా చూడండి)  

మొదటిసారి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నం చేసిన సందర్భంగానే, అంటే 13 ఏళ్ళ వయసులోనే సావిత్రి తన భావిభర్త అయిన జెమినీ గణేశన్ (GG) ని మొదటిసారి చూడడం తటస్థించింది. ఆయన యువకుడు, అందగాడు. అప్పటికింకా తమిళ హీరో కాలేదు. జెమినీ స్టూడియోలో స్టిల్ ఫోటోగ్రాఫర్ గా ఒక చిఱుద్యోగం చేస్తూండేవాడు, ఆయనకి అలమేలు, పుష్పవల్లి అని ఇద్దఱు భార్యలూ, పిల్లలు కూడా ! సావిత్రికి స్టిల్ ఫోటోలు తీసింది ఆయనే. ఆయన ఆమెకి తీసిన ఫోటోల సంగతెలా ఉన్నా ఆయన రూపం సావిత్రి మనస్సనే ఫిలిమ్ మీద శాశ్వతంగా ముద్రించుకుపోయింది. ఎన్ని సంవత్సరాలు పోయినా, ఎక్కడున్నా GG ని జ్ఞాపకం చేసుకునేది. అందుకే 1953 లో కేవలం 18 వ ఏటనే ఎవఱికీ చెప్పకుండా ఆయన్ని రహస్యంగా పెళ్ళిచేసుకుంది. అయితే ఈ విషయాన్ని వారు మూడేళ్ళ తరువాత ప్రపంచానికి వెల్లడించారు. నిజానికి 1953 నాటికే ఆమె దక్షిణాపథాన ఒక స్టార్ గా వెలుగొందుతోంది. కనుక ఈ వార్త సహజంగానే దేశంలో గగ్గోలు పుట్టించింది.”GG కి మూడో భార్యగా సావిత్రి” అని శీర్షికలు పెట్టాయి పత్రికలు. అయితే అప్పట్లో ఏకపత్నీత్వం గట్రా చట్టాలేవీ లేవు కనుక సమస్యేం తలెత్తలేదు. ఒకవేళ తలెత్తినా సావిత్రి తాను నమ్మినదానికి నిలబడే మనిషే తప్పలోకాన్ని లెక్కచేసే తత్త్వం కాదు. కానీ చిత్రమేంటంటే పెళ్ళయ్యాక సావిత్రికి జనంలో క్రేజ్ ఇంకా పెఱిగిపోయి తారస్థాయికి చేఱుకుంది.

సావిత్రి చాలా తెలివిగల మహిళ. ఎక్కువ చదువుకోనప్పటికీ జీవితమే ఆమెకి ఎంతో నేర్పింది. మాతృభాష అయిన తెలుగు మీద గట్టి పట్టుండడమే కాక, తమిళ, హిందీభాషల్ని సైతం మాతృభాషంత ధారాళంగా మాట్లాడేది. ఇంగ్లీషు కూడా స్వయంకృషితో అభ్యసించింది. ఇంగ్లీషు పత్రికలవారికి ఇంగ్లీషులోనే ఇంటర్వ్యూలిచ్చేది. సావిత్రి తెలుగుమహిళ అని ఇప్పటికీ చాలామంది తమిళులకి తెలీదు. తెలిసిన తమిళులు బాధపడతారు. మద్రాసొచ్చిన మూడేళ్లల్లోనే ఆ భాషని లిపితో సహా ఆమె  ఆపోఽశన పట్టేసింది. అక్కడ తాను పాల్గొన్న అన్ని సభల్లోనూ తెలుగుతో పాటు తమిళంలో కూడా మాట్లాడేది. హిందీలో కూడా సితారోం సే ఆగే (ధర్మేంద్రతో). బలరామ్-శ్రీకృష్ణ (పృథ్వీరాజ్ కపూర్‌తో) ఇత్యాదిగా 5 సినిమాలు చేసింది.

దేశంలో ఏ నటీ అనుభవించనంత గొప్ప సామాజిక గౌరవాన్ని పొందింది సావిత్రి. ఆమె ఆ రోజుల్లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ మెంబరుగా ఉండేది. ప్రత్యేకంగా ధ్వనించే ఆమె కారు హారన్ విని మద్రాస్ రోడ్లమీద జనం “సావిత్రి, సావిత్రి” అంటూ వాళ్ళంతట వాళ్ళు పక్కకి తొలగి దారిచ్చేవారు. కాసు బ్రహ్మానందరెడ్డిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో సావిత్రికి గజారోహణ సమ్మానం జఱిగింది. ఆమెతో పాటు ఆమె భర్త GG ని కూడా కూర్చోబెట్టి ఊరేగించారు. ఆ ఊరేగింపులో సావిత్రి అధిరోహించిన ఏనుగు వెంట రోడ్లమీద  రాష్ట్ర ముఖ్యమంత్రీ, కేబినెట్ సభ్యులూ నడిచారు.

సాంప్రదాయిక పాత్రలు చేస్తూ, నిజజీవితంలో కూడా సాంప్రదాయికంగానే ఉన్న సావిత్రి సాధించిన ఆర్థిక విజయాలు సైతం తక్కువవి కావు. ఆ రోజుల్లో హీరోల తరువాత అంతటి పారితోషికం తీసుకున్న ఏకైకనటి ఆమె. కొన్ని సినిమాలకైతే హీరోతో సమానంగా తీసుకునేది. బ్యాంక్ మేనేజర్ల నెలజీతం రు.200 మాత్రమే ఉన్న రోజుల్లో సావిత్రి రోజువారీ సంపాదన రు.5000. ఆమెకి మద్రాసులో కోట్లాది విలువ చేసే నాలుగు బంగళాలు, కొడైకెనాల్ లో ఒక గెస్ట్ హౌస్, విజయవాడలో రెండు బంగళాలు, హైదరాబాదులో ఒక బంగళా, కృష్ణాజిల్లాలో విజయ్ స్పిన్నింగ్ మిల్స్ పేరుతో ఒక పరిశ్రమ, ఒక వ్యావసాయిక ఎస్టేటు, మద్రాసులో సావిత్రీ ప్రొడక్షన్స్ అనే సినిమా కంపెనీ ఉండేవి. ఇంట్లో ఎప్పుడూ 6 కార్లుండేవి. ఇవన్నీ ఆమె కష్టార్జితమే. భర్త కూడా సినీనటుడే అయినా ఆయన్నుంచి వచ్చినదేమీ లేదు.  ఏడాదికి రు.8 లక్షల ఆదాయప్పన్ను కట్టాల్సి వచ్చేది. ఆమె నిర్మించిన కొన్ని సినిమాల మీద వచ్చిన భారీనష్టం కారణంగా ఒకసారి ఆదాయప్పన్ను చెల్లించలేకపోతే ఆ శాఖ అధికారులు ఆమె దగ్గర్నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ ఆ రోజుల్లోనే రు.30 లక్షలంటేనే మనకి అర్థం కావాలి. అప్పట్లో ఎంత పెద్ద స్టార్లని పెట్టి తీసినా సినిమా నిర్మాణ ఖర్చు రు.4 లక్షలకి మించేది కాదు.

సరే ! అదంతా ఒక మహద్దశాకాలం.

ఆ దశ గడిచిపోయాక 1972-73 తరువాతినుంచి సావిత్రి అనుభవించిన మానసిక క్రుంగుబాటు (depression) ఆర్థికబాధలూ, ఒంటరితనం, అనారోగ్యం, వీటి మూలాన కలిగిన అప్రతిష్ఠ, వీటన్నింటి పర్యవసానంగా ఆమె అటూ ఇటూ కాని వయసులో అన్నీ పోగొట్టుకుని 1981 లో  45 వ ఏటనే కన్నుమూయడం – ఇవన్నీ ఇంకో పార్శ్వం. ఆమెలాంటి మహోన్నత వ్యక్తిత్వానికి రాకూడని అవస్థ. కానీ వచ్చింది. ఒకప్పుడు సావిత్రి అంతటి మనిషి లేదని ఆకాశానికెత్తిన పత్రికలు ఆమె మరణవార్తని మొదటిపుటల్లోనే ప్రచురించినప్పటికీ అందుకోసం అవి కేటాయించిన స్థలం చాలా చిన్నది. అంతటి మహామనిషికి తగిన గౌరవం కాదు. ఒక ప్రత్యేక అనుబంధం ప్రచురించాల్సిన మనిషి. కానీ అలా ఎవఱూ చేయలేదు.  “క్రుంగుబాటు తట్టుకోలేక తాగినంతమాత్రాన ఇహ అన్ని అవలక్షణాల్నీ ఒక మంచిమనిషికి అంటగట్టేయడమేనా ? దీని క్కారణం ఏంటి ?” అని అభిమానుల మనసు బాధగా మూలుగుతుంది. చేతికి ఎముక లేని లక్షలాది రూపాయల దానాలూ, ఆమె తీసిన సినిమాల మీద వచ్చిన భయంకరమైన నష్టాలు, ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడానికి ఇంట్లో ఎవఱూ (ముఖ్యంగా భర్త) లేకపోవడం, అది ఆసరాగా చేసుకొని ఆమె ఇంటిని సన్నిహితులూ, ఉద్యోగులూ దోచేసిన వైనం, భర్తతో గొడవల వల్ల మానసికంగా క్రుంగిపోవడం, తత్ఫలితంగా అతివేలమైన మద్యపాన వ్యసనానికి లోను కావడం, అంతకుముందే చుట్టుముట్టిన మధుమేహం, రక్తపోటు బాధలు. ఏతావతా ఆమె 1977 లో ఒక అద్దె ఇంటికి మారాల్సి వచ్చింది. బస్సెక్కి షూటింగులకి వెళ్ళేది.

నేనీ పుస్తకం ఒకసారి చదివాను. మళ్లీ చదివాను. మళ్ళీ మళ్లీ చదివాను. బాధతో ఇహ మూసేశాను. ఎవఱో శపించినట్లు, మంత్రం వేసినట్లు ఒకే జీవితంలో రెండుజన్మల్లా తయారైన సావిత్రి పరిస్థితిని తల్చుకుంటే మనసు వికలమైపోతుంది. ఏదేమైనా ఇది కడకంటా చదివించే గ్రంథం. ఇందులో చాలా ఆసక్తికరమైన, ఎక్కడా దొఱకని ఛాయాచిత్రాలున్నాయి. రచయిత్రి తన కృషిలో పొందిన సాఫల్యం నూటికి నూఱుపాళ్ళు. ఇంత మంచి ప్రణాళికతో పకడ్బందీగా వ్రాయబడ్డ ఈ పుస్తకం ఆమె తొలిరచన అంటే ఆశ్చర్యం వేస్తుంది. (సమాప్తం)

(మహానటి సావిత్రి : వెండితెర సామ్రాజ్ఞి ; రచన – పల్లవి ; పేపర్ బ్యాక్ క్రౌన్ సైజు పుటలు – 358 ; ప్రచురణ – ఆగస్టు 2008 ; ప్రతులకు – అన్ని ప్రముఖ పుస్తకవిక్రయ కేంద్రాలలో ; వెల – రు. 200 ; రచయిత్రిని సంప్రదించగోరేవారు – ఫోన్ – (040) 23711421 : వేగు చిరునామా – pallavirg@rediffmail.com )  

గమనిక : పై స్టాంపు సమాచారం Stamps of Andhra  బ్లాగునుంచి తీసుకోబడింది.     

You Might Also Like

11 Comments

  1. mahanati savitri venkatesh

    Elanti oka goppa mahanati prapanchamlo undadhu. Alanti goppa manasunna mahanati mana madya lenandhuna badhaga undhi.
    Marala aavide mahantiga puttalani devunni
    Pradhistunnanu

  2. జంపాల చౌదరి

    @హరికృష్ణ:

    >>గానకోకిల సుశీల గారి జీవిత చరిత్ర కూడా ఇలాగే ఏకఖండంగా కాకుండా, అనేక భాగాలుగా అక్కడా అక్కడా చదువుకోవచ్చును.

    సుశీలగారు ప్రస్తుతం సాక్షి వారపత్రికలో తమ జీవితచరిత్రను రాస్తున్నారు.

    >> ఇదే స్థాయిలో ఆధునిక తెలుగు సంస్కృతిని సంపన్నం చేసిన తదితరులు – అంటే నాగయ్య, కన్నాంబ, యస్.వరలక్ష్మి, భానుమతి, బి-ఎన్-రెడ్డి ప్రభృతులకి ఇదే గౌరవం ఎప్పుడు సిద్ధిస్తుందో కదా?

    నాగయ్యగారు (స్వీయ చరిత్ర, 2004 ఆర్కే బుక్స్), భానుమతి గారు (నాలో నేను, 1993, సినిమా గ్రూప్) తమ జీవిత చరిత్రలను తామే రాసుకున్నారు.
    భానుమతి గారి గురించి భరాగో సంపాదకత్వంలో ఒక పుస్తకం (మహా మహిళ) వచ్చింది (సుశీల గారి గురించి కూడా?).
    Randor Guy ఆంగ్లంలో బి.ఎన్.రెడ్డిగారిపై ఒక మోనోగ్రాఫ్ ప్రచురించారు (B.N. Reddi: A Monograph; 1985, National Film Archives, Pune).
    బి.ఎన్.రెడ్డి గారి గురించి, చక్రపాణి గురించి తెనాలి నుంచి డాక్టరు దక్షిణామూర్తి గారు రెండు పుస్తకాలు వెలువరించినట్లు జ్ఙాపకం.
    కన్నాంబగారి గురించి కూడా ఒక పుస్తకం (ధృవతార కన్నాంబ; సంకలనం: హెచ్.రమేష్ బాబు) వచ్చింది.

  3. తాడేపల్లి హరికృష్ణ

    వ్యాపారమే ఆయువుగాను, దేహంగానూ, అభివ్యక్తిగానూ మసలే ప్రస్తుత సినిమా ప్రపంచానికి కళ అనేది ఒక ఆహార్యం మాత్రమేను. అన్ని కాలాలూ ఇలానే లేవని పాత సినిమాలతో పరిచయమూ, ఆసక్తీ వున్నావారందరకీ కాస్తో కూస్తో అనుభవవేద్యమేను. కనక తెలుగు సినీ పరిశ్రమంతా హైదరాబాదుకి తరలి వచ్చి మనదరికీ ఏదో మహోపకారం జరిగిపోయిందని ఎంత టముకువేసినా, సినమాల్లో అంతో ఇంతో ప్రతిభా, కళావిలువలూ, ప్రజాసంస్కౄతినీ వెతుక్కునేవాళ్ళందరికీ ఇంకా మద్రాసు కేంద్రంగా వున్న్న ఒకప్పటి సినిమా యుగమే మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో హైదరబాదులో అప్పుడప్పుడూ భారీ ఖర్చుతో సినిమాచరిత్రపరంగానూ వజ్రోత్సవాలూ, సన్మాన సభలూ, ప్రశంసా పత్రాలూ, కరతాళార్భాటలూ మిన్నంటుతూ జరుగుతూ వుంటాయి. అవి TV చానెళ్ళలో పున:పున: మన కళ్ళూ చెవులూ మెదళ్ళూ మొద్దుబారే వరకూ ప్రసారిస్తూ వుంటాయి. కానీ వీటిల్లో ఎక్కడా కూడా సినిమాకళకి అధారభూతులై, కళాస్రష్టలై, తెలుగు వారందరి ఉమ్మడాస్తిగా వాళ్ళ హృదయాల్లో శాశ్వతంగా తిష్ఠించిన మాహా పురుషులూ, స్త్రీల గురించి ప్రస్తావన చాలా విరళంగానూ, ఇంకా లుప్తంగానూ వుంటుంది. నాగయ్య, బి-ఎన్-రెడ్డి, గూడవల్లి, కన్నాంబా, సావిత్రీ, భానుమతీ, వేదాంతం – వీళ్ళందరూ కనీసం మచ్చుకి కూడా ప్రస్తావింపబడరు. సంగీతకారులూ, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణుల సంగతి ఐతే ఇంక చెప్పక్కర లేదు. ఎవరైతే సినిమా అధారంగా వ్యాపార సామ్రాజ్యాలు హైదరాబాదు కేంద్రంగా ఏలుతున్నారో వారి చరిత్రే సినిమా చరిత్ర. వాళ్ళూ వాళ్ళ కొడుకులూ వాళ్ళ మనవలూ వాళ్ల కంపెనీలు చేస్తున్నవే సినిమా ఘనకార్యాలు. వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకునే నిత్యకితాబులూ.

    ఓ రకంగా చెప్పలంటే ఇందులో వచ్చిన నష్టమేమీ లేదనుకుంటాను. హైదరాబాదు నవతరం సినిమాకారులు సృష్టిస్తున్న సినిమా బ్రాండు వేరు. సినిమా ఆదిమ దశాబ్దాల్లో వున్న సినిమా ఉత్పాదక సూత్రాలు వేరు. ఇప్పటి ప్రచార సాధనాల్లో అప్పటి మహామహులని విస్మరించినా, ప్రజలు మాత్రం వాళ్ళని మరవలేక పోతున్నారు. రోజూ ఇరవై చానెళ్ళలో అవే చెత్త ప్రకటనలిస్తూ మనకెంత హోరెత్తించినా, అదేం పాపమో మెజారిటీ తెలుగు వాళ్ళందరూ అదే మయాబజారునీ, అదే మిస్సమ్మనీ, అదే మల్లీశ్వరినీ, అదే దేవదాసునీ, అదే జయభేరిని, అదే విప్రనారాయణనీ, అదే మాంగల్యబలాన్నీ, ఇత్యాదులని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. వాటి కళాకారుల ప్రతిభని, వాటికున్న సాంఘిక నేపధ్యాన్ని తలుచుకు తలుచుకు అనుభవిస్తున్నారు.

    వాడ్రేవు సోదరులు సావిత్రి గారి జీవిత కధని సాధికారికంగా శోధించి ఇంగ్లీషులో రాశారు. దీనికి తెలుగు పాఠాంతరం లేక పోవడం శొచనీయం. సావిత్రి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిజెయ్యాలని వారికున్న ఆశ ఇందుకు ప్రోద్బలమై ఉండవచ్చును. పల్లవి గారి పుస్తకం నాకు లభ్యమైనప్పుడు తప్పక చదువుతాను. మహానటుడు NTR గురించి సాధికారమైన జీవిత చరిత్రలు కనీసం రెండు మూడన్నా వచ్చాయి. ఇక అక్కినేని గారు ఇటీవలికాలంలో తమ జీవితానుభవాలని అనేకమైనన్ని TV ఇంటర్వ్యూల్లో తమ ముఖత: తామే తెలియజేశారు. గంధర్వుడు ఘంటసాల గారి గురించి ఎన్నో జీవిత సంకలనాలు వచ్చాయి – ఇవన్నీ సంక్షేపంగా వున్నా, వీటన్నిటినీ కలిపి చదివితే మనకి సంపూర్ణమైన జీవిత చరిత్ర లభ్యమౌతుంది. గానకోకిల సుశీల గారి జీవిత చరిత్ర కూడా ఇలాగే ఏకఖండంగా కాకుండా, అనేక భాగాలుగా అక్కడా అక్కడా చదువుకోవచ్చును.

    వాడ్రేవు వారి పుస్తకమూ, పల్లవి గారి పుస్తకమూ సావిత్రి గారి జీవిత్రకి అదే ప్రాచుర్యాన్ని, ఆధికారికతనీ తేవచ్చునని ఆశిద్దాము. ఇదే స్థాయిలో ఆధునిక తెలుగు సంస్కృతిని సంపన్నం చేసిన తదితరులు – అంటే నాగయ్య, కన్నాంబ, యస్.వరలక్ష్మి, భానుమతి, బి-ఎన్-రెడ్డి ప్రభృతులకి ఇదే గౌరవం ఎప్పుడు సిద్ధిస్తుందో కదా?

    1. Silpa

      హరికృష్ణ గారు!

      మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం.. మన ప్రస్తుత తెలుగు చలన చిత్ర పరిశ్రమ పునాది రాళ్ళను గుర్తుంచుకుంటుందని ఆశిద్దాం..

      మీరు పల్లవి గారు రాసిన మహానటి సావిత్రి – వెండితెర సామ్రాజ్ఞి పుస్తకం చదవ గలిగారా?
      ప్రస్తుతం ఈ పుస్తకం మార్కెట్ లో లేదు … 5 వ ఎడిషన్ మరి కొద్ది రోజుల్లో విడుదల కానుంది …చదివి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి ..

  4. Srinivas Nagulapalli

    ఉత్త ఊహాజనితంగా వ్రాసే నవల కాదు, ఉన్న వాస్తవాలే చెప్పే జీవిత చరిత్ర కాదు. కొత్తగా సాగిన ప్రక్రియను పుస్తకాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. చదివినంతవరకు బాగున్నా, ఎందుకో పూర్తిగా చదవలేక పోయాను, కోరిక పోయింది. ఒక్క మాట పంచుకోవాలనిపించింది. నాది కాదు ఆ మాట!

    ప్రఖ్యాత నాటక, సినిమా రచయిత గౌరవనీయులు శ్రీ డి.వి.నరసరాజు గారు “తెర వెనుక కథలు” పుస్తకంలో సావిత్రి గురించి అన్న వాక్యం.
    ——————————————–
    “ఉత్తమ నటిగా ఎంతో పేరుతెచ్చుకుని దర్శకురాలిగానూ నిర్మాతగాను మారి దురదృష్టవశాత్తు అన్ని విధాలా దెబ్బతిన్న అభాగ్యురాలు శ్రీమతి సావిత్రి!”
    ——————————————–
    అంత సంగ్రహంగా, సారవంతంగా ఎంతమంది చెప్తారు! ఆ పుస్తకంలో సావిత్రి గురించి చెప్పిన, జరిగిన తెర వెనుక కథ కూడా బాగుంది. కొన్ని పంక్తులు మచ్చుకి
    —————————————–
    ….. సినిమా ప్రొడక్షన్‌లో మరో ఇబ్బంది ఉంది.
    ఒకసారి దిగిన తరువాత వెనక్కి రావడం అంత తేలిక గాదు!
    అహం అడ్డు పడుతుంది.
    అలాగే సావిత్రి తరువాత సొంతంగా సినిమా తీసింది.
    “మూగ మనసులు” తమిళంలోనూ “వియత్నాం వీడు” అనే తమిళ చిత్రం తెలుగులోనూ తీసింది.
    అలా ఒకదాని తరువాత ఒకటి తీసిన సినిమాలు దెబ్బతినడం, వాటికి తోడు ఇంట్లో గొడవలు అన్నీ కలిసి ఆరోగ్యం దెబ్బ తినడం!
    ఆస్తులు అమ్మి అప్పులు తీర్చడం!
    ఒకసారి చక్రపాణి గారి దగ్గరకు వచ్చి తన కష్టాల్న్నీ చెప్పుకును కళ్ళనీళ్ళు పెట్టుకుంది!
    చివరికి వుండడానికి కూడా యిల్లు లేక అద్దె యింట్లో వుండి అవసాని దశలో నెలల తరబడి అపస్మారక స్థితిలో ‘కోమా’లో పడి అతి దయనీయ పరిస్థితుల్లో అంతిమ శ్వాస విడిచింది.
    అంత గొప్ప ఆర్టిస్టుకి రావలసిన ‘అంతం’ కాదది!
    ఇప్పటికి ఆమెతో బాగా పరిచయం వున్న మా తరం వాళ్ళందరూ ఆమె విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడూ ‘అయ్యో! పాపం’ అంటారు!
    —————————————–
    వట్టి సినిమాలకే కాదు, నేటీ మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు, పెద్ద పెద్ద సంస్థ అధినేతలకు, సత్యం చేప్పాలంటే ఎందరికో, కొద్దో గొప్పో, వర్తించే జీవిత సత్యం.

    ఎవరో కావ్యకంఠ గణపతి మునికి భారత దేశంలో సినిమా అనేది వచ్చింది అని చెప్పితే “చిత్రం, చిత్రం” అన్నారట. “చిత్రసీమ” పదం “సినిమా” పదం కన్నా ఎంతో సార్థకం. తెర మీదే కాదు, చాలా సార్లు తెర వెనుక సైతం కథలే మెరుగైన కామెడీలు, ట్రాజెడీలు, ఊహించని మలుపులు మెరుపుల నాటకాలు ఎన్నో చూపించే “చిత్ర”సీమ, వి”చిత్ర”సీమే!
    ========
    విధేయుడు
    శ్రీనివాస్

  5. Ramesh

    నిన్న మాంగల్యబలం సినిమా ఏదో channelలో వేసారు. ముందుగా తెలియదు. Channels flip చేస్తుంటే ఆ సినిమా వచ్చింది. అంతే మంత్రం వేసినట్లు కూర్చుని చూస్తూ వుండిపోయాను. సావిత్రి కోసం. అలాంటి నటి నభూతో నభవిష్యతి. శశిరేఖ (మాయాబజార్), పార్వతి (దేవదాసు), మధురవాణి (కన్యాశుల్కం), రాధ (మూగమనసులు)- ఇలా ఒకటా, రెండా – వందల సినిమాలు తెలుగులో, తమిళంలో, ఇంకో నటి అలా చేయగలదా అనిపించి, మురిపించింది ఆమె. నటనలో అంత ease వున్న మరో నటి ప్రపంచ సినిమాలో వుందా? లేదు. ఎదుటి hero ఇంకో take అని ఎప్పుడూ అడిగేవారు కాదట. భయం. ఆమె ఇంకా విజృంభిస్తుందని. ఆ రోజుల్లో (అంటే పెళ్లినాటి ప్రమాణాలు, మాంగల్యబలం విడుదల time లో)మా అభిప్రాయం ఇది.
    అభినేత్రికి అందమైన
    అంత్యప్రాస మహానటి
    సావిత్రి
    ఇప్పుడు ఆ అభిప్రాయం ద్విగుణీకృతమైంది ఈ కాలపు నటీమణులని చూసి, చూడలేక.
    అంత గొప్పనటి నటనను చూసి గర్విద్దాం. ఆమె ఎప్పుడు పుట్టింది, ఎలా మరణించింది అన్నది ఎవరికి కావాలి? 45 సంవత్సరాలకే మనమధ్యనుండి వెళ్లిపోయిన సావిత్రి చిరంజీవి .

  6. చంద్రహస్

    ఈ పుస్తకాన్ని చదివాను. సావిత్రి మహానటి. ఆమె అభినయం ఇంకొకరికి అసాధ్యం. ఒక నటి ఆమెకంటే తనే గొప్ప అని చెప్పుకుంది. అదొక పెద్ద అతిశయోక్తి అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఊబకాయం సావిత్రిది. కానీ సినిమా చూసేవారెవరూ దాన్ని గమనించలేదు. ఆమె మొహంలో పలికించే భావాలు, మెరుపులు మాత్రమే చూసేవారు. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి,ఆమె లేని పెద్ద banner సినిమా వూహించని పరిస్థితికి ఎదిగిన గొప్ప మనిషి. ఆమె emotional జీవితం ఒడిదుడుకులమయం. నమ్మినవారు మోసం చేసారు.నటనకు timing అంటే పర్యాయపదమైన ఆమె Producer గా timing విషయమై ఖంగు తిన్నారు.ఆమె చివరిరోజులు తలచుకుంటే చాలా బాధ కలుగుతుంది. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అంటారు. అలాగే ఆమె పతనానికి కారణాలు ఎన్నో. మనం గుర్తుంచుకోవలసినది ఆమె నటనని. ఆమె అందుకున్న శిఖరాలను. ఆమె తప్పుల చిట్టా ఏకరువు పెట్టడము ఎందుకండి? పుస్తకం గురించి మరచిపోయి ఏదేదో చెప్పాను ఆమెపై అభిమానంతో. Forgive me. పుస్తకంలో వున్న ఆమె black and white photo లు నా వూహలో పైసా వసూల్. No doubt.

  7. శ్యామలరావు

    ఈ పుస్తకాన్ని నేను కొన్నాళ్ళక్రిందట హైదరాబాదులో కొన్నాను. చదివాను ఆసక్కతిగా. చాముండి కేవలం కల్పితవ్యక్తి అనే అనుమానం అప్పుడే వచ్చింది. పుస్తకం విస్వసనీయత సందేహిచన మాట వాస్తవం. జంపాల చౌదరగారు అనుమానం నివృత్తి చేసారు.

    1. ravi

      శ్యామల రావు గారు జంపాల గారు ఏమని చెప్పారు?

  8. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

    నటులు నిర్మాతలు కాకూడదని రూలు పెట్టలేం కదా ! సావిత్రిలాగే చాలామంది నటులు నిర్మాతలయ్యారు. వాళ్ళ సొంత సినిమాలు కూడా కొన్ని ఫ్లాపయ్యాయి. అలాంటివాటిల్లో ఎన్టీయార్ సొంత సినిమాలు కూడా కొన్నున్నాయి. అయితే వాళ్ళంతా సావిత్రి అంత దీనస్థితిని అనుభవించలేదు. సావిత్రిది చిత్తూరు నాగయ్యగారి కేసులాంటిది. నాగయ్యగారిలాగే సావిత్రి తీసిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి. కానీ నిర్మాతగా ఆమె మాత్రం నష్టపోయింది. లాభాలు ఆవిడదాకా రాలేదు.

    సావిత్రి పడిపోవడానికి అంతకన్నా ముఖ్యమైన కారణాలు రెండు అని నేననుకుంటున్నాను. ఆమెకి ఆర్థిక విషయాల్లో సరైన మార్గదర్శకత్వం లేదు. ఒకవేళ ఉన్నా ఆమె స్వీకరించలేదు. రెండోది – విపరీతమైన, అసాధారణమైన దానగుణం. అడిగినవాళ్ళకి లేదనకుండా, వాళ్ళు అడిగినదానికంటే ఎక్కువగా చేతిలో పెట్టడం. కట్టలుకట్టలు బ్యాంక్‌నోట్స్ తీసి ఇచ్చేదని ప్రత్యక్షసాక్షుల కథనం.

  9. gudakesh

    onething everybody has to keep in mind is economical soundness, whether you are on the top of the society or on the roads. savitri failed miserably because she ventured films which was not her job. all she could was acting.

Leave a Reply