దాశరథి కృష్ణమాచార్య “యాత్రాస్మృతి” – తెలంగాణా విమోచన పోరాట స్మృతి, మహాంధ్రోదయ కృతి

(తెలంగాణా విమోచన దినోత్సవ సందర్భంగా)
***************************

ఈ పుస్తకం తెప్పించుకుంటున్నప్పుడు ఇది శ్రీ దాశరథి తిరిగిన ప్రాంతాల, ప్రయాణాల కథనం అనుకున్నాను. పుస్తకం వచ్చాక, అట్టపైన చిన్న అక్షరాలలో స్వీయచరిత్ర అని ఉపశీర్షిక చూసి ఆశ్చర్యపడ్డాను. అప్పుడు రంగాచార్య గారు తన ఆత్మకథకి జీవనయానం అని పేరు పెట్టారని జ్ఞాపకం వచ్చింది.

“కృష్ణశాస్త్రిగారిని రాయమన్నాను. ఆయన రాయనే లేదు. మన జీవితాలు ఏ క్షణాన ముగిసిపోతాయో! మీరన్నా రాయండి”
అని పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రేరేపించగా దాశరథి గారు ఆంధ్రజ్యోతి వారపత్రికలో (ఎప్పుడో? 1986-87?) దాదాపు డబ్భై వారాలపాటు రాసిన వ్యాసాలకు దాశరథిగారే స్వయంగా చేసిన మార్పులతో ఉన్న ప్రతిని ఆయన మరణానంతరం 1988లో మొదటిసారిగా ప్రచురించినట్లున్నారు (నా దగ్గర ఉన్న ఎడిషన్‌లో మొదటి ముద్రణ 2006లో అని ఉంది).

శ్రీ దాశరథి వరంగల్లు జిల్లా (ఇప్పుడు ఖమ్మం జిల్లా) మహబూబాబాదు (మానుకోట) తాలూకా గూడూరు గ్రామంలో 1925 జులై 25న పుట్టారు. నిజాం నిరంకుశరాజ్యంలో, ఆ నిజాంకు ఆశ్రితుడిగా ఉన్న ఒక జమీందారు గ్రామం గూడూరు. శ్రీవైష్ణవ కుటుంబం. తండ్రి సంస్కృతాభిమాని; స్నానంచేసి మడిగట్టుకున్నప్పుడు తెలుగు మాట్లాడితే మైలపడిపోతానన్న భయంతో ఆయన సంస్కృతంలోనే మాట్లాడేవారట. దాశరథిగారి చదువు ఉర్దూ మాధ్యమంలో. బాల్యంలో తెలుగుమీద దండయాత్రల మధ్య పెరిగిన దాశరథి తనలో తిరుగుబాటుకు బీజాలు అప్పుడే పడ్డాయని అంటారు. యవ్వనంలోకి వచ్చేసరికి  స్వాతంత్ర్యాభిలాషిగా, వామపక్ష వాదిగా, తెలుగు, ఉర్దూలలో పండితునిగా, కవిగా ఎదిగారు. నిజాం వ్యతిరేకపోరాటంలో ప్రముఖపాత్ర వహించారు. కొన్నిసార్లు తప్పించుకున్నా, చివరకు నిజాం పోలీసులకు చిక్కారు. వరంగల్లు, నిజామాబాద్, హైదరాబాద్ (చంచల్‌గుడా) జైళ్ళలో పోలీసులు, రజాకార్ల చేతుల్లో చాలా కష్టాలు పడ్డారు. పోలీసు చర్య (ఆపరేషన్ పోలో) తర్వాత నిజాం బలగాలు జనరల్ చౌదరికి లొంగిపోయి, నిజాం భారతదేశంలో విలీనం అవటానికి అంగీకారం ప్రకటించాక జైలులోంచి విడుదల అయ్యారు. కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు. అభ్యుదయ రచయితల సంఘానికి నాయకత్వం వహించారు. చలనచిత్ర గీత రచయితగా మరింత పేరు మూటగట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థానకవిగా కొంతకాలం ఉన్నారు. 1987 నవంబరు 5న మరణించారు.

ఈ యాత్రాస్మృతిని దాశరథిగారు ముందు స్వీయచరిత్రగా ఉద్దేశించినట్లు లేదు. మొదటి ప్రకరణాలలో స్వీయచరిత్రకన్నా సాహిత్య విషయాలు, పరిచితులైన సాహితీకారుల గురించి, సాహితీ ఉద్యమాల గురించి చెప్పిన కబుర్లే ఎక్కువ. ఆ ప్రకరణాల శీర్షికలు: రుబాయీలు, ఇక్బాల్ కవిత, గోలకొండ పత్రిక, ముషాయిరాలు, గాలిబ్ గజల్, చెళ్ళపిళ్ళ- ఇలా ఉంటుంది వరస. తుంగభద్ర తీరాన ఆలంపురంలో 1953 జనవరి11న జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తమ మహాసభల గురించి చాలా ప్రకరణాలు ఉన్నాయి. అన్నిప్రాంతాలనుండి కవులు ప్రత్యేక రైళ్ళలో ఆలంపురం వచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా గంభీరోపన్యాసం చేశారు. విశ్వనాథ, గిడుగు సీతాపతి, గడియారం వేంకట శేషాచార్యులు, దేవులపల్లి రామానుజరావు వంటి ఉద్దండులు ప్రసంగించారు. కాళోజీ “నా గొడవ”ను వట్టికోట ఆళ్వారుస్వామి ప్రచురించగా, శ్రీశ్రీ ఆవిష్కరించారు. శ్రీశ్రీ అధ్యక్షుడిగా, దాశరథి, పుట్టపర్తి నారాయణాచార్యులు ఉపాధ్యక్షులుగా, వట్టికోట ఆళ్వారుస్వామి ప్రధాన కార్యదర్శిగా విశాలాంధ్ర కళాకారుల సంఘం ఏర్పాటైంది. కన్నడ, హిందీ, మరాఠీ రచయితలు కూడా ఈ సభల్లో పాల్గొన్నారు. కన్నడ రచయిత నర్సింగ్‌రావ్ మాన్వీతో కలసి తుంగభద్రలో జలకాలాడిన దాశరథి ఆయన ప్రేరణపైన తుంగభద్ర అనే గేయనాటకాన్ని రైల్లో తిరుగుప్రయాణంలో (ఎదుటి బెర్తుపైన నిద్రిస్తున్న అందమైన అమ్మాయిని భద్రగా ఊహిస్తూ) రాశారట. ఆ నాటిక ఆకాశవాణిలో ప్రసారమైనప్పుడు శారద (శ్రీనివాసన్)గారు భద్ర పాత్రని అద్భుతంగా పోషించారట.

పుస్తకంలో ముఖ్యభాగం దాశరథిగారి జైలు అనుభవాల గురించి, ఆ సమయంలో తెలంగాణాలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనల గురించి. ఆ కాలంలో తెలంగాణాలో ముఖ్యులైన వ్యక్తులగురించి, వారి వ్యక్తిత్వాల గురించి, అప్పటి ఉద్యమాల గురించి చాలా వివరాలు తెలుస్తాయి. తీవ్ర వ్యతిరేక పరిస్థితుల మధ్యలో ఈ రాజకీయ ఖైదీల దృఢదీక్ష, స్థితప్రజ్ఞత, ఆత్మవిశ్వాసం, ఆశావాదం  అబ్బుర పరుస్తాయి. వరంగల్లు జైల్లో మగ్గుతున్న  ముప్పైమంది రాజకీయ ఖైదీల్ని నిజామాబాదు (ఇందూరు కోట) జైలుకు మారుస్తామని అరవై మంది పోలీసులు బయటకు తీసుకొచ్చారు. నిజామాబాద్ తీసుకు వెళ్ళటమంటూ ఏమీ లేదు; దారిలోనే కాల్చిచంపబోతున్నారు అని ఖైదీల నమ్మకం. “కాగితం లేదు. కలం లేదు. దీపం లేదు. కాని గళం ఉంది. కోపం ఉంది. మృత్యువు ముఖాన ఉమ్మేసి, శాశ్వత చైతన్య పదాల మీద అమరప్రయాణం చేయాలనే తెగువవుంది. ధారణా శక్తి ఉంది. ఆశుధారా కవన జవనాశ్వాలు నాలో ఉన్నాయి.”  చాలా కాలం తర్వాత జైలు గోడల బయటకు వచ్చారు. డిశెంబరు మాసపు చలి గాలులు తగులుతున్నాయి. వధ్యశిలకు వెళ్ళే ముందు బిళ్హణుడు చెప్పిన మాదిరి దాశరథిగారు,
చలిగాలి పలుకు వార్తలు
చెలిగాలినిబోలి వలపు చిరుపచ్చదన
మ్ములు గుండెలలో నింపెను
చెలికాడా! జైలు బయట చిత్తమ్మలరెన్
అంటూ మొదలుబెట్టి, చలిగాలి అనే మాటతో మొదలయ్యె 27 పద్యాల్ని ఆశువుగా  చెప్పారు. రాసుకోవటానికి లేదుగదా. ఖైదీలందరూ తలో పద్యమూ గుర్తు పెట్టుకున్నారు.

జైల్లోనూ అంతే. గోడమీద బొగ్గుతో-
     ఓ నిజాము పిశాచమా! కాన రాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని;
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ, కోటి రత్నాల వీణ

అని రాస్తే, ఆ పద్యాన్ని కంఠస్తం చేసిన శ్రీ ఆళ్వారుస్వామి జైలుగోడల మీద అధికారులు ఒకచోట చెరిపితే మరోచోట రాస్తుండేవాడట (ఈ ముచ్చట అగ్నిధార ముందుమాటలో దాశరథి చెప్పింది; ఈ పుస్తకంలోది కాదు).

ఇందుపురంలో (నిజామాబాద్ అసలు పేరు ఇందూరు) రఘునాథ రాయలు నిర్మించిన కోట, శ్రీరామాలయం, సత్రాలను నిజాం ప్రభుత్వం సెంట్రల్ జైలు చేసింది. కొండ మీద ఉన్న ఆ కోటలోనుంచి క్రింద ఉన్న నిజాంసాగర్ కాలువ, ఆ కాలువ ఒడ్డున ఎర్రగాపూసిన మోదుగుపూలను చూస్తూ, కుమారసంభవంలొ కాళిదాసు పలాశపుష్పాల వర్ణన మననం చేసుకుంటూ ఉండేవారట. వట్టికోట ఆళ్వారుస్వామి, ఇతర మిత్రులు చాలామంది ఆ జైల్లోనే ఉన్నారు. క్షురకారుడు కాగితాలు, కరపత్రాలు రహస్యంగా తన పొదిలో తెచ్చేవాడు.  వాడిగా రాజకీయ చర్చలు జరిగేవి. దుర్భర పరిస్థితుల మధ్య భవిష్యత్తు గురించి కలలు. కవిత్వం మాత్రం మానలేదు. జైల్లో సహాయనిరాకరణ చేస్తున్నారు. దాశరథి తీవ్రజ్వరంతో బాధ పడుతున్నారు. చికిత్సలేదు, తిండిలేదు. క్షమాపణ రాసిస్తే విడుదల అవచ్చు అని రాయటానికి కాయితం కలం ఇచ్చారు. క్షమాపణ బదులు, ఆ కాగితాల మీద నటస్వామి అన్న శీర్షికతో శివుడిపైన నలభై పద్యాలు రాశారట.

జైల్లో పడ్డ కష్టాల్లో జ్వరమొక్కటే కాదు. రాజకీయ ఖైదీల్ని చంపే ఉద్దేశంతో, ఒక రాత్రిపూట రజాకార్లు జైలు మీద దాడిచేసినప్పుడు, వారు కొట్టిన దెబ్బలకు దాశరథికి తల పగిలిపోయింది. ఎడమ భుజం బొమిక విరిగిపోయింది. స్పృహ తప్పింది. ఆ రాత్రి జైల్లో ఉన్న ఖైదీలు వంటచెరకు కట్టెలను ఆయుధాలుగా వాడుతూ రజాకార్లను తిప్పిగొట్టటం నిజంగా వీరోచిత సంఘటనే.

జైలు జీవితం తర్వాత చాలా ప్రకరణాలు తెలంగాణా విమోచనం వివరాలు, కె.ఎం.మున్షీ దక్షత, లొంగుబాటు తర్వాత జనరల్ చౌదరి పరిపాలనల గురించి. దాశరథి, మగ్దూం (మొహియుద్దీన్) తమ కవితాశక్తితో,  ఆసక్తితో జనరల్ చౌదరికి సన్నిహితులైనట్లు, అప్పటి వివరాలు ఆయన వీరితో పంచుకొన్నట్లు అనిపిస్తుంది.

తెలంగాణా విమోచనం తర్వాత విశాలాంధ్ర నిర్మాణం గురించి భిన్నాభిప్రాయాలు వినవచ్చాయి. దాశరథి అభిలాష మాత్రం మహాంధ్రనిర్మాణమే. “కోటితమ్ముల కడ రెండు కోట్ల తెలుగుటన్నలను గూర్చి వృత్తాంతమందజేసి మూడు కోటుల నొక్కటే ముడి బిగించి” మహాంధ్రసౌభాగ్యగీతి పాడిన దాశరథి  మహాంధ్రోదయం అన్న ఖండకావ్య సంపుటిని ప్రచురించారు. 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ అవతరణతో ఈ యాత్రాస్మృతి అంతమౌతుంది.

1947 – 48లలో  తెలంగాణా రాజకీయ చరిత్రను ముందు వరుసలో కూర్చుని చూసిన ప్రత్యక్ష సాక్షి కథనం ఇది. అలాగే 1940-56ల మధ్య తెలంగాణా సాహితీరంగంగురించి, కొన్ని సాహిత్య సమావేశాల గురించి రసవత్తరమైన కథనాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అక్కడక్కడా కొంత చిలిపితనం (మరదలు చూడామణి కబుర్లు వచ్చినప్పుడు), కొన్ని ఛలోక్తులు, కొన్ని హాస్యోదంతాలూ (ఉర్దూ లిపిలో రాసిన అరెస్టు వారంట్లలో పట్టాభి సీతారామయ్య గారి పేరు సత్తార్‌మియాగానూ, టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు టాంగ్ టూటీ (కాళ్ళు విరిగిన) పీర్‌కాసింగానూ మార్పు చెందితే, ఆ తప్పుల్ని ఆసరా చేసుకుని స్థానికులు ఈ నాయకులని అరెస్టు కాకుండా పోలీసులను మభ్యపెట్టి వెనక్కు పంపిచేసి, వీరిని ఊరినుంచి తప్పించేశారట) ఉన్నాయి.

ఇంకో ఉదంతం: పారిశ్రామిక మైదానంలో జరగబోతున్న ముషాయిరాకు వెళ్ళడానికి దాశరథి రిక్షా ఎక్కబోయారు. అక్కడికెందుకు వెళ్తున్నారు అని రిక్షా నడిపే యువకుడు అడిగాడు. ముషాయిరాకు అని చెప్పారు దాశరథి. “వినడానికా, వినిపించడానికా” అన్నాడు రిక్షావాలా.  “వినిపించడానికే; నేను కవిని” అన్నాడు ఈయన. “నేనూ అక్కడికే వెళ్ళాలి. నేనూ కవినే. కవిత వినిపించడానికి వెళ్తున్నాను” అన్నాడా యువకుడు, యూసుఫ్. ముషాయిరాలో దాశరథి సరసన కూర్చుని కవిత్వం చెప్పి అందరిచేత వాహ్వా అనిపించుకున్నాడు. ముషాయిరాల్లో ముందుపీట కవితా సామర్థ్యానికే, సాంఘిక స్థాయికి కాదు.

దాశరథిగారి వచనం కూడా ఆయన కవితలమల్లేనే సాఫీగా, స్పష్టంగా ఉండి ఇష్టంగా, వడిగా చదివిస్తుంది. తోటి సాహితీకారులమీద (ముఖ్యంగా ఆళ్వారుస్వామి, మగ్దూం, కాళోజీ, శ్రీశ్రీల మీద) ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవం స్పష్టంగా కనపడుతుంటుంది. ఆలంపురంలోనూ హైదరాబాదులోనూ జరిగిన తెలుగు సాహితీ సభల గురించి మాట్లాడినప్పుడూ, తాను పాలుపంచుకొన్న ఒక ముషాయిరా గురించి చెప్తున్నప్పుడూ చిన్నపిల్లాడికి ఇష్టమైన వస్తువు దొరికినప్పుడు కేరింతలు కొట్టినట్టు ఉంటుంది. ఆయన ఉత్సాహాతిరేకాల్లో మనం కూడా కొట్టుకుపోతుంటాము.

వారపత్రికలో ఈ యాత్రాస్మృతి డబ్భైవారాల పైగా సాగింది అని దాశరథి ఆఖరు భాగంలో అన్నారు. కానీ ఈ పుస్తకంలో అరవై ప్రకరణాలే ఉన్నాయి.  ఈ పుస్తకంలో కొంత భాగం తప్పిపోయిందా అన్న అనుమానం కలుగుతుంది. 13వ ప్రకరణంలో అణా పుస్తకాల గురించి చెప్పాక, 14వ ప్రకరణం అకస్మాత్తుగా, వరంగల్ జైలునుంచి బదిలీ కావటానికి ఉత్తరువులు రావటంతో మొదలవటం ఈ అనుమానానికి బలమిస్తుంది. దాశరథి తెలంగాణా ఉద్యమంలో ఎలా భాగమయ్యారో, జైలుకు ఎందుకు వెళ్లవలసి వచ్చిందో ఈ పుస్తకంలో లేదు.

పుస్తకంలో ప్రతి ప్రకరణం ముందూ పొందు పరచిన దాశరథి పద్యాలు ఆయన కవితల్లో ఉన్న వైవిధ్యాన్ని రుచి చూపిస్తాయి.  వాడ్రేవు చినవీరభద్రుడు ఎంపిక చేశారట. మండలి బుద్ధప్రసాద్ (ప్రచురణకర్త), చినవీరభద్రుడు, దాశరథి రంగాచార్య, దేవులపల్లి రామానుజరావు ముందు మాటలు సమకూర్చారు. పుస్తకం చివర్లో బాల పత్రిక కోసం మండలి బుద్ధప్రసాద్ దాశరథితో జరిపిన సంభాషణ, దాశరథి మరణం తర్వాత గాంధీక్షేత్రం పత్రిక సంపాదకీయం, కొన్ని ఛాయాచిత్రాలు ఉన్నాయి.
పుస్తకం అందంగా ముద్రించారు కానీ, కాగితం నాణ్యత బాగోలేదు. అచ్చుతప్పులు తక్కువే. ఈ పుస్తకానికి డా. డి. ఛంద్రశేఖర రెడ్డి సంపాదకులు అని ఉంది. కొన్ని వివరాల పట్ల శ్రద్ధ పెడితే బాగుండేది. ఈ యాత్రాస్మృతి ఎప్పుడు రాసిందీ, మొదటి ముద్రణ ఎప్పుడు వంటి వివరాలు ఇస్తే బాగుండేది. ముందూ, వెనుకా సూచికలు (indices) ఉంటే ఉపయోగకరంగా ఉండేవి. ఛాయాచిత్రాల్లో గొప్పవాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు కానీ, ఎవరు ఎవరో, ఏ ఫొటో ఏ సందర్భంలో తీసిందో తెలిసే అవకాశం లేదు.   గాంధీక్షేత్రం పత్రిక సంపాదకీయమే ప్రత్యేకంగా ఎందుకు వేశారో తెలీలేదు. ఈ పత్రికకూ, ప్రచురణకర్త మండలి బుద్ధప్రసాద్‌కి సంబంధం ఏమైనా ఉందా?

చరిత్ర మీద, దాశరథి మీద అభిమానం ఉన్న వారు తప్పకుండా చదవవలసిన పుస్తకం. వీరి తమ్ముడు దాశరథి రంగాచార్యగారి జీవనయానం కూడా కలిపి చదువుకుంటే ఇంకా విశదంగా ఉంటుంది.

**********

యాత్రాస్మృతి

దాశరథి కృష్ణమాచార్య స్వీయచరిత్ర

నవంబర్ 2006, మార్చ్ 2008
ప్రచురణ: తెలుగు సమితి, హైదరాబాద్
ప్రతులకు: లిటరసీ హౌస్, ఆంధ్రమహిళాసభ అకడమిక్ క్యాంపస్, ఉస్మానియా యూనివర్సిటీ రోడ్, హైదరాబాద్ 500 007
ఫోన్: 040- 27098406, 27096464
e-mail: durgabai@cityonlines.com
www.andhramahilasabha.org
247 పేజీలు; 90 రూ.

You Might Also Like

7 Comments

  1. pavan santhosh surampudi

    ఈ ప్రచురణలో చాలా వివరాలే తెగిపోయినట్టుగా అనిపించింది నాకు. సంగతి సందర్భాలు అవగతం కావడానికి రెండోమారు చదవాల్సి వచ్చింది. అలాగనేం సామాన్యమైన పుస్తకం కాదు. మహాద్భుతమైన గ్రంధం. ఆ మహనీయుడు నైజాం విమోచన కోసం పడ్డ కష్టాలు చదివితే హృదయం ద్రవించి ఉప్పొంగుతుంది.

  2. electionreddy

    @sowmya: Can u pls. give the link to bhuvanavijayam blog which has the pdf conversion tool.

  3. budugoy

    @saumya: thanks for correcting. this is the second time i am making this mistake.kaloji is another name i make this mistake abotut.
    the download did not work for me. will try it again.
    @kameswararao: thanks a lo..t for the info.

  4. కామేశ్వరరావు

    “చింతలతోపులో కురియు చిన్కులకున్” అన్న పద్యం “రుద్రవీణ”లోనిది.
    దాశరథి సాహిత్యం విశాలాంధ్రవాళ్ళు సంపుటాలుగా (బహుశా అయిదనుకుంటాను) క్రిందటి ఏడాదే ప్రచురించారు. మొదటి సంపుటం కవిత్వం. ఇందులో మహాంధ్రోదయం, రుద్రవీణ, అగ్నిధార, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం అన్న ఆరు ఖండకావ్యాలు ఉన్నాయి. వెల 190రూ. బహుశా విశాలాంధ్ర దుకాణాలన్నిట్లోను దొరకవచ్చు.

  5. సౌమ్య

    బుడుగోయ్ గారికి:
    అగ్నిధార గురించి ఇంకా తెలీదు కానీ, ఇదివరలో మరో టపాలో నేను రాసిన వ్యాఖ్య మీకు పనికిరావొచ్చని, పేస్ట్ చేస్తున్నాను.

    “new.dli.ernet.in వెబ్సైటులో “daasharathi” అన్న క్వెరీ ఇవ్వండి. ’అలోచనాలోచనాలు’ అన్న కవితాసంపుటి, జ్వాలాలేఖిని అన్న కవితాసంపుటి ధ్వజమెత్తిన ప్రజ, గాలిబ్ గీతాలు – ఈ నాలుగూ ఉన్నాయి అక్కడ. పీడిఎఫ్ కి మార్చుకోడానికి భువనవిజయం బ్లాగులోని టూల్ ని వినియోగించండి. ”

    అలాగే, చిల్లరదేవుళ్ళు – రాసింది ఈయన కాదనుకుంటాను. రంగాచార్య గారు అనుకుంటా.

    Sowmya.

  6. budugoy

    ‘అగ్నిధార’ పుస్తకం ఎవరి దగ్గరైనా ఉందా? “చింతలతోపులో కురియు చినుకులకున్” అన్న పద్యాన్ని మా తెలుగు మాష్టారు గొంతెత్తి పాడుతుంటే అసలు ఈ దాశరథి ఎవరు? ఏం రాశాడు అన్న ఆసక్తితో లైబ్రరీ గాలించినట్టు గుర్తు. చిల్లరదేవుళ్ళు(classic. loved it), యాత్రాస్మృతి, గాలిబు గీతాలు చదివాను గాని అగ్నిధార మాత్రం దొరకలేదు నాకు. ఆన్లైనో, ఆఫ్‌లైనో ఎక్కడైనా దొరికితే చెప్పగలరు. thanks in advance.

  7. తాడేపల్లి

    చాలా బాగా వ్రాశారు. నెనరులు.

    కఱుడుగట్టిన సమైక్యవాది అయిన దాశరథిగారు నాకు వ్యక్తిగత పరిచయం. ఆయన పుస్తకాలు చాలావఱకు ఇప్పుడు అపునర్‌ముద్రితాలుగా మిగిలిపోయాయి. సాహిత్యాభిమానులమందఱమూ కలిసి ఎలాగైనా వాటిని వెలికితీసి తెలుగుజాతికి మఱల అక్షరోపాయనాలుగా సమర్పించడానికి తలో చెయ్యీ వేయాల్సి ఉంది.

Leave a Reply