నండూరి రామ్మోహనరావు – జీవిత విశేషాలు
(ఈ వ్యాసం నండూరి రామ్మోహనరావు గారు జర్నలిజంలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు వచ్చిన స్వర్ణాభినందన సంచికలోనిది. పుస్తకం.నెట్లో ప్రచురించడానికి అనుమతించిన ఆ సంచిక సంపాదకులు-శ్రీరమణ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
స్వస్థలం కృష్ణాజిల్లా (పూర్వపుగన్నవరం తాలూకాలో) ఆరుగొలను గ్రామం. జన్మస్థలం కృష్ణాజిల్లా (పూర్వపు తిరువూరు తాలూకాలో) విస్సన్నపేట. మాతామహుల ఇంట జననం 24 ఏప్రిల్ 1927.
హైస్కూలు చదువు 1937-39 నూజివీడు ఎస్.ఆర్.ఆర్ హైస్కూలు, 1939-42 మచిలీపట్నం హిందూ హైస్కూలు. కాలేజీ చదువు 1942-47 రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజి. ఆ రోజుల్లోనే పిలకా గణపతి శాస్త్రి, తిలక్, సూరంపూడి భాస్కరరావు, రాయప్రోలు రాజశేఖర్, కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం, విశ్వాత్ముల నరసింహమూర్తి ప్రభృతులతో పరిచయాలు, స్నేహాలు. వివాహం మేనమామ గారి కుమార్తె రాజేశ్వరితో 1944 ఏప్రిల్ 30వ తేదీ. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఋషీకేశంలో స్వామీ శివానంద అంతేవాసిత్వం (1945-46), ఉత్తర కాశీ వరకు పాదయాత్ర.
1947 అక్టోబరు-నవంబరులో విజయవాడలో పాటిబండ మాధవశర్మ గారి ఉదయభారతి గురుకులంలో కొద్దిరోజులపాటు ట్యూటర్ ఉద్యోగం. 1947 నవంబరు డిసెంబరులలో విజయవాడలోనే ఎమోచర్ల కృష్ణమూర్తి గారి “జన్మభూమి” అనే పత్రికలో సబెడిటరు ఉద్యోగం.
1948 జనవరి 1వ తేదీన మదరాసు ఆంధ్రపత్రిక (యజమాని, సంపాదకుడు శివలెంక శంభుప్రసాద్ గారు, జాయింట్ ఎడిటర్ పండితారాధ్యుల నాగేశ్వరరావుగారు) లో సబెడిటర్ గా చేరిక.
1950 చివరలో కొడవటిగంటి కుటుంబరావు, సూరంపూడి సీతారాం గార్లతో పాటు వారపత్రికకు బదిలీ. కొడవటిగంటి “చందమామ”కు వెళ్ళిపోయిన తరువాత సూరంపూడి ఇన్‌ఛార్జి ఎడిటరుగా నాలుగేళ్ళపాటు సినిమా, బొమ్మరిల్లు శీర్షికల నిర్వహణ. ఆరోజులలోనే (1951 నుంచి) మార్క్‌ట్వేన్ నవలల (టాంసాయర్, హకిల్బెరీఫిన్, రాజూ-పేద, విచిత్రవ్యక్తి, టాంసాయర్ ప్రపంచయాత్ర)కు, ఆర్.ఎల్.స్టీవెన్సన్ నవల ట్రెజర్ ఐలెండ్ (కాంచనద్వీపం)కు, మరిపెక్కు ఇంగ్లీషు నవలలకు, ఆస్కార్ వైల్డ్, గొగోల్ ప్రభృతుల కథలకు అనువాదాలు. సవ్యసాచి కలం పేరుతో వారం వారం రాజకీయ వ్యంగ్య గేయాలు. ఎన్నార్ మొదలైన కలం పేర్లతో సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, జాతీయ, అంతర్జాతీయ తదితర విషయాలపై వ్యాసాలు, వగైరా. 1958-60 మధ్య కాలంలో ఆంధ్ర వార పత్రిక ఇన్‌ఛార్జి సంపాదకత్వం.
నార్ల వెంకటేశ్వరరావు ఎడిటర్ గా, కె.ఎల్.ఎన్.ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ గా 1960 జులై 2వ తేదీన విజయవాడలో ప్రారంభమైన ఆంధ్రజ్యోతిలో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరిక. 1976 జులై నుంచి నార్ల చీఫ్ ఎడిటర్ కాగా, నండూరి ఎడిటరు. 1977 మార్చిలో నార్ల పదవీ విరమణ.
1977లో ప్రారంభమైన “జ్యోతిచిత్ర” సినిమా వారపత్రికకు 1978 జులై వరకు ఎడిటర్. 1978లో ప్రారంభమైన “వనితాజ్యోతి”, 1980లో ప్రారంభమైన “బాలజ్యోతి” మాసపత్రికలకు 1994 అక్టోబరు వరకు ఎడిటరు. ఆంధ్రజ్యోతి ఎడిటరుగా 1994 అక్టోబర్ 18వ తేదీ పదవీ విరమణ.
ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1969లో విశ్వరూపం, 1971లో నరావతారం, 1981 నుంచి విశ్వదర్శనం (పాశ్చాత్య చింతన), 1991 నుంచి విశ్వదర్శనం (భారతీయ చింతన) ధారావాహిక రచన, ప్రచురణ.
1962 జులై, ఆగస్టులలో అమెరికా విదేశాంగ శాఖ ఆహ్వానంపై కొందరు భారతీయ పత్రికా ప్రతినిధులతో కలిసి ఆ దేశంలో సుమారు పదిహేను ప్రధాన నగరాలలో పర్యటన. ఆ సందర్భంలోనే పశ్చిమ జర్మనీ సందర్శన.
1978 జులైలో ప్రధాని మొరార్జీ దేశాయి, విదేశాంగ మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిలతో పాటు వెళ్ళిన పత్రికా సంపాదకులు, విలేఖరుల బృందంలో సభ్యులుగా బెల్జియం, ఇంగ్లండ్, అమెరికాలలో పర్యటన.
1982 ఆగస్టులో సోవియట్ జర్నలిస్టుల యూనియన్ వారి ఆహ్వానంపై మాస్కో, లెనిన్‌గ్రాడ్, తాష్కెంట్ నగరాలలో విస్తృత పర్యటన.
1984 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లలో అమెరికా ప్రయివేట్ విజిట్. 1992 జులైలో అమెరికాకు తెలుగు అసోసియేషన్ వారి ఆహ్వానంపై న్యూయార్కులో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలకు బాపు, ముళ్ళపూడి వెంకటరమణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రభృతులతో కలిసి హాజరు. ఆ మహాసభలలో సాహిత్య సేవలకు గుర్తింపుగా “శిరోమణి” అవార్డు స్వీకరణ. ఆ సందర్భంలోనే హాలీవుడ్, డిస్నీలాండ్ తదితర టూరిస్టు కేంద్రాల సందర్శన.
అవార్డులు:
1. అభినందన (హైదరాబాదు) సంస్థ నుంచి ముట్నూరి కృష్ణారావు అవార్డు (1988).
2. జూలూరి నాగరాజారావు (హైదరాబాదు) స్మారక అవార్డు (1989)
3. మద్రాసు తెలుగు అకాడెమీ “ఉగాది వెలుగు” అవార్డు (1989)
4. కళాసాగర్ (మద్రాసు) అవార్డు
5. అభిరుచి (ఒంగోలు) సంస్థ వారి “పాత్రికేయ రత్న” అవార్డు.
6. “జమీన్ రైతు” వజ్రోత్సవంలో నెల్లూరి వెంకట్రామానాయుడు స్మారక అవార్డు (1990)
7. ఆలూరి నారాయణరావు స్మారక ట్రస్టు (విజయవాడ) వారి సి.వై.చింతామణి అవార్డు
8. తెలుగు యూనివర్సిటీ వారి ఆనరరీ డాక్టరేట్ (1991)
9. అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి “శిరోమణి” అవార్డు (1992)
10. క్రాంతి విద్యా సంస్థల (విజయవాడ) నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1994)
11. రామకృష్ణ జైదయాళ్ హార్మొనీ అవార్డు (1994)
12. సిద్ధార్త కళా పీఠం (విజయవాడ) వారి విశిష్ట వ్యక్తి అవార్డు (1994)
13. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1996)
14. తెలుగు యూనివర్సిటీ వారి “తాపీ ధర్మారావు స్మారక అవార్డు” (1997)
15. అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి “ప్రతిభామూర్తి” అవార్డు (1998)
ప్రచురణలు:
పైన పేర్కొన్న రచనలు కాక, ఆంధ్రజ్యోతి సంపాదకీయాలు, సంకలనాలు –
1) అనుపల్లవి 2)చిరంజీవులు 3) వ్యాసావళి
విశ్వాత్ముల నరసింహమూర్తి చిత్రరచన చేసిన మిత్రలాభం, మిత్రభేదం కథలకు, బాపు చిత్రరచన చేసిన అసంప్రేక్షకారిత్వం బొమ్మల కథకు, గేయరచన; కథాగేయ సుధానిధి (ఈసప్ కథలు), హరివిల్లు-పిల్లల గేయాలు, బాలరాజు (ఆస్కార్ వైల్డ్ కథలకు అనువాదం), చిలక చెప్పిన రహస్యం (పిల్లల నవల), మయూర కన్య (పిల్లల నవల), ఉషస్విని (కవితా సంపుటి), అక్షరయాత్ర (సాహిత్య, సాహిత్యేతర వ్యాససప్తతి)
**********************************************
నండూరి గారి గురించి వారి మనవరాలు కామరాజు శ్రీలత చెప్పిన విశేషాలు పుస్తకం.నెట్లో ఇక్కడ చదవండి. ఆయన్ని కలిసినప్పుడు సౌమ్య రాసిన వ్యాసం ఇక్కడ చదవండి. ఆయన సంపాదకీయాల సంకలనాలు – “అనుపల్లవి”, “చిరంజీవులు” గురించి పుస్తకం.నెట్ లో వచ్చిన పరిచయ వ్యాసం ఇక్కడ చదవండి.
Srinivas Nagulapalli
నిజానికి తెలుగు జర్నలిజానికి విడదీయని అనుబంధంతో సుదీర్ఘకాలం గౌరవప్రదమైన
సేవ చేసిన అతి తక్కువమందిలో నండూరి గారు ఒకరు.
పార్టీ జెండాల బరువు మోస్తూ, నేతల అజెండాలలో నలుగుతూ, సొంత డబ్బా నాదాలకు మురుస్తూ,
వెన్నెముక ఉన్నదని మరుస్తూ, నొక్కిన గొంతుకతో సాగుతున్న కొన్ని వర్తమాన సంపాదకీయాల
పోకడలు చూసినప్పుడు నండూరి లాంటి వారు కూడా ఉండేవారా అని ఆశ్చర్యం కలుగుతుంది.
రాను రాను రాజుగారి గుఱ్ఱం గాడిద అయ్యిందంటే ఇదేనేమో. జరగకూడని దారుణాలు
జరిగినందుకన్నా, సడలకూడని మేధావుల స్థైర్యం నైతికత సడలినందుకే ఎక్కువ హాని,
ఎక్కువమందికి నష్టం, ఎక్కువకాలం కష్టం కలుగుతుందేమో అనిపిస్తుంది. వారి
సంపాదకీయ సంకలనం “చిరంజీవులు” నిన్నటి చరిత్ర గురించి నేటి వారికి లభించే
రేఖాచిత్రాలు. నిస్వార్థంగా నిబద్ధతతో సేవలు చేసిన నేతలను, మాన్యులను ప్రత్యక్షంగా
చూడడమే కాదు, కళ్ళకు కట్టినట్టు రచనద్వారా చూపించారు. ఎన్నో రచనలు చేసిన
నండూరిగారికి సైతం ఆ సంకలనం సొంతానికి బాగా నచ్చడం అందుకేనేమో.
ఆలోచనల్లో స్పష్టత, అభివ్యక్తిలో సరళత, అహమిహలకు అంటని హృదయవైశాల్యత,
అన్నింటినీ మించిన నైతికత నిష్పక్షపాతం వారి రచనలలో పుష్కలం.
తెలుగు సంపాదకీయ చరిత్రలో వారి స్థానం స్మృతి సజీవం.
==========
విధేయుడు
-శ్రీనివాస్
రసజ్ఞ
మంచి విషయాలు తెలియచేశారు. ధన్యవాదములు!