మా మోహనం అన్నయ్య

(నండూరి రామమోహనరావు గారి గురించి ముళ్ళపూడి శ్రీదేవి గారు రాసిన మాటలివి.)
**************************
నండూరి రామమోహనరావు గారి (మా మోహనం అన్నయ్య) విశ్వరూపంలో కవి, రచయిత మాత్రమే కాకుండా ఇంకా చాలా ముఖాలున్నాయి. ఆయన మంచి గాయకుడు కూడా. పిల్లల కోసం ఎన్నో పాటలు రాశాడు. చందమామ పాటలు, హరివిల్లు పాటలు రాసి, వాటికి తనే రాగాలు కట్టి పాడేవాడు.

యవ్వన దశలో కృష్ణశాస్త్రి గారి ప్రభావం, ఉమర్ ఖయాం, రవీంద్రనాథ్ టాగూరు ప్రభావం చాలా ఉండేది. “హృదయ వీణాతంత్రి, నిదురపోయేవేళ/వీణ మొరసినదెవరో, నా వీను విరిసినదెవరో”, “యవ్వనమా-ఓ మన్మథ సుమ మార్గణమా”, “మా భాష గానమ్ము-లేక గంభీర మౌనమ్ము” లాటి భావగీతాలు రాశాడు. “అసవ పాత్రిక తేవే సాకీ” అనీ, ఇంకా మీరాబాయివలె ఆత్మనివేదనతో “తుది వందనమిది స్వామీ-ఇది నా తుది గీతార్చన స్వామీ” అనీ ఎంతో వైరుధ్యమైన ఫాటలు రాశాడు. అన్నయ్య చేసిన రాగాలతోనే ఇప్పటికీ మా ఇంట్లోవాళ్ళంతా ఆ పాటలన్నీ పాడుకుంటు ఉంటారు.

మోహనం అన్నయ్య రాసిన “అందమైన చందమామ-అందరాని చందమామ/అమ్మా, నా చేతిలోని అద్దములో చిక్కినాడె” ఈపాట బాలమురళీకృష్ణగారు వేరే రాగంలో పాడారు. “విభుడేగుదెంచేటి వేళాయెనే సఖి/సజ్జ సవరించేటి సమయమిదేనే సఖి” -ఈపాట బాలసరస్వతి గారి ఆల్బంలో ఉంది. “వెళ్ళిపోయే వెన్నెలయ్యా, మళ్ళి వచ్చేదెన్నడయ్యా” ఇది ఎమ్మెస్ రామారావు గారు పాడారు.
నండూరి సుబ్బారావుగారు (మా బాబాయి) మమ్మల్ని ఆలిండియా రేడియోకి పిల్లల కార్యక్రమానికి తీసుకువెళ్ళినప్పుడు మేము ఈ పాటలే పాడేవాళ్ళం.

మోహనం అన్నయ్య సైగల్, పంకజ్ మల్లిక్ పాటలు ఎంతో బాగా పాడేవాడు. ఆంధ్రపత్రికలో పనిచేసేటప్పుడు అన్నయ్యా వాళ్ళు బాపుగారింట్లో కాపురం ఉండేవాళ్ళు. బాపు గారికి, రమణ గారికి అన్నయ్య పాటలు వినడం చాలా ఇష్టం. హిందీ పాటలే కాకుండా భానుమతి, రాజేశ్వరరావు, బాలసరస్వతి, ఎస్వరలక్ష్మి పాటలు కూడా చాలా బాగా పాడేవాడు. న్యూస్‌పేపర్ చుట్టచుట్టి దాన్ని మైక్ లాగా నోటి దగ్గర పెట్టుకుని అందులో నుంచి పాడేవాడుట. ఉద్యోగ బాధ్యతలు, సంసార బాధ్యతలు వీటిల్తో మోహనం అన్నయ్య పాడడం మానేశాడు కాని తన పాటలు తరువాతి తరం వారికి కూడా అందాలనే ఆశతో తనే పాడి రికార్డు చేశాడు. అదొక్కటే మాకు మిగిలి ఉన్న జ్ఞాపకం.

పిల్లల కోసం పాటలే కాక పుస్తకాలు ఎన్నో రాశాడు. ఆంధ్రపత్రికలో పనిచేసేటప్పుడే మార్క్ట్వైన్ పుస్తకాలు టాంసాయర్, హకిల్బెరీఫిన్, ఇంకా మిత్రలాభం, మిత్రభేదం, ఈసప్ కథలు రాశాడు. ఆ పుస్తకాలన్నీ ఇప్పుడు చదివినా అంత కొత్తగా బావుంటాయి. రమణగారికి మోహనం అన్నయ్య అనువాదం పద్ధతి శైలి చాలా ఇష్టం. రామ్మోహనరావు గారి వచనం కూడా కవిత్వం అంత బాగుంటుంది అనేవారు. ముఖ్యంగా టాంసాయర్లోని “మంచు కురుస్తోంది, చలి కరుస్తోంది” అనే వాక్యాలను తరుచు జ్ఞాపకం చేసుకునేవారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా ముప్ఫైఅయిదు సంవత్సరాలు పనిచేశాడు మోహనం అన్నయ్య. ఆ రోజుల్లోనే నార్ల వెంకటేశ్వరరావు గారి ప్రోత్సాహంతో విశ్వరూపం, నరావతారం, విశ్వదర్శనం పుస్తకాలు రాశాడు.

“అన్నయ్యా, నువ్వు పరమ నాస్తికుడివి కదా, ఇలాగ విశ్వదర్శనం అనీ, భారతీయ చింతన, పాశ్చాత్య చింతన అనీ ఈ తత్వ చింతన ఎలా చేయగలిగావు? అసలు నీ ఆలోచన అటువైపు ఎందుకు మళ్ళింది?” అని అడిగాము మేము ఒక సందర్భంలో. “ఈ తత్వ చింతన అన్నది నాలో ఎప్పుడు మొదలయిందో నాకూ తెలీదు. కానీ, మనసులో ఏదో ఒక జిగ్ఞాస, ఇంకా ఏదో తెలుసుకోవాలన్న తపన చిన్నప్పటి నుంచే ఉంది” అన్నాడు అన్నయ్య.

మోహనం అన్నయ్య చిన్నప్పటినుంచీ నాస్తికుడేమీ కాదు. ఆరోజుల్లోనే ఆ చిన్న వయసులోనే ఏదో ఆలోచనా, మథనం ఉంది మనసులో. ఈ అనంత విశ్వానికి మూల పదార్థం, ఆత్మస్వరూపం ఈ ఆలోచనలన్నీ ఉక్కిరిబిక్కిరి చేసేవి. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ భగవంతుని చేరుకునే మార్గాలు చెప్తున్నాయి. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, ద్వైతం, అద్వైతం అన్నీ భగవంతునితో ఆత్మను అనుసంధానం చేసే ప్రయత్నాలే. అయితే, ఏ ప్రయత్నమూ, ఏ మార్గమూ కూడా పూర్తిగా గమ్యం చేరుకోగలిగేది కాదు. అయినా, ఎవరి మార్గం వారిది, ఎవరి ప్రయత్నం వారిది. “ఈ ప్రయత్నంలో సరైన దారి చూపించగల సద్గురువు కావాలి నాకు. హిమాలయాలలో, అక్కడి ఆశ్రమాలలో యోగులు,సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారని విన్నాను. పెద్దగా ఏమీ ఆలోచించకుండానే ప్రయాణం అయ్యాను – హిమాలయాలకు, శివానంద మహర్షి దగ్గరకు.”

ఇంట్లో ఎవరికీ చెప్పకుండా, డిగ్రీ చదువు మధ్యలోనే వదిలేసి, కాలేజీ ఫీజుకని నాన్న పంపించిన డబ్బు పట్టుకుని రైలెక్కి హిమాలయాలకు వెళ్ళి స్వామి శివానందను కలుసుకున్నాడు. తనకి ఎవరూ లేరు, ఒంటరి వాడినని చెప్పి, ఆయన అనుమతితో అక్కడి ఆశ్రమంలో దాదాపు అయిదారు నెలలు ఉన్నాడు. శివానంద స్వామి ఈ కుర్రవాడి తపన, జిజ్ఞాస అర్థం చేసుకున్నారా? ఏమైనా బోధించారా? మార్గం చూపించారా?

“ఏమో, అంతగా జ్ఞాపకం లేదు. ఇంకా కొన్నాళ్ళపాటు అక్కడే, ఆయన దగ్గరే ఉంటే ఆయన ఏమైనా చెప్పేవారేమో, నా సందేహాలకి సరైన సమాధానం దొరికేదేమో. కానీ, అయిదారు నెలలకే స్వామి నన్ను వెనక్కి పంపించేశారు”. నాన్న ఎవరి ద్వారానో అన్నయ్య గురించి తెలుసుకుని మహర్షికి ఉత్తరం రాశారు. ఆయన అన్నయ్యని మందలించారు. “ఇక్కడే ఉండిపోదగిన వయసు కాదు నీది. తర్వాత మళ్ళీ వద్దువు గాని” అని నచ్చజెప్పి పంపించేశారు అన్నయ్యని. అన్నయ్య ఇంటికి తిరిగివచ్చి, మళ్ళీ కాలేజీలో చేరి చదువు పూర్తి చేసుకుని, ఆంధ్రపత్రిక ఉద్యోగం సంపాదించుకుని మద్రాసు చేరాడు. మరి అన్నయ్య నాస్తికుడెప్పుడైనాడు? తన సందేహాలు తీరేవి కావని తెలిసి మనసు, మార్గం మళ్ళించుకున్నాడా?

మోహనం అన్నయ్యకి గాంధీ గారంటే విపరీతమైన భక్తి,గౌరవం. 1948 జనవరి 30వ తేదీన గాంధీ గారిని గాడ్సే కాల్చి చంపాడన్న వార్త రేడియోలో విన్నాడు. షాక్ అయ్యాడు. అన్నయ్యేమిటి, దేశమంతా గగ్గోలు పెట్టి ఏడ్చింది. “ఆ రోజున అనిపించింది. ఇంత గొప్ప గాంధీ గారు ఇలా దుర్మరణం పాలయ్యారే, దేవుడేం చేస్తున్నాడు – చూస్తూ ఊరుకున్నాడెందుకు? దేవుడనేవాడు లేడు. అంతా భ్రమ, మాయ, మోసం. అసలు దేవుడే లేడు అని ఆ తరువాత మళ్ళీ దేవుడి గురించి ఆలోచించలేదు.” అయితే; అంత నాస్తికుడైన వాడు మళ్ళీ ద్వైతం, అద్వైతం, ఆత్మ, పరమాత్మ అంటూ వెనక్కి వెళ్ళాడేం?

వెనక్కు వెళ్ళలేదు. ముందుకే సాగాడు. ఏ విషయమైనా, అది భగవంతుడైనా, వేదాంతమైనా, నాస్తికత్వమైనా, అది గుడ్డినమ్మకం కాకూడదు. వితండవాదం కాకూడదు. ఆ తత్వమేదో పూర్తిగా తెలుసుకుంటేగానీ, దాన్ని నమ్మడానికి కానీ, కాదనడానికి కానీ అర్హత లేదు. ఈ ఆత్మ, పరమాత్మ, ద్వైతం, అద్వైతం, పూర్వజన్మ, పునర్జన్మ, కర్మఫలం ఇవన్నీ భారతీయులకు గానీ, మిగితా ప్రపంచానికి గానీ, కొత్తగా పుట్టుకొచ్చిన వింత విషయాలేం కాదు. యుగయుగాల నుండీ, తరతరాల నుండీ, ఆలోచించడం మొదలుపెట్టిన దగ్గర్నించీ, మనిషి రక్తంలో కలిసిపోయే ఉన్నాయి. ఈ విశ్వాసాలను మనిషి నుండి విడదీయడం అసాధ్యం. ఆ తత్వాన్ని మహర్షులు, తత్వవేత్తలు అనేక మార్గాలలో అన్వేషించారు. దర్శించారు కూడా. తాము దర్శించిన తత్వాన్ని ఆ మహా ద్రష్టలు అనేక విధాలుగా శోధించి, మధించి సత్యదర్శనం చేసుకున్నారు. ఆ జ్ఞానాన్ని తమకోసమే దాచుకోకుండా లోకోద్ధరణ కోసం పామరులకు అర్థమయ్యే రీతిలో అనేక మార్గాలలో ఉపదేశించారు.

మోహనం అన్నయ్య ఆ ఋషులు బోధించిన దాని సారాంశమంతా క్రోడీకరించి ఇంకా తేలికైన భాషలో అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. ఎంతో చదివాడు, మననం చేశాడు. అనుభూతికి తెచ్చుకున్నాడు. ఆయితే, ఆ అనుభవం ఆయన మీద ఎలాంటి ప్రభావం చూపింది? ఆయన భావాలలో, ఆలోచనలలో ఎలాటి మార్పు తేగలిగింది?

“నాలో ఏమార్పూ రాలేదు. వాటి ప్రభావం నా మీద కొంచెం కూడా లేదు. నేను ఇప్పటికీ నాస్తికుడనే. ఆ తత్వవేత్తలూ, మహాజ్ఞానులూ చెప్పిన దాన్ని నేను సాక్షి మాత్రంగానే గ్రహించాను. వారు చెప్పినదాన్ని నేను రాసినంత మాత్రాన నేను వాటినన్నింటినీ ఒప్పుకున్నట్లు కాదు కదా – వాటి నుంచి నేను గ్రహించిన దాన్ని, నా ఉద్దేశాలనూ ఇంకా చెప్పవలసి ఉంది.” అన్నాడు అన్నయ్య. కానీ, అది అనేక కారణాల వల్ల, ముఖ్యంగా ఆరోగ్య కారణాల వల్ల సాధ్యపడలేదు. తన విశ్వదర్శనం రచన అసంపూర్ణమనే అనేవాడు అన్నయ్య. ఆయన చెప్పగలిగినవి, మేము తెలుసుకోవలసినవి ఎన్నో ఉండగా, అవన్నీ అర్థంతరంగా ఆగిపోయాయే అనిపిస్తుంది.

మూడు నాలుగేళ్ళ నుంచీ అన్నయ్య ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. ఒంట్లో ఓపిక బాగా తగ్గింది. మాట్లాడటం కూడా బాగా తగ్గించేశాడు. అందరం కూర్చుని ఆరుగొలను కబుర్లు చెప్పుకుంటుంటే వింటూ కూర్చునేవాడు. మధ్యమధ్యలో ఏదో ఒక మాట మాట్లాడేవాడు. అదే పరమానందంగా చెప్పుకునేవాళ్ళం మేమంతా. “అన్నయ్య ఇవ్వాళ నాతో మాట్లాడాడు” అనుకుంటూ.

మోహనం అన్నయ్యకి ఒంట్లో బాగుండటం లేదని తెలిసి విజయవాడ బయలుదేరాం నేనూ, రమణగారూ. తీరా బయలుదేరేరోజున “నేను రాను, నువ్వెళ్ళిరా” అన్నారు. “రామ్మోహనరావు గారు తెల్లగా, చల్లగా నవ్వుతూ, నలగని బట్టల్తో అందంగా, హుందాగా నడుస్తూంటే చూడముచ్చటగా ఉండేది. ఇప్పుడు ఒంట్లో బాగాలేకుండా నీరసంగా పడుకుని ఉండటం నేను చూడలేను, నా వల్లకాదు” అన్నారు. అన్నారు కానీ, విజయవాడ తను కూడా బయలుదేరారు రమణగారు. “నాకూ ఓపిక తగ్గిపోయింది. ఆయనకీ ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు చూడకపోతే మళ్ళీ ఆ అవకాశం వస్తుందో లేదో” అన్నారు. ఇద్దరం విజయవాడ వెళ్ళాం. అన్నయ్య అసలే మితభాషి. ఆపైన ఇప్పుడు ఓపికా తగ్గింది. రమణగారికి మనసులో మాట్లాడే ఉద్దేశ్యం ఉన్నా గలగలా మాట్లాడే శక్తి లేదు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. పాత విషయాలు గుర్తుచేసుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. రమణగారికి బట్టలు పెట్టాడు అన్నయ్య. అన్నయ్య కాళ్ళకి దణ్ణం పెట్టారు రమణగారు. కళ్ళంట నీళ్ళొచ్చినాయి నాకు.

ఇప్పుడింక మోహనం అన్నయ్య కనిపించడు – ఆయన మాట వినిపించదు. అదంతా గతకాలపు జ్ఞాపకం మాత్రమేననుకుంటే చాలా కష్టంగా ఉంది. పుట్టినవాళ్ళంతా వెళ్ళిపోవలసిన వాళ్ళేనన్న వేదాంతం తెలిసినా, ఆ వెళ్ళింది మన మనిషే అనుకున్నప్పుడు మనసంతా దిగులు నిండుతుంది. మా అన్నయ్యని మా అన్నయ్య అని చెప్పుకోవడానికి మాకందరికీ ఎంత గర్వం! మా నండూరి కుటుంబంలో పుట్టి, మా అందరి మధ్యా తిరిగిన అంత మామూలు మనిషి, అంత గొప్ప మనీషి మా అన్నయ్యేనంటే మాకెంత సంతోషం!

సౌమ్య, పూర్ణిమ (పుస్తకం.నెట్) లాటి ఈతరం పాఠకులు మోహనం అన్నయ్య పుస్తకాలు – టాంసాయర్, పంచతంత్రం, ఈసప్ కథలు లాటివే కాకుండా విశ్వదర్శనం, విశ్వరూపం పుస్తకాలు కూడా అంత ఆసక్తిగా, భక్తిగా, ఇష్టంగా చదవడం చూస్తూంటే అన్నయ్య ఎక్కడికీ వెళ్ళలేదు, తన పుస్తకాల్లో, తన అభిమాన పాఠకుల మనసుల్లో జీవించే ఉన్నాడు, శాస్వతంగా ఉంటాడు అనిపిస్తుంది. ఎంతో సంతోషంగా, తృప్తిగా ఉంటుంది.

You Might Also Like

6 Comments

  1. Sreenivas Paruchuri

    పుస్తకాలకు సంబంధించని (వాటి గురించి ఇప్పటికే చాలామంది చాలా చెప్పేసారు కాబట్టి నేను కొత్తగా జతపరచవలసిందేమీ లేదు. ఆయన వ్యాసాలు ఒక సంకలనంగా తెచ్చే ఆలోచనలెవరికైనా వుంటే నాకు కూడా చెప్పండి. I am interested in such a project.) కామెంటు రాస్తున్నందుకు ముందస్తుగానే క్షమాపణలు. కానీ పైన 8 లలిత గీతాల ప్రస్తావన చూడగానే ఎగిరి గంతేసాను. వీటిలో 5 పాటలు చాలా కాలంగా నా దగ్గరున్నా, ఒక్క పాటే (“విభుడేగుదెంచేటి వేళాయెనే చెలీ, ఈపాటని చాలామంది రేడియోలో పాడారు. తరచుగా వినపడే వెర్షన్‌: వి. బాలాత్రిపురసుందరి గారిది.) రామమోహనరావుగారి రచనగా తెలుసు.

    ఈ మూడు పాటలు ఎక్కడైనా దొరికే అవకాశముంటే చెప్పండి: “యవ్వనమా-ఓ మన్మథ సుమ మార్గణమా”, “మా భాష గానమ్ము-లేక గంభీర మౌనమ్ము”, “అసవ పాత్రిక తేవే సాకీ”

    > తన పాటలు తరువాతి తరం వారికి కూడా అందాలనే ఆశతో తనే పాడి రికార్డు చేశాడు.

    ఈ రికార్డింగులు కూడా బయటకు తెచ్చే ఆలోచనలుంటే చెప్పండి. ముందస్తుగా కృతజ్ఞతలతో …

    భవదీయుడు
    — Sreenivas Paruchuri
    Düsseldorf, Germany

  2. సౌమ్య

    నండూరి గారి గురించి రాసినందుకు చాలా థాంక్స్. మాములుగా వారి గురించి వచ్చిన వ్యాసాలే తక్కువనుకుంటాను. అందులో మీది మరీ ప్రత్యేకం. మరోసారి ధన్యవాదాలు.

  3. mohanramprasad

    నండూరి వారిని మరువడం కష్ట0. ఆయన రచనలని మళ్ళీ చదువుతున్నాను. ఆయన ‘విశ్వరూప0’ కళ్ళేదుటేవుంది. మీ రచన బావుంది. రమణగారి జ్ఞాపకాలను రాయరూ..?

  4. KumarN

    నండూరి గారు మనకు పెద్ద Asset.
    It’s a great loss.

    మీ వ్యాసం చివరిదాకా చదివాక, తెలీని కారణంతో కళ్ళలో సన్నటి నీటిపొర..

  5. జంపాల చౌదరి

    శ్రీదేవి గారూ: రామ్మోహనరావుగారిని కొత్తకోణాల్లో పరిచయం చేశారు. కృతజ్ఞతలు.

  6. సిరిసిరిమువ్వ

    శ్రీదేవి గారూ..మిమ్ముల్ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. మీ మోహనం అన్నయ్య గురించి మంచి విషయాలు చెప్పారు. ఆయన పట్ల మీకున గౌరవం..ప్రేమ..మీ ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. ఆయనొక విజ్ఞానఖని. ఆయన వ్రాసిన మార్క్ ట్వైన్–టాంసాయర్, హకిల్బెరీఫిన్, విచిత్ర వ్యక్తి అనువాదాలు మా పిల్లల చేత కూడా చదివించాం. నండూరి గారిని తల్చుకోగానే మాకు ముందు గుర్తుకొచ్చేవి ఈ పుస్తకాలే.

    ఇలానే రమణ గారి గురించి కూడా మీకు వీలైనప్పుడు నాలుగు మాటలు వ్రాస్తే చదివి ఆనందిస్తాం. మీ రచనా శైలి కూడా చాలా బాగుంది.

    సౌమ్యా..పూర్ణిమా..Thank you!

Leave a Reply